Nutritional Values
-
దానిమ్మతో దీర్ఘాయుష్షు, ఇలా తిన్నారంటే..!
చాలా మంది మనసులో మెదిలే ఆలోచన ‘దీర్ఘకాలం జీవించాలి. ఆ జీవనం కూడా వీలైనంతవరకు ఆరోగ్యంగా, వృద్ధాప్యం దరిచేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన మీది కూడా అయితే మన శరీర కణాల ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లతో ఆయుష్షును పెంచుకోవచ్చు.ఎలా అంటే... కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి సహజంగా అవసరమైన వాటిని సరఫరా చేస్తాయి. ఈ సీజన్లో దానిమ్మపండ్లు (సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు) విరివిగా లభిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలిస్తే ప్రతిరోజూ ఆహారంలో వీటిని తప్పక చేరుస్తారు. చర్మానికి మేలు..దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి మెదడు నుండి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానికీ మద్దతు ఇస్తాయని పరిశోధనలలో తేలింది. డాక్టర్ విసెంటె మేరా తన ‘యంగ్ ఎట్ ఏ ఏజ్’ అనే పుస్తకంలో ‘దానిమ్మపండు దాని యాంటీఆక్సిడెంట్ శక్తి కారణంగా చర్మానికి మేలు చేసే సూపర్‌ఫుడ్’ అని పేర్కొన్నారు. దానిమ్మపండులో విటమిన్– సి పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ‘శరీరానికి విటమిన్– సి అందినప్పుడు, కొల్లాజెన్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. అంతర్గత సన్స్క్రీన్దానిమ్మ జ్యూస్ తాగితే యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నుండి చర్మాన్ని రక్షించవచ్చు. ఇది దాదాపు ‘అంతర్గత సన్‌స్క్రీన్‘ లా పనిచేస్తుంది. మెదడుకు దానిమ్మదానిమ్మలోని విటమిన్ బి5 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దానిమ్మ రసం నుండి వచ్చే ఫైటోన్యూట్రియెంట్లు మెదడుపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి‘ అని యుసిఎల్ఎ హెల్త్ నోట్ పరిశోధకులు పేర్కొన్నారు.చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‘చెడు‘ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టిజి, ఎల్డిఎల్ అండ్ సి, హెచ్‌డిఎల్, సి స్థాయిలను మెరుగుపరచడంలో దానిమ్మ వినియోగం ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతర ఒత్తిడి వల్ల వృద్ధాప్యం త్వరగా ప్రవేశిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ, నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలోనూ కాలానుగుణంగా లభించే దానిమ్మ సరైనది. ఎలా తినాలంటే... దానిమ్మ గింజలు కొన్ని రకాల వంటకాలకు, సలాడ్స్‌కు మంచి రుచిని తీసుకువస్తాయి. ఉదయం టిఫిన్‌తో పాటుగా దానిమ్మ గింజలను తినవచ్చు. అవకాడో, పిస్తాతో కలిపి చేసిన సలాడ్స్‌లోనూ చేర్చవచ్చుఅవిసె గింజలు, పెరుగుతోనూ కలిపి తినవచ్చు. ఉడికించిన కూరగాయలపైన పెరుగు, దానిమ్మ గింజలు వేసుకొని తినవచ్చు. దానిమ్మ పండును కడగాల్సిన అవసరం లేదు. గింజలను వేరు చేసి, తినవచ్చు. -
Healthy Snacking Report 2024: మనోళ్లు కొంటున్నది... పోషకాలున్న స్నాక్సే!
న్యూఢిల్లీ: మార్కెట్లో స్నాక్స్ కొనేటప్పుడు ప్యాక్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదువుతున్నారా? అయితే ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నట్టే. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి స్నాక్స్ కొనేటప్పుడు దానిలో వాడిన పదార్థాలేంటి? అందులో ఏమాత్రం పోషక విలువలున్నాయని 73శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్–2024 సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 6వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను ఆది వారం విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్ ప్యాకెట్స్ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది. ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతు న్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్‌గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది. -
పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్ అభియాన్ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదీ లక్ష్యం.. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం. – కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్–మల్కాజిగిరి. -
సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం. చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్‌ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్‌ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్‌పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్‌ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్‌కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లోనే 1.50 లక్షల సీడ్ పెంపకం జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్ దాదాపు 1.50 లక్షల సీడ్‌ను పెంచుతున్నారు. సీడ్ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్ పెరగడంతో వైజాగ్ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్‌లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం. పిల్ల పరిమాణం ఆధారంగా మేత మైక్రో సీడ్ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్‌కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్‌ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్‌ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్‌ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీడ్ ఎగుమతి ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్ ఎగుమతి జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా పెంపకం కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం స్వయం ఉపాధికి అవకాశం నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. – డాక్టర్ దేవీవరప్రసాద్‌రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
పోషకాలు, ఔషధ గుణాల సమ్మిళితం.. 'సీ వీడ్'
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో పోషక విలువలు.. మరెన్నో ఔషధ గుణాల మేలు కలయిక.. సీవీడ్ (సముద్రంలో పెరిగే నాచులాంటి మొక్క). జపాన్, చైనా, కొరియా తదితర దేశాల్లో ప్రాచీన కాలం నుంచి ఇది అందుబాటులో ఉంది. నేరుగానూ, ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని తింటున్నారు. సీవీడ్‌పై ఇప్పుడు మనదేశంలోనూ ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ అధికమవుతున్న నేపథ్యంలో సీవీడ్ ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ).. సీవీడ్స్తో వైవిధ్య ఆహార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, వినియోగం పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. మ్యాక్రో ఆల్గేగా పిలిచే ఈ సీవీడ్ మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో విరివిగా లభిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సీవీడ్‌తో సూప్‌లు, నూడుల్స్, పాస్తాల్లో పొడి, రోల్ రూపంలో తినడానికి వీలుగా తయారుచేస్తున్నారు. అలాగే బిస్కెట్లు/కుకీస్, డ్రింకులు, నూట్రియెంట్ బార్స్, బ్రెడ్లు, సాచెట్లు వంటి వాటి తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సీవీడ్‌తో తినే పదార్థాలు, సూప్, సాచెట్లు వంటివి తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని విశాఖ ఐకార్–సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తినడానికి వీలుగా 221 రకాల జాతులు.. సీవీడ్‌లో ఎరుపు, గోదుమ, ఆకుపచ్చ రంగుల్లో తినడానికి వీలుగా 221 రకాల జాతులున్నాయి. వీటిలో సోడియం, కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి. సీవీడ్‌లో పలు ఔషధ గుణాలు ఉండడంతో వాటితో తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హెచ్ఐవీ, కోవిడ్ వంటివి నియంత్రణలోకి వస్తాయని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఐకార్–సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు డైటరీ ఫైబర్ ఫోర్టిఫైడ్ ఫిష్ సాసేజ్‌ను అభివృద్ధి చేశారు. వీటిని ఆహార, చేపల శుద్ధి చేసే రిటైల్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కియోస్కుల్లో అందుబాటులో ఉంచే వీలుంది. కృత్రిమంగానూ పెంచే వీలు.. సీవీడ్ సముద్రంలో సహజసిద్ధంగానే పెరుగుతుంది. దీనిని కృత్రిమంగానూ పెంచవచ్చు. ఇలా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వీటి పెంపకాన్ని చేపట్టారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వరకు.. అలల తీవ్రత అంతగా లేని, లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతం సీవీడ్ పెంపకానికి అనుకూలం. సీవీడ్‌తో శానిటైజర్ల తయారీ.. ఐకార్– సీఐఎఫ్టీ కొచ్చి శాస్త్రవేత్తలు సీవీడ్‌తో హ్యాండ్ శానిటైజర్ల తయారీ సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు. ఇది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నియంత్రణలో చురుగ్గా పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. రెడ్ సీవీడ్.. ఫుడ్, కాస్మొటిక్స్, ఫార్మా, బయోమెడికల్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇది హెర్పిస్, ఇన్ఫ్లుయెంజా, హెచ్ఐవీ వైరస్‌లపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. మరోవైపు విశాఖలో లభించిన గ్రీన్ సీవీడ్‌తో సూప్‌ను కూడా తయారు చేసినట్టు విశాఖ ఐకార్–సీఐఎఫ్టీ సీనియర్ శాస్త్రవేత్త జెస్మీ దేబర్మ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ తీరంలో 1,215 హెక్టార్లు దేశంలో సముద్ర తీరంలో సీవీడ్ పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 49 ప్రాంతాల్లో తీరానికి ఆనుకుని సముద్రంలో 1,215 హెక్టార్లు సీవీడ్ పెంపకానికి అనువుగా ఉందని గుర్తించారు. విశాఖ తీర ప్రాంత పరిసరాల్లో రెడ్, బ్రౌన్లకంటే గ్రీన్ సీవీడ్ (ఉల్వా రకం) ఎక్కువగా లభిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్కే బీచ్ వద్ద 40, ఉడా పార్క్ 10, తెన్నేటి పార్క్ 50, తొట్లకొండ 25, భీమిలి 25, తిమ్మాపురం 50, మంగమారిపేట 50, ఎండాడ 25, ముత్యాలమ్మపాలెం 25, పూడిమడక 50, బంగారమ్మపాలెం 25, రాంబిల్లి వద్ద 25 వెరసి 400 హెక్టార్లు అనుకూలంగా ఉన్నట్టు తేల్చారు. ఇంకా విజయనగరం జిల్లాలో 165, శ్రీకాకుళంలో 75, తూర్పు గోదావరిలో 250, పశ్చిమ గోదావరిలో 100, కృష్ణాలో 105, ప్రకాశంలో 75, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 45 హెక్టార్లను గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సహజసిద్ధంగా సీవీడ్ పెరుగుతోంది. ఔత్సాహికులు ముందుకొస్తే పెంచేందుకు ఈ ప్రాంతాలు అనుకూలమని నిర్ధారించారు. సముద్రంలో కేజ్ కల్చర్‌తోపాటు మల్టీ ట్రాఫిక్ ఆక్వాకల్చర్ పేరిట సీవీడ్‌ను పెంచేలా ఆలోచన చేస్తున్నారు. సీవీడ్‌పై అవగాహన కల్పిస్తున్నాం.. పలు ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న సీవీడ్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సీవీడ్‌లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లను చంపే గుణాలున్నాయి. సీవీడ్‌తో పశుగ్రాసం, ఎరువులను తయారు చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. సీవీడ్ వినియోగం పెరగాలంటే వీటి ఉత్పత్తులు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు రావాలి. – బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐకార్–సీఐఎఫ్టీ, విశాఖపట్నం -
చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: మాంసం.. చేపలు.. రొయ్యలు.! చింత చిగురు ధర ముందు ఇవన్నీ దిగదుడుపే. పల్లెల్లో అంతగా పట్టించుకోని ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది. నగర మార్కెట్లలో కిలో రూ.500 ధర పలుకుతోందంటే దీనికున్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే.. రెండు కిలోల చికెన్, రెండు కిలోల రొయ్యలు, మూడు కిలోల చేపలకు సమానమన్న మాట! చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలుండడంతో నగరవాసులు వీలైనంత మేర కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు మంచి రుచి తెస్తుందన్న భావనతో పల్లెల్లో చింత చిగురును కాయగూరల్లోనే కాదు.. చేపలు, రొయ్యలు, మటన్ వంటి మాంసాహార వంటకాల్లోనూ జత చేసేవారు. చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! ఇంకా దీనితో చెట్నీ, పులిహోర, రసంలను తయారు చేసేవారు. కాలక్రమంలో పల్లెటూళ్లలో చింత చిగురు వినియోగాన్ని తగ్గించారు. కానీ మారిన జీవనశైలి, ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా, టీవీల్లో ప్రసారమయ్యే వంటకాల్లో చింత చిగురులో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల గురించి విరివిగా ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు పల్లెలుకంటే పట్టణాలు, నగరాల్లోనే దీని వినియోగం బాగా పెరిగింది. ఏడాదిలో జూన్, జులైలో మాత్రమే ఇది దొరుకుతోంది. గతంకంటే అర్బన్ ప్రాంతాల్లో ఏటికేడాది డిమాండ్‌తో పాటు ధర కూడా పెరుగుతోంది. మార్కెట్లు, రైతుబజార్లలో రెండేళ్ల కిందట కిలో చింత చిగురు రూ.100–150కే లభ్యమయ్యేది. ఈ సంవత్సరం ఏకంగా రూ.400 నుంచి 500 వరకు ఎగబాకింది. సేకరణ కష్టతరం గతంలో చింత చెట్లు పల్లె ప్రాంతాల్లోనూ, రోడ్ల పక్కన విరివిగా ఉండేవి. గ్రామాలు, రోడ్ల విస్తరణతో ఆయా చోట్ల వీటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా ఎక్కడా చింత చెట్లను నాటడం లేదు. ఫలితంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దీంతో పల్లెలకు దూరంగా ఉంటున్న చింత చెట్ల నుంచి చిగురు సేకరణకు ఆసక్తి చూపడం లేదు. చిగురు కోయడానికి ఎక్కువ కూలీ సొమ్ము చెల్లించి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని కె.కోటపాడుకు చెందిన దేవుడమ్మ అనే మహిళ ‘సాక్షి’కి చెప్పింది. అందుకే గతంకంటే చింత చిగురు ధర పెరిగిందని తెలిపింది. చింత చిగురు ఆరోగ్య ప్రదాయిని చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మోతాదులో ఔషధ గుణాలుంటాయి. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్–సి 3 మి.గ్రా.లు ఉంటుంది. యాంటీ బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలుండడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. జీర్ణ క్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిది. – ఎం.రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఏయూ -
డబ్బుల ‘డ్రాగన్’ పళ్లు.. ఎకరాకు రూ.6 లక్షల ఆదాయం.. ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు
నల్లగొండ రూరల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడానికితోడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఇది ఎడారి జాతికి చెందిన పంట కావడంతో నీటి అవసరం పెద్దగా ఉండదు. ఏడాది పొడవునా 50 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుంది. కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్.. బీడు భూములు, గుట్టల ప్రాంతాల్లో బ్రహ్మజముడు పండు తరహాలోనే పండుతుంది. ఈ పంట థాయ్‌లాండ్ దేశంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం మిర్యాలగూడ సమీపంలోని మొల్కపట్నంకు చెందిన కొంపల్లి యాదగిరి అనే వ్యాపారి కోల్‌కతా నుంచి మొక్కలు తెచ్చి సాగు చేశాడు. ఆ తర్వాత ఒకరిని చూసి మరొకరు డ్రాగన్ సాగుబాట పట్టారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 53ఎకరాలు, భువనగిరి యాదాద్రి జిల్లాలో 15ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4 ఎకరాల చొప్పున మొత్తం 72 ఎకరాల్లో 33 మంది రైతులు ఈ తోటలను సాగు చేస్తున్నారు. (చదవండి: నిమ్మకాయలు, నల్లకోడి కోసి తవ్వకాలు.. పక్కా సమాచారంతో..) ఒకసారి నాటితే 30ఏళ్ల వరకు దిగుబడి.. నీరు నిలిచే బంకనేలలు మినహా అన్ని భూములు ఈ పంటకు అనుకూలమే. నాటిన ఆరునెలల్లో పంట చేతికొస్తుందని సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. ప్రతి ఏడాది జూన్ మొదటి వారం నుంచి డిసెంబర్‌కు దిగుబడి వస్తుంది. సస్యరక్షణ చర్యలు చేపడితే 6టన్నుల నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని, ఒకసారి మొక్కలు నాటితే 30ఏళ్లపాటు తోట దిగుబడినిస్తుందని నిపుణులు అంటున్నారు. పోషక విలువలు మెండు.. పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లు కావడంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఈ పండ్లకు యమ గిరాకీ ఉంటోంది. ప్రస్తుతం మార్కెట్లో వైట్, పింక్ రంగుల్లోడ్రాగన్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తున్నాయి. కొందరు రైతులు డ్రాగన్ ఫ్రుట్ క్షేత్రాల వద్దనే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కిలో రూ.200–250 ధర ఉండగా టన్ను ధర గరిష్టంగా రూ.2లక్షల వరకు పలుకుతోంది. (చదవండి: ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు) సాగు విధానం ఇలా.. డ్రాగన్ ఫ్రూట్ సాగులో 15రోజులకు ఒకసారి తేలికపాటి నీటిని అందించాలి. పూత సమయంలో చీమలు తినకుండా మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడిపై ప్రభావం పడకుండా మునుగ, కరివేపాకుతోపాటు నీడనిచ్చే అంతరపంటలను సాగు చేస్తే చాలు మేలు. ఎకరానికి 400 కడీలను పాతి వాటి పైభాగంలో రింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒక కడీకి తూర్పు, పడమర వైపు రెండేసి మొక్కలు నాటుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడితే అధిక దిగుబడులు రావడంతోపాటు పండ్లు రుచికరంగా ఉంటాయి. ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే రూ.6లక్షల ఖర్చు అవుతుంది. దిగుబడి వచ్చాక అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.6లక్షల ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. నల్లగొండ సమీపంలో సాగుచేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట డ్రాగన్ ఫ్రూట్‌తో భలే ఆదాయం రెండేళ్ల క్రితం నా కుమార్తె డెంగీ బారిన పడినప్పుడు డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని చెప్పారు. మార్కెట్లో ఈ పండ్లకు ఉన్న డిమాండ్‌ను చూసి అప్పుడే ఈ తోట పెట్టాలని నిర్ణయించుకున్నాను. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట నాకున్న 5ఎకరాల భూమిలో పూర్తిస్థాయిలో సేంద్రియ పద్ధతిలో ఎకరాకు రూ.6లక్షల పెట్టుబడి పెట్టి తోట సాగు చేశాను. ఆరునెలల్లోనే పంట చేతికొచ్చింది. ప్రస్తుతం రోజూ 4–5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు అన్ని ఖర్చులుపోను రూ.6లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది. – తండు సైదులుగౌడ్, డ్రాగన్ ఫ్రూట్ రైతు -
ఆహా.. ఆక్వా హబ్‌లు!
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న ఆక్వా హబ్‌లు సిద్ధమవుతున్నాయి. దేశంలో తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్రా’ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. బతికి ఉన్న చేపలే కాదు.. ఐస్‌లో భద్రపర్చిన ఫ్రెష్ ఫిష్‌తో పాటు దేశంలోనే తొలిసారిగా వ్యాక్యూమ్ ప్యాక్డ్ ఫిష్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కూరగాయలు, చికెన్ మాదిరిగా అన్ని వేళల్లో అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తొలిసారిగా చేపలు, రొయ్యల పచ్చళ్లతోపాటు నేరుగా వండుకునేందుకు మసాలాతో దట్టించి చేసిన మత్స్య ఉత్పత్తులను కూడా అందించబోతున్నారు. వంద ఆక్వా హబ్‌లు.. ఏటా దాదాపు 46.23 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏపీలో వార్షిక తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా 2022 కల్లా రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా డిసెంబర్ నెలాఖరులోగా రూ.325.15 కోట్లతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పులివెందులతో పాటు పెనమలూరులో ఏర్పాటు చేస్తోన్న హబ్‌లను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హబ్‌ల్లో ప్రత్యేకతలెన్నో హబ్‌ల్లో 20 టన్నుల సామర్థ్యంతో ప్రాసెసింగ్ యూనిట్, 3 టన్నుల సామర్థ్యంలో చిల్డ్, కోల్డ్ స్టోరేజీలు, టన్ను సామర్థ్యంతో 2 లైప్ ఫిష్ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. ఆక్వా, సముద్ర ఉత్పత్తులను సేకరించే ముందు తొలుత శాంపిళ్లను ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు పంపి పరీక్షించిన తర్వాత హబ్, రిటైల్ అవుటలెట్స్కు తరలిస్తారు. హబ్‌ల్లో కోల్డ్ చైన్ సప్లై సిస్టమ్ ద్వారా చేపలు, రొయ్యలను వృథా కాకుండా కట్ చేసి కనీసం వారం రోజుల పాటు నిల్వచేసే విధంగా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్ చేస్తారు. వాటిని రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. నేరుగా వండుకునేందుకు వీలుగా మసాలాలు దట్టించిన ఉత్పత్తులను ఇక్కడ నుంచి అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. బతికి ఉన్న చేపలను చెరువుల నుంచి హబ్‌లతో పాటు రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. రెస్టారెంట్ మాదిరిగా .. హబ్‌కు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సర్వే చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వాల్యూయాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బతికున్న చేపలతో పాటు రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో వేస్ట్ లేకుండా కట్ చేసిన చేపలు(ఫ్రెష్ ఫిష్)లతో పాటు ఫ్రోజెన్ ఫిష్, మ్యారినెట్ చేసిన చేపలను కూడా అందుబాటులో ఉంచుతారు. రెస్టారెంట్ మాదిరిగా ఓ వైపు డైనింగ్ ఫెసిలిటీ కల్పిస్తారు. తమకు నచ్చిన చేపలను కోరుకున్నట్లుగా వండుకుని తినే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా బతికున్న చేపలతో పాటు మ్యార్నెట్ చేసిన వాటిని తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. లైవ్ ఫిష్ యూనిట్లలో బతికున్న చేపలను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేస్తారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే కియోస్క్‌లో కూడా తక్కువ సామర్థ్యంతో లైవ్షిఫ్ను అందుబాటులో ఉంచుతారు. మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టుల్లో తినేందుకు వీలుగా చేపలు, రొయ్యలతో తయారైన స్నాక్స్ అందుబాటులో ఉంచుతారు. ఈ– కార్ట్స్ ద్వారా కూరగాయల మాదిరిగా తాజా నాణ్యమైన చేపలను ప్రజలకు ఇళ్ల వద్దే విక్రయిస్తారు. సచివాలయానికొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అందుబాటులో ఉంచుతారు. ఈ అవుట్‌లెట్స్ ద్వారా డోర్ డెలివరీ చేస్తారు. ఈ కామర్స్ సిస్టమ్ ద్వారా ప్రతీ వినియోగదారుడి నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు తగ్గట్టుగా మత్స్య ఉత్పత్తులను సరఫరా చేస్తారు. సచివాలయానికో మినీ రిటైల్ అవుట్లెట్ నాలుగు వేల చదరపు అడుగుల వీస్తీర్ణంలో రూ.1.67 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌లకు అనుబంధంగా ప్రతి హబ్ పరిధిలో రూ.50 లక్షల ఖర్చుతో వ్యాల్యూ యాడెడ్ యూనిట్, రూ.20 లక్షల అంచనాతో ఐదు లైవ్ ఫిష్ యూనిట్లు, రూ.10 లక్షల వ్యయంతో 8 ఫిష్ కియోస్క్‌లు, రూ.10 లక్షలతో మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టులు, బజార్లలో విక్రయించేందుకు రూ.3 లక్షల అంచనాతో 10 ఎలక్ట్రికల్ ఈ కార్ట్స్ వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇక హబ్‌కు అనుబంధంగా సచివాలయానికి ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ.1.45 లక్షల అంచనా వ్యయంతో 100–120 మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తారు. -
పచ్చి మిరప పరమ శ్రేష్ఠం
ఆహారపు వర్గీకరణలో ఆయుర్వేదం షడ్రసాలకు (మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త కషాయ రుచులు) ప్రాధాన్యతనిచ్చింది. ‘కటు’ అంటే ‘కారం/ఘాటు’ అని అర్థం. భారతీయ వైద్యమైన ఆయుర్వేద కాలంలో కారానికి వాడుకునే ఏకైక ప్రధాన ద్రవ్యం ‘మిరియాలు’(మరిచ). పచ్చిమిరప చరిత్ర: 16 వ శతాబ్దంలో పచ్చి మిరపను పోర్చుగీసువారు ఆసియా ఖండానికి అందించారు. అనంతరం వాస్కోడగామా మన దేశానికి తెలియచెప్పారు. కనుక ఆ కాలంలో వెలసిన ఆయుర్వేద గ్రంథమైన ‘యోగరత్నాకరం’ లో ‘క్షుపజమరిచ’ అనే పేరులో దీనిని పేర్కొన్నారు. అటుపిమ్మట దీనికే ‘కటుబీర’ అనే పేరు కూడా వచ్చింది. పచ్చి మిరప ఆకారంలోనూ, పరిమాణంలోనూ, ఘాటు తీవ్రతలోనూ రకరకాల తేడాలుంటాయి. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: పోషక విలువలు: వంద గ్రాముల పచ్చిమిరపలో 40 కేలరీలు, 3 శాతం పిండి పదార్థాలు, 3 శాతం ప్రొటీన్లు, అత్యధికంగా నీటి శాతం, 6 శాతం ఆహారపు పీచు ఉంటాయి. కొలెస్టరాల్ వంటి కొవ్వులు శూన్యం. ‘విటమిన్ – ఎ’ 19 శాతం, ‘సి’ 239 శాతం ఉంటాయి. ‘ఇ’, ‘కె’ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ‘బి – 6’ 25 శాతం ఉంటుంది. డి విటమిన్ ఉండదు. సోడియం 9 మిల్లీ గ్రాములు, పొటాషియం 322 మి.గ్రా. ఉంటాయి. కాల్షియం ఒక శాతం, ఐరన్, మెగ్నీషియాలు ఐదేసి శాతం ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు: యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు, బీటాకెరోటిన్, ఎండార్ఫిన్లు, కెప్సైసిస్ వంటి జీవరసాయనాలు పుష్కలంగా ఉండటం వలన, అనేక వ్యాధులను పోగొట్టడానికి, వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తుంది. ►ప్రధానంగా రక్తప్రసరణని ధారళం చేస్తుంది, వయాగ్రాల కంటె మిన్నగా కామోత్తేజకంగా పనిచేస్తుంది. కంటిచూపును, చర్మకాంతిని వృద్ధి పరుస్తుంది. పొడి చర్మానికి విరుగుడైన జిడ్డు కలిగిస్తుంది, కనుక మొటిమల (పింపుల్స్) సమస్య ఉన్న వారికిది మంచిది కాదు. ►మెటబాలిజాన్ని అధికం చేసి, కొవ్వుని కరిగించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ►హైబీపీ, డయాబెటిస్, కేన్సరు వ్యాధులను అదుపు చేస్తుంది ►గుండె జబ్బుల నివారణకు మంచిది ►పురుషులలోని ప్రోస్టేటు సమస్యలో ప్రయోజనకారి ►జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది ►జలుబు, సైనసైటిస్‌లకు మంచిది. గమనిక: పచ్చిమిరప పండు మిర్చిగా మారుతుంది. ఎండబెడితే ద్రవాంశ ఇగిరిపోయి, ఎండుమిర్చిగా మారుతుంది. నీరు లేకపోవడం వలన ఎండు మిర్చి లేదా దాని పొడి శరీరంలోని మ్యూకస్ పొరలను దహించివేసి అల్సర్స్ కలుగచేసే ప్రమాదం ఉంది. అందువలన పచ్చి మిర్చిని వాడటమే శ్రేష్ఠం. సాధారణంగా దీనిని అధికంగా సేవించేవారు ఉప్పు సంపర్కంతోటే తింటుంటారు. అది మంచిది కాదు. సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గించి పచ్చిమిర్చిని వాడటం శ్రేష్ఠం. నిమ్మరసాన్ని జోడిస్తే ఉప్పు అవసరం ఉండదు. వాడుకునే ప్రక్రియలు నిమ్మరసంలో నామమాత్రంగా ఉప్పు, కొంచెం వాము, ఇంగువ కలిపి అందులో కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి గంటసేపు ఉంచితే చక్కటి రుచి పుడుతుంది. అన్నంలోకి, రొట్టెలలోకి నంజుకుందుకు వాడుకోవచ్చు. రెండు రోజుల వరకు పాడవదు. మిరపకాయలను ముక్కలు చేయకుండానే ‘నరుకు’ పెట్టి, గింజలు తీసేసి, అందులో నువ్వుల పొడిని (పల్లీల పొడి లేక పుట్నాల పప్పు పొడి కూడా వాడుకోవచ్చు) నింపి, ఆవిరి మీద ఉడికించి, దానిపై ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం కలిపి, నంజుకుందుకు వాడితే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రుచి అద్భుతంగా ఉంటుంది. పండుమిర్చి పచ్చడి తినాలంటే నెయ్యి లేక నువ్వుల నూనెను తగినంత అనుసంధానంగా వాడితే అనర్థం తగ్గుతుంది. పెరుగు లేక మజ్జిగను సమృద్ధిగా సేవిస్తే మంచిది. లేకపోతే కడుపులో పుండ్లు, పైల్స్, హైబీపీలకు దారి తీస్తుంది. జాగ్రత్తలు: మిరపకాయలను వాడుకునే ముందు, ఉప్పు కలిపిన నీళ్లలో అరగంట నానబెడితే క్రిమిసంహారక మందుల దుష్ప్రభావం తగ్గుతుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
తియ్య గుమ్మడి తిని తీరాలి
సనాతన భారతీయ వైద్యమైన ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, పువ్వులు, మూలికల పోషక విలువలు, ఔషధ గుణాల గురించి ప్రాచీన ఆచార్యులు వివరించారు. పచ్చి మిరప, టొమాటో వంటి కొన్ని ద్రవ్యాలు మాత్రం మన దేశపు పురాతన పంటలలోకి రావు. అవి విదేశాల నుండి మనకు సంక్రమించినవే. ‘తియ్య గుమ్మడి’ కూడా అలాంటిదే. దక్షిణ అమెరికా దీనికి కాణాచి. మన దేశానికి ఇది అక్కడి నుంచి వలస వచ్చినదే. బూడిద గుమ్మడి (కూష్మాండ), కర్బూజ (కూష్మాండీ), త్రపుస (దోస) మొదలైనవి మన దేశపు వారసత్వ శాకఫలాలే. అయితే ‘కూష్మాండీ’ ని తియ్య గుమ్మడి జాతి భేదంగా పరిగణించారు మన ప్రాచీన శాస్త్రజ్ఞులు. కూష్మాండీ: దీనికే ‘కర్కారు’ అనే పేరుంది. వృక్షశాస్త్రంలో దీని పేరు ‘కుకుర్బిటా మేక్జిమా’, ‘పెపా’. ఇది దేహాన్ని చల్లబరచి (శీతలం) రక్త స్రావాలని అరికడుతుంది (రక్తపిత్తహరం). బాగా పండినదైతే కొంచెం ఉప్పగా, చిరు చేదుగా ఉంటుంది. పుష్టికరం. ఆకలి కలిగిస్తుంది (అగ్నిదీపకం). కఫవాత రోగాల్ని తగ్గిస్తుంది. భావప్రకాశ: ‘‘కూష్మాండీ... కర్కారుః... శీతా రక్తపిత్తహరా, గురుః , పక్వా తిక్తాగ్ని జననీ సక్షారా కఫవాతనుత్’’ తియ్య గుమ్మడి: ఇది శీతాకాలంలో అధికంగా లభిస్తుంది. దీనిని కాయగానూ, పండుగానూ కూడా పిలుస్తుంటారు. భారతీయ వివాహాలలో దీనికి మంగళప్రదమైన స్థానం ఉంది. మన నిత్య వంటకాలలో దీనిని కూరగా వండుతుంటారు (నువ్వుల పొడి కూర, మెంతి పొడి కూర మొదలైనవి). పులుసులో ముక్కలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పండులోని గింజలను... పై పొరను తొలగించి తినటం ఆనవాయితీ. కృశించినవారికి బలకరం. ఎక్కువగా బరువున్న వారికి (స్థూలురకు) కొవ్వు కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: 100 గ్రాముల తియ్య గుమ్మడిలో 7 గ్రా. పిండిపదార్థాలూ, 1 గ్రా. ప్రొటీన్లూ, 0.1 గ్రా. కొవ్వులూ ఉంటాయి. 26 కేలరీలు ఉంటాయి. సోడియం, కొలెస్టరాల్ చాలా నామమాత్రంగా ఉంటాయి. ‘విటమిన్ – ఎ’ (170 శాతం), విటమిన్ సి (15 శాతం), బి – 6 (5 శాతం), క్యాల్షియం (20 శాతం), ఐరన్ (4 శాతం) మెగ్నీషియం (3 శాతం) లభిస్తాయి. కాపర్, మెగ్నీషియం కూడా కొద్దిగా లభిస్తాయి. విటమిన్ – ఇ, ఫోలేట్స్, ఒమేగా – 3 ఫాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. స్టార్చ్ అధికం. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ప్రయోజనాలు: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. కంటి ఆరోగ్యానికి, చర్మ కాంతికి, గుండె బలానికి దోహదకారి. అధిక బరువుని తగ్గించటానికి ఉపయోగకరం. కాన్సరు వంటి క్లిష్టమైన వ్యాధులను నివారించటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించటానికి ఉపకరిస్తుంది. ఇది ఎంత తిన్నా మంచిదే. నూటికొక్కరికి సరిపడక ఎలర్జీలు కలిగించవచ్చు. అలాంటివారు దీనిని తినకూడదు గాని, దీనిని ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యకరం. దీనిని పండ్లు తినే రీతిలో పచ్చిగా తినరు. వండుకుని కూరగాను, పులుసులో ముక్కలుగా (ఉడికించి) ను సేవించాలి. చిన్న మాట నిమ్మచెక్కతో చాలా వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. కూరలు తరిగిన ప్లాస్టిక్ బోర్డు మీద అలాగే డైనింగ్ టేబుల్ మీద నిమ్మ చెక్కతో రుద్ది, పదిహేను నిమిషాల తరవాత కడిగితే మురికితో పాటు క్రిములు కూడా మటుమాయం అవుతాయి. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
చింతలు తీర్చే ఎర్రచింత!
తీవ్ర కరువు, గాలివానలు వంటి తీవ్రమైన ప్రకృతి వైవపరీత్యాలను సైతం తట్టుకోవడంతోపాటు రైతుకు స్థిరంగా ఏటేటా మంచి ఆదాయాన్నివ్వగలిగిన మంచి తోట పంట ‘ఎర్ర చింత’. దీని అసలు పేరు ‘అనంత రుధిర’. ఇది సహజ రకమే. అనంతపురం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదలైంది. ఈ చింతపండు ఎరుపు రంగులో ఉండటం, సాధారణ చింతలో కన్నా పోషక విలువలు అధికంగా కలిగి ఉండడంతో ఇతర ఉత్పత్తుల్లో కలపడానికి.. అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఇది బాగా అనుకూలమైనది. బత్తాయి తదితర పండ్ల తోటలు ఎండిపోతున్న తీవ్ర కరువు పరిస్థితుల్లోను, గాలివానలకు తట్టుకొని దిగుబడిని ఇవ్వగలగడం దీని ప్రత్యేకత.. చింతపండుతో దక్షిణాదిప్రజలకు, రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత సాగు జరుగుతోంది. ఇంట్లో రోజువారీ వంటల్లో వాడుకోవడానికి, నిల్వపచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే చింతపండును ప్రస్తుతం మనం వాడుతున్నాం. చింతపండు అంటే నల్లగానే ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే ఇటీవలే ఎర్రని చింత రకం ఒకటి వెలుగులోకి వచ్చింది. పొలుసు ఒలిచిన తర్వాత చింతపండు మామూలు చింత రకాలకు భిన్నంగా ఎర్ర చింత రకాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఐదేళ్లపాటు కొనసాగిన పరిశోధనల ఫలితంగా ఎరుపు రంగులో ఉండే చింత రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది. గింజలు తీసిన ఎర్రచింతపండు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఉద్యాన శాస్త్రవేత్తలు విడుదల చేసిన చింత రకాలు రెండే రెండు. ఉత్తరప్రదేశ్‌లో యోగేశ్వర్ అనే రకం(దీని వివరాలు పెద్దగా అందుబాటులో లేవు) మొదటిది కాగా, మన అనంతపురం శాస్త్రవేత్తలు గుర్తించి, అభివృద్ధి చేసి వెలుగులోకి తెచ్చిన ‘ఎర్ర చింత’(అనంత రుధిర) రెండోది కావడం విశేషం. రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో 40కి పైగా రకాల చింతచెట్లను సాగు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో 30 ఏళ్ల వయసున్న ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు, ఈ చెట్టు ప్రతి ఏటా కాయలు కాస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎర్ర చింతపండుతో తయారైన వివిధ ఉత్పత్తులు దీనికి ‘ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 20 వేల అంట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రకం మొక్కలు కొన్నిటిని ఈ పరిశోధనా స్థానంలో నాటారు. అవి పూతకు వచ్చిన తర్వాత ఆ చెట్లకు కూడా అంట్లు కట్టడం ప్రారంభిస్తామని డా. శ్రీనివాసులు తెలిపారు. ‘అనంత రుధిర’ రకంతోపాటు సాధారణరకాలైన తెట్టు అమాలిక, ధార్వాడ్ సెలక్షన్–1, ధార్వాడ్ సెలక్షన్–2 చింత రకాల అంటు మొక్కలు కూడా రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎర్రచింత అంటుమొక్కలు ఎర్ర చింతకు గుత్తులుగా కాయలు ఉద్యాన క్షేత్రంలో ఉన్న అనంత రుధిర రకం ప్రతి ఏటా కాపు కాస్తున్నది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్ రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్మెంట్ కారణంగా ఎరుపు రంగు సహజసిద్ధంగానే వస్తున్నదని డా. శ్రీనివాసులు తెలిపారు. ఆరోగ్యదాయకం మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింతతొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తారు. అయితే, ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు. ఆకర్షణీయంగా ఆహారోత్పత్తులు ఎరుపు రంగు ఆక్షణీయంగా ఉంటుంది కాబట్టి ఎర్ర చింతపండుతో పులిహోర, సాంబారును మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయని డా. శ్రీనివాసులు అంటున్నారు. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది. ఐదో ఏడాది నుంచి దిగుబడి ‘అనంత రుధిర’ రకం సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనవే అయినప్పటికీ, ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల రేగళ్లలో మంచి దిగుబడులు వస్తాయని డా.శ్రీనివాసులు తెలిపారు. సాధారణంగా చింత మొక్కలను చౌడు నేలల్లోనో, వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనో నాటుతూ ఉంటారని.. అయితే సాగు యోగ్యమైన భూముల్లో ఇతర తోట పంటల మాదిరిగానే చింత అంట్లను నాటుకొని, డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన అంటున్నారు. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 8 మీటర్ల ఎడంలో ఎకరాకు 62 మొక్కలు నాటుకోవచ్చు. చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది. చింత పండ్లను సేకరించి పైన పొలు, ఈనెలు, గింజలు తీసేస్తే.. 40–45 శాతం మేరకు నికరంగా చింతపండు చేతికి వస్తుందని డా. శ్రీనివాసులు తెలిపారు. ఏటా కాపు కాయడం ఈ రకం విశిష్టత కావడంతో రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అంటు మొక్కలు నాటుకుంటే 70–80 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. చింత గింజలు నాటితే చెట్లు 10–12 ఏళ్లకు గానీ కాపునకు రావు. కానీ, వందేళ్ల వరకు దిగుబడినిస్తాయి. అయితే, గింజ నాటినప్పటికన్నా అంటు నాటుకున్నప్పుడు జన్యుపరంగా ఖచ్చితమైన నాణ్యమైన చెట్లు రావడానికి అవకాశం ఉందన్నారు. అంతర పంటలుగా పప్పు ధాన్యాలు చింత మొక్కల మధ్య ఎటుచూసినా 8 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి.. మామిడి, చీనీ తోటల్లో మాదిరిగానే.. చింత తోటలు నాటిన కొన్ని ఏళ్ల పాటు రైతులు నిశ్చింతగా అంతర పంటలు వేసుకోవచ్చని డా. శ్రీనివాసులు తెలిపారు. అన్ని రకాల కూరగాయ పంటలు, వేరుశనగ, అలసంద, పెసర, మినుము, బీన్స్ వంటి పప్పుజాతి పంటలను అంతరపంటలుగా సాగు చేసుకోవచ్చన్నారు. చింత చెట్లకు కాయతొలిచే పురుగు ఒక్కటే సమస్యగా గుర్తించారు. మూడు నాలుగు నెలల పాటు ఉండే పిందె దశలో 1 మి.లీ క్లోరిఫైరిపాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1 మి.లీ డైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కాయతొలిచే పురుగును నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందించాలి. సేంద్రియ ఎరువులు, వేప చెక్కతో పాటు తగిన మోతాదులో రసాయన ఎరువులు వేసుకోవాలని డా. శ్రీనివాసులు సిఫారసు చేస్తున్నారు. అయితే, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు తమ పద్ధతుల ప్రకారం ఎరువులను, కషాయాలను వాడుకుంటూ చింత తోటలు సాగు చేసుకోవచ్చు. – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అంతపురం అగ్రికల్చర్ ఎర్ర గరప, రేగడి నేలలు అనుకూలం ఎర్ర చింత చెట్ల సాగుకు ఎర్ర గరప నేలలతోపాటు తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో అయితే మెట్ట ప్రాంతాల్లో కన్నా అధిక దిగుబడి కూడా రావచ్చు. గాలి వానలకు దీని కాయలు పండిన దశలో కూడా రాలిపోవు. తక్కువ వర్షపాతం ఉండే రాయలసీమ వంటి ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులను సైతం తట్టుకొని బతుకుతుంది. అందువల్లనే బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో రైతులు ఇటీవల కాలంలో చింత మొక్కలు నాటుకుంటున్నారు. ఇతర తోటల్లో మాదిరిగా డ్రిప్ పెట్టుకొని, ఎరువులు వేసుకొని కొంచెం శ్రద్ధ చూపితే ఎటువంటి భూముల్లోనైనా చక్కగా పెరిగి దశాబ్దాలపాటు లాభదాయకమైన దిగుబడినిస్తుంది. ఎర్ర చింత అంటు మొక్కలకు రైతుల నుంచి ఇప్పటికే గిరాకీ బాగా వచ్చింది. తెలంగాణ ఉద్యాన శాఖ వారు కూడా 3 వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చారు. వచ్చే నెలలో వారికి సరఫరా చేస్తున్నాం. టిష్యూకల్చర్ పద్ధతి విజయవంతం కాకపోవడంతో అంటు మొక్కలనే రైతులకు అందిస్తున్నాం. ఎర్రచింతపండును వంటకాల్లో చింతపండుగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువే. – డా. బి. శ్రీనివాసులు (73826 33667), అధిపతి, డా. వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా -
పాలక్ కబాబ్స్
ఎన్నో పోషక విలువలు ఉన్న ఆకుకూర తో సాధారణంగా పప్పు, పొడి కూర, పనీర్‌తో చేస్తాం. కాని వెరైటీగా పాలకూరలో బంగాళాదుంపని కలిపి, కబాబ్స్ చేసి మీవాళ్లకి అందించండి. కొత్త రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా అందించి ఆరోగ్యాన్నీ అందించండి ఇలా... తయారి సమయం: 30. నిమిషాలు కావలసినవి: పాలకూర కట్టలు – 2, చిన్నగా కట్ చేసుకోవాలి; బంగాళదుంపలు – రెండు; ఉల్లిపాయ – 1, సన్నగా కట్ చేసుకోవాలి; పచ్చిమిర్చి – 3; అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – ఒక కట్ట, సన్నగా కట్ చేసుకోవాలి; బ్రెడ్ స్లైస్‌లు – రెండు; గరం మసాలా – చిటికెడు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా; తయారి: ∙ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ∙పై పదార్థాల్లో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ కలపాలి. వడల్లా వత్తుకుని ఇరవై నిమిషాలు రిఫ్రిజరేటర్లో పెట్టి తియ్యాలి. ∙నాన్ స్టిక్ పెనం వేడయ్యాక, కొంత నూనె వేసి నాలుగు లేదా అయిదు కబాబ్స్ వేసి ఇరు వైపులా ఎరుపు రంగు వచ్చేలా వేయించాలి. ∙వేడివేడిగా టొమాటో సాస్ కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటాయి. -
విస్తరిస్తున్న అంజీర సాగు
పోషక విలువలు కలిగిన పండు అంజీర. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా సాగవుతున్న ఈ పంట సాగు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నది. హైదరాబాద్ నగరంలో మంచి గిరాకీ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలువురు రైతులు సాగు ప్రారంభించారు. వారిలో ఒకరు విశ్రాంత ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల క్రితం 4 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన ఆయన.. 3 ఎకరాల్లో పుణే లోకల్ వెరైటీ అంజీర తోటను పది నెలల క్రితం నాటారు. మహారాష్ట్రతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో అంజీర తోటలను స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకున్న తర్వాత ఆయన సాగు చేపట్టారు. బళ్లారి నుంచి రూ.40ల ఖర్చుతో తీసుకొచ్చిన 1,500 మొక్కలను మూడెకరాల్లో నాటారు. గత ఏడాది జూన్‌లో ఒక ఎకరంలో, సెప్టెంబర్‌లో రెండెకరాల్లో నాటారు. మొదట నాటిన ఎకరం తోటలో ప్రస్తుతం తొలి విడత పండ్ల కోత ప్రారంభమైంది. సాళ్ల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంలో గుంతకు కిలో వర్మీకంపోస్టు వేసి నాటారు. చిగుళ్లను తుంచి వేయడం వలన సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పిలకలు వచ్చేలా చూసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారా రెండు రోజులకొకసారి నీటి తడిని అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి చెట్టుకు 5 కిలోల చొప్పున పశువుల ఎరువు వేశారు. ప్రస్తుతం ప్రతి డ్రిప్పర్ దగ్గర ఐదు కిలోల చొప్పున చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఇటీవలే వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని యాదగిరి ఆశిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన పెరుగుతుండటంతో పురుగు మందుల అవశేషాలు లేని పండ్లను తినేందుకు ఎంత ఖర్చయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. తన వ్యవసాయ క్షేత్రం వద్ద మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే అంజీర పండ్లను యాదగిరి (96528 60030) విక్రయిస్తున్నారు. – కుంభం వెంకటేశ్వర్లు, సాక్షి, నల్లగొండ రూరల్ -
గొంతులో ప్రతి సమస్య త్రోటింగ్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు
‘‘నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది’’ అన్న సామెత విన్నా "We are what we eat"అంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన శారీరక మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అన్న సత్యాన్ని తెలుసుకున్నా, నలుగురితో మంచిగా మాట్లాడడానికి, చక్కటి ఆహారం తీసుకోవడానికి మనస్సు, తెలివి కంటే ముందు ‘‘గొంతు’’ ప్రాధాన్యత ఏమిటో అందరూ గుర్తిం^è గలుగుతారు. మరీ ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మన మనస్సు సరిగ్గా లేనప్పుడు తప్పనిసరి నలుగురిలోకి వెళ్ళటం, వ్యాపకాలు పెట్టుకోవటం, మంచి ఆహారం తీసుకుంటూ మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తే చాలా త్వరగా కోలుకోగలుగుతారు. క్యాన్సర్ లాంటి మహమ్మారిని ఎదిరించి మంచి ట్రీట్మెంట్స్తో పాటు గుండె నిబ్బరంతో వారు ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రముఖులను ఎందరినో మనము చూస్తున్నాం. వారు అలా జయించారంటే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ, ‘‘నాకేం అవ్వలేదు’’. మిగతా వ్యాధులలానే ఈ వ్యాధి’’ అనుకుంటూ నలుగురిని కలిసి వారి వృత్తిలో వారు కొనసాగటమే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కాని దురదృష్టవశాత్తు అన్నవాహిక క్యాన్సర్‌కు గురైనవారు, తినటానికి ఇబ్బందిపడటమే కాకుండా గొంతు కూడా బొంగురుపోవటం, కొన్నిసార్లు మాట్లాడ లేక పోవటం వంటి లక్షణాలు ఉండటం వలన మరింత వ్యధ చెందే పరిస్థితులు తలెత్తుతుంటాయి. అందుకే ఈ క్యాన్సర్ పట్ల అవగాహన ముందుగా గుర్తించటం, ఎవ్వరిలో ఈ క్యాన్సర్ తలెత్తె ప్రమాదం ఉంటుందో తెలుసుకుని ఎదుర్కొవటం మరింత ముఖ్యం. గొంతునొప్పి అనగానే త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు బొంగురుగా మారినా, మింగడానికి కష్టంగా ఉన్నా నీళ్ల మార్పిడి జరిగిందని, వాతావరణ మార్పిడి, వేడి చేసింది, పడని ఆహార పదార్థాలు తీసుకున్నాం. ప్రయాణం చేయటం వలన అని అనుకునే వారిని మన చుట్టూ, మనం ఎంతో మందిని చూస్తుం టాం. అప్పుడప్పుడు అలాంటి లక్షణాలు కన్పించి రెండు, మూడు రోజుల్లో తగ్గితే అంతగా భయపడాల్సిన పనిలేదు కాని తగ్గకుండా కొన్నిరోజులుగా 1) మింగటానికి కష్టంగా, నొప్పిగా ఉండటం. 2) ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోగలగటం. 3) ఆకలి, బరువు తగ్గటం. 4) ఆగని దగ్గు, దగ్గులో రక్తం కన్పించటం. 5) గుండెలో మంట. 6) జ్వరం వంటి లక్షణాలు కన్పించే సొంత వైద్యం మానుకుని డాక్టర్ని సంప్రదించటం చాలా ముఖ్యం. ఒక్కొక్క సారి ఈ లక్షణాలు కన్పించే సరికే లేటు దశ అయి ఉండి కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా వ్యాపించి ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అన్నవాహిక మెడ కింద నుండి పొట్ట పై భాగం దాకా 25 సె.మీ. పొడవు ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్‌ను ఉపరిభాగంలో, మధ్య భాగంలో కింది భాగంలో వచ్చేవిగా మూడు భాగాలుగా విడదీస్తారు. ఉపరి భాగంలో వచ్చే క్యాన్సర్‌కు సాధారణంగా కీమో, రేడియోషన్ థెరఫి మాత్రమే ఇస్తుంటారు స్వరపేటికకు దగ్గరగా ఉండటం వలన సర్జరి చేయటం కష్టం. మిగతా రెండు భాగాలకు సర్జరి, కణితి బాగా పెద్దగా ఉన్నప్పుడు ముందు కీమో, రేడియేషన్ తర్వాత సర్జరి చేయటం జరుగుతూ ఉంటుంది. కణితి పెద్దగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకోలేని పరిస్థితులలో స్పెంట్ అమర్చటం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నవాహికలో కణితి ఉన్న భాగాన్ని సర్జరి ద్వారా తీసివేయటాన్ని ‘‘ఈసోఫేగక్టమి’’ అంటారు. ఈ సర్జరిలో అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేసి పొట్టలోని కొంత భాగాన్ని అన్నవాహికకు కలిపి వేయటం జరుగుతుంది. స్త్రీలకన్నా పురుషలలో మూడు రెట్లు అధికంగా కన్పించే ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోతే జీవిత కాలం పెంపొందించటం చాలా కష్టమనే చెప్పాలి కణితి కొంచెం పెద్దదయినప్పుడే లక్షణాలు కన్పించటం వలన ఈ క్యాన్సర్ లేటు దశలోనే గుర్తించటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారికి కొంత వరకు ఇబ్బందులు తగ్గించుట స్టెంట్స్ వంటివి అమర్చి పాలియేటివ్ కేర్ అందించటం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవ్వరిలో ఎక్కువ అన్న విషయాన్ని అందరూ తెలుసుకుని, ముందుగా గుర్తించడానికి ప్రయత్నించటమే మనము చేయవలసిన ప్రధానమైన పని. మరి ఈ క్యాన్సర్ ఎవరిలో వచ్చే ప్రమాదం ఎక్కువ, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి... ఒక సారి తెలుసుకుందాం. 1) 60 ఏళ్ల పై బడిన పురుషులు. 2) పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు. 3) గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ (ఎఉఖఈ) సంవత్సరాల తరబడి ఉన్నవారికి. 4) ఏ్కV (హ్యూమన్ పాపిలోమా వైరస్) 5) అన్నవాహికకు యాసిడ్స్‌తో తీవ్రవైన గాయాలు. 6) హెడ్ – నెక్ క్యాన్సర్‌కు గురయిన వారికి. 7) గొంతు భాగంలో రేడియేషన్. 8) థైలోసిస్ సమస్యలున్నవారికి. 9) కొన్ని రకాల రసాయన కర్మాగారాలలో వృత్తులు. 10) కొంత వరకు వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. దురలవాట్లకు దూరంగా ఉంటూ చక్కని జీవనశైలితో అధికబరువునూ, ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. లక్షణాలు కన్పించినప్పుడు మరీ ముఖ్యం గా పైన పేర్కొన్న రిస్క్గ్రూప్కు చెందిన వారు ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహామేరకు ఎండోస్కోపి, బయాప్సి అవసరమైతే ఛ్టి స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి, వ్యాధి నిర్థారణ, స్పే ఏ రకానికి చెందిన క్యాన్సర్, ఏఏ భాగాలకు వ్యాపించింది అనే విషయాల నిర్థారణకు ఈ పరీక్షలు తప్పనిసరి, నిర్థారణ, అయ్యాక సర్జరి, కీమో, రేడియేషన్, లేజర్ థెరఫి, లేక రేడియోఫ్రీక్వెన్సి అబ్లేషన్ వంటి వాటిలో ఏవి అవసరమో ఎంత కాలం తీసుకోవాల్సి ఉంటుందో వంటి విషయాలపై వైద్యులు నిర్ణయం తీసుకోగలుగుతారు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
లాభాలకు గొడుగులు
ఆషాడమాసంలో కురిసిన వర్షాలకు గ్రామీణప్రాంతాలలోని పుట్టలపై ప్రకృతిసిద్ధంగా మొలిచే పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేకువజామునే పుట్టల వెంట తిరుగుతూ వీటిని సేకరిస్తుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కలిగి ఉండే వీటిని సిటీ మార్కెట్లలో కిలో రూ.500 వరకు విక్రయిస్తుంటారు. తగరపువలస : ఆషాడమాసంలోనే కాకుండా ఏడాది పొడుగునా పుట్టగొడుగులను సాగుచేసి లాభాలబాట పడుతున్న కుటీర పరిశ్రమలు ఇటీవల మారుమూల గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇంటిపంటలుగా సాగుచేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలోనే కాకుండా బటన్ రకం పుట్టగొడుగులను రసాయనాలు ఉపయోగించి కూడా పండిస్తున్నారు. కర్రీ పాయింట్లు, విందుభోజనాలలో పుట్టగొడుగులకు ప్రముఖ స్థానం ఉంది. వీటికితోడు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పుట్టగొడుగులను ఉపయోగించి రకరకాల స్నాక్స్, ఊరగాయాలు చేస్తుండడంతో ఆహారంలో వీటి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. ఇలా పండిస్తారు మిల్కీ, పేడీ, అయిస్టర్,బటన్ రకాలుగా పిలవబడే పుట్టగొడుగులకు ప్రధాన వనరు వరిగడ్డే. ఏడాదిలోపు వయసుండే నిల్వగడ్డిని సేకరించుకుని ముక్కలుచేసి పాలిథిన్ కవర్లలో ఉడకబెట్టిన గడ్డిని పొరలుగా వేసి మద్యలో విత్తనాలు ఉంచి మూతికట్టి 21 రోజుల పాటు ఫంగస్ సోకని నీడలో భద్రపరుస్తారు. తరువాత కవరును సగభాగంగా వేరుచేసి దానిపై మట్టి పరచి ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిపై నీళ్లు చిలకరిస్తారు. ఇలా పదిరోజులు చేసేసరికి మొదటికోతకు గొడుగులు సిద్ధమై 40 రోజుల వరకు దిగుబడి ఇస్తాయి. సస్యరక్షణను బట్టి కిలో విత్తనాలకు 6 నుంచి 10 కిలోల దిగుబడులు పొందవచ్చు. మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి వీటి ధర సగటున రూ.250 వరకు ధర పలుకుతుంది. పేడీ స్ట్రా పుట్టగొడుగుల ధర రూ.400 నుంచి 500 వరకు ఉంది. పోషకాలు భలే పుట్టగొడుగులలో ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలోని లోవాస్టాటిన్ అనే పదార్థం వల్ల కొవ్వును తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తుందంటున్నారు. కేన్సర్ నిరోధానికి, విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఆస్థమా ఉన్నవారికి మంచి ఆహారం. ఇందులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు. కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు లేకపోవడంతో మధుమేహరోగులకు మంచి ఆహారం అంటున్నారు. స్థూలకాయం, మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ నుంచి గట్టెక్కిస్తుందట. నోరూరించే వంటలు.. పుట్టగొడుగులను కేవలం కూరగానే కాకుండా ఫ్రై, పకోడి, బిర్యాని, స్టఫ్డ్ మష్రూమ్స్, సూప్, ఖీర్, మిల్క్‌షేక్, మునగాకుతో ఇగురు, చింతచిగురు కాంబినేషన్, కోనసీమ వేపుడు పేరుతో ఎన్నోరకాలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి శ్రేష్టమైనవి.. పుట్టగొడుగులు చెరువు చేపల తరువాత అంతటి శ్రేష్టమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. కొన్ని వ్యాధుల నిరోధానికి బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలోనూ, ఆ తరువాత గ్రామాలలో పుట్టలపై పుట్టగొడుగులు తవ్వి తీస్తుంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుని తినాలి. అందులో కొన్ని విషతుల్యంగాను, పురుగులు చేరి ఉంటాయి. ఇక కుటీర పరిశ్రమలలో అత్యంత శ్రద్ధగా పండించే పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వలేకుండా తింటే మంచిది. –డాక్టర్ కె.రామారావు, పట్టణ ఆరోగ్యకేంద్రం, తగరపువలస తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పుట్టగొడుగుల సాగును పసిపిల్లల్లా చూసుకోవాలి. ఏ మాత్రం వైరస్ సోకకుండా జాగ్రత్తగా చేసుకుంటే పెట్టుబడికి మంచిలాభాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొందరు శిక్షణ ఇచ్చి విత్తనాలు మేమే ఇచ్చి, దిగుబడి మేమే కొంటామంటూ మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మార్కెటింగ్ చేసుకోగలిగితే దీనిని మించిన సాగులేదు. ఇది మంచి పౌష్టికాహారం కూడా. –ఎర్నింటి రమేష్, పుట్టగొడుగుల పెంపకదారుడు -
ఓ మాంచి లంచ్‌బాక్స్
బ్రేక్ బెల్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాపం పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్‌తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. అందుకు మంచి లంచ్‌బాక్స్ కావాలి మరి! లంచ్‌బాక్స్ ఎలా ఉండాలి..? ఆహారం తాజాగా ఉండాలి... ఉదయం ఎప్పుడో బాక్స్‌లో పెట్టిన ఫుడ్ పిల్లలు తినేవరకు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుందో లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాంటి మెటీరియల్‌తో తయారైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణంగా పిల్లలు వాళ్లకు నచ్చిన కార్టూన్ బొమ్మలు ఉన్నాయనో, రంగు నచ్చిందనో కొనమని అడుగుతారు. కానీ పేరెంట్స్ మాత్రం కొనుగోలు చేసే ముందు అందులో నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలి. లంచ్బాక్స్లోని ప్రతి భాగం శుభ్రపర్చేందుకు వీలుగా ఉందో లేదో చెక్‌చేసుకోవాలి. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఎన్ని విభాగాలుగా ఉంది..? కేవలం ఒక డబ్బా మాదిరి కాకుండా బాక్స్ లోపల పలు రకాలుగా విభజించి ఉంటే వీలైనన్ని ఐటమ్‌లను పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుంది. భోజనంతో పాటు సలాడ్స్, పండ్లు లాంటివి లంచ్‌బాక్స్‌లో పెట్టడానికి వీలున్న వాటిని ఎంపిక చేసుకోవాలి. సైజ్..? మరీ పెద్దదిగాను, మరీ చిన్నదిగానూ కాకుండా మీడియం సైజ్ ఉన్నవి అయితే పిల్లలు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి. వారి స్కూల్ బ్యాగ్‌లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్‌లు వద్దు.. వేడి వస్తువులను ప్లాస్టిక్ బాక్స్‌లలో పెడితే ఆ వేడికి అందులోని రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇతర ఆరోగ్య కారణాల రీత్యా కూడా ప్లాస్టిక్ బాక్స్‌ల వాడకం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ట్రై చేద్దామా? కూల్ బాక్స్‌లు.. పెట్టిన ఆహార పదార్థాలను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచడం వీటి ప్రత్యేకత. దానికి మీరు చేయాల్సిందిల్లా వీటిని ముందు రోజు రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆతర్వాత ఇందులో ఫుడ్‌ను ఉంచితే ఎప్పుడు తిన్నా సువాసనలు కూడా పోకుండా అప్పుడే వండిన పదార్థాలంత ఫ్రెష్‌గా ఉంటాయట. ఫ్యాషన్ బాక్స్‌లు.. చూసేందుకు ఫ్యాషన్ బ్యాగ్‌లాగా కనిపించే లంచ్ బాక్స్‌లు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ యువతను కూడా ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఆహారం తాజాగా ఉండటమే కాకుండా, వీటిని శుభ్రం చేయడం కూడా తేలిక. మంచి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తున్న వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యుమ్బాక్స్ పానినో.. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ ఉత్పత్తి చేస్తోంది. గత ఏడాది కాలంగా ఆన్లైన్లో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ బాక్స్ మొత్తం ఆరు భాగాలుగా విభజించి ఉంటుంది. వాటిలో ఒక భాగం కొంచెం పెద్దదిగా ఉండి, మిగిలిన ఐదు విభాగాలు చిన్నగా ఉంటాయి. చాలా తక్కువ బరువుండటంతో పాటు ఒక ఐటమ్‌తో మరో ఐటమ్ కలిసిపోకుండా ఉండేలా ఇందులో ప్రత్యేక ఏర్పాటు ఉంది. గో గ్రీన్ లంచ్‌బాక్స్.. ఇందులో ఎక్కువ ఆహార పదార్థాలు పట్టే ఖాళీ ఉండటం వల్ల పెద్ద తరగతులు, కాలేజీ విద్యార్థులకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది. చిన్నారులు సులువుగా ఓపెన్ చేసుకోవడంతో పాటు లీకేజ్ సమస్య లేకుండా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న వెరైటీ లంచ్బాక్స్లలో ఇదీ ఒకటి. - కర్రి వాసుదేవరెడ్డి -
బ్రకోలీతో కేన్సర్‌కు చెక్
వాషింగ్టన్: బ్రకోలీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా కేన్సర్, హృద్రోగాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫినోలిక్ పదార్థాలు సహా పలు ఫ్లేవనాయిడ్స్‌ను ఆహారంలో అధికంగా తీసుకోవడం ద్వారా పలు ప్రాణాంతక వ్యాధులను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రకోలీ, క్యాబేజ్, కాలే వంటి వాటిలో ఫినోలిక్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తిం చారు. ఫినోలిక్ ఉన్న కూరగాయలు వండినా వాటిలో పోషక విలువలు తగ్గిపోవని అంటున్నారు. -
మితంగా వాడితే హితమే
ఆవకాయ - ఆయుర్వేదం ప్రకృతిలో నేరుగా లభించే ఆహార పదార్థాల పోషక విలువల గురించి, ఇతర గుణధర్మాల గురించి కూలంకషంగా వివరించింది ఆయుర్వేదం. వివిధ ద్రవ్యాల సమ్మేళనంతో మనం వండుకు తినే ఆహార పదార్థాలను ‘కృతాన్నములు’గా విశదీకరించింది. కాని, ఎక్కడా ఆవకాయ (ఊరగాయ) గురించిన ప్రస్తావన కనబడదు. కాబట్టి ఆవకాయలో ఉండే వివిధ ద్రవ్యాల గుణధర్మాలను గుర్తెరిగి మనం అన్వయించుకుని, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవకాయలోని పదార్థాలు ముదిరిన పుల్లటి మామిడికాయ, ఆవపొడి (ఆవాలు), ఉప్పు, కారంపొడి (ఎండు మిరప), నువ్వులనూనె. కొంత తక్కువ పరిమాణంలో ఇంగువ, పసుపు, మెంతులు, కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి కూడా కలుపుతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బెల్లం కూడా కలుపుతారు. ఉత్తరాది వారు ఆవకాయలో సోంపు కూడా వాడుతారు. స్థూలంగా పరిశీలిస్తే ఆవకాయలో షడ్రసాలు (మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ) కనిపిస్తాయి. మామిడికాయ: అమ్లరస ప్రధానం (పులుపు). కాబట్టి రుచి, ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. లఘువు (సులువుగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరుస్తుంది). ఉష్ణవీర్యం (వేడి చేస్తుంది). మేదస్సు (కొవ్వు) కరిగిస్తుంది. ధాతు పోషకం. కఫ, పిత్త, రక్త వర్ధకం. ఆవాలు: ఇవి పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో మూడు రకాలుగా ఉంటాయి. రుచికి చేదుగా, కారంగా కూడా ఉంటాయి. తీక్ష్ణ, ఉష్ణ గుణాలు ఉంటాయి. కృమిహరము (కడుపులో క్రిములను నాశనం చేస్తాయి). అగ్నిదీప్తికరం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి). కారం (కటురసం): సనాతన ఆయుర్వేద గ్రంథాల్లో కారానికి సంబంధించి మిరియాలు మాత్రమే కనిపిస్తాయి. మిరపకాయ క్రీస్తుశకం 17వ శతాబ్దంలో విదేశాల నుంచి మనకు సంక్రమించిన పదార్థం. కటురసం. దీపన పాచనాలు చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. తీక్ష్ణ, ఉష్ణ గుణాలను కలిగి ఉంటుంది. ఉప్పు (లవణరసం): తీక్ష్ణమై చెమటను కలిగిస్తుంది. రుచికరమై జీర్ణక్రియకు దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వు కంతులను కరిగించి, జడత్వాన్ని పోగొడుతుంది. అయితే, షడ్రసాలలో అతి తక్కువగా తినవలసింది లవణరసం. దీనిని ఎక్కువగా సేవించవద్దని చరక మహర్షి హెచ్చరించాడు. నిజానికి ఇది ‘హిత శత్రువు’ చక్కని రుచి కలిగించి, తృప్తినిచ్చే మిత్రునిలా ఉంటూనే వెనుక ఎన్నో రోగాలను కలిగించే శత్రువన్న మాట. ఎక్కువగా వాడితే బట్టతల, శిరోజాలు రాలిపోవడం, తలనెరపు, శరీరంపై ముడుతలు వంటి లక్షణాలు యుక్తవయస్సులోనే కలుగుతాయి. ఎముకలు, కీళ్లు బలహీనమవుతాయి. కంటిచూపు మందగిస్తుంది. నువ్వులనూనె: త్రిదోషహరం. మేధావర్ధకం, దీపనం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది), శూలహరం (నొప్పులను తగ్గిస్తుంది). ఇంగువ, పసుపు, మెంతులు, వెల్లుల్లి: ఇవన్నీ కోష్ఠశుద్ధికి (కడుపును శుభ్రపరచడానికి) పనికొస్తాయి. తీక్ష్ణ, ఉష్ణగుణాలు కలిగి ఉంటాయి. క్రిములను నాశనం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. విడివిడిగా ఇలాంటి గుణధర్మాలను కలిగిన ద్రవ్యాలన్నింటినీ సమ్మేళనం చేసి, నిల్వ ఉంచితే తయారయ్యే ఊరగాయే ‘ఆవకాయ’. ఆవకాయ ప్రభావం ఇందులోని ఏ ద్రవ్యమైనా అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలేనని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆవకాయను తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదు. మితంగా తింటే అలసత్వం పోయి చురుకుదనం కలుగుతుంది. నోటికి రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎలా తినాలి? ⇒ కొందరు నెయ్యి కలిపిన పప్పన్నంతో తప్ప ఆవకాయను తినరు. ఇది చాలా మంచి పద్ధతి. ఇలా తింటే, జీర్ణకోశానికి రక్షణ కలిగి, అల్సర్లు రాకుండా ఉంటాయి. ⇒ కొందరు వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని, పైన వెన్నపూస వేసి తింటారు. వెన్నపూసలోని స్నిగ్ధత్వం ఆవకాయలోని తీక్ష్ణత్వాన్ని అణచివేస్తుంది. ఫలితంగా మనలో పుట్టే వేడి తగ్గుతుంది. ⇒ కొన్ని ప్రాంతాల్లో ఆవకాయ అన్నంలో నెయ్యి కలుపుకుంటారు. కొందరు నువ్వులనూనె లేదా వేరుశనగ నూనె కలుపుకుంటారు. ఇది కూడా ఆవకాయ అహం‘కారాన్ని’ అణచివేయడానికే. ⇒ కొందరికి పెరుగు లేదా మజ్జిగ సేవించే అలవాటు ఉండదు. అలాంటప్పుడు ఆవకాయ మన శరీరంపై తప్పక విపరీత ప్రభావం చూపుతుంది. కళ్లు మంట, మూత్రంలో మంట, మలవిసర్జన సమయంలో మంట, మలబద్ధకం, కాళ్లుపీకటం, జ్వరం, నీరసం, కడుపులో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యావహారిక భాషలో దీనినే ‘వేడిచేసింది’ అంటాం. ⇒ పెరుగు, మజ్జిగతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగితే ఆవకాయ ఘాటు శరీరంపై తక్కువగా ప్రభావం చూపుతుంది. ⇒ శరీరానికి షడ్రసాలను అలవాటు చేయడం వల్ల బలం కలుగుతుందని, ఏకరస ప్రధానంగా ఆహారం తీసుకుంటే తగిన పోషకాలు లభించవని చరకాచార్యులు చెప్పారు. కనుక ఆవకాయను అప్పుడప్పుడు మితంగా తింటే మంచిదే. ⇒ కాని, ఈ హితశత్రువు పట్ల అప్రమత్తంగా లేకుంటే మాత్రం హైబీపీ, కీళ్లవ్యాధులు, స్థూలకాయం, కిడ్నీ సమస్యలు, మధుమేహం, పక్షవాతం, గుండెపోటు వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆవకాయలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఉప్పే అసలు ముప్పు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమయూన్‌నగర్, హైదరాబాద్ -
తాండూరు రోటీ రుచిలో మేటి
జొన్నరొట్టె తాండూరువాసుల ఆహారపుటలవాట్లలో ఓ భాగమైంది. చేతులతో పిండిని నునుపు బండపై కొడుతూ.. కట్టెల పొయ్యి మీద తయారు చేసిన ఈ రొట్టెను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒక పూట భోజనం (వరి అన్నం) లేకపోయినా ఉంటారేమో కానీ.. జొన్నరొట్టె లేకుండా మాత్రం ఉండలేరు. విందులు, శుభకార్యాల్లో కచ్చితంగా మెనూలో ఉండి తీరాల్సిందే.. డిమాండ్ పెరగడంతో కొన్ని కుటుంబాలు వీటి తయారీని ఏకంగా ఉపాధి మార్గంగా మలుచుకోవడం విశేషం. పోషకాలు పుష్కలంగా ఉండడంతోపాటు రుచి విభిన్నంగా ఉండడంతో చాలామంది జొన్నరొట్టెలను తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు. - తాండూరు * జొన్నరొట్టెను ఇష్టంగా తింటున్న తాండూరువాసులు * విందులు, శుభకార్యాల్లో ఉండి తీరాల్సిందే.. * పోషక విలువలు ఉండడంతో అమితాసక్తి * జీవనోపాధిగా మలుచుకున్న కుటుంబాలు * ఆర్డర్లపై విక్రయాలు * కిరాణాదుకాణాలు, హోటళ్లలోనూ లభ్యం జిల్లాలో ఇతర ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లతో పోల్చితే కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రజలు భిన్నం. ఒకప్పుడు తాండూరు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా పరిధిలో ఉండేది. అలా కర్ణాటక సంప్రదాయమే క్రమంగా తాండూరు ప్రజల ఆహార అలవాట్లలో భాగమైంది. తాండూరు కందిపప్పు ఎంత ప్రసిద్ధో.. ఇక్కడి జొన్నరొట్టెకూ అంతే ఖ్యాతి వచ్చింది. వీటి తయారీ చాలామందికి జీవనోపాధిగా మారింది. తాండూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కుటుంబాలు జొన్నరొట్టె తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లో.. హోటళ్లలో.. ఎక్కడికి వెళ్లినా జొన్నరొట్టెను ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో జొన్నరొట్టె తయారీ ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా మారింది. పండగలు, ప్రత్యేక విందులు, ఇతర శుభకార్యాల్లో ఇది కచ్చితమైన మెనూ అయింది. ఆర్డర్లపై జొన్నరొట్టెలను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లలో సైతం హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తుంటారు. తాండూరు ప్రాంతంలో సుమారు 20 కుటుంబాలు జొన్నరొట్టె తయారీతో ఉపాధిని పొందుతుండడం గమనార్హం. పలు హోటళ్లలో ఉదయం వేళల్లో జొన్నరొట్టె కాంబినేషన్లో ‘రోటీ-బోటీ’ స్పెషల్ మెనూగా ఉండడం విశేషం. ఒక్కో రొట్టె రూ.5 .. తాండూరు పట్టణంలోని 22వ వార్డు గాంధీనగర్‌లో బుగ్గమ్మ కుటుంబం దాదాపు పదేళ్లుగా జొన్నరొట్టెలను తయారు చేస్తోంది. బుగ్గమ్మతోపాటు వీరి కోడళ్లు కూడా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జొన్నరొట్టెలను తయారు చేస్తారు. ఒక్కో జొన్నరొట్టె రూ.5 చొప్పున విక్రయిస్తారు. కొందరు యంత్రాలపై కూడా రొట్టెలు తయారు చేసి విక్రయిస్తున్నా.. చేతులతో చేసిన రొట్టెలను ఎక్కువగా ఇష్ట పడతారు. ఇదే మాకు ఉపాధి.. పదేళ్లుగా జొన్నరొట్టెలు తయారు చేస్తున్నాం. ఇదే మా కుటుంబానికి జీవనోపాధి. అవసరమైన వారు ఆర్డర్లపై తీసుకువెళ్తారు. కొందరు కిరాణ, హోటల్ నిర్వాహకులు మా వద్ద హోల్‌సేల్‌గా తీసుకెళ్లి రిటైల్‌గా విక్రయిస్తారు. రూ.35 కిలో చొప్పు జొన్నలు కొనుగోలు చేస్తాం. కిలో జొన్నలతో పది రొట్టెలు అవుతాయి. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇష్టపడతారు. -బుగ్గమ్మ, గాంధీనగర్ రోజుకు 200దాకా విక్రయిస్తాం.. రోజుకు 200 వరకు జొన్నరొట్టెలు చేసి విక్రయిస్తాం. మా ఇంట్లో అత్త, తోటి కోడళ్లు అం తా కలిసి ఉదయం నుంచి సా యంత్రం వరకు రొట్టెలు త యారు చేస్తాం. ఒక మహిళ స హాయంగా పని చేస్తుంది. రొట్టెల తయారీకి రోజు కు క్వింటాలు కట్టెలు ఉపయోగిస్తాం. ఇందుకు రూ. 600 వరకు ఖర్చవుతుంది.ఒకరు రోజుకు 50 రొట్టె లు తయారు చేయొచ్చు. కందూర్, ఇతర విం దు కార్యక్రమాల సమయంలో ఆర్డర్లపై తీసుకువెళ్తారు. -మున్నీబాయ్, గాంధీనగర్ రోజూ తినాల్సిందే.. భోజనంలో తప్పనిసరిగా జొన్నరొట్టె తింటాం. రోజులో ఒక్కసారైనా రొట్టె లేకుండా భోజనం దాదాపు ఉండదు.చాలా కాలంగా జొన్నరొట్టెను తింటున్నాం. మా కుటుంబంలో అందరికీ ఇష్టం. ఆరోగ్యపరంగా కూడా మంచిది కావడంతో ఎక్కువగా ఆసక్తి చూపుతాం. -బిడ్కర్ రఘ, తాండూరు పోషకాలు పుష్కలం.. జొన్నల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో బీ, సీ విటమిన్లు ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్యాన్సర్ లాంటి వ్యాధులు దరి చేరవు. జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ తక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. గింజల నూర్పిడి సమయంలో అల్యూరాన్ పొర దెబ్బతినకపోవడం వల్ల జొన్న రొట్టెతో సమృద్ధి పోషకత్వాలులభిస్తాయి. జాతీయ జొన్న పరిశోధనా సంచాలయం జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు విలువ ఆధారిత వస్తువులుగా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జొన్న లడ్డూ, జొన్న ఉప్మా తదితర పదార్థాలపై ప్రచారం కల్పిస్తున్నారు. -డా.సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు -
పాల దిగుబడి పెరగాలంటే...
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా) : పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరిగడ్డితో పాటు సమీకృత దాణానూ ఇవ్వాలి. అప్పుడే దేశవాళీ గేదెల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి.సత్యప్రసాద్. ఆ వివరాలు... దాణా ఎలా ఉండాలి? పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి. ఎంత ఇవ్వాలి? సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి. తాజాగా ఉండాలి పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యం గా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దానిని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరుశనగ, సోయా పిండ్లు బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్ అనే విష పదార్థం చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరి చి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది. పత్తి పిండిని మరీ ఎక్కువగా... అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్ ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్ అందుతుంది. ఇలా చేయండి 100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ/తెలగ/పత్తి/కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు/శనగపొట్టు/కందిపొట్టు/కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దృష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకృత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.