బావమరిదికి పగ్గాలు!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త బాస్ వచ్చాడు. ఇప్పటివరకు అధినేతగా ఉన్న హఫీజ్ సయీద్ గృహనిర్బంధంలో ఉండటంతో.. అతడి బావమరిది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఆ సంస్థకు అధిపతిగా నియమించారు. అతడిని పట్టిస్తే 13 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. కొత్త బాస్ మక్కీ అన్న విషయాన్ని జమాత్ ఉద్ దవా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మక్కీ జేయూడీలో నెంబర్ 2గా ఉన్నాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలోనే ఉన్నా.. ఇంటి నుంచే హఫీజ్ సయీద్ కార్యకలాపాలు సాగిస్తున్నాడన్న వదంతులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని జేయూడీ ఖండించింది. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలూ మక్కీయే చూసుకుంటున్నాడని చెప్పింది. హఫీజ్ సయీద్ నిర్బంధం తర్వాతి నుంచి ఇప్పటివరకు మక్కీ లాహోర్ నగరంలో దాదాపు ఆరు ర్యాలీలు నిర్వహించాడు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవాతో పాటు మరో నలుగురు జేయూడీ నేతలను, ఫలా ఎ ఇన్సానియత్ నేతలను 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ రెండు సంస్థలకు చెందిన పలు కార్యాలయాలను కూడా మూసేశారు. ఈ రెండింటినీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పరిశీలనలో ఉంచారు. సయీద్ గృహనిర్బంధం తర్వాత జేయూడీ తన పేరు మార్చుకుంది. 'తెహరీక్ ఆజాదీ జమ్ము కశ్మీర్' అనే కొత్త పేరుతో దీని కార్యకలాపాలు నడుస్తున్నాయి.