Hafiz Saeed
-
Hafiz Saeed extradition: నేరగాళ్ల అప్పగింతకు ఒప్పందమేదీ?: పాక్
ఇస్లామాబాద్: నేరగాళ్ల అప్పగింతకు భారత్‌తో తమకు ద్వైపాక్షిక ఒప్పందమేమీ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా పాక్‌ను భారత్ కోరడం తెలిసిందే. ఇందుకవసరమైన అన్ని పత్రాలను కూడా పాక్‌కు ఇప్పటికే అందజేసినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ నుంచి అభ్యర్థన అందిందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ధ్రువీకరించారు. అయితే హఫీజ్ అప్పగింతకు వీలు కల్పించే ద్వైపాక్షిక ఒప్పందమేదీ ఇరు దేశాల మధ్య లేదన్నారు. -
భారత్ రిక్వెస్ట్‌కి పాక్ నో!
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ కోరిందని పాకిస్థాన్ నిర్ధారించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అయితే.. హఫీజ్‌ను అప్పగించేందుకు మాత్రం పొరుగు దేశం పరోక్షంగా నో చెప్పేసింది. ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ అభ్యర్థించిందని పాకిస్థాన్ చెప్పింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు. అయితే.. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవన్నారు. మరోవైపు ఢిల్లీ వర్గాలు కూడా ఈ తరహా ఒప్పందం ఇస్లామాబాద్‌తో లేదని ధృవీకరించాయి. ఇక.. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్‌లో అనేక కేసులలో వాంటెడ్‌గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో కూడా అతడి పేరు ఉందన్న విషయం తెలిసిందే. పాక్‌లో మత పెద్దగా చెలామణి అవుతున్న సయీద్‌ను 2019లో అక్కడి ఉగ్రవాద వ్యతిరేక కలాపాల న్యాయస్థానం అరెస్ట్ చేసింది. ఆ టైంలో సయీద్ అతని అనుచరులపై ఏకంగా 23 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఇక.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఉగ్రవాదులకు డబ్బు సాయం అందించిన రెండు కేసులకు సంబంధించి.. యాంటీ-టెర్రరిజం కోర్టు సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 నాటి భయానక ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృత్యువాత పడ్డారు. అయితే పాక్‌లో సయీద్‌కు లభించే వీఐపీ ట్రీట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. సయీద్‌కు అక్కడి ఆర్మీ సంరక్షణలో ఉండడం, అక్కడ రాజకీయ పార్టీలు సైతం సయీద్ ఉగ్ర కార్యకలాపాలను ఖండించకపోవడం చూస్తున్నదే. ఇక.. సయీద్ కొడుకు తల్హా సయీద్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. -
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ
ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు. పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! -
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్‌లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్‌లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్‌లో సాహిద్ మిర్, జూన్‌లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్‌లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
ముంబై పేలుళ్ల సూత్రధారికి 32 ఏళ్ల జైలు శిక్ష
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్(70)కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 32 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రముఠాలకు ఆర్థిక సాయం అందించిన కేసులో 2019లో ఇతడికి 36 ఏళ్ల జైలు శిక్ష పడగా ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన మరో రెండు కేసుల్లో కలిసి 32 ఏళ్లతోపాటు, 3.40 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తూ తాజాగా గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్‌పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇండియాకు చెందిన ఎన్ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది. -
హఫీజ్ సయీద్‌కు కఠిన కారాగార శిక్ష
లాహోర్: ముంబై దాడుల్లో మాస్టర్ మైండ్, నిషేధిత జమాత్ –ఉద్–దవా(జుద్) చీఫ్, హఫీజ్ సయీద్‌కి పాక్‌లోని లాహోర్‌లో ఉన్న యాంటీ టెర్రరిస్టు కోర్టు 15 ఏళ్ల 6నెలల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న నాలుగు నేరాల్లో ఇప్పటికే 70 ఏళ్ళ సయీద్‌కి 21 ఏళ్ళ శిక్ష పడింది. గురువారం సయీద్ సహా జమాత్–ఉద్–దవా ఉగ్రవాద సంస్థ ఐదుగురు నాయకులకు కోర్టు పదిహేనున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని కోర్టు అధికారులు తెలిపారు. సయీద్‌కి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చి ప్రోత్సహిస్తున్నారన్న ఐదు నేరాల్లో కలిపి మొత్తం 36 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. కాగా, 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. -
హఫీజ్ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్-ఉల్-దవా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లాహోర్ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్‌తో పాటు జాఫర్ ఇక్బాల్, యహ్యా ముజాహిద్ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్ రెహమాన్ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: చిత్తశుద్ధి లేని చర్య) అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఇక ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న హఫీజ్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్ సయీద్ పాక్‌లోని కోట్ లాక్‌పాత్ జైలులో ఉన్నాడు. ప్రపంచ తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్న హఫీజ్ పాకిస్తాన్ కేంద్రంగా భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నాడని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే జమాత్-ఉల్-దవా ప్రతినిధులపై పాకిస్తాన్ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కేసులు నమోదు చేసింది. 4 కేసుల్లో హఫీజ్ సయీద్ దోషిగా తేలగా మిగతావి పాక్‌లోని పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరం లేకుండా చేయాలని భారత్ తన మిత్ర దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను ఎప్పటి నుంచో కోరుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడంపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఏటిఎఫ్ కు భారత్ కొన్ని ఆధారాలను అందించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై బాంబు దాడికి పాల్పడిన జైషే-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కొన్ని పాక్ సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని భారత్ ఆధారాలతో సహా ఎఫ్ఏటిఎఫ్ కు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాదులకు మద్దతిస్తుందన్న ఆరోపణల కారణంగా ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీంతో ప్రంపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వంటి సంస్థలు పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్ గత్యంతరం లేక ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. -
చిత్తశుద్ధి లేని చర్య
ముంబై మహానగరంపై పన్నెండేళ్లక్రితం జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు బుధవారం 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇది విని అమెరికా హర్షం వ్యక్తంచేసింది గానీ పాకిస్తాన్ న్యాయస్థానాల తీరుతెన్నులు, అక్కడి పాలకుల ఎత్తుగడలు తెలిసినవారికి ఈ పరిణామం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు ముసుగు సంస్థగా రంగంలోకొచ్చిన జేయూడీ మన దేశంలో 173 మందిని పొట్టనబెట్టుకున్న ముంబై ఉగ్రవాద దాడి కేసులో మాత్రమే కాదు... 12 మంది మరణించిన 2001 పార్లమెంటు దాడి, 209 మంది చనిపోయిన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు వగైరాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కేసుల్లో హఫీజ్‌ను అప్పగించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. ముంబై ఉగ్ర దాడికి సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించింది. కానీ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవని, మరిన్ని వివరాలు కావాలని పదే పదే అడగటం తప్ప పాక్ చేసిందేమీ లేదు. ముంబై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికా పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలుశిక్ష అను భవిస్తున్న పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ సైతం ఆ దాడిలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం, లష్కర్‌తో దానికున్న సంబంధాలు, హఫీజ్ సయీద్ పోషించిన పాత్ర వగైరాలపై పూస గుచ్చినట్టు చెప్పాడు. అలాంటి హఫీజ్‌కు ఇప్పుడు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించిన కేసులో శిక్ష పడింది. అతగాడి పాపాల చిట్టాతో పోలిస్తే ఈ ఆర్థిక సాయం ఆరోపణ చాలా చిన్నది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినప్పుడు హఫీజ్‌ను జైలుకు పంపడం, అవి చల్లారగానే అతన్ని విడుదల చేయడం రివాజుగా మారింది. మధ్యమధ్య గృహ నిర్బంధంలో ఉంచడం కూడా సర్వసాధారణం. గత పదేళ్లుగా ఈ తంతు నడుస్తూనేవుంది. 90వ దశకం చివర లష్కరే సంస్థను నిషేధించినప్పుడు అప్పటికి ఉనికిలో లేని జమాత్ ఉద్ దవావల్ ఇర్షాద్ అనే సంస్థ పంచన చేరిన హఫీజ్ 2002లో దాన్ని జేయూడీగా మార్చుకున్నాడు. అది ధార్మిక సంస్థ అని చెప్పుకున్నాడు. దానిద్వారా భారీయెత్తున నిధులు సేకరించడం, ఆ నిధుల్ని ఖర్చుపెట్టి ఉగ్రవాద మూకలను తయారు చేయడం వంటి చర్యలు కొనసాగిస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వాలు కళ్లు మూసుకున్నాయి. జేయూడీకి సైన్యం అండదండలుండటమే ఇందుకు కారణం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరుడు అమెరికా పర్యటనలో వుండగా ఇలాంటి ఉగ్ర మూకల గురించి తీవ్రంగానే మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్, కశ్మీర్‌లలో పోరాడిన సాయుధ మిలిటెంట్లు 30,000 నుంచి 40,000 వరకూ పాక్‌లో ఉన్నారని ప్రకటించారు. పాక్‌ను గతంలో ఏలినవారంతా ఈ నిజాన్ని దాచి దేశానికి నష్టం కలగ జేశారని ఆరోపించారు. ఈ మాదిరి మిలిటెంట్లపై తాము చర్యలు తీసుకోవడం మొదలుపెట్టామని కూడా చెప్పారు. కానీ అందులో అర్థసత్యమే ఉందని ప్రపంచానికంతకూ తెలుస్తునే వుంది. అందుకు హఫీజ్ సయీద్ ఉదంతమే పెద్ద ఉదాహరణ. నిజంగా తన దేశంలో సాయుధ మిలిటెంట్ల బెడద వుండకూడదనుకుంటే హఫీజ్పైనా, అలాంటి మరికొందరిపైనా పకడ్బందీ సాక్ష్యాలు సేకరించి, వారందరికీ ఎప్పుడో శిక్ష పడేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఆ విషయంలో చిత్తశుద్ధి కనబడటం లేదు. ఇప్పుడైనా శిక్ష పడిన సందర్భమేమిటో గమనిస్తే చివరకు ఈ కేసు ఏమవుతుందో సులభంగానే తెలుస్తుంది. జీ–7 దేశాల చొరవతో 1989లో ఏర్పడి, పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద లావాదేవీల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఉగ్రవాదుల కదలికలను, వారి లావాదేవీలను గమనిస్తూ వుంటుంది. ఏ దేశమైనా ఇలాంటి లావాదేవీలను నిరో ధించలేకపోయినా, వాటిని ప్రోత్సహిస్తున్నట్టు అనుమానం కలిగినా, ఉగ్ర సంస్థల నిధుల వ్యవ హారాన్ని దర్యాప్తు చేయడంలో సహకరించకపోయినా అనుమానిత దేశాల జాబితాలో లేదా కుమ్మక్కయిన దేశాల జాబితాలో చేరుస్తుంది. పర్యవసానంగా ప్రపంచ దేశాలనుంచి వాటికి ఆర్థిక సాయం నిలిచిపోతుంది. బ్లాక్ లిస్టులో చేరిన దేశాలపై ఇతరత్రా ఆంక్షలు కూడా విధిస్తారు. ఇరాన్, ఉత్తర కొరియాలపై ఈ వంకనే ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ సంస్థ నిరుడు జూన్‌లో సమావే శమైనప్పుడు పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. 2020 ఫిబ్రవరి 20కల్లా చర్య తీసుకోకపోతే చర్యలు తప్పవని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహ రించలేకపోతున్నారని చీవాట్లు పెట్టింది. నిజానికి అప్పట్లోనే కఠిన చర్య తీసుకోవాల్సివున్నా చైనా, టర్కీ, మలేసియా, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి జోక్యం చేసుకుని ఆ దేశానికి మరికొంత సమయం ఇద్దామని నచ్చజెప్పాయి. మరో మూడురోజుల్లో పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి హఫీజ్‌పై చర్యకు వెనకాడితే ఎవరూ తనను సమర్థించరన్న భయం పాకిస్తాన్‌కు వుంది. అలాగే అఫ్ఘానిస్తాన్ ఊబిలో కూరుకుపోయిన అమెరికా సాధ్యమైనంత త్వరగా అక్కణ్ణించి బయటపడాలని చూస్తోంది. పాక్ అండ లేకుంటే అది సాధ్యం కాదు గనుక, ఎఫ్ఏటీఎఫ్ బెడద తప్పించుకోవడానికి వెనువెంటనే ఏదో ఒక చర్య తీసుకోమని అమెరికా సలహా ఇచ్చి వుండొచ్చు కూడా. మొత్తానికి ఇలా స్వీయ ప్రయోజనాలను ఆశించి ఉగ్రవాదంపై భిన్న వైఖరులు తీసుకునే దేశాల వల్లే పాకిస్తాన్ ఇష్టానుసారం వ్యవహరించగలుగుతోంది. ఇది అంతిమంగా ఉగ్రవాదులకు ఊతం ఇస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు ముగిశాక పాక్‌లో మరో న్యాయస్థానం హఫీజ్ నిర్దోషి అని తీర్పి చ్చినా ఆశ్చర్యం లేదు. సంస్థల నిషేధం, వ్యక్తుల అరెస్టులు మించి అదనంగా పాక్ ఏం చేస్తున్నదో నిశితంగా గమనించాల్సిన అవసరం... అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకుంది. ముఖ్యంగా ఉగ్రవాదం రాజ్య విధానంగా లేదా దాని ఉపకరణంగా మారకూడదన్న స్పష్టత అందరికీ ఉండాలి. -
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు షాక్
ఇస్లామాబాద్ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజమ్ కోర్టు (ఏటీసీ) షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్‌పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో హాఫీజ్ 16 సార్లు అరెస్ట్ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్.. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
ఉగ్ర సయీద్‌కు ఊరట
లాహోర్: ముంబై ఉగ్ర పేలుళ్ల ప్రధాన సూత్రదారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ (జమాత్–ఉద్–దవా) చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజమ్ కోర్టులో (ఏటీసీ) ఆశ్చర్యకర రీతిలో స్వల్ప ఊరట లభించింది. ఉగ్ర నిరోధక కేసులో హఫీజ్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న మాలిక్ జాఫర్ ఇక్బాల్‌ను అధికారులు విచారణకు హాజరుపర్చకపోవడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక్బాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా హఫీజ్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 11న అతడిపై అభియోగాలు నమోదు చేస్తామని శనివారం తెలిపింది. 11న ఇక్బాల్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది. -
వాళ్లను విచారించి తీరాల్సిందే: అమెరికా
వాషింగ్టన్ : తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లష్కర్-ఎ-తొయిబా నాయకుడు హఫీజ్ సయీద్ సహా ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని పేర్కొంది. తమ దేశ భవిష్యత్తు కోసం ఉగ్రవాదలును ఏరివేస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ ట్వీట్ చేశారు. కాగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ) బ్లాక్‌లిస్టులో ఉన్న దేశాల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇక భారత్‌లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన పాకిస్తాన్... తాము విడుదల చేసి నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తమ జాబితాలో గ్రేలిస్టులో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఇరాన్, ఉత్తర కొరియాలతో పాటు బ్లాక్‌లిస్టులో చేరుస్తామని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది. అక్టోబరు 2019 నాటికి తమ విధానమేమిటో స్పష్టం చేయాలని పాక్‌ను కోరింది. ఈ నేపథ్యంలో గురువారం ఎల్టీఈ చీఫ్ సయీద్ సహా ఉగ్ర సంస్థలకు సహాయం చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఇక 2008లో ముంబై పేలుళ్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్‌పై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల్లో అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం విదితమే. -
హఫీజ్ సయీద్‌ను దోషిగా నిర్ధారించిన పాక్ కోర్టు
పాకిస్తాన్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ)చీఫ్ హఫీజ్ సయీద్‌ను గుజ్రన్‌వాలాలోని యాంటీ టెర్రరిజమ్ కోర్టు దోషిగా తేల్చింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశాడనే కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) వాదనతో ఏకీభవించింది. తదుపరి ఈ కేసు విచారణ పాక్‌లోని గుజరాత్ యాంటీ టెర్రరిజం కోర్టులో జరగనుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లేముందు హఫీజ్ సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా జులై 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హఫీజ్‌ను హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. -
గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా
వాషింగ్టన్ : ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో పాక్ ఏ మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో ఇకపై చూడాల్సి ఉందని వైట్‌హౌజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్లు, భారత పార్లమెంట్‌పై దాడి సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరిపాలనా అధికారి మాట్లాడుతూ.. ‘గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మిలిటరీ గ్రూపులకు పాకిస్తాన్ సైన్యం సహాయం చేస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో ఉగ్ర సంస్థల ఆస్తులు సీజ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు హషీజ్ సయీద్ విషయంలో పాక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో అతడు ఏడుసార్లు అరెస్టయ్యాడు. కానీ వెంటనే విడుదలయ్యాడు కూడా. అందుకే అతడి అరెస్టు లష్కర్-ఎ-తొయిబా కార్యకలాపాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది మన ముందున్న ప్రశ్న. తూతూ మంత్రంగా కాకుండా పాక్ నిజంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని భావిస్తే ఆ దేశంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయి’ అని పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇక హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇక జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. -
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
సయీద్ అరెస్టుకు సిద్ధం
లాహోర్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్‌తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్ సయీద్‌తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్‌ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు. సయీద్ ప్రస్తుతం లాహోర్ లోని జాహర్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్‌కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్‌లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ గతంలో విధించిన గడువును పాక్ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్ వరకు పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్ అరెస్టుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. -
‘ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది అతడు’
ముంబై : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను పొగుడుతూ బ్రిడ్జ్ పిల్లర్‌పై గుర్తు తెలియని దుండగులు రాతలు రాయడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ విచారణ చేపట్టింది. వివరాలు.. ముంబై అర్బన్‌లోని బ్రిడ్జి పిల్లర్లపై ఐఎస్ హెడ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీ, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పొగుడుతూ రాతలు వెలిశాయి. ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది బాగ్దాది అంటూ ఐఎస్‌ను చీఫ్‌ను పొగడటంతో పాటు.. పోర్టు, ఎయిర్‌పోర్టు, పైప్‌లైన్, ట్రెయిన్ వంటి వివిధ చిత్రాలను గీసిన దుండగులు వాటిని మార్క్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కోప్తా గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఏటీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అర్బన్ ఏరియా, పోర్టు సమీపంలో భద్రత పటిష్టం చేశారు. బుధవారం రంజాన్ నేపథ్యంలో అల్లర్లు ప్రేరేపించేందుకే దుండగులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బ్రిడ్జికి సమీపంలో మద్యం సీసాలు లభించిన కారణంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
సయీద్‌కు ఐరాస షాక్
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్‌పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యతిరేకించగా, పాక్ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్‌పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్ రసూల్ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు. లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న డానియెల్ కిఫ్సెర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్‌పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు. -
నిర్బంధంలో అజహర్ కొడుకు, సోదరుడు
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్ మసూద్ అజహర్ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్ కొడుకు హమద్ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్ హోం శాఖ వెల్లడించింది. అరెస్ట్ కాదు..: భారత్ ఈఅరెస్టులపై భారత్ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో జమాతే–ఉద్–దవా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్ ఫౌండేషన్‌ను పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్‌లిస్ట్‌లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
ఓటేసిన అంతర్జాతీయ ఉగ్రవాది
లాహోర్, పాకిస్తాన్ : అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్‌లోని ఓ ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్ల అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సయీద్ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్ మిల్లీ ముస్లిం లీగ్(ఎమ్‌ఎమ్‌ఎల్) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు. పాకిస్తాన్ ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. -
అమెరికా బానిస కొడుకులకు, మోదీ స్నేహితులకు..
‘‘అమెరికా బానిస కొడుకులకు, నరేంద్ర మోదీ స్నేహితులకు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టయితే, మీ గొయ్యిని మీరు తవ్వుకున్నట్టే’’ అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నాడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్! రాజకీయ ముసుగేసుకుని ఈ నెల 25న జరిగే పాకిస్తాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఇతగాడు.. 265 మందిని పోటీకి పెట్టాడు. ‘‘అమెరికా మద్దతు ఉన్న అఫ్గానిస్తాన్‌లో భారత్ తిష్టేసింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’’ అంటూ విషప్రచారం సాగిస్తున్నాడు. నిషేధిత/ఉగ్ర గ్రూపుల ప్రతినిధులు పాక్‌లో భారీగా పోటీకి దిగారు. సైన్యం మద్దతుతో పెట్రేగిపోతున్నారు. భారత్‌తో శాంతి సంబంధాల గురించి మాట్లాడుతున్న పీఎంఎల్ (ఎన్)ను పక్కకు తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారి పాత్రధారీ సైన్యమే. పాకిస్తాన్‌తోపాటు భారత్‌కూ అత్యంత అపాయకరమైన ఈ పరిణామాలపై ఓ పరిశీలన. ఔరంగజేబ్ ఫరూకీ.. పాకిస్తాన్లో మతం పేరిట హింసను ప్రేరేపిస్తున్న ఓ నిషేధిత ఉగ్రవాద గ్రూపు నాయకుడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా షియా కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో ఇతడు పోటీ చేస్తున్నాడు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధ బాంధవ్యాలున్న అనేక మంది అభ్యర్థుల్లో ఫరూకీ కూడా ఒకడు. మిలిటెంట్లతో ఫరూకీ గ్రూపునకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఓ కోర్టు అతడి పోటీకి అనుమతించింది. ఫరూఖీ సహా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉగ్రవాద నిఘా జాబితా (ఉగ్ర నిరోధక చట్టంలోని ఫోర్త్ షెడ్యూల్)లో ఉన్నారు. జనసమూహాల్ని కలిసేందుకు, కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు, బ్యాంకు అకౌంట్లు వాడేందుకు చట్టం అనుమతించనప్పటికీ వారు ఎన్నికల బరిలో నిలిచారు. 2013 ఎన్నికల్లో కేవలం 202 ఓట్లతో ఓడిపోయిన ఫరూకీ.. ప్రస్తుతం కరాచీలో ఓ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అతడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే మాటలు వినబడుతున్నాయి. సైన్యం ప్రమేయంతోనే ఇలాంటి గ్రూపుల ప్రతినిధులు చట్టపరమైన అడ్డంకుల నుంచి బయటపడగలుగుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. వీరు గనుక జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే విధాన నిర్ణయాల్లో సైన్యానికి తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు. లష్కరే తొయిబా విభాగమైన జమాత్–ఉద్–దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ‘మిల్లీ ముస్లిం లీగ్’ పార్టీ స్థాపించి తన కొడుకు, అల్లుడితో సహా 265 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపాడు. వీరిలో 80 మంది జాతీయ అసెంబ్లీకి, 185 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీ నమోదుకు నిరాకరించడంతో అల్లాహో అక్బర్ తెహరీక్ (ఏఏటీ) అనే పార్టీ పేరిట హఫీజ్ రంగంలోకి దిగాడు. పాక్ రాజకీయ నాయకుల్ని భారత్–అమెరికాల కీలుబొమ్మలుగా వర్ణిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ముత్తాహి–ఇ–మజ్లిస్ (ఎంఎంఏ) అనే ఐదు ఛాందస పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. మరోవైపు ఇస్లాంను దూషించే వారిని శిక్షిస్తానంటున్న తెహ్రీక్–ఇ–లబ్బైక్ అనే పార్టీ ఈ నెలలో అధికారిక ఆమోదం దక్కించుకుని పోటీకి దిగింది. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపిన ఖాద్రి ఈ గ్రూపునకు చెందిన వాడే. తర్వాతి కాలంలో అతణ్ణి ఉరి తీశారు. పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్యం మద్దతు ఉన్న ఈ జిహాదీ గ్రూపులు కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా ఎన్నికల చట్టబద్ధత... ఉగ్ర ప్రతినిధులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంపై పాక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసేందుకు ఈ గ్రూపుల అభ్యర్థుల్ని అనుమతించడం, ప్రచారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పీపీపీ, అవామీ వర్కర్స్ పార్టీల అభ్యర్థులపై భద్రతా బలగాలు వేధింపులకు పాల్పడటం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల చట్టబద్ధతనే ఆ సంస్థ ప్రశ్నిస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీపై సైనిక నేతల గురి... పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు సైనిక నేతలు. విదేశాంగ విధాన సంబంధిత విషయాల్లో ప్రత్యేకించి భారత్ విషయంలో తమతో విభేదించిన ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్ల వారు కంటగింపుగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణాన్ని ఉపయోగించుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించగలిగారు. న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని షరీఫ్‌నూ, ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తెను జైలుకు పంపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ షరీఫ్ పార్టీని తప్పించాలనే మిలటరీ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్’ (పీటీఐ)ని గెలిపించేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక నేత గతంలో కంటేæ ఇప్పుడు బలం పుంజుకున్నాడు. ఇమ్రాన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చునని లేదంటే స్వల్ప ఆధికత్యతో బయటపడవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం నవాజ్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ హోదా సంపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
జైల్లో మాజీ ప్రధాని.. ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాది
లాహోర్ : ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ధోరణి మరోసారి బట్టబయలయింది. అవినీతి కేసుల్లో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేశామంటూ గొప్పలు చెప్పుకున్న పాక్, ఉగ్రవాదుల విషయంలో మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను స్వదేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ముంబై దాడుల ప్రధాన సూత్రధారుడు, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో మాత్రం పాక్ ఇందుకు భిన్న వైఖరి కనబరుస్తోంది. ఇప్పటికే అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డుతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రసుత్తం జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఉగ్ర సంస్థకు హఫీజ్ అధినేతగా ఉన్నాడు. మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ జూలై 25న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో హఫీజ్ కొడుకు, అల్లుడు, 13 మంది మహిళలతో పాటు జేయూడీ ఉగ్ర సంస్థకు చెందిన 265 మంది సభ్యులు ఎంఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాల్లీలో హఫీజ్ పాల్గొంటున్నాడు. ఎంఎంఎల్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో జేయూడీ ఉగ్ర సంస్థ సీనియర్ యాకుబ్ షేక్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, ధర్మం ప్రతిపాదికన ఎంఎంఎల్ అభ్యర్థులను గెలిపించాలని పాక్ ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాక్‌లోని పరిస్థితులను మార్చివేస్తామని అన్నారు. మానవత్వంతో సేవలందిస్తామని, కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తామని తెలిపారు. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా భారత్, యూఎస్‌లపై విరుచుకుపడుతున్నారు. అవినీతికి పాల్పడ్డ ఆ దేశ మాజీ ప్రధానిని జైల్లో ఉంచిన పాక్, ఉగ్ర సంస్థలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కరడుగట్టిన ఉగ్రవాదిగా ఏడు దశల్లో శిక్షణ
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్‌పై దాడులకు నిరంతరం పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. హఫీజ్‌ని అప్పగించాలంటూ భారత్ ఒకవైపు అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే అతను యదేచ్ఛగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హఫీజ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా కలసికట్టుగా భారత్‌పై దాడులు జరపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ ఉగ్రసంస్థలు బహిరంగంగానే ఆసక్తి ఉన్న వారు శిక్షణలో చేరవచ్చు అంటూ యువకులకి వల విసురుతున్నాయి. ఈ విషయాన్ని గత మార్చి 20న కుప్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జబియుల్లా అలియాస్ హమ్జా వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అతను కఠోరమైన వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచాడు. ఇంటరాగేషన్‌లో హమ్జా చెప్పిన విషయాలను క్రోడీకరించి ఎన్ఐఏ ఒక నివేదిక రూపొందించింది. ‘జమాత్ ఉద్ దవా బహిరంగంగానే జిహాదీల కోసం ఆహ్వానిస్తోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వారికి కఠోర శిక్షణ ఇస్తోంది. అలా శిక్షణ తీసుకుంటున్న వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు బయటపెడుతున్నారు. సయీద్ హఫీజ్, లష్కరేకి చెందిన జకీర్ ఉర్ రెహ్మన్ లఖ్వీలు బహిరంగంగానే యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటూ’ హమ్జా వెల్లడించాడు. అంతేకాదు వీరికి ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు దశల్లో శిక్షణ ఇస్తారు. మొత్తం రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల సమయంలో సయీద్ హఫీజ్ తనని తాను అమీర్ సాహెబ్ లేదంటే అమీర్–మస్గర్‌గా వ్యవహరిస్తాడు. ఉగ్రవాదంలో శిక్షణనిచ్చే ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ కోసం చేరిన వారు కూడా అతనిని అమీర్ సాహెబ్ అనే పిలవాలి. ఇక శిక్షణనిచ్చే వారిని మసూల్స్, కాక్రూన్స్ అని పిలుస్తారు. ఈ శిక్షకులు జోన్, జిల్లా, తెహ్సీల్, పట్టణ , సెక్టార్స్థాయిలో ఉంటారు. వివిధ మదరసాల నుంచి పనికొచ్చేవారికి మసూల్స్ ఎంపిక చేసి లాహోర్‌లోని శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నారని ఇంటరాగేషన్‌లో హమ్జా తెలిపాడు. ఎక్కడెక్కడ ఎలా ఈ శిక్షణ ఇస్తున్నారంటే.. 1. దౌరాబైత్ ఉల్ రిజ్వాన్, పంజాబ్ యుద్ధ శిక్షణ 2. తబూక్ క్యాంప్ గడి, హబిబుల్లా ఫారెస్ట్ సాయుధ శిక్షణ 3. ఆక్సా మసర్ కేంప్ షువై నాలా.. ముజఫరాబాద్ మ్యాప్ రీడింగ్, జీపీఎస్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ 4. కరాచీ ఫుడ్ సెంటర్, ముజఫరాబాద్ సరకుల్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం, నిల్వ, వినియోగంలో శిక్షణ 5. డైకెన్, ముజఫరాబాద్ గోడలు ఎక్కడంలో శిక్షణ 6. మస్కర్ ఖైబర్ అండర్ గ్రౌండ్ సెంటర్, ముజఫరాబాద్ ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ 7. ఖలీద్ బిన్ వాలిద్, జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం, ముజఫరాబాద్ ఆయుధాలు, దుస్తులు పంపిణీలో శిక్షణ శిక్షణా శిబిరాలకు సయీద్, లఖ్వీ హాజరయ్యేవారు : హమ్జా హమ్జా తండ్రి స్వయంగా మసూల్. అతనే తనకి ఉగ్రవాదం శిక్షణ ఇచ్చాడని హజ్జా వెల్లడించాడు. ఈ శిక్షణ శిబిరాల్లో తమకు ఎలాంటి అవసరం వచ్చినా పాక్ ఆర్మీ, ఐఎస్ఎస్ సిబ్బంది సాయం చేసేవారని చెప్పాడు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన సమయంలో సయీద్, లఖ్వీలుకూడా వచ్చేవారని చెప్పాడు. సయీద్ అందరినీ హత్తుకొని భారత్‌పై దాడులకు దిగండంటూ ప్రేరేపించాడని హజ్జా చెప్పుకొచ్చాడు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పశ్చిమాసియా దేశానికి సయీద్ తరలింపు??
న్యూఢిల్లీ : ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను తప్పించేందుకు కుట్ర జరగుతోందా?. ఈ మేరకు పాకిస్తాన్, చైనాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ సంచలన రిపోర్టును ప్రచురించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్‌ను ఏదైనా పశ్చిమాసియా దేశానికి పంపి, సంరక్షించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీకి సూచించినట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియా దేశాలు అయితేనే సయీద్ ‘ప్రశాంత జీవితం’ గడపటానికి అవకాశం ఉంటుందని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు తెలిపింది. గత నెలలో చైనాలో బీఓఏఓ సమావేశం వేదికగా జిన్‌పింగ్, అబ్బాసీలు కలుసుకున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో దాదాపు 10 నిమిషాల పాటు హఫీజ్ సయీద్ అంశంపైనే జిన్‌పింగ్ మాట్లాడినట్లు ది హిందూ పేర్కొంది. సయీద్‌ను వెలుగులో నుంచి తప్పించడం వల్ల తొందరగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చని జిన్‌పింగ్ అబ్బాసీకి చెప్పినట్లు తెలిపింది. ఈ మేరకు అబ్బాసీ ప్రభుత్వ న్యాయకోవిదులతో ఈ మేరకు చర్చించినట్లు పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే పరిష్కారాన్ని చూపలేదని వెల్లడించింది. ఈ నెల 31తో అబ్బాసీ ప్రభుత్వ సమయం ముగుస్తుండటంతో కొత్త ప్రభుత్వానికి సమస్యను అప్పజెప్పే ఆలోచనలో కూడ ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది జులై మాసం ఆఖర్లో పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ముంబై దాడుల అనంతరం ఐక్యరాజ్యసమితి హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమతి, భారత్, అమెరికాలు సయీద్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు బహుమానాన్ని సైతం ప్రకటించాయి.