
దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆరోపణలు రావటం, మౌనంగా ఉండిపోయి నెలలు గడిచాక ముక్తసరిగా మాట్లాడటం ఎన్నికల సంఘం(ఈసీ)కి అలవాటైపోయింది. ఈసారి మార్పేమిటంటే... ఓటర్ల జాబితా సవరణ దశలోనే దానిపై ఆరోపణలు రావటం! రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి గనుక దానికి అనుగుణంగా ఈ దఫా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఈసీ చెబుతోంది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కింద ఓటర్ల వివరాలు సేకరిస్తామంటున్నది. ఇదే మాదిరి సవరణ 2003లో జరిగింది. కానీ ఆ ‘సర్’ వేరు! అప్పట్లో ఇంటింటికీ వెళ్లి జాబితాలోని ఫొటోలతో ఓటర్లను పోల్చిచూడటం, అనుమానాస్పదం అనిపిస్తే తొలగించటం వగైరాలు చేశారు. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారందరినీ సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ పత్రాలు అడగాలన్నది ఈసీ తాజా నిర్ణయం.
ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా జాబితాలో కెక్కాలంటే ముందుగా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కాదు... తమ తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేయాలి. ప్రస్తుతం ఓటర్లను ఈసీ మూడు కేటగిరీలుగా విభజించింది.
దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకుముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పిస్తే సరిపోతుంది. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2024 మధ్య జన్మించినవారు ఈ పత్రాలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ఆ తర్వాత జన్మించినవారు తమ ధ్రువీకరణ పత్రాలతోపాటు తల్లిదండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. ఇవి అందజేయలేనివారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. తుది జాబితా ప్రచురణలోగా అందిస్తేనే తిరిగి చేరుస్తారు.
ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించటంలో తరచూ విఫలమవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసీ దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సీని అమల్లో పెట్టజూస్తున్నదని విపక్షాలు చేస్తున్న ఆరోపణ కొట్టిపారేయదగ్గది కాదు. అలాగని దొంగ ఓటర్ల సమస్య లేదని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అటు తర్వాత రెండు విభజిత రాష్ట్రాల్లో వేర్వేరు పోలింగ్ తేదీలున్నప్పుడు తెలుగుదేశం దీన్నొక కళగా అభివృద్ధి చేసింది.
అక్కడా ఇక్కడా ఓటేయించటం, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఓటర్లను తరలించటం ఆ పార్టీకి అలవాటైన విద్య. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వగైరాల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి వచ్చినవారు ఓటర్లుగా నమోదై ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకు సంబంధించిన డేటా ఈసీ ఇంతవరకూ బయటపెట్టలేదు.
అది విడుదల చేసివుంటే ఈ వ్యవహారం ఇంత వివాదం అయివుండేది కాదు. కానీ అలా చేయటం తన స్థాయికి తగదని సంస్థ భావిస్తున్నట్టుంది. బిహార్ మాత్రమే కాదు... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఈ ‘సర్’ వచ్చిపడుతుందంటున్నారు.
ఏడేళ్ల క్రితం అస్సాంలో ఈ దేశ పౌరులెందరు... ఇతరులెందరన్న ఆరా తీశారు. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే తర్వాత 40.07 లక్షల మంది ‘విదేశీయులని’ నిర్ధారించారు. ఎన్నో ఆందోళనలు జరిగాక ఈ సంఖ్య 19 లక్షలకు తగ్గింది.
వీరిలో అన్ని మతాలవారూ ఉండగా బిచ్చగాళ్లు, నిరుద్యోగులూ, ఇల్లూ వాకిలీ లేనివారూ ఎక్కువ. ఒక ఇంట్లో పెద్దన్న ‘భారతీయుడైతే’ మిగిలిన అన్నదమ్ములు ‘విదేశీయులు’గా ముద్రపడిన వారున్నారు.
భర్తకు ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కితే భార్య పేరు గల్లంతయిన ఉదంతాలు కోకొల్లలు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీసు విభాగంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా పేరు సైతం మాయమైతే అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు.
జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులంతా గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్ దొరికింది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లయినా ఇప్పటికీ లక్షల కేసులు తేలని నేపథ్యంలో ఇంత పని ఈసీ ఎందుకు నెత్తికెందుకుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
బిహార్‌లో ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 7 కోట్ల 90 లక్షలు. ఇందులో 20–38 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు సగమని చెబుతున్నారు. ఈసీ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2.93 కోట్లు. వీరు తమతోపాటు తమ తల్లిదండ్రుల్లో కనీసం ఒకరి పౌరసత్వాన్ని తేల్చిచెప్పాల్సి ఉంటుంది.
నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడాల్సిన బిహార్‌లో ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారమా? ఆ వంకన పాలక పక్షాల ఒత్తిడితో భారీయెత్తున ఓటర్లను తొలగించే ప్రమాదం ఉండదా? జాబితాలో చోటుదక్కనివారు న్యాయస్థానాలకెక్కితే పరిస్థితేమిటి? పాలకులుగా ఎవరున్నా పేదరికం రాజ్యమేలే బిహార్ నుంచి భారీయెత్తున వలసలుంటాయి.
అక్కడ వృద్ధాప్య పింఛన్ నెలకు రూ. 700. ఇటీవలే దాన్ని రూ. 1,100 చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్భాటంగా ప్రకటించారు. పనుల కోసం వందలాది కిలోమీటర్లు దాటి తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు.
అక్కడి జనాభాలో 7 శాతం మంది వేరే రాష్ట్రాలకు పోగా, అందులో 30 శాతం మంది ఉపాధి వెదుక్కొని వెళ్లినవారే. వారంతా వెనక్కొచ్చి తమ పత్రాల కోసం వెతుకులాడటం జరిగే పనేనా? బిహార్‌లో సకాలంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ విశ్వసిస్తోందా?