పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్‌ క్లియర్‌!.. ప్రధాని ఆయనేనా? | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో కొత్త సర్కార్‌కు లైన్‌ క్లియర్‌!.. ప్రధాని ఆయనేనా?

Published Sat, Feb 24 2024 8:43 AM

Pakistan New Government Likely By March 2nd - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పాక్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపిస్తున్న వేళ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అధికార ఒప్పందానికి సంబంధించి పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీల మధ్య డీల్‌ కుదిరింది.

వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీల మధ్య ఒప్పందంతో వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మార్చి తొమ్మిదో తేదీలోగా పాక్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని న్యూస్‌ ఇంటర్నేషనల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది.

ఇక, మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్‌ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్‌ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (72) మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement