పాక్‌లో ఎన్నికల ప్రహసనం | Sakshi Editorial On Pakistan Elections | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఎన్నికల ప్రహసనం

Published Thu, Feb 8 2024 12:22 AM | Last Updated on Thu, Feb 8 2024 12:22 AM

Sakshi Editorial On Pakistan Elections

సైన్యం పడగనీడలో ఎన్నికల తంతుకు పాకిస్తాన్‌ సిద్ధమైంది. జాతీయ అసెంబ్లీకి గురువారం జరిగే పోలింగ్‌లో గెలిచేదెవరో ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎప్పటిలాగే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకొచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై సైన్యం ఆగ్రహంతో వుంది. ఫలితంగా పదవి కోల్పోయి రెండు అవినీతి కేసుల్లో పదేళ్లు, పద్నాలుగేళ్ల్ల చొప్పున శిక్షపడి ఆయన జైలుపాలయ్యారు. చట్టవిరుద్ధంగా పెళ్లాడిన కేసులో మరో ఏడేళ్ల శిక్ష కూడా పడింది.

భార్య సైతం ఈ కేసులో జైలుకు పోయారు. ఎలాగైతేనేం సకాలంలోనే ఎన్నికల తంతు మొదలైంది. ఇమ్రాన్‌ స్థాపించిన పాకిస్తాన్‌ తెహ్రికే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఏటికి ఎదురీదుతోంది. పీటీఐకి న్యాయస్థానాల పుణ్యమా అని బ్యాట్‌ గుర్తు గల్లంతుకాగా, పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలో వున్నారు. పీటీఐ అభ్యర్థినని చెప్పుకున్నవారిని సైన్యం అరెస్టు చేసింది. వారి ఇళ్లపై దాడులకు తెగబడింది. అభ్యర్థులు నామినేషన్‌ వేసిన వెంటనే అజ్ఞాతంలోకి పోగా, ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థుల కుటుంబాలకు సైతం వేధింపులు తప్పలేదు.

కొందరు అభ్యర్థులు పీటీఐతో తెగదెంపులు చేసుకున్నామని ప్రకటించి, బతుకుజీవుడా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొన్న జరిగిన పీటీఐ ఎన్నికల ప్రచారసభలో వేదికపై రెండు డజన్లమంది బిక్కుబిక్కుమని కూర్చోగా, ఆ సభకు కనీసం మైక్‌ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదనీ, పోస్టర్లు వేయనీయలేదనీ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక కథనం. యధాప్రకారం ఇక్కడి అభ్యర్థి కూడా కేసుల్లో చిక్కుకుని పరారీలో వున్నాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ను అందలం ఎక్కించిన 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించిందిగానీ, పాక్‌ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నారు.

నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుడయ్యాక ఆయన సైన్యాన్ని తూర్పారపట్టడం మొదలెట్టారు. రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని ‘అధికార వ్యవస్థ’ పదం చాటున నిందించటం అలవాటు. ఇమ్రాన్‌ ఆ సంప్రదాయానికి స్వస్తిపలికారు. నేరుగా సైన్యాన్నీ, దాని అధినేతలనూ ఉద్దేశిస్తూ దూషించారు. పైగా నిరుడు మే నెలలో ఇమ్రాన్‌కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకుంది. ఊహకందని రీతిలో సైనిక కార్యాలయాలపైనా, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైనా యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాలు చేయటం సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

రంగంలో వున్న రెండు ప్రధాన పక్షాలు– మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌–ఎన్‌), మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో ఆధ్వర్యంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మాత్రం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీవుండటం ఆనవాయితీ. ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ నెగ్గిన 2018 ఎన్నికలొక్కటే దీనికి మినహాయింపు. చెప్పాలంటే ఇతరులకన్నా పీపీపీ చాలా ముందుగా ఎన్నికల బరిలోకి దిగింది.

విస్తృతంగా ప్రచారం చేసింది. మొదట్నుంచి బలంగా వున్న సింద్‌ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీ బలహీనపడింది. ప్రచారావకాశాలు బొత్తిగా లేని పీటీఐకి యువత బలమైన శక్తిగా వున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు సాగిస్తున్న ప్రచారం రెండు పార్టీలనూ బెంబేలెత్తిస్తున్నది. పాకిస్తాన్‌లో మరీ ముఖ్యంగా... బలూచిస్తాన్,  ఖైబర్‌ ఫక్తుంఖ్వాల్లో భారీయెత్తున హింస చోటుచేసుకున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించటాన్నిబట్టి ఈ ఎన్నికల సరళి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.

మహిళా అభ్యర్థులకు ఈసారి పెద్దగా చోటు దక్కలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ అంటున్నది. ఈ విషయంలో మీ సంజాయిషీ ఏమిటని పాకిస్తాన్‌ ఎన్నికల సంఘానికి ఆ సంస్థ తాఖీదులు పంపింది. పాకిస్తాన్‌ పార్లమెంటులో మహిళా కోటా 22 శాతం వుంది. దీంతోపాటు చట్టప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5 శాతం స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు మూడూ ఈ విషయంలో మొహం చాటేశాయి. 

ఎన్నికలు, గెలుపోటముల సంగతలావుంచితే... రాబోయే ప్రభుత్వానికి చాలా సవాళ్లున్నాయి. నిరుడు మే నెలలో పాకిస్తాన్‌ దాదాపు దివాలా అంచులకు చేరింది. ఆఖరి నిమిషంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 300 కోట్ల డాలర్ల రుణం అందించి ఆదుకుంది. ఆ సాయం కూడా వచ్చే నెలాఖరుతో ఆగిపోతుంది. దాన్ని పొడిగించేలా చూసుకోవటం, అందుకు సంస్థ విధించబోయే షరతులకు తలొగ్గటం కొత్త పాలకులకు తప్పనిసరి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న ప్రజానీకంలో ఇది మరింత నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది.

ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక రంగానికి కూడా సహకారం అందకపోవచ్చు. మన దేశంతో ఆది నుంచీ పాకిస్తాన్‌ది శత్రుపూరిత వైఖరే. దీనికితోడు దశాబ్దాలుగా పాక్‌లో వుంటున్న వేలాదిమంది అఫ్గాన్‌ పౌరులను నిరుడు వెనక్కి పంపటంతో తాలిబన్‌ పాలకులతో తగాదాలు మొదలయ్యాయి. ఇవన్నీ దేశంలో మిలిటెన్సీ మరింత పెరగటానికి దోహదపడతాయి. వీటిని ఒడుపుగా ఎదుర్కొంటూ, సైన్యానికి ఆగ్రహం కలగకుండా చూసుకోవటం కొత్త పాలకులకు జీవన్మరణ సమస్య. ఇన్ని భారాలు మోసేదెవరో తాజా ఎన్నికలు తేల్చబోతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement