లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్–దవా ఉపాధ్యక్షుడు హఫీజ్ అబ్దుల్ రహ్మాన్(76) మక్కి లాహోర్‌లో చనిపోయాడు. మధుమేహం ముదిరిపోవడంతో కొంతకాలంగా అతడు లాహోర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, శుక్రవారం వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడని జమాత్ ఉద్–దవా తెలిపింది. ఉగ్ర నిధుల కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతడికి 2020లో ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
2023లో ఇతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో, మక్కి ఆస్తుల సీజ్‌తోపాటు ప్రయాణ, ఆయుధ నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి మక్కి బహిరంగంగా కనిపించడం మానేశాడు. అప్పట్నుంచి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త వాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాడు. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కరులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్తాన్‌లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment