లాభాలకు గొడుగులు
లాభాలకు గొడుగులు
Published Wed, Aug 3 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఆషాడమాసంలో కురిసిన వర్షాలకు గ్రామీణప్రాంతాలలోని పుట్టలపై ప్రకృతిసిద్ధంగా మొలిచే పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేకువజామునే పుట్టల వెంట తిరుగుతూ వీటిని సేకరిస్తుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కలిగి ఉండే వీటిని సిటీ మార్కెట్లలో కిలో రూ.500 వరకు విక్రయిస్తుంటారు.
తగరపువలస : ఆషాడమాసంలోనే కాకుండా ఏడాది పొడుగునా పుట్టగొడుగులను సాగుచేసి లాభాలబాట పడుతున్న కుటీర పరిశ్రమలు ఇటీవల మారుమూల గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇంటిపంటలుగా సాగుచేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలోనే కాకుండా బటన్ రకం పుట్టగొడుగులను రసాయనాలు ఉపయోగించి కూడా పండిస్తున్నారు. కర్రీ పాయింట్లు, విందుభోజనాలలో పుట్టగొడుగులకు ప్రముఖ స్థానం ఉంది. వీటికితోడు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పుట్టగొడుగులను ఉపయోగించి రకరకాల స్నాక్స్, ఊరగాయాలు చేస్తుండడంతో ఆహారంలో వీటి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది.
ఇలా పండిస్తారు
మిల్కీ, పేడీ, అయిస్టర్,బటన్ రకాలుగా పిలవబడే పుట్టగొడుగులకు ప్రధాన వనరు వరిగడ్డే. ఏడాదిలోపు వయసుండే నిల్వగడ్డిని సేకరించుకుని ముక్కలుచేసి పాలిథిన్ కవర్లలో ఉడకబెట్టిన గడ్డిని పొరలుగా వేసి మద్యలో విత్తనాలు ఉంచి మూతికట్టి 21 రోజుల పాటు ఫంగస్ సోకని నీడలో భద్రపరుస్తారు. తరువాత కవరును సగభాగంగా వేరుచేసి దానిపై మట్టి పరచి ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిపై నీళ్లు చిలకరిస్తారు. ఇలా పదిరోజులు చేసేసరికి మొదటికోతకు గొడుగులు సిద్ధమై 40 రోజుల వరకు దిగుబడి ఇస్తాయి. సస్యరక్షణను బట్టి కిలో విత్తనాలకు 6 నుంచి 10 కిలోల దిగుబడులు పొందవచ్చు. మార్కెట్‌లో గ్రేడ్‌ను బట్టి వీటి ధర సగటున రూ.250 వరకు ధర పలుకుతుంది. పేడీ స్ట్రా పుట్టగొడుగుల ధర రూ.400 నుంచి 500 వరకు ఉంది.
పోషకాలు భలే
పుట్టగొడుగులలో ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలోని లోవాస్టాటిన్ అనే పదార్థం వల్ల కొవ్వును తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తుందంటున్నారు. కేన్సర్ నిరోధానికి, విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఆస్థమా ఉన్నవారికి మంచి ఆహారం. ఇందులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు. కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు లేకపోవడంతో మధుమేహరోగులకు మంచి ఆహారం అంటున్నారు. స్థూలకాయం, మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ నుంచి గట్టెక్కిస్తుందట.
నోరూరించే వంటలు..
పుట్టగొడుగులను కేవలం కూరగానే కాకుండా ఫ్రై, పకోడి, బిర్యాని, స్టఫ్‌డ్ మష్రూమ్స్, సూప్, ఖీర్, మిల్క్‌షేక్, మునగాకుతో ఇగురు, చింతచిగురు కాంబినేషన్, కోనసీమ వేపుడు పేరుతో ఎన్నోరకాలు సిద్ధం చేస్తున్నారు.
ఆరోగ్యానికి శ్రేష్టమైనవి..
పుట్టగొడుగులు చెరువు చేపల తరువాత అంతటి శ్రేష్టమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. కొన్ని వ్యాధుల నిరోధానికి బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలోనూ, ఆ తరువాత గ్రామాలలో పుట్టలపై పుట్టగొడుగులు తవ్వి తీస్తుంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుని తినాలి. అందులో కొన్ని విషతుల్యంగాను, పురుగులు చేరి ఉంటాయి. ఇక కుటీర పరిశ్రమలలో అత్యంత శ్రద్ధగా పండించే పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వలేకుండా తింటే మంచిది.
–డాక్టర్ కె.రామారావు, పట్టణ ఆరోగ్యకేంద్రం, తగరపువలస
తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం
పుట్టగొడుగుల సాగును పసిపిల్లల్లా చూసుకోవాలి. ఏ మాత్రం వైరస్ సోకకుండా జాగ్రత్తగా చేసుకుంటే పెట్టుబడికి మంచిలాభాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొందరు శిక్షణ ఇచ్చి విత్తనాలు మేమే ఇచ్చి, దిగుబడి మేమే కొంటామంటూ మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మార్కెటింగ్ చేసుకోగలిగితే దీనిని మించిన సాగులేదు. ఇది మంచి పౌష్టికాహారం కూడా.
–ఎర్నింటి రమేష్, పుట్టగొడుగుల పెంపకదారుడు
Advertisement
Advertisement