‘దావూద్‌ను పట్టి తేవడం చిటికెలో పని’
- మరిన్ని సర్జికల్ దాడులు కొట్టిపారేయలేం
- పాక్ ఉగ్రసంస్థలు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోం
- సయీద్ గృహనిర్భంధం కంటితుడుపు చర్యే
- చిత్తశుద్ధి ఉంటే వెంటనే సయీద్‌ను జైలులో పెట్టాలి: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం తమకు చిటికె వేసినంత సేపు పని అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని, అతడిని పట్టుకొస్తామన్న నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. ముఖ్యంగా పాక్ విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్ధలు కొట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మరిన్ని సర్జికల్ దాడులు జరిగే అవకాశాన్ని తీసిపారేయలేమని తెలిపారు.
పాకిస్థాన్ తమ పొరుగు దేశం అని, ఒక వేళ మంచి కోసం పాక్ మారదామని అనుకున్నా ఆ దేశం మాటలు నమ్మి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని, అసలు అలాంటి అడుగు వేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ నుంచి ఏ ఉగ్రసంస్థగానీ, ఉగ్రవాదులుగానీ భారత్‌పైకి దాడి చేసేందుకు వస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని, మరిన్ని సర్జికల్ దాడులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, ఇలాంటివి జరగాలని తాము కోరుకోవడం లేదని, అలాంటి పరిస్థితి ఉంటే తప్పక ధీటుగా స్పందిస్తామని తెలిపారు. గత నాలుగు నెలల కిందట భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
సయీద్ గృహనిర్భంధంపై స్పందిస్తూ..
‘ఉగ్రవాది, లష్కరే ఈ తోయిబా, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం చేయడం ఒక కంటి తుడుపుచర్యే. నిజంగా పాక్‌కు చిత్తశుద్ధి ఉంటే అతడిని ఈ పాటికే జైలు ఊచలు లెక్కబెట్టిస్తుండాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి కూడా’ అని రాజ్‌నాథ్ అన్నారు.
దావూద్‌పై స్పందిస్తూ..
ఎన్నేళ్ల నుంచో తప్పించుకుని తిరుగుతున్న దావూద్ పాక్‌లోనే తలదాచుకున్నాడని తెలుసు. అతడిని పట్టుకొని తీసుకురావడం మాకు చిటికెవేసినంతసేపు పని. అతడిని వెనక్కి తీసుకురావడంలో విజయంసాధిస్తామన్న నమ్మకం నాకుంది.