లాహోర్‌ నడిబొడ్డున సయీద్‌ అడ్డా! | Pakistan tightens security for most wanted Lashkar chief | Sakshi
Sakshi News home page

లాహోర్‌ నడిబొడ్డున సయీద్‌ అడ్డా!

Published Thu, May 1 2025 5:18 AM | Last Updated on Thu, May 1 2025 5:20 AM

Pakistan tightens security for most wanted Lashkar chief

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదికి పాక్‌ పటిష్ట భద్రత 

స్వేచ్ఛగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే చీఫ్‌ 

శత్రు దాడులు తప్పించుకోవడానికి జనావాసాల మధ్య నివాసం

హఫీజ్‌ సయీద్‌.. కరడుగట్టిన పాకిస్తాన్‌ ఉగ్రవాది. లష్కరే తోయిబా అధినేతగా భారత్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారం జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల (రూ.84.58 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్‌ సయీద్‌ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. 

పాక్‌ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్‌లో రెండో పెద్దనగరమైన లాహోర్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్‌ చిత్రాలను, వీడియోలను ‘ఇండియా టుడే’ వార్తాసంస్థ తాజాగా బహిర్గతం చేసింది. లాహోర్‌లో జోహర్‌ టౌన్‌ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది.  

శత్రువులు దాడి చేయకుండా ఎత్తుగడ  
అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్‌–ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్, జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి, లాడెన్‌ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండడం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చిoది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహల్వపూర్‌లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. 

ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా, హఫీజ్‌ సయీద్‌ వ్యూహం మరోలా ఉండడం గమనార్హం. లాహోర్‌ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్నచోట దాడులు చేస్తే ప్రాణనష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావొచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడవచ్చు. 

లాహోర్‌లో హఫీజ్‌ సయీద్‌ ఇల్లు శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్‌ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతోపాటు మరికొన్ని ఇళ్లు, మసీదు, మదర్సా(హఫీజ్‌ సయీద్‌ కార్యాలయం), ఒక ప్రైవేట్‌ పార్కు ఉన్నాయి. హఫీజ్‌ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. అతడికి పాకిస్తాన్‌ సైన్యంతోపాటు సొంత ప్రైవేట్‌ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్‌ సయీద్‌ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు.  

ఇంటి కింద బంకర్‌  
లాహోర్‌లోని అల్‌–ఖద్‌సియా మసీదు గతంలో హఫీజ్‌ సయీద్‌ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్‌లో భారత సైన్యం సర్జికల్‌ స్రైక్‌ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్‌–ఖద్‌సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్‌కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు. దాంతో హఫీజ్‌ సయీద్‌ భద్రతను మరింత పటిష్టం చేశారు. 

ఈ కాంపౌండ్‌ లోపల, బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్‌ సమీపంలోకి కూడా అనుమతించరు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడం నిషేధించారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్‌ సయీద్‌ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  

జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు  
ఉగ్రవాద కార్యాకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్‌ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్‌ పైకి నమ్మబలుకుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమతోంది. సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్‌ సైన్యమే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 

పహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్‌ ఫోర్స్‌(టీఆర్‌ఎఫ్‌) స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక అసలు సూత్రదారి హఫీజ్‌ సయీద్‌ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరుడి కోసం కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్‌లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement