కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.
పాక్‌లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్‌లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.
శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.
ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment