Pakistan election
-
పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్ క్లియర్!.. ప్రధాని ఆయనేనా?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పాక్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపిస్తున్న వేళ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అధికార ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య డీల్ కుదిరింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒప్పందంతో వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మార్చి తొమ్మిదో తేదీలోగా పాక్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని న్యూస్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది. ఇక, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
గెలిచింది నేను కాదు, నాకొద్దీ సీటు
కరాచీ: ఎన్నికల పందేరంలో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిసిపట్టాలనే నేతలున్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెబుతున్నా ఒక పాకిస్తాన్ నేత ‘నాకు ఇలాంటి గెలుపు వద్దే వద్దు’ అని తెగేసి చెప్పారు. రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా తనను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కుండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతోపాటు నాలుగు ప్రావిన్షియల్(అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో పీఎస్–129 నియోజకవర్గం నుంచి జామాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉర్ రెహ్మాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసుల్లో జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేత, స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిల్చారు. సైఫ్‌కు 31,000 ఓట్లు రాగా, రెహ్మాన్‌కు 26,000 ఓట్లు పడ్డాయి. అయితే పీటీఐ నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సైఫ్‌కు కేవలం 11,000 ఓట్లు పడ్డట్లు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహా్మన్ను విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెల్సి రెహా్మన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టిమరీ తన ధర్మాగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘‘ అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజాతీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వారికి ఎక్స్‌ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేను. విజేతకే విజయం దక్కాలి’’ అని అన్నారు. రెహ్మాన్ నిజాయతీ చూసి అక్కడి వాళ్లు మెచ్చుకున్నారు. అయితే ఈ ఉదంతంపై పాక్ ఎన్నికల సంఘం మరోలా స్పందించింది. ‘‘ రిగ్గింగ్ అవాస్తవం. ఇలాంటి ఫిర్యాదులపై దృష్టి పెడతాం’’ అని పేర్కొంది. ఈ ఘటనపై త్వరలోనే స్పందిస్తామని పీటీఐ తెలిపింది. -
Pakistan General Elections 2024: పాకిస్తాన్లో హంగ్
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి. -
Pakistan Elections: పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్థాన్ ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ప్రతి ఫలితం తామే అఖండ మెజారిటీతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నాయంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించింది. ఈమేరకు పీటీఐ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ ప్రజల స్పష్టమైన తీర్పును తారుమారు చేస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘనలు జరిగిప్పటికీ, పోలింగ్ రోజున భారీ ఓటింగ్ జరిగింది. ప్రతి ఫలితం పీటీఐ భారీ గెలుపును సూచిస్తోంది. ఫారం 45లే ఎన్నికల ఫలితాలకు ప్రాథమిక మూలం. మా పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఆ ఫారం కాపీలు మేము భారీ మెజారిటీతో గెలిచినట్లు చూపుతున్నాయి. అయితే రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47లతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు" అని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పీటీఐ పార్టీ ఆరోపించింది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెలిపింది. రిగ్గింగ్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. ఫలితాల ట్రెండ్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాణ్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ పీఎంఎల్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది. కాగా, పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. మిగతా 70 సీట్లను మైనార్టీలు, మహిళలకు కేటాయించారు. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
పాక్‌లో ఎన్నికల ప్రహసనం
సైన్యం పడగనీడలో ఎన్నికల తంతుకు పాకిస్తాన్ సిద్ధమైంది. జాతీయ అసెంబ్లీకి గురువారం జరిగే పోలింగ్‌లో గెలిచేదెవరో ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎప్పటిలాగే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకొచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సైన్యం ఆగ్రహంతో వుంది. ఫలితంగా పదవి కోల్పోయి రెండు అవినీతి కేసుల్లో పదేళ్లు, పద్నాలుగేళ్ల్ల చొప్పున శిక్షపడి ఆయన జైలుపాలయ్యారు. చట్టవిరుద్ధంగా పెళ్లాడిన కేసులో మరో ఏడేళ్ల శిక్ష కూడా పడింది. భార్య సైతం ఈ కేసులో జైలుకు పోయారు. ఎలాగైతేనేం సకాలంలోనే ఎన్నికల తంతు మొదలైంది. ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఏటికి ఎదురీదుతోంది. పీటీఐకి న్యాయస్థానాల పుణ్యమా అని బ్యాట్ గుర్తు గల్లంతుకాగా, పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలో వున్నారు. పీటీఐ అభ్యర్థినని చెప్పుకున్నవారిని సైన్యం అరెస్టు చేసింది. వారి ఇళ్లపై దాడులకు తెగబడింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన వెంటనే అజ్ఞాతంలోకి పోగా, ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థుల కుటుంబాలకు సైతం వేధింపులు తప్పలేదు. కొందరు అభ్యర్థులు పీటీఐతో తెగదెంపులు చేసుకున్నామని ప్రకటించి, బతుకుజీవుడా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొన్న జరిగిన పీటీఐ ఎన్నికల ప్రచారసభలో వేదికపై రెండు డజన్లమంది బిక్కుబిక్కుమని కూర్చోగా, ఆ సభకు కనీసం మైక్ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదనీ, పోస్టర్లు వేయనీయలేదనీ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం. యధాప్రకారం ఇక్కడి అభ్యర్థి కూడా కేసుల్లో చిక్కుకుని పరారీలో వున్నాడు. ఇమ్రాన్ ఖాన్‌ను అందలం ఎక్కించిన 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించిందిగానీ, పాక్ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుడయ్యాక ఆయన సైన్యాన్ని తూర్పారపట్టడం మొదలెట్టారు. రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని ‘అధికార వ్యవస్థ’ పదం చాటున నిందించటం అలవాటు. ఇమ్రాన్ ఆ సంప్రదాయానికి స్వస్తిపలికారు. నేరుగా సైన్యాన్నీ, దాని అధినేతలనూ ఉద్దేశిస్తూ దూషించారు. పైగా నిరుడు మే నెలలో ఇమ్రాన్‌కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకుంది. ఊహకందని రీతిలో సైనిక కార్యాలయాలపైనా, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైనా యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాలు చేయటం సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగంలో వున్న రెండు ప్రధాన పక్షాలు– మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్–ఎన్), మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీవుండటం ఆనవాయితీ. ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ నెగ్గిన 2018 ఎన్నికలొక్కటే దీనికి మినహాయింపు. చెప్పాలంటే ఇతరులకన్నా పీపీపీ చాలా ముందుగా ఎన్నికల బరిలోకి దిగింది. విస్తృతంగా ప్రచారం చేసింది. మొదట్నుంచి బలంగా వున్న సింద్ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీ బలహీనపడింది. ప్రచారావకాశాలు బొత్తిగా లేని పీటీఐకి యువత బలమైన శక్తిగా వున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు సాగిస్తున్న ప్రచారం రెండు పార్టీలనూ బెంబేలెత్తిస్తున్నది. పాకిస్తాన్లో మరీ ముఖ్యంగా... బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాల్లో భారీయెత్తున హింస చోటుచేసుకున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించటాన్నిబట్టి ఈ ఎన్నికల సరళి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులకు ఈసారి పెద్దగా చోటు దక్కలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అంటున్నది. ఈ విషయంలో మీ సంజాయిషీ ఏమిటని పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి ఆ సంస్థ తాఖీదులు పంపింది. పాకిస్తాన్ పార్లమెంటులో మహిళా కోటా 22 శాతం వుంది. దీంతోపాటు చట్టప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5 శాతం స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు మూడూ ఈ విషయంలో మొహం చాటేశాయి. ఎన్నికలు, గెలుపోటముల సంగతలావుంచితే... రాబోయే ప్రభుత్వానికి చాలా సవాళ్లున్నాయి. నిరుడు మే నెలలో పాకిస్తాన్ దాదాపు దివాలా అంచులకు చేరింది. ఆఖరి నిమిషంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 300 కోట్ల డాలర్ల రుణం అందించి ఆదుకుంది. ఆ సాయం కూడా వచ్చే నెలాఖరుతో ఆగిపోతుంది. దాన్ని పొడిగించేలా చూసుకోవటం, అందుకు సంస్థ విధించబోయే షరతులకు తలొగ్గటం కొత్త పాలకులకు తప్పనిసరి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న ప్రజానీకంలో ఇది మరింత నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక రంగానికి కూడా సహకారం అందకపోవచ్చు. మన దేశంతో ఆది నుంచీ పాకిస్తాన్‌ది శత్రుపూరిత వైఖరే. దీనికితోడు దశాబ్దాలుగా పాక్‌లో వుంటున్న వేలాదిమంది అఫ్గాన్ పౌరులను నిరుడు వెనక్కి పంపటంతో తాలిబన్ పాలకులతో తగాదాలు మొదలయ్యాయి. ఇవన్నీ దేశంలో మిలిటెన్సీ మరింత పెరగటానికి దోహదపడతాయి. వీటిని ఒడుపుగా ఎదుర్కొంటూ, సైన్యానికి ఆగ్రహం కలగకుండా చూసుకోవటం కొత్త పాలకులకు జీవన్మరణ సమస్య. ఇన్ని భారాలు మోసేదెవరో తాజా ఎన్నికలు తేల్చబోతున్నాయి. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్!
వచ్చే నెల 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అవినీతి కేసులతో ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (71) సొంత రాజకీయ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ). దీని ఎన్నికల చిహ్నం- క్రికెట్ బ్యాట్. మరో రెండు వారాల్లో జరగనున్న దేశ సాధారణ ఎన్నికల్లో క్రికెట్ బ్యాట్ ఎన్నికల గుర్తును వాడకుండా పీటీఐపై దేశ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ ఎన్నికల గుర్తు మీద ఈసీ నిషేధం విధించడంపై ఇమ్రాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పీటీఐ ఓటమికి కోసం మిలిటరీ మద్దతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం పన్నిన కుట్రగా ఇమ్రాన్ మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నిబంధనల ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించనందునే ఎన్నికల గుర్తు వినియోగంపై ఆంక్షలు విధించామని ఎన్నికల సంఘం అంటోంది. వాస్తవానికి గత సంవత్సరం జూన్ 8న ఇమ్రాన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. అయితే సజావుగా జరగలేదంటూ ఆ ఎన్నికలను గుర్తించడానికి పాక్ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ చర్య అన్యాయం, అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితమని, ఇదంతా ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని నిరోధించేందుకేనని ఇమ్రాన్ మద్దతుదారులు ఆక్రోశిస్తున్నారు. 13 చిన్నాచితకా రాజకీయ పార్టీల విషయంలోనూ ఈసీ ఇలాంటి ఉత్తర్వులే వెలువరించింది. ఎన్నికల చిహ్నంపై నిషేధాన్ని తొలగించుకునేందుకు పీటీఐ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పీటీఐకి ఈ తీర్పు శరాఘాతంలా తగులుతోంది. ఎన్నికల్లో పార్టీ గుర్తులను రాజకీయ పార్టీలు కోల్పోవడం పాకిస్తాన్లో కొత్తేమీ కాకపోయినప్పటికీ, పీటీఐ తమ అభ్యర్థులందరికీ ఇతరత్రా ఓ గుర్తును ఎంచుకునే సమయం, అవకాశం సైతం లేకుండా పోయింది. అందుకు ఉద్దేశించిన నిర్ణీత గడువు ముగిసింది. చిహ్నాల్ని మార్చే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం జరుగుతుందని ఈసీ చెబుతోంది. ఈ గందరగోళాన్ని తొలగించేలా తమ పార్టీ అభ్యర్థుల పేర్లు-చిహ్నాలను ఓటర్లు అన్వేషించేందుకు వీలుగా ఇమ్రాన్ పార్టీ సామాజిక మాధ్యమాల బృందం ఓ పోర్టల్ నడుపుతోంది. పాకిస్తాన్లో సగం మంది ప్రజలకే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఓటర్ల వద్దకు చేరడంలో ఇమ్రాన్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏదేమైనా క్రికెట్ బ్యాట్ గుర్తును కోల్పోవడం తమ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని పీటీఐ నేతలు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్ మీద మహా మోజున్న పాక్ లాంటి దేశంలో ఓటర్లను ఇమ్రాన్ పార్టీ వైపు ఆకర్షించడానికి బ్యాట్ గుర్తు సమ్మోహనాస్త్రంలా ఉపయోగపడింది. ‘త్రాసు’ కోసం న్యాయపోరాటం! క్రికెట్ బ్యాట్ గుర్తుతో ఇమ్రాన్ రాజకీయ పార్టీ పీటీఐకి విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ నిజానికి దాని తొలి ఎన్నికల గుర్తు ‘దీపం’. పీటీఐ పేరులోని ‘ఇన్సాఫ్’ అంటే ఉర్దూలో న్యాయం అనే అర్థం వస్తుంది. 2013 ఎన్నికలకు ముందు పీటీఐ న్యాయానికి ప్రతీకగా ‘సమ త్రాసు’ గుర్తును వాడుకోవాలని భావించింది. కానీ, ‘సమ త్రాసు’ 1970 సాధారణ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తుగా ఉంది. ఈ గుర్తు కోసం ఇరు పార్టీల మధ్య సాగిన న్యాయపోరాటంలో చివరికి జమాతే ఇస్లామీ పార్టీదే పైచేయి అయింది. 1977 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనరల్ జియా-ఉల్-హక్ నేతృత్వంలోని సైనిక సర్కారు కొన్ని ఎన్నికల చిహ్నాల్ని ఆమోదిత జాబితా నుంచి తొలగించింది. అలా తొలగించిన వాటిలో త్రాసు గుర్తు ఉంది. తర్వాత 2010 సంవత్సరంలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం త్రాసు గుర్తును పునరుద్ధరించింది. పాక్ ఎన్నికల్లో గుర్తుల ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ‘’పాకిస్తాన్ జనాభాలో 40% మంది నిరక్ష్యరాస్యులు. విద్యావంతులు కాని ఓటర్లు ఓటు వేయడానికి గుర్తులపై ఆధారపడతారు, పేర్లు చదవగలిగిన పౌరుల్లోనూ చాలామంది ఎల్లప్పుడూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ వారికి పార్టీ గుర్తు మాత్రం తెలుసు” అని ‘జియో’ జర్నలిస్టు మాలిక్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లోని నినాదాలు, గీతాలు వాటి గుర్తుల చుట్టూ అల్లుకుని వుంటాయి అని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు 150 గుర్తులు కేటాయించగా మరో 174 గుర్తుల్ని స్వతంత్ర అభ్యర్థులకు ఇస్తున్నారు. మూడు సార్లు దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (74) ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ పులి గుర్తుతో, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బాణం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మిలిటరీ మ్యాన్ నవాజ్ షరీఫ్! ప్రజాదరణ ఎంత బలంగా ఉన్నప్పటికీ రాజకీయ క్రీజులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి రావడం దుర్లభం గానే కనిపిస్తోంది. ఇంత ఎదురుగాలిలోనూ గత డిసెంబరులో నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్ ప్రకారం... నవాజ్ షరీఫ్ (52%)తో పోలిస్తే ఇమ్రాన్ ఖాన్ (57%)కే అధిక అప్రూవల్ రేటింగ్స్ దక్కడం విశేషం. పీటీఐని అణచివేసేందుకు మిలిటరీ ట్రిక్స్ ప్రయోగిస్తోంది. ఇటీవలి కాలంలో పీటీఐ కార్యకర్తలు పలువురు అరెస్టయ్యారు. కొందరు నేతలు ‘ఇంటరాగేషన్స్’ తట్టుకోలేక పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రధాన సమాచార మాధ్యమాల్లో ఇమ్రాన్ పేరు ఉచ్చరించడాన్ని నిషేధించారు. ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. చివరికి... ప్రతిపాదించేవారు, బలపరిచేవారు దొరక్క (కిడ్నాప్స్/అపహరణలకు గురై)... ఇమ్రాన్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలో (దాదాపు 90%) తిరస్కృతికి గురయ్యాయి. నవాజ్ షరీఫ్ పాక్ మిలిటరీ నుంచి సహకారం పొందుతున్నారు. పాక్ ప్రధానమంత్రి పీఠంపై కూర్చొని పూర్తి పదవీకాలాన్ని అనుభవించిన వారెవరూ లేరు. ఆ అదృష్టం తొలిసారిగా, నాలుగో విడతలో షరీఫ్ ను వరిస్తుందేమో చూడాలి. మిలిటరీతో షరీఫ్ ఒప్పందం: బిలావల్ తూర్పు పంజాబ్ ప్రావిన్సులో పోటీ చేస్తున్న తమ పార్టీ జాతీయ, అసెంబ్లీ అభ్యర్థులకు తప్పుడు ఎన్నికల గుర్తులు కేటాయించారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో-జర్దారీ అంటున్నారు. నవాజ్ షరీఫ్ ఒత్తిడి మేరకే దేశ ఎన్నికల సంఘం ఇలా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెర వెనుక ఉంటూ రాజ్యాధికార శక్తుల్ని నియంత్రించే మిలిటరీతో షరీఫ్ ఒప్పందం కుదుర్చుకున్నారని బిలావల్ ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లు స్వయం ప్రకటిత ప్రవాసం గడిపి నిరుడు అక్టోబరులో స్వదేశానికి వచ్చిన నవాజ్ షరీఫ్... బిలావల్ ఆరోపణలను కొట్టిపారేశారు. అవినీతి కేసుల్లో పదవి నుంచి 2017లో ఉద్వాసనకు గురై పదేళ్ళ జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్... వైద్యచికిత్స కోసమంటూ బెయిల్ మీద లండన్ వెళ్ళి అక్కడే (పరారై ప్రవాసం) తలదాచుకున్నారు. ఆయన అకస్మాత్తుగా నిరుడు అక్టోబరు 21న స్వదేశానికి విచ్చేశారు. ‘అవినీతి మరకల్ని, రాజాకీయాల నుంచి శాశ్వత నిషేధాన్ని’ వదిలించుకుని 4వ సారి ప్రధాని అయ్యే ఆశతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. - జమ్ముల శ్రీకాంత్ -
ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని సీజేపీ జస్టిస్ క్వాజీ ఫయీజ్ ఇసా పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించడం, దానిపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. దీనిపై పీటీఐ పెషావర్ హైకోర్టును ఆశ్రయించగా, ఊరట లభించింది. అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్ హైకోర్టు తప్పుపట్టింది. బ్యాట్ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా సీజేపీ జస్టిస్ ఇసా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఈసీ తన బాధ్యతలను నిర్వరిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సరైన చర్య అవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం’’ అని ఆయన పేర్కొన్నారు. -
సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలి
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది. స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది. -
లవ్ గురూగా మారిన పాక్ ప్రధాని!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ లవ్ గురూ!గా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహమాడవచ్చని సమాధానమిచ్చారు. న్యూఇయర్ సందర్భంగా మాట్లాడిన వీడియో సందేశంలో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ వ్యక్తి పాక్ ప్రధాని అన్వర్-ఉల్-హక్-కాకర్‌ను అడగగా.. 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానమిచ్చారు. డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏమి చేయాలి అనే మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ.. తన జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మందిని ఆకట్టుకున్నానని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. 'అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.' అని కాకర్ స్పందించారు. సరైన అత్తగారు లేకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంక్షోభ నిర్వహణ కోర్సులో చేరాలని ఫన్నీగా చెప్పారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్‌ను ఎంపిక చేశారు. పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఇదీ చదవండి: వన్ ఉమన్ షో! -
పాక్ ఎన్నికల బరిలో.. ఎవరీ సవీరా ప్రకాష్?
సవీరా ప్రకాష్.. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన వేళ మారుమోగుతున్న పేరు. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారీమె. తద్వారా ఈ ఎన్నికల్లో ఆ ప్రావిన్స్ నుంచి నామినేషన్ ఫైల్ చేసిన తొలి మహిళగా.. అలాగే పోటీ చేయబోతున్న తొలి హిందూ మహిళగా వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఈ మధ్యే కీలక సవరణ చేసింది. సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేయడం అందులో ఒకటి. సవీరా తండ్రి ఓం ప్రకాశ్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. ఆయన అక్కడ పేరుపొందిన వైద్యుడు. మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా ఆయనకంటూ పేరుంది అక్కడ. ఈ మధ్యే వైద్య వృత్తికి దూరంగా జరిగారు. అంతేకాదు.. 35 ఏళ్లుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. సోమవారం బర్నర్‌లోని పీకే-25 స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా. సవీర, అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకుంది. ఆ సమయంలో బనర్ పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తన రాజకీయ అడుగులకు కారణమని ఇప్పుడు చెబుతున్నారామె. గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత.. సంక్షేమ సాధన తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. మరోవైపు బనర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్న ఇమ్రాన్ నోషాద్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. సవీరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అంటున్నాడు. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇదే బిలావల్ భుట్టో.. భారత్, కశ్మీర్‌పై గతంలో పలుమార్లు విషం చిమ్మడం తెలిసిందే. పాక్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది. -
పాక్ విలువలకు దివిటి ఆ గెలుపు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను అంతర్జాతీయ మీడియాకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. పాకిస్తాన్లో మానవత్వం, భిన్న మతాల మధ్య సామరస్యం ఉందని. నా విజయం మత తీవ్రవాద చీకటిలో మినుకుమినుకు మంటున్న వెలుగుకాదు. నా దేశ విలువలను చూపే దివిటి’ అని డాక్టర్ మహేశ్ కుమార్ మలానీ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తొలి హిందువు. పార్లమెంట్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ముస్లింయేతరుడు. పాకిస్తాన్ పార్లమెంట్‌కు ముస్లింయేతరులు పోటీచేసేందుకు వీలుగా, అలా పోటీ చేసిన వ్యక్తికి ముస్లింయేతరులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు వీలుగా 2002 నుంచి పాకిస్తాన్ ఎన్నికల్లో సంయుక్త ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చారు. ముస్లింయేతరుల కోసం పాక్ పార్లమెంట్లో పది నామినేట్ సీట్లను కూడా కేటాయించారు. ఈ పది నామినేట్ సీట్లను రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో గెలుచుకున్న సీట్ల సంఖ్యనుబట్టి కేటాయిస్తారు. మొత్తం పోలయిన ఓట్లలో కనీసం ఐదు శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ఈ నామినేటెడ్ సీట్లను కేటాయిస్తారు. మహేశ్ కుమార్ మలానీ ముందుlవరకు ముస్లిం ఏతరులు నేరుగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించలేదు. ఈసారి ఎన్నికల్లో ఆయన పాకిస్తాన్ ఎంపీగా ఎన్నికై ఎంతో మంది ముస్లిం ఏతరులకు ఆదర్శంగా నిలిచారు. తనకు హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఓటువేసి గెలిపించారంటూ వారందరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఆయన సింధు ప్రాంతంలోని తార్పార్కర్ 2 నియోజక వర్గం నుంచి గెలుపొందారు. -
పాకిస్థాన్‌లో ఎన్నికల తీరుపై వ్యతిరేకిస్తు ఆందోళనలు
-
ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: తాజా పాకిస్థాన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహం ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడం వల్లే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచారని ఆమె ఆరోపించారు. పాక్ సైన్యం నుంచి ఇమ్రాన్ లబ్ధి పొందాడని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాక విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లిపోతుందని ఆమె పేర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్‌లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ 115 స్థానాలు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్-న్యూస్ 18తో రెహాం ఖాన్ మాట్లాడారు. ‘పాక్ ఎన్నికలు ఆశ్చర్యపరచలేదు. ఫలితాలు ఊహించినవే. చాలామంది ఇమ్రాన్‌ను ప్రోత్సహించారు. ఆయనపై ఎంతో పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఆర్మీ ఇప్పుడు పాక్ విదేశాంగ శాఖను నిర్వహించబోతోంది’ అని రెహం ఖాన్ అన్నారు. -
షరీఫ్ ఓటమిని భరించలేని భారత గ్రామం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించాలని భారత ప్రభుత్వం కోరుకుందంటూ కాబోయే పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో నిజమెంతుందో తెలియదుగానీ భారత్‌లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం మనస్ఫూర్తిగా నవాజ్ షరీఫ్ పార్టీ విజయాన్ని కోరుకున్నారు. అదే పంజాబ్ రాష్ట్రంలోని టార్న్ తరణ్ జిల్లా, జటి ఉమ్రా గ్రామం. నవాజ్ షరీఫ్ పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు. దేశ విభజనకు ముందు షరీఫ్‌లు ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. గ్రామంలోని షరీఫ్‌ల ఇల్లు గురుద్వార్‌గా మారింది. నవాజ్ షరీఫ్ తాత మియాన్ ముహమ్మద్ బక్ష్ సమాధి ఇప్పటికీ ఈ గ్రామంలో ఉంది. నవాజ్ షరీఫ్ పూర్వీకులతో ఈ గ్రామానికి ప్రత్యక్ష సంబంధం ఉండడంతో భారత్ రాజకీయాలతో పాటు పాక్ రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఈ గ్రామం అభివృద్ధిలో షరీఫ్‌ల పాత్ర ఉండడమే అందుకు కారణం కూడా. నవాజ్ షరీఫ్ తమ్ముడు, పాక్ పంజాబ్ రాష్ట్రం ముఖ్యమంత్రి షాహ్బాజ్ షరీఫ్ 2013లో ఈ గ్రామన్ని సందర్శించారు. గ్రామం పరిస్థితిని చూసి ఆయన బాధ పడ్డారు. గ్రామం అభివద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా మన పంజాబ్ రాష్ట్రం అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు పాక్ పంజాబ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కూడా ప్రకాష్ సింగ్ బాదల్ సిద్ధమయ్యారు. అది వివాదాస్పదం అవడంతో మానుకున్నారు. అయితే షాహ్బాజ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలోని అన్ని రూట్లకు రోడ్డు వేశారు. నవాజ్ షరీఫ్ తాత సమాధి వద్దకు వెళ్లేందుకు వీలుగా కూడా ఓ ప్రత్యేక రోడ్డు వేశారు. మురుగునీరు పోయేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్, ఓ మినీ స్టేడియంను కూడా గ్రామంలో నిర్మించారు. షరీఫ్ కుటుంబానికి చెందిన గల్ఫ్ కంపెనీల్లో ఈ గ్రామానికి చెందిన దాదాపు 25 మంది యువకులకు కూడా ఉద్యోగాలిచ్చారు. మళ్లీ గ్రామం బాగోగుల గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో అప్పుడేసిన రోడ్లు పాడయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. నవాజ్ షరీఫ్ సమాధి శిథిలమయింది. ఆ ప్రాంతంలో అంతా గడ్డి మొలచింది. గ్రామం అభివృద్ధికి నిధులను కేటాయించకపోవడమే ఈ దుస్థితికి కారణమని గ్రామ పెద్ద దిల్బాగ్ సింగ్ సాంధు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధిస్తే ఆయన మరోసారి తమ గ్రామాన్ని సందర్శిస్తారని, తద్వారా తమకు మంచి రోజులు రావచ్చని టార్న్ తరణ్ ప్రజలు ఆశించారు. పాపం వారి ఆశలు అడియాశలయ్యాయి. -
భారత్‌పై వ్యతిరేకతతోనే ఇమ్రాన్‌కు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలను భారత్ వ్యతిరేకత ప్రభావితం చేసింది. పాక్‌లో జరిగిన ఈ ఎన్నికలను భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య జరుగుతున్న యుద్ధంగా ప్రచారం చేయడంలో, నవాజ్ షరీఫ్ పార్టీని గెలిపించడం కోసం భారత్‌తో కలిసి అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నాయని పాక్ ఓటర్లను నమ్మించడంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (న్యాయం కోసం ఉద్యమం) పార్టీలు విజయం సాధించాయి. భారత్‌తో కలిసి కుట్ర పన్నిన అంతర్జాతీయ శక్తులెవరో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలని అర్థం చేసుకోవచ్చు. భారత్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రచారానికి సోషల్ మీడియాలోని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు బాగా ఉపయోగపడ్డాయి. 2015, డిసెంబర్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా లాహోర్‌ను సందర్శించినప్పుడు నవాజ్ షరీఫ్, మోదీలు పాక్ గౌరవ వందనం స్వీకరించడం, ఆ సందర్భంగా ఇరువురు ఒకరినొకరు ఆత్మీయంగా కౌగించుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ కొత్త అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారుగానీ అది ఓటర్లకు ఆకట్టుకోలేక పోయింది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ చైనాతో కలిసి పాకిస్తాన్ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం వారికి చప్పగా అనిపించింది. 2008, 2013లో జరిగిన పాక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారత్ వ్యతిరేకత అన్న అంశమే అసలు ప్రస్థావనకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి. 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (వారు ఆజాద్ కశ్మీర్ అంటారు) జరిగిన ఎన్నికల్లో మొదటి సారి భారత్ వ్యతిరేకత అంశం వచ్చింది. బహుశ 2014 భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, పాకిస్థాన్ వ్యతిరేకత అంశాన్ని తీసుకరావడం కావచ్చు. ఈ అంశంతోపాటు ఎన్నికల్లో అవినీతి, పోకరితనం, ప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం, వ్యవస్థకు అనుకూలం, వ్యవస్థకు వ్యతిరేకం అన్న అంశాలపై జోరుగా ప్రచారం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీవారు సైనిక తొత్తులంటూ నవాజ్ షరీఫ్ పార్టీ వారు ప్రచారం చేయగా, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్వహించిన పాత్ర గురించి, 1978 నుంచి 1988 మధ్య పాక్ సైనిక నియంత జిలా ఉల్ హక్‌తో నవాజ్ షరీఫ్కున్న సంబంధాల గురించి ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఆ దాడిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన పార్టీలను కాదని పాక్ ప్రజలు ఇమ్రాన్‌కు పట్టడం కట్టడమంటే భారత్ వ్యతిరేకతే అందుకు కారణం అని చెప్పవచ్చు. చదవండి: యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్! పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన -
పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన
-
ఎన్నికల ఫలితాలపై నవాజ్ షరీఫ్ స్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ఎన్నికలు దొంగిలించి బడ్డాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మలినమైన ఫలితాల్ని చూడాల్సి వచ్చిందన్నారు. తాజా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో చెడు సంకేతాలకు నిదర్శమన్నారు. అడియాలా జైల్లో నవాజ్ షరీఫ్‌ను పరామర్శించడానికి వచ్చిన అభిమానులతో ముచ్చటించిన ఆయన ఎన్నికలు జరిగిన తీరును మొదలుకొని, ఫలితాల వరకూ తనదైన విశ్లేషించారు. అసలు ఎన్నికలే సరిగా జరగలేదన్న షరీఫ్.. ఫైసలాబాద్, లాహోర్, రావల్పిండిల్లో తమ అభ్యర్థులు అత్యంత నిలకడను ప్రదర్శించినా చివరకు ఓటమితో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరొకవైపు పీటీఐఈ మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. చదవండి: పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన -
యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం తనదేనని భావించిన ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి, తాను భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నానని, కశ్మీర్‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాక్ సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కయిందని, ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి ప్రధాని అయితే భారత్‌కు ముప్పేనంటూ విశ్లేషణలు వెల్లువెత్తిన నేపథ్యంతో అనూహ్యంగా ఆయన నుంచి శాంతి చర్చల మాట వెలువడడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ అదొక వ్యూహం. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారమంతా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు. అహ్మది తెగ బహిష్కరణను తీవ్రంగా సమర్థించిన విషయాన్ని ఎలా మరచిపోతారు (అహ్మది తెగవారు ముస్లింలు కాదంటూ 1973లో జుల్ఫీకర్ అలీ భుట్టో నిషేధం విధించగా, జనరల్ జియా ఉల్ హక్ ఏకంగా 1984లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు) మైనారిటీలను చిత్ర హింసలకు గురిచేస్తున్న మత విద్రోహ రాక్షస చట్టాన్ని ఇమ్రాన్ వెనకేసుకొస్తున్న విషయాన్ని, తాలిబన్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్ ఖాన్‌గా ముద్రపడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు చర్చలకు సిద్ధమంటే ఎవరు నమ్ముతారు!! అంతా ఒక వ్యూహం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనుసరించిన వ్యూహమే అది. పాకిస్థాన్ బూచిని చూపించి దేశభక్తి పేరిట ఓట్లు దండుకోవడమే ఆ వ్యూహం. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పాక్ పేరునే జపిస్తుంది. వ్యూహానికి ప్రతి వ్యూహంగా నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని నవాజ్ షరీఫ్‌కు ప్రియమిత్రుడని కాంగ్రెస్ పార్టీ సంబోధిస్తోంది. 2015లో మోదీ అనూహ్యంగా పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్న విషయం తెల్సిందే. బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇమ్రాన్ ఖాన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ భారత్‌ను తిడుతూ వచ్చారు. ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ అవసరం లేదు. భారత్‌ను నిజంగా ఇరుకున పెట్టాలంటే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకరావడమే. పైగా అంతర్జాతీయ సమాజం ముందు మంచి మార్కులు కొట్టేయవచ్చు. అందుకనే చర్చల ప్రతిపాదన చేశారు. అందుకు స్పందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ లబ్ధి పొందాలంటే పాకిస్తాన్‌తో వియ్యానికి బదులు కయ్యానికి కాలుదువ్వాలి. అందుకు కశ్మీర్ భారత్‌కు ఎప్పుడూ ఆయుధమే! -
పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. మరో 20 స్థానాల ఫలితాల్లో కౌంటింగ్ ఇంకా కొనసా...గుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. ఇతరుల సాయంతో పీటీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రధాని బరిలో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం పీటీఐ వర్గాలు స్పందించలేదు. బుధవారం సాయంత్రం నుంచి కౌటింగ్ కొనసాగుతూనే ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని ఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అనుచరులు అవకతవకలకు పాల్పడ్డాడని, భారీ ఎత్తున్న రిగ్గింగ్ జరిగిందని మిగతా పార్టీలు విమర్శిస్తుండగా.. ఎన్నికల సంఘం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే భారీ విక్టరీపై గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్.. సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్‌తో దౌత్య సంబంధాలు, అమెరికా జోక్యంసహా పలు అంశాలపై స్పందించారు కూడా. 14 మంది రెడీ... 14 మంది స్వతంత్ర్యులు తాము పీటీఐ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వటంతో రాయబారాలు నడుస్తున్నాయి. పీటీఐ కీలక నేతలు జహంగీర్ తరీన్, చౌదరి సర్వర్లు సంప్రదింపులు నడుపుతున్నారు. రేపు సాయంత్రంలోపు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇమ్రాన్‌పై ముషార్రఫ్ ప్రశంసలు.. ఇదిలా ఉంటే పాక్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై ప్రశంసలు గుప్పించారు. మతవ్యతిరేక కూటములకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ఇమ్రాన్ ఖాన్ సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలడన్న నమ్మకం ఉందని ముషార్రఫ్ కొనియాడారు. మరోవైపు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. -
జిన్నా కలలు కన్న పాకిస్థాన్‌ను నిర్మిస్తా
-
ఎన్నికలు అనుమానాస్పదం: అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరుపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సాధారణ ఎన్నికల్లో పారదర్శకత కొరవడిందని.. ఆర్మీ మద్దతున్న పీటీఐ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. ‘ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని అర్థమవుతోంది. పీటీఐ మినహా మిగిలిన పార్టీల ఏజెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని ప్రభావమే ఈ ఫలితాలు’ అని అమెరికా విదేశాంగ ఉన్నతాధికారి అలేసా ఎయిర్స్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వం మారుతున్నా పాకిస్తాన్ ప్రజాస్వామ్యం ఇంకా మిలటరీ పాలనలోనే కొనసాగుతుంది. ప్రభుత్వం కేవలం తోలుబొమ్మ మాత్రమే’ అని హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ జెఫ్ స్మిత్ పేర్కొన్నారు. పలువురు అమెరికా–పాకిస్తాన్ సంబంధాల నిపుణులు కూడా ఎన్నికల్లో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ముందుగా ఊహించినవేనని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుసేన్ హక్కానీ తెలిపారు. -
పాక్ విజేత సైన్యమే!
ఎట్టకేలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ జీవితేచ్ఛ నెరవేరవేరుతోంది. ఇరవై రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ బుధవారం జరిగిన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 272 స్థానాల్లో ఆ పార్టీకి 120 దక్కాయి. ఇంతవరకూ అధికారంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్)–ఎన్ ఈ అంకెకు చాలా దూరంగా 63 దగ్గర ఆగిపోయింది. మరో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 40 స్థానాలు గెల్చుకుని మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే తనకు బాగా పట్టున్న సిం«ద్ ప్రాంతంలో అది పీటీఐను నిలువ రించగలిగింది. అందువల్లే పీటీఐకి అధికారానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ 137 దక్కలేదు. ఇమ్రాన్ స్వస్థలమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో ఆయన పార్టీకే అధిక స్థానాలొచ్చాయి. మొదటినుంచీ అండగా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతాలైన రావల్పిండి, లాహోర్ వగైరాల్లో పీఎంఎల్–ఎన్‌కు ఆశించినంతగా స్థానాలు రాలేదు. జాతీయ అసెంబ్లీ ఫలితాలనే ప్రావిన్స్ ఫలితాలు కూడా ప్రతిబింబించాయి. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్స్ పీటీఐకి, పంజాబ్ ప్రావిన్స్ పీఎంఎల్–ఎన్‌కూ, సిం«ద్ ప్రావిన్స్ పీపీపీకి దక్కే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైన్యం కనుసన్నల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందని ప్రధాన పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. అందులో అబద్ధమేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే సకల వ్యవస్థలూ ఈసారి సైన్యం ముందు మోకరిల్లాయి. బల హీనమైన అవినీతి ఆరోపణల కేసులో ఆదరా బాదరగా విచారణ జరిపి న్యాయస్థానం నవాజ్ షరీఫ్‌కు, ఆయన కుమార్తెకూ జైలు శిక్షలు విధించింది. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలన్నిటినీ సైన్యం పహారా కింద ఉంచింది. ఇంకా సిగ్గుచేటైన విషయమేమంటే పోలింగ్ కేంద్రాల దగ్గర గొడవలు జరిగితే అక్కడికక్కడే విచారించి శిక్ష విధించటానికి వీలుగా సైన్యానికి మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చింది. మీడియా సంస్థలపై సైతం సైన్యం ఉక్కుపాదం మోపింది. జియో న్యూస్ చానెల్ ప్రసారాలకు అంతరాయాలు కలిగించింది. డాన్ పత్రిక పంపిణీ ని అడ్డుకుంది. ఇతర మీడియా సంస్థలన్నీ సైన్యానికి తలొగ్గాయి. ఇలా సైన్యం అండదండలు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్ పైచేయి సాధించటం ఖాయమని రాజకీయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. అలాగని సైన్యానికి ఇమ్రాన్‌పై పూర్తి స్థాయిలో ప్రేమ ఉందని చెప్పలేం. వారు బలంగా కోరుకున్నది హంగ్ పార్లమెంటే. అది కుదరని పక్షంలో మాత్రమే ఇమ్రాన్ అధికార పీఠంపై ఉండాలని ఆశించారు. చివరకు వారి రెండో కోరిక నెరవేరుతోంది. పాకిస్తాన్ రాజకీయాల్లో పీటీఐ ఛాందసవాద ధోర ణులున్న పార్టీగా ముద్రపడింది. అయితే అల్లాహో అక్బర్ తెహ్రీక్(ఏటీటీ) పేరిట బరిలోకి దిగిన జమాత్ ఉద్ దవా చీఫ్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ అభ్యర్థుల్ని జనం టోకుగా తిరస్కరించారు. అంతకుముందుగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ భారత వ్యతిరేకతను బలంగా ప్రదర్శించిన ఇమ్రాన్ దేశప్రజలనుద్దేశించి గురువారం చేసిన ప్రసంగంలో ఆచి తూచి మాట్లాడారు. తాను భారత్ వ్యతిరేకిని కానని చెప్పారు. కశ్మీర్ సమస్యపై భారత, పాకిస్తాన్‌లు రెండూ చర్చించుకోవాలన్నది తన అభిమతమని చెప్పారు. భారత్ ఒక అడుగేస్తే తాము రెండడుగులేస్తామని అన్నారు. చర్చల ప్రతి పాదన వచ్చినప్పుడల్లా వాటిని భగ్నం చేస్తున్నది పాకిస్తాన్ సైన్యమే. ఇరుదేశాల మధ్యా సామరస్యం ఏర్పడాలని నిజంగా ఇమ్రాన్ కోరుకుంటే ఆయన ముందుగా ఒప్పించాల్సింది అక్కడి సైన్యాన్నే. గత రెండున్నరేళ్లుగా సైన్యం మద్దతుతో అనేక ఉద్యమాలు నడుపుతున్న నాయకుడు గనుక ఇమ్రా న్కు దాని అభిమతమేమిటో ఇప్పటికే తెలిసి ఉండాలి. అయితే దేశాన్ని చైనా మాదిరిగా పారిశ్రా మికంగా అభివృద్ధి చేసి పేదరికాన్ని నిర్మూలించటమే, ‘కొత్త పాకిస్తాన్’ను నెలకొల్పటమే తన లక్ష్య మని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఆ లక్ష్య సాధనకూ, సైన్యం ధోరణులకూ చుక్కెదురు. దానికి కావాల్సింది పౌర ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉండటం, దేశం తన కనుసన్నల్లో నడ వటం... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో తన మాటే చెల్లుబాటు కావటం. పాక్‌లో కీలుబొమ్మ సర్కారుంటే మనకు అది తలనొప్పే. పుష్కలంగా ప్రజామద్దతున్న అధినేత లేన ట్టయితే అక్కడ అరాచకం తాండవిస్తుంది. దాని ప్రభావం మనపైనా ఉంటుంది. పాకిస్తాన్ ఆవిర్భవించాక అది అత్యధిక కాలం సైన్యం పడగనీడనే కొనసాగింది. పౌర ప్రభు త్వాలపై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటం సైన్యానికి అక్కడ రివాజు. పౌర ప్రభుత్వాలు నిరంతరాయంగా అధికారంలో కొనసాగింది ఈ పదేళ్లకాలంలోనే. 2008లో అప్పటి సైనిక నియంత జనరల్ ముషార్రఫ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు ఒప్పుకున్నారు. తిరుగులేని మెజారిటీ సాధిస్తారనుకున్న పీపీపీ అధినేత బేనజీర్ భుట్టోను ప్రచారపర్వంలోనే హత్యచేశారు. దీని వెనక ముషార్రఫ్ హస్తమున్నదన్న ఆరోపణలు బలంగా వచ్చినా ఆయన పాత్రపై విచారణ జరగలేదు. ఆరోపణలు వచ్చాక ఆయన్ను కొన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ రోగాలను సాకుగా చూపి 2016లో దుబాయ్ వెళ్లి అప్పటినుంచీ ఆయన ప్రవాసజీవితం గడుపుతున్నారు. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉండగా ఒకసారి రావడానికి ప్రయత్నించినా అరెస్టు చేయటం ఖాయమని ప్రభుత్వం చెప్పడంతో ఆగిపోయారు. షరీఫ్‌పై సైన్యం ఆగ్రహించడానికి గల కారణాల్లో ఇదొకటని చెబుతారు. ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా దేశాల్లో భ్రష్టుపడుతుండటం ఇటీవలికాలంలో కొట్టొ చ్చినట్టు కనబడుతోంది. సైన్యం పెత్తనం బాహాటంగా కనబడే పాక్‌లో అందుకు భిన్నంగా ఉంటుందని ఆశించలేం. కొత్తగా ఏర్పడే పాక్ ప్రభుత్వం మన లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ మనతో యధాతథ స్థితినే కొనసాగించి ఆ తర్వాత మాత్రమే తన విధా నాలను ప్రకటించే అవకాశముంది. ఆ విధానాలు ఇరుదేశాల మధ్యా సానుకూల వాతావరణానికి దోహదపడాలని ఆశిద్దాం. -
పాకిస్థాన్ గురించి ఐదు ఆసక్తికరమైన అంశాలు!
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ దేశానికి సంబంధించి ఐదు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవి అందరికి తెలియక పోవచ్చు. పాకిస్థాన్‌కు మొదటి రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమె 1956 వరకు పాక్‌కు రాణిగా ఉన్నారు. 1. భారత్, పాక్‌కు స్వాతంత్య్రానికి ముందు నుంచి ఎలిజబెత్ రాణి తండ్రి జార్జి–6 ఇరు దేశాలకు రాజుగా ఉన్నారు. 1950లో భారత్ రిపబ్లిక్‌గా మారడంతో ఆయన రాజరికం భారత్‌లో అంతరించింది. కానీ పాకిస్థాన్‌లో కొనసాగింది. 1952లో రాజు జార్జి–6 మరణించారు. ఆయన స్థానంలో బ్రిటీష్ రాణిగా పట్టాభిషక్తులైన ఆయన కూతురు రెండో ఎలిజబెత్ పాకిస్థాన్‌కు రాణిగా 1956 వరకు కొనసాగారు. అయితే రాణి పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా లాంఛనంగా మాత్రమే ఆ దేశపు రాణిగా కూడా కొనసాగారు. 1956లో పాకిస్థాన్ కూడా రిపబ్లిక్ అవడంతో ఆమె రాచరికం అక్కడ కూడా రద్దయింది. 2. పాకిస్థాన్ జాతీయ పానీయం చెరకు రసం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఈ పానీయం అత్యంత ఇష్టం. ముఖ్యంగా వేసవిలో ఈ చెరకు రసం లేకుండా ఆయన ఉండలేరు. 3. హరప్ప నాగరికతగా ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికతకు పాకిస్థాన్ పుట్టినిల్లు. ఈశాన్య అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఆగ్నేయ భారత్ ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించి ఉంది. 4. ప్రపంచంలో సగం ఫుట్‌బాల్స్ ఇక్కడే తయారయితాయి. పాకిస్థాన్‌లోని సియాల్కోట్ అందుకు ప్రసిద్ధి. అన్ని ప్రపంచకప్ సాకర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వీటినే ఎక్కువగా వాడుతారు. చేతితో తయారుచేసే ఈ ఫుట్‌బాల్స్‌ను ఏటా ఆరు కోట్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. 5. ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలో గ్రౌండ్, ఎత్తయిన అంతర్జాతీయ రహదారి పాక్‌లోనే ఉన్నాయి. ‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’గా ప్రసిద్ధి చెందిన గిల్గిట్ పర్వతాల్లో షాండూర్ టాప్ ఉంది. 12,200 అడుగులు (3,700 మీటర్ల) ఎత్తులో ఉండే షాండూర్ టాప్‌లో 1936 నుంచి ఫ్రీ సై్టల్ పోలో ఆడుతున్నారు. ఇక పాకిస్థాన్‌ను చైనాను కలిపే అంటే కారకోరం పర్వత శ్రేణి నుంచి చైనాలోని కుంజేరబ్ పాస్‌ను కలిపే కారకోరం అంతర్జాతీయ రహదారి 15,397 అడుగులు (4,693 అడుగులు) ఎత్తులో ఈ రహదారి వెళుతుంది. దీని పొడువు 800 మైళ్లు. -
‘నా పిల్లల తండ్రే ప్రధాని కాబోతున్నాడు’
ఇస్లామాబాద్ : మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది.. పాకిస్తాన్ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి. కానీ ఈ లోపే అభిమానులు తమ భావి ప్రధానిగా మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రకటించేశారు. మొత్తం 272 స్థానాలకుగాను పీటీఐ 120 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతూ, మ్యాజిక్ ఫిగర్ 137 వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఇప్పటి నుంచే ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇమ్రాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కూడా ఉన్నారు. 22 years later, after humiliations, hurdles and sacrifices, my sons’ father is Pakistan’s next PM. It’s an incredible lesson in tenacity, belief & refusal to accept defeat. The challenge now is to remember why he entered politics in the 1st place. Congratulations @ImranKhanPTI — Jemima Goldsmith (@Jemima_Khan) July 26, 2018 పీటీపై పార్టీ ముందంజలో ఉండటంతో జెమిమా ‘22 ఏళ్ల అవమనాలకు ఫలితం ఇది’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జెమిమా చేసిన ట్వీట్లో ‘22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, త్యాగాలు, అడ్డంకులు. వీటన్నింటికి ఫలితం నేడు లభించనుంది. నా కొడుకు తండ్రే ప్రధాని కాబోతున్నారు. ఓటమిని అంగీకరించలేని వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ ఫలితం. ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, దాన్ని సాధించడమే ఇప్పుడు మీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. శుభాకాంక్షలు ఇమ్రాన్ ఖాన్’ అంటూ అభింనందనలు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తన 42 వ ఏట తన వయసులో సగం ఉన్న(21 ఏళ్లు) జెమిమా గోల్డ్ స్మిత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందే జెమిమా ఇస్లాం మతంలోకి మారారు. వివాహమైన కొద్ది కాలానికే ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహమైన తొమ్మిదేళ్ల, 2004లో తర్వాత జెమిమా - ఇమ్రాన్లు విడిపోయారు. -
ముమ్మాటికీ రిగ్గింగే..! పీఈసీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: తీవ్ర ఉద్రిక్తలు, ఘర్షణల మధ్య ముగిసిన పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓవైపు పాకిస్తాన్‌తో సహా పొరుగుదేశం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇమ్రాన్‌ఖాన్ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐఈ) మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. రిగ్గింగ్.. రిగ్గింగ్..!! నవాజ్ షరీఫ్ జైలుపాలు కావడంతో అతని తమ్ముడు షాబాజ్‌ఖాన్ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ (పీఎంఎల్-ఎన్) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి పీఎంఎల్-ఎన్ను అధికారంలోకి తేవడమే కాకుండా జైలుపాలైన నవాజ్ షరీఫ్‌కు ఊరట కలిగిద్దామనుకున్న షాబాజ్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాత్రి లాహోర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పీటీఐ పార్టీ మెరుగైన స్థానంలో ఉండడానికి కారణం రిగ్గింగేనని చెప్తున్నారు. నిస్సిగ్గుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చే పీటీఐతో దేశం మరో ముప్పయ్యేళ్లు వెనక్కి పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్లు లేకుండా ఎలా..! పోలీంగ్ బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లు బలవంతంగా బయటకు గెంటేశారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మండిపడింది. ఓట్ల లెక్కింపులో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు నమ్మేట్టుగా లేవని అంటున్నాయి. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. మరోవైపు 111 పైగా స్థానాల్లో మంచి ఆధిక్యంలో నిలిచిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
కెప్టెన్ సెన్సేషన్.. ప్రత్యర్థులు విలవిల
ఇస్లామాబాద్: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఊహించని రీతిలో సత్తా చాటుతున్న పీటీఐ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 272 స్థానాలకుగానూ ఎన్నికలు జరగ్గా.. దాదాపు 120 సీట్ల ఆధిక్యంతో పీటీఐ దూసుకుపోతోంది. ఇమ్రాన్ దెబ్బకు పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎమ్‌లు విలవిలలాడిపోతున్నాయి. ఇమ్రాన్ ఘనత.. ఇదిలా ఉంటే ఫలితాల్లో మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించారు. మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆయన ఘన విషయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పీఎంఎల్-ఎన్ పార్టీ కంచుకోటగా ఉన్న రావల్పిండిలో ఇమ్రాన్ జెండా ఎగరేయటం చర్చనీయాంశంగా మారింది. అధికారం దిశగా ఫలితాలు పీటీఐకు అనుకూలంగా వస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సయీద్‌కు షాక్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. సయీద్ ‘అల్లాహో అక్బర్‌తెహరిక్ పార్టీ’ని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈ పార్టీ మద్ధతుదారులు కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా, వాళ్లు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. NA-3 స్వాట్‌లో షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఓటమి పాలయ్యాడు. అక్కడ పీటీఐ అభ్యర్థి సలీం రెహమాన్ జయకేతనం ఎగరవేశాడు. NA-200 లార్కానా లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెనకంజలో ఉన్నారు. ఎంఎంఏ రషీద్ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిలావల్ తండ్రి అసిఫ అలీ జర్దారీ NA-213 నవాబ్షా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మొత్తం 272 స్థానాలకు గానూ ఎన్నికలు జరగ్గా, మ్యాజిక్ ఫిగర్ 137. ఒకవేళ పీటీఐకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఫలితాలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అవకతవకల ఆరోపణలపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి ముహమ్మద్ రాజా వాటిని ఖండించారు. ఫలితాలు ఆలస్యం కావటం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సాయంత్రంకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. -
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ దూకుడు
-
పాక్ ఎన్నికల ఫలితాలు: అప్డేట్స్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నడుమ కొనసాగిన పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. ఇక ఈ రెండు పార్టీలకు తగిన మెజార్టీ రానిపక్షంలో బిలావల్ భుట్టో జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో.. ఏ పార్టీ పరాజయం వైపు పయనిస్తుందో.. ఎప్పటికప్పుడు ఇవిగో వివరాలు...! పార్టీలు: ఆధిక్యం+ గెలుపు ఇమ్రాన్‌ఖాన్: పీటీఐ 120 నవాజ్ షరీఫ్: పీఎంఎల్-ఎన్ 61 అసిఫ్ అలీ జర్దారీ: పీపీపీ 40 స్వతంత్రులు, ఇతరులు 51 చిత్తుగా రాసిచ్చారా..!! ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పుకొంటున్న పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫారం 45పై ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాల్సిందిపోయి అధికారులు చిత్తు కాగితంపై రాసిచ్చారు. ఒక స్టాంపు వేసి ఆ కాగితాన్ని అధికారికం చేసేశారు. ఈ వార్త ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #PakistanElections2018 As per rules,Election Commission of Pakistan(ECP)officials are bound to provide results on Form 45,instead results were handed out on plain paper in Khi&Hyderabad. As per latest unofficial trends on ARY news,PTI leading on 114 seats,PMLN-63 seats& PPP on 42 pic.twitter.com/rxFEosfG1p — ANI (@ANI) July 26, 2018 ఫలితాలు ఆలస్యం.. పాక్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ముందుగా అనుకున్న సమయానికి ఫలితాలను వెల్లడించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 47 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ఆయన పేర్కొనడం గమనార్హం. చదవండి: పాక్ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు భారత్‌కు మున్ముందు ముప్పే! ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే! -
పాక్ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్యం వచ్చిన 71 ఏళ్లలో ముప్పయ్యేళ్ల పాటు సైనిక పాలన చవిచూసిన పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఒక్కసారే ఒక పౌర ప్రభుత్వం నుంచి మరో పౌర ప్రభుత్వం పగ్గాలు అందుకుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాన మంత్రి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగక పోవడం గమనార్హం. జాతీయ అసెంబ్లీకి(పార్లమెంటు) , ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ 10 విశేషాలను తెలుసుకుందాం..! 1.దేశ వ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 85 వేల పోలింగ్ బూత్‌ల ఏర్పాటు. 2. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఈసీపీ) ప్రకారం 272 జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నాలుగు ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు (పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పంక్త్వా) జరుగుతున్న ఎన్నికల్లో 577 జనరల్ సీట్లకు 8,396 మంది పోటీ చేస్తున్నారు. 3. మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఎన్నికల నిర్వహణలో సైన్యం జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఎన్నికల భద్రత కోసం 4,49,465 పోలీసులను, 3,70,000 మిలటరీ సిబ్బందిని వినియోగిస్తున్నామని పాక్ ఎన్నికల కమిషన్ పేర్కొంది. 4. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మేజిక్ ఫిగర్ 172 సీట్లు. 5. మిలటరీకి మెజిస్టీరియల్ అధికారాలు కట్టబెడుతూ పాక్ సుప్రీం కోర్టు ఇటీవల తీర్వునివ్వడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వా మాత్రం.. ఎన్నికలు సజావుగా జరగడానికి మిలటరీ సిబ్బందిని వాడుతున్నామనీ, ఎన్నికల నిర్వహణలో మిలటరీ జోక్యం ఏమాత్రం ఉండదని అంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. 6. ఎన్నికల్లో ఓటర్లు విస్తృతంగా పాల్గొనడానికి వీలుగా బుధవారం పాకిస్తాన్లో సెలవు ప్రకటించారు. 7. ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకుంటోందని పాకిస్తాన్ మిలటరీ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్-తెహ్రీకే-ఇన్సాఫ్ (పీటీఐ) అధికారంలోకి వస్తే ఆ దేశ విదేశాంగ విధానంలో సంపూర్ణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 8. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేక పోయారు. రెండు సార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్ పనామా పత్రాల కుంభకోణం కేసులో పదవి కోల్పోయారు. తన కూతురు మరియంతో కలిసి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 9. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ తాజా ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీచేస్తుండడం ప్రజాస్వామ్యవాదులను కలవపపెడుతున్నది. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 10. ఎన్నికల రోజు (బుధవారం) జరిగిన ఆత్మాహతి దాడిలో 28 మంది చనిపోగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులే లక్ష్యంగా 10 రోజుల క్రితం బలూచిస్తాన్‌లో జరిగిన బాంబు దాడిలో 151 మంది మృత్యువాత పడ్డారు. -
ఓటేసిన అంతర్జాతీయ ఉగ్రవాది
లాహోర్, పాకిస్తాన్ : అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్‌లోని ఓ ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్ల అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సయీద్ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్ మిల్లీ ముస్లిం లీగ్(ఎమ్‌ఎమ్‌ఎల్) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు. పాకిస్తాన్ ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. -
భారత్‌కు మున్ముందు ముప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ చేయడం తన దృష్టిలో మోసం కాదని, అది ఆటలో భాగమేనని మాజీ పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, ప్రస్తుతం పాక్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం. ఈ విషయాన్ని ఆయన 1994లో విడుదల చేసిన తన జీవిత చరిత్ర పుస్తకంలో, ఆ తర్వాత కొన్ని రోజులకే ‘ఛానల్–4’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కూడా బాల్ ట్యాంపరింగ్ చేసినట్టు అంగీకరించారు. ఇప్పుడు పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాక్ సైన్యం తనకు సహకరించడం తప్పుకాదని, అది బాల్ ట్యాంపరింగ్ లాంటిదేనని ఆయన భావిస్తున్నారు. పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సమతౌల్యతను కాపాడుతానని ప్రమాణం చేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పాక్ సైనిక మద్దతును సమకూర్చున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాద శక్తులు కూడా ఆయనకు మద్దతిస్తున్న విషయం తెల్సిందే. ముంబైలో జరిగిన 26–11 దాడుల్లో హఫీద్ సయీద్, లఖ్వీ లాంటి టెర్రరిస్టుల హస్తం ఉందని మొట్టమొదట ధ్రువీకరించినది కూడా ఇమ్రాన్ ఖానే. 1996లోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనేక పరాజయాల అనంతరం పార్టీ తరఫున ఇప్పటి వరకు ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ప్రధాని స్థాయి అభ్యర్థిగా ఎదగడం దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే భారత్‌కు మున్ముందు పాక్‌తో ముప్పుందనే విషయం అర్థం అవుతుంది. 1988 నుంచి పాక్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పాక్ సైన్యం గుప్పిట్లోనే బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ప్రభుత్వాలు పనిచేశాయి. వీరిద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు పాక్ సైన్యంతో కలిసి కుట్ర పన్నడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టుకున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు పాక్ విదేశాంగ విధానాన్ని, రక్షణ విధానాన్ని నిర్దేశిస్తున్న పాక్ సైన్యానికి 2011 నుంచి పౌర ప్రభుత్వంతో విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, సైన్యం సలహాలను తీసుకోకుండా అప్పటికి పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ పార్టీ సహకారంతో రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల అధికారాలను సడలించిన సంస్కరణలు కూడా వాటిలో ఉన్నాయి. 2013లో జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. నాటి నుంచి ఆయన భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుతూ విదేశాంగ విధానాన్ని తన ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. దానికి సైన్యం (ఐఎస్ఐ సహా) ససేమిరా అంటూ వచ్చింది. మెల్లగా ఇమ్రాన్ ఖాన్‌తో చేతులు కలపడం ప్రారంభించింది. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఇమ్రాన్ ఖాన్ బహిరంగ సభలకు జనం రావడం ప్రారంభం కావడానికి కారణం ఐఎస్ఐ శక్తులే అన్న వాదన వచ్చింది. ఐఎస్ఐయే జనాన్ని సమీకరించిందనడానికి ఐఎస్ఐతో అంటకాగిన రాజకీయ నాయకుల్లో 90 శాతం మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీలో చేరడమే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవడం పాక్ సైన్యం మొదటి ప్రాధాన్యత కాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడాలనే పాక్ సైన్యం కోరుకుంటోందని, రెండో ప్రాథమ్యం మాత్రమే ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయమని ఇస్లామాబాద్ మాజీ భారత హైకమిషనర్ శరద్ సభర్వాల్ అన్నారు. హంగ్ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని కార్యాలయం పూర్తిగా తమ గుప్పిట్లోనే ఉంటుందన్నది పాక్ సైన్యం అభిప్రాయమని, ఇందులో ఏది జరిగిన భారత్‌కు ప్రతికూలమైన పరిణామమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేస్తే భారత్‌తో గెలవలేమని పాక్ సైన్యానికి తెలుసు. టెర్రరిస్టు శక్తులతో భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్లో కల్లోలం సష్టించేందుకే ప్రయత్నిస్తుంది. -
ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే!
సాక్షి, న్యూఢిల్లీ : తాలిబన్ ఖాన్, ముల్లా ఖాన్‌గా ముద్ర పడిన ‘తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బుధవారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే అది అటు పాకిస్థాన్‌కు, ఇటు భారత్‌కు అంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు పలు టెర్రరిస్టు సంస్థల నాయకులతో అవినాభావ సంబంధం ఉండడం వల్ల టెర్రరిస్టులు భారత్‌కు వ్యతిరేకంగా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కశ్మీర్ మరింత కల్లోలం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, సైన్యం, ఐఎస్ఐ మద్దతుగల ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎక్కడికక్కడ విచారించి శిక్షలు విధించే జుడీషియల్ అధికారాలను పాక్ సైన్యానికి కట్టబెడుతూ పాక్ సుప్రీం కోర్టు ఇటీవల అసాధారణ ఉత్తర్వులు జారీ చేయడం రెండు వ్యవస్థల మధ్య నెలకొన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పాక్ సైన్యం, ఐఎస్ఐ మున్ముందు ఇమ్రాన్ ఖాన్ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యవహరించే ప్రమాదం ఉంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి నిషేధించిన హర్కత్ ఉల్ జిహాద్ నాయకుడు మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ఖలీల్‌తోపాటు, లష్కరే తోయిబా మద్దతుగల మిల్లీ ముస్లిం లీగ్, అహ్లే సున్నావాల్ జమాత్, బరేల్వి సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్, తెహ్రీక్ లబ్బాయిక్ యా రసూల్ అల్లా లాంటి తీవ్రవాద సంస్థల నాయకుల మద్దతు ఇమ్రాన్ ఖాన్‌కు ఉందని ‘భారత రీసర్జ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)’ మాజీ చీఫ్ విక్రమ్ సూద్ ఇటీవలనే తాను ప్రచురించిన ‘ది అన్ఎండింగ్ గేమ్: ఏ ఫార్మర్ ఆర్ అండ్ ఏడబ్లూ చీఫ్సీ ఇన్సైట్ ఇన్‌టూ ఎస్పియోనేజ్’ పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్నుకుంటే పక్కలో బల్లెంలా కాకుండా తుపాకీలా ఉంటాడని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మిన్హాజ్ మర్చంట్ లాంటి వాళ్లు అభివర్ణిస్తున్నారు. -
పాక్ పగ్గాలెవరికి..?
-
‘నటులనే మించిన నటుడు మాజీ ప్రధాని’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా బాగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు ఫిల్మ్ స్టార్స్ కూడా పనికిరారని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఒక్క అమెరికా డాలర్ మన 5 రూపాయలకు సమానం. ఇప్పుడు 130 పాక్ రూపాయలైంది. కానీ షరీఫ్ కుటుంబం మాత్రం దేశాన్ని దోచుకుని విదేశాలకు వెళ్లిపోయిందని’ పేర్కొన్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు మెరుగు పడాలంటే పీటీఐకి ఓట్లేసి విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ఎన్నికల నేపథ్యంలో తాను అమాయకుడినని తెలియ జెప్పేందుకు నవాజ్ షరీఫ్ చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదియాలా జైల్లో తమను దోమలు కుడుతున్నాయని షరీఫ్, ఆయన కూతురు మర్యమ్ చెబుతున్నారని.. ఏసీల సౌకర్యం లేకపోతే వారు ఉండలేరని ఈ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారిద్దరూ చాలా బాగా నటిస్తున్నారని, సినిమాల్లో సైతం మనం ఇలాంటి నటనను చూడలేమన్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌ల కంటే కూడా కైబర్ కనుమలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కైబర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని, 9 వేల మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. 50 కొత్త కాలేజీలు, 10 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణలు రావడం, పీఎంఎల్–ఎన్ నేత షరీఫ్ జైల్లో ఉండటం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికా బానిస కొడుకులకు, మోదీ స్నేహితులకు..
‘‘అమెరికా బానిస కొడుకులకు, నరేంద్ర మోదీ స్నేహితులకు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టయితే, మీ గొయ్యిని మీరు తవ్వుకున్నట్టే’’ అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నాడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్! రాజకీయ ముసుగేసుకుని ఈ నెల 25న జరిగే పాకిస్తాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఇతగాడు.. 265 మందిని పోటీకి పెట్టాడు. ‘‘అమెరికా మద్దతు ఉన్న అఫ్గానిస్తాన్‌లో భారత్ తిష్టేసింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’’ అంటూ విషప్రచారం సాగిస్తున్నాడు. నిషేధిత/ఉగ్ర గ్రూపుల ప్రతినిధులు పాక్‌లో భారీగా పోటీకి దిగారు. సైన్యం మద్దతుతో పెట్రేగిపోతున్నారు. భారత్‌తో శాంతి సంబంధాల గురించి మాట్లాడుతున్న పీఎంఎల్ (ఎన్)ను పక్కకు తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారి పాత్రధారీ సైన్యమే. పాకిస్తాన్‌తోపాటు భారత్‌కూ అత్యంత అపాయకరమైన ఈ పరిణామాలపై ఓ పరిశీలన. ఔరంగజేబ్ ఫరూకీ.. పాకిస్తాన్లో మతం పేరిట హింసను ప్రేరేపిస్తున్న ఓ నిషేధిత ఉగ్రవాద గ్రూపు నాయకుడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా షియా కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో ఇతడు పోటీ చేస్తున్నాడు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధ బాంధవ్యాలున్న అనేక మంది అభ్యర్థుల్లో ఫరూకీ కూడా ఒకడు. మిలిటెంట్లతో ఫరూకీ గ్రూపునకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఓ కోర్టు అతడి పోటీకి అనుమతించింది. ఫరూఖీ సహా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉగ్రవాద నిఘా జాబితా (ఉగ్ర నిరోధక చట్టంలోని ఫోర్త్ షెడ్యూల్)లో ఉన్నారు. జనసమూహాల్ని కలిసేందుకు, కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు, బ్యాంకు అకౌంట్లు వాడేందుకు చట్టం అనుమతించనప్పటికీ వారు ఎన్నికల బరిలో నిలిచారు. 2013 ఎన్నికల్లో కేవలం 202 ఓట్లతో ఓడిపోయిన ఫరూకీ.. ప్రస్తుతం కరాచీలో ఓ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అతడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే మాటలు వినబడుతున్నాయి. సైన్యం ప్రమేయంతోనే ఇలాంటి గ్రూపుల ప్రతినిధులు చట్టపరమైన అడ్డంకుల నుంచి బయటపడగలుగుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. వీరు గనుక జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే విధాన నిర్ణయాల్లో సైన్యానికి తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు. లష్కరే తొయిబా విభాగమైన జమాత్–ఉద్–దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ‘మిల్లీ ముస్లిం లీగ్’ పార్టీ స్థాపించి తన కొడుకు, అల్లుడితో సహా 265 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపాడు. వీరిలో 80 మంది జాతీయ అసెంబ్లీకి, 185 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీ నమోదుకు నిరాకరించడంతో అల్లాహో అక్బర్ తెహరీక్ (ఏఏటీ) అనే పార్టీ పేరిట హఫీజ్ రంగంలోకి దిగాడు. పాక్ రాజకీయ నాయకుల్ని భారత్–అమెరికాల కీలుబొమ్మలుగా వర్ణిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ముత్తాహి–ఇ–మజ్లిస్ (ఎంఎంఏ) అనే ఐదు ఛాందస పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. మరోవైపు ఇస్లాంను దూషించే వారిని శిక్షిస్తానంటున్న తెహ్రీక్–ఇ–లబ్బైక్ అనే పార్టీ ఈ నెలలో అధికారిక ఆమోదం దక్కించుకుని పోటీకి దిగింది. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపిన ఖాద్రి ఈ గ్రూపునకు చెందిన వాడే. తర్వాతి కాలంలో అతణ్ణి ఉరి తీశారు. పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్యం మద్దతు ఉన్న ఈ జిహాదీ గ్రూపులు కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా ఎన్నికల చట్టబద్ధత... ఉగ్ర ప్రతినిధులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంపై పాక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసేందుకు ఈ గ్రూపుల అభ్యర్థుల్ని అనుమతించడం, ప్రచారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పీపీపీ, అవామీ వర్కర్స్ పార్టీల అభ్యర్థులపై భద్రతా బలగాలు వేధింపులకు పాల్పడటం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల చట్టబద్ధతనే ఆ సంస్థ ప్రశ్నిస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీపై సైనిక నేతల గురి... పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు సైనిక నేతలు. విదేశాంగ విధాన సంబంధిత విషయాల్లో ప్రత్యేకించి భారత్ విషయంలో తమతో విభేదించిన ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్ల వారు కంటగింపుగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణాన్ని ఉపయోగించుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించగలిగారు. న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని షరీఫ్‌నూ, ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తెను జైలుకు పంపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ షరీఫ్ పార్టీని తప్పించాలనే మిలటరీ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్’ (పీటీఐ)ని గెలిపించేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక నేత గతంలో కంటేæ ఇప్పుడు బలం పుంజుకున్నాడు. ఇమ్రాన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చునని లేదంటే స్వల్ప ఆధికత్యతో బయటపడవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం నవాజ్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ హోదా సంపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ
కరాచీ : ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న పాకిస్తాన్లో ఓ హిందూ మహిళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచి చరిత్ర సృష్టించారు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 31 ఏళ్ల సునీత పర్మార్ జూలై 25న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తార్పర్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మైనార్టీ వర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ సునీతనే కావడం విశేషం. ఏ పార్టీ మద్దతు లేకున్న ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోరాండేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కూడా హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హీని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆ దేశ సెనెట్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయినందు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 21 శతాబ్ధంలో కూడా ఈ ప్రాంతంలో మహిళలకు కనీస విద్య, వైద్య వసతులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మహిళలు బలహీనులు, భయస్థులు అనే రోజులు పోయాయన్నారు. గెలుపుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తాను గెలిస్తే నియోజవర్గంలోని మహిళలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్త్రీలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా వారు శక్తివంతంగా తయారవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా 2017 లెక్కల ప్రకారం తార్పర్కర్ జిల్లాలోని 16 లక్షల జనాభాలో దాదాపు సగం మంది హిందువులే. -
మోదీపై మాజీ బౌలర్ బౌన్సర్లు..
ఇస్లామాబాద్ : భారత్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. కశ్మీర్లో వారు (భారత్) చేస్తున్న దురాగతాలకు పాకిస్తాన్‌ను నిందించాలని మోదీ భావిస్తుండటంతో భారత ప్రభుత్వం ఈ వైఖరిని అనుసరిస్తోందని దుయ్యబట్టారు. భారత్‌తో సంబంధాలను చక్కదిద్దేందుకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, చివరికి ప్రధాని మోదీని ఆయన తన ఇంటికి రావాలని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలనే విధానాన్ని అనుసరిస్తూ భారత్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సంబంధాలను దిగజార్చిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. కాగా పాక్‌లో ఏ పార్టీ సుపరిపాలన అందించలేకపోతున్న క్రమంలో ప్రభుత్వంపై మిలటరీ ప్రభావం ఉందని అంగీకరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన సందర్భాల్లో ప్రజలు సైన్యాన్ని పాలనా పగ్గాలు చేపట్టాలని ఆహ్వానిస్తారని అన్నారు. జులై 25న జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రత్యర్థి పార్టీలకు దీటైన పోటీనిస్తుందని భావిస్తున్నారు. -
ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు!
ఇస్లామాబాద్: త్వరలో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ రూ. 223 బిలియన్లు (రూ. 22,300 కోట్లు). కాగా ఈ ఎన్నికల్లో అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముజఫర్గడ్ జిల్లాలోని ఎన్ఏ-182, పీపీ-270 నియోజక వర్గాల నుంచి మహ్మద్ హుస్సేన్ షేక్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ తన ఆస్తుల విలువ దాదాపు 22,300 కోట్ల రూపాయలుగా ఆయన ప్రకటించారు. ఇందులో 40శాతం మేరకు భూమి విలువ(స్థిరాస్తి)గా చూపించారు. మరోవిషయం ఏమిటంటే ముజఫర్‌గడ్‌లోని హుస్సేన్ భూముల వివాదం కేసు గత 88 ఏళ్లుగా సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు హుస్సేన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.22,300 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా హుస్సేన్ నిలిచారు. మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్, ఇతర నేతలు కూడా ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జులై 25న పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. -
షారుఖ్ నా కోసం ప్రార్థించు..
న్యూఢిల్లీ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రార్థించాలని షారుఖ్ ఖాన్‌ను ఆయన సోదరి నూర్ జెహాన్ కోరారు. వరుసకు షారుఖ్‌కు కజిన్ అయిన జెహాన్ పాక్‌లోని పెషావర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధం అవుతున్నారు. షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్ నాయకత్వం వహిస్తున్నారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. బచాఖాన్గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్ ఉద్యమం(ఎర్ర చొక్కా ఉద్యమం)లో జెహాన్ పూర్వీకులు పాల్గొన్నారు. -
పాక్ ఎన్నికల్లో భారత సూపర్‌స్టార్ బంధువు!
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బంధువు ఒకరు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. షారుఖ్‌కు కజిన్ అయిన నూర్ జెహాన్ పాక్‌లోని పెషావర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆమె గురువారం ఎన్నికల సంఘం నుంచి నామినేషన్ పత్రాలను తీసుకున్నారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్ నాయకత్వం వహిస్తున్నారు. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యముందని, బచ్చా ఖాన్‌గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్ ఉద్యమంలో తమ కుటుంబం చురుగ్గా పాల్గొన్నదని మన్సూర్ తెలిపారు. -
పాకిస్థాన్ ప్రధాని ఉంటారా? ఊడుతారా?
-
పాకిస్థాన్ ప్రధాని ఉంటారా? ఊడుతారా?
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు గురువారం తన తీర్పు వెలువరించనుంది. అక్రమ మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులు ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జగరనున్న నేపథ్యంలో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు షరీఫ్, ఆయన పార్టీ పీఎంఎల్-ఎన్‌కు కీలకం కానుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన 67 ఏళ్ల షరీఫ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1990లో రెండుసార్లుల ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో షరీఫ్ అక్రమ మనీలాండరింగ్ ద్వారా లండన్‌లో ఆస్తులు పోగేశారని, ఇదే విషయంలో పనామాపత్రాల్లో సైతం వెలుగుచూసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తిరస్కరించలేని ఆధారాలు ఉన్నందున ప్రధాని షరీఫ్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడం అనివార్యమని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు.