న్యూఢిల్లీ: కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో జరుగుతున్న ఆందోళనల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కర్ చీఫ్ హపీజ్ సయీద్ హస్తం ఉందని ఆయన అన్నారు. సయీద్ మద్దతుతోనే భారత జాతి వ్యతిరేక కార్యక్రమాలు యూనివర్సిటీలో చేస్తున్నారని, వాటిని తామెంత మాత్రము ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక ప్రత్యేక దినం నిర్వహించడం, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం వంటి వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఈ చర్యలకు పాల్పడిన విద్యార్థినాయకులను అరెస్టు చేయడంతోపాటు జేఎన్ యూలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందిన మాజీ సైనికులు, తదితరులు (పూర్వ విద్యార్థులు) తమ సర్టిఫికెట్లను వెనక్కి ఇస్తామని బెదిరించడంవంటి పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి.
ఈ వ్యవహారంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగగా.. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో ఆందోళనలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 'జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరిగిందో దాని వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే భారత్కు వ్యతిరేకంగా నినాదాలు పెల్లుబుకుతాయో వాటిపై మాట్లాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షిస్తాం. నిర్దోషులకు ఎలాంటి హానీ జరగదు' అని రాజ్ నాథ్ అన్నారు.
రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Published Sun, Feb 14 2016 3:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement