ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు.
శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి.
మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది.
అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment