Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం' | Operation Sindoor: India struck multiple targets in Pakistan and pok | Sakshi
Sakshi News home page

Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'

May 8 2025 2:33 AM | Updated on May 8 2025 5:00 AM

Operation Sindoor: India struck multiple targets in Pakistan and pok

పాక్‌ ఉగ్ర తండాలపై విరుచుకుపడ్డ భారత్‌ 

100మందికి పైగా ఉగ్రవాదులు హతం

‘పహల్గాం’కు బదులు తీర్చుకున్న భారత్‌

‘ఆపరేషన్‌ సిందూర్‌’తో గర్జించిన సైన్యం  

ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త ఆపరేషన్‌ 

విరుచుకుపడ్డ క్షిపణులు, బాంబులు, డ్రోన్లు 

జైషే, లష్కరే ప్రధాన స్థావరాలు ధ్వంసం 

పదుల కొద్దీ ఉగ్ర శిక్షణ కేంద్రాలు కూడా 

బాధితులకు న్యాయం జరిగింది: సైన్యం 

మనందరికీ ఎంతో గర్వకారణం: మోదీ

అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్‌ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్‌’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్‌ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది.

 పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజర్‌ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్‌ నిర్వహించాయి. 

ఎయిర్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రెసిషన్‌ బాంబులు, గైడెడ్‌ బాంబ్‌ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా నాలుగు స్వయానా పాక్‌ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్‌ దాడుల మాదిరిగా పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్‌ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి.

 అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్‌ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది.

 ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్‌ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్‌’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్‌ అజర్‌ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్‌ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు.

 భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్‌ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్‌ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్‌ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.

అద్భుత నైపుణ్యం
 దాడులపై నిపుణులు 
సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్‌ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. 

పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్‌ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది.  

25 నిమిషాలు.. 9 లక్ష్యాలు
దాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్‌ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement