పాకిస్తాన్ మహిళలకోసం 'గాల్స్ ఎట్ డాబాస్'!
అనాదిగా నెలకొన్న దురాచార, పురుషాధిక్య సమాజం నుంచీ ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ మహిళలు బయటకు వస్తున్నారు. వివక్షత, వేధింపులు, హింసలకు గురయ్యే నేపథ్యం నుంచి... గౌరవంగా, హక్కుగా, స్వేచ్ఛగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. పురుషుడు తోడులేనిదే బయటకు రాని పరిస్థితి నుంచీ... ఒంటరిగా, ధైర్యంగా తిరిగే స్థాయికి చేరారు. మహిళల్లో అటువంటి మార్పే ధ్యేయంగా ఏర్పాటు చేసిన 'గాల్స్ ఎట్ డాబాస్' అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోని బహిరంగ ప్రదేశాల్లో.. పురుషులు తోడు లేకుండా మహిళలు పబ్లిక్ ప్లేస్ లో ఒంటరిగాగాని, సమూహంతోగాని స్వేచ్ఛగా, ఆనందంగా గడిపే క్షణాల ఫొటోలను పోస్ట్ చేయమంటూ ప్రారంభించిన ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది.
భారత మహిళల 'వై లాయ్ టర్' ఉద్యమానికి స్పందిచిన కరాచీ జర్నలిస్ట్ సదియా ఖత్రి.. పాకిస్తాన్ మహిళల్లోనూ అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. 'గాల్స్ ఎట్ డాబాస్' పేరిట ఉద్యమానికి నాంది పలికింది. భారత నగరాల్లోని మహిళలను . 'వై లాయ్ టర్' ఎలా ప్రోత్సహించిందో తెలుసుకొని, భారతీయ నిర్వాహకులతో కలిసి పాకిస్తాన్ లో ఉద్యమం తెచ్చేందుకు నిర్ణయించింది. 'వై లాయ్ టర్' ద్వారా మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, కచ్చితంగా మాట్లాడగల్గుతున్నారని... భారతదేశంలో జరిగిన ప్రచారాన్నే పాకిస్తాన్ కు పరిచయం చేయాలని ప్రతిన బూనింది. కరాచి, ఇస్లామాబాద్, లాహోర్లతోపాటు అనేక పాకిస్తానీ నరగాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. పాకిస్తానీ మహిళలు తమ ఇళ్ళనుంచి బయటకు వచ్చి... సమావేశాల్లో పాల్గొని, ఎటువంటి ఆందోళనా లేకుండా సమయం గడపడంతో ఖత్రి ప్రయత్నం కొంతవరకూ సఫలమైంది.
పాకిస్తాన్ లో పబ్లిక్ ప్లేస్ లు మహిళలకు నరక కూపాలుగా ఉన్నాయని, రోడ్లపై 25 మంది పురుషులకు ఒక్క మహిళ కనిపించడం కష్టమని, ఈ నిష్పత్తి ఇలా ఉంటే ఇక మహిళలు హాయిగా వీధుల్లో తిరగడం కనిపించే అవకాశమే లేదని ఖత్రి అంటుంది. ఎటువంటి అవసరం ఉన్నా పురుషుడు తోడు లేనిదే బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడి మహిళలదని, అత్యవసర పరిస్థితుల్లోనూ ఒకరికోసం వేచి చూడాల్సిందేనని అంటుంది. 'వై లాయ్ టర్' స్ఫూర్తిగా పాకిస్తానీ మహిళల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు ఖత్రి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లను వినియోగించుకొని మహిళలు తమ అభిప్రాయాలను హాయిగా వెలిబుచ్చేందుకు వేదికలుగా మార్చింది. తోడు లేకుండా బయటకు రాలేని నిస్సహాయ స్థితి నుంచి వారు స్వేచ్ఛా ప్రపంచంలో విహరించేట్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే పురాతన దురాచారాల లోతుల్లో పాతుకుపోయిన భావాలనుంచి అక్కడి మహిళలను బయటకు తేవడం కొంత కష్టమే అయినా... పదిమంది సభ్యులు కలిగిన 'గాల్స్ ఎట్ డాబాస్' టీమ్.. సోషల్ మీడియాద్వారా అవగాహన కల్పిస్తూ మహిళల్లో మార్పుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఉద్యమాన్నికేవలం సోషల్ మీడియా ద్వారా నడపడం కష్టమేనంటున్న టీమ్... కనీసం విలువలు, హక్కుల గురించైనా తెలిపేందుకు ఇదో ప్రమాదంలేని, ఉచిత మార్గమని భావిస్తోంది. అయితే ప్రస్తుతం మహిళలను అగౌరవంగా, అతి హేయంగా చూస్తున్న సమాజంలో ఉన్నామని, కనీసం ఓ డాబా వద్ద చాయ్ తాగేందుకు, పబ్లిక్ ప్లేస్ లో ఆనందంగా గడిపేందుకు అవకాశం లేకుండా ఉందని ఖత్రి అంటోంది. హక్కులు, స్వేచ్ఛపై పాకిస్తానీ మహిళల్లో అవగాహనకు తమ ప్రయత్నం కొంత మాత్రమైనా సహకరిస్తుందని ఖత్రి ఆశాభావం వ్యక్తం చేస్తోంది.