
పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ
దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి అంగీకరించాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను అక్కడకు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) వెనక్కి తగ్గింది.
ఈ నేపథ్యంలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. గ్రూప్ దశలో మూడు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను అక్కడే పూర్తి చేసుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ పది మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంకాగా.. వర్షం వల్ల కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే సజావుగా సాగాయి.
రూ. 739 కోట్ల మేర నష్టం?
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ నేపథ్యంలో పీసీబీకి రూ. 739 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే వార్తలు వచ్చాయి. అయితే, పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఈ వదంతులను ఖండించారు.
ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తమకు ఎలాంటి నష్టం రాలేదని.. పైగా రూ. 100 కోట్ల మేర ఆదాయం చేకూరిందని చెప్పడం గమనార్హం.
‘‘టోర్నమెంట్‌కు సంబంధించి అయిన ఖర్చు మొత్తాన్ని ఐసీసీ సమకూర్చింది. టికెట్ల అమ్మకం, ఇతర మార్గాల ద్వారా పీసీబీకి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది’’ అని ఆమిర్ మిర్ స్పష్టం చేశాడు. తమ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని.. ఆడిట్ తర్వాత ఈ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తమకు రూ. 300 కోట్ల మేర ఆదాయం చేకూరిందని పీసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆదాయంలో ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదైందని.. ప్రపంచంలో తాము ఇప్పుడు టాప్-3 సంపన్న బోర్డుల జాబితాలో చేరామని పేర్కొన్నాయి.
అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ
కాగా దాదాపు 19 వేల కోట్లకు పైగా రూపాయలతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 689 కోట్లు, ఇంగ్లండ్ &వేల్స్ బోర్డు రూ. 513 కోట్ల మేర సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా.. రూ. 300 కోట్ల సంపద కలిగి ఉన్నామన్న చెపుతున్న పీసీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. తాము టాప్-3లో ఉన్నామంటూ బోర్డు వర్గాలు వెల్లడించడం గమనార్హం.
చాంపియన్‌గా టీమిండియా
ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.
తొలి సెమీస్‌లో భారత్.. ఆసీస్‌ను.. రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ ప్రొటిస్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దుబాయ్‌లో మార్చి 9న జరిగిన ఫైనల్లో టీమిండియా కివీస్ జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించింది.
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో రావల్పిండి, కరాచీ, లాహోర్ మైదానాలు చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగా వన్డే ఈవెంట్ కోసం ఈ మూడు స్టేడియాలలో భారీ ఖర్చుతో పీసీబీ మరమతులు చేపట్టింది.
అయితే, వర్షం కారణంగా రావల్పిండి, లాహోర్‌లలో మ్యాచ్‌లు రద్దు కావడం.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దుస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేనపుడు ఇలాంటి మెగా టోర్నీలను నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదంటూ పీసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి.
చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా'
Comments
Please login to add a commentAdd a comment