
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్‌లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్‌ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు.
ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్‌లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు.