లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్ (జేయూడీ) హఫీజ్ సయీద్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్య్రం సాధించటానికి పాకిస్తాన్‌లో ప్రజా ఉద్యమం తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 297 రోజుల గృహ నిర్బంధం అనంతరం ఈ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు గురువారం అర్ధరాత్రి దాటాక విడుదలయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘కశ్మీర్ గురించి మాట్లాడనీయకుండా చేయడానికే నన్ను 10 నెలలు గృహనిర్బంధంలో ఉంచారు. నేను కశ్మీరీల కోసం పోరాడుతాను.
వారికి స్వాతంత్య్రం వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాను. కశ్మీర్‌కు స్వాతంత్య్రాన్ని కోరుకునే పాకిస్తానీలను ఏకం చేసి ఆ కల నెరవేరేందుకు ప్రయత్నిస్తాను’అని పేర్కొన్నాడు. అలాగే శుక్రవారం ఓ మసీదులో సయీద్ మతోపన్యాసం చేస్తూ..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత్‌తో మైత్రి కోసం ప్రయత్నించి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించాడు. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో పలుచోట్ల మారణహోమం సృష్టించి ఆరుగురు అమెరికన్లు సహా 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే.
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్వారా హఫీజ్ సయీద్ ఈ దాడికి ప్రణాళిక రచించాడు. ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు భారత్ ఆధారాలు అందజేయడంతో ఈ ఏడాది జనవరి 31న సయీద్‌తో పాటు మరో నలుగురిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. సయీద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేస్తూ ఇతని తలపై అమెరికా కోటి డాలర్ల నజరానా కూడా ప్రకటించింది.
అరెస్టు చేయాలి: అమెరికా
హఫీజ్ సయీద్ చేసిన నేరాలకు అతణ్ని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అమెరికా కోరింది. ‘లష్కరే తోయిబా స్థాపకుడు సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం మాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికన్లు సహా వందలాది మంది ప్రజలను లష్కరే తోయిబా అన్యాయంగా చంపేసింది. సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment