Jamaat-ud-Dawah (JuD)
-
హఫీజ్ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్-ఉల్-దవా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లాహోర్ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్‌తో పాటు జాఫర్ ఇక్బాల్, యహ్యా ముజాహిద్ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్ రెహమాన్ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: చిత్తశుద్ధి లేని చర్య) అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఇక ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న హఫీజ్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్ సయీద్ పాక్‌లోని కోట్ లాక్‌పాత్ జైలులో ఉన్నాడు. ప్రపంచ తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్న హఫీజ్ పాకిస్తాన్ కేంద్రంగా భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నాడని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే జమాత్-ఉల్-దవా ప్రతినిధులపై పాకిస్తాన్ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కేసులు నమోదు చేసింది. 4 కేసుల్లో హఫీజ్ సయీద్ దోషిగా తేలగా మిగతావి పాక్‌లోని పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరం లేకుండా చేయాలని భారత్ తన మిత్ర దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను ఎప్పటి నుంచో కోరుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడంపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఏటిఎఫ్ కు భారత్ కొన్ని ఆధారాలను అందించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై బాంబు దాడికి పాల్పడిన జైషే-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కొన్ని పాక్ సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని భారత్ ఆధారాలతో సహా ఎఫ్ఏటిఎఫ్ కు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాదులకు మద్దతిస్తుందన్న ఆరోపణల కారణంగా ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీంతో ప్రంపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వంటి సంస్థలు పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్ గత్యంతరం లేక ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. -
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు షాక్
ఇస్లామాబాద్ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజమ్ కోర్టు (ఏటీసీ) షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్‌పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో హాఫీజ్ 16 సార్లు అరెస్ట్ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్.. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
ఉగ్ర సయీద్‌కు ఊరట
లాహోర్: ముంబై ఉగ్ర పేలుళ్ల ప్రధాన సూత్రదారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ (జమాత్–ఉద్–దవా) చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజమ్ కోర్టులో (ఏటీసీ) ఆశ్చర్యకర రీతిలో స్వల్ప ఊరట లభించింది. ఉగ్ర నిరోధక కేసులో హఫీజ్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న మాలిక్ జాఫర్ ఇక్బాల్‌ను అధికారులు విచారణకు హాజరుపర్చకపోవడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక్బాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా హఫీజ్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 11న అతడిపై అభియోగాలు నమోదు చేస్తామని శనివారం తెలిపింది. 11న ఇక్బాల్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది. -
హఫీజ్ సయీద్‌ను దోషిగా నిర్ధారించిన పాక్ కోర్టు
పాకిస్తాన్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ)చీఫ్ హఫీజ్ సయీద్‌ను గుజ్రన్‌వాలాలోని యాంటీ టెర్రరిజమ్ కోర్టు దోషిగా తేల్చింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశాడనే కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) వాదనతో ఏకీభవించింది. తదుపరి ఈ కేసు విచారణ పాక్‌లోని గుజరాత్ యాంటీ టెర్రరిజం కోర్టులో జరగనుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లేముందు హఫీజ్ సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా జులై 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హఫీజ్‌ను హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. -
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
సయీద్ అరెస్టుకు సిద్ధం
లాహోర్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్‌తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్ సయీద్‌తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్‌ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు. సయీద్ ప్రస్తుతం లాహోర్ లోని జాహర్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్‌కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్‌లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ గతంలో విధించిన గడువును పాక్ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్ వరకు పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్ అరెస్టుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. -
ఉగ్ర సయీద్ ఆస్తులు పాక్ చేతికి!
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులు, అతడి అధీనంలోని స్వచ్ఛంద సంస్థలను స్వాధీనం చేసుకోడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్–ఉద్–దవా (జేయూడీ), ఫలాహ్–ఎ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐ ఎఫ్)లను అధీనంలోకి తీసుకోవాలని ఐదు ప్రావిన్సులు, లా ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలకు ఆర్థిక శాఖ రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. సంబంధించిన రహస్య పత్రాలను రాయిటర్స్ సంపాదించింది. 1987లో ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలని, 2008 ముంబై మారణహోమం వెనుక హఫీజ్ హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. హఫీజ్ ఆధ్వర్యంలో 300 పాఠశాలలు, ఆస్పత్రులు, ఓ ప్రచురణ సంస్థ, అంబులెన్స్ సర్వీసులు పని చేస్తున్నాయి. అలాగే జేయూడీ, ఎఫ్ఐఎఫ్ సంస్థల్లో 50,000 వరకు వలంటీర్లు, వందల్లో పెయిడ్ వర్కర్లు పని చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక సంస్థలు చెబుతున్నాయి. కాగా, హఫీజ్ సంస్థలను స్వాధీనం చేసుకుం టున్నట్లు వస్తున్న వార్తలపై పాక్ మంత్రి ఇక్బాల్ స్పందిస్తూ.. బాధ్యత గల దేశంగా నిషేధిత సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేస్తున్నామని, అమెరికా ఒత్తిడి మేరకు తాము చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. విరాళాలపై నిషేధం జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండా పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. జేయూడీ, ఎఫ్ఐఎఫ్లతోపాటు సయీద్‌కు చెందిన మరికొన్ని సంస్థలకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండదంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ షాక్..!!
కరాచీ : ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు హఫీజ్ సయీద్ ఆస్తులను, సంస్థలను హస్తగతం చేసుకునేందుకు పాకిస్తానప్రభుత్వం వ్యూహాన్ని రచించిందా?. ఈ విషయాన్నే రాయిటర్స్ రిపోర్టులు ధ్రువపరుస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 19న ఈ మేరకు ఫెడరల్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో పాకిస్తాన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్-ఉద్-దవా(జేయూడీ), ఫలా-ఈ-ఇన్సానియాత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్)లను హస్త గతం చేసుకోవాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖకు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దేశంలోని ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 2008 నవంబర్‌లో ముంబైపై ఉగ్రదాడులు చేసిన లష్కర్-ఈ-తైబాకు జేయూడీ, ఎఫ్ఐఎఫ్లు సాయం చేశాయని అమెరికా పేర్కొంది. వాటిని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే సంస్థలుగా పరిగణించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్న హఫీజ్ సయీద్‌ను పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమానాన్ని కూడా ప్రకటించింది. కాగా, హఫీజ్ సయీద్ సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై పాకిస్తాన్ హోం శాఖ మంత్రి అహ్శాన్ ఇక్బాల్‌ను అడుగ్గా.. నిధులు సమకూర్చుకుంటున్న అన్ని సంస్థలపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించారు. -
హఫీజ్ సయీద్‌తో పొత్తుకు సిద్ధమే!
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇటీవలే జై కొట్టిన పాక్ మాజీ మిలటరీ రూలర్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో పొత్తు సిద్దమని ముషారఫ్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్ చెప్పారు. గత నెల్లో పాకిస్తాన్‌లోని 23 పార్టీలతో కలిపి అవామీ ఇత్తేహాద్ కూటమిని ముషారఫ్ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్‌ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పలు మతసంస్థలపై హఫీజ్ సయీద్ పట్టుసాధించాడు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్ సయీద్ పేరును తొలగించాలని ముషారఫ్ కోరారు. -
హఫీజ్ సయీద్ హత్యకు కుట్ర!
లాహోర్: నిర్బంధంలో ఉన్న ముంబై దాడుల సూత్రధారి, జమాత్–ఉద్–దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌కు భద్రత పెంచాలని అక్కడి పంజాబ్ హోం మంత్రత్వ శాఖను పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. ఆయన్ని హతమార్చేందుకు ఓ విదేశీ నిఘా సంస్థ కుట్ర పన్నిందని ఆరోపించింది. పాకిస్తాన్ జాతీయ ఉగ్రవ్యతిరేక ఏజెన్సీ రాసిన లేఖలో...హఫీజ్‌ను అంతమొందించేందుకు విదేశీ నిఘా సంస్థ ఓ నిషేధిత సంస్థకు చెందిన ఇద్దరికి రూ.8 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. హఫీజ్‌కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని పంజాబ్ హోంమంత్రిత్వ శాఖను కోరింది. ఉగ్ర వ్యతిరేక చట్టం కింద ఈ ఏడాది జనవరి 30 నుంచి లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. జేయూడీ ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. -
భారత్ పై మరిన్ని దాడులకు తెగబడతాం!
ఇస్లామాబాద్: భారత్‌పై మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పాకిస్థాన్ ఉగ్రసంస్థలు హెచ్చిరిస్తున్నాయి. పఠాన్ కోట్ తరహాలో మరికొన్ని ఉగ్రదాడులకు పాల్పడుతామని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దువా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌కు ఉగ్ర హెచ్చరికలు పంపాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా వ్యవహించాడని సయీద్ పై అభియోగాలున్నాయి. భారత్ కేవలం పఠాన్‌కోట్ కు ఒకవైపు మాత్రమే చూసిందని ఇంకా దాడులకు పాల్పడబోతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో బుధవారం చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సయీద్ భారత్‌ను రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. పాక్ తరహాలో భారత్ మారణహోమం సృష్టించలేదని.. పఠాన్‌కోట్ ఘటనలాంటివి పాక్ వల్ల సాధ్యం అంటూ గత నెలలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. కశ్మీర్ మిలిటెంట్ నాయకుడు, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజల్ని రెచ్చగొట్టే అంశాలపై మాట్లాడాడు. జనవరి 2న పఠాన్ కోట్ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని సలావుద్దీన్ గతంలోనే ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి 2008 లో జేయూడీని ఉగ్రవాద పార్టీగా ప్రకటిస్తూ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. సయీద్‌ను పట్టిస్తే దాదాపు 63 కోట్లు చెల్లిస్తామంటూ అదే ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.