భారత్ పై మరిన్ని దాడులకు తెగబడతాం!
ఇస్లామాబాద్: భారత్పై మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పాకిస్థాన్ ఉగ్రసంస్థలు హెచ్చిరిస్తున్నాయి. పఠాన్ కోట్ తరహాలో మరికొన్ని ఉగ్రదాడులకు పాల్పడుతామని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దువా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ భారత్కు ఉగ్ర హెచ్చరికలు పంపాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా వ్యవహించాడని సయీద్ పై అభియోగాలున్నాయి. భారత్ కేవలం పఠాన్కోట్ కు ఒకవైపు మాత్రమే చూసిందని ఇంకా దాడులకు పాల్పడబోతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో బుధవారం చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సయీద్ భారత్ను రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. పాక్ తరహాలో భారత్ మారణహోమం సృష్టించలేదని.. పఠాన్కోట్ ఘటనలాంటివి పాక్ వల్ల సాధ్యం అంటూ గత నెలలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు.
కశ్మీర్ మిలిటెంట్ నాయకుడు, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రజల్ని రెచ్చగొట్టే అంశాలపై మాట్లాడాడు. జనవరి 2న పఠాన్ కోట్ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని సలావుద్దీన్ గతంలోనే ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి 2008 లో జేయూడీని ఉగ్రవాద పార్టీగా ప్రకటిస్తూ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. సయీద్ను పట్టిస్తే దాదాపు 63 కోట్లు చెల్లిస్తామంటూ అదే ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.