ఇస్లామాబాద్: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఊహించని రీతిలో సత్తా చాటుతున్న పీటీఐ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 272 స్థానాలకుగానూ ఎన్నికలు జరగ్గా.. దాదాపు 120 సీట్ల ఆధిక్యంతో పీటీఐ దూసుకుపోతోంది. ఇమ్రాన్ దెబ్బకు పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎమ్‌లు విలవిలలాడిపోతున్నాయి.
ఇమ్రాన్ ఘనత.. ఇదిలా ఉంటే ఫలితాల్లో మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించారు. మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆయన ఘన విషయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పీఎంఎల్-ఎన్ పార్టీ కంచుకోటగా ఉన్న రావల్పిండిలో ఇమ్రాన్ జెండా ఎగరేయటం చర్చనీయాంశంగా మారింది. అధికారం దిశగా ఫలితాలు పీటీఐకు అనుకూలంగా వస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
సయీద్‌కు షాక్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. సయీద్ ‘అల్లాహో అక్బర్‌తెహరిక్ పార్టీ’ని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈ పార్టీ మద్ధతుదారులు కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా, వాళ్లు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. NA-3 స్వాట్‌లో షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఓటమి పాలయ్యాడు. అక్కడ పీటీఐ అభ్యర్థి సలీం రెహమాన్ జయకేతనం ఎగరవేశాడు. NA-200 లార్కానా లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెనకంజలో ఉన్నారు. ఎంఎంఏ రషీద్ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిలావల్ తండ్రి అసిఫ అలీ జర్దారీ NA-213 నవాబ్‌షా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మొత్తం 272 స్థానాలకు గానూ ఎన్నికలు జరగ్గా, మ్యాజిక్ ఫిగర్ 137. ఒకవేళ పీటీఐకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.
ఫలితాలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అవకతవకల ఆరోపణలపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి ముహమ్మద్ రాజా వాటిని ఖండించారు. ఫలితాలు ఆలస్యం కావటం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సాయంత్రంకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment