
లాహోర్: ముంబై ఉగ్ర పేలుళ్ల ప్రధాన సూత్రదారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ (జమాత్–ఉద్–దవా) చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజమ్ కోర్టులో (ఏటీసీ) ఆశ్చర్యకర రీతిలో స్వల్ప ఊరట లభించింది. ఉగ్ర నిరోధక కేసులో హఫీజ్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న మాలిక్ జాఫర్ ఇక్బాల్‌ను అధికారులు విచారణకు హాజరుపర్చకపోవడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక్బాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా హఫీజ్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 11న అతడిపై అభియోగాలు నమోదు చేస్తామని శనివారం తెలిపింది. 11న ఇక్బాల్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది.