‘‘అమెరికా బానిస కొడుకులకు, నరేంద్ర మోదీ స్నేహితులకు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టయితే, మీ గొయ్యిని మీరు తవ్వుకున్నట్టే’’ అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నాడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్! రాజకీయ ముసుగేసుకుని ఈ నెల 25న జరిగే పాకిస్తాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఇతగాడు.. 265 మందిని పోటీకి పెట్టాడు. ‘‘అమెరికా మద్దతు ఉన్న అఫ్గానిస్తాన్‌లో భారత్ తిష్టేసింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’’ అంటూ విషప్రచారం సాగిస్తున్నాడు. నిషేధిత/ఉగ్ర గ్రూపుల ప్రతినిధులు పాక్‌లో భారీగా పోటీకి దిగారు. సైన్యం మద్దతుతో పెట్రేగిపోతున్నారు. భారత్‌తో శాంతి సంబంధాల గురించి మాట్లాడుతున్న పీఎంఎల్ (ఎన్)ను పక్కకు తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారి పాత్రధారీ సైన్యమే. పాకిస్తాన్‌తోపాటు భారత్‌కూ అత్యంత అపాయకరమైన ఈ పరిణామాలపై ఓ పరిశీలన.
ఔరంగజేబ్ ఫరూకీ.. పాకిస్తాన్‌లో మతం పేరిట హింసను ప్రేరేపిస్తున్న ఓ నిషేధిత ఉగ్రవాద గ్రూపు నాయకుడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా షియా కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో ఇతడు పోటీ చేస్తున్నాడు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధ బాంధవ్యాలున్న అనేక మంది అభ్యర్థుల్లో ఫరూకీ కూడా ఒకడు. మిలిటెంట్లతో ఫరూకీ గ్రూపునకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఓ కోర్టు అతడి పోటీకి అనుమతించింది. ఫరూఖీ సహా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉగ్రవాద నిఘా జాబితా (ఉగ్ర నిరోధక చట్టంలోని ఫోర్త్ షెడ్యూల్)లో ఉన్నారు. జనసమూహాల్ని కలిసేందుకు, కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు, బ్యాంకు అకౌంట్లు వాడేందుకు చట్టం అనుమతించనప్పటికీ వారు ఎన్నికల బరిలో నిలిచారు. 2013 ఎన్నికల్లో కేవలం 202 ఓట్లతో ఓడిపోయిన ఫరూకీ.. ప్రస్తుతం కరాచీలో ఓ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అతడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే మాటలు వినబడుతున్నాయి. సైన్యం ప్రమేయంతోనే ఇలాంటి గ్రూపుల ప్రతినిధులు చట్టపరమైన అడ్డంకుల నుంచి బయటపడగలుగుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. వీరు గనుక జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే విధాన నిర్ణయాల్లో సైన్యానికి తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు.
లష్కరే తొయిబా విభాగమైన జమాత్–ఉద్–దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ‘మిల్లీ ముస్లిం లీగ్’ పార్టీ స్థాపించి తన కొడుకు, అల్లుడితో సహా 265 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపాడు. వీరిలో 80 మంది జాతీయ అసెంబ్లీకి, 185 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీ నమోదుకు నిరాకరించడంతో అల్లాహో అక్బర్ తెహరీక్ (ఏఏటీ) అనే పార్టీ పేరిట హఫీజ్ రంగంలోకి దిగాడు. పాక్ రాజకీయ నాయకుల్ని భారత్–అమెరికాల కీలుబొమ్మలుగా వర్ణిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ముత్తాహి–ఇ–మజ్లిస్ (ఎంఎంఏ) అనే ఐదు ఛాందస పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. మరోవైపు ఇస్లాంను దూషించే వారిని శిక్షిస్తానంటున్న తెహ్రీక్–ఇ–లబ్బైక్ అనే పార్టీ ఈ నెలలో అధికారిక ఆమోదం దక్కించుకుని పోటీకి దిగింది. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపిన ఖాద్రి ఈ గ్రూపునకు చెందిన వాడే. తర్వాతి కాలంలో అతణ్ణి ఉరి తీశారు. పాకిస్తాన్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్యం మద్దతు ఉన్న ఈ జిహాదీ గ్రూపులు కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రశ్నార్థకంగా ఎన్నికల చట్టబద్ధత...
ఉగ్ర ప్రతినిధులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంపై పాక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసేందుకు ఈ గ్రూపుల అభ్యర్థుల్ని అనుమతించడం, ప్రచారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పీపీపీ, అవామీ వర్కర్స్ పార్టీల అభ్యర్థులపై భద్రతా బలగాలు వేధింపులకు పాల్పడటం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల చట్టబద్ధతనే ఆ సంస్థ ప్రశ్నిస్తోంది.
నవాజ్ షరీఫ్ పార్టీపై సైనిక నేతల గురి...
పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు సైనిక నేతలు. విదేశాంగ విధాన సంబంధిత విషయాల్లో ప్రత్యేకించి భారత్ విషయంలో తమతో విభేదించిన ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్ల వారు కంటగింపుగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణాన్ని ఉపయోగించుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించగలిగారు. న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని షరీఫ్‌నూ, ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తెను జైలుకు పంపారు.
ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ షరీఫ్ పార్టీని తప్పించాలనే మిలటరీ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్’ (పీటీఐ)ని గెలిపించేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక నేత గతంలో కంటేæ ఇప్పుడు బలం పుంజుకున్నాడు. ఇమ్రాన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చునని లేదంటే స్వల్ప ఆధికత్యతో బయటపడవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం నవాజ్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ హోదా సంపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బ్యాలెట్.. 'బుల్లెట్'
Published Sun, Jul 22 2018 1:21 AM | Last Updated on Sun, Jul 22 2018 1:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment