ఇటు ఆషాఢం.. అటు మూఢం
- ప్రమాణ స్వీకారాలకు సరైన ముహూర్తమేది?
- తెగ మదనపడిపోతున్న ‘స్థానిక’ ప్రతినిధులు
- కొద్ది రోజుల్లో వెలువడనున్న మార్గదర్శకాలు
విశాఖ రూరల్ : ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు ఆషాడం, అనంతరం మూఢం బెంగ పట్టుకుంది. అధికార ఎడబాటుకు వచ్చే నెల మొదటి వారంలో తెరపడనున్నప్పటికీ.. నెలాఖరు నుంచి ప్రవేశిస్తున్న ఆషాడమాసం అందరినీ కలవరపెడుతోంది. ఆ తర్వాత మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. స్థానిక సమరంలో విజయం సాధించి మూడు నెలలుగా అధికార పీఠం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ.. ఇప్పుడు మరో మూడు నెలలు అధికారానికి దూరంగా ఉండాలో...ఆషాడంలో పగ్గాలు చేపట్టాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది.
తప్పనిసరయి ఆషాడంలో బాధ్యతలు చేపట్టాల్సి వస్తే శాంతులు ఏమైనా ఉన్నాయంటూ పూజార్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా.. జూలై మొదటి వారంలో మునిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 28 నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. అనంతరం మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ముహూర్తాలు ఉండవు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని తెగ బెంగపడిపోతున్నారు.
జూలైలో ముహూర్తం
జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరగాయి. మే12న ఫలితాలు వచ్చాయి. అలాగే 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు 13న వెల్లడయ్యాయి. అప్పటి నుంచి గెలిచిన అభ్యర్థులు అధికారపీఠం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఈ పరోక్ష ఎన్నికలకు అడ్డంకిగా మారాయి. రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం వీటి చైర్మన్,వైస్‌చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఈ ఎన్నికలు జరగవచ్చని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
మున్సిపాలిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలు ఉండగా టీడీపీ 24, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 15 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది.
విప్ ధిక్కరిస్తే వేటే
చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశముంది.
ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీచేస్తాయి.
విప్‌లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు.
ఎన్నికల ప్రక్రియ చేతుల ఎత్తే పద్ధతిలో ఉంటుంది.
ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా జరగదు.
ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటు చెల్లుబాటైనప్పటికీ.. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. సభ్యుని పదవి రద్దు విషయపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం సదరు సభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
ఇవీ మార్గదర్శకాలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు.
ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే ఎన్నిక వాయిదా పడుతుంది.
తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.