మిలటరీ, ప్రభుత్వానికి పాక్ పత్రిక షాక్
ఇస్లామాబాద్: జైషే-ఈ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ లపై చర్యలు తీసుకోవడం ఏ విధంగా దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తుందని పాకిస్తాన్ కు చెందిన ఓ జాతీయ దినపత్రిక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డావ్న్ పత్రికలో మిలటరీ, ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నాయనే కథనాన్ని ప్రచురించిన సిరిల్ అల్ మెడియా జర్నలిస్టుపై పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మిలటరీ టెర్రరిస్టు గ్రూపులైన హక్కానీ నెట్ వర్క్, తాలిబన్లు, లష్కరే-ఈ-తోయిబాలకు సహకరిస్తోందనే వార్తలు కూడా జాతీయపేపర్లలో పెద్ద ఎత్తున ప్రచురించాయి.
ఉగ్రసంస్ధల నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ 'ది నేషన్' పత్రిక 'హౌ టూ లూజ్ ఫ్రెండ్స్ అండ్ ఏలియనేట్ పీపుల్' శీర్షికన ఎడిటోరియల్ ను ప్రచురించింది. అజర్, సయీద్ లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మీడియాకు పాఠాలు చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారి అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి సయీద్ లు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నారని, ఇరువురికి మిలటరీ భద్రతను కల్పిస్తోందనే వార్తలు ఉన్నాయని పేర్కొంది. మీడియా తన పనిని సజావుగా చేయాలని ప్రభుత్వం, మిలటరీ లు చెప్పడం గర్హనీయమంది.
జాతీయ భద్రతకు సంబంధించిన మీడియా కథనాలపై ప్రభుత్వం, మిలటరీలు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని అనడానికి జర్నలిస్టు అల్ మెడియా ఓ ఉదాహరణ అని పేర్కొంది. అల్ మెడియా ఇచ్చిన రిపోర్టు కల్పన అనే ప్రభుత్వ ఆరోపణను కొట్టిపారేసింది. నిషేధించిన సంస్ధలు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరగుతుంటే ప్రభుత్వం, మిలటరీలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించింది. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లపై చర్యలు తీసుకుంటే దేశ భద్రతకు ఎలా ప్రమాదం జరుగుతుంది?. ప్రపంచదేశాల మద్దతును పాకిస్తాన్ ఎందుకు కోల్పోతుంది?.
దిగజారిపోతున్న దేశ ప్రతిష్టను కాపాడుకోవడం చేతకాక మీడియా సంస్ధలు పని ఎలా చేయాలో మీరు మాకు(ఆ దేశ పత్రికలకు) నేర్పిస్తారా? అంటూ నిలదీసింది. ఓ రిపోర్టర్ ను క్రిమినల్ లాగా పరిగణించగడానికి మీకు ఎంత ధైర్యం అంటూ తీవ్రంగా స్పందించింది. పైగా ఈ ఘటనను జాతీయ భద్రత కోసం చేస్తున్నట్లు చిత్రీకరించడం ఏకాధికారాన్ని ప్రదర్శిచమేనని అంది. అల్ మెడియాకు తమ సంఘీభావాన్ని ప్రకటించింది. మీడియా మొత్తం మీతో పాటు నిలబడుతుందని పేర్కొంది.