సంపాదకీయం: సంక్షోభాలు పాకిస్థాన్‌కు కొత్త కాదు. నిజానికి అలాంటి సంక్షోభాలు అక్కడ లేకపోవడమే వింత. ఎందుకనో నిరుడు జూలైలో గద్దె దిగిన అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వం ఒక్కటే తన పాలనాకాలాన్ని సజావుగా పూర్తిచేయగలిగింది. ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ జర్దారీ సర్కారు మినహా పాక్‌లో ఏ ఒక్క ప్రభుత్వమూ స్థిరంగా అయిదేళ్లూ పాలించలే కపోయింది. జర్దారీ కూడా చివరి రెండు సంవత్సరాలూ అక్కడి సుప్రీంకోర్టు కల్పించిన అనేక అవరోధాల వల్ల చిక్కుల్లో పడ్డారుగానీ ఆయన అర్ధాంతరంగా గద్దె దిగే పరిస్థితి రాలేదు. పాకిస్థాన్ ఇక మారిందేమో... ప్రజాస్వామ్య విలువలు ఒంటబట్టాయేమోనని అం దరూ అనుకునేంతలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.
నిరుడు జూన్‌లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన పని నల్లేరు మీద నడకలా లేదుగానీ... చెప్పుకోదగిన సంక్షోభాలైతే రాలేదు. ఇన్నాళ్లకు పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ నేత తహిరుల్ ఖాద్రీల రూపంలో పెను సవాల్ ఎదురైంది. నవాజ్ షరీఫ్‌ను గద్దె దించటమే తమ లక్ష్యమంటూ వేలాదిమంది తమ అనుచరులతో ఇస్లామ్‌బాద్ లోని పార్లమెంటు భవనమున్న రెడ్ జోన్ ప్రాంతంలో వారు బైఠాయించారు. పక్షం రోజులక్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం అంతూ దరీ లేకుండా సాగుతున్నది.
నిజానికి పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఉగ్రవాదం, జాతుల పోరు, అంతులేని విద్యుత్ కోతలు, అధిక ధరలు ఆ దేశాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. నవాజ్ షరీఫ్ సర్కారు ఇందులో ఏ ఒక్కదాన్నీ సరిగా పరిష్కరించలేకపోయిందన్న అసంతృప్తి అక్కడివా రిలో అంతకంతకూ పెరుగుతోంది. ఇదంతా చాలదన్నట్టు ఇస్లామా బాద్‌ను స్తంభింపజేస్తూ ఈ ఉద్యమం! లాహోర్‌లో మూడునెలల క్రితం తమ ఉద్యమంపై పోలీసులు విరుచుకుపడి 14మందిని కాల్చి చంపడంపై ఖాద్రీ ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఉదంతంలో ప్రధాని షరీఫ్... ఆయన సోదరుడు, పంజాబ్ ప్రా విన్స్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌లపై హత్య కేసులు నమోదు చేయాలన్నది ఖాద్రీ ప్రధాన డిమాండు. షరీఫ్ అక్రమ పద్ధతుల్లో గద్దెనెక్కారు గనుక తప్పుకోవాలన్నది ఇమ్రాన్ డిమాండు. చిత్రమేమంటే ఇద్దరి ర్యాలీలూ ఈ నెల 14నే ఇస్లామాబాద్ చేరుకున్నాయి. ఇద్దరూ ఖరీదైన, విలాసవంతమైన వాహనాల్లో కాలక్షేపం చేస్తూ ‘ప్రజాస్వామిక ఉద్యమాన్ని’ నడిపిస్తున్నారు. అందుకనే స్థానిక మీడియా దీనికి ‘కంటైనర్ ఉద్యమం’ అని ముద్దుపేరు పెట్టింది. ఇద్దరి దారులూ వేర్వేరు. ఒకరిది లౌకికవాద పార్టీ, మరొకరిది మతతత్వ పార్టీ. కానీ, ఇద్దరూ తోడుదొంగల్లా ఉద్యమాన్ని నడుపు తున్నారు. ఒకరు ఓ మెట్టుదిగితే, మరొకరు కూడా తగ్గినట్టే కనబడతారు. ఒకరు బెట్టు చేస్తే, మరొకరు కాస్సేపటికల్లా దాన్నే అనుకరిస్తారు. ‘ఇదే చివరి డెడ్‌లైన్’ అంటూ ఇప్పటికి అయిదారు సార్లు ఇద్దరూ ఒకరి వెనక ఒకరు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాక పోయేసరికల్లా దాన్ని పొడిగించడం కూడా మామూలే. ఖాద్రీ ప్రధాన డిమాండును నెరవేరుస్తూ షరీఫ్ సోదరులపై హత్య కేసులు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. కనుక ఆయన జారుకుంటా డేమోననుకుని గురువారం ఇమ్రాన్ సైతం తగ్గినట్టే కనబడ్డారు. అయితే, హత్య కేసులు పెట్టారు గనుక షరీఫ్ సోదరులు రాజీనామా చేయాలని ఇప్పుడు ఖాద్రీ కొత్త మెలిక పెట్టి ఉద్యమాన్ని కొనసాగిం చదల్చుకున్నట్టు ప్రకటించారు.
నిరుడు జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఇమ్రానే కాదు... చాలామంది ఆరోపిస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపించాలన్న పీటీఐ డిమాండును మిగిలిన పార్టీలు కూడా సమ ర్ధిస్తున్నాయి. అయితే, ఆ పేరున ప్రజాస్వామిక ప్రక్రియకు విఘాతం కలిగేలా వ్యవహరించడాన్ని అవి నిరసిస్తున్నాయి. పాక్ ప్రజానీకానికి కూడా వీరి ఉద్యమంపై సానుభూతి లేదు. పౌర వ్యవహారాల్లో తరచు జోక్యం చేసుకోవడం అలవాటైన సైన్యం అయిదేళ్లపాటు అందుకు దూరంగా ఉన్నదని, వీరి ఉద్యమాల కారణంగా మళ్లీ అది తన పాత రూపాన్ని ప్రదర్శించే ప్రమాదమున్నదని వారు ఆందోళన చెందుతు న్నారు. అయితే, ఇప్పటివరకూ తటస్థతను పాటిస్తున్న పాక్ సైన్యం జోక్యానికి సిద్ధపడొచ్చునన్న అంచనాలున్నాయి.
ఉద్యమకారుల ఒత్తిళ్లకు లొంగక, కఠినంగా ఉన్నట్టు కనబడు తున్న నవాజ్ షరీఫ్ వాస్తవానికి బలహీనపడ్డారని జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఆయన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రహీల్ షరీఫ్‌ను రెండుసార్లు కలిశారంటేనే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. షరీఫ్ పగ్గాలు చేపట్టాక సైన్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించారు. పౌర ప్రభుత్వం ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి స్వల్పస్థాయిలోనైనా ఆయన కృషి చేశారు.
ఆఖరికి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడంలో కూడా సైన్యం మనోగతం వేరుగా ఉన్నా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి సహ జంగానే పాక్ సైన్యా నికి మింగుడు పడటంలేదు. అది అదును కోసం వేచిచూస్తున్నది. ఇమ్రాన్, ఖాద్రీల రూపంలో ఇప్పుడు వారికది సమకూడింది. నిజా నికి ఈ ఉద్యమం వెనకాల వారి ప్రోద్బలమున్నదని కూడా పాకి స్థాన్‌లో చాలామంది అనుమానం. మన పొరుగునున్న దేశం కనుక పాక్‌లో ప్రజాస్వామ్యం బలహీనపడితే దాని ప్రభావం మనను కూడా తాకుతుంది. అందువల్లే అక్కడ పరిస్థితులు చక్కబడాలనీ, గత అయిదేళ్లుగా అక్కడ కుదురుకుంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరం కావాలని అందరూ కోరుకుంటారు.
పాక్‌లో ఉద్యమ ప్రహసనం
Published Fri, Aug 29 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement