asadamasam
-
ఆషాడ మాసం: గోరింటాకు పెట్టుకోవడం వెనకున్న ఆంతర్యం ఇదే..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢమాసం నేటి (గురువారం) నుంచి ప్రారంభం అయ్యిందది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాఢమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఈ మాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పనిచేయడం పరిపాటి. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. ప్రస్తుతం రకరకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్నిచోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు. పండుగలకు ప్రత్యేకం ఆషాఢం పండుగలకు ఆషాఢం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వచ్చేనెల 10వ తేదీన శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), 12వ తేదీన గురుపౌర్ణమి (ఆషాడ పౌర్ణమి) పండుగలు రానున్నాయి. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాఢ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే!
సాక్షి, కరీంనగర్: మూఢాలు వచ్చేశాయి.. శుభ మహూర్తాలకు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి ఆషాఢమాసం ప్రవేశించడంతో ముహూర్తాలు లేవు. మూడు నెలలుగా జిల్లాలో కొనుగోలు దారులతో కళకళలాడిన పెళ్లి సామగ్రి దుకాణాలు బోసిపోనున్నాయి. పెళ్లి మండపాలు, ప్రింటింగ్ప్రెస్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వంటవారు, భజాభజంత్రీలు, నాదస్వరం, పురోహితులు నెల రోజుల పాటు ఆగస్టు 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. వ్యాపార వర్గాల్లో గుబులు ఆషాఢ మాసంతో శుభముహూర్తాలు లేక తమ వ్యాపారాలు ఎలా సాగుతాయోనని వ్యాపారవర్గాల్లో గుబులు పట్టుకుంది. వానాకాలం రైతుల సీజన్ కూడా కావడంతో రైతులు పొలం పనుల్లో ఉండి తమ అవసరాలను వాయిదా వేసుకుంటారని, అత్యవసరమైతే అది కూడా నిత్యావసరలకే తప్పా అనవసరంగా ఏమి కొనుగోలు చేయరని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నెల రోజులు ఉపాధి బంద్ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలపై ఆధారపడిన వారు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో సంపాదించుకున్న వాటిలో నుంచే నిత్యావసరాలకు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. చదవండి: Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్ ఆగస్టు 3 నుంచి ముహూర్తాలు ఆషాఢ మాసంతో జూలైలో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 3 నుంచి శుభముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్రమూఢం ఉంటుంది. ఈ మూడు నెలలు శుభముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ ఉపాధి ఉండదు శుభకార్యక్రమాలపై ఆధారపడ్డ వారికి ఆషాఢంలో ఉపాధి ఉండదు. మొన్నటి వరకు జరిగిన శుభకార్యక్రమాల్లో అంతో ఇంతో సంపాదించుకుంటే వాటి నుంచి అత్యవసరాలకు ఖర్చు చేసుకుని ముహూర్తాల కోసం వేచి ఉండాలి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్ -
Mehndi: గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇందులోని లాసోన్ అనే రసాయనం వల్ల..
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆనవాయితీ ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. లాసోన్ అనే సహజమైన రసాయనం వల్లే! ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి. చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే.. -
అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..
-
ఆశలన్నీ ఆషాడంపైనే..
కడప కల్చరల్: వస్త్ర వ్యాపారుల ఆశలన్నీ ఆషాడంపైనే ఉన్నాయి. సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే వస్త్ర వ్యాపారులు ‘ఆషాడం డిస్కౌంట్ సేల్’ పేరిట తగ్గింపు ధరకు ఇస్తారు. దీంతో మహిళల నుంచి వ్రస్తాలకు మంచి డిమాండ్ ఏర్పడి వ్యాపారులు నాలుగు డబ్బులు కళ్లచూసే అవకాశం లభిస్తుంది. పండుగలు, వివాహాల సీజన్ ముగిసిన తర్వాత ఆషాడం డిస్కౌంట్ సేల్స్‌పైనే వస్త్ర వ్యాపారులు నమ్మకం ఉంచుతారు. వీలైనంత తక్కువ ధరకు అంతకుముందు వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం తెప్పించిన వస్త్రాలను విక్రయించి కొత్త స్టాకును తెచ్చి పెట్టుకోవాలని భావిస్తారు. అందుకే కొద్దిపాటి మార్జిన్ ఉన్నా వస్త్రాలను డిస్కౌంట్ సేల్స్‌లో ఉంచి విక్రయిస్తారు. విక్రయాలకు లాక్డౌన్ కరోనా లాక్డౌన్ కారణంగా మంచి సీజన్లో వస్త్ర వ్యాపారాలు మూతపడ్డాయి. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు పండుగలు, అంతకుమించి వివాహ ముహూర్తాలు ఉండేవి. దీని కోసం వ్యాపారులు కొత్తకొత్త రకాల వ్రస్తాలను పెద్ద ఎత్తున తెచ్చి స్టాక్ ఉంచుకున్నారు. ఊహించని విధంగా లాక్‌డౌన్‌తో వ్యాపారాలకు బ్రేక్ డౌన్ కావడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వారం, పదిరోజులు లేదా ఒక నెల మాత్రమే లాక్డౌన్ ఉంటుందని వారు తొలుత భావించినా ఆ తర్వాత వరుసగా దాదాపు మూడు నెలలపాటు దుకాణాలు మూసి ఉంచాల్సి రావడంతో అటు దుకాణ గదుల అద్దెలు చెల్లించలేక, ఇటు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేక మినిమ్ కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో ఆర్థికంగా కుదేలయ్యారు. జూన్ 4 నుంచి షరతులపై దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా అప్పటికే సీజన్ ముగిసిపోవడంతో ఆషాడ మాసం ఆఫర్లతోనైనా వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆషాడం ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా మునుపటిలా వ్యాపారాలు జరుగుతాయన్న ఆశలేవీ కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిజానికి ఎప్పటిలా ఆషాడం పేరిట వ్రస్తాలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ అంతో ఇంతో వ్యాపారం జరుగుతుందన్న విశ్వాసంతో కొందరు వ్యాపారులు మాత్రం డిస్కౌంట్ ప్రకటనలు ఇస్తున్నారు. నాడు కళకళ.. నేడు వెలవెల సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే చిన్నా, పెద్ద వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతాయి. కొన్ని దుకాణాలు 50 శాతం వరకు ఇవ్వజూపడంతో ఆ దుకాణాల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఈసారి ఆ అవకాశం లేదు. మూడు మాసాలపాటు వ్యాపారాలు లేక నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వస్త్ర వ్యాపారులు విన్నవిస్తున్నారు. లాక్డౌన్ ముందు ఆషాఢం ఆఫర్ మంత్రం పనిచేయడం లేదని, ఈ మాసం కూడా భారీగా నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశలు శ్రావణమాసంలోనేనని భావిస్తున్నారు. ఆషాడమాసం మరో మూడు వారాలు ఉంది గనుక ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకునే అవకాశం కూడా ఉందని మరికొందరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశ ఆషాడం ఆఫర్లు ఇచ్చే పరిస్థితి పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తుపై ఆశ ఉంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా కార్మికుల జీతాలు, మెయింటెన్స్ ఖర్చులు వస్తే చాలనుకుంటున్నాం. శ్రావణమాసం, ఆపై వచ్చే సీజన్లోనైనా వ్యాపారాలు జరుగుతాయన్న విశ్వాసం ఉంది. – దినేష్‌సింగ్, వస్త్ర వ్యాపారి, కడప లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టం లాక్‌డౌన్‌ను ఊహించకపోవడం, మూడు నెలలు దుకాణాలు మూసి వేయడంతో వస్త్రాల స్టాకు కొద్దిమేర పాడై నష్టం చేకూరింది. పనిలేకపోయినా బాడుగలు, కరెంటు బిల్లు, ట్యాక్సు, కారి్మకుల జీతాలు కట్టాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – చెన్నంశెట్టి మురళి, వస్త్ర వ్యాపారి, కడప -
లాభాలకు గొడుగులు
ఆషాడమాసంలో కురిసిన వర్షాలకు గ్రామీణప్రాంతాలలోని పుట్టలపై ప్రకృతిసిద్ధంగా మొలిచే పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేకువజామునే పుట్టల వెంట తిరుగుతూ వీటిని సేకరిస్తుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కలిగి ఉండే వీటిని సిటీ మార్కెట్లలో కిలో రూ.500 వరకు విక్రయిస్తుంటారు. తగరపువలస : ఆషాడమాసంలోనే కాకుండా ఏడాది పొడుగునా పుట్టగొడుగులను సాగుచేసి లాభాలబాట పడుతున్న కుటీర పరిశ్రమలు ఇటీవల మారుమూల గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇంటిపంటలుగా సాగుచేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలోనే కాకుండా బటన్ రకం పుట్టగొడుగులను రసాయనాలు ఉపయోగించి కూడా పండిస్తున్నారు. కర్రీ పాయింట్లు, విందుభోజనాలలో పుట్టగొడుగులకు ప్రముఖ స్థానం ఉంది. వీటికితోడు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పుట్టగొడుగులను ఉపయోగించి రకరకాల స్నాక్స్, ఊరగాయాలు చేస్తుండడంతో ఆహారంలో వీటి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. ఇలా పండిస్తారు మిల్కీ, పేడీ, అయిస్టర్,బటన్ రకాలుగా పిలవబడే పుట్టగొడుగులకు ప్రధాన వనరు వరిగడ్డే. ఏడాదిలోపు వయసుండే నిల్వగడ్డిని సేకరించుకుని ముక్కలుచేసి పాలిథిన్ కవర్లలో ఉడకబెట్టిన గడ్డిని పొరలుగా వేసి మద్యలో విత్తనాలు ఉంచి మూతికట్టి 21 రోజుల పాటు ఫంగస్ సోకని నీడలో భద్రపరుస్తారు. తరువాత కవరును సగభాగంగా వేరుచేసి దానిపై మట్టి పరచి ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిపై నీళ్లు చిలకరిస్తారు. ఇలా పదిరోజులు చేసేసరికి మొదటికోతకు గొడుగులు సిద్ధమై 40 రోజుల వరకు దిగుబడి ఇస్తాయి. సస్యరక్షణను బట్టి కిలో విత్తనాలకు 6 నుంచి 10 కిలోల దిగుబడులు పొందవచ్చు. మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి వీటి ధర సగటున రూ.250 వరకు ధర పలుకుతుంది. పేడీ స్ట్రా పుట్టగొడుగుల ధర రూ.400 నుంచి 500 వరకు ఉంది. పోషకాలు భలే పుట్టగొడుగులలో ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలోని లోవాస్టాటిన్ అనే పదార్థం వల్ల కొవ్వును తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తుందంటున్నారు. కేన్సర్ నిరోధానికి, విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఆస్థమా ఉన్నవారికి మంచి ఆహారం. ఇందులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు. కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు లేకపోవడంతో మధుమేహరోగులకు మంచి ఆహారం అంటున్నారు. స్థూలకాయం, మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ నుంచి గట్టెక్కిస్తుందట. నోరూరించే వంటలు.. పుట్టగొడుగులను కేవలం కూరగానే కాకుండా ఫ్రై, పకోడి, బిర్యాని, స్టఫ్డ్ మష్రూమ్స్, సూప్, ఖీర్, మిల్క్‌షేక్, మునగాకుతో ఇగురు, చింతచిగురు కాంబినేషన్, కోనసీమ వేపుడు పేరుతో ఎన్నోరకాలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి శ్రేష్టమైనవి.. పుట్టగొడుగులు చెరువు చేపల తరువాత అంతటి శ్రేష్టమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. కొన్ని వ్యాధుల నిరోధానికి బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలోనూ, ఆ తరువాత గ్రామాలలో పుట్టలపై పుట్టగొడుగులు తవ్వి తీస్తుంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుని తినాలి. అందులో కొన్ని విషతుల్యంగాను, పురుగులు చేరి ఉంటాయి. ఇక కుటీర పరిశ్రమలలో అత్యంత శ్రద్ధగా పండించే పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వలేకుండా తింటే మంచిది. –డాక్టర్ కె.రామారావు, పట్టణ ఆరోగ్యకేంద్రం, తగరపువలస తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పుట్టగొడుగుల సాగును పసిపిల్లల్లా చూసుకోవాలి. ఏ మాత్రం వైరస్ సోకకుండా జాగ్రత్తగా చేసుకుంటే పెట్టుబడికి మంచిలాభాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొందరు శిక్షణ ఇచ్చి విత్తనాలు మేమే ఇచ్చి, దిగుబడి మేమే కొంటామంటూ మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మార్కెటింగ్ చేసుకోగలిగితే దీనిని మించిన సాగులేదు. ఇది మంచి పౌష్టికాహారం కూడా. –ఎర్నింటి రమేష్, పుట్టగొడుగుల పెంపకదారుడు -
ఇటు ఆషాఢం.. అటు మూఢం
ప్రమాణ స్వీకారాలకు సరైన ముహూర్తమేది? తెగ మదనపడిపోతున్న ‘స్థానిక’ ప్రతినిధులు కొద్ది రోజుల్లో వెలువడనున్న మార్గదర్శకాలు విశాఖ రూరల్ : ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు ఆషాడం, అనంతరం మూఢం బెంగ పట్టుకుంది. అధికార ఎడబాటుకు వచ్చే నెల మొదటి వారంలో తెరపడనున్నప్పటికీ.. నెలాఖరు నుంచి ప్రవేశిస్తున్న ఆషాడమాసం అందరినీ కలవరపెడుతోంది. ఆ తర్వాత మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. స్థానిక సమరంలో విజయం సాధించి మూడు నెలలుగా అధికార పీఠం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ.. ఇప్పుడు మరో మూడు నెలలు అధికారానికి దూరంగా ఉండాలో...ఆషాడంలో పగ్గాలు చేపట్టాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. తప్పనిసరయి ఆషాడంలో బాధ్యతలు చేపట్టాల్సి వస్తే శాంతులు ఏమైనా ఉన్నాయంటూ పూజార్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా.. జూలై మొదటి వారంలో మునిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 28 నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. అనంతరం మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ముహూర్తాలు ఉండవు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని తెగ బెంగపడిపోతున్నారు. జూలైలో ముహూర్తం జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరగాయి. మే12న ఫలితాలు వచ్చాయి. అలాగే 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు 13న వెల్లడయ్యాయి. అప్పటి నుంచి గెలిచిన అభ్యర్థులు అధికారపీఠం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఈ పరోక్ష ఎన్నికలకు అడ్డంకిగా మారాయి. రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం వీటి చైర్మన్,వైస్‌చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఈ ఎన్నికలు జరగవచ్చని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలు ఉండగా టీడీపీ 24, వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. విప్ ధిక్కరిస్తే వేటే చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశముంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీచేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియ చేతుల ఎత్తే పద్ధతిలో ఉంటుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటు చెల్లుబాటైనప్పటికీ.. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. సభ్యుని పదవి రద్దు విషయపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం సదరు సభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే ఎన్నిక వాయిదా పడుతుంది. తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.