ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ కోరిందని పాకిస్థాన్ నిర్ధారించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అయితే.. హఫీజ్‌ను అప్పగించేందుకు మాత్రం పొరుగు దేశం పరోక్షంగా నో చెప్పేసింది.
ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ అభ్యర్థించిందని పాకిస్థాన్ చెప్పింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు. అయితే.. నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవన్నారు. మరోవైపు ఢిల్లీ వర్గాలు కూడా ఈ తరహా ఒప్పందం ఇస్లామాబాద్‌తో లేదని ధృవీకరించాయి.
ఇక.. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్‌లో అనేక కేసులలో వాంటెడ్‌గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో కూడా అతడి పేరు ఉందన్న విషయం తెలిసిందే.
పాక్‌లో మత పెద్దగా చెలామణి అవుతున్న సయీద్‌ను 2019లో అక్కడి ఉగ్రవాద వ్యతిరేక కలాపాల న్యాయస్థానం అరెస్ట్ చేసింది. ఆ టైంలో సయీద్ అతని అనుచరులపై ఏకంగా 23 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఇక.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఉగ్రవాదులకు డబ్బు సాయం అందించిన రెండు కేసులకు సంబంధించి.. యాంటీ-టెర్రరిజం కోర్టు సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
2008 నాటి భయానక ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది మృత్యువాత పడ్డారు. అయితే పాక్‌లో సయీద్‌కు లభించే వీఐపీ ట్రీట్‌మెంట్ చర్చనీయాంశంగా మారింది. సయీద్‌కు అక్కడి ఆర్మీ సంరక్షణలో ఉండడం, అక్కడ రాజకీయ పార్టీలు సైతం సయీద్ ఉగ్ర కార్యకలాపాలను ఖండించకపోవడం చూస్తున్నదే. ఇక.. సయీద్ కొడుకు తల్‌హా సయీద్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment