Sworn in
-
రేపు ప్రమాణం చేయనున్న అమృత్‌పాల్
చండీగఢ్/అమృత్సర్: విచారణ ఖైదీగా అస్సాం జైలులో గడుపుతున్న ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ జూలై ఐదో తేదీన పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణంచేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్‌పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలిచారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో గెల్చిన విషయం తెల్సిందే. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్‌పాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణంచేసేనాటికి ఈయనకు పెరోల్ లభించలేదు. తాజాగా జూలై 5వ తేదీ నుంచి నాలుగురోజులపాటు పెరోల్ దొరికింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో ఈయనతో ఎంపీగా ప్రమాణంచేయిస్తారని ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా బుధవారం వెల్లడించారు. -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) నేత అసిఫ్ అలీ జర్దారీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయీజ్ ఈసా ఆయనతో ప్రమాణం చేయించారు. జర్దారీ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అíసీమ్ మునీర్, జర్దారీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జర్దారీ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అధికార కూటమి ఉమ్మడి అభ్యరి్థగా ఆయన శనివారం అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో శనివారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్‌తో కలిసి 101 మంది ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు లాస్య నందిత, పద్మావతి రెడ్డి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, బండారి లక్ష్మారెడ్డి, గడ్డం వినోద్, మధుసూదన్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, ముఠా గోపాల్, మైనంపల్లి రోహిత్, తెల్లం వెంకట్రావ్, గడ్డం వివేక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ఉర్దూలో ప్రమాణం చేశారు. ♦ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సహా అధిక సంఖ్యలో సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ♦ మంత్రి సీతక్క, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా పలువురు సభ్యులు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. వారిలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, అరికపూడి గాం«దీ, చిక్కుడు వంశీకృష్ణ, దొంతి మాధవరెడ్డి, గూడం మహిపాల్ రెడ్డి, కె. శంకరయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మాగంటి గోపినాథ్, మక్కాన్‌సింగ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వేముల వీరేశం ఉన్నారు. ‘‘దేశ సార్వభౌమాధికారాన్ని’’పలకడంలో ఇక్కడా ఇబ్బందే ప్రమాణ స్వీకారంలో భాగంగా ‘సభా నియమాలకు కట్టుబడి ఉంటానని’ చేసే ప్రతిజ్ఞ సందర్భంగా సభ్యులు చాలా మంది ‘సభా నియామకాలకు కట్టుబడిఉంటానని’ చదివారు. ‘భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని...’అనే వాక్యాన్ని పలుకడానికి సహజంగానే చాలా మంది సభ్యులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం అభివాదం.. రాజగోపాల్‌రెడ్డికి ఆలింగనం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11.05 గంటలకు సభలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లాస్య నందిత , కోవాలక్ష్మి తదితరుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ఎంఐఎం సభ్యులను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ♦ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు కుటుంబసభ్యులు కూడా సభకు వచ్చారు. ♦ అన్ని పార్టీల శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి అభివాదం చేసి, ఫొటోలు దిగారు. ♦ కొత్త ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియమావళి, ఇతర మెటీరియల్‌తో కూడిన కిట్‌ను ప్రమాణం చేసిన ప్రతి ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా తరలి వచ్చారు. ♦ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి కార్మికుడి దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసనసభలో మక్కాన్సింగ్నురేవంత్ ప్రత్యేకంగాఅభినందించడం కనిపించింది. ♦ మంత్రి సీతక్క ప్రమాణం చేసిన తరువాత బీఆర్ఎస్ మహిళా సభ్యులు కోవాలక్ష్మి, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లి కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కలవడం కనిపించింది. -
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నూతన బోర్డు ఎంపిక
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ 2023 సంవత్సరానికి గాను కొత్త బోర్డు కొలువుదీరింది. ఎన్నికైన నూతన బోర్డు కార్యవర్గం, ఇతర సభ్యుల చేత పద్మశ్రీ సంత్ సింగ్ వీరమణి ప్రమాణ స్వీకారం చేయించారని ఐఏఎన్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బోర్డు అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షుడు- దినేష్ హుడా మాజీ అధ్యక్షుడు- ఉర్మీత్ జునేజా సుష్మా మల్హోత్రా - ప్రెసిడెంట్ ఎలెక్ట్ కార్యదర్శి - జస్టిన్ వర్గీస్ కోశాధికారి- పద్మ మిశ్రా జాయింట్ కోశాధికారి- నవాజ్ ఝా డైరెక్టర్స్: శ్రేయాన్స్ జైన్, స్మరణిక రౌత్ , హేతల్ షా, వైభవ్ శేత్, మనీష్ చోక్షి , సుభాశిష్ నాయక్ , దీపక్ కల్రా, వెంకట్ ములుకుట్ల ట్రస్టీలు ఇందు రెడ్డి మందడి (ట్రస్టీ చైర్) కమల్ కౌశల్ (ట్రస్టీ కో-చైర్) సల్మాన్ ఫర్షోరి (తక్షణ గత కుర్చీ) స్వాతి షా శైలేష్ షా అక్రమ్ సయ్యద్ జాక్ గోధ్వాని ట్రస్టీ ఎమెరిటస్: షబ్నం మోద్గిల్, లాల్ దాస్వానీ, సుధీర్ పారిఖ్ తమ బోర్డ్ సభ్యులు 6 దశాబ్దాలకు పైగా భారతీయ సమాజానికి గొప్ప అభిరుచితో సేవలందిస్తున్నారని పేర్కొన్న పద్మశ్రీ సంత్ సింగ్ విర్మణి కొత్త బోర్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు అందించారు. IANTని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు దినేష్ హుడా, BOT చైర్ ఇందు రెడ్డి మందాడి వెల్లడించారు. 1962లో స్థాపించిన ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) ఉత్తర టెక్సాస్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన రాజకీయేతర, సెక్టారియన్ సంస్థ అని, 1976లో విలీనమైందని ఐఏఎన్టీ వెల్లడించింది. సాంస్కృతిక విద్యా అవసరాలను తీర్చడమే ప్రాథమిక ఉద్దేశమని సంస్థ ప్రకటించింది. IANT అనేది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ద్వారా DFW ఏరియాలో ఆమోదించబడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) గొడుగు సంస్థ అని పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో వివిధ కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా భారతీయ సంతతికి చెందిన విశిష్ట వ్యక్తులు భారతీయ సమాజానికి సేవ సేవలందించారని ఐఏఎన్టీ పేర్కొంది. -
చరిత్రలో తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మహిళ
రోమ్: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్ వింగ్‌కు చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటీలీ పార్టీ అధ్యక్షురాలు జియార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు. ప్రధాని అయ్యాక మెలోని ఫైర్ బ్రాండ్‌గా ముందుకుసాగుతారని అంతా భావిస్తున్నారు. ఇటలీ అంతర్జాతీయ సంబంధాలు, వలసదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అలాగే దేశ అప్పులను తగ్గించేందుకు స్థిరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడాతరని అనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెలోని సారథ్యంలోని బ్రథర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ మొత్తం 400 స్థానాలకు 118 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇతరుల మద్దతుతో 237 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెలోని ఇప్పటికే కేబినెట్‌ను కూడా ప్రకటించారు. చదవండి: ‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’ -
చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్
శాంటియాగో: వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బొరిక్ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది. బొరిక్ తన కేబినెట్లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్ కేబినెట్ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్ అయిన జాస్ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్ బొరిక్ విజయం సాధించారు. -
హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం చేశారు. నూతన న్యాయమూర్తులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.రవీంద్రబాబు చదివి వినిపించారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకి రామిరెడ్డి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాతో కలిసి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కలిసి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కలిసి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయితో కలిసి జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కలిసి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కలిసి జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కలిసి జస్టిస్ వడ్డిబోయన సుజాత కేసులను విచారించారు. హైకోర్టు చరిత్రలో ఏడు ధర్మాసనాలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఆ తరువాత నూతన న్యాయమూర్తులను న్యాయవాదులు అభినందించారు. ఈ ఏడుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కి చేరింది. త్వరలో మరిన్ని నియామకాలు జరిగే అవకాశం ఉంది. జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి 1966 జూన్ 3న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ఇటీవలి వరకు ఆ పోస్టులో కొనసాగారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు 1967 జూలై 1న జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్ పూర్తి చేశారు. హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ 1964 మే 28న జన్మించారు. ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా, నాగార్జున వర్సిటీ నుంచి మాస్టర్ లా పొందారు. సుప్రీం కోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా, రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్ ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు. జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు 1967 ఆగస్టు 3న జన్మించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎల్ చదివారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి 1970 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివారు. తొలుత తాడేపల్లిగూడెంలో, 1997లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జస్టిస్ రవి చీమలపాటి 1967 డిసెంబర్ 4న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. పంచాయతీరాజ్ శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా, వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. జస్టిస్ వడ్డిబోయన సుజాత 1966 సెప్టెంబర్ 10న జన్మించారు. ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఎంఏ (సైకాలజీ), ఎల్ఎల్ఎం చదివారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ప్యానెల్ అడ్వొకేట్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. చదవండి: (ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు) -
శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో కవిత, దామోదర్‌రెడ్డితో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రొటెమ్ చైర్మన్ చాంబర్లోకి అనుమతించారు. కవిత ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసన మండలికి తరలివచ్చారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కవిత, దామోదర్‌రెడ్డికి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీ, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఎంపీలు సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, ఫారూక్ హుస్సేన్, వాణీదేవి, భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్ అహ్మద్, సంజయ్, సురేందర్, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు. తనను మండలికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ బారిన పడిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కవిత వెల్లడించారు. నేడు ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం.. ఖమ్మం స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన తాతా మధు గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈ నెల 27న ప్రమాణం చేయనున్నారు. -
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా గుర్మీత్ సింగ్ ప్రమాణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్, డీజీపీ అశోక్ కుమార్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. గుర్మీత్ సింగ్ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సైనికుడిగా సేవలందించాక, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా పని చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికుడు ఉన్నాడని, అందుకే రాష్ట్రానికి వీరభూమి అనే పేరుందని అన్నారు. రిటైర్ అయిన సైనికులు, ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారిపై ఆధారపడిన వారికి కుటుంబాలకు సాయం అందించడం తన ప్రాధమ్యమని చెప్పారు. గవర్నర్ కార్యాలయం ద్వారా ప్రజల అంచనాలను పెంచుతానని వ్యాఖ్యానించారు. -
మే 5న మమత ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. ప్రాణభయంతోనే రిటర్నింగ్ ఆఫీసర్ రీకౌంటింగ్ పెట్టలేదు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్ఎంఎస్ను మీడియాకు చూపించారు. రిటర్నింగ్ అధికారి ఆ ఎస్ఎంఎస్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. -
సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సోమవారం ఉదయం తన కార్యాలయంలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా.. కొత్త జడ్జీల ప్రమాణస్వీకారంతో ఆ సంఖ్య 34కు చేరింది. దీంతో తొలిసారి సుప్రీంకోర్టుకి అత్యధికంగా 34 మంది న్యాయమూర్తులుగా నియామకమయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు న్యాయమూర్తులు వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి, జస్టిస్ హృషికేశ్‌రాయ్ కేరళ హైకోర్టుకి, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టులకి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ రాజస్తాన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌లుగా పనిచేశారు. -
కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం నేడే
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఖన్నాలతో ప్రమాణం చేయించనున్నట్లు గురువారం ఒక అధికార ప్రకటన వెలువడింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ఏ బాంబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ఈ నెల 10వ తేదీన ఈ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం
ఢాకా: నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను భయపెట్టి హింసకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వారిపై దాడులకు పాల్పడటం, హింస చెలరేగడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
ఛత్తీస్‌గడ్‌లో కేబినెట్ ప్రమాణస్వీకారం
-
శ్రీలంక ప్రధానిగా మళ్లీ విక్రమ సింఘే
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం విక్రమ సింఘే మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం శ్రీలంక ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం, పౌరుల సార్వభౌమత్వానికి లభించిన విజయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా విక్రమ సింఘే ఐదోసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించడంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యూఎన్‌పీ, శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లకు చెందిన 30 మందితో సోమవారం కేబినెట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు సిరిసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎన్‌పీ నేత ఒకరు తెలిపారు. ‘సిరిసేనను కొందరు తప్పుదోవ పట్టించి విక్రమసింఘేకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు. విక్రమ సింఘేను తిరిగి నియమించడం ద్వారా సిరిసేన సిసలైన వ్యక్తిత్వం బయటపడింది’ అని ఆయన అన్నారు. విక్రమసింఘే తొలగింపు, పార్లమెంట్ రద్దు వంటి సిరిసేన నిర్ణయాలతో అంతర్జాతీయంగా శ్రీలంక ప్రతిష్ట దెబ్బతింది. -
దేవుని సాక్షిగా
అధికార పక్షం, విపక్షం, కొద్దిసేపట్లో ఎవరు అటు ఇటు అవుతారో తెలియని ఉత్కంఠ, అధికారం నిలుపుకోవాలని ఒకరు, చేజిక్కించుకోవాలని మరొకరి ఆరాటం. అందరి మనసుల్లోనూ ఒకటే కలవరం, ఈ పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ శనివారం తొలిసారిగా కొలువు తీరింది. నూతన సభ్యులు దేవుని సాక్షిగా, రైతుల సాక్షిగా, ఒకరిద్దరు సత్యం సాక్షిగా ప్రమాణం గావించారు. సాక్షి, బెంగళూరు: ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశం అయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఎంతో ఉద్వేగంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సమయానికే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన 10 నిమిషాలకు హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష„ý స్థానంలో, బీజేపీ ఎమ్మెల్యే అధికారపక్షం వైపు కూర్చొన్నారు. సభలో హెచ్డీ రేవణ్ణ మాట్లాడుతూ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని ప్రొటెం స్పీకర్‌ను కోరగా, ఆ మేరకు అనుమతించారు. మధ్యాహ్నం కల్లా ప్రధాన నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్, జమీర్ అహ్మద్ తదితరులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, సోమశేఖర్‌రెడ్డి, ప్రతాప్గౌడలు మధ్యాహ్నం వరకు శాసనసభకు హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటలోపల చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. మీడియా గ్యాలరీలో కూర్చొని జాతీయ నేతలు అనంత్‌కుమార్, శోభ, గులాంనబీ ఆజాద్, మునియప్ప తదితరులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎమ్మెల్యేలందరూ దేవుడు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దాదాపు 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం తాత్కాలిక స్పీకర్ గోపయ్య సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆనంద్‌సింగ్, ప్రతాప్ గౌడ ఆచూకీ లభించకపోవడంతో వారు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో వ్యక్తమయింది. గత బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశమవడంతో ఎమ్మెల్యేలందరితో శాసనసభ కళకళలాడింది. ఎమ్మెల్యేల ముఖాల్లో ఉత్సాహంతో పాటు ఉద్విగ్నత కూడా కనిపించింది. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా?, ఓడిపోతారా?అనే సందిగ్ధం అందరిలోనూ వ్యక్తమైంది. యడ్యూరప్ప దేవునిపై, సిద్ధరామయ్య సత్యంపై సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ‘ముఖ్యమంత్రి’ యడ్యూరప్ప మొదటగా ఎమ్మెల్యేగా.. దేవుని పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సత్యప్రమాణంగా ప్రమాణ స్వీకారం గావించారు. కొత్త ఎమ్మెల్యేలతో విధానసభ కార్యదర్శి ఎస్.మూర్తి ప్రమాణం చేయించారు. సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ పరీక్ష ముగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం 03.30గంటలకు 221 మంది ఎమ్మెల్యేలు చకచకా ప్రమాణం చేశారు. కనిపించకుండా పోయి కాంగ్రెస్‌ను కలవరపెట్టిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్‌లు సభ ప్రారంభమవడానికి అర్ధగంట ముందు విధానసౌధలో ప్రత్యక్షమవడంతో హమ్మయ్య అనుకున్నారు. కుమార, డీకే ఒకేసారి జేడీఎస్ నుంచి కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్‌లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయగా, అందరూ ఆసక్తిగా గమనించారు. గత మూడు రోజులుగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ పేరిట ప్రమాణం అసెంబ్లీలో అందరూ దైవం, సత్యం, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కుణిగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్. డీకేకు అత్యంత ఆప్తునిగా పేరు పొందిన రంగనాథ్ ఆయన పేరు మీద ప్రమాణం చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. మొదటి సారి ఎన్నికల్లో గెలుపొందిన కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలో తెలియక కాసేపు సందిగ్ధంలో పడ్డారు. -
హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తులు గా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. డీవీ ఎస్ఎస్ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, టి.అమర్నాథ్ గౌడ్లతో హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రమాణం చేయిం చారు. ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, బంధువు లు పాల్గొన్నారు. అనంతరం వీరిని న్యాయవా దులు వ్యక్తిగతంగా కలసి అభినందించారు. ఈ ఆరుగురిని న్యాయమూర్తులుగా నియమి స్తూ రాష్ట్రపతి ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం అనం తరం సీనియర్ న్యాయమూర్తులతో కలసి కేసు లు విచారించారు. తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తితో కలసి జస్టిస్ మంతోజ్ గంగారావు, జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కలసి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ సి.వి.నాగా ర్జునరెడ్డితో కలసి జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కలసి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్‌తో కలసి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయా జులు, జస్టిస్ రాజా ఇలంగోతో కలసి జస్టిస్ కేశవరావులు కేసులను విచారించారు. -
బలనిరూపణ నేడే
► 132 మంది మద్దతుపై ఎన్డీయే ధీమా ► సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం ► బీజేపీ నుంచి సుశీల్ మోదీ ప్రమాణం ► ఏ నిర్ణయమైనా బిహార్ కోసమే: నితీశ్ కుమార్ పట్నా/న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (66) గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ నితీశ్తోపాటుగా బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీతోనూ ప్రమాణం చేయించారు. బిహార్ ప్రగతిని దృష్టిలో పెట్టుకునే కూటమినుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్ వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు బిహార్ అసెంబ్లీలో నితీశ్ బలనిరూపణ చేసుకోనున్నారు. బీజేపీ సంపూర్ణ మద్దతు తెలపటంతోపాటుగా ఎన్డీయేలోని ఇతర పక్షాలు కూడా మద్దతివ్వటంతో విశ్వాస పరీక్షలో నితీశ్ విజయం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. నితీశ్ నిర్ణయంపై జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మహాకూటమినుంచి వైదొలిగే అంశంపై తనను సంప్రదించకపోవటాన్ని శరద్ యాదవ్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. జేడీయూ రాజ్యసభ ఎంపీలు వీరేం ద్ర కుమార్, అలీ అన్వర్ కూడా నితీశ్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవేవీ పార్టీ బలనిరూపణపై ప్రభావం చూపబోవని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి 132 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్నారు. ఘనంగా ఎన్డీయేలోకి.. బిహార్ సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా బిహార్ ప్రజల మేలుకోసమే. ఇది పార్టీ సమష్టి నిర్ణయం. మేమంతా ప్రజలకోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను రాజకీయ అవకాశవాదిగా పేర్కొనటంపై స్పందిస్తూ.. ‘రాహుల్ వ్యాఖ్యలకు సరైన సమయంలో సమాధానమిస్తాం’ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే సుపరిపాలన తిరిగి ప్రారంభమైందని సుశీల్ మోదీ (ఉప ముఖ్యమంత్రి) తెలిపారు. ‘గత 20 నెలలుగా రాష్ట్రంలో కొంత స్తబ్దత నెలకొంది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కుతుంది’ అని ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం కాగానే.. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయసభల్లో మా సంపూర్ణ మద్దతుంటుంది’ అని జేడీయూ ప్రకటించింది. అటు ప్రధాని మోదీ మరోసారి నితీశ్, సుశీల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమితో దోస్తీ చారిత్రక తప్పిదం బిహార్‌లో తాజా మార్పులపై బీజేపీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిపెద్ద పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకోసం తమకు అవకాశం ఇవ్వకపోవటంపై నిరసన తెలుపుతున్నట్లు ఆర్జేడీ ప్రకటించింది. ఆర్జేడీతో కలవటం జేడీయూ చేసిన అతిపెద్ద తప్పిదమని కేసీ త్యాగి తెలిపారు. అందుకోసం చింతిస్తున్నామన్నారు. సీబీఐ కేసులనుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులతో లాలూ రహస్య మంతనాలు జరిపారని, నితీశ్ సర్కారును పడగొట్టేందుకు కుట్రపన్నారని త్యాగి విమర్శించారు. కాగా, బుధవారం అర్ధరాత్రి దాటాక గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే బృందం.. నితీశ్‌కు మద్దతుగా 132 మంది (జేడీయూ 71, బీజేపీ 53, ఆర్ఎల్ఎస్పీ 2, ఎల్జేపీ 2, హెచ్ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) ఎమ్మెల్యేల జాబితాను అందజేసింది. పలువురు ఆర్జేడీ శాసనసభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని జేడీయూ నేతలంటున్నారు. ‘నా నా కర్తే’: అఖిలేశ్ బీజేపీతో నితీశ్ దోస్తీపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యంగా స్పందించారు. 1965 నాటి బాలీవుడ్ పాట ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే..’ (వద్దు వద్దంటూనే మీతో ప్రేమలో పడ్డాను) పాట నితీశ్‌కు సరిపోతుందని ట్విటర్లో విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేస్తూనే.. ఆ పార్టీతోనే నితీశ్ దోస్తీ కుదుర్చుకున్నారని విమర్శించారు. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతోపాటు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి) నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి శాసనమండలి దర్బారు హాలులో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ నలుగురి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ నేతలు, పలువురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కొత్త ఎమ్మెల్సీలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీ లను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి: మైనంపల్లి టీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జూబ్లీహాలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో కష్టపడ్డ అందరికీ సీఎం కేసీఆర్ తగిన గుర్తింపు ఇస్తున్నారని, వారందరికీ తప్పక న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ సభ్యత్వం భారీగా నమోదవుతోందని, ఈ సారి 20 లక్షలపైనే సభ్యత్వ లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. -
కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గంగాధర్‌గౌడ్, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వారిచేత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్ నగర్– హైదరాబాద్– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్‌రెడ్డి రెండో మారు కౌన్సిల్లో అడుగుపెట్టనున్నారు. అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ కూడా రెండో సారి కౌన్సిల్‌కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. -
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
శాసన మండలి దర్బారు హాల్లో కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురు వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్ నగర్– హైదరాబాద్– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్‌రెడ్డి రెండో మారు కౌన్సిల్లో అడుగుపెట్టనున్నారు. అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ కూడా రెండో సారి కౌన్సిల్‌కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు గురువారం ఉదయం పదిన్నర గంటలకు శాసన మండలి దర్బారు హాల్లో జరిగే కార్యక్రమంలో శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి ఎం రమేశ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నలుగురితో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. -
శశికళ ప్రమాణంపై అదే ఉత్కంఠ
-
శశికళ ప్రమాణంపై అదే ఉత్కంఠ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే ఆమె చేత ప్రమాణం స్వీకారం చేయించాల్సిన ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు చెన్నై రాకపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ శశికళపై పూటపూటకూ వ్యతిరేకత పెరుగుతోంది. ముంబై నుంచి గవర్నర్ చెన్నై వెళ్లడంపై బుధవారం నిర్ణయం తీసుకోవచ్చని మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఇప్పట్లో చెన్నైకి రాకపోవచ్చని తమిళనాడు రాజ్‌భవన్ వర్గాల సమాచారం. ఇక సొంత పార్టీకి చెందిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పాండ్యన్.. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జయను ఆస్పత్రిలో చేర్చిన రోజు ఆమెతో శశికళ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారని, ఆ సందర్భంలో గెంటివేయడంతో కిందపడిపోయారని చెప్పారు. ఆరోజు జరిగిన ఘటనపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. జయ మరణంపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు. కాగా, శశికళ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిల్లో లోపాలు ఉన్నందున మంగళవారం విచారణకు నోచుకోలేదు. మద్రాస్ హైకోర్టులో కూడా శశికళకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. -
నేడు సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విజయ్ రూపానీ శనివారం గవర్నర్ ఓపీ కోహ్లిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా రూపానీ వెంట డిప్యూటీ సీఎంగా ఎన్నిక కానున్న నితిన్ పటేల్, ఇతర నేతలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ రాష్ర్ట ఇన్చార్జి దినేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. -
కేంద్ర సహకారం లేదు: డీఎస్
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నా కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశాను. మేమందరం ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యి రూపాయల పెన్షన్, సన్న బియ్యం.. ఇంకా ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఒక కాలవ్యవధి పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. అయితే కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడంలేదు. కేంద్ర ప్రోత్సాహాన్ని సంపాదించేందుకు నావంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది పార్టీ నిర్ణయించే అంశం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది..’ అని అన్నారు. డీఎస్‌తో పాటు వొడితెల లక్ష్మీకాంతరావు కూడా మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణం
అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చే శారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో రోజే ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావు గౌడ్ , ఖమ్మం నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చే సిన తుమ్మల అభినందన సభకు వచ్చిన పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, పలువురు నేతలు తుమ్మలను కలసి అభినందించారు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానన్నారు. -
'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది. 'అమ్మ' మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువాళ్లకు స్థానం దక్కింది. తెలుగువాడైన హోసూయ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి, రాజాకు ఐటీ శాఖను జయలలిత కేటాయించింది. కొత్తగా 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న జయలలిత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, డీఎంకే నేత స్టాలిన్ హాజరయ్యారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. -
నేడే అమ్మ పట్టాభిషేకం
సాక్షి, చెన్నై : తమిళనాట ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు రికార్డులకు దారి తీశాయి. 134 స్థానాల్ని అమ్మకు కట్టబెట్టిన ఓటర్లు, 89 స్థానాల్ని డీఎంకేకు అప్పగించి బలమైన ప్రతి పక్షాన్ని నిలబెట్టారు. ఓటరు తీర్పు అధికార పక్షానికి ఆనందాన్ని ఇచ్చినా, అదే సమయంలో బలమైన ప్రతిపక్షం ఎదురుగా కూర్చుం టుండడం కొంత మేరకు ఇరకాటమే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోసారిగా అమ్మ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఆమెతో పాటుగా 29 మంది మంత్రులు ప్ర మాణ స్వీ కారం చేయనున్నారు. ఇందు కు వేదికగా మద్రాసు వర్సి టీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియం నిలవనుంది. 2011లో ఇదే వేదిక నుంచే పగ్గాలు చేపట్టిన జయలలిత మళ్లీ ప్రజాహిత సుపరిపాలన అందించాలన్న కాంక్షతో కొత్త ఉద్వేగంతో పరుగులు తీయడానికి సిద్ధమయ్యారు. సర్వం సిద్ధం : మద్రాసు వర్సిటీ సెంటినరీ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను అధికార వర్గాలు పూర్తి చేశాయి. అసెంబ్లీకి ఎన్నికైన అధికార, ప్రతిపక్షాలకు చెందిన 232 మందికి , రాష్ట్రంలోని 39 మంది పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీల రాజ్య స భ సభ్యులకు, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యులుగా ఉన్న ప్రధాన పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పలికి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లడంతో ఆయన తరఫున ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్ హాజరు కానున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరందరితో పాటుగా 3,150 మందికి ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్లి ఉన్నది. డీఎంకే అధినేత కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్లకు కూడా అధికారులు ఆహ్వానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, అమ్మ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అన్నాడీఎంకే వర్గాలు, ప్రజలు తిలకించేందుకు వీలుగా 32 జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే, 72 ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ ఎల్ఈడీ స్రీన్స్తో కూడిన వాహనాల్ని సిద్ధం చేశారు. అలాగే, వేడుక జరిగే సెంటినరీ హాల్ పరిసరాల్లో మూడు భారీ స్కీన్స్ను ఏర్పాటుచేశారు. సరిగ్గా పదిన్నర పద కొండు గంటలకు పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత , మంత్రుల బృందం ఆడిటోరియానికి బయలు దేరనుంది. పన్నెండు గంటల ప్రాంతంలో రాష్ర్ట గవర్నర్ రోశయ్య అక్కడికి చేరుకుంటారు. తదుపరి ప్రమాణ స్వీకారోత్సవ వేడుక జరుగుతుంది. ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం పోయెస్ గార్డెన్ నుంచి రాధాకృష్ణన్ సాలై మీదుగా మెరీనా తీరం వెంబడి మద్రాసు వర్సిటీకి వెళ్లే అమ్మకు బ్రహ్మరథం పట్టేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. దారి పొడవున ఆమెకు పుష్పాలు చల్లి ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ తీరం వెంబడి అమ్మకు ఆహ్వానం పలికే హోర్డింగ్స్, ఫ్లెక్సీలు వెలిసి ఉన్నాయి. ఇక, కాన్వాయ్‌లోకి జనం చొచ్చుకు రాకుండా ఆ తీరం వెంబడి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. సెంటినరీ హాల్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. ఆహ్వాన పత్రిక లు ఉన్న వాళ్లను మాత్రమే ఆ హాల్లోకి అనుమతిస్తారు. ఇక, ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సీఎం జయలలిత , మంత్రుల బృందం సచివాలయానికి వెళ్లనున్నారు. అక్కడ తమ తమ చాంబర్లలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, 2011లో అధికార పగ్గాలు చేపట్టగానే, ఐదు కీలక హామీల అమలుకు తొలి సంతకం చేసిన జయలలిత 2016లో ఏ ఏ అంశాల్ని కీలకంగా తీసుకుని తొలి సంతకం పెడతారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
అమ్మ టీం రెడీ!
♦ ప్రభుత్వ ఏర్పాటుకు జయకు గవర్నర్ రోశయ్య ఆహ్వానం ♦ అమ్మ కేబినెట్లో 28 మందికి చోటు ♦ 23న ప్రమాణ స్వీకారం సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని అన్నాడీఎంకే పొందింది. చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలితను శుక్రవారం నాటి సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జయలలిత రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ కే రోశయ్యను కలిశారు. రోశయ్యకు జయలలిత ముందుగా పుష్పగుచ్ఛం, శాలువా ఇచ్చి మర్యాద చేయగా, రోశయ్య సైతంజయలలితకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ తరువాత రోశయ్య సతీమణి కే శివలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు జయలలితకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని జయలలిత గవర్నర్ రోశయ్యకు అందజేశారు. తీర్మాన ప్రతిని స్వీకరించిన రోశయ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయలలితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా 28 మంది మంత్రుల పేర్లతో కూడిన జాబితాను జయలలిత గవర్నర్‌కు అందజేశారు. ప్రొటెం స్పీకర్‌గా మేట్టూరు ఎమ్మెల్యే ఎస్ సెమ్మలై నియమితులుకాగా ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ కే రోశయ్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముస్తాబవుతున్న వేదిక ప్రాంగణం: అన్నా యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఈనెల 23వ తేదీన జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో 28 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ కే రోశయ్య వారిచేత ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆడిటోరియంను పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఆడిటోరియంలోపల, బైట ముస్తాబు చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీస్‌శాఖ గట్టిబందోబస్తు చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్‌స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆడిటోరియం పరిసరాల్లో అణువణువును తనిఖీ చేస్తున్నారు. జయ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మ కేబినెట్: 1. జే జయలలిత- ముఖ్యమంత్రి. శాఖలు: హోం, పబ్లిక్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డీఆర్వోలు ప్రజాపరిపాలన 2. ఓ పన్నీర్‌సెల్వం- ఆర్థికమంత్రి 3. దిండుగల్లు సీ శ్రీనివాసన్, అటవీశాఖ 4. ఎడపాడి కే పళనిస్వామి, ప్రజా పనుల శాఖ 5. సెల్లూరు కే రాజు, సహాకార, కార్మికశాఖ 6. పి. తంగమణి, విద్యుత్, ఎక్సైజ్ 7. ఎస్పీ. వేలుమణి, పురపాలక పరిపాలన, గ్రామీణాభివృద్ధి 8. డి.జయకుమార్, మత్స్యశాఖ 9. సీవీ. షణ్ముగం, న్యాయశాఖ, కోర్టులు, జైళ్ల మంత్రి 10. కేపీ అన్బళగన్, ఉన్నతవిద్యాశాఖ 11. డాక్టర్ వీ సరోజ, సాంఘిక సంక్షేమం 12. కేసీ. కరుప్పన్నన్, పర్యావరణం 13. ఎంసీ సంపత్, పరిశ్రమలు 14. ఆర్ కామరాజ్, ఆహారం, పౌరసరఫరాలు 15. ఓ ఎస్. మణియన్, చేనేత 16. ఉడుమలై రాధాకృష్ణన్, గృహ, పట్టణాభివృద్ధి 17. డాక్టర్ సి. విజయభాస్కర్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 18. ఎస్పీ షణ్ముగనాథన్, పాడిపరిశ్రమ 19. ఆర్ దురైకన్ను, వ్యవసాయం, పశుసంవర్థకం 20. కాదంబూరు రాజు, సమాచారం, ప్రచారం 21. ఆర్బీ ఉదయకుమార్, రెవెన్యూ 22. కేటీ రాజేంద్రబాలాజీ, గ్రామీణ పరిశ్రమలు 23. కేసీ వీరమణి, వాణిజ్యపన్నులు 24. పి.బెంజిమిన్, పాఠశాల విద్య, క్రీడ, యువజన సంక్షేమం 25. వెల్లమండి ఎన్.నటరాజన్, పర్యాటకం 26. ఎస్ వలర్మ29. ఎంఆర్ విజయభాస్కర్, రవాణాశాఖ -
ఆరోసారి..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శాసనసభాపక్ష నేతగా ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. * శాసనసభాపక్ష నేతగా జయ ఏకగ్రీవం * 23వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారం * ప్రధాని మోదీకి ఆహ్వానం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గాను తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి మినహా 232 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 134 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అన్నాడీఎంకే అధికారం చేపట్టనుంది. పార్టీ అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కేనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవగా, ధ్రువీకరణ పత్రాన్ని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, ఆర్కేనగర్ ఎన్నికల ఇన్చార్జ్ వెట్రివేల్ శుక్రవారం పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి ఆమెకు అందజేశారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశాన్ని రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరయ్యేందుకు ముందుగా అన్నాశాలై, అన్నా ఫ్లైవో వర్ సమీపంలోని పెరియార్ విగ్రహానికి జయ నివాళులర్పించారు. ఆ తరువాత అన్నాశాలైలోని ఎంజీఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి రాయపేట అవ య్యషణ్ముగం రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరై అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 23న సీఎంగా పదవీ ప్రమాణం: అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం పూర్తికావడంతో ఈనెల 23వ తేదీ న జయలలిత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ కే రోశయ్య జయలలితతోపాటు కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రమాణస్వీకారం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపడతారు. ప్రధాని మోదీకి ఆహ్వానం: ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం పలికారు. అలాగే కేంద్ర మంత్రులకు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. చేతలతో కృతజ్ఞతలు చాటుకుంటా: జయలలిత కేవలం నోటి మాటలతో కాదు, ప్రజారంజకమైన పాలనతో తన కృతజ్ఞతలు చాటుకుంటానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత అన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికవుతున్న సందర్భంగా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విచక్షణమైన తీర్పుతో ప్రజలు ఒక చరిత్రను సృష్టించారని అన్నారు. తాను ప్రజల పక్షం, ప్రజలు నా పక్షమని మరోసారి రుజువైంది. గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు అంగీకార ముద్ర వేశారు. మీడియా సాధనాల ద్వారా అనేక విపక్ష నేతలు అనేక విషప్రచారాలను చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వంపై విపక్షాల చేసిన విమర్శలను విసిరిపారేశారు. తమిళ ప్రజలను ఎవ్వరూ మోసం చేయలేరని నిరూపించారు. పేద, బడుగు, బలహీన ప్రజలను అక్కున చేర్చుకునేది అన్నాడీఎంకే ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు నమ్మినందునే మరోసారి అధికారంలోకి వచ్చాను. మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చాటుకుంటున్నాను. ప్రజల సంక్షేమకోసం ఉద్వేగంతో పాటుపడుతాను. కేవలం మాటలతోకాదు సుపరిపాలనను చేతలతో చూపిస్తాను అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. -
తొలి అధ్యక్షురాలు వచ్చేసింది
తైపీ: తైవాన్ పరిపాలన బాధ్యతలు తొలిసారి ఓ మహిళ చేతికి వచ్చాయి. తైవాన్ అధ్యక్షురాలిగా సెయింగ్ వెన్ శుక్రారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం పూర్తవగానే ప్రదాని లి చువాన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము చైనాతో స్టేటస్ కో విధానం పాటిస్తామని అదే సమయంలో తైవాన్ ప్రజాస్వామ్యాన్ని బీజింగ్ గౌరవించాలని చెప్పారు. తమ దేశంలోని ఎన్నో ఆర్థిక సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు చైనా సహకారం కోరుకుంటామని, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆమె చెప్పారు. తైవాన్ లో జనవరి 16 ఎన్నికలు జరగ్గా సాయింగ్ పార్టీ ప్రొ-ఇండిపెండెన్స్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(పీడీపీ) 56.2శాతం గెలుచుకుంది. ఆమె ప్రత్యర్థి ఎరిక్ చూను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన దాదాపు ఐదు నెలల తర్వాత ఆమె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. -
టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణం
హైదరాబాద్: ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. పురాణం సతీష్, భూపతి రెడ్డి, భాను ప్రసాద్, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కొండా మురళి, లక్ష్మినారాయణ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. -
లంక ప్రధానిగా రణిల్ ప్రమాణం
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్‌పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు. అధ్యక్షభవనంలో రణిల్‌తో సిరిసేన ప్రమాణం చేయించారు. రణిల్ ప్రధాని కావడం ఇది నాలుగోసారి. రణిల్ ప్రమాణం తర్వాత మిత్రపక్షమైన ఎస్ఎల్ఎఫ్పీతో కలసి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. దీనిప్రకారం కొత్త రాజ్యాంగాన్ని రచించేందుకు రాజ్యాంగపరిషత్తు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాజ్యాంగం ద్వారా మైనారిటీల(తమిళుల సహా), మానవ హక్కులకు రక్షణ కల్పించేందుకు రాజ్యాంగ భరోసా ఇవ్వనున్నారు. -
ఆనందన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా ఎంఎస్ఎం ఆనందన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, సమాచార కమిషనర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం రోజు కొత్త మంత్రికి సమస్య బయలు దేరింది. ఆయనపై సీఎం జయలలితకు ఫిర్యాదు చేయడానికి యత్నించిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, చెన్నై : రాష్ర్ట అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చిన ఎంఎస్ఎం ఆనందన్‌ను గతంలో సీఎం జయలలిత తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయనకు అవకాశం కల్పిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అదే శాఖను ఆయనకు కట్టబెడుతూ మళ్లీ తన కెబినెట్లోకి చేర్చుకున్నారు. మంత్రిగా నియమించ బడ్డ ఎంఎస్ఎం ఆనందన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జె జయలలిత హాజరు అయ్యారు. ఆమె సమక్షంలో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఎంఎస్ఎం ఆనందన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే సమాచార చీఫ్ కమిషనర్‌గా రామానుజం, కమిషనర్లుగా మురుగానందన్, దక్షిణామూర్తిల చేత కూడా రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా కొత్త మంత్రి ఎంఎస్ఎం ఆనందన్‌ను సీఎం జయలలితతో పాటుగా సహచర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, మంత్రులందరూ గవర్నర్ రోశయ్య, సీఎం జయలలితతో కలసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం నేరుగా సచివాలయంలోని తన చాం బర్కు చేరుకున్న ఎంఎస్ఎం ఆనందన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, సీని యర్ మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడ పా డి పళని స్వామి, పళనియప్పన్, వలర్మతి, గోకుల ఇందిరఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదుకు యత్నం : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఎంఎస్ఎం ఆనందన్‌కు కొత్త చిక్కులు బయలు దేరాయి. తిరుప్పూర్‌కు చెందిన జయమణి(33) ఆయన తనకు మోసం చేశారంటూ సీఎం జయలలితకు ఫిర్యాదు చేయడానికి యత్నించారు. పోయెస్ గార్డెన్ వైపుగా వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నాడీఎంకే వర్గాల సమాచారం మేరకు తిరుప్పూర్‌కు చెందిన ఆ మహిళకు ఓ కుమారుడు,కుమార్తె ఉన్నట్టు పేర్కొంటున్నారు. భర్తను విడిచి దూరంగా ఉన్న ఆ మహిళతో ఎంఎస్ఎం ఆనందన్‌కు పరిచయం ఉండేదని,ఇప్పుడు ఆమెను విస్మరించ బట్టే ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం ఉందోనన్నది పక్కన బెడితే, దీనిని సీఎం జయలలిత తీవ్రంగా పరిగణించిన పక్షంలో పదవి ఊడేది మాత్రం ఖాయం. -
రేపటి రోజున నేనే మంత్రిని కదా...!!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది తాజాగా ఎన్నికైన ఓ ఎమ్మెల్సీ గారి వ్యవహారం. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఆయన పెద్దల సభకు ఎంపికయ్యారు. తన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. దీంతో తప్పకుండా తనకు మంత్రి పదవి ఖాయమని సదరు ఎమ్మెల్సీ గారు అపుడే ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ తాను మంత్రి అయితే ఏ శాఖను అప్పగిస్తారో అపుడే ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ శాఖలో ఏఏ అధికారులను ఎక్కడెక్కడ నియమించాలో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారికి సూచిస్తున్నారు. తన ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌పై అందుకు అనుగుణంగా సిఫారసు లేఖలు కూడా ఇచ్చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తనకు కేటాయిస్తారని భావిస్తున్న శాఖలో బాధ్యతలు చక్కగా నిర్వహించుకునేందుకు ఆ ఎమ్మెల్సీ గారు ఇప్పటి నుంచే మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక మంత్రి దగ్గరకు వచ్చిన ఆ ఎమ్మెల్సీ గారు మీరు ప్రస్తుతం చూస్తున్న శాఖలోని ఫలానా కార్పొరేషన్‌కు ఫలానా అధికారిని నియమించండి, ఫలానా శాఖకు ఫలానా కమిషనర్‌ను నియమించండి అని సూచించారు. ఇపుడున్న అధికారులు బాగానే పనిచేస్తున్నారు కదా అని సదరు మంత్రి అమాయకంగా ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తే రేపు మంత్రివర్గ విస్తరణలో మీరు చూసే శాఖను నాకే కేటాయిస్తారు కదా, ఆ శాఖను బాధ్యతలు చేపట్టిన వెంటనే చక్కదిద్దాలంటే కష్టం, అందుకే ఇప్పటి నుంచే నాకు అనుకూలమైన అధికారులను నియమింప చేసుకుని పర్యవేక్షిస్తుంటే అపుడు పని సులువవుతుందని సెలవిచ్చారట. దీంతో ఆశ్చర్యపోయిన మంత్రి గారు వెంటనే తేరుకుని అన్నా మీరు పార్టీకోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, మీరు అడిగిన ఆ పని చేయలేనా అని చెప్పి అందుకు అనుగుణంగా అప్పటికపుడు ఓ లేఖను తయారు చేయించి అందులో ఫలానా ఎమ్మెల్సీ గారి సిఫారసు మేరకు ఈ అధికారులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా నియమించండి అని పేర్కొన్నారు. తన లేఖతో పాటు ఎమ్మెల్సీ గారు రాసి ఇచ్చిన సిఫారసు లేఖను సీఎంతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు కూడా పంపించి హమ్మా మీరు మంత్రి కాక ముందే నా శాఖలో వేలు పెడతానంటే కుట్టకుండా ఊరుకుంటానా? అందుకే సీఎంకు మీ లేఖను పంపాను అని సంతోషపడుతున్నాడట. -
ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్ నేత నోముల విమర్శ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను గమనించే స్థితిలో కాంగ్రెస్ లేదని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించారు. కేసీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఆయన దిష్టిబొమ్మలు తగులపెట్టిన నీచమైన పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు డిండి ప్రాజెక్టుకు జరిగిన శంకుస్థాపన కూడా కనిపించడం లేదన్నారు. మరో వైపు టీడీపీ నేతలు చివరకు వరద నీళ్లపైనా తగాదాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు నీచ స్థాయికి దిగజారి శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి కేసీఆర్ నియంతాలనే వ్యవహరిస్తారన్నారు. వికీ లీక్స్ చంద్రబాబు కుట్రలను బయట పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని నోముల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ నేతలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి వారితో ప్రమాణం చేయించారు. వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న (కృష్ణా), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), రెడ్డి సుబ్రమణ్యం (తూర్పు గోదావరి), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించటంతో పాటు వాటి పరిష్కారానికి, టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. లోకేష్ అడుగుజాడల్లో.. ఆయన సైన్యంలో పనిచేస్తామని వ్యాఖ్యానించారు. -
'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి' అంటూ ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఆదివారం మహబూబ్ బాషా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందని, 80 శాతం మంది ప్రజలు చంద్రబాబును దోషిగా పేర్కొంటున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు. -
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని దర్బారు హాల్లో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు వరుసగా ప్రమాణం చేశారు. అంతా కలిపి ఏడు నిమిషాల్లోనే ప్రమాణం చేయడంతో కార్యక్రమం పూర్తిగా పది నిమిషాల్లోనే ముగిసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్ నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీల సొంత జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన కొత్త ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. -
బాధ్యతల స్వీకరణ
ఎనిమిది నెలల తరువాత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సచివాలయంలోకి ఆదివారం అడుగు పెట్టారు. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు. ఐదు సరికొత్త పథకాలకు సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తక్కువ ధరకే ఉద్ది, కందిపప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టారు. సచివాలయంలోకి అడుగు పెట్టిన జయకు పూలవర్షంతో ఆహ్వానం లభించింది. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి నిర్దోషిగా జయలలిత బయట పడ్డ విషయం తెలిసిందే. తమ అమ్మకు మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించేందుకు అన్నాడీఎంకే శాసన సభా పక్షం నిర్ణయించింది. ఆ మేరకు శనివారం మద్రాసు వర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన వేడుకలో ఐదో సారిగా తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా 28 మంది మంత్రులకు గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుక అనంతరం సచివాలయంకు జయలలిత వెళ్తారని సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆమె నేరుగా పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. సర్వం సిద్ధం చేసిన సచివాలయం వర్గాలు ఆమె రాక కోసం ఎదురు చూశాయి. ఆదివారం సెలవు దినమైనా జయలలిత బాధ్యతలు స్వీకరించేందుకు తప్పకుండా వస్తారని భావించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. బాధ్యతల స్వీకరణ : సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయంకు జయలలిత రానున్న సమాచారం, అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. అమ్మ విధేయులు ముందస్తుగా ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి సచివాలయంకు బయలు దేరిన జయలలితకు దారి పొడవునా పార్టీ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద ఆమె కాన్వాయ్‌పై పుష్పపు జల్లులు కురిపిస్తూ ఆహ్వానం పలికారు. సరిగ్గా మూడు గంటలకు సచివాలయంలోకి అడుగు పెట్టిన జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ పుష్ప గుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. నేరుగా తన చాంబర్లోకి అడుగు పెట్టగానే, ఎదురుగా ఉన్న దివంగత నేతలు ఎంజీయార్, అన్నా చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం తన సీటులో ఆశీనులయ్యారు. అదే సమయానికి 28 మంది మంత్రులూ తమ తమ చాంబర్లలో బాధ్యతల్ని స్వీకరించారు. ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర అధికారులు వారికి పుష్పగుచ్ఛాలను అందజేసి ఆహ్వానం పలికారు. ఐదు సంతకాలు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్ కొన్ని ఫైల్స్‌ను అందజేశారు. ఐదు ఫైల్స్‌పై తొలుత జయలలిత సంతకాలు చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పోలీసు అధికారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. సరిగ్గా నాలుగు గంటలకు సచివాలయం నుంచి తన నివాసం పోయెస్ గార్డెన్‌కు జయలలిత బయలు దేరి వెళ్లారు. తదుపరి జయలలిత సంతకాలు చేసిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికార వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఐదు పథకాలు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పథకానికి జయలలిత సంతకం చేశారు. అలాగే పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కళను సాకారం చేయడం లక్ష్యంగా పట్ణణ గృహ నిర్మాణ పథకానికి సంతకం చేశారు.1274 తాగునీటి పథకాలకు, పేద మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటుగా కుటుంబ పెద్దలుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెడుతు సంతకం చేశారు. అమ్మ క్యాంటీన్లు నిర్మాణాలు పూర్తై రాష్ట్రంలో వందలాది అమ్మ క్యాంటీన్లు ప్రారంభానికి నోచుకోని విషయం తెలిసిందే. జయలలిత రాకతో ఆ క్యాంటీన్ల తలుపులు తెరచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయలలిత ప్రారంభించారు. ఇక, పెరుగుతున్న పప్పు దినుసుల ధరల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు చేపట్టింది. కుటుంబ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో చౌక ధరకే ఉద్ది, కంది పప్పు లభించనున్నది. ఇందుకు తగ్గ పథకానికి జయలలిత శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా కిలో కంది పప్పు *53.5, అర కిలో ఏ గ్రేడ్ ఉద్ది పప్పు *56, బి గ్రేడ్ *49.5కు విక్రయించనున్నారు. ఎనిమిది నెలల అనంతరం జయలలిత సచివాలయంలోకి అడుగు పెట్టి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఓ వైపు ఉంటే, మరో వైపు ఆమె రాకతో సచివాలయం పరిసరాల్లో సందడి వాతావరణం ఆదివారం సెలవుదినం రోజున కూడా నెలకొనడం విశేషం. -
సమాయత్తం
నేడు అన్నాడీఎంకే సమావేశం 23న సీఎంగా జయ పదవీ స్వీకారం భారీ భద్రతా ఏర్పాట్లు టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కొన్ని నెలల అనంతరం మళ్లీ ప్రజల్లోకి జయ రానున్నందున అందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు రాయపేటలోగల అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ అన్నాడిఎంకే పార్టీ అధ్యక్షురాలిగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 23వ తేదీ ఐదవ సారిగా జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆ రోజు ఉదయం 11 గంటలకు మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలులో జరుగనుంది. గవర్నర్ రోశయ్య, జయలలితతో పదవీ ప్రమాణం చేయించనున్నారు. జయ తర్వాత 32 మంది మంత్రులు పదవులు చేపట్టనున్నారు. జయలలిత పదవిని చేపట్టి మళ్లీ జార్జి కోటకు చేరుకోనున్నారు. ఆ సమయంలో జయలలితను స్వాగతించేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడు నెలలుగా మూతబడిన సీఎం చాంబర్ కొత్త హంగులు సంతరించుకోనుంది. జార్జి కోట ప్రాంగణంలోగల భవనాలు, రోడ్లను ఆధునీకరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశం జరిగే హాలుతో సహా భవనాలను రంగులతో తీర్చిదిద్దనున్నారు. జయకు స్వాగతం పలికే విధంగా కోట వెలుపలి భాగాన భారీ ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటుచేస్తున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్ రోడ్డు మీదుగా కోటకు వెళ్లే రోడ్డు ఆధునీకరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల నలుపు, తెలుపు రంగులను పెయింట్ చేస్తున్నారు. జయను స్వాగతిస్తూ పోయెస్ గార్డెన్ నుంచి కోట వరకు చైతన్య శీర్షికలతో కూడిన రంగు రంగుల బ్యానర్లు, తోరణాలు, పార్టీ జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవం జరిగే మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలు చుట్టుప్రక్కల బ్యానర్లు ఏర్పాటవుతున్నాయి. మౌంట్‌రోడ్డుకు ముస్తాబు: జయ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రోశయ్యను కలిసి సైదాపేట, నందనం, తేనాంపేట, థౌజండ్ లైట్స్ మీదుగా మౌంట్రోడ్కు చేరుకోనున్నారు. మార్గ మధ్యంలోగల ఎంజిఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయలలిత ఏడు నెలల తర్వాత శుక్రవారం మళ్లీ ప్రజలను కలుసుకోనున్నారు. దీంతో ఆమె రానున్న మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని స్వాగతం తెలుపనున్నారు. తమ అమ్మ జయను కనులారా తిలకించి తరించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లలో బిజీగా వున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా జరుపుతున్నారు. -
17న ప్రమాణస్వీకారం లేనట్లే!
-
17న ప్రమాణస్వీకారం లేనట్లే!
‘అప్పీలు’ డిమాండ్లు పెరగడంతో జయ ఊగిసలాట సాక్షి, చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈనెల 15న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని భావించిన పార్టీ నేతలు తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 17వ తేదీన సీఎంగా జయ ప్రమాణస్వీకారం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలంటూ రాజకీయ పక్షాల డిమాండ్ పెరుగుతుండడమే ఈ ప్రతిష్టంభనకు కారణంగా తెలుస్తోంది. జయలలిత నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. కాగా, 19 ఏళ్లపాటు సాగిన విచారణలో జయ దోషి అని రుజువైతే, 3 నిమిషాల తీర్పుతో ఆమె నిర్దోషి అని ప్రకటించారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తప్పుపట్టారు. తీర్పును సవరిస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. ఆందోళనలో జయ: కోర్టు తీర్పుపై విమర్శలు రావడం, అప్పీలుకు విపక్షాలు పట్టుపట్టడం, తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కుమారస్వామి సైతం విమర్శలకు స్పందించి అత్యవసరంగా సమావేశం కావడం జయలలితను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసు నుంచి బయటపడ్డా జయ.. ఉత్సాహంతో ప్రజల ముందుకు ఇప్పటివరకు రాలేదు. సీఎం పన్నీర్‌సెల్వంతో మాత్రమే ఆమె సమావేశమయ్యారు. తీర్పు వివరాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సీఎం పదవి చేపట్టడంపై ఆమె నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనెల 17నపదవీ ప్రమాణం లేకున్నా అందుబాటులో ఉండాలని 155 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. తీర్పుపై జడ్జి పునఃసమీక్ష! జయలలిత ఆస్తుల కేసులో వెలువరించిన తీర్పు ప్రతిలో తప్పులు ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య పేర్కొనడంతో తీర్పుపై న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్.కుమారస్వామి బుధవారం సమీక్షించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. జయను నిర్దోషిగా పేర్కొంటూ జస్టిస్ కుమారస్వామి ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు ప్రతిలో తప్పులు నిజమే అయినా.. ఒకసారి ఇచ్చిన తీర్పును తిరిగి అదే కోర్టు మార్చడానికి వీల్లేదని, అయితే క్లరికల్, అర్థమెటిక్ తప్పులను సరిదిద్దడానికి మాత్రం అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
ముందస్తుకే జయ మొగ్గు!
17న సీఎంగా ప్రమాణ స్వీకారం 14న శాసనసభా పక్ష నేతగా ఎన్నిక అనంతరం గవర్నర్‌కు తీర్మానం అందజేత చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి విముక్తి పొందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. జయ సీఎం అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. జయ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్నెల్ల తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచి, మరో ఆరు నెలలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవడం అనవసరమని జయలలిత భావించవచ్చు. ఈ నెలలోనే పదవిని చేపట్టి, ఐదు నెలలపాటు సీఎంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవంగా అన్నాడీఎంకే ప్రభుత్వానికి 2016, మే నాటికి ఐదేళ్లు పూర్తవుతుండగా, ఈఏడాది చివర్లో ఎన్నికలు తథ్యమని అంటున్నారు. 14న సీఎం రాజీనామా ఈనెల 14న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రివర్గం సమావేశమై రాజీనామాలు చేసి గవర్నర్‌కు సమర్పిస్తారని భావిస్తున్నారు. అదేరోజు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతగా జయను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ కె.రోశయ్యకు అందజేస్తారు. ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను గవర్నర్ ఆహ్వానిస్తారు. తమిళనాడు ప్రజలు శుభదినంగా భావించే నిండు అమావాస్య రోజైన ఈనెల 17న జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అనధికార సమాచారం. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ వెలువరించిన తీర్పు ప్రతులను తమిళనాడు ఏసీబీ ఐజీ గుణశీలన్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే, సీఎం పదవులకు అనర్హురాలిగా జయపై ఉన్న నిషేధం ఎత్తివేసినట్లయింది. అప్పీలుకు వెళ్తే..? మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాల్సిందేనని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. జయ సీఎం పీఠం ఎక్కినట్లయితే మళ్లీ రాజీనామా చేయకతప్పదని సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. అయితే ఆయన్ను బీజేపీ అగ్రనేతలు కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఇలాంటి డోలాయమాన స్థితిలో తొందరపడరాదని జయ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వె ళ్తే సుప్రీంకోర్టులో సైతం కేసు నుంచి బయటపడి, ఎన్నికల్లో గెలుపొంది ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే బాగుంటుందని కూడా జయలలిత యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘జయ మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుంది!’ చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సిద్ధమవుతున్నారు. ‘‘ఈ కేసులో కర్టాటక హైకోర్టు ‘లెక్కలు’ తప్పని నేను సుప్రీంకోర్టులో నిరూపిస్తా. జయలలిత ఒకవేళ సీఎంగా పగ్గాలు చేపడితే మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన మంగళవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. జయపై ఈ కేసును 1996లో సుబ్రహ్మణ్య స్వామే దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
జార్ఖండ్ సీఎంగా రఘువర్‌దాస్ ప్రమాణం
మంత్రులుగా మరో నలుగురు కూడా.. పొగమంచు వల్ల హాజరుకాలేకపోయిన ప్రధాని రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సాముండా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రఘువర్దాస్తో పాటు మరో నలుగురితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణం చేయించారు. వీరిలో బీజేపీ తరఫున నీల్కాంత్సింగ్ ముండా, చంద్రేశ్వర్ప్రసాద్ సింగ్, లూయిస్ మరాండీ, మిత్రపక్షం అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్‌జేయూ) నుంచి చంద్రప్రకాశ్ చౌదరి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తదితరులు రావాల్సి ఉన్నా... ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలను నిలిపివేయడంతో హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రఘువర్దాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అవినీతిరహిత అభివృద్ధి సాధిస్తాం రాంచీ: అవినీతికి తావులేని అభివృద్ధి పనులను చేపడతామని, ప్రభుత్వ సేవలను నిర్ధిష్టమైన కాలపరిమితితో అందిస్తామని జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్ చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగానికి ఈ అభివృద్ధి పనులను అప్పగిస్తామన్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జార్ఖండ్‌కు ఇప్పటి వరకూ అంతమంచి పేరు లేదని, దీనిని తొలగించాలంటే అందరి సహకారం అవసరమని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీడియా కూడా దీనికి సహకరించాలని కోరారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న కొత్త సీఎం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన కొద్దిసేపటికే రఘువర్‌దాస్ స్వచ్ఛభారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే కరంతోలి ప్రాంతంలోని రోడ్లను ఊడ్చారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రివర్గ సభ్యుడు సీపీ సింగ్‌తో కలసి ఆయన నేరుగా కరంతోలి ప్రాంతానికి చేరుకున్నారు. సంక్షేమ పథకాల కింద వృద్ధులకు పింఛన్లు, ఇతర సదుపాయాలు అందడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించానని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో వృద్ధులందరికీ పింఛన్లు, ఇతర సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
అభివృద్ధే లక్ష్యం : మంత్రి తుమ్మల
- ‘సాక్షి’తో మంత్రి తుమ్మల సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని రోడ్లు, భవనాలు, స్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తాను. ఏ ప్రాంతం వారు ఏ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని జిల్లా నలుమూలలా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. జిల్లాలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయడానికి తోడ్పడుతాను. జిల్లాలో అన్ని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తాను. సూర్యాపేట-కాకినాడ వయా ఖమ్మం నాలుగు వరుసల రహదారుల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తాం. ఖమ్మంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం. భద్రాచలంలో నూతన బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి సారిస్తా. ఏజెన్సీ ప్రజలకు మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం. పది సంవత్సరాలుగా జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధిని పునరుద్ధరిస్తా. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వేగవంతంగా పనిచేసేలా అప్రమత్తం చేస్తా. ముంపు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తా. ఇందుకు ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడుతా. రహదారులు, అభివృద్ధిపరంగా ఖమ్మాన్ని రాష్ట్రస్థాయిలోనే కాదు దేశస్థాయిలోనూ అగ్రగామిగా నిలుపుతా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని వేగవంతం చేయిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ను అందించే అరుదైన అవకాశం ఖమ్మం జిల్లాకు రావడం జిల్లా వాసుల అదృష్టం. జిల్లాలో నిర్మించనున్న పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయిస్తా. ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకోను’ అన్నారు. 18న జిల్లాకు రానున్న తుమ్మల రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు తొలిసారిగా 18వ తేదీన భద్రాచలం వస్తారు. ఆయన నేరుగా హెలీకాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. భద్రాచలంలో నూతనంగా నిర్మించనున్న స్పెషల్ బ్రిడ్జికి మంత్రి హోదాలో తొలి శంకుస్థాపన చేస్తారు. 19న జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. -
శాసనసభ ప్రాంగణంలో ఐదున ప్రమాణ స్వీకారం
ఎవరికి ఏ శాఖ దక్కేనో? సాక్షి, ముంబై: ఎట్టకేలకు బీజేపీ, శివసేన మధ్య ఒప్పందం కుదిరింది. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం పది గంటలకు బీజేపీకి చెందిన 10 మంది, శివసేనకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరిలో ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారనేది ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పైరవీలు ప్రారంభించారు. కాగా బీజేపీ సర్కారులో చేరాలా? వద్దా? అనే అంశాన్ని దాదాపు నలభై రోజులకుపైగా శివసేన నాన్చింది. పదవుల పంపిణీపై ఆ పార్టీ తగ్గడం బీజేపీ సర్కారుకు ఊరట లభించింది. శివసేనకు ఐదు కేబినెట్ హోదా, ఏడు సహాయ మంత్రి పదవులను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే ఈ పదవులు ఎవరిని వరిస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవుల విషయంలో సుభాష్ దేశాయి, ఏక్నాథ్ షిండే, దివాకర్ రావుతే, నీలం గోరే పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా సహాయ మంత్రి పదవుల విషయంలో దాదా భుసే, విజయ్ అవుటీ, రవీంద్ర వైకార్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్, అర్జున్ ఖోత్కర్, దీపక్ కేసర్కర్ లేదా ఉదయ్ సామంత్, దీపక్ సావంత్ తదితరుల పేర్లు తెరపైకొచ్చాయి. దీంతో శివసేనతోపాటు బీజేపీలో కూడా భారీగా లాబీయింగ్ జరుగుతోంది. శివసేన ముందుగా డిమాండ్ చేసిన ప్రకారం ఉప ముఖ్య మంత్రి, హోం శాఖ లాంటి కీలక శాఖలను బీజేపీ ఇవ్వలేదు. కేవలం సాధారణ శాఖలతోనే సరిపెట్టింది. ఈ విషయంలో శివసేన విఫలమైందని కాంగ్రెస్, ఎన్సీపీలు విమర్శిస్తున్నాయి. అయితే శివసేనకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించామనుకోవడం పొరబాటేనంటూ బీజేపీ సమర్థించుకుంది. ఎమ్మెస్సార్డీసీ, రవాణా లాంటి కీలకమైన శాఖలను శివసేనకు ఇవ్వనున్నారు. వీటితోపాటు కేంద్రంలో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది. దీనిపై బీజేపీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరికో? బీజేపీ సర్కారులో శివసేన చేరడం ఖాయమని తేలడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారనే అంశం తెరపైకి వచ్చింది. సంఖ్య బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం మెండుగా ఉంది. అయితే ఎన్సీపీ కూడా ప్రతిపక్ష స్థానంలోనే ఉంటామంటోంది. ఇటీవల గవర్నర్ విద్యాసాగర్‌రావును తోపులాటల్లో గాయపర్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 37కి చేరింది. ఈ లెక్కప్రకారం ఎన్సీపీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. స్వతంత్రులు, ఇతర పార్టీల బలం తమకుందని, అందువల్ల ప్రతిపక్షంలో తామే కొనసాగుతామంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్సీపీ కూడా ఈ పదవిని ఆశిస్తుండడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఫలించని ఎన్సీపీ వ్యూహం శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మాజీ మిత్రపక్షమైన శివసేనను ఇరకాటంలో పడేసేందుకు ఎన్సీపీ యత్నించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఆ తరువాత అనేక సందర్భాల్లోనూ ఇదే మాట చెప్పారు. అయితే పక్షం రోజుల్లోనే ఆయన మాట మార్చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచడం తమ బాధ్యత కాదన్నారు. ఆ తరువాత రెండు రోజులకే మరోసారి ఓ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని అనడం ద్వారా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. బీజేపీ సర్కారులో చేరడానికి శివసేన అంగీకరించడంతో ఎన్సీపీ వ్యూహం తల్లకిందులైంది. -
నేడు భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్లో ఆమె చేత ప్రమాణం చేయిస్తారని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఒక ప్రకటనలో తెలిపింది. -
మహోత్సవం మాదిరిగా ప్రమాణ స్వీకారం
ముంబై: తొలిసారిగా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఓ మహా ఉత్సవం మాదిరిగా నిర్వహించేందుకు నానాతంటాలూ పడుతోంది. దాదాపు 40 వేలమంది అతిథులు రానుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందు అశోక్ హండే నేతృత్వంలోని బృందం సంగీత విభావరి నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి లతామంగేష్కర్, అమితాబ్బచ్చన్లతోపాటు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు రానుండడంతో స్టేజీకి రూపకల్పన చేయడం కోసం ప్రముఖ కళాదర్శకుడు నితిన్ దేశాయ్‌ని రంగంలోకి దింపింది. సముద్రతీరం వద్ద వికసించిన కమలాన్ని ఏర్పాటు చేయనుంది.దీంతోపాటు వేదిక సమీపంలో భారీ ఎల్ఈడీ తెరను కూడా అమర్చనుంది. శివాజీ మహారాజు ప్రతిమను కూడా ఉంచనుంది. ప్రమాణ స్వీకారానికి ‘వాంఖడే’ ఉచితం ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా వాంఖడే స్టేడియంను వాడుకుంటున్నందుకుగాను శరద్పవార్నేతృత్వంలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) బీజేపీ వద్ద ఎటువంటి చార్జీ వసూలు చేయడం లేదు. ఈ విషయాన్ని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దయాళ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినందువల్లనే మేము వారి వద్దనుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయబోవడం లేదన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం స్టేడియంలో అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ తమను కలిశాడన్నారు. ఈ నెల 31వ తేదీన ఈ స్టేడియంలో బీజేపీ తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. సాధారణంగా ప్రమాణ స్వీకారోత్సవాలు రాజ్‌భవన్‌లోనే జరుగుతాయి. అయితే 1995లో మనోహర్ జోషి నేతృత్వంలోని కాషాయకూటమి ప్రభుత్వం శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. -
కుదిరిన ముహూర్తం 31న వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారం
కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా వాణిజ్య రాజధానికి రానున్నారు. సాక్షి, ముంబై: నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 31వ తేదీన బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్థానిక మెరీన్లైన్స్ ప్రాంతృంలోని వాంఖడే స్టేడియంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని తెలియవచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీ... ఏ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే విషయంపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠతకు మంగళవారం తెరపడనుంది. ఈ నెల 31వ తేదీన కొత్త ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రానున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులందరూ ప్రమాణ స్వీకారాత్సోవానికి హాజరుకానున్నట్టు తెలిసింది. తొలుత ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేస్తారని పేర్కొన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ సౌకర్యార్ధం కారణంగా మరో రోజు వాయిదావేశారు. దేవేంద్ర ఫడ్విస్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టాలని బీజేపీకి చెందిన అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ జెన్కో, ట్రాన్స్ కో ఎండీ విజయానంద్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు కొత్త చైర్మన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా భవానీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై గురుతర బాధ్యత పెట్టిందని, అందరి సహకారంతో ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విద్యుత్ చార్జీల భారం లేకుండా ఉండేలా కృషి చేస్తానని అన్నారు. -
అట్టహాసంగా అమరనాథ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శనివారం స్థానిక అపూర్వ కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే కళ్యాణమండపం పూర్తిగా నిండిపోయింది. చాలామందికి కూర్చోడానికి కుర్చీలు లేక నిలబడే వక్తల ప్రసంగాలు విన్నారు. వైఎస్ఆర్సీపీ కడప, చిత్తూరు జిల్లాల పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ఆకేపాటి అమర్నాథ్రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ వైస్ ైఛె ర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఆకేపాటికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డీసీసీబీ మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు మాసీమ బాబు, ఈవీ సుధాకర్‌రెడ్డి, యానాదయ్య, ఎంపీ సురేష్, జీ. చ ంద్రమోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, నిత్యానందరెడ్డి, కరీముల్లా, ఎస్ఎండీ షఫీ, బి. అమర్నాథ్రెడ్డి, మహిమలూరి వెంకటేష్, కిరణ్‌కుమార్, శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు పాకా సురేష్, చైతన్య, చల్లా రాాజశేఖర్, బోలా పద్మావతి,ఎస్ఏ షంషీర్, మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ గురుమోహన్ తదితరులు నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. -
పాక్‌లో ఉద్యమ ప్రహసనం
సంపాదకీయం: సంక్షోభాలు పాకిస్థాన్‌కు కొత్త కాదు. నిజానికి అలాంటి సంక్షోభాలు అక్కడ లేకపోవడమే వింత. ఎందుకనో నిరుడు జూలైలో గద్దె దిగిన అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వం ఒక్కటే తన పాలనాకాలాన్ని సజావుగా పూర్తిచేయగలిగింది. ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ జర్దారీ సర్కారు మినహా పాక్‌లో ఏ ఒక్క ప్రభుత్వమూ స్థిరంగా అయిదేళ్లూ పాలించలే కపోయింది. జర్దారీ కూడా చివరి రెండు సంవత్సరాలూ అక్కడి సుప్రీంకోర్టు కల్పించిన అనేక అవరోధాల వల్ల చిక్కుల్లో పడ్డారుగానీ ఆయన అర్ధాంతరంగా గద్దె దిగే పరిస్థితి రాలేదు. పాకిస్థాన్ ఇక మారిందేమో... ప్రజాస్వామ్య విలువలు ఒంటబట్టాయేమోనని అం దరూ అనుకునేంతలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. నిరుడు జూన్‌లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన పని నల్లేరు మీద నడకలా లేదుగానీ... చెప్పుకోదగిన సంక్షోభాలైతే రాలేదు. ఇన్నాళ్లకు పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ నేత తహిరుల్ ఖాద్రీల రూపంలో పెను సవాల్ ఎదురైంది. నవాజ్ షరీఫ్‌ను గద్దె దించటమే తమ లక్ష్యమంటూ వేలాదిమంది తమ అనుచరులతో ఇస్లామ్‌బాద్ లోని పార్లమెంటు భవనమున్న రెడ్ జోన్ ప్రాంతంలో వారు బైఠాయించారు. పక్షం రోజులక్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం అంతూ దరీ లేకుండా సాగుతున్నది. నిజానికి పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఉగ్రవాదం, జాతుల పోరు, అంతులేని విద్యుత్ కోతలు, అధిక ధరలు ఆ దేశాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. నవాజ్ షరీఫ్ సర్కారు ఇందులో ఏ ఒక్కదాన్నీ సరిగా పరిష్కరించలేకపోయిందన్న అసంతృప్తి అక్కడివా రిలో అంతకంతకూ పెరుగుతోంది. ఇదంతా చాలదన్నట్టు ఇస్లామా బాద్‌ను స్తంభింపజేస్తూ ఈ ఉద్యమం! లాహోర్‌లో మూడునెలల క్రితం తమ ఉద్యమంపై పోలీసులు విరుచుకుపడి 14మందిని కాల్చి చంపడంపై ఖాద్రీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఉదంతంలో ప్రధాని షరీఫ్... ఆయన సోదరుడు, పంజాబ్ ప్రా విన్స్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌లపై హత్య కేసులు నమోదు చేయాలన్నది ఖాద్రీ ప్రధాన డిమాండు. షరీఫ్ అక్రమ పద్ధతుల్లో గద్దెనెక్కారు గనుక తప్పుకోవాలన్నది ఇమ్రాన్ డిమాండు. చిత్రమేమంటే ఇద్దరి ర్యాలీలూ ఈ నెల 14నే ఇస్లామాబాద్ చేరుకున్నాయి. ఇద్దరూ ఖరీదైన, విలాసవంతమైన వాహనాల్లో కాలక్షేపం చేస్తూ ‘ప్రజాస్వామిక ఉద్యమాన్ని’ నడిపిస్తున్నారు. అందుకనే స్థానిక మీడియా దీనికి ‘కంటైనర్ ఉద్యమం’ అని ముద్దుపేరు పెట్టింది. ఇద్దరి దారులూ వేర్వేరు. ఒకరిది లౌకికవాద పార్టీ, మరొకరిది మతతత్వ పార్టీ. కానీ, ఇద్దరూ తోడుదొంగల్లా ఉద్యమాన్ని నడుపు తున్నారు. ఒకరు ఓ మెట్టుదిగితే, మరొకరు కూడా తగ్గినట్టే కనబడతారు. ఒకరు బెట్టు చేస్తే, మరొకరు కాస్సేపటికల్లా దాన్నే అనుకరిస్తారు. ‘ఇదే చివరి డెడ్‌లైన్’ అంటూ ఇప్పటికి అయిదారు సార్లు ఇద్దరూ ఒకరి వెనక ఒకరు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాక పోయేసరికల్లా దాన్ని పొడిగించడం కూడా మామూలే. ఖాద్రీ ప్రధాన డిమాండును నెరవేరుస్తూ షరీఫ్ సోదరులపై హత్య కేసులు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనుక ఆయన జారుకుంటా డేమోననుకుని గురువారం ఇమ్రాన్ సైతం తగ్గినట్టే కనబడ్డారు. అయితే, హత్య కేసులు పెట్టారు గనుక షరీఫ్ సోదరులు రాజీనామా చేయాలని ఇప్పుడు ఖాద్రీ కొత్త మెలిక పెట్టి ఉద్యమాన్ని కొనసాగిం చదల్చుకున్నట్టు ప్రకటించారు. నిరుడు జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఇమ్రానే కాదు... చాలామంది ఆరోపిస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపించాలన్న పీటీఐ డిమాండును మిగిలిన పార్టీలు కూడా సమ ర్ధిస్తున్నాయి. అయితే, ఆ పేరున ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగేలా వ్యవహరించడాన్ని అవి నిరసిస్తున్నాయి. పాక్ ప్రజానీకానికి కూడా వీరి ఉద్యమంపై సానుభూతి లేదు. పౌర వ్యవహారాల్లో తరచు జోక్యం చేసుకోవడం అలవాటైన సైన్యం అయిదేళ్లపాటు అందుకు దూరంగా ఉన్నదని, వీరి ఉద్యమాల కారణంగా మళ్లీ అది తన పాత రూపాన్ని ప్రదర్శించే ప్రమాదమున్నదని వారు ఆందోళన చెందుతు న్నారు. అయితే, ఇప్పటివరకూ తటస్థతను పాటిస్తున్న పాక్ సైన్యం జోక్యానికి సిద్ధపడొచ్చునన్న అంచనాలున్నాయి. ఉద్యమకారుల ఒత్తిళ్లకు లొంగక, కఠినంగా ఉన్నట్టు కనబడు తున్న నవాజ్ షరీఫ్ వాస్తవానికి బలహీనపడ్డారని జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఆయన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రహీల్ షరీఫ్‌ను రెండుసార్లు కలిశారంటేనే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. షరీఫ్ పగ్గాలు చేపట్టాక సైన్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించారు. పౌర ప్రభుత్వం ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి స్వల్పస్థాయిలోనైనా ఆయన కృషి చేశారు. ఆఖరికి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంలో కూడా సైన్యం మనోగతం వేరుగా ఉన్నా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి సహ జంగానే పాక్ సైన్యా నికి మింగుడు పడటంలేదు. అది అదును కోసం వేచిచూస్తున్నది. ఇమ్రాన్, ఖాద్రీల రూపంలో ఇప్పుడు వారికది సమకూడింది. నిజా నికి ఈ ఉద్యమం వెనకాల వారి ప్రోద్బలమున్నదని కూడా పాకి స్థాన్లో చాలామంది అనుమానం. మన పొరుగునున్న దేశం కనుక పాక్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడితే దాని ప్రభావం మనను కూడా తాకుతుంది. అందువల్లే అక్కడ పరిస్థితులు చక్కబడాలనీ, గత అయిదేళ్లుగా అక్కడ కుదురుకుంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరం కావాలని అందరూ కోరుకుంటారు. -
30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
రుణాలు కాదు.. వర్షాలు మాఫీ అయ్యాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ప్రజలందరి ముందు ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తయినా వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులెవరికీ రుణాలు మాఫీ కాలేదు కానీ రాష్ట్రంలో వర్షాలు మాత్రం పూర్తిగా మాఫీ అయ్యాయని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువేననే నానుడి రాష్ట్రంలో ఉందని.. ఇప్పుడదే నిజమైందని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా లేకుండా పోయిందన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల పాలన తీరును ఆయన దుయ్యబట్టారు. బాబు వస్తే ఉద్యోగం వస్తుందని ప్రచారం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం.. ‘బాబు వచ్చాడు ఉద్యోగం పోయింది’, ‘బాబు వచ్చాడు వర్షాలు పడడం లేదు’ అని అనుకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. జిల్లాల కలెక్టర్లను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముక్కుసూటిగా పనిచేయొద్దు, తమ పార్టీ కార్యకర్తలకు సహకరించమంటూ కోరిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సును ప్రస్తావిస్తూ.. ప్రపంచ చరిత్రలో ఏ పాలనాధిపతి అధికార యంత్రాంగానికి ఇలాంటి ఆదేశాలిచ్చి ఉండరని ఆయన అన్నారు. అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న వారికీ పచ్చచొక్కాలు తొడగాలని బాబు ప్రయత్నం చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
ఇందూరు : సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జడ్పీ పాలకవర్గం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించడానికి నెలన్నరగా నిరీక్షిస్తున్న జడ్పీటీసీలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులను సభ్యులకు పరిచయం చేయించా రు. డీఆర్డీఏ పీడీ వెంకటేశంతో పరిచయ కార్యక్రమం ప్రారంభించారు. డీఆర్డీఏ, జిల్లా పంచాయతీ, డ్వామా, ట్రాన్స్‌కో, వ్యవసాయ, ఉద్యాన, సంక్షేమ తదితర శాఖల అధికారులు ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలు, అవి అందించే ఫలాలను జడ్పీటీసీ సభ్యులకు వివరించారు. ఘనసన్మానం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సన్మానిం చారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కవిత, బీబీపాటిల్, కలెక్టర్ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ రాజారాం, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు తన కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. జడ్పీ కార్యాలయం వద్ద జుక్కల్, నిజాంసాగర్ మండలాలకు చెందిన అభిమానులు టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. భారీ బందోబస్తు పాలక వర్గం ఎన్నిక సందర్భంగా జిల్లా పరిషత్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే జిల్లా పరిషత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. జడ్పీ పరిసరాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేశారు. గుర్తింపు కార్డులు లేనిదే ఎవరినీ లోనికి అనుమతించలేదు. సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. -
జెడ్పీపై టీ‘ఢీ’పీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. శనివారం జరగనున్న జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు జెడ్పీ సీఈవో నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 22 స్థానాలు టీడీపీకి దక్కగా, వైఎస్ఆర్సీపీకి 16 స్థానా లు దక్కాయి. దీంతో టీడీపీకే జెడ్పీ పీఠం దక్కడం ఖాయం. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మి పేరును అధ్యక్ష పదవికి ప్రకటించినప్పటికీ, మంత్రి మండలి ఏర్పాటు తర్వాత సామాజిక సమీకరణల పేరుతో జెడ్పీని కాపు వర్గానికి ఇవ్వాలని ఒత్తిళ్లు పెరిగాయి. అధ్యక్ష పీఠం కాళింగులకే ఇస్తే.. ఉపాధ్యక్ష పదవైనా కాపులకు ఇచ్చేలా ఆ వర్గం నేతలు పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇదే పోస్టును టెక్కలి డివిజన్‌కు చెందిన మత్స్యకారులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఎన్నిక సందర్భంగా టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో చౌదరి ధనలక్ష్మికే పీఠం దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్ష పదవికి మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఈ రెండు పదవులు తమ వర్గానికే దక్కించుకోవడం ద్వారా సీనియర్ నేత కళాకు చెక్ పెట్టాలని కింజరాపు వర్గం యోచిస్తోంది. వైస్ పదవిపై మల్లగుల్లాలు చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు ఖరారైనట్లేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత కళా వెంకటరావు వర్గానికి అన్యాయం జరగకుండా ఉండేందుకు, కాపులకు కాస్తయినా సంతృప్తి కలిగించేందుకు జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు గత రెండు రోజులుగా జిల్లా టీడీపీ నేతలు పలుమార్లు మంతనాలు జరిపి నిర్ణయించినట్లు తెలిసింది. ఆ సామాజికవర్గానికి చెందిన పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు, వంగర జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావు నాయుడు, సంతకవిటి జెడ్పీటీసీ అయిన పార్టీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు భార్య పేరుతో పాటు మరో మహిళా జెడ్పీటీసీ పేరూ వినిపిస్తోంది. అయితే పార్టీలో చాలా మంది దామోదర్‌రావు పేరును వ్యతిరేకించినట్టు తెలిసింది. వేరే పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆయనకు పదవి ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చైర్మన్ పదవి మహిళకు కట్టబెట్టినప్పుడు వైస్ పదవి కూడా మహిళ కెందుకు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సోంపేట ప్రాంతానికి చెందిన మత్స్యకార సభ్యుడు కూడా వైస్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నిక జరిగేదిలా... అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నిక కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఉదయం 10 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం మధ్యాహ్నం 1 గంట- నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన మధ్యాహ్నం 3 గంటలు - జెడ్పీ తొలి సమావేశం. ఏకగ్రీవం కాకపోతే చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహణ అనంతరం.. కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షల ప్రమాణ స్వీకారం -
కొలువయ్యారు
- నగర, ‘పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం - నరసాపురం మినహా అన్నిచోట్లా ఏకగ్రీవమే సాక్షి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో పాలకవర్గా లు కొలువుతీరారు. ఏలూరులో 50 మంది కార్పొరేటర్లు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 241 మంది కౌన్సిలర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు మేయర్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక, ఆ వెంటనే ఏలూరు డెప్యూటీ మేయర్, మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వ హించారు. నరసాపురం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యూయి. రాజకీయ పార్టీల తరఫున విప్‌లను ఎన్నుకున్నారు. అన్నిచోట్లా ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం, ఎన్నికలు జరిగాయి. సారథులు వీరే : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌గా షేక్ నూర్జహాన్డెప్యూటీ మేయర్‌గా ఏడాదిన్నర కాలానికి చోడే వెంకటరత్నంను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. భీమవరం మునిసిపల్ చైర్మన్‌గా కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వైస్ చైర్మన్‌గా ముదునూరి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్‌గా బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా గొర్రెల శ్రీధర్ ఎంపికయ్యూరు. పాలకొల్లు చైర్మన్‌గా వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్‌పర్సన్‌గా కర్నేని రోజారమణి ఎన్నికయ్యూరు. తణుకు చైర్మన్‌గా దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్‌గా మంత్రిరావు వెంకటరత్నం ఎంపికయ్యారు. కొవ్వూరు చైర్మన్‌గా సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్‌గా దుద్దుపూడి రాజా రమేష్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడ వైస్‌చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. నాయకులు సర్ధిచెప్పడంతో శాంతిం చారు. నిడదవోలు చైర్మన్‌గా బొబ్బా కృష్ణమూర్తి, వైస్ చైర్మన్‌గా పేరూరి సాయిబాబా ఎన్నికయ్యారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరై పదవులు చేపట్టిన వారిని అభినందించారు. జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్‌గా బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్‌గా అట్లూరి రామ్మోహనరావును ఎన్నుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సాయంతో... నరసాపురంలో 14 వార్డులను టీడీపీ, మరో 14 వార్డులను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, మూడుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ముగ్గురు ఇండిపెండెంట్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ బలం 19కి చేరింది. దీంతో టీడీపీ నుంచి పసుపులేటి రత్నమాల చైర్‌పర్సన్‌గా, పొన్నాల నాగబాబు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
రోగులకు నమ్మకం కలిగించాలి
ఆ బాధ్యత ప్రభుత్వ వైద్యులదే ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కె.కోటపాడు : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత వైద్యులదేనని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి విచ్చేసిన ఆయన బుధవారం మధ్యాహ్నం స్థానిక 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి సేవలపై ఆరాతీశారు. మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రిలోని జనరేటర్ పనిచేయడం లేదని, దీనివల్ల ఆపరేషన్ల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వేచలపు కాసుబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ డీసీహెచ్ఎస్ నాయక్‌కు లేఖరాయాలని, దాని కాపీ తనకు ఇస్తే మంత్రితో మాట్లాడుతానని వైద్యులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈర్లె గంగునాయుడు (నాని), కొత్తల సింహాచలంనాయుడు (నవీన్), తర్రా మురళీకృష్ణ, వర్రి చినరమణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం మాడుగుల : శాసన సభలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ బూడి ముత్యాలనాయుడుకు బుధవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ సమస్యలపై దృష్టిసారిస్తానని తెలిపారు. స్వాగతం పలికిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు గొల్లవిల్లి ప్రభావతి, నాయకులు గొల్లవిల్లి సంజీవరావు, రాఖి శ్రీను, వేమవరపు వెంకటధర్మజ (పెదబాబు), కనిశెట్టి నగేష్, బొద్దపు భాస్కరరావు, తాళపురెడ్డి రాజారాం, కొట్యాడ భాస్కరరావు, రొబ్బా మహేష్, కొట్యాడ కృష్ణమూర్తి, అశోక్, సయ్యపురెడ్డి నారాయణరావు, రాజుతాత, చెల్లంనాయుడు, దాడి రాజేశ్వరరావు, గోకాడ అప్పారావు తదితరులున్నారు. -
ఇటు ఆషాఢం.. అటు మూఢం
ప్రమాణ స్వీకారాలకు సరైన ముహూర్తమేది? తెగ మదనపడిపోతున్న ‘స్థానిక’ ప్రతినిధులు కొద్ది రోజుల్లో వెలువడనున్న మార్గదర్శకాలు విశాఖ రూరల్ : ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు ఆషాడం, అనంతరం మూఢం బెంగ పట్టుకుంది. అధికార ఎడబాటుకు వచ్చే నెల మొదటి వారంలో తెరపడనున్నప్పటికీ.. నెలాఖరు నుంచి ప్రవేశిస్తున్న ఆషాడమాసం అందరినీ కలవరపెడుతోంది. ఆ తర్వాత మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. స్థానిక సమరంలో విజయం సాధించి మూడు నెలలుగా అధికార పీఠం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ.. ఇప్పుడు మరో మూడు నెలలు అధికారానికి దూరంగా ఉండాలో...ఆషాడంలో పగ్గాలు చేపట్టాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. తప్పనిసరయి ఆషాడంలో బాధ్యతలు చేపట్టాల్సి వస్తే శాంతులు ఏమైనా ఉన్నాయంటూ పూజార్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా.. జూలై మొదటి వారంలో మునిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 28 నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. అనంతరం మరో రెండు నెలలు మూఢం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ముహూర్తాలు ఉండవు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని తెగ బెంగపడిపోతున్నారు. జూలైలో ముహూర్తం జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరగాయి. మే12న ఫలితాలు వచ్చాయి. అలాగే 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు 13న వెల్లడయ్యాయి. అప్పటి నుంచి గెలిచిన అభ్యర్థులు అధికారపీఠం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఈ పరోక్ష ఎన్నికలకు అడ్డంకిగా మారాయి. రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం వీటి చైర్మన్,వైస్‌చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఈ ఎన్నికలు జరగవచ్చని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలు ఉండగా టీడీపీ 24, వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. విప్ ధిక్కరిస్తే వేటే చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశముంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీచేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియ చేతుల ఎత్తే పద్ధతిలో ఉంటుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటు చెల్లుబాటైనప్పటికీ.. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. సభ్యుని పదవి రద్దు విషయపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అనంతరం సదరు సభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికల ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే ఎన్నిక వాయిదా పడుతుంది. తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. -
కొత్త సభలో మన ఎమ్మెల్యేలు
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, ముత్తుముల అశోక్‌రెడ్డి.. కొత్త సభలో ప్రమాణస్వీకారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు శిద్దా రాఘవరావు, కదిరి బాబూరావు, దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి -
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
{పొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షంలో కాకాణి, గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి, అనిల్ కుమార్ నెల్లూరు : జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు గురువారం కొత్త రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభలో ప్రొటెం స్పీకర్ నారాయణస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవ ర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీకి చెందిన కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్రెడ్డితో కలిసి బస్‌లో అసెంబ్లీకి వచ్చారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా, టీడీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ గడప తొక్కారు. వైఎస్సార్సీపీ శాసనసభా పక్షంలో నలుగురికి చోటు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కార్యవర్గంలో జిల్లాకు చెందిన నలుగురికి చోటు లభించింది. బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం కార్యదర్శిగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యుడిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, సమన్వయకర్తగా ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం అధికార ప్రతినిధిగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. -
నవశకం
- శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ‘పశ్చిమ’ ఎమ్మెల్యేలు - ఇక జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి - స్థానిక సంస్థల విజేతల పదవీ స్వీకారానికి మార్గం సుమగం - గాడిన పడనున్న పాలన సాక్షి, ఏలూరు : నవశకం మొదలైంది. కొత్త రా ష్ట్రంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ), చింతలపూడి ఎమ్మెల్యే, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై వెంటనే దృష్టి సారించనున్నట్టు వీరంతా ముక్తకంఠంతో చెప్పారు. ఇక వీళ్ల వంతు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది. వీరంతా బాధ్యతలు చేపడితే ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన జిల్లా అభివృద్ధి గాడిన పడుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. 2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక, నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 865 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. మే 12న పురపాలక, 13న పరిషత్ ఫలితాలు వెలువడ్డాయి. నెలలు గడుస్తున్నా పాలకవర్గాలు పగ్గాలు చేపట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా నెలల తరబడి ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో పాలన గాడినపడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న చేపట్టి ఫలితాలను ప్రకటించారు. 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టాలని మందుగా నిర్ణయించారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంది. గత శాసనసభ రద్దు కావడంతో కొత్త సభ్యులు వస్తే తప్ప మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం లేకుండా పోరుుంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడంతో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు మార్గం ఏర్పడింది. గాడిన పడనున్న పాలన పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు సైతం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్లుగా మండలాలకు నిధులు విడుదలకాకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పాలకవర్గం ఏర్పడితే జనాభా ప్రాతిపదికన ప్రతి మండలానికి సాధారణ నిధులు రూ.40 లక్షల వరకూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో 75శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో 25 శాతం వాటా నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు. ఇదిలావుండగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఏర్పడింది. శాసనసభ సమావేశాలు ముగియగానే జిల్లాకు రానున్న ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ముందుగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించనున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు త్వరితగతిన తీసుకురావాలని భావిస్తున్నారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త సభ
* ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు * ఉదయం 11:50కి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు.. తర్వాత తంగిరాలకు సంతాపం * శోభానాగిరెడ్డి పేరును విస్మరించడంపై వైఎస్సార్సీపీ మండిపాటు * ఎట్టకేలకు ఎజెండాలో చేర్చిన అసెంబ్లీ అధికారులు సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ కొలువుదీరనుంది. నిజాం హయాంలో నిర్మితమైన ఈ కట్టడం ప్రస్తుతం వారసత్వ కట్టడంగా ఉంది. 1956లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసిన తరువాత అయ్యదేవర కాలేశ్వరరావు అధ్యక్షతన తొలి అసెంబ్లీ సమావేశం(1956 డిసెంబర్ 4న) ఈ భవనంలోనే జరిగింది. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక ఈ భవనం వెనుకనే కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించడంతో ఆ తరువాత నుంచి సభా కార్యక్రమాలు అక్కడికి మారాయి. అప్పట్నుంచి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించినప్పుడు మాత్రమే ఈ పాత భవనాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనతో ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పాత అసెంబ్లీ భవనం మళ్లీ వేదికగా మారుతోంది. ప్రొటెం స్పీకర్‌గా పతివాడ.. అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ అయిన పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 29, 30లు విడుదల చేశారు. ఉదయం 9.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో పతివాడ నారాయణస్వామితో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముందుగా సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఇతర సభ్యులందరితోనూ ప్రమాణాలు చేయించనున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు ఫలితాలు ప్రకటించిన నెలా మూడు రోజుల తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సంతాప తీర్మానాలు: సభ్యుల ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటీవల మరణించిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు (నందిగామ), వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ)లకు సభ సంతాపం తెలపనుంది. తొలుత విడుదల చేసిన ఎజెండాలో శోభా నాగిరెడ్డికి సంతాపం తెలిపే తీర్మానం ప్రస్తావన లేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణను కలసి తమ అభ్యంతరం తెలిపారు. శోభానాగిరెడ్డి గెలిచినా ఎన్నికకు ముందే ఆమె మరణించడంతో సాంకేతికంగా ఈ సభ సభ్యురాలిగా పరిగణించాలా? లేదా? అన్న సంశయం అధికారుల్లో ఏర్పడింది. దీంతో ఆమె పేరును సంతాప తీర్మానాల్లో చేర్చలేదని అసెంబ్లీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో పొరపాటును సరిచేసుకున్నారు. శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం అంశాన్ని చివరి నిమిషంలో అసెంబ్లీ ఎజెండాలో చేర్చారు. ఐదు రోజుల సభ.. ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు 19వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు, మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22న సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఉంటుంది. శాసన మండలి ఈ నెల 23, 24 తేదీల్లో సమావేశమవుతుంది. అక్కడ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. -
మైత్రీబంధం!
సంపాదకీయం: తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా ఇరుగుపొరుగుతో సాన్నిహిత్యానికి ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియజెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ... ఇప్పుడు తొలి విదేశీ పర్యటనకు హిమాలయ సానువుల్లో కొలువుదీరిన భూటాన్‌ను ఎంచుకుని దాన్ని మరింత దృఢంగా చాటారు. ప్రపంచంలోనే ఏకైక బౌద్ధ దేశమైన భూటాన్ పర్యావరణ పరిరక్షణను లాంఛనప్రాయంగా కాక తన పవిత్ర కర్తవ్యంగా, తన నైతిక బాధ్యతగా గుర్తిస్తున్నది. మన పూర్వీకులు మనకిచ్చిపోయిన ఈ ప్రకృతి సంపద రానున్న తరాలది కూడా అనే తత్వాన్ని నిలువెల్లా ఒంటపట్టించుకుని అందుకోసమని ఒక యజ్ఞంలా దేశంలోని కొండలను, లోయలను, అరణ్యాలను పరిరక్షించుకోవడంలో అది ముందుంటున్నది. 2005లో భూటాన్ రాజు స్వచ్ఛందంగా దేశాన్ని రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంవైపు నడిపించారు. అందుకనుగుణంగా 2008లో ఆ దేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రపంచ పటంలో వెతుక్కుంటేగానీ దొరకనంత చిన్నదిగా ఉండే ఆ దేశాన్ని తన తొలి విదేశీ పర్యటనకూ, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకూ ఎంచుకున్నప్పుడు ఈ విశిష్టతలన్నిటినీ మోడీ గమనంలోకి తీసుకునే ఉంటారు. భూటాన్‌తో మన అనుబంధం దశాబ్దాలనాటిది. ఈ అను బంధంలో చిన్న చిన్న అపశ్రుతులొచ్చిన మాట వాస్తవమే. పరస్పర అవిశ్వాసం ఏర్పడిన మాటా వాస్తవమే. కానీ మన దేశం కాస్త విశాల దృష్టితో, ముందుచూపుతో వ్యవహరించివుంటే ఈ అపశ్రుతులనూ, ఈ అవిశ్వాసాన్నీ జయించడం పెద్ద కష్టమయ్యేది కాదు. యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాలనూ అస్తవ్యస్థం చేసినట్టే భూటాన్‌తో ఉన్న చిరకాల స్నేహానికి కూడా చిల్లులు పొడిచే చర్యకు దిగింది. నిరుడు అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా హ ఠాత్తుగా ఆ దేశానికిచ్చే ఇంధన సబ్సిడీలను మన ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో వంటగ్యాస్, కిరోసిన్ ధరలు రెట్టింపై భూటాన్ ప్రజలు విలవిల్లాడారు. భారత్ అంటే ప్రాణంపెట్టే ఆ దేశంలో సామాన్యులు సైతం ఈ చర్యతో ఎంతగానో నొచ్చుకున్నారు. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కాలపరిమితి ముగిసి సబ్సిడీలన్నీ వాటికవే నిలిచిపోయాయని ఆనాటి మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సర్దిచెప్పబోయినా అది వాస్తవ పరిస్థితికి అతకలేదు. ఆ దేశం చైనాతో చెలిమికి ప్రయత్నిస్తున్నదన్న శంకే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. 2007 వరకూ ఇరుదేశాల మధ్యా అమలులో ఉన్న స్నేహ ఒడంబడిక ప్రకారం అది భారత్ ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే దౌత్య సంబంధాలను ఏర్పర్చుకుంది. మన దేశానికి తలనొప్పిగా మారిన అల్ఫా స్థావరాలను ధ్వంసంచేసి తమ గడ్డను మిలిటెంట్ కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని స్పష్టంచేసింది. దానికి ఉత్తర సరిహద్దుల్లో చైనాతో సమస్యలున్నాయి కూడా. ఆ ప్రాంతంలోని చంబీ లోయను తనకు ధారాదత్తం చేయమని చైనా కోరుతున్నా...అందువల్ల తనకొచ్చే సమస్యేమీ లేకపోయినా ఆ పని భారత్‌కు వ్యూహాత్మక సమస్యలు తెచ్చిపెడుతుందన్న భావనతో భూటాన్ అందుకు ససేమిరా అంటున్నది. అయితే, భూటాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డాక ఇరుగుపొరుగుతో సంబంధాలు సమాన గౌరవ ప్రాతిపదికగా ఉండాలన్న ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎవరు గరిష్టంగా లబ్ధిచేకూరగలరో వారితో చెలిమి చేస్తే తప్పేమిటన్న ప్రశ్నలూ వస్తున్నాయి. అటు చైనా వ్యూహం వేరు. ఈ ప్రాంతంలోని చిన్న చిన్న దేశాలకు భారత్ దూరమవుతున్న తీరును గమనించి అందువల్ల ఏర్పడుతున్న ఖాళీని తాను భర్తీ చేయాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆ రకంగా భారత్‌ను అష్టదిగ్బంధం చేయాలనుకుంటున్నది. కనుకనే భూటాన్‌ను దువ్వుతున్నది. ఒక్క పాకిస్థాన్ మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశాలుగా ఉంటున్నవే గనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే, పకడ్బందీ దౌత్యవ్యూహంతో ముందుకెళ్తే చైనా కంటే మనకే ఆ దేశాలన్నీ ప్రాముఖ్యతనిస్తాయి. నరేంద్ర మోడీ దీన్ని సరిగానే గుర్తించారు. అందువల్లే తొలి విదేశీ పర్యటనకు ఘనంగా కనబడే...ప్రచారం అధికంగా వచ్చే అమెరికానో, బ్రిటన్‌నో ఎంచుకోక భూటాన్‌పై దృష్టి సారించారు. సుసంపన్నమైన, సుదృఢమైన భారత్ వల్ల ఇరుగుపొరుగు దేశాలకే అధికంగా మేలు కలుగుతుందన్న సందేశాన్నిచ్చి ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరుచుకుందామని పిలుపునిచ్చారు. బియ్యం, గోధుమలు మొదలుకొని వంట నూనెల వరకూ భూటాన్‌కు నిషేధంనుంచి, పరిమితులనుంచి మినహాయింపునిస్తున్నట్టు మన దేశం ప్రకటించింది. అలాగే ఇక్కడ చదువుకునే భూటాన్ విద్యార్థులకిచ్చే ఉపకార వేతనం సొమ్మును రెట్టింపుచేసింది. ఇరుదేశాల భాగస్వామ్యంతో నెలకొల్పే 600 మెగావాట్ల ఖోలాంగ్సు జల విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. భూటాన్కున్న ప్రధాన ఎగుమతి వనరు జలవిద్యుత్తే. దానికి 24,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం ఉంది. అంతేకాదు...హిమాలయ దేశం గనుక మనకు విద్యుత్ అవసరాలుండే వేసవిలో దాన్ని నిరంతరాయంగా సరఫరా చే యగలదు కూడా. అదే సమయంలో 200 కోట్ల డాలర్ల భూటాన్ ఆర్ధిక వ్యవస్థ మనతో పెనవేసుకుని ఉన్నది. భూటాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చిన కొత్త ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటూ, అదే సమయంలో మన ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా అరమరికల్లేకుండా చర్చిస్తే, పారదర్శక దౌత్యాన్ని పాటిస్తే స్నేహసంబంధాలు బలపడతాయనడంలో సందేహం లేదు. నరేంద్ర మోడీ పర్యటన ఈ దిశగా ముందడుగని భావించవచ్చు. -
రావెల కార్యక్రమం రసాభాస
- బోనబోయిన వర్సెస్ గింజుపల్లి వర్గీయులు ఘర్షణ - రెండు వర్గాల వీరంగం - మంత్రి కాన్వాయ్‌ను నిలిపిన ప్రత్తిపాడు కార్యకర్తలు - సర్దుబాటు చేసిన మంత్రి విద్యానగర్/కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వచ్చిన రావెల కిషోర్ బాబుకు స్వాగతం పలికే సందర్బంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కిషోర్ బాబుకు నగరశివారులోని నాగార్జున యూనివర్సిటీనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. నగంరలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే మంత్రి కాన్వాయ్‌లో మా వాహనం ముందుండాలంటే, మా వాహనం ముందుండాలనే విషయంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరారామప్రసాద్ తనయుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది క్రమంగా శృతి మించి ఘర్షణకు దారితీసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులను వెంకటేశ్వరరావు అనుచరులు ప్రశ్నించి మంత్రి కాన్వాయ్ ముందు ఘర్షణకు దిగారు. ఒక దశలో మంత్రి కాన్వాయ్‌ను నిలిపి కార్ల బాయినెట్పైకి ఎక్కి రచ్చరచ్చ చేశారు. ఇరువర్గాలు ఆగ్రహావేశాలలో మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి, మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఘర్షణ ఎంతకీ సమసిపోకపోవడంతో మంత్రి రావెల కారు దిగి వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన వివాదంతో ఆర్టీసి బస్టాండ్ నుంచి ఇటు ఆటోనగర్‌కు, ఇటు పొన్నూరు రోడ్డు వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పాయంకు ఘన స్వాగతం
బూర్గంపాడు : పినపాక నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండల పరిధిలోని పినపాకపట్టీనగర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయంను పూలదండలు వేసి ఘనంగా ఆహ్వానించారు. పినపాకపట్టీనగర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పాయం పూజలు చేశారు. అనంతరం భారీర్యాలీగా మోరంపల్లిబంజరకు చేరుకున్నారు. ఎంపీ బంజర, లక్ష్మీపురం గ్రామాలలోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం, ముసలిమడుగు, క్రాస్రోడ్లలో మహిళలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ప్రజలను ఎమ్మెల్యే అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పాయంకు స్వాగతం పలికిన వారిలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లానాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, సోమురోశిరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, బాలి శ్రీహరి, సర్వా శ్రీహరి, పొలగాని వెంకట్రావు, కైపు వెంకట్రామిరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, గాదె నర్సిరెడ్డి, పాండవుల దర్గయ్య, గనికల లక్ష్మయ్య, ప్రసన్నకుమార్, వర్సా చెటాక్, ఎంపీటీసీలు కైపు రోశిరెడ్డి, జక్కం సర్వేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, పాటి భిక్షపతి, తుమ్మల పున్నమ్మ, సర్పంచ్‌లు బొర్రా శ్రీను, బి భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలపైనే గురి
సాక్షి, రాజమండ్రి/కార్పొరేషన్ : నిన్నగాక మొన్న కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కానేలేదు. రాజమండ్రి నగరపాలక సంస్థలో అప్పుడే పలువురు ప్రజాప్రతినిధులు వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులపై కన్నేశారు. ఎక్కడ ఏ పథకం ఉంది, దేనికెంత గ్రాంటు వస్తుంది, ఏ కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నా యి, వాటిని ఎలా తన్నుకుపోవాలి అనే అంశాలపై సర్వేలు చేసేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 15 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి కోట్లాది మం ది రాజమండ్రి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించి వెళతారు. అంతటి ప్రాశస్త్యం కలి గిన గోదావరి పుష్కరాలను ఈసారి కుంభమే ళా తరహాలో నిర్వహించాలని నేతలు, అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికోసం కోట్లాది రూపాయల నిధులు రప్పించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో వివిధ డివిజన్లలో భారీగా పనులు మంజూరవుతాయి. వాటిని చేజిక్కిం చుకుంటే ‘లైఫ్ టర్న అవుతుంద’నుకుంటూ వాటిలో వాటా కోసం పోటీ పడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంట్రాక్టర్లు చక్కర్లు కొడుతుండగా, మరికొందరు ప్రజాప్రతినిధులు తామే స్వయంగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. రంగంలోకి కాంట్రాక్టర్లు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2003 పుష్కరాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈసారి అంతకంటే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నగరంలో కూడా కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేరకు అభివృద్ధి పనులు కూడా చేయాలి. ఈ పనులపై కాంట్రాక్టర్లు కన్నేశారు. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులను మెప్పించి, అంతా కలిసి రింగై పనులను దక్కించుకునే పనిలో పడ్డారు. రూ.27 కోట్ల పనులే అందుకు నిదర్శనం ఇటీవలి ఎన్నికల ముందు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు రూ.27 కోట్ల విలువైన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. ఈ పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లంతా అప్పట్లో రెండు దఫాలుగా సమావేశమయ్యారు. బయటి కాంట్రాక్టర్లకు ఈ పనులు దక్కకుండా ఉం డేందుకు వారంతా రింగయ్యారు. ఎవరి వా టా వారికి ఇచ్చి మొత్తం పనులు పంచేసుకున్నారు. వచ్చే పుష్కరాల పనులకు కూడా ఇదే ఫార్ములా అనుసరించేందుకు కొంచెం ప్రజాప్రతినిధుల అండ, మరికొంచెం అధికారుల ఆశీర్వాదం కోసం కాంట్రాక్టర్లు తాపత్రయ పడుతున్నారు. -
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మంత్రులకు శాఖలు కేటాయిం చారు. ఈ నెల 8న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, ఆయనతో పాటు 19 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారికి ఈ రోజు శాఖలు కేటాయించారు. నారా చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయ, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కేఈ కృష్ణమూర్తి: ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు నిమ్మకాయల చినరాజప్ప: ఉప ముఖ్యమంత్రి, హోం మరియు విపత్తుల నివారణ యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు సీహెచ్. అయ్యన్నపాత్రుడు: పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి: అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, సహకార దేవినేని ఉమామహేశ్వరరావు : నీటి పారుదల, పరీవాహక ప్రాంత అభివృద్ధి మరియు జలవనరుల నిర్వహణ పి. నారాయణ: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పట్టణ నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక పరిటాల సునీత: పౌర సరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు ప్రత్తిపాటి పుల్లారావు: వ్యవసాయం, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, మత్స్య శాఖ కామినేని శ్రీనివాస్: వైద్య, ఆరోగ్యం, వైద్య విద్య గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి (ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్య) పల్లె రఘునాథరెడ్డి: సమాచార పౌరసంబంధాలు, తెలుగు భాష మరియు సంస్కృతి, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, మైనార్టీ సంక్షేమం, ఐటీ పీతల సుజాత: భూగర్భ గనులు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కింజరపు అచ్చెన్నాయుడు: కార్మిక ఉపాధి, యువత క్రీడలు, స్కిల్ డెవలప్మెంట్ సిద్ధా రాఘవరావు: రవాణా, రోడ్లు, భవనాలు కిమిడి మృణాళిని : గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిసరాల పరిశుభ్రత కొల్లు రవీంద్ర: బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ రావెళ్ల కిశోర్‌బాబు: సాంఘిక సంక్షేమం, సాధికారత, గిరిజన సంక్షేమం పైడికొండల మాణిక్యాలరావు: దేవాదాయ శాఖ -
తొలి వంచన!
సంపాదకీయం: తనకూ, విశ్వసనీయతకూ... తనకూ, నిజాయితీకీ... తనకూ, ఇచ్చిన మాటకూ సహస్రయోజనాల దూరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. తరలివచ్చిన అతిరథమహారథుల సాక్షిగా, వేలాదిమంది పార్టీ కార్యక ర్తల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా ఆదివారంనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బాబు.... ఇంతమంది ఉన్నారు కదానన్న వెరపైనా లేకుండా ఇచ్చిన మాటేమిటో, చేసిన బాసేమిటో మరచి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీ ఫైలుపై కాకుండా అందుగురించిన విధివిధానాల కమిటీ ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాదు... ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టే తొలి సంతకం చేశానని నదురు బెదురూ లేకుండా నిండు పేరోలగంలో స్వోత్కర్షకు పోయారు. రుణమాఫీకీ, రుణమాఫీపై విధివిధానాల కమిటీ ఏర్పాటుకూ మధ్య ఉన్న తేడాను జనం పోల్చలేరన్న భరోసానన్నమాట... ఎంత వంచన! ‘వస్తున్నా... మీకోసం’ అంటూ రెండేళ్లనాడు చేసిన పాదయాత్రలో ఆయన తొలి సారి రైతు రుణాలు, ఇతర రుణాల మాఫీపై ప్రకటనచేశారు. ‘వ్యవ సాయం దండగ’న్న నోటినుంచి ఇలాంటి మాట వచ్చేసరికి రైతులె వరూ నమ్మలేదు. అందువల్లే ఆయన పదే పదే అదే మాటను వల్లెవే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం దానికి చోటిచ్చారు. రుణ మాఫీని ఖచ్చితంగా అమలు చేసితీరుతామని, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని నమ్మబలికారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిననాటినుంచీ ఆయన స్వరం మారిం ది. పాదయాత్ర సమయంలో ప్రజల బాధలు చూసి రుణ మాఫీ హామీ ఇచ్చానని నసిగారు. అప్పటికింకా రాష్ట్ర విభజన నిర్ణయం జరగలేద న్నారు. ‘ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు... ఎవరికీ తెలియని పరిస్థితి’ అంటూ తన నిజరూపం బయటపెట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా గత ఏడాది జూలైలో సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానంచేశారు. అటు తర్వాత అంచెలంచెలుగా తదుపరి పరిణామాలు సంభవించాయి. చివరకు పార్లమెంటు తుది సమావేశాల్లో విభజన నిర్ణయానికి ఆమోద ముద్రపడింది. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ కాల మంతటా ఎక్కడా, ఎప్పుడూ బాబు తన రుణమాఫీ వాగ్దానాన్ని సవ రించుకోలేదు. విభజన అయిపోయింది గనుక దానికి ఫలానా మార్పు లు తెస్తామని చెప్పలేదు. పైగా ఆ ఫైలు పైనే తొలి సంతకం పెడతానని హోరె త్తారు. బంగారం రుణాలతో సహా వ్యవసాయ రుణాల్లో ఒక్క పైసా కూడా చెల్లించవద్దని ప్రచారం చేశారు. వాటన్నిటినీ అణాపైస లతో సహా రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పారు. పార్టీ తరఫున ఎలక్ట్రా నిక్ మీడియాలో మోత మోగించిన వాణిజ్య ప్రకటనల్లో కూడా ఇల్లాళ్ల పుస్తెలు, పొలం దస్తావేజులు వెనక్కొస్తాయని ఆశపెట్టారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి లక్ష లోపు రుణాలు రద్దుచేస్తామని పరిమితైనా పెట్టుకున్నారు. బాబు ఆ పనీ చేయలేదు. బాధ్యతగల నాయకుడెవరూ ఉత్తుత్తి హామీలివ్వరు. ప్రజలను వంచించి పబ్బం గడుపుకోవాలనుకోరు. ఒకపక్క ఖరీఫ్ సీజన్ వచ్చే సింది. రైతులు కొత్తగా రుణాలు తీసుకునే సమయమిది. బాబు వాగ్దా నాలు నమ్మి ఈ ఏడాది రైతన్నలెవరూ బ్యాంకు బకాయిలు చెల్లించ లేదు గనుక కొత్తగా వారికి రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. సమస్య ఇంత జటిలంగా మారిందని తెలిసికూడా బాబు బాధ్యత మరిచారు. కనీసం తాను జూన్ మొదటివారంలో ప్రమాణస్వీకారం చేసి, బ్యాంకులను ఒప్పించే బాధ్యతనైనా స్వీకరించివుంటే ఈపాటికి కొంతైనా కదలిక ఉండేది. కానీ, వారంరోజుల సమయాన్ని వృథా చేసి ఇప్పుడు ఎందుకూ కొరగాని కమిటీ ఏర్పాటు ఫైలుపై సంతకం చేయ డంలో ఆంతర్యం ఏమిటి? ఆ కమిటీ కూడా పక్షం రోజుల్లో ప్రాథమిక నివేదికను, మరో 45 రోజుల్లో తుది నివేదికనూ అందిస్తుందట. అంత వరకూ ఖరీఫ్ సీజన్ ఆగుతుందా? ఆ కమిటీ సిఫార్సుల తర్వాత బ్యాంకులు రుణాలిచ్చేవరకూ అది వేచిచూస్తుందా? ఇది రైతాంగానికి మాత్రమే కాదు...మొత్తంగా వ్యవసాయానికి, పల్లెసీమలకూ, ఆహార భద్రతకూ జరుగుతున్న దగా. అన్నం పెట్టే చేతులకు ఆసరా కల్పిస్తే ఆ రంగంపై ఆధారపడిన లక్షలమందికి పని దొరుకుతుంది. రైతును సకాలంలో పంట వేయనిస్తే ప్రతి మనిషికీ ఇంత అన్నం ముద్ద దొరుకు తుంది. అసలే ఎల్‌నినో పొంచివున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానలు సరిగా పడక కరువు రాజ్యమేలవచ్చునని భయపెడుతున్నారు. ఈ తరుణంలో కమిటీల పేరుతో కాలయాపన చేయడం క్షమార్హం కాదు. బాబు రుణమాఫీ పథకం ఆచరణ సాధ్యంకాదని ఎన్నికల ప్ర చార సమయంలోనే నిపుణులు చెప్పివున్నారు. చాలా పార్టీలు ఓటర్లను తప్పుడు వాగ్దానాలతో వంచిస్తున్నాయన్న కారణంతో ఎన్నికల సం ఘం ఈసారి మేనిఫెస్టోల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్దేశిం చింది. చేసే వాగ్దానాలకు హేతుబద్ధత లేకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో చాలామంది విభేదిం చారు. మేనిఫెస్టోలు సక్రమంగా లేకపోతే, అందులోని వాగ్దానాలను గాలికొదిలేస్తే ప్రజలే తగిన చర్య తీసుకుంటారని చెప్పారు. అది ఎలాగూ జరుగుతుంది. కానీ, ఇప్పుడు బాబు చేసిన వాగ్దానం పర్యవ సానంగా రాష్ట్రంలో సాగు మొత్తం తలకిందులయ్యే స్థితి ఏర్పడింది. అందువల్ల కమిటీల పేరుతో కాలయాపనకు స్వస్తిచెప్పి తన వాగ్దా నాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టడమే బాబు తక్షణ కర్తవ్యం. అందుకోసం కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించాలి. ఈ విషయంలో ఏ కొంచెం జాప్యంచేసినా రైతాంగానికే కాదు... మొత్తం రాష్ట్ర ప్రజలకే ద్రోహంచేసినట్టవుతుందని గుర్తించాలి. -
ఏపీ సిఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
-
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
గుంటూరు: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల విశాల ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదికపైన గవర్నర్ నరసింహన్ చంద్రబాబు చేత ప్రమాణం చేయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శాసనసభ్యుడుగా ఎన్నికైన చంద్రబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, నాగాలాండ్ ముఖ్యమంత్రులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను, హిందీనటుడు వివేక్ ఓబ్రాయ్తోపాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖులకు చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. బహిరంగ ప్రదేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందున కట్టుదిట్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు సాయంత్రం నుంచి వేదికపైన సినీకళాకారులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. -
మంత్రులెవరో?
డిప్యూటీగా నారాయణ, యనమల గవర్నర్ పదవిపై యనమల ఆసక్తి నారాయణ పట్ల పార్టీలో వ్యతిరేకత చినరాజప్ప, కేఈ పేర్లు ప్రచారంలో స్పీకర్‌గా గొల్లపల్లి సూర్యారావు? మంత్రులుగా అచ్చన్నాయుడు, పతివాడ, మృణాళిని హైదరాబాద్: చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఉప ముఖ్యమంత్రులుగా నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్లు తొలుత ఖరారయ్యాయి. అయితే యనమల మాత్రం తనకు డిప్యూటీ వద్దని, ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని కోరుతున్నారు. ఇక ఏ సభలోనూ సభ్యుడు కాని నారాయణకు ఏకంగా డిప్యూటీ ఏమిటన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచే వస్తుండటంతో ఆయన్ను మంత్రి పదవికి పరిమితం చేస్తారని కూడా వినిపిస్తోంది. అదే జరిగితే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కాపు వర్గం నుంచి డిప్యూటీగా అవకాశమిస్తారు. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కూడా డిప్యూటీ రేసులో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కింజారపు అచ్చన్నాయుడు, గౌతు శ్యామసుందర శివాజీ, విజయనగరం నుంచి పతివాడ నారాయణస్వామి, కిమిడి మృణాళిని పేర్లు తుది జాబితాలో ఉన్నాయంటున్నారు. ఈమె శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావుకు స్వయానా మరదలు. ఈమెకు పదవిస్తే ఎర్రన్నాయుడు, కళా గ్రూపులను సంతృప్తి పరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి గంటాకు నో చాన్స్ విశాఖ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి ఖాయమైంది. గంటా శ్రీనివాసరావుకు తొలి దశలో అవకాశం లేదని తెలిసింది. తూర్పు గోదావరి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలిసింది. జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావును స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి నుంచి ఎస్సీ కోటాలో పీతల సుజాత, కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావులకు మంత్రి పదవి ఖాయమైంది. కాగిత వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్లలో ఒకరికి స్థానం దక్కనుంది. గుంటూరు నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నది బాబుకు కత్తిమీద సాములా మారింది. అక్కడి నుంచి తాము చెప్పిన వారికే అవకాశమివ్వాలని టీడీపీ కార్పొరేట్ కోటరీ బాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గుంటూరు నుంచి కమ్మ వర్గానికి చెందిన కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జీవీఎస్ ఆంజనేయులు ఆశావహుల్లో ఉన్నా రు. మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనంద బాబు, రావెల కిశోర్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా రేసులో ఉన్నారు. తొలి విడతలో ప్రత్తిపాటికి చాన్స్ దక్కొచ్చంటున్నారు. ప్రకాశం నుంచి సిద్ధా రాఘవ రావు, నెల్లూరు నుంచి నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ, చిత్తూరు నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కర్నూలు నుంచి కేఈ పేర్లు ఖరారయ్యాయి. అనంతపురం నుంచి పరిటాల సునీతతో పాటు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘనాథరెడ్డి, బీకే పార్థసారథిల్లో ఒకరికి స్థానం లభిస్తుంది. అక్టోబర్‌లో విస్తరణ! తొలి విడతలో తనతో పాటు 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించినా, చివరి నిమిషంలో ఈ సంఖ్యను కుదించే అవకాశముందంటున్నారు. ఎక్కువ పదవులు ఇప్పుడే ఇచ్చేస్తే రానివారిలో తీవ్ర అసంతృప్తి రాజుకుంటుందనే ఈ యోచన చేస్తున్నారని, సెప్టెంబర్-అక్టోబర్లలో పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాల తర్వాతే విస్తరణ ఉండొచ్చని బాబు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చేరకుంటేనే మంచిదేమో: బీజేపీ బాబు మంత్రివర్గంలో బీజేపీ చేరకపోవడమే మంచిదన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైనట్టు సమాచారం. ప్రస్తుతానికి తన కేబినెట్లో ఒకరికి అవకాశం కల్పిస్తానని బాబు చెప్పారు. అయితే దీనిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ హామీలపై ప్రమాణ స్వీకారం రోజునే సంతకం చేస్తానన్న బాబు, ఇప్పుడు దానిపై కమిటీ వేయడానికే పరిమితం కావడం తదితరాల నేపథ్యంలో బీజేపీ వెనకాముందాడుతోంది. ఎన్నికల హామీలను అమ లు చేయలేకపోతే దాని ప్రభావం మంత్రివర్గంలో చేరినందుకు తమపైనా తీవ్రంగా ఉంటుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక కేంద్రంలో బీజేపీ సహకరించని కారణంగానే హామీలను అమలు చేయలేకపోయానని బాబు చెబితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మథనపడుతున్నట్టు సమాచారం. -
అట్టహాసంగా ప్రమాణ ఏర్పాట్లు
-
ముహూర్తంపై టీడీపీ మల్లగుల్లాలు
-
బాబూ.. అంత ఆర్భాటం అవసరమా?
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి: పద్మరాజు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేంటని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుణాలమాఫీ కోసం భారీగా వెచ్చించాల్సిన సమయంలో ఈ హంగులెందుకన్నారు. నిరాడంబరంగా ముగించాల్సిన కార్యక్రమం హడావుడి, ఆర్భాటాల మధ్య నిర్వహించనుండడం శోచనీయమన్నారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు రైతులకు స్పష్టత ఇవ్వాలని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మాఫీ అమలు చేయాల్సిన అవసరం ఉందని పద్మరాజు అన్నారు. కాగా, సరైన మౌలిక సదుపాయాలు లేవన్న కారణంగా సుమారు 700 వైద్య సీట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్న విషయమై ఎంసీఐ పునరాలోచించాలని పద్మరాజు విజ్ఞప్తి చేశారు. సీట్లు రద్దయితే విద్యార్థులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందని, వాళ్లకు ఉపశమనం కల్పించేందుకు ఎంసీఐ మరోమారు పరిశీలించాలని, ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలన్నారు. -
19 లేదా 23 నుంచి ఏపీ అసెంబ్లీ భేటీ
* ముహూర్తంపై టీడీపీ మల్లగుల్లాలు * ఎన్నికల ఫలితాలు వచ్చి ఈ 16కు నెల పూర్తి * ఈ లోగా ఆంధ్రా అసెంబ్లీ సమావేశం లేనట్లే * 12వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ భేటీ! * ఆ తర్వాత రెండు రోజులు సెలవు దినాలు * 16 లేదా 23 తేదీల్లో ముహూర్తం నిర్ణయం * ప్రొటెం స్పీకర్ ఎంపికపై టీడీపీ నేతల చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలపై అధికార తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడం, పైగా విభజనానంతర అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు కావడంతో మంచి ముహూర్తాల కోసం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం తెలిసిందే. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణాల కోసం కూడా టీడీపీ నేతలు పండితులతో చర్చించి ముహూర్తాన్ని నిర్ణయించారు. 8వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రమాణం చేయాలని ముందు నిర్ణయించినా దాన్ని తరువాత అదే రోజు సాయంత్రానికి మార్చారు. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ తొలి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు గత నెల 16వ తేదీనే వెలువడినా రాష్ట్ర విభజనకు సంబంధించి అపాయింటెడ్ డే జూన్ రెండో తేదీ వరకు ఉండడంతో ఎమ్మెల్యేల ప్రమాణాలకు వీలు లేకుండాపోయింది. ఆ తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తం 8వ తేదీగా నిర్ణయించడంతో సభ్యుల ప్రమాణాలకు మరిన్ని రోజులు ఆగక తప్పడం లేదు. ఈ నెల 16వ తేదీ నాటికి ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తవుతాయి. ఆలోగా ప్రమాణాలు చేయడానికి టీడీపీ నేతలకు సరైన ముహూర్తాలు కుదరడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 9న ప్రారంభమై 12వ తేదీ వరకు జరగనుంది. ఈ తేదీల్లో ఏపీ అసెంబ్లీనీ సమావేశపరిస్తే రెండు ప్రాంతాల సభ్యులు, మంత్రులు ఒకేసారి రావడం, ఇప్పుడున్న వసతులు అరకొరగా ఉండడంతో గందరగోళ పరిస్థితులు తలె త్తనున్నాయి. 14, 15 తేదీలు సెలవు దినాలు. దీంతో 16వ తేదీ తరువాతే ఏపీ అసెంబ్లీని సమావేశపర్చే వీలుంది. ఈ రోజుల్లో మంచి ముహూర్తాలు ఏమున్నాయా? అని అధికార టీడీపీ సీనియర్ నేతలు పండితులతో చర్చిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ చవితి కావడం, 17వ తేదీ తిథి పంచమి అయినా ఆ రోజు మంగళవారం కావడంతో అదీ సమావేశాలకు పనికిరాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు కలసిన సమయంలోనూ అసెంబ్లీ సమావేశాల తేదీలపై ప్రస్తావన వచ్చింది. 15, 16, 17 తేదీల్లో తనకు వేరే షెడ్యూల్ కార్యక్రమాలున్నాయని, ఆ తరువాత తేదీల్లో సమావేశం పెట్టుకోవాలని బాబుకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు తదుపరి ముహూర్తాలపై దృష్టి సారించారు. 19న సప్తమి మంచి ముహూర్తమని, అది కాదనుకుంటే 23వ తేదీ ఏకాదశి ఉంది కనుక ఆ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున అసెంబ్లీని సమావేశపరిస్తే మంచిదని పండితులు టీడీపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతున్నందున ఈ లోగానే అసెంబ్లీని సమావేశపరిచాలని భావిస్తున్నారు. ప్రొటెం స్పీకర్ ఎవరో..! అసెంబ్లీలో సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్నది టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత సభకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తుంటారు. ప్రస్తుత సభలో కె.ఇ.కృష్ణమూర్తి (డోన్), పతివాడ నారాయణస్వామినాయుడు (నెలిమర్ల)లు ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. వీరిద్దరూ చంద్రబాబు కేబినెట్లో బెర్తులను ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో మంత్రిపదవికి అవకాశం లేని వారిని ప్రొటెం స్పీకర్‌గా చేయనున్నారు. ఒకవేళ ఇద్దరికీ కేబినెట్లో చోటు దక్కితే కనుక వేరొకరిని ఎంపికచేయాలి. ఈ ఇద్దరి తరువాత ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులు ఉన్నారు. వీరూ కేబినెట్ పదవులను కోరుకుంటుండటంతో ఎవరిని ఎంపికచేస్తారన్నది సందిగ్ధంగా మారింది. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనందున ఆయనను ప్రొటెం స్పీకర్ చేయవచ ్చని చెప్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని ఎంపికచేయనున్నారో ముందుగా తనకు సమాచారం ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ టీడీపీ నేతలకు సూచించారు. -
ముగిసిన ఎంపీల ప్రమాణం
మంత్రులను పరిచయం చేసిన మోడీ న్యూఢిల్లీ: నూతన లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసింది. గురువారం రికార్డు స్థాయిలో ఏకంగా 510 మంది ఎంపీలు ప్రమాణం చేయడం తెలిసిందే. మిగతా వారిలో అత్యధికులు శుక్రవారం ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బి.వి.పాటిల్, టీడీపీకి చెందిన నరమల్లి శివప్రసాద్ తదితరులు వీరిలో ఉన్నారు. ఆర్జేడీకి చెందిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్, ఆయన భార్య రంజిత్ రంజన్ (కాంగ్రెస్) ప్రమాణం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచారు. మొత్తం వ్యవహారాన్ని సజావుగా జరిపించారంటూ ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్, లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్‌లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. ఒకే రోజులో ఏకంగా 510 మందితో ప్రమాణం చేయించడం ద్వారా శ్రీధరన్ రికార్డు సృష్టించారన్నారు. స్పీకర్ ఎన్నిక జరిగిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సభ్యులను లోక్‌సభకు పరిచయం చేశారు. విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) పీయూష్ గోయల్ మినహా రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితర 43 మంది మంత్రులనూ పేరుపేరునా పరిచయం చేశారు. ఆ క్రమంలో నిజానికి గోయల్ పేరును కూడా మోడీ పిలిచారు. ఆయన సభలో లేరంటూ కాంగ్రెస్ సభ్యులంతా గట్టిగా అరవడంతో, అలాగైతే ఆయనను మరోసారి పరిచయం చేస్తానన్నారు. పాల్ తడబడ్డ వేళ... బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబడ్డ వైనం సభలో నవ్వులు పూయించింది. అందరి మాదిరిగానే ఆయనకు కూడా లోక్‌సభ సిబ్బంది ప్రమాణ పాఠం ప్రతిని అందించగా, వద్దంటూ తిరస్కరించి సొంతగానే ప్రమాణం చేయడం మొదలు పెట్టారు. కానీ కొంతమేరకు పలికాక ఆపై గుర్తుకు రాక నీళ్లు నమిలారు. చివరికి సిబ్బందిని పిలిచి ముద్రిత ప్రతిని అడిగి తీసుకుని, దాంట్లో చూస్తూ ప్రమాణం పూర్తి చేయాల్సి వచ్చింది. ఆయన పాట్లను ఇతర సభ్యులు ఆద్యంతం నవ్వుతూ గమనించారు. చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్న పాల్ ఇటీవలి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని దోమరియాగంజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ విషయమై అంతకుముందు ఉదయం కూడా సభలో పలువురు సభ్యులు పాల్‌ను సరదాగా ఆట పట్టించడం కన్పించింది. ‘ఏమండీ పాల్ గారూ! మీరిప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సరదాగా అడిగారు. దానికాయన ‘మీ పార్టీలోనే’ అంటూ అంతే సరదాగా బదులిచ్చారు. ఎంతైనా మీరు ఒక్క రోజు ముఖ్యమంత్రి కదా అంటూ పాల్‌ను బెనర్జీ మరింతగా ఆటపట్టించి అందరినీ నవ్వించారు -
అట్టహాసంగా ప్రమాణ ఏర్పాట్లు
* వేదిక వెనుక నాలుగు హెలిపాడ్ల ఏర్పాటు * ఢిల్లీ వీఐపీలు, అతిథులు, పాత్రికేయుల కోసం రెండు ప్రత్యేక విమానాలు * హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు * పూర్తికావచ్చిన పనులు.. నేటి సాయంత్రానికి ప్రాంగణం సిద్ధం * విజయవాడ - గుంటూరు హైవేపై ఒక లైన్ మొత్తం వీఐపీలకే * బాబు ప్రమాణ స్వీకార సభకు ప్రధాని నరేంద్రమోడీ రావట్లేదు: బీజేపీ సాక్షి, విజయవాడ/హైదరాబాద్: విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు సమీపంలోని కాజ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ ప్రాంగణంలో వేదిక నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 480 అడుగుల వేదికకు నాలుగు వైపులా బారికేడ్లు నిర్మించడంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణం, వీఐపీ గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీ, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో నాలుగు హెలిపాడ్లను నిర్మించారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వస్తున్న పలువురు ప్రముఖులు సొంతంగా ప్రత్యేక విమానాల్లో వస్తుండగా.. మరికొందరికీ టీడీపీ విమానాలను ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చే అతిథులు, పాత్రికేయుల కోసం రెండు విమానాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారి సౌకర్యార్థం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీలు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు.. గుంటూరు నుంచి విజయవాడ వరకు, గుంటూరు, విజయవాడ నగరాల్లో టీడీపీ శ్రేణులు భారీగా స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. రెండు నగరాల మధ్య వున్న జాతీయ రహదారి డివైడర్లలో టీడీపీ జెండాలతో భారీగా అలంకరించారు. వేదిక ఏర్పాట్లు శనివారం సాయంత్రానికే పూర్తికానున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, బి రామాంజనేయులు, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌లు పనులను పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయంలో భద్రత... చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర వీఐపీలు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి వస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు భద్రత చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో పలు శాఖల అధికారులు విమానాశ్రయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఎంట్రీపాస్ ఉన్న కార్లనే విమానాశ్రయంలోకి అనుమతించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, అధికారులు మినహా ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తిరిగివెళ్లే వీఐపీలకు భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా టెంట్లు వేయడంతోపాటు ఫ్యానులు, లైట్లు తదితర సదుపాయాలను సమకూర్చాలని చెప్పారు. ముఖ్యంగా వీఐపీల రాకపోకల కోసం విమానాశ్రయం నుంచి గుంటూరు జిల్లాలోని సభాప్రాంగణం వరకు జాతీయ రహదారి రెండు లైన్లులో ఒక లైనును కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ రూట్లో వీఐపీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారన్నారు. పోలీసు సిబ్బంది ఆకలి కేకలు... ఆదివారం రాత్రి 7.27 నిమిషాలకు చంద్రబాబు బహిరంగసభ వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో పోలీసులు బందోబస్తు విధులకు హాజరు కావాల్సి ఉంది. సీమాంధ్రలోని అన్ని రేంజిల పరిధిలోని సుమారు 8,568 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. పోలీస్ బలగాలను శుక్రవారం మధ్యాహ్నానానికే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తరలించారు. స్థానిక అధికారులు వర్సిటీలోని రెండు బ్లాకులు తీసుకుని ఒక్కొక్క తరగతి గదిని 50 మంది పోలీసులకు రాత్రి బసకు కేటాయించారు. అయితే.. వారందరికీ భోజనం ఏర్పాట్లు చేయకపోవటం, పులిహోర, పెరుగు ప్యాకెట్లు కానీ పంపిణీ చేయకపోవడంతో ఆకలితో గడపాల్సి వచ్చింది. బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు... బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్ హైదరాబాద్‌లో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజనాథ్సింగ్, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, రవిశంకర్ప్రసాద్లతో సహా సుమారు పది మంది కేంద్రమంత్రులు వస్తున్నారని చెప్పారు. పార్టీ సీనియర్ నేత అద్వానీ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. అలాగే.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ (మధ్యప్రదేశ్), రమణ్‌సింగ్ (ఛత్తీస్‌గఢ్), ప్రకాశ్‌సింగ్‌బాదల్ (పంజాబ్), మనోహర్‌పారికర్ (గోవా) హాజరుకానున్నట్టు తెలిపారు. ఒడిశా, తమిళనాడు సీఎంలు నవీన్‌పట్నాయక్, జయలలిత హాజరవుతారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పుల్లారావు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. గవర్నర్‌తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అందిన ఆహ్వానం నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యూరు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను, ఎవరెవరు హాజరుకానున్నదీ వివరించారు. ఇదిలావుంటే వేదపండితుల సూచన మేరకు చంద్రబాబు హైదరాబాద్ నగర శివార్లలోని సొంత ఫాంహౌజ్‌లో ఒక రాత్రి నిద్ర చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లారు.