pass away
-
సింగర్ జయచంద్రన్ మృతి
ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిసూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 3న కొచ్చిలో జన్మించిన జయచంద్రన్ 1965లో వచ్చిన ‘కుంజలి మరక్కర్’ అనే సినిమాలోని ‘ఒరు ముల్లప్పుమలమే..’పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. 1967లో విడుదలైన ‘కలితోజన్’ చిత్రంలోని ‘మంజలైల్ ముంగి తోర్తి’పాట ఆయన కెరీర్లో ఒక మైలురాయి. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 16 వేలకుపైగాపాటలుపాడారాయన.జయచంద్రన్ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటిపాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిపాట. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ , ఎం.ఎం. కీరవాణి, విద్యాసాగర్, కోటి వంటి సంగీత దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగాపాటలుపాడారు. హిందీలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘అదా: ఎ వే ఆఫ్ లైఫ్’ అనే ఒకే ఒక మూవీలోపాడారు జయచంద్ర.అదేవిధంగా తన మాతృ భాష మలయాళంలో ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ వంటి సినిమాల్లో అతిథిపాత్రల్లో మెరిశారాయన. అంతేకాదు.. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఐదు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు. -
లష్కరే నేత అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్–దవా ఉపాధ్యక్షుడు హఫీజ్ అబ్దుల్ రహ్మాన్(76) మక్కి లాహోర్‌లో చనిపోయాడు. మధుమేహం ముదిరిపోవడంతో కొంతకాలంగా అతడు లాహోర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, శుక్రవారం వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడని జమాత్ ఉద్–దవా తెలిపింది. ఉగ్ర నిధుల కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతడికి 2020లో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో ఇతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో, మక్కి ఆస్తుల సీజ్‌తోపాటు ప్రయాణ, ఆయుధ నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి మక్కి బహిరంగంగా కనిపించడం మానేశాడు. అప్పట్నుంచి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త వాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాడు. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కరులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. -
కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్‌కు వెళ్తూ ఘటన
ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్‌దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్, న్యూ సౌత్‌వేల్స్ దిగ్గజం ఫ్రాంక్ మిస్సన్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఫ్రాంక్ మిస్సన్ శుక్రవారం తన సృగృహంలో తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని న్యూ సౌత్‌వేల్స్ క్రికెట్ ధ్రువీకరించింది. కాగా 1960 నుంచి 1961 మధ్య ఆసీస్ తరపున కేవలం ఐదు టెస్టులు మ్యాచ్‌లు ఆడిన మిస్సన్.. 16 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్‌తో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 4 వికెట్లు పడగొట్టి సత్తచాటారు.అయితే గాయం కారణం ఆయన కెరీర్లో మధ్యలోనే ముగిసిపోయింది. కానీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం మిస్సన్ మాత్రం అద్బుతమైన గణాంకాలను ఆయన నమోదు చేశారు. న్యూసౌత్‌వేల్స్ తరపున 71 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఫ్రాంక్ మిస్సన్ 177 వికెట్లు సాధించారు. కాగా మిస్సన్ క్రికెటర్ కాకముందు మంచి అథ్లెట్ కూడా. మిడిల్ డిస్టెన్స్ మాజీ కోచ్ పెర్సీ సెరుట్టితో మిస్సన్ శిక్షణ పొందాడు. ఆ తర్వాత చాలా మంది అథ్లెట్లకు కోచ్‌గా ఆయన పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన హెర్బ్ ఇలియట్కు శిక్షణనిచ్చి 1960లో రోమ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ల స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల పలువరు న్యూసౌత్‌వేల్స్ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత..
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రాహం థోర్ప్.. ఆదివారం ఆర్ధ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఈ దివంగత క్రికెటర్‌కు ఈసీబీ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది."ఈ రోజు వరల్డ్ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన హృదయాలతో మేము పంచుకుంటున్నాము. అతడి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈసీబీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా థోర్ప్ ఎంపికయ్యారు. కానీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham's death. pic.twitter.com/VMXqxVJJCh— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024 -
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. అతడు చివరగా వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు. ఆయనను అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునేవారు. భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి. -
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్(62) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వెల్లింగ్టన్లోని తప సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయన మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. కాగా స్టిర్లింగ్ టెస్టులు, వన్డేల్లోనూ కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడిన స్టిర్లింగ్ ఓవరాల్‌గా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్, లాన్స్ కెయిర్న్స్ వంటి దిగ్గజ కివీస్ పేసర్లు అద్భుతంగా రానిస్తున్న సమయంలో.. స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు పొందలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం స్టిర్లింగ్‌కు మంచి రికార్డు ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్కు ప్రాతినిధ్యం వహించారు. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టిర్లింగ్ 206 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 65 గేమ్‌లలో 90 వికెట్లు సాధించాడు. స్టిర్లింగ్ రిటైర్మెంట్ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. కివీస్ యువ క్రికెటర్లను తయారు చేయడంలో స్టిర్లింగ్ తన వంతు పాత్రపోషించారు. చదవండి: నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ NZC is deeply saddened by the passing of former Test fast-bowler Derek Stirling, aged 62. "Billy" as he was known, played 6 Tests and 6 ODIs for his country and was a popular member of both the @CDCricket, and @cricketwgtninc sides. Our thoughts are with his family and friends. — BLACKCAPS (@BLACKCAPS) December 13, 2023 -
విండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్లైడ్ బట్స్(66) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. మరో దిగ్గజం జో సోలమన్(93) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. జో సోలమన్.. గయానాకు చెందిన జో సోలమన్ వెస్టిండీస్ క్రికెట్లో కొన్నాళ్లపాటు కీలక బ్యాటర్‌గా కొనసాగాడు. 1958 నుంచి 1965 మధ్య విండీస్ తరపున 27 టెస్టులు ఆడిన సోలమన్.. 34 సగటుతో 1326 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 1960లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సోలమన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఆఖరి రోజు చివరి వరకు క్రీజులో నిలుచని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. క్లైడ్ బట్స్.. 1980లో వెస్టిండీస్ తరుపున క్లైడ్ బట్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటిలో విండీస్ ఫాస్ట్ బౌలర్లకు పేరు గాంచిన జట్టు. కానీ క్లైడ్ బట్స్ తన స్పిన్ బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జాతీయ జట్టు తరపున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ.. బట్స్‌కు దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. 87 ఫస్ట్‌క్లాస్, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో గయానాకు బట్ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన కామేంటేటర్‌గా, 2000లో విండీస్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. కాగా ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. వారి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ విండీస్ క్రికెట్ ట్విట్ చేసింది. -
టీమిండియా మాజీ కెప్టెన్ మృతి..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (అక్టోబర్ 23) సోమవారం తుది శ్వాస విడిచారు. బేడీ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ కొనసాగారు. టీమిండియా తరపున 67 టెస్టులు ఆడిన బేడి.. ఏకంగా 266 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పది వన్డేల్లో కూడా భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. 10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు. అదే విధంగా భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టారు. అయన బౌలింగ్ కోటాలో ఏకంగా 8 మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. 1970లోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న బేడీ.. దేశీవాళీ క్రికెట్లో ఎక్కువగా ఢిల్లీ తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఈ జెంటిల్మెన్ గేమ్‌లో కొంతకాలంగా వ్యాఖ్యాతగా తన సేవలు అందించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఆయన ఉన్నారు. మణిందర్ సింగ్,మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు భారత క్రికెట్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. 1990 తర్వాత బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా కూడా పనిచేశారు. -
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
హఫీజ్‌పేట్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. గత ఏడాది ఆయన కేన్సర్ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖుల నివాళి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
భారత క్రికెట్లో విషాదం.. సునీల్ దేవ్ కన్ను మూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన సునీల్ దేవ్(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచారు! ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా? -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు డెయిరీ రంగానికి ఎనలేని సేవ చేశారన్నారు. తులసీరావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆడారి తులసీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. చదవండి: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు -
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కన్నుమూత..
వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ డేవిడ్ ముర్రే(72) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముర్రే శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కరీబియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన వికెట్ కీపర్లలో ముర్రే ఒకరు. అయితే మత్తు పదార్థాలకు బానిస కావడంతో ముర్రే క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలను ముర్రే ఎదుర్కొన్నారు. దీంతో అతను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టులో ముర్రేకు అవకాశం దక్కలేదు. ఇక వెస్టిండీస్ తరపున 19 టెస్టులు ఆడిన ముర్రే 601 పరుగులు సాధించారు. అదే విధంగా అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు -
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ మృతి
కోల్‌కతా: అలనాటి మేటి ఫుట్‌బాలర్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సమర్ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్‌గా, సమర్ బెనర్జీ కెప్టెన్‌గా మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత్ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్‌లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్... కాంస్య పతక మ్యాచ్‌లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్‌బాల్‌లో విఖ్యాత మోహన్ బగాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమర్ బెనర్జీ తన క్లబ్ జట్టుకు డ్యూరాండ్ కప్ (1953), రోవర్స్ కప్ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్ అందించారు. అనంతరం సమర్ కోచ్‌గా మారి 1962లో బెంగాల్ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్ ట్రోఫీని చేర్చారు. -
సంతూర్ విద్వాంసుడు సొపోరి కన్నుమూత
న్యూఢిల్లీ: సంతూర్ విద్వాంసుడు భజన్ సొపోరి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురుగ్రాం ఆస్పత్రిలో గురవారం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభయ్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంతూర్ మేస్ట్రో పండిట్ శివకుమార్ శర్మ మరణించిన కొన్ని వారాలకే సొపోరి కూడా వెళ్లిపోవడం సంగీత ప్రపంచంలో విషాదం నింపింది. కశ్మీర్‌కు చెందిన సొపోరి పదేళ్ల వయసులోనే కచేరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అలరించారు. హిందీ కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురీ, పర్షియన్, అరబిక్ భాషల్లో 6 వేలకుపైగా పాటలు కంపోజ్ చేశారు. గాలిబ్ గజల్స్‌కూ బాణీలు కట్టారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు. -
గుండెపోటుతో మరో క్రికెటర్ అకాల మరణం
ముంబై రంజీ జట్టు పేసర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తన మాజీ సహచర ఆటగాడు భవిన్ థక్కర్ ధృవీకరించాడు. కాగా 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాజేష్ వర్మ వర్మ అరంగేట్రం చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన వర్మ మొత్తం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతడు తన చివరి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడాడు. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజేష్ వర్మ 23 వికెట్లు పడగొట్టాడు. దీంట్లో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో రాజేష్ వర్మ భాగంగా ఉన్నాడు. "రాజేష్ వర్మ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. అండర్-19 నుంచి మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాం. 20 రోజుల క్రితం మేమిద్దరం కలిసి ఓ టోర్నమెంట్లో పాల్గొన్నాం. శనివారం (ఏప్రిల్ 23) నేను అతడితో దాదాపు 30 నిమిషాలు పాటు ఫోన్లో మాట్లాడాను. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటలకు అతడి చనిపోయాడాని నాకు ఫోన్ వచ్చింది. అతడు మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. అతడు మమ్మల్ని విడిచి వెళ్లి పోవడం చాలా బాధగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఠక్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు' -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్నా
స్పీకర్ బాక్సులు బద్దలయ్యాయి. స్తంభాలకు కట్టిన హారన్లు కేకపెట్టాయి. టేప్ రికార్డర్ల మోతకు అంతే లేదు. రేడియోలు మళ్లీ మళ్లీ పాడాయి. ‘జిమ్మీ.. జిమ్మీ.. ఆజా... ఆజా’... ‘హరి ఓం హరి... హరి ఓం హరి’... ‘మేరే దిల్ గాయేజా జు..జు.. జుబి జుబి జూబీ’... ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’... బప్పీ లహిరి అనే పేరు 1980లలో హోరై దేశాన్ని చుట్టేసింది. గంతులు రాని వాళ్లు గంతులేశారు. చిందులు వేయని వాళ్లు చిందులేశారు. ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచి బప్పీ లహిరి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ నృత్య సంగీతభరిత కాలం మరి తిరిగి రాదు. బప్పీ లహిరి ఇంటర్ వరకు కూడా చదువుకోలేదు. కాని ఉన్న చోటే ఉండిపోవడం మాత్రం బతుక్కు చేటు అని ముందే తెలుసుకున్నాడు. కోల్‌కతా మహా నగరం. తల్లిదండ్రులు అపరేష్ లహిరి, బాన్సురి లహిరి ఆ నగరంలో అంతో ఇంతో పేరున్న సంగీతకారులు. తల్లి క్లాసికల్ కచేరీలు ఇస్తుంది. బప్పీ ఒక్కగానొక్క కొడుకు. అయినా సరే ఉన్న చోటే ఉండటం సరికాదు అనుకున్నాడు బప్పీ. ముంబై వెళ్లాలి... సాధించాలి అనుకున్నాడు. సంగీత దర్శకుడుగా. 21 ఏళ్లు అప్పటికి. ముంబై చేరుకున్నాడు. కిశోర్ కుమార్ అతనికి దూరపు చుట్టం. హీరోయిన్ కాజోల్ తండ్రి సోము ముఖర్జీ దగ్గరి చుట్టం. సోము తీస్తున్న ‘నన్హా షికారి’ (1973) సినిమాకు సంగీతం చేశాడు. ఓకే అనిపించింది. ఆ తర్వాత తాహిర్ హుసేన్ తీసిన ‘జఖ్మీ’ (1975)తో గుర్తింపు వచ్చింది. 1977లో వచ్చిన ‘ఆప్ కీ ఖాతిర్’లోని ‘బంబై సే ఆయా మేరా దోస్త్... దోస్త్కో సలామ్ కరో’... పాట ఆల్మోస్ట్ డూపర్ హిట్ అయ్యింది. కాని అలాంటి గుర్తింపు కాదు బప్పీ కోరుకుంటున్నది. ఇంకా ఏదో చేయాలి. అప్పుడే అమెరికాలో కచేరీ చేసే చాన్స్ వచ్చింది. లోకం చూస్తే విషయం తెలుస్తుంది అని బయలు దేరాడు. పారే నీరే ఒండ్రుమట్టిని తోడు తీసుకుంటుంది. బప్పీ అమెరికాలోని చికాగోలో ఆ రాత్రి ఒక పబ్‌కు వెళ్లాడు. పబ్‌లో అంతా హోరుగా ఉంది. వెలిగే ఆరే దీపాలు. డాన్స్ చేస్తున్న జంటలు. ఒకతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ నచ్చిన బప్పీ అతని దగ్గరకు వెళ్లి ‘నువ్వు ప్లే చేస్తున్న సంగీతం ఏమిటి?’ అని అడిగాడు. ‘నేను డిస్క్ ప్లే చేస్తున్నాను. పబ్‌లో అందరూ డాన్స్ చేయడానికి ప్లే చేస్తున్నాను కనుక ఇది డిస్కో’ అన్నాడు. ఆ సౌండ్ బప్పీకి నచ్చింది. ఆ బీట్ కూడా. అది ఇండియాలో మొదలు కానున్న డిస్కో కాలానికి ఆరంభ క్షణం. ∙∙ పోటీదారుల్ని అర్థం చేసుకోకపోతే పోటీలో నిలవడం కష్టం. 1970ల కాలంలో బాలీవుడ్ సినిమా రంగం ఘనంగా ఉంది. పోటీలో గండర గండలు. ఎస్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్, కళ్యాణ్‌జీ–ఆనంద్జీ... వీళ్లంతా టాప్‌లో ఉన్నారు. వీళ్ల మధ్య బప్పీ నిలబడాలి. అతను చిన్నప్పటి నుంచి తబలా ప్లేయర్. ఏ బీట్ శ్రోతలకు హుషారునిస్తుందో తెలుసు. అదే సమయంలో తల్లి ద్వారా విన్న శాస్త్రీయ సంగీతం వల్ల ఏ స్వరం చెవికి ఇంపుగా ఉంటుందో కూడా తెలుసు. ఈ మెలోడీని, బీట్‌ని సరిగ్గా కలపగలిగితే చాలు అనుకున్నాడు బప్పీ. కొత్త సంగీత పరికరాలతో ఎప్పటికప్పుడు పోటీ పడే ఆర్.డి. బర్మన్ను ఎదుర్కొనాలంటే డిస్కో ఒక మార్గంగా కనిపించింది. అదే సమయంలో అమితాబ్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడానికి మిథున్ చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. మిథున్‌ను పెంచడానికి కూడా కొంత మంది ట్రై చేస్తున్నారు. బి.సుభాష్ అనే బి గ్రేడ్ దర్శకుడు బప్పీకి స్నేహితుడు. బప్పీ అప్పటికే డిస్కో బీట్తో ఒకటి రెండు పాటలు చేయడంతో ఇదేదో బాగుందే అనుకుని ‘డిస్కో డాన్సర్’ అనే కథను తయారు చేశాడు. మిథున్ హీరో. కాని బప్పీకి అర్థమైంది. ‘ఈ సినిమా నాది’ అనుకున్నాడు. డిస్కో మ్యూజిక్ నేపథ్యంలో పాటలు పుట్టాయి. 1982. సినిమా రిలీజైంది. నిజానికి పెద్దగా డాన్స్ రాని మిథున్ చక్రవర్తి డాన్సింగ్ స్టార్ అయ్యాడు. బప్పీ లహిరి డిస్కో కింగ్ అయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి పాట వీధి వీధి వాడ వాడ మార్మోగి పోయింది. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో, తిరునాళ్లలో, పెళ్లిళ్ల లో అందరూ ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాటకు డాన్స్ వేయడమే. ‘యాద్ ఆ రహా హై తేర ప్యార్’, ‘గోరోంకి నా కాలోంకి దునియా హై దిల్ వాలోంకి’, ‘కోయి యహా అహ నాచే నాచే’ హిట్టు మీద హిట్టు. దేశం ఇక డిస్కోలోకి మేల్కొంది. ∙∙ కృష్ణకు ఒక హిట్ ఎలాగైనా ఇవ్వాలని పట్టుదలగా కె.రాఘవేంద్రరావు తీసిన ‘ఊరికి మొనగాడు’ హిట్ కావడం బప్పీ లహిరికి లాభించింది. దానిని కృష్ణ ‘హిమ్మత్వాలా’ పేరుతో హిందీలో తీయాలని అనుకున్నప్పుడు బప్పీ లహిరిని సంగీతానికి ఎంచుకున్నాడు. ‘ఒక పాటలో బోలెడన్ని కుండలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాట చేయండి’ అని రాఘవేంద్రరావు అడిగితే ట్యూన్ కట్టేటప్పుడు తన ఎదురుగా ఐదారు తబలాల వరుస పెట్టుకుని ఉండే బప్పీ ఒక ట్యూన్ వినిపించాడు. పాట ఓకే అయ్యింది. షూటింగ్‌కు జితేంద్ర హాజరయ్యాడు. శ్రీదేవితో పాట. నగరాలో పాట విని ‘ఇదేం పాట డైరెక్టరు గారూ... ఇవేం స్టెప్పులు’ అని పైకే అనేశాడు. కాని చేయక తప్పలేదు. ‘హిమ్మత్వాలా’ రిలీజైంది. ఒక్క పాట. ‘నైనోమే సప్నా సప్నోమే సజ్నీ సజ్నీ పే దిల్ హోగయా’... ఎక్కడ చూసినా అదే. ‘హిమ్మత్వాలా’తో పాటు బప్పీ పాటా హిట్ అయ్యాయి. ఇక కె.రాఘవేంద్రరావు, జితేంద్ర, బప్పీ లహిరి ఒక టీమ్ అయ్యారు. తెలుగులో హిట్ అయిన ‘దేవత’ హిందీలో ‘తోఫా’(1984) గా రీమేక్ అయితే ‘తోఫా.. తోఫా.. తోఫా... లాయా లాయా లాయా’ హిట్. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా ‘మవ్వాలి’గా రీమేక్ అయితే ‘ఉయ్యమ్మ.. ఉయ్యమ్మ ముష్కిల్ ఏ క్యా హోగయీ’ మాస్ హిట్. ‘ముందడుగు’ రీమేక్ ‘మక్సద్’, ‘జస్టిస్ చౌదరి’, ‘ఖైదీ’... ఈ సినిమాలన్నింటికీ బప్పీ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదంతా ముంబై నుంచి హైదరాబాద్‌కు బప్పీ రావడానికి కారణమైంది. ∙∙ కృష్ణ ఏది చేసినా ఘనంగా చేయాలనుకుంటాడు. ‘సింహాసనం’ (1986) రెండు భాషల్లో తీయ తలపెట్టిన భారీ జానపద చిత్రం. తెలుగులో తాను. హిందీలో జితేంద్ర. రెండు భాషల్లో హిట్ పాటలు తప్పవు కనుక బప్పీ లహిరిని రంగంలోకి దించాడు. నిజానికి కృష్ణకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడటం లేదు. రాజ్ సీతారాంతో సర్దుకోవాలి. కాని ఆ మైనస్‌ను కూడా పట్టించుకోని స్థాయిలో బప్పీ లహిరి భారీ హిట్ పాటలు అందించాడు. ‘ఆకాశంలో ఒక తార’ నేటికీ మోగుతూనే ఉంది. ఆ సినిమాలో ‘ఇది కల అని నేననుకోనా’, ‘గుమ్మా గుమ్మా’, ‘వహవ్వా నీ యవ్వనం’ మాస్‌ను క్యాసెట్లు కొనేలా చేశాయి. ఆ తర్వాత కృష్ణ హీరోగా భారీ ఖర్చుతో తీసిన సాధారణ సినిమా ‘తేనె మనసులు’కు, ‘నసీబ్’ రీమేక్‌గా చేసిన ‘త్రిమూర్తులు’కు పాటలు ఇచ్చాడు. కాని చిరంజీవి– బప్పీ లహిరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’ కలెక్షన్లలో అంతగా ఘనంగా లేకపోయినా పాటల్లో ఊపేసింది. ‘చుక్కల పల్లకిలో’, ‘రాధా రాధా మదిలో మన్మధ బాధ’కు తెర మీద కాగితపు ముక్కలు ఎగిరాయి. అయితే బప్పీ లహిరి అసలు సిసలు హిట్ ‘గ్యాంగ్ లీడర్’తో దక్కింది. ఆ సినిమాలో పాటలు చిరంజీవిని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేర్చాయి. ‘జీ ఏ ఎన్ జీ గ్యాంగ్ గ్యాంగ్’... ఎంత ఫాస్ట్ బీటో ‘భద్రాచలం కొండ’ అంత పల్లె బీట్తో ఆకట్టుకున్నాయి. ‘వానా వానా వెల్లువాయే’ పాట ‘రచ్చ’ సినిమాలో రీ మిక్స్ అయ్యేంత ఫ్రెష్‌గా నేటికీ ఉంది. ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి గుర్తుండిపోయారు జల్లు కురిసే వానలాగా. చిరంజీవికే ‘రౌడీ అల్లుడు’ చేసిన బప్పీ బాలకృష్ణకు ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ చేశాడు. ∙∙ కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’తో హిందీ దేశానికి తెలిశాడని అనుకుంటాం కాని దానికి ముందే బప్పీ అతని చేత ‘టూటే ఖిలోనే’లో పాడించాడు. శేఖర్ కపూర్ హీరో. షబానా ఆజ్మీ హీరోయిన్. ‘మానాహో తుమ్ బేహద్ హసీన్’ పాట ఇప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత తెలుగులో మోహన్‌బాబు కోసం చేసిన పాటల్లో ఏసుదాస్‌కు మంచి పాటలు ఇచ్చాడు. ‘రౌడీ గారి పెళ్లాం’ ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’... ‘బ్రహ్మ’లో ‘ముసి ముసి నవ్వులలోనా’ పాటలు హిట్. ∙∙ బప్పీ లహిరి చాలా ప్రయోగాలు చేశాడు. డిస్కోలో ఇండియన్ మ్యూజిక్ ‘ఫ్యూజన్’ను ఆ రోజుల్లోనే ప్రయత్నించాడు. ‘నమక్ హలాల్’లో 12 నిమిషాల పాట ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’లో డిస్కోను, క్లాసికల్‌ను కలిపాడు. కిశోర్ కుమార్ దగ్గరకు ఈ పాట కోసం వెళితే సహనం తక్కువగా ఉండే ఆయన (ఎంత పెద్ద పాట పాడినా అదే పారితోషికం కనుక) ‘ఇంత పెద్ద పాట నా వల్ల కాదు. ఇలాంటివి రఫీ సాబ్ కదా పాడేది’ అన్నాట్ట. కాని బప్పీ పట్టుబట్టి పాడించాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. మన జయప్రద అమితాబ్‌తో కలిసి నటించిన ‘షరాబీ’, ‘ఆజ్ కా అర్జున్’ సినిమాల్లో పాటలు బప్పీ చేయగా హిట్ అయ్యాయి. ‘షరాబీ’లో ‘దేదే ప్యార్ దే ప్యార్ దే’, ‘ఇంతెఖాల్ హోగయీ ఇంతెజార్కీ’... పాటలు ‘ఆజ్ కా అర్జున్’లో ‘గోరిహి కలాయియా’ పాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్నాయి. ∙∙ 1982 నుంచి 1990 వరకూ దాదాపు ఒక ప్రభంజనంలా బప్పీ కొనసాగాడు. డిస్కో తర్వాత బ్రేక్‌ను తెచ్చాడు. గోవిందా తొలి సినిమా ‘ఇల్జామ్’లో ‘ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్’ పాటతో బ్రేక్ డాన్స్ పాటలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ట్రెండ్ కొంతకాలం సౌత్‌లో కూడా కొనసాగింది. చివరకు ఆనంద్– మిలింద్, నదీమ్ – శ్రావణ్ వచ్చే వరకూ అతనికి ఎదురు లేకపోయింది. ∙∙ బప్పీ లహిరి మాస్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఉండటానికే అతడు ఇష్టపడ్డాడు. బాలీవుడ్ కూడా అలాగే అతణ్ణి ఉంచింది. పెద్ద పెద్ద సినిమాలు, సీరియస్ కథాంశాలు అతని దాకా రాలేదు. క్లాసిక్స్ అంటూ చెప్పుకోవడానికి అతనికి ఏమీ లేవు. కాని అతడు మంచి పాటలు చేయగలడు. ‘ప్యార్ మే కభీ కభీ ఐసాహి హోతాహై’ (చల్తే చల్తే), ‘కిసీ నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై’ (ఐత్బార్), ‘జిద్ నా కరో అబ్ తో రుకో ఏ రాత్ నహీ ఆయేగీ’ (లహూ కే దో రంగ్) వంటి మంచి మెలోడీలు చేశాడు. బప్పీని సంగీత పండితులు నిరాకరించినా అన్ని పాటల్లో అతను తబలాను వాడే పద్ధతిని విశేషంగా మెచ్చుకుంటారు. అతడికి తబలా అంటే ఇష్టం కనుక ఎంతటి బీట్ ఆధారిత పాటలో కూడా తబలాను చాలా ప్రతిభావంతంగా ఇముడ్చుతాడు. బప్పీ లహిరిని 1980ల మాస్ పాటలకు ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ‘డర్టీ పిక్చర్’ను తీసేప్పుడు ఆ కాలం మాస్ పాటకు సంకేతంగా బప్పీ స్టయిల్లో ‘ఊలాల ఊలాల’ పాట చేయించి అతని చేతే పాడించారు. బప్పీ, అలీషా చినాయ్, షరోన్ ప్రభాకర్ లాంటి గాయనులను సినిమాల్లోకి తెచ్చాడు. అతడు వెలుగుతున్నప్పుడు నిర్మాత దర్శకులే కాదు గాయనీ గాయకులు కూడా అతని ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. చివరి రోజుల్లో అతడు తనకు కనీసం ‘పద్మశ్రీ’ వస్తే బాగుండు అనుకున్నాడు. రాలేదు. ఒక కాలపు మాస్ ప్రేక్షకులు తనకు తెర మీద చిల్లర నాణేలు విరజిమ్ముతూ చేసిన సత్కారమే చాలనుకున్నాడు. అతను చేసిన మంచి పాటతోనే అతనికి వీడ్కోలు చెప్పవచ్చు. చల్తే చల్తే మేరే ఏ గీత్ యాత్ రఖ్నా కభి అల్విదా నా కెహెనా కభి అల్విదా నా కెహెనా... మైక్ టైసన్ ‘జింగిల్’ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ 2018లో ఎమ్ఎమ్ఏ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చినప్పుడు ఆయన్ను స్వాగతిస్తూ జింగిల్ పాటను బప్పీ పాడాడు. ‘ఓమ్ స్వాగతమ్..’ అని ప్రారంభమయ్యే ఈపాట మైక్ టైసన్ ను కొనియాడుతూనే బప్పీ మార్క్‌ను చూపింది. బప్పీ... ది గోల్డ్ మ్యాన్ ‘నడిచే నగల దుకాణం’... బప్పీ లహిరి గురించి చాలామంది సరదాగా అనుకునే మాట ఇది. ఇక అందరూ ఆయన్ను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే మెడలో కొబ్బరి తాడుని తలపించే బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతులకు కడియాలు, మణికట్టు గొలుసులు... ఇలా బప్పీ ఒంటిపై బంగారం మెరిసేది. నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే బంగారాన్ని అదృష్టంగా భావించి ఎప్పుడూ కనీసం ఎనిమిది చెయిన్ లను మెడలో వేసుకునేవారు. 1974లో బప్పీవాళ్ల అమ్మగారు తొలి బంగారపు గొలుసు ఇచ్చారు. తొలిసారి వేసుకున్న ఈ గొలుసు పేరు ‘ఏ హరే కృష్ణ చెయిన్ ’. తర్వాత భార్య చిత్రాణి 1977లో బంగారపు గొలుసు ఇచ్చారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని బంగారపు గొలుసులు వేసుకుంటూ గోల్డ్ మ్యాన్, బ్లింగ్ మ్యాన్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే వినూత్న వస్త్రధారణ, ప్రత్యేకమైన సన్ గ్లాసెస్ ధరించేవారు బప్పీ. ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలంటే ముందు రోజే ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ గ్లాసెస్ పెట్టుకోవాలి? ఏ ఆభరణాలు ధరించాలి? అనేది ప్లాన్ చేసేసుకునేవారట. విశేషం ఏంటంటే... వెరైటీ డ్రెస్సింగ్ మీద భర్తకి ఉన్న ఆసక్తి గమనించి, భార్య చిత్రాణి లహిరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బప్పీయే స్వయంగా చెప్పారు కూడా. కలసి రాని రాజకీయాలు 2014లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రస్తావిస్తూ, తనకు 754 గ్రాములు, భార్యకు 967 గ్రాముల బంగారం ఉందని, ఇద్దరిదీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నాయనీ బప్పీ పేర్కొన్నారు. అయితే సంగీత ప్రపంచంలో హిట్ రాగాలిచ్చిన బప్పీకి రాజకీయ జీవితం మాత్రం ఫ్లాప్ రాగం అనాలి. ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. – కె -
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ హయాంలో ఫరీదుద్దీన్ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చదవండి: సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్ -
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
బీజింగ్: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది. -
ప్రముఖ చరిత్రకారుడు పురందరే కన్నుమూత
పుణె: ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన సోమవారం పుణెలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన ఆయన వయసు 99 సంవత్సరాలు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకంతో ఆయన మహారాష్ట్ర వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జానతా రాజా పేరుతో ఆయన రూపొందించిన నాటకం సైతం ఎంతో పేరొందింది. 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆయనను వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే మృతిపై ప్రధాని మోదీ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పురందరే అంత్యక్రియలను పుణెలో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. -
పాక్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీర్‌ఖాన్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. 1936లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఖదీర్ ఖాన్ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్ ఖాన్ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆగస్ట్ 26వ తేదీన ఇస్లామాబాద్‌లోని ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీ(కేఆర్ఎల్) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కేఆర్‌ఎల్‌కి తీసుకు రాగా అక్కడే ఆయన కన్నుమూశారని మీడియా తెలిపింది. ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీదులో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఖదీర్‌ఖాన్ మృతికి అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్ ఖాన్ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది. -
తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే
ఖమ్మం: కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం జైత్రాంతండా గ్రామానికి చెందిన ధరావత్ కౌసల్య కుటుంబంలో చోటుచేసుకున్న వివాదానికి మనస్థాపం చెంది ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. అనంతరం ఖమ్మం ఆస్పత్రికి కౌసల్య కుమారుడు ధరావత్ సురేష్(25) తన తండ్రి ధరావత్ సూర్య, మామయ్య కేలోతు గోపీతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. ఈక్రమంలో ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ సమీపాన శివాయిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య, కేలోతు గోపీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఒకవైపు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందడం... తండ్రి, మామయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జైత్రాం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం -
బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి
మాంట్రియల్: ఓ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. మాంట్రియల్లో జరిగిన జీవైఎం గాలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికోకు చెందిన వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్ జకారియాస్ జపాటా గత శనివారం షెడ్యూలైన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్లో ప్రత్యర్థి మేరీ పియర్ హౌల్ విసిరిన పంచ్‌లకు జెన్నెట్ నేలకూలింది. ఐదో రౌండ్ బెల్ మోగాక కూడా ఆమె తేరుకోకపోవడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిని అనంతరం గురువారం ఆమె కన్నుమూసినట్లు ఫైట్ నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: ఢిల్లీ పగ్గాలు పంత్‌కే.. శ్రేయస్‌కు భంగపాటు -
Vasoo Paranjape: గవాస్కర్, సచిన్‌ల కోచ్ కన్నుమూత
ముంబై: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. వాసు.. 1956-1970 మధ్య ముంబై, బరోడా జట్ల తరఫున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.78 సగటుతో 785 పరుగులు చేశాడు. వాసు.. బాంబేలోని దేశీయ క్రికెట్లో దాదర్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించేవాడు. ఈ జట్టు బాంబేలో అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటి. I feel that a piece of me has left the world. Rest in Peace Vasu Sir. 🙏 pic.twitter.com/0ynyJ7LQNu — Sachin Tendulkar (@sachin_rt) August 30, 2021 ఆటగాడిగా విరమణ పొందిన తర్వాత వాసు కోచ్‌గా మారారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పాడు. అంతేకాదు వాసు అనేక జట్లకు కోచ్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీకి కోచ్‌గా సేవలనందించారు. వాసు మరణం పట్ల సచిన్, రోహిత్ సహా చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, వాసు కుమారుడు జతిన్ పరంజపే కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. జతిన్ కొంతకాలం జాతీయ సెలెక్టర్‌గా కూడా వ్యవహరించాడు. చదవండి: ఒకే గ్రూప్‌లో తలపడనున్న కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ జట్లు -
Sunderlal Bahuguna: ‘చిప్కో’ ఉద్యమ కర్త ఇకలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. 13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 84 రోజుల నిరశన దీక్ష చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు. -
బతుకు అర్థం తెలియచేసిన మంచి కవికి వీడ్కోలు
వినోదం పంచే కవులు బహుగురు. బతుకు కోరే కవులు పదుగురు. నీవు వినే మాట, పాట నీకో దారి దీపం కాగలిగితే, కవి అలా చేసి ఇవ్వగలిగితే ఆ కవిని కాలం గుర్తు పెట్టుకుంటుంది. చెప్పాల్సింది, తెలపాల్సింది ఉన్నప్పుడే రాస్తాను అని రాసి గౌరవం పొందారు అదృష్టదీపక్. పాట అంటే పురోగామి, చైతన్యపథగామి అని పదేపదే చెప్పారాయన. మన బతుకు అర్థవంతమై ఎదుటివారి బతుకు అర్థవంతం చేయడమే మనిషి చేయవలసింది అని బోధించిన అదృష్టదీపక్‌కు వీడ్కోలు. ‘కులం లేని మతం లేని మమతే మన పాటగా మానవత్వం చాటరా’ అని అదృష్టదీపక్ ‘యువతరం కదిలింది’లో తన తొలిపాటలో రాశారు. ‘ఆశయాల పందిరిలో’ అనే పల్లవితో ఉండే ఆ పాట అదృష్టదీపక్‌కు మాదాల రంగారావు ఇచ్చిన తొలిపాట. అందులోనే ఆయన పాట, తన పాట ఎలా ఉంటుందో చెప్పారు. ‘ఎరుపెక్కిన ఆశలతో తూరుపు తెల్లారింది’ అని ఆ పాటలోనే రాశారు. మనిషి సగటు ఆశలు నెరవేరాలంటే ఆ ఆశలకు ఉండాల్సిన రంగు ‘ఎరుపు’ అని ఆయన అన్యాపదేశంగా చెప్పారు. పాటను ప్రయోజనం కోసం, సందేశం కోసం రాసిన అదృష్టదీపక్ (71) కరోనా చికిత్స పొందుతూ కాకినాడలో ఆదివారం మరణించారు. అదృష్టదీపక్ శ్రీమతి పేరు స్వరాజ్యం. కుమారుడు చక్రవర్తి సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. కుమార్తె కిరణ్మయి గృహిణి. రైతుబిడ్డ అదృష్టదీపక్ది తూ.గో.జిల్లా రామచంద్రాపురం. ఆయన బాల్యం తొమ్మిదో తరగతి వరకూ రావులపాలెంలో సాగింది. తండ్రి బంగారయ్య రైతు. పొగాకు వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు నాటకాలపై ఆసక్తి ఉండేది. తల్లి సూరమ్మ అరుగు మీద తోటి స్త్రీలను కూచోపెట్టి బాలనాగమ్మ, బాల సన్యాసమ్మ లాంటి కథలను గానరూపంలో పాడి వినిపించేది. అదృష్టదీపక్ మీద ఆ ప్రభావం ఉంది. ఆ తర్వాత బడ్డీకొట్లకు వేళ్లాడుతూ కనిపించే చందమామ ఆయనకు పఠనాశక్తి కలిగించిది. చిన్నప్పుడు బాగా చదువుతున్నాడని స్కూలులో బహూకరించిన ‘బొమ్మల భారతం కథ’ శాశ్వత పాఠకుడిని చేసింది. ఇవన్నీ అదృష్టదీపక్‌ను సాహిత్యంవైపు తీసుకువచ్చాయి. చరిత్ర అధ్యాపకుడు రామచంద్రాపురంలో పి.జి చేసిన అదృష్టదీపక్ ద్రాక్షారామం జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా చేరి 28 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయ్యారు. అయితే అందరూ లెక్చరర్స్‌కు మల్లే ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భారీగా పెన్షన్‌ను, బెనిఫిట్స్‌ను నష్టపోయారు. ఉత్తమ కవికి పదమే సంపద అన్నట్టు సైకిల్ మీద సింపుల్‌గా తిరిగేవారు. ఒకవైపు అధ్యాపకుడిగా కొనసాగుతూనే మరోవైపు కవిగా, నటుడిగా రాణించారు. ‘అరసం’, ‘ప్రజానాట్యమండలి’తో కలిసి పని చేశారు. ‘కోకిలమ్మ పదాలు’, ‘అగ్ని’, ‘సమర శంఖం’, ‘ప్రాణం’, ‘అడవి’, ‘దీపకరాగం’, ‘ఆశయాల పందిరిలో’, ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ తదితర కవితా సంపుటాలు వెలువరించారు. విమర్శలో రాణించారు. అదృష్టదీపక్ సప్తతి సందర్భంగా మిత్రుల పరిచయ వ్యాసాలతో ‘దీపం’, మిత్రులతో తనకున్న పరిచయాలను ‘తె రచిన పుస్తకం’ పేర్లతో అదృష్టదీపక్ వెలువరించారు. పద విన్యాసం అదృష్టదీపక్‌కు తెలుగు భాషకు సంబంధించిన ‘గళ్ల నుడికట్టు’ను నిర్వహించడంలో అభిరుచి ఉంది. అది సరదా కోసంగానే కాక తెలుగు భాష విస్తృతిని కొత్తతరాల్లో పాదుకొల్పడానికి కూడా ఆయన నిర్వహించేవారు. గతంలో ఉదయం పత్రికలో దశాబ్ద కాలం నిర్వహించిన ఆయన ‘సాక్షి’ ప్రారంభం నుంచి ‘ఫన్డే’లో మరణించేనాటి వరకూ కూడా భాషా నుడికట్టును విజయవంతంగా నిర్వహించారు. మానవత్వం పరిమళించే అదృష్టదీపక్ ‘ప్రాణం’ కవితా సంపుటిని చూసిన దర్శకుడు మాదాల రంగారావు ఆయనను మద్రాసు పిలిపించి ‘యువతరం కదిలింది’ సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత టి.కృష్ణకు సన్నిహితం అయిన అదృష్టదీపక్ ‘నేటి భారతం’, ‘దేవాలయం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ తదితర సినిమాలకు పని చేశారు. మొత్తం 40 సినిమా పాటలు రాశారు. మద్రాసులోనే ఉంటూ అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఎన్ని పాటలు రాసేవారో కాని కమర్షియల్ పాటలు రాయడం ఇష్టం లేదని రామచంద్రాపురం తిరిగి వచ్చేశారు. ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన పాట ‘నేటి భారతం’లోని ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’. ఆ సినిమాలో వేశ్యలను సంస్కరించి ఉపాధి చూపిన ఇన్స్పెక్టర్ సుమన్ వారెలా ఉన్నారో చూద్దామని భార్యతో పాటు వచ్చినప్పుడు వారు పాడే పాట అది. ‘ఆ పాట రాయించే ముందు మూడ్ కోసం దర్శకుడు టి.కృష్ణ నన్ను ఒక రోజంతా ఎస్.జానకి ప్రయివేటు గీతాలు వినమన్నారు. అలాగే అమెరికాలో ఉదయ్‌శంకర్ చేసిన కచేరి కేసెట్ను కూడా వినమన్నారు. అందువల్లే ఆ పాట అంత లలితంగా వచ్చింది’ అని అదృష్టదీపక్ చెప్పారు. ఆ పాట వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు అయినా ఏ మంచి వ్యక్తికి సంబంధించిన విశేష కార్యక్రమంలో కూడా ఆ పాటనే ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు మత పురుషుల మీదా ఆ పాటను ప్లే చేయడం విశేషం. ముగిసిన శకం రామచంద్రాపురంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ సాహితీ ప్రోత్సాహకులుగా, మార్గదర్శిగా ఉన్న అదృష్టదీపక్ తన నిష్క్రమణతో ఆ ప్రాంతంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చారు. తెలుగు పాట ఆదర్శదారిని గుర్తు చేసే కలంగా ఉంటూ వచ్చిన ఆయన ఇక వీడ్కోలు తీసుకోవడం కూడా ఒక పెద్దలోటు. ఆయనకు నివాళి. – సాక్షి ఫ్యామిలీ -
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్ ఉంటే ఆ రేడియో ద్వారా కొంతమంది మన ఇంటి మనుషులు అవుతారు. వారు పదే పదే నట్టింట్లో మోగుతూ మనకు ఆత్మీయులైపోతారు. వారిని మరిచిపోవడం కష్టం. ఇదిగో ఏదో ఒక ‘జనరంజని’లో ఒక వేణునాదంతో మొదలయ్యే ఈ తియ్యటి పాటనూ, గొంతునూ పుస్తకంలో దాచుకున్న నెమలీక లాంటి స్పర్శను ఎలా మర్చిపోవడం? ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగ మాలిక జి.ఆనంద్ తెలుగులో కొన్ని మంచి పాటలకు వాటాదారు అయ్యారు. అలా అవడం కష్టం. సినీ ప్లేబ్యాక్‌లో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న సమయంలో... పి. రామకృష్ణ కూడా వెనుకంజ వేస్తున్న సమయంలో... తెలుగులో ఇద్దరు గాయకులు కొన్ని పాటలు పొందగలిగారు. వారు మాధవపెద్ది రమేశ్, జి. ఆనంద్. మాధవపెద్ది రమేశ్‌కు సినిమా రంగపు వెన్నుదన్నన్నా ఉంది. శ్రీకాకుళం నుంచి మద్రాసు చేరుకున్న జి. ఆనంద్‌కు అది కూడా లేదు. ఆయన ప్రధానంగా స్టేజ్ సింగర్. సినిమాల్లోకి రాకముందు ఆర్కెస్ట్రా సింగర్‌గా కళింగాంధ్రలో జి.ఆనంద్ పేరు మార్మోగేది. నంద్యాలలో జరిగిన ఒక పాటల పోటీలో ప్రైజ్ కొట్టి జడ్జ్‌గా వచ్చిన కె.వి. మహదేవన్ దృష్టిలో పడి మద్రాసు చేరుకున్నాడాయన. తొలి పాటను ‘పండంటి కాపురం’లో రాజబాబుకు పాడినా పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘అమెరికా అమ్మాయి’ సినిమా. సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ఆనంద్‌కు ‘ఒక వేణువు’ పాట ఇచ్చారు. ఆ పాట పెద్ద హిట్ అవడమే కాదు మరణించే క్షణాల వరకూ ఆనంద్‌కు ఒక అస్తిత్వంలా, వ్యక్తిత్వంలా నిలిచింది. ఈ పాట తర్వాత ఆనంద్ దాసరి దర్శకత్వంలోని ‘మా బంగారక్క’లో ‘దూరాన దూరాన తారాదీపం’ పాడారు. ఆ పాట గుర్తింపు పొందింది. సంగీత దర్శకుడు చక్రవర్తి బాలూ కెరీర్‌ను నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నా కొన్ని సందర్భాలలో కొత్త గాయకులకు అవకాశాలు ఇచ్చేవారు. ‘కల్పన’లో ఆనంద్‌కు మంచి డ్యూయెట్ పడింది. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మా ఆ తర్వాత ‘ఆమె కథ’లో ‘పువ్వులనడుగు నవ్వులనడుగు’ డ్యూయెట్ కూడా చక్రవర్తి సంగీతంలో హిట్ అయ్యింది. చక్రవర్తే ‘జూదగాడు’లో సుశీలతో చాలా మంచి డ్యూయెట్ ఇచ్చారు ఆనంద్‌కు. ఆ పాట కూడా జనరంజని హిట్టే. మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథలీల జానపదాలకు నెలవైన ఉత్తరాంధ్ర నుంచి రావడం వల్ల ఆనంద్ అటువంటి పాటలు దొరికితే ఊపుగా న్యాయం చేసేవారు. చిరంజీవి తొలి డ్యూయెట్ ‘ప్రాణం ఖరీదు’లో ‘ఎన్నియెల్లో ఎన్నియెల్లో ఎందాక’ ఆనంద్ పాడిందే. ఇక ‘మనవూరి పాండవులు’ సినిమాలో మహదేవన్ పాడించిన ఈ పాట వినని రేడియో శ్రోత ఉండడు. నల్లా నల్లా మబ్బుల్లోన లగ్గోపిల్లా తెల్లాతెల్లని సందామామ లగ్గోపిల్లా చాలామందికి గుర్తుండదు కాని ‘ఒక వేణువు’ స్థాయిలోనే ఆనంద్ పాడిన ఒక సోలో ఉంది. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలోనిది. ‘పయనించే చిరుగాలి... నా చెలి చెంతకు చేరి’.... చాలా బాగుంటుంది. ఆనంద్‌కు తన పరిమితులు తెలుసు. శక్తులూ తెలుసు. అందుకే ఆయన గాయకుడిగా తనకు వచ్చిన గుర్తింపుతో ‘స్వరమాధురి’ ఆర్కెస్ట్రాను స్థాపించి దేశ విదేశాలలో ఎక్కడ తెలుగువారుంటే అక్కడ కచ్చేరీలు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి ప్లేబ్యాక్ సింగింగ్ కంటే కూడా ఈ కచ్చేరీల వల్లే ఆర్థికంగా ఆయన ఎక్కువ లబ్ధి పొందారు. అమెరికాలో 19 సార్లు టూర్లు నిర్వహించిన ఘనులు ఆనంద్. మధ్యలో ‘గాంధీనగర్ రెండవ వీధి’ లాంటి కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. ‘గాంధీనగర్’లో ‘కలకానిది విలువైనది ఒక కథ ఉన్నది వినిపించనా’ పాట పెద్ద హిట్. ‘అమెరికా అమ్మాయి’ సినిమాతో గుర్తింపు పొందిన ఆనంద్ ‘అమెరికా’తో తనకేదో బంధం ఉందని చెప్పుకునేవారు. ఆ అమెరికా అమ్మాయి హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన గాయని సుజాత పరిచయమై భార్యగా మారారు. ఆనంద్ ఇద్దరు అబ్బాయిలు. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఒక మనవరాలు పుట్టింది కనుక ఆ పాప అమెరికా అమ్మాయి అని చెప్పుకునేవారు. అమెరికాలో చాలాకాలం ఉండి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆనంద్ కరోనాకు తన అంతిమ పాటను వినిపించారు. ఆయనకు నివాళి. కరోనాకు బలి అయిన కమ్మని కంఠం సీనియర్ సినీ గాయకుడు జి. ఆనంద్ (77) కరోనా బారిన పడి, గురువారం రాత్రి హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని తులగామ్ గ్రామంలో 1944 ఫిబ్రవరి 16న ఆనంద్ జన్మించారు. ఆయన తండ్రి రంగస్థలంపై అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్ కూడా తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడంతో పాటు పలు పౌరాణిక నాటకాల్లో నటించారు. తండ్రి రాముడి పాత్ర పోషించినప్పుడు, ఆనంద్, ఆయన సోదరుడు లవ–కుశ పాత్రలు పోషించారు. తొలినాళ్లలో తమ ఇరుగు పొరుగు గ్రామాలలో పండగలు, ఇతర కార్యక్రమాల్లో, సంగీత విభావరుల్లో పాటలు పాడి, పలు బహుమతులు గెలుచుకున్నారు ఆనంద్. మదరాసు (ఇప్పుడు) చెన్నైలో రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ‘నీ గొంతు బావుంది’ అంటూ కె.వి.మహదేవన్‌కు ఆనంద్ గురించి సిఫార్సు లేఖ రాశారట కృష్ణశాస్త్రి. ఆ సమయంలోనే ‘అమెరికా అమ్మాయి’ లో ‘ఒక వేణువు వినిపించెను..’ పాట పాడే అవకాశం ఆనంద్కి వచ్చింది. అప్పటినుంచి పలు చిత్రాల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో 2500 పైచిలుకు పాటలు పాడిన ఆనంద్ 150 ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. టీవీ సీరియల్స్‌కూ, హిందీ నుంచి తెలుగు సహా అనేక అనువాద చిత్రాలకూ స్వరసారథ్యం వహించారు. ‘స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా సంగీత విభావరులు నిర్వహించారు. ఏకంగా 6500 పైగా ప్రదర్శనలిచ్చారు. ‘స్వరమాధురి’ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది యువ గాయనీ గాయకులను సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు. సుదీర్ఘకాలం చెన్నైలో ఉన్న ఆనంద్ ఆ మధ్య హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్ర మాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చారు. వీనులవిందైన పాటలు ఎన్నో పాడిన ఆనంద్ ఆ పాటల ద్వారానే గుర్తుండిపోతారు. ఆయన మృతిపట్ల హీరో చిరంజీవి సహా పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో ఆనంద్ అంత్యక్రియలు జరిగాయి. – సాక్షి ఫ్యామిలీ -
హాస్య నటుడు వివేక్ మృతి.. ప్రముఖుల నివాళులు
-
కాలానికి కరిగిపోని ‘వివేక్’ నవ్వు
వివేకం + ఆనందం = వివేకానందం. సార్థక నామధేయుడు – ప్రసిద్ధ తమిళ నటుడు ‘వివేకానందన్’ అలియాస్ వివేక్. చేసింది హాస్యపాత్రలే అయినప్పటికీ వివేకవంతమైన సంభాషణలతో విజ్ఞానాన్నీ, హాస్యసంభాషణలతో ఆనందాన్నీ పంచారు వివేక్. ప్రముఖ తమిళ హాస్య, సహాయ నటుడు వివేకానందన్ (వివేక్) శనివారం తుది శ్వాస విడిచారు. శుక్రవారం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. శనివారం తెల్లవారుజామున 4.35 గంటలకు వివేక్ (59) కన్నుమూశారు. తమిళనాడులోని కోవిల్పట్టిలో 1961 నవంబర్ 19న జన్మించాడు. దిండిగల్‌లో టెలిఫోన్స్ శాఖలో టెలిఫోన్ ఆపరేటర్‌గా శిక్షణ పొందారు. చెన్నైలో సెక్రటేరియట్లో పనిచేస్తూ, ‘మద్రాస్ హ్యూమర్ క్లబ్’లో ‘స్టాండప్ కమెడియన్’గా చేసేవారు. క్లబ్ వ్యవస్థాపకుడు గోవిందరాజన్ ద్వారా దర్శకుడు కె. బాలచందర్‌తో వివేక్కి పరిచయం ఏర్పడింది. రచన టు నటన... బాలచందర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా చేయడం మొదలుపెట్టారు వివేక్. ఒకరోజు ఒక సందర్భాన్ని వివరించి, పదహారు పాత్రలతో కథ రాయమన్నారు బాలచందర్. ఒకే ఒక్క రాత్రిలో వివేక్ రాసిచ్చారు. ‘మనదిల్ ఉరుది వేండుమ్’ (1987) చిత్రానికి స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు చిత్రదర్శకుడు బాలచందర్ వివేక్కి మంచి పాత్ర ఇచ్చారు. తొలిరోజు షూట్లో వివేక్ మెట్లపై నుంచి వేగంగా కిందకు దిగాలి. బాలచందర్ తృప్తిగా కట్ చెప్పేవరకూ మెట్లు దిగారు. ఫలితంగా కాలి వేళ్లకు గాయమైంది. కానీ బాలచందర్ దగ్గర చెప్పలేదు. విషయం తెలిసి, ఆయన చికిత్స చేయించుకోమన్నారు. నటుడిగా తొలి సీన్లో మెట్లు దిగిన వివేక్ ఆ తర్వాత కెరీర్లో ఎన్నో మెట్లు ఎక్కారు! విజ్ఞానం పంచిన నటుడు... బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పుదు పుదు అర్థంగళ్’, ‘ఒరు వీడు – ఇరు వాసల్’ వంటి చిత్రాల్లోనూ వివేక్ మంచి పాత్రలు చేశారు. ‘పుదు పుదు అర్థంగళ్’లో ‘ఇన్నిక్కు సత్తా... నాళైక్కు పాల్’ (ఇవాళ చచ్చిపోతే... రేపటికి రెండు) అని పదే పదే అంటుంటారు వివేక్. అర్థవంతమైన ఈ డైలాగ్‌ని వివేక్ నవ్వు తెప్పించేట్లు పలికారు. ఆ మాటకొస్తే... ఇలాంటి డైలాగులు చాలానే చెప్పారు. ‘వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలి. మనుషుల మనసుల్లో ఉండకూడదు రా’, ‘మిమ్మల్ని మార్చాలంటే ఎంతమంది పెరియార్లు వచ్చినా కుదరదు’, ‘ఇక్కడ డబ్బులు ఇవ్వనిదే పనులు జరగవు శివాజీ’ వంటి ఆయన డైలాగులు వివిధ తమిళ చిత్రాల్లో నవ్వించాయి... ఆలోచింపజేశాయి. అందుకే నవ్వులు మాత్రమే కాదు.. విజ్ఞానం పంచిన నటుడు కూడా! అది వివేక్ సీజన్... 1990ల మధ్య నుంచి ఓ పదేళ్లకు పైగా తమిళ పరిశ్రమలో కామెడీ పరంగా ‘వివేక్ సీజన్’ అని చెప్పాలి. అప్పట్లో వివేక్ లేని తమిళ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ‘సొల్లి అడిప్పేన్’ (2004) హీరోగా వివేక్కి తొలి తమిళ చిత్రం. ఆ తర్వాత విక్రమ్‌తో శంకర్ తీసిన ‘అన్నియన్’ (అపరిచితుడు)లో అండర్‌కవర్ పోలీసాఫీసర్‌గా వివేక్ చేసిన పాత్ర ఆకట్టుకుంది. రజనీకాంత్, కమలహాసన్ దగ్గర నుంచి మాధవన్, అజిత్, ఇవాళ్టి హీరోలు విజయ్, ధనుష్ దాకా తమిళ స్టార్లందరితోనూ ఆయన నటించారు. రజనీకాంత్ ‘శివాజీ’, మాధవన్‌తో ‘అలైపాయుదే’ (‘సఖి’), ‘మిన్నలే’ (‘చెలి’), ధనుశ్ ‘వీఐపీ’ (‘రఘువరన్ బీటెక్’) లాంటి చిత్రాల్లో వివేక్ పండించిన హాస్యం మరచిపోలేనిది. అలాగే వివేక్ ‘నాన్‌దాన్ బాలా’, ‘పాలగాట్టు మాధవన్’, ‘వెళ్లై పూక్కళ్’ వంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు. తెరపై నవ్వు... తెరవెనక దుఃఖం... తెరపై నవ్వులు పంచిన వివేక్ జీవితంలో జరిగిన పెద్ద విషాదం ఆయన తనయుడు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మెదడు వాపు వ్యాధితో మరణించడం! 2016లో ప్రసన్నకుమార్ చనిపోయాక వివేక్ కుంగిపోయారు. వివేక్‌కు భార్య అరుళ్ సెల్వి, ఇద్దరు కుమార్తెలు – అమృతనందిని, తేజస్విని ఉన్నారు. 2019లో తల్లి మణియమ్మాళ్ మరణం వివేక్‌ను చాలా బాధించింది. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి... ఇప్పుడు వివేక్ గురించి అందరూ అంటున్న మాట ఒకటే... మంచి నటుడే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని! అయిదేళ్ళ క్రితం తమిళనాట డెంగూ, మెదడువాపు జ్వరాలు ప్రబలుతున్నప్పుడు జనంలో చైతన్యం కలిగించడానికి ప్రభుత్వ ప్రచారోద్యమంలో భాగస్వామి అయ్యారు. కానీ, అదే డెంగూ, మెదడువాపు జ్వరాలకు వివేక్ తన కుమారుణ్ణి కోల్పోవడం విషాదం. తాజాగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజల్లో కోవిడ్ టీకాపై అవగాహన కల్పించాలని ఆయన భావించారు. గుండెపోటు రావడానికి సరిగ్గా ముందు రోజే వివేక్ తమిళనాడు ప్రభుత్వం పక్షాన కోవిడ్ టీకా ఉద్యమానికి ప్రచారకర్తగా నిలిచారు. ప్రభుత్వా సుపత్రిలో టీకా వేయించుకున్నారు. బండికి ఇన్సూరె¯Œ ్స చేయించుకున్నాం కాబట్టి రోడ్డు ప్రమాదం జరగదని అనుకోవడం పొరపాటని తనదైన శైలిలో కామెడీ చేస్తూనే, టీకా వేసుకొని, కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం గురించి హాస్యధోరణిలో మాట్లాడారు. ఆ మరునాడే తీవ్రమైన గుండెపోటుతో, అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య ప్రచారం కోసం ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిన రెండు సందర్భాలూ ఆయన జీవితంలో తీరని విషాదాలుగా మారిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, తీరని దుఃఖం మిగిల్చిన విచిత్రం. తమిళంలో హాస్యం అంటే.. ఇప్పటికీ ఎన్.ఎస్. కృష్ణన్ – ఆయన సతీమణి టి.ఏ. మధురం జంట పేరే చెబుతారు. ఆ తొలితరం సినీ – నిజజీవిత జంట పండించిన హాస్యం అంత పాపులర్. ఆ రోజుల్లో ఎన్.ఎస్. కృష్ణన్‌ను తమిళంలో ‘కలైవానర్’ అని పిలిచేవారు. అంటే, ‘కళా ప్రియుడు, కళల్లో విద్వాంసుడు’ అని అర్థం. కృష్ణన్ మరణించిన మూడున్నర దశాబ్దాల తర్వాత సినీ రంగంలోకి వచ్చిన వివేక్ ‘చిన్న కలైవానర్’ అయ్యారు. తమిళ సినీ అభిమానుల్లో వివేక్‌కు లభించిన అతి పెద్ద గౌరవం అది అని చెప్పుకోవచ్చు. ‘పద్మశ్రీ’ లాంటి ప్రభుత్వ పురస్కారాలు దక్కినా, తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నా, జనం ఇచ్చిన ఈ ‘చిన్న కలైవానర్’ టైటిల్‌ను వివేక్ అపురూపంగా భావించేవారు. అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో... వివేక్ ఆఫీసు రూములో ఆయన టేబుల్ మీద తిరుక్కురళ్ రాసిన ప్రాచీన తమిళ కవి – సంస్కర్త తిరువళ్ళువర్, ధ్యాన ముద్రలో బుద్ధుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బొమ్మలు కనిపిస్తాయి. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చినప్పుడు ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను కలిశాక, మొక్కల ఉద్యమం చేపట్టారు వివేక్. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం గురించి, మొక్కల అవసరం గురించి కలామ్ తన డైరీలో రాసుకున్న ఓ కవిత వివేక్ ఉద్యమానికి ఊపిరిపోసింది. అప్పటి నుంచి ఆయన తమిళనాట హరిత ఉద్యమానికి అనధికారిక అంబాసిడర్ అయ్యారు. ఏకంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మేరకు ప్రజలకూ, తన ఫ్యాన్స్‌కూ పిలుపునిచ్చారు. ఇప్పటికే దాదాపు 35 లక్షల దాకా మొక్కలు నాటడంలో, నాటించడంలో సక్సెస్ అయ్యారు. త్వరలోనే ఆ కోటి మొక్కలతో కాంతులు నింపాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఇలా జరిగింది. ‘అయ్యో నవ్వు చచ్చిపోయిందే’... అంటూ వివేక్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘తెర మీద నటించడంతో నటుడి బాధ్యత అయిపోయిందని అనుకోని వ్యక్తి వివేక్. సమాజానికి ఉపయోగపడేలా తన వంతుగా ఏదైనా చేయాలనుకున్న మంచి మనిషి’’ అన్నారు కమలహాసన్. రజనీకాంత్, వెంకటేశ్, దేవిశ్రీప్రసాద్ వంటి ఎందరో ప్రముఖులు వివేక్ హఠాన్మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలంతో పాటు మనిషి కరిగిపోవచ్చు. కానీ... వివేక్ కాలంతో పాటు కరిగిపోని నవ్వులు పంచారు. మంచిని పంచారు. ఆ నవ్వుకీ, ఆ మంచికీ మరణం లేదు! - డి.జి. భవాని -
పాక్ హక్కుల కార్యకర్త రెహ్మాన్ మృతి
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్(90) సోమవారం లాహోర్‌లో కన్నుమూశారు. పాక్‌లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్‌తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు. రెహ్మాన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్‌లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్ జర్నలిస్ట్‌గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్–ఇండియా పీపుల్స్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్ఆర్సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ జోహ్రా యూసఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సంతోష్ ముంజల్ కన్నుమూత
ముంబై: ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో గ్రూపు వ్యవస్థాపకుడు స్వర్గియ బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్(92) తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఆమె మరణించినట్లు ముంజల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1947లో బ్రిజ్మోహన్ లాల్‌తో ఆమె వివాహం జరిగింది. 1953లో హీరో సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆమె బ్రిజ్‌మోహన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆమె కుమారులు సుమన్ ముంజల్ రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, పవన్ ముంజల్ హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈఓగా, సునీల్ ముంజల్ హీరో ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు గీతా ఆనంద్ అనే కూతురు కూడా ఉన్నారు. -
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది ఇక లేరు
జైపూర్: బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 93 ఏళ్ళ రాజయోగిని దాది హృదయ్ మోహిని గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. గత పదిహేను రోజులుగా అనారోగ్య కారణాలతో ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో మోహిని చికిత్స పొందుతున్నారని ఆధ్యాత్మిక సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. బ్రహ్మకుమారీస్ మాజీ చీఫ్ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత మోహినిని చీఫ్‌గా నియమించారు. అబు రోడ్‌లోని బ్రహ్మకుమారీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మోహిని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్టు వారు తెలిపారు. మార్చి 13న మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. రాజయోగిని దాది గుల్జార్ ఆకా హృదయ మోహిని ప్రజాపీఠ బ్రహ్మకుమారీస్ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ప్రధాన పాలనాధికారి. దాదా లేఖ్‌రాజ్(ఆ తరువాత బ్రహ్మ బాబాగా పేరు మార్చుకున్నారు) స్థాపించిన ‘ఓం నివాస్’ అనే బోర్డింగ్ స్కూల్లో 1936లో ఎనిమిదేళ్ల వయసులోనే దాది గుల్జార్ యజ్ఞ(సంస్థ)లో దాది హృదయ మోహిని చేరారు. చిన్న వయస్సులోనే ఎంతో అనుభవాన్ని ఆర్జించిన దాది మోహిని, ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దాది మోహిని ఆధ్యాత్మిక, బోధనా విలువలకు పెట్టిందిపేరు. అతిచిన్న వయస్సు నుంచే ఆమె చేసిన సేవ, చూపిన త్యాగనిరతి దాది మోహినిని ఇప్పుుడు అత్యున్నత స్థానంలో నిలిపింది. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానంమేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా, ఇండోనేíసియా, శ్రీలంక, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, హాలాండ్, పోలండ్, రష్యా తదితర దేశాలెన్నింటికో వెళ్ళి తన బోధనలను వినిపించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫిలాసఫీ, రాజ్యోగ లాంటి అనేక అంశాల్లో ఆమె అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. -
భారత అథ్లెటిక్స్ కోచ్ అనూహ్య మృతి
పాటియాలా: భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికొలాయ్ స్నెసరెవ్ శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. పాటియాలాలో శుక్రవారం ఇండియన్ గ్రాండ్‌ప్రి టోర్నీ జరిగింది. సన్నాహాల్లో భాగంగా ఉదయమే అథ్లెట్లతో కలిసి సాధన లో పాల్గొన్న స్నెసరెవ్ మధ్యాహ్నం ప్రధాన ఈవెంట్ జరిగే సమయంలో కనిపించలేదు. దాంతో అధికారులు ఆయన గదికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే తన మంచంపై కోచ్ పడిఉన్నారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. 2005లో తొలిసారి భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్నెసరెవ్ హయాంలోనే ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, సుధా సింగ్, లలిత తదితరులు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మంగళవారమే ఆయన భారతదేశానికి వచ్చారు. -
టీకా వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి
యశవంతపుర: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా కార్యకర్త మృతి చెందిన ఘటన కర్ణాటకలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో జరిగింది. 33 ఏళ్ల ఆశా కార్యకర్త జనవరి 22న కరోనా టీకా వేయించుకుంది. 30వ తేదీన ఆమెకు ఎక్కువగా వాంతులయ్యాయి. దీంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 3న ఆమె మృతి చెందారు. మెదడులో రక్తం గడ్డ కట్టడమే మరణానికి కారణమని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె తలనొప్పితో బాధపడుతూ తరచూ మందులను వాడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు తెలిపారు. కలబురిగిలో ఆరుమంది ఆస్పత్రిపాలు .. కలబురిగిలో శుక్రవారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆరుమంది వైద్యారోగ్య సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో రాత్రి 7 గంటలకు ఆరుమందినీ కలబురిగి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ సమస్య లేదని వైద్యులు తెలిపారు. -
హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ ప్లమ్మర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత క్రిస్టోఫర్ ప్లమ్మర్ (91) నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా, టీవీల్లో, సినిమా నటుడిగా సుమారు 70 ఏళ్లు నటుడిగానే కొనసాగారాయన. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ (1965) చిత్రం ద్వారా నటుడిగా పాపులారిటీ సంపాదించారు ప్లమ్మర్. ఆస్కార్ అవార్డు అందుకున్న పెద్ద వయస్కుడిగానూ ప్లమ్మర్ పేరు మీద ఓ రికార్డు ఉంది. 2012లో వచ్చిన ‘బిగినర్స్’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నారాయన. ఈ అవార్డు అందుకునేప్పటికి ప్లమ్మర్కి 82ఏళ్లు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఎంత పేరు తెచ్చిపెట్టినా లీడ్ రోల్స్‌లో నటించడానికి అంగీకరించలేదాయన. సహాయ పాత్రల్లోనే నటించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని పేర్కొనేవారు ప్లమ్మర్. షేక్స్పియర్ కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా ప్లమ్మరే నటించడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం ప్రకటించారు. -
ల్యారీ కింగ్ కన్నుమూత
లాస్ ఏంజెలిస్: అర్ధ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి సరికొత్త అధ్యాయం సృష్టించిన టాక్ షో లెజెండ్ ల్యారీ కింగ్(87) కన్నుమూశారు. లాజ్ ఏంజెలిస్‌లోని సెడార్స్–సినాయ్ మెడికల్ సెంటర్లో శనివారం కింగ్ కన్నుమూశారని ఆయన సహ వ్యవస్థాపకుడుగా ఉన్న ఓరా మీడియా ట్విట్టర్లో తెలిపింది. జనవరి 2వ తేదీన కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఆయన కుమారుడు చాన్స్ ధ్రువీకరించారు. 1985 నుంచి 2010 వరకు సుదీర్ఘకాలం రేడియో హోస్ట్‌గా ఉన్నారు. 2010 నుంచి సీఎన్ఎన్లో పనిచేశారు. ఆయన నిర్వహించిన 50వేలకు పైగా కార్యక్రమాలు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యాయి.1995లో మధ్యప్రాచ్యం శాంతి చర్చలకు ల్యారీకింగ్ అధ్యక్షత వహించారు. ఎలిజబెత్ టేలర్, మిఖాయిల్ గోర్బచెవ్, బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, లేడీ గాగా వరకు ఆయన ఎందరో ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. 1933లో యూదుల కుటుంబంలో జన్మించిన ల్యారీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు చవిచూశారు. -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం తెల్లవారుజామున కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుం డె సంబంధిత సమస్యలతో పాటు కరోనాకు చికిత్సకోసం వారం క్రితం ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. ముంబైలోని సీపీఐ కార్యాలయంలో కూడా ఆయన పని చేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడే నర్సింగరావు. 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో ఆయన జన్మించారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు. సొంతూరు బూర్గులలో రైల్వేస్టేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. ఊర్లో స్కూల్ స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయనకు భార్య డాక్టర్ మంజూత, కుమార్తె మాళవిక, కుమారులు అజయ్, విజయ్‌లున్నారు. సీఎం సంతాపం తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు, తొలి.. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో నర్సింగరావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు, ప్రముఖుల సంతాపం బూర్గుల మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. అలాగే సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతాపం తెలిపారు. ఈ నెల 21న మఖ్దూంభవన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది. బూర్గుల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ, (ఇన్సెట్) -
పాండ్యా సోదరులకు పితృ వియోగం
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారిద్దరి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. -
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
హైదరాబాద్ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2009 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాస్ మృతి పట్ల నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు -
మసాలా మహాశయ్ ఇక లేరు..
న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, స్పైస్ కింగ్‌గా పేరొందిన మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్ దేవీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. ‘మహాశయన్ ది హట్టి (ఎండీహెచ్) అధినేత శ్రీ ధరమ్‌పాల్ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. శరణార్థిగా వచ్చి.. స్పైస్ కింగ్‌గా ఎదిగి.. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్కోట్లో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్కోట్లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది. అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్ పోర్టల్‌లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్‌లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు. 1948లో కొత్త మలుపు.. గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్‌లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఆయన విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
గుడ్‌బై మారడోనా
మారడోనా... నీవిక రావని, ఇకపై లేవనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేమంటూ దివికెగిన సాకర్స్టార్కు ఫుట్‌బాల్ ప్రపంచం, జనవాహిని, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ముఖ్యంగా అర్జెంటీనా అంతటా విషాదం అలుముకుంది. అభిమానజనం దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పూల చేతితో, కన్నీటి కళ్లతో నివాళి అర్పించింది. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): సాకర్ లోకం కన్నీటి సంద్రమైంది. యావత్ అర్జెంటీనా విలపించింది. అభిమాన హీరో ఇక లేడనే వార్తని జీర్ణించుకోలేకపోయింది. గుండెపోటుతో బుధవారం మృతి చెందిన డీగో మారడోనాను కడసారి చూసిన కనులన్నీ నీళ్లతో నిండిపోయాయి. అంతిమ వీడ్కోలు పలికే చేతులు అచేతనమయ్యాయి. బరువెక్కిన హృదయాలు, బాధాతప్త మనసులు మౌనంగానే రోదిస్తే... నిలువెత్తు అభిమానం నింపుకున్న జనం బోరుమంది. ఆఖరిసారి దిగ్గజాన్ని చూసుకోవాలని పోటీపడిన అభిమానులతో పరిస్థితి కూడా మారిపోయింది. వెంటనే పరిస్థితి చేజారకుండా స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. అయిన ఆ లాఠీల దెబ్బలు, పోలీసు జాగిలాల దాడులు అభిమాన లోకాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోయాయి. గురువారం ఉదయమే సాధారణ జనానికి నివాళి అర్పించేందుకు అర్జెంటీనా అధ్యక్ష నివాసంలో ఏర్పాటు చేశారు. కానీ రాత్రి నుంచే ‘కరోనా కాలాన్ని’ లెక్కచేయని అభిమానులు వేలసంఖ్యలో వరుస కట్టారు. అనంతరం లాంఛనాలతో అతనికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. అభిమానం... ఆగ్రహం వేల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు, ప్రజలు తమ దేశానికి ప్రపంచకప్ అందించిన దిగ్గజాన్ని ఆఖరిసారిగా చూసేందుకు క్యూ కట్టేందుకు ఎగబడ్డారు. వీరిని నియంత్రించడం బాడీగార్డులు, భద్రతా సిబ్బంది తరం కాలేకపోయింది. అనుమతించడం లేదంటూ ఊగిపోయిన జనాలు ఒక్కసారిగా సహనం కోల్పోయారు. చేతిలో ఉన్న వాటర్ బాటిళ్లు, శ్రద్ధాంజలి ఘటించేందుకు తెచ్చిన పూల బొకేలతో పోలీసులపై విసిరికొట్టారు. దీంతో విషాదంతో బరువెక్కిన అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అది... ఇప్పుడు మారడోనా స్టేడియం ఇటలీలోని సాన్ పాలో స్టేడియం ఇకపై మారడోనా స్టేడియంగా మారుతోంది. నేపుల్స్ నగరం మేయర్ లూగి డి మాగిస్ట్రిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. నేపుల్స్లో ఉన్న ఈ మైదానంలో మారడోనా నేతృత్వంలోని నపోలి జట్టు ఇటాలియన్ ఫుట్‌బాల్ లీగ్ (సెరియా ‘ఎ’)లో రెండు సార్లు (1987, 1990) విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నపోలి క్లబ్ విజేతగా నిలువలేదు. అందుకే అతని సారథ్య విజయానికి ఈ స్టేడియాన్ని అంకితమిస్తున్నట్లు మేయర్ మాగిస్ట్రిస్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు. ఫుట్‌బాల్‌ను కట్ చేయను గ్రేటెస్ట్ సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఆట తనకెంత ప్రాణప్రదమో మైదానంలో చేతల్లో చూపినట్లే... వెలుపల చేష్టల్లోనూ చూపాడు. కేక్‌పై ఫుట్‌బాల్ లోగోను కోయనంటే కోయనని చెప్పాడు. ఈ విషయాన్ని భారత దిగ్గజ ఫుట్‌బాలర్ ఎం. విజయన్ తాజాగా వివరించారు. 2012లో భారత్‌కు విచ్చేసిన డీగో కోసం కన్నుర్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్టేడియం ఆకారంలో కేక్‌ను తయారు చేశారు. దానిపై ఫుట్‌బాల్ లోగోను తీర్చిదిద్దారు. మారడోనాను కట్ చేయమంటే తిరస్కరించాడు. తను ప్రేమించే సాకర్ బంతిని కోయనన్నాడు. ఫుట్‌బాల్ భాగాన్ని కాకుండా మిగత కేక్ కోసి ఆటపై తనకున్న మమకారాన్ని గుర్తుచేశాడని విజయన్ చెప్పారు. ‘నిస్సందేహంగా మారడోనా దేవుడు. దేవుడికి మరణం లేదు. సాకర్ ఆరాధించే గుండెల్లో అతను చిరస్థాయిగా ఉంటాడు’ అని విజయ్ నివాళులు అర్పించాడు. అర్జెంటీనా జెండా... జెర్సీ జననివాళికి ముందుగా మారడోనా పార్థివ దేహాన్ని కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో ఏకాంతంగా ఉంచారు. వారంతా కన్నీటి నివాళులు అర్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అతని శవపేటికపై జాతీయ పతాకాన్ని కప్పారు. దానిపైనే అతను బరిలోకి దిగిన 10 నంబర్ జెర్సీని ఉంచారు. అందరికంటే ముందుగా డీగో కుమార్తె తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించింది. తర్వాత కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా తమ తుది వీడ్కోలు పలికారు. ఆ తర్వాత 1986 ప్రపంచకప్ విజేత సభ్యులు, అర్జెంటీనా ఫుట్‌బాలర్లు, బోకా జూనియర్స్ ఆటగాళ్లు తమ ఆత్మీయ సూపర్ హీరోను కడసారి చూసుకున్నారు. -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
తొలి తరం నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. యస్–యస్–సక్సెస్ సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది. సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి. – దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు -
బహ్రెయిన్ రాజు ఖలీఫా కన్నుమూత
దుబాయ్: ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన 84 ఏళ్ళ బహ్రెయిన్ రాజు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం మరణించారు. గత కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్సపొందుతూ మరణిం చినట్లు బహ్రెయిన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఖలీఫా దేశ విదేశాల్లో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని షియాలు 2011లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమకారులను ఖలీఫా తీవ్రంగా అణచివేసి, తన పదవిని కాపాడుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఈయన అత్యంత సంపన్నవంతుడు. విదేశీ ప్రతినిధులను కలవడానికి, ప్రత్యేకంగా తన సొంత దీవిలో సమావేశాలు నిర్వహించేవారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్ల కు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో ఈయన జన్మించారు. -
నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘ఫరీబ్’ (1996), ‘మెహందీ’ (1998) తదితర చిత్రాల్లో హీరోగా నటించారాయన. బాలీవుడ్ నటుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫేమ్ యూసఫ్‌ఖాన్ కుమారుడు ఫరాజ్. సల్మాన్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘మైనే ప్యార్‌కియా’కి మొదటగా ఫరాజ్ఖాన్నే హీరోగా అనుకున్నారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు ఫరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఆ సినిమా చేసే అవకాశం సల్మాన్‌ఖాన్ దక్కించుకున్నారు. కాగా కొన్ని వారాల క్రితం పహ్ మాన్ ఖాన్ తన సోదరుడు ఫరాజ్ అనారోగ్యం గురించి చెబుతూ, ఆర్థిక సహాయం కూడా కోరారు. అప్పుడు సల్మాన్ ఖాన్ సహాయం చేశారు. -
ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత
‘ఖుషి’, ‘7/జి బందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’...చిత్రాలతో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన కోలా భాస్కర్ (55) బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. భాస్కర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ సతీమణి గీతాంజలి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’తో హీరోగా పరిచయమయ్యారు భాస్కర్ కుమారుడు కోలా బాలకృష్ణ. ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించారు. కాగా కోలా భాస్కర్ మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్‌సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా ఇక లేరు
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా. 1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను. ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, విష్ణువర్థ¯Œ వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
జశ్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్ సెప్టెంబర్ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్ సింగ్ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్ సింగ్ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ పేర్కొన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ 1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్‌గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
జానే వాలో జరా ముడ్ కే దేఖో ఇధర్
బాలూకి రఫీ దైవ స్వరూపుడు. గానదూత. మార్దవ మనోహరుడు. బాలు ఆయనకు ఏకలవ్య శిష్యుడు. పరమ భక్తుడు. బాలు సొంత రికార్డింగ్ థియేటర్ ‘కోదండపాణి’లో మూడు ఫొటోలు పెద్ద పెద్దవి ఉంటాయి. ఒకటి ఘంటసాలది. రెండోది సంగీత దర్శకుడు కోదండపాణిది. మూడోది రఫీది. 18 ఏళ్ల వయసుకే (1964) సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్న బాలు తండ్రి కోరిక మేరకు ఏ.ఎం.ఐ.ఇ చేరారు. రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లేటప్పుడు ఒక టీకొట్టు దగ్గర రఫీ పాటలు వినిపిస్తూ ఉండేవి. రోజూ రఫీ పాడిన ‘దీవానా హువా బాదల్’ వింటూ అక్కడే ఆగిపోయేవారు. అది పూర్తయ్యే సరికి కళ్ల నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. వారం రోజులపాటు ఇది చూసిన టీ కొట్టువాడు ‘ఎందుకయ్యా ఏడుస్తావు. అదంత హుషారు పాటైతే’ అని ఆశ్చర్యపోయాడు. ఏమో.. రఫీ గొంతులోని మార్దవం వింటే కళ్లు స్పందించడం మొదలెడతాయి. బాలూకు తొలి అవకాశం ఇప్పించడానికి ఎస్.పి. కోదండపాణి నటుడు పద్మనాభం దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ‘ఏదైనా పాడు నాయనా’ అని అడిగితే బాలూ పాడింది రఫీ పాడిన ‘జానే వాలో జరా ముడ్ కే దేఖో ఇధర్’ (దోస్తీ) పాటనే. నౌషాద్కు అమిత భక్తుడైన సంగీత దర్శకుడు వేణును అవకాశమివ్వమని బాలు వెళ్లినప్పుడు నౌషాద్ బాణీ కట్టిన ‘పాల్కీ’ సినిమాలోని ‘కల్ రాత్ జిందగీసే ములాకాత్ హోగయి’ పల్లవిని వినిపించి ‘అబ్బాయ్.. ఈ పల్లవిని యథాతథంగా పాడిన నాడు నీకు అవకాశం ఇస్తాను’ అన్నారు. దానికి బాలు ‘గురువుగారూ.. ఎన్నాళ్లయినా రఫీలాగా ఈ పల్లవిని పాడలేను’ అని వినయంగా ఒప్పుకున్నారు. రఫీ పాటలు ఇంట్లో ఎప్పుడైనా ప్లే అయితే బాలు సతీమణి సావిత్రి వెంటనే వాటిని ఆపేస్తారు. ఎందుకంటే భావోద్వేగానికి లోనైన బాలు బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేస్తారు. అంతగా ఆరాధించే రఫీని బాలు ఒక్కసారే చెన్నైలో చూశారు. ఆయన పాడటానికి వచ్చినప్పుడు కాళ్లకు నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఆయనతో మాట్లాడలేదన్న వెలితి బాలూకు ఎతేరే మేరే బీచ్ మే“ కైసా హై యే బంధన్ హిందీలో బాలు కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’ (1976)తోనే హిందీలో పెద్ద గుర్తింపు పొందారు. అయితే బాలూకు ఆ గుర్తింపు రావడానికి మరో ఐదేళ్లు పట్టింది. అది కూడా కె.బాలచందర్ వల్ల. ‘మరో చరిత్ర’ రీమేక్‌గా ‘ఏక్ దూజే కే లియే’ (1981) తీయాలనుకున్నప్పుడు సంగీతానికి లక్ష్మీకాంత్–ప్యారేలాల్ను పెట్టుకున్నారు. అయితే పాటలన్నీ బాలు పాడాలని షరతు పెట్టారు. ఇది లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లకు పెద్దగా ఇష్టం లేదు. ‘బాలు పాడితే దక్షిణాది యాస ఉంటుందేమో’ అని నొక్కులు చెప్పారు. ‘ఉంటే మరీ మంచిది. ఎందుకంటే నా సినిమాలో హీరో కథ ప్రకారం దక్షిణాదివాడు కదా’ అన్నారు బాలచందర్. ఇక నో చెప్పడానికి వారికి వీలు లేకపోయింది. కాని బాలూ దీనిని సవాలుగా తీసుకున్నారు. ఎందుకంటే తాను ఈ సినిమాలో పాడాల్సింది సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్తో. అందుకే ‘ఏక్ దూజే కే లియే’లోని అన్ని పాటలు అద్భుతంగా పాడి ఉత్తరాది వారితోపాటు తాను ఇదివరకే జయించిన దక్షిణాదివారిని కూడా అలరించారు. ఆ సినిమాలోని ‘తేరే మేరే బీచ్ మే’ పాటకు జాతీయ అవార్డు పొందారు. లతాతో పాడిన ‘హమ్ మిలే తుమ్ మిలే’ పాట కూడా హిట్. ఆ తర్వాత ఆర్.డి. బర్మన్ చేసిన ‘సాగర్’ (1985) పాటలు బాలూకు విశేషమైన పేరు తెచ్చి పెట్టాయి. అందులో కమల్‌హాసన్‌కు పాడిన ‘ఓ మారియా’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది. కాని బాలూకి హిందీలో ఘన పరంపర వేసిన సినిమా మాత్రం ‘మైనే ప్యార్ కియా’ (1989). సల్మాన్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ భిన్నమైన గొంతు కోసం సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్, దర్శకుడు సూరజ్ భరజ్యాతా బాలూను ఎంచుకున్నారు. బాలు గొంతు సల్మాన్‌కు సరిగ్గా సరిపోయింది. అందులోని ‘దిల్ దీవానా’, ‘కబూతర్ జా జా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’ పాటలన్నీ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత సల్మాన్ కోసమే పాడిన ‘పత్థర్ కే ఫూల్’ (1991) సినిమాలోని ‘కభీ తూ ఛలియా లగ్తా హై’, ‘తుమ్ సే జొ దేఖ్తేహీ ప్యార్హువా’ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ‘సాజన్’ (1991) నదీమ్–శ్రావణ్ సంగీతంలో పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలు పాడిన ‘జియేతో జియే కైసే’, ‘తుమ్సేమిల్నేకి తమన్నా హై’, ‘దేఖాహై పెహెలీ బార్’ పాటలు దేశమంతా మోగిపోయాయి. ‘లవ్’ సినిమాలో ‘సాథియా తూనే క్యా కియా’ కూడా పెద్ద హిట్. ఆ తర్వాత ‘హమ్ ఆప్ కే హై కౌన్’ (1994)తో బాలు సినీ గానంలో తనకు సమ ఉజ్జీ లేరన్నంతగా ఆ పాటలను హిట్ చేశారు. ఆ సినిమాలోని ‘దీదీ తేరా దేవర్ దివానా’, ‘పహెలా పహెలా ప్యార్ హై’ పాటలు ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రియ గీతాలుగా నిలిచాయి. హిందీలో బాలు దాదాపు 350 పాటలు పాడి ఉండొచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జితేంద్ర, సంజయ్ ద™Œ లాంటి హీరోలు బాలు పాటకు అభినయించారు. ‘ప్రేమ’ హిందీ రీమేక్ ‘లవ్’లో తన పాత్ర సుప్రసిద్ధ విలన్ అంజాద్ ఖాన్ చేస్తే ఆయనకు బాలు ప్లేబ్యాక్ పాడారు. షారూక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో బాలు పాడిన టైటిల్ సాంగ్ ఇటీవలి సూపర్ హిట్.ప్పుడూ ఉండేది. -
చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మా
గాయకులుగా ఉంటూ సంగీత దర్శకత్వం చేసిన వారిలో చిత్తూరు నాగయ్య, ఘంటసాల, భానుమతి రామకృష్ణ తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వస్తారు. నెల్లూరులో పాట కచ్చేరీలు ఇచ్చే నాటి నుంచే సొంతగా పాట రాసి ట్యూన్ కట్టే ప్రయత్నం చేసిన బాలు సినిమా గాయకుడిగా బిజీ అయ్యాక సంగీత దర్శకుడిగా పాటలు చేయాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. కాని ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడైన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ‘కన్య–కుమారి’ (1977) సినిమాకు తొలి అవకాశం ఇచ్చారు. వేటూరి రాసిన ‘ఇది తొలి పాట’ బాలు స్వరపరిచిన తొలి పాట. ఈ పాటను ఆ తర్వాత ఆయన తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. అయితే గాయకుడిగా చాలా బిజీగా ఉంటున్న బాలూను సినిమా సంగీతం కోసం అడగడం నిర్మాత దర్శకులకు కొంత సంశయం అనే చెప్పాలి. ఎందుకంటే దానికి వారు అడిగినంత సమయం బాలు ఇవ్వలేకపోవచ్చు అనే సందేహం ఉండేదేమో. అయినప్పటికీ తెలుగులో బాలు 31 సినిమాలకు సంగీతం వహించారు. తమిళంలో 5, కన్నడంలో 9 సినిమాలు ఆయన స్వర పర్యవేక్షణలో వచ్చాయి. బాపుతో కలిసి దర్శకుడు బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాకు బాలు చేత పాటలు చేయించుకున్నారు. ఇవి మంచి అభిరుచి ఉన్న పాటలుగా నిలిచాయి. జాలాది రాసిన ‘సందె పొద్దు అందాలున్న చిన్నది’, ఆరుద్ర రాసిన ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలుకమ్మ’ పాటలు నేటికీ నిలిచి ఉన్నాయి. చుట్టూ చెంగావి చీర పాటకు మెహదీ హసన్ ‘రఫ్తా రఫ్తా’ ప్రేరణ. ఆ తర్వాత బాపూతో బాలు ‘సీతమ్మ పెళ్లి’, ‘జాకీ’ సినిమాలు చేశారు. ‘సీతమ్మ పెళ్లి’ తమిళంలో సూపర్‌హిట్ చిత్రానికి రీమేక్. అయినప్పటికీ ఆ పాటల ఛాయలు లేకుండా ఒరిజినల్ పాటలు చేశారు బాలు. అందులోని ‘చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే’ పాట ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇక ‘జాకీ’లో పాటలన్నీ హిట్టే. శోభన్‌బాబు, సుహాసిని నటించిన ఈ సినిమాలో బాలు, జానకి పోటీలు పడి పాడారు. ‘శశివదన మొరను వినలేవా’, ‘అలా మండి పడకే జాబిలీ’, ‘నిదుర లెమ్ము నిమ్మకాయ’ అలరించాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమాను బాపు హిందీలో ‘హమ్ పాంచ్’ పేరుతో రీమేక్ చేస్తే బాలు దానికి రీ రికార్డింగ్ చేశారు. జంధ్యాలతో జంధ్యాలతో బాలూ చేసిన ‘పడమటి సంధ్యారాగం’ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాకు పేరు బాలూయే పెట్టారు. అందులో ‘లైఫ్ ఈజ్ షాబీ’ పాటను రాసి పాడారు కూడా. ఇందుకోసం అమెరికాలో పాటను రికార్డు చేసి, అలా రికార్డు చేసిన తెలుగు సినిమా రికార్డును సొంతం చేసుకున్నారు. పడమటి సంధ్యారాగంలోని ‘ఈ తూరుపు ఆ పశ్చిమం’ పాట బాలు చేసిన చాలామంచి పాటల్లో ఒకటి. అలాగే ‘పిబరే రామరసం’ పాట ఎంతో స్పందనాయుతంగా ఉంటుంది. జంధ్యాలతో ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ సినిమాలు చేశారు బాలు. అవార్డు తెచ్చిన సినిమా బాలూకు అవార్డులు, రివార్డులు తెచ్చి పెట్టిన సినిమాగా ‘మయూరి’ని చెప్పవచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలు సంగీత ప్రతిభకు ఒక తార్కాణంగా నిలిచింది. ఇందులో ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’ పాటలు హిట్‌గా నిలిచాయి. ఈ సినిమా బాలూకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు తెచ్చి పెట్టింది. సింగీతం దర్శకత్వంలోనే ‘ఊరంతా సంక్రాంతి’ సినిమాకు పాటలు చేశారు బాలు. ప్రతి సంక్రాంతికి వినిపించే ‘సంబరాల సంకురాత్రి’ పాట ఈ సినిమాలోదే. శోభన్‌బాబు ‘కొంగుముడి’, బాలకృష్ణ ‘రాము’, నాగార్జున ‘జైత్రయాత్ర’ సినిమాలకు బాలూ సంగీతం అందించారు. జైత్రయాత్రలోని ‘ఎన్నాళ్లమ్మా ఎన్నేళ్లమ్మా’ పాట హిట్‌గా నిలిచింది. దర్శకుడు వంశీతో ‘లాయర్ సుహాసిని’ చేశారు బాలు. ఇందులోని పాటలన్నీ మెలొడీతో ఉంటాయి. ‘తొలిసారి పూసే మురిపాల తీవ’, ‘ఏమైంది ఇల్లాలుగారు’, ‘మహరాజా మర్యాద’ చాలా బాగుంటాయి. ఇక చిన్న సినిమా ‘కళ్లు’కు పెద్ద సంగీతం అందించారు బాలు. ఇందులో ‘తెల్లారింది లెగండోయ్’ పాటను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. బాలు పాటల్లోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా ఒక మార్క్ ఉండేలా చూసుకున్నారు. ఆయన పాటల్లో ‘కలకాలం ఇదే పాడనీ’ (ఏజంట్ గోపీ), ‘చెలి సఖీ మనోహరి’ (బంగారు చిలక), ‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’ (మగధీరుడు), ‘తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ’ (చిన్నోడు పెద్దోడు) గుర్తుకు వస్తాయి. ‘నా షరతులతో పాటలు చేయడానికి అంగీకరించిన వారికే పాటలు చేస్తాను’ అని చెప్పిన బాలు 1990ల తర్వాత సంగీత దర్శకత్వానికి దూరంగానే ఉండిపోయారు. బాలు – జానకి నిరంతరమూ వసంతములే బాలు నెల్లూరు బిడ్డ అయితే ఎస్. జానకి నెల్లూరు కోడలు. ఇద్దరూ పోటీ పడి పాడిన పాటలు తెలుగువారికి కండశర్కరలుగా మారాయి. ముఖ్యంగా ఇళయరాజా తెలుగులో చేసిన పాటలు చాలా వాటికి వీరిద్దరే గొంతునిచ్చారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ‘మాటే మంత్రము’ (సీతాకోక చిలుక), ‘ఏమని నే చెలి పాడుదును’ (మంత్రిగారి వియ్యంకుడు), ‘నిరంతరము వసంతములే’ (ప్రేమించు–పెళ్లాడు), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘మౌనమేలనోయి’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’ (స్వాతిముత్యం), ‘ఎదలో తొలి వలపే’ (ఎర్ర గులాబీలు), ‘సన్నజాజి పడక మంచె కాడ పడక’ (క్షత్రియపుత్రుడు), ‘మధుర మురళి హృదయ రవళి’ (ఒక రాధ–ఇద్దరు కృష్ణులు)... ఇవన్నీ కమనీయ పాటలు. ఇక ఇతర సంగీత దర్శకుల కోసం కూడా వీరు ఎన్నో మనోహరమైన పాటలు పాడారు. ‘వీణ వేణువైన సరిగమ’ (ఇంటింటి రామాయణం), ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ‘నీ చేతులలో తలదాల్చి’ (కార్తీక దీపం), ‘అలివేణి ఆణిముత్యమా’ (ముద్దముందారం), ‘కాస్తందుకో దరఖాస్తందుకో’ (రెండు రెళ్లు ఆరు)... ఈ పాటలు వింటుంటే కాలం తెలుస్తుందా? జానకి దగ్గర బాలూకు కొంచెం చనువు ఉండేది. ‘ఆమె ఒక చేతిలో కర్చిఫ్ పట్టుకుని పాడేవారు. అది ఆమె అలవాటు. తీరా రికార్డింగ్ సమయానికి ఆ కర్చిఫ్ దాచేసేవాణ్ణి. ఆమె నన్ను కోప్పడేవారు’ అని సరదాగా చెప్పుకున్నారు బాలు. పాట నుంచి విరమించుకుని విశ్రాంత జీవితం గడుపుతున్న జానకి ఈ వార్త విని ఎలా స్పందిస్తారో. అసలు తట్టుకోగలరో లేదో. -
మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు
‘నన్ను పెట్టి సినిమా తీస్తే హిట్ అవ్వొచ్చు.. ఫ్లాప్ అవ్వొచ్చు... ఆలోచించుకో వసంత్’ అన్నారు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. వసంత్ అంటే దర్శకుడు కె.బాలచందర్ అసిస్టెంట్. ‘కేలడి కన్మణి’ (1990) అనే సినిమా కథ రాసుకుని అందులో బాలు లీడ్ రోల్ చేస్తే బాగుంటుందనుకున్నారు. ‘ఫెయిల్ అయితే నాకేం కాదు. నీకిది ఫస్ట్ సినిమా’ అని హెచ్చరించారు బాలు. కానీ వసంత్ వినలేదు. బాలూతోనే తీశారు. ‘కేలడి కన్మణి’ సూపర్ హిట్ అయ్యింది. 285 రోజులు ఆడింది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాలు ఈ సినిమా కోసం ఊపిరి బిగపట్టినట్టు పాడిన (అది కంప్యూటర్ మిక్సింగ్) ‘మాటే రాని చిన్నదాని..’ పాట ఓ సంచలనం. ఈ సినిమా తెలుగులో ‘ఓ పాపా లాలి’ పేరుతో విడుదలై, ఇక్కడా మంచి విజయాన్ని అందుకుంది. నటుడిగా బాలు సామర్థ్యాన్ని చూపిన సినిమా అది. బాలూకి నటన తెలుసు. కాలేజీ రోజుల్లో ఆయన నాటకాలు వేశారు. సినిమాల్లో సరదాగా ఎప్పుడైనా కనిపించవచ్చని భావించారు. కాని హిందీలో హిట్ అయిన ‘పడోసన్’ సినిమా తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’గా తీస్తున్నప్పుడు హిందీలో గాయకుడు కిశోర్ కుమార్ చేసిన పాత్రను తెలుగులో బాలు చేశారు. ఆ సినిమాలో ‘చిలుకా పలుకవే’ పాట పాడుతూ కనిపిస్తారు. బాలు చాలా సినిమాల్లో ‘బాలు’ హోదాలో కనిపించారు. కొన్ని సినిమాల్లో పాత్రలుగా మారారు. వెంకటేష్ హిట్ చిత్రం ‘ప్రేమ’లో బాలుది చాలా సరదా పాత్ర. వెంకటేష్‌కు ధైర్యం చెప్పే పాత్ర అది. ‘వివాహ భోజనంబు’ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా రాజేంద్రప్రసాద్‌తో ఆయన నవ్వులు పూయిస్తారు. కాని తెలుగులో దాసరి నారాయణరావు, బాలు ముఖ్యపాత్రలుగా ‘పర్వతాలు పానకాలు’ (1992) తీసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరు భిన్నరంగాల ఉద్దండులు నటులుగా చేసిన సినిమా ఇది. బాలు నటనను మణిరత్నం భిన్న కోణంలో ఉపయోగించుకున్నారు. ‘దొంగ దొంగ’ (1993) సినిమాలో క్యాజువల్‌గా, పైకి జోక్ చేస్తూ లోన సీరియస్‌గా పని చేసే íసీబీఐ ఆఫీసర్‌గా బాలు కనిపిస్తారు. తుపాకులు, నల్లకళ్లద్దాలు ఉండే íసీబీఐ ఆఫీసర్లు తెలిసిన మనకు మామూలు చొక్కా ప్యాంట్లో ఉండే అలాంటి ఆఫీసర్‌ను చూడటం కొత్త. డైరెక్టర్ శంకర్ బాలూకి ‘కాదలన్’ (1994)లో ప్రభుదేవా తండ్రి పాత్ర ఇచ్చారు. అందులో ప్రభుదేవాతో కలిసి ‘అందమైన ప్రేమరాణి’ పాటకు డాన్స్ చేశారు బాలు. అదే సంవత్సరం భక్తి చిత్రం ‘దేవుళ్లు’లో వినాయకుడి పాత్ర చేశారు బాలు. ‘ఉల్లాసమ్’ (1997) అనే తమిళ సినిమాలో కొడుకు జీవితం ఏమైపోతుందోననే బాధతో నిద్రలేని రాత్రులు గడిపే తండ్రి పాత్ర బాగా పండించారు బాలు. అయితే ‘పవిత్రబంధం’ (1996), ‘ఆరోప్రాణం’ (1997) చిత్రాలు బాలూని మంచి తండ్రి పాత్రల్లో చూపించాయి. ‘పవిత్ర బంధం’లో వెంకటేష్ తండ్రిగా బాలు చేసిన పాత్ర ఎంత హిట్ అంటే ఆ సినిమాల తమిళ, కన్నడ రీమేకుల్లో బాలూయే నటించారు. ‘ఆరో ప్రాణం’లో వినీత్ తండ్రిగా నటించారు బాలు. ఇక 1996లో విడుదలైన చిత్రాల్లో ‘కాదల్ దేశం’ (ప్రేమ దేశం) సెన్సేషనల్ హిట్. ఇందులో టబు తండ్రిగా నటించారు బాలు. ఓ త్రీడీ సినిమాలోనూ నటించారు బాలు. అది తమిళ చిత్రం ‘మ్యాజిక్ మ్యాజిక్ త్రీడీ’ (2003). ఇందులో ఆయన ఇంద్రజాలికుడిగా చేశారు. బాలు లీడ్ రోల్లో నటించిన చిత్రాల్లో ‘దేవస్థానం’ (2012) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కళాతపస్వి కె. విశ్వనాథ్, బాలు ముఖ్య తారలుగా జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పురాణాలు తెలిసిన విశ్వనాథ్ దేవాలయాల్లో భక్తులు అడిగే సందేహాలను నివృత్తి చేస్తుంటాడు. తన తర్వాత ఆ స్థానానికి బాలు కరెక్ట్ అనుకుంటాడు. ఆ పని చేయడానికి ముందు నిరాకరించి, తర్వాత విశ్వనాథ్ బాటలో వెళతాడు బాలు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను కదిలించి వేసింది. అలాగే అదే ఏడాది బాలు చేసిన చిత్రం ‘మిథునం’ (2012). తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలు–లక్ష్మి జీవించారనే చెప్పాలి. ఆ తర్వాత బాలు–లక్ష్మీ ‘మూనే మూను వార్తయ్’ (మూడు ముక్కల్లో చెప్పాలి) అనే తమిళ సినిమాలోనూ నటించారు. ఈ చిత్రానికి బాలు తనయుడు, గాయకుడు చరణ్ నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బాలు దాదాపు 75 చిత్రాల్లో నటించారు. నటుడిగా తనదైన మార్క్‌ని చూపించారు. కన్నడంలో ‘బాలోందు చదురంగ’, ‘తిరుగుబాణ’, ‘ముద్దిన మావ’, ‘మాంగల్యం తంతునానేన’ తదితర చిత్రాల్లో నటించారు. హిందీలో నేరుగా చిత్రాలు చేయకపోయినా ప్రేమదేశం, రాక్షసుడు వంటివి హిందీలో అనువాదం కావడంతో ఆ చిత్రాల ద్వారా హిందీ తెరపై కనిపించారు. -
మేడంటే మేడా కాదు
గురువును ఎవరైనా ఒకసారి రెండుసార్లు తలుచుకుంటారు. కాని బాలసుబ్రహ్మణ్యం మాత్రం తన గురువు ఎస్.పి. కోదండపాణిని జీవితాంతం గుర్తు చేసుకుంటూనే వచ్చారు. మద్రాసులో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన పాటల పోటీకి నాటి మహామహులు ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి జడ్జీలుగా వచ్చారు. బాలు పాడిన పాటకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కాని పోటీ అయిపోయాక ఒక వ్యక్తి తనను పరిచయం చేసుకుని తాను సంగీత దర్శకుడు కోదండపాణి అని చెప్పారు. ‘నీ గొంతు బాగుంది. నువ్వు డిసిప్లిన్‌తో ఉంటే నలభై ఏళ్లు ఇండస్ట్రీలో పాడతావు’ అని ఆశీర్వదించారు. ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కాని ఆ మాటే నిజమైంది. కోదండపాణి బాలూను మెచ్చుకొని ఊరుకోలేదు. తన వెంట ఉంచుకున్నారు. పాటల మెలకువలు నేర్పారు. చాలామంది సంగీత దర్శకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. తొలి పాటకు అవకాశం ఇచ్చారు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన ‘మేడంటే మేడా కాదు’ పాట బాలూకు మంచి గుర్తింపు తెచ్చింది. అందుకే ఎస్.పి.కోదండపాణి పేరు తన రికార్డింగ్ థియేటర్‌కు పెట్టుకున్నారు బాలు. అంతేకాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా ఎస్.పి.కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్‌గా ఉంచారు. ‘నా విజయాన్ని మా గురువుగారు చూసి ఉంటే బాగుండేది’ అని చెప్పుకునేవారాయన. -
రైల్వే సహాయమంత్రి సురేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి (65) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. సురేశ్ కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. తిరుగులేని నేత: 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బెళగావిలోని ఎస్ఎస్ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. సురేశ్ అంగడి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సురేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఏపీ గవర్నర్ సంతాపం: సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతాపం: రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం నుంచి కిసాన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్‌తోపాటు పాల్గొన్న సందర్భాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
నవరసాల నటి సీతాదేవి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి, దివంగత విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మించారు సీతాదేవి. సమీప బంధువు నీలాబాయి భర్త రాజా శాండో ఫిల్మ్ మేకర్ కావడంతో సీతని కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యం నుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారామె. 1947లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు సీత. కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు’ తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు చేశారామె. కేవలం హాస్యమే కాకుండా తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారామె. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి ‘రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి’ లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ‘లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాత వ్రతం, దేవదాసు, మాయాబజార్’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటారు సీత. ‘ఋతురాగాలు’ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘రక్తకన్నీరు’ నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు సీత. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. హిందీలో రూపొందించిన ‘అల్బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ సీత చేసిన నటన అందర్నీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. నాగభూషణం, సీతాదేవి దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక తనకు వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవారు ఆమె. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమందితో పాటు బంధువుల కష్టాలను విని గుప్తదానాలు ఎన్నో చేశారు సీత. రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతకు ‘యువ కళావాహిని’ సంస్థ వారు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ‘మాయాబజార్’ చిత్రంలో సావిత్రితో... నా తొలినాళ్ల గురువు సీతాదేవి నేను అప్పుడప్పుడే డ్యా¯Œ ్స నేర్చుకుంటున్నాను. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను, నన్ను నాగభూషణంగారి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే సీతగారు నన్ను తొలిసారి చూశారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించారు. అలాగే ‘ఎక్కువకాలం మా గ్రూపులో ఉండవు.. పెద్ద హీరోయి¯Œ అయిపోతావు’ అని చెప్పారామె. నా కెరీర్ తొలినాళ్లలో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె. – వాణిశ్రీ, నటి -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్(80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ తెలిపింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని పేర్కొంది. తెలుగువారే.. అగ్నివేశ్ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అగ్నివేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిక్కోలు నివాళి శ్రీకాకుళం, సోంపేట: శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన అగ్నివేశ్ తన ప్రస్థానాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఆయన కన్నుమూతతో సిక్కోలు నివాళి అర్పించింది. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అగ్నివేశ్ సోంపేట, బీల ప్రాంత పరిసర గ్రామాల ప్రజలతో మాట్లాడారు. -
లవకుశ నాగరాజు ఇక లేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రాల్లో ‘లవకుశ’ ఒకటి. ఈ చిత్రంలో లవుడి పాత్రలో అలరించిన అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీ దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రానికి సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో లవుడి పాత్రలో నాగరాజు, కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు దాటినా ఇప్పటకీ వారు లవ, కుశలుగానే గుర్తింపు పొందారు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండూ కలగలిపిన లవుడి పాత్రలో నాగరాజు చక్కగా నటించారు. నాగరాజు తండ్రి ఏవీ సుబ్బారావు సినీ నటుడు. అలా నాగరాజు కూడా నటుడిగా రంగప్రవేశం చేశారు. చిన్నప్పుడే నాగరాజుకి నాటకాలంటే ఇష్టం. సుబ్రహ్మణ్యం, నాగరాజు కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు నాగరాజు. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు నాగరాజు. ‘సీతారామ కల్యాణం’లో లక్ష్మణుడిగా, ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో పద్మావతి దేవి తమ్ముడిగా.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలు మానుకున్నాక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో నాగరాజు పూజారిగా చేయడం మొదలుపెట్టారు. ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
కేశవానంద భారతి కన్నుమూత
కాసరగఢ్ (కేరళ): రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుముశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేశవానంద భారతి మృతి సమాచారం తెలుసుకుని భారీగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు ఎదనీరు మఠంలో ఆయన మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. ‘ఎదనీరు మఠాధిపతి కేశవానంద భారతి తత్వవేత్త. శాస్త్రీయ సంగీతకారుడు. యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం వెలువరించారు. ‘సమాజ సేవలో పూజ్య కేశవానంద భారతి చేసిన సేవలు స్మరణీయం. పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన గొప్ప కృషి చేశారు’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మైలురాయి... ఆ తీర్పు కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం. ఆ తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. ‘రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. అందుకే ఈ కేసుకు అంత ప్రాముఖ్యత నెలకొంది’అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు పేర్కొన్నారు. భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక. -
ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్‌షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్‌దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్‌కోహ్లీ -
సొంత ఊరిపై మమకారం
కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్‌దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్‌ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్‌కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్‌ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్‌కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్‌గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్‌తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్‌ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్‌సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్‌ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్‌కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ మృతి
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్‌తో బా«దపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చద్విక్ వయసు కేవలం 43 సంవత్సరాలే. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన. 2003లో నటుడిగా చద్విక్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 2013లో వచ్చిన ‘42’లో ఆయన చేసిన జాకీ రాబిన్సన్ పాత్ర పెద్ద బ్రేక్. ఆ తర్వాత ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. చద్విక్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
నిర్మాత కమలాకర్ రెడ్డి మృతి
నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో కమలాకర్ కూడా ఒకరు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారినపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తుండగా నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాకు కమలాకర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అర్జు¯Œ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ చిత్రాలతో పాటు పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన పంపిణీ చేశారు. కమలాకర్ రెడ్డి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంబులె¯Œ్స డ్రైవర్ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. -
దర్శకుడు నిషికాంత్ ఇకలేరు
‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ ఇకలేరు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) జులై 31 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం 4.24 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ కాలేయ వ్యాధి తిరగబెట్టడంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాని అజయ్ దేవ్గన్, టబులతో బాలీవుడ్లో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్ చేసి హిట్ అందుకున్నారు నిషికాంత్ కామత్. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన ఆయన హిందీలో ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, రాకీ హ్యాండ్సమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ, ‘డాడీ, జూలీ 2’ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడిగా నిషికాంత్ చివరి చిత్రం ‘మదారీ’ (2016). ఈ హిందీ చిత్రం తర్వాత అటు మరాఠీ ఇటు హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించారాయన. నిషికాంత్ మృతికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘నిషికాంత్, నా స్నేహాన్ని కేవలం ‘దృశ్యం’ సినిమాతోనే పోల్చి చూడలేం. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారాయన. చాలా తెలివైనవాడు.. సరదాగా ఉంటాడు. ఈ లోకాన్ని చాలా త్వరగా వదిలి వెళ్లిపోయాడు’’ అని అజయ్ దేవ్గన్ పేర్కొన్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుణ్ణి కోల్పోయా’’ అని రితేశ్ దేశ్‌ముఖ్, ‘‘నువ్వు నా జీవితానికి కోచ్ లాంటివాడివి. నా ఆప్తమిత్రుడివి. నిన్ను మిస్ అవుతున్నాను డియర్ నిషి’’ అన్నారు జెనీలియా. -
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్యంతో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో డీఐజీగా పని చేసిన శేషయ్య పదవీ విరమణ అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. శేషయ్యకు నలుగురు సంతానం. వారిలో సినీదర్శకుడు శేఖర్ కమ్ముల చివరివాడు. శేషయ్య అంత్యక్రియలు హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో శనివారం సాయంత్రం జరిగాయి. -
హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ (76) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ‘బగ్స్ మాలోనే, మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ఎవిత, ఫేమ్, ద కమిట్మెంట్స్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అలెన్. ఆయన 14 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో సుమారు 19 బాఫ్తా అవార్డులు, పది గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, 6 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఉన్నాయి. అలెన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
నిర్మాత సత్యనారాయణ ఇకలేరు
సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ద్వారా సత్యనారాయణ నిర్మాతగా మారారు. ‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని, దొరగారింట్లో దొంగోడు’ వంటి సినిమాలు నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఆయన పలు సినిమాలు నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకుపైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సత్యనారాయణ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
హాలీవుడ్ నటి ఒలివియా కన్నుమూత
హాలీవుడ్ సీనియర్ నటి, 1960ల సూపర్ స్టార్, రెండు సార్లు ఆస్కార్ గెలిచిన ఒలివియా కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఒలివియా వయసు 104. ఐదు దశాబ్దాల పాటు హాలీవుడ్ లో నటిగా కొనసాగారామె. సుమారు 49 సినిమాల్లో నటించారు. ‘టుఈచ్ హిజ్ ఓన్’ (1947), ‘ది హెయిరెస్’ (1950) సినిమాలకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారామె. ‘కెప్టెన్ బ్లడ్, ది అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్ హుడ్, స్నేక్ పిట్’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారు ఒలీవియా. హాలీవుడ్ గోల్డెన్ పీరియడ్ లో ఒలివియా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒలివియా మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
దర్శకుడు రజత్ ముఖర్జీ కన్నుమూత
ప్రముఖ హిందీ దర్శకుడు రజత్ ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘ప్యార్ తునే క్యా కియా, రోడ్, లవ్ ఇన్ నేపాల్’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటిలో ‘రోడ్’ సినిమా రజత్ ముఖర్జీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ‘రజత్ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అన్నారు నటుడు మనోజ్ భాజ్‌పాయ్. డైరెక్టర్ అనుభవ్ సిన్హా, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు రజత్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే రిషీకపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ తదితరులు అనారోగ్యంతో మృతి చెందగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
నటుడు రాజన్ సెహగల్ కన్నుమూత
ఈ ఏడాది బాలీవుడ్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్స్‌ను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం ఓ పెద్ద విషాదం. తాజాగా బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్ (36) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బుల్లితెరపై క్రైౖమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా, తుమ్ దేనా సాత్ మేరా వంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రాజన్ ఆ తర్వాత బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఐశ్వర్యా రాయ్, రణదీప్ హుడా నటించిన ‘సరబ్జిత్’ చిత్రంలో చేసిన రవీంద్ర పాత్ర రాజన్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ‘ఫోర్స్, కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. రాజన్ సెహగల్ మృతి పట్ల సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
దర్శక–నిర్మాత హరీశ్ షా కన్నుమూత
బాలీవుడ్ దర్శక–నిర్మాత హరీశ్ షా (76) ముంబైలో కన్నుమూశారు. పదేళ్లుగా హరీశ్ గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆయన సోదరుడు వినోద్ షా తెలిపారు. రాజేశ్ ఖన్నా హీరోగా ‘మేరే జీవన్ సాథీ’, ‘రామ్ తేరీ కిత్నే నామ్’ తదితర చిత్రాలను నిర్మించారు హరీశ్. నిర్మాతగా ఆయన చివరి చిత్రం ‘జాల్: ది ట్రాప్’ 2003లో విడుదలైంది. ఆ చిత్రంలో సన్నీ డియోల్, టబు, రీమాసేన్ నటించారు. అలాగే ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా హీరోలుగా ‘జల్జల’, రిషీ కపూర్, నీతూ సింగ్ జంటగా ‘ధన్ దౌలత్’తో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. హరీశ్ షా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
నిర్మాత పోకూరి రామారావు మృతి
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈతరం ఫిలింస్’ పతాకంపై ఎన్నో చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించిన పోకూరి రామారావు (65) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆçస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు ఆయన. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో రామారావు హస్పిటల్లో చేరారు. పది నెలల క్రితం ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగిందని తెలిసింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ తదితర చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. రామారావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
దర్శకుడు సచీ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) కన్నుమూశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో సచీకి గుండెపోటు వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేశారు బంధువులు. కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై సచీకి చికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో వచ్చిన మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. సచీ ఒక్కరే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ (దర్శకత్వం కూడా), ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (దర్శకత్వం కూడా) చిత్రాలకు కథ అందించారు. ‘అనార్కలి’ (2015) చిత్రంతో సచీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత – నటుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి
ప్రఖ్యాత నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి మనవడు శరత్ రెడ్డి (52) శుక్రవారం ఉదయం చెన్నైలో కరోనా వైరస్‌తో కన్నుమూశారు. నాగిరెడ్డికి ఇద్దరు కొడుకుల్లో ఒకరు విశ్వనాథరెడ్డి. ఈయనకు ఇద్దరు కొడుకులు. వారిలో రెండో కొడుకు శరత్ రెడ్డికి కరోనా వైరస్ సోకడంతో ఇటీవల చెన్నైలోని విజయా హెల్త్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ‘చందమామ, విజయ, బొమ్మరిల్లు’ వంటి పత్రికల నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు శరత్ రెడ్డి. ఈయనకు ఒక కొడుకు ఉన్నారు. తను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. శరత్‌రెడ్డి మరణంతో బి.నాగిరెడ్డి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
నటుడు ఇయాన్ ఇకలేరు
ప్రముఖ ఇంగ్లీష్ నటుడు ఇయాన్ హోల్మ్ (88) మృతి చెందారు. ‘‘ఇయాన్ హోల్మ్గారు ఇక లేరని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు’’ అని హోల్మ్ మేనేజర్ పేర్కొన్నారు. ఇక ఇయాన్ సినిమాల విషయానికి వస్తే... ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ఏలియన్’, ‘కింగ్ లియర్’, ‘ది స్వీట్ హియర్ ఆఫ్టర్’, ‘డ్రీమ్ చైల్డ్’, ‘డ్యాన్స్ విత్ ఏ స్ట్రేంజర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు ఇయాన్. ‘ఛారియట్స్ ఆఫ్ ఫైర్’ చిత్రంలో ఇయాన్ నటన ఆయన్ను ఆస్కార్ అవార్డ్ (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీ)కు నామినేట్ చేసింది. ఇయాన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. -
మాజీ ఫుట్‌బాలర్ సఫీ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీఎంఎస్ సఫీ (47) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1993–2001 మధ్య కాలంలో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ సహా పలు టోర్నీల్లో సఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ వేదికగా 2001లో జాతీయ క్రీడల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఎస్బీఐ (సీసీపీసీ) హైదరాబాద్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సఫీ...ఇటీవలే ఆలిండియా ఇంటర్ బ్యాంక్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. సఫీ మృతి పట్ల తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సంతాపం ప్రకటించింది. -
‘వందేళ్ల’ వసంత్ కన్నుమూత
ముంబై: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నిలిచిన వసంత్ నైసద్రాయ్ రైజీ (100) అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందారు. 1938–1949 మధ్య కాలంలో ముంబై, బరోడా జట్ల తరఫున ఆయన 9 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 277 పరుగులు చేయగా, ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1920 జనవరి 26న జన్మించిన వసంత్.... మరణించే సమయానికి ప్రపంచంలోని అతి ఎక్కువ వయస్సు ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా హాజరయ్యారు. ఆట నుంచి తప్పుకొని చార్టెడ్ అకౌంటెంట్‌గా రాణించిన వసంత్ క్రికెట్‌తో మాత్రం తను అనుబంధాన్ని కొనసాగించారు. రంజిత్ సింగ్జీ, దులీప్ సింగ్జీ, సీకే నాయుడు, విక్టర్ ట్రంపర్‌ల బయోగ్రఫీలు ఆయన రచించారు. వసంత్ మృతి పట్ల బీసీసీఐతో పాటు సచిన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు భీమ్‌సింగ్ కణ్ణన్ శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కణ్ణన్ ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు భీమ్‌సింగ్ కుమారుడు. బి. కణ్ణన్‌గా అందరికీ తెలిసిన ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజాతో ఎక్కువ చిత్రాలకు పనిచేశారు. ఒక్క భారతీరాజాతోనే దాదాపు 40 సినిమాలు చేశారు కణ్ణన్. అందుకే తమిళనాడులో ‘భారతీరాజా విన్కన్గళ్’ (భారతీరాజా కళ్లు) గా ఆయన ప్రసిద్ధి. భారతీరాజాతో ఆయన చేసిన చివరి చిత్రం ‘బొమ్మలాట్టమ్’ (2008). తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేశారు కణ్ణన్. తెలుగులో ఆయన కెమెరామేన్‌గా పని చేసిన చిత్రాల్లో ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. కణ్ణన్‌కు భార్య కాంచన, కుమార్తెలు మధుమతి, జనని ఉన్నారు. ఫిల్మ్ మేకర్ బి. లెనిన్‌కి సోదరుడు కణ్ణన్. బి. కణ్ణన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కణ్ణన్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరుగుతాయి. -
సంగీత దర్శకుడు వాజిద్ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్–వాజిద్ (ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వాజిద్ చిన్నవాడు) లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఇక లేరు. 42 ఏళ్ల వాజిద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. అయితే కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో వాజిద్ ఇబ్బందిపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ (1998) చిత్రంతో సాజిద్–వాజిద్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి పని చేస్తూ వచ్చారు. ‘ప్యార్ కియాతో...’ తర్వాత మళ్లీ సల్మాన్ సినిమా ‘హలో బ్రదర్’కి సాజిద్–వాజిద్ సంగీతదర్శకులుగా చేశారు. అయితే ఈ చిత్రంలోని నాలుగు పాటలకు మాత్రమే స్వరాలందించారు. వాటిలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కీ ఘాటా..’ పాటలు ఉన్నాయి. సల్మాన్‌తో వాజిద్‌కి మంచి అనుబంధం ఉంది. సల్మాన్ నటించిన ‘తేరే నామ్’లోని ‘తూనే సాథ్ జో మేరా చోదా..’ పాట మంచి హిట్. అలాగే సల్మాన్ నటించిన ‘పార్టనర్’, ‘వాంటెడ్’, ‘వీర్’, ‘దబాంగ్’ తదితర చిత్రాలకు కూడా సాజిద్–వాజిద్ స్వరాలందించారు. ‘దబాంగ్’లోని ‘మున్నీ బద్నామ్ హుయి..’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. సల్మాన్ ‘దబాంగ్ 2’, ‘దబాంగ్ 3’ చిత్రాలకూ వీరే స్వరకర్తలు. ఇంకా ఈ సంగీత ద్వయం పని చేసిన ఇతర హీరోల చిత్రాల్లో ఇమ్రాన్ హష్మి ‘ది కిల్లర్’, అక్షయ్ కుమార్‡ ‘హౌస్‌ఫుల్ 2’, ‘రౌడీ రాథోడ్’, టైగర్ ష్రాఫ్ ‘హీరో పంతి’ వంటివి ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో సల్మాన్ రూపొందించిన ‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’ పాటలకు కూడా వాజిద్ సంగీతం అందించారు. ‘‘నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవు. ఎప్పటికీ గుర్తుండిపోతావ్ వాజిద్. నీ ప్రతిభను మిస్సవుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, వరుణ్‌ధావన్, ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా, సోనమ్ కపూర్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు వాజిద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. వాజిద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
అజిత్ జోగి కన్నుమూత
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్‌గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. కలెక్టర్‌గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. -
నటి వాణిశ్రీకి పుత్రశోకం
ప్రఖ్యాత నటీమణి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ్ కార్తీక్ (36) శుక్రవారం రాత్రి హఠాన్మరణం పొందారు. అభినయ వెంకటేశ్ కార్తీక్ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఆయన తండ్రి కరుణాకరన్‌తో పాటు చెంగల్పట్టు జిల్లాలోని తిరుకళికుండ్రం గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. కార్తీక్ భార్య, పిల్లలు చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న వాణిశ్రీ ఇంట్లో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా అభినయ వెంకటేశ్ కార్తీక్ తండ్రి వద్దే ఉండిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌లో గుండెపోటు కారణంగా నిద్రలోనే కార్తీక్ మృతి చెందినట్టు వాణిశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వాణిశ్రీ కుటుంబసభ్యులు ఖండించారు. అభినయ వెంకటేశ్ కార్తీక్ భౌతికకాయాన్ని శనివారం చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. వాణిశ్రీకి పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. కార్తీక్ మృతిపై చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. – సాక్షి, చెన్నై -
ఫ్రెడ్ విలియార్డ్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఫ్రెడ్ విలియార్డ్ ఇటీవల మరణించారు. 86 ఏళ్ల ఫ్రెడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ‘రాత్రి నిద్రలోనే మా నాన్నగారు ప్రశాంతంగా కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులోనూ ఆయన చాలా చలాకీగా ఉన్నారు. ఆయన్ని మేమంతా మిస్ అవుతాం’’ అని పేర్కొన్నారు హాప్ విలియార్డ్. ఫ్రెడ్ మంచి కామెడీ యాక్టర్ గా పేరు పొందారు. ‘ఎవ్రీబడీ లవ్స్ రేమండ్, మోడ్రన్ ఫ్యామిలీ’’ వంటి టీవీ షోల ద్వారా పాపులారిటీ పొందారు ఫ్రెడ్. ‘వాల్ – ఈ, యాంకర్ మేన్, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ బ్లాక్’’ వంటి సినిమాల్లో నటించారాయన. ఫ్రెడ్ మరణం పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. -
కరోనాతో ‘సుమో’ రెజ్లర్ మృతి
టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా జపాన్ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. భారీకాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న 28 ఏళ్ల షోబుషి... నెలరోజుల పాటు కరోనాతో పోరాడి బుధవారం కన్నుమూశాడు. టోక్యోలోని ‘టకడగవా సుమో స్టేబుల్’కు చెందిన షోబుషి వైరస్ దాడి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయడంతో మృత్యువాత పడ్డాడు. ఏప్రిల్ నాలుగు నుంచి జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలతో బాధపడిన షోబుషి... చివరి వరకు ఆ వ్యాధిని జయించడానికి తీవ్రంగా పోరాడాడని సుమో సంఘం చీఫ్ హక్కకు తెలిపాడు. జపాన్‌లో పెద్ద సంఖ్యలో సుమో రెజ్లర్లు, మాస్టర్లు కరోనా బారిన పడినట్లు ఆయన చెప్పాడు. ఈ కారణంతోనే ఈ నెల జరగాల్సిన ‘బాషో’ టోర్నీలను రద్దు చేసినట్లు పేర్కొన్నాడు. 2011లో ఫిక్సింగ్ ఉదంతం తర్వాత టోర్నీలు రద్దు కావడం ఇదే మొదటిసారని అన్నాడు. -
కోవిడ్‌తో ‘లోక్‌పాల్’ త్రిపాఠీ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. -
కుల్మీత్ కన్నుమూత
ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ శుక్రవారం ఉదయం గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ‘‘ఈ రోజు (శుక్రవారం) మా అందరికీ ఎంతో బలమైన కుల్మీత్గారిని మేం కోల్పోయాం. ఆయన లేని లోటు తీరనిది. సినిమాల పట్ల ఆయనకు ఉన్న తపన, అంకితభావం చాలా గొప్పవి. క్లిష్టమైన సమస్యను సైతం ఆయన ఓ ప్రత్యేక విధానంలో సులభంగా పరిష్కరించేవారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి కుల్మీత్గారు అందించిన సేవలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి’’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ఫర్హాన్ అక్తర్, హన్సల్ మెహ్తా వంటి బాలీవుడ్ ప్రముఖులు కుల్మీత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. -
నేను ఒంటరిని ఎలా అవుతా?
‘‘ఇర్ఫాన్ మరణాన్ని ప్రపంచం మొత్తం తమ సొంత మనిషిని కోల్పోయినట్టు భావిస్తుంటే, ఈ లేఖను కేవలం కుటుంబ సభ్యులు విడుదల చేసింది అని ఎలా పేర్కొనగలను? ప్రపంచం మొత్తం నాతో పాటే బాధలో ఉంటే నేను ఒంటరిని అని ఎలా అనుకోగలను?’’ అన్నారు ఇర్ఫాన్ భార్య సుతాపా. ఇర్ఫాన్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఓ లేఖను రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఈ విధంగా. ‘‘అందరూ మనం ఏదో కోల్పోయాం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆయన నేర్పిన ఎన్నో విషయాలను అనుసరించేందుకు, అనుసరించి సరైన మార్గంలో ప్రయాణించేందుకు మంచి అవకాశం. ఇర్ఫాన్ మీద నాకున్న ఒకే ఒక్క ఫిర్యాదు ఏంటంటే, ఇర్ఫాన్ జీవితం మొత్తం పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించారు. అదే నన్నూ పాడు చేసింది. దాంతో జీవితంలో సాధారణమైన వాటికి పరిమితం కావడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఆయన ప్రతి దాంట్లో ఒక రిథమ్ చూసేవారు. దానికి తగ్గట్టు నడుచుకోవడం నేను అలవాటు చేసుకున్నాను. ఏ ఆహ్వానం లేకుండా మా ఇంటికి వచ్చిన అతిథిలోనూ (క్యాన్సర్) ఒక రిథమ్ చూశారాయన. నేను డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులను స్క్రిప్ట్ లాగా భావించేదాన్ని. అందులోనూ ఆయన పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉండాలనుకునేదాన్ని. ఈ ప్రయాణంలో ఎంతోమంది వైద్యుల సహకారం మరువలేనిది. మా కుటుంబ ప్రయాణాన్ని పడవలో ఉన్నట్టు ఊహిస్తుంటా. మా పిల్లలు బబిల్, అయాన్ ముందు ఉండి నడిపిస్తున్నట్టు వెనక నుంచి ఇర్ఫాన్ అటు కాదు ఇటు అని వాళ్లను గైడ్ చేస్తునట్టు అనుకుంటా. కానీ జీవితం సినిమా కాదు, సినిమాలో ఉన్నట్టు జీవితంలో రీటేకులు ఉండవు కదా. నాన్న లేకుండానే మా పిల్లలు ఈ ప్రయాణాన్ని సాగిస్తారనుకుంటున్నాను. ‘అనూహ్యమైన సంఘటనలు జరిగినా వాటికి అనుగుణంగా మారుతూ నువ్వు నీ నమ్మకంతో ముందు వెళ్లాలి’ బబిల్. ‘నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకుండా, నువ్వు చెప్పినట్టు అది వినేలా చేసుకో’ అయాన్. ఆయనను మేము దాచిపెట్టిన చోటులో ఆయనకు నచ్చిన మొక్కను నాటుతుంటే కంట్లో నీళ్లు ఆగలేదు. అది చిగురిస్తుంది. ఆ సువాసన ఆయన్ను ప్రేమించిన అందరికీ వెదజల్లుతుంది అనుకుంటున్నాను’’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు సుతాపా. -
రిషీ కపూర్ మృతి పట్ల తారల నివాళి
రిషీ కపూర్ మరణ వార్త విని దక్షిణ, ఉత్తరాది తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్వీటర్ ద్వారా పలువురు ప్రముఖులు స్పందించారు. కొందరి ట్వీట్స్ ఈ విధంగా... ► నా ప్రియనేస్తం రిషీ కపూర్ మరణ వార్త నా హృదయాన్ని బద్దలయ్యేలా చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – రజనీకాంత్ ► నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. – కమల్‌హాసన్ ► లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్, హైలీ టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌లను మనం కోల్పోవడం బాధాకరం. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. – మోహన్‌బాబు ► గొప్ప నటుడు, నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – చిరంజీవి ► నటదిగ్గజాలు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మనకు దూరం కావడం చాలా బాధాకరం. ఇండియన్ సినిమాకు వీరు లేని లోటు తీరనిది. వారి చిత్రాల ద్వారా ఈ ఇద్దరూ మనకు ఎప్పటికీ గుర్తుంటారు. – బాలకృష్ణ ► గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను (ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్) కోల్పోవడం బాధాకరం. రిషీజీ మనందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయన్ను కలిసినప్పుడల్లా కొత్త విషయాలను నేర్చుకునేవాణ్ణి. రిషీగారి మరణం మా కుటుంబానికి కూడా తీరని లోటు. – వెంకటేష్ ► రిషీజీ... మా అందరి హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచే ఉంటారు. – నాగార్జున ► రిషీ కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. భారతీయ సినిమాకు తీరని లోటు. ఆప్తమిత్రుణ్ణి కోల్పోయాను. ఆయనతో మేం నిర్మించిన ‘చాందిని’ చిత్రం తాలూకు జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. రిషి మంచి మానవతావాది. – టి. సుబ్బరామిరెడ్డి ► రిషీ కపూర్‌గారి ఆకస్మిక మరణం నన్ను బాధించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. – పవన్ కల్యాణ్ ► రిషీ కపూర్‌గారి మరణవార్త నా హృదయాన్ని బద్దలు చేసింది. అద్భుతమైన ప్రతిభావంతులు, నిజమైన లెజెండ్. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకు తీరనిది. – మహేశ్‌బాబు ► నిన్న (బుధవారం) సుప్రీమ్లీ టాలెంటెడ్ ఇర్ఫాన్ ఖాన్‌గారిని కోల్పోయాం. ఈ రోజు (గురువారం) లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్‌గారు మనందరికీ దూరమయ్యారు. భారతీయ సినిమాకు తీరని లోటు. – ఎన్టీఆర్ ► రిషీ కపూర్‌గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇండియన్ సినిమాకు మరో గొప్ప నటుడు దూరమయ్యారు. – రామ్‌చరణ్ ► అతను వెళ్లిపోయాడు... రిషీ కపూర్ వెళ్లిపోయాడు... నేను కుప్పకూలిపోయాను. – అమితాబ్ బచ్చన్ ► చింటూ (రిషీ కపూర్) సార్ ఆత్మకు శాంతి కలగాలి. – సల్మాన్‌ఖాన్ ► ఒక గొప్ప నటుణ్ణి మనం కోల్పోయాం. మంచి మానవతావాది. కళామతల్లి ముద్దుబిడ్డ. మీ (రిషీ కపూర్) నటనతో మా జీవితాలకు వినోదాన్ని పంచినందుకు ధన్యవాదాలు. – ఆమిర్ ఖాన్ ► ఒక లెజెండ్. మంచి కో స్టార్. మా ఫ్యామిలీకి మంచి స్నేహితుడు. – అక్షయ్ కుమార్ ► మన వెండితెర కలలను నిజం చేసుకునే దారిలో మనం కలిసి ప్రయాణించాం. నువ్వు (రిషీ కపూర్) నా పెద్ద అన్నయ్యవి. నాకు ఓ భుజంలా సపోర్ట్ చేశావు. స్నేహితుడిలా నన్ను ముందుకు నడిపించావు. నాతో పాటు నా కుటుంబానికి కూడా నీ అపారమైన ప్రేమను పంచావు. నువ్వు లేని లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది. – అనిల్ కపూర్ ► నీతో (రిషీ కపూర్) కలిసి సమయాన్ని గడిపినందుకు సంతోషంగా ఉంది. నీ గురించి ఎప్పుడు ఆలోచించినా నా ముఖంపైకి చిరునవ్వు వస్తుంది. అంత ప్రేమ చూపించావు. – బోనీ కపూర్ ► ‘ఔరంగజేబ్’ (2013) సినిమాలో తొలిసారి చింటూ అంకుల్‌తో కలిసి నటించాను. ఆ సమయంలో కాస్త నెర్వస్‌గా అనిపించింది. మా నాన్నగారితో (బోనీకపూర్) ‘యాక్టర్‌గా అర్జున్ రాణిస్తాడు’ అని చింటూ అంకుల్ చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. – అర్జున్ కపూర్ ► రిíషీగారి మరణ వార్తను ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. మంచి నటుణ్ణి కోల్పోయాం. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. – మాధురీ దీక్షిత్ ► రిషిజీ అద్భుతమైన నటుడు. మీ (రిషీ కపూర్) చిత్రాల ద్వారా మిమ్మల్ని మేం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం. ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ వేదికగా ఆయనతో కలిసి నవ్విన జ్ఞాపకాలను మర్చిపోలేను. – కాజోల్ ► చింటూ అంకుల్ మరణ వార్త విని నా హృదయం ముక్కలైంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడే క్రమంలో మేం ఇద్దరం న్యూయార్క్‌లో కలుసుకున్నాం. మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడిన మాటలు నాతో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సోనాలీ బింద్రే ► చింటూ అంకల్ ఒక లెజెండ్. ఇకపై మీతో ఫుడ్, రెస్టారెంట్ల గురించి చర్చించుకోవడాన్ని మిస్ అవుతాను. – కరిష్మా కపూర్ ► నాకు తెలిసిన బెస్ట్ బాయ్స్ పప్పా (రణ్‌ధీర్‌కపూర్) అండ్ చింటూ అంకుల్ (రిషీ కపూర్). – కరీనా కపూర్ -
రిషీ కపూర్ అనే నేను
షో బిజ్ లో ఒకలాంటి డాబు ఉంటుంది. తప్పక కృత్రిమంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో మాటలకు షుగర్ కోటింగ్ వేసి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. రిషీ కపూర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేయడమే. నచ్చింది చెప్పేయడమే. తన బయోగ్రఫీలోనూ అదే పాటించారు. మనసుకు ఫిల్టర్ వేయకుండా మనసులో ఉన్నదంతా ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. 2017లో ఈ పుస్తకం విడుదలైంది. ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లమ్ ఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్’ పుస్తకంలో రిషి కపూర్ రాసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. నేను అదృష్టవంతుణ్ణి మా కుటుంబం కూడా ఆకాశం లానే. ఇంట్లో ఎంతో మంది స్టార్స్. నా జన్మ నక్షత్రం కూడా అద్భుతమైనది. నేను అదృష్టవంతుణ్ణి. పృథ్వీ రాజ్ కపూర్ కి మనవడిని అయినందుకు, రాజ్ కపూర్ లాంటి తండ్రికి కొడుకు అయినందుకు, నీతూ లాంటి భార్య ఉన్నందుకు, రిద్ధిమా, రణ్ బీర్ లాంటి పిల్లలు పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని. నేనెప్పుడూ అదృష్టవంతుడినే. నా బాల్యం నా బాల్యం అంతా సినిమాలతోను, సినిమాల చుట్టూను తిరిగింది. సినిమా కథలు వింటూనే పెరిగాను. కపూర్ ఫ్యామిలీ మొత్తంలో అతి చిన్న వయసులో కెమెరా ముందుకు వచ్చింది నేనే. నాన్నగారు నటించిన ‘శ్రీ 420’ సినిమాలోని ‘ప్యార్ హువా...’ పాటలో వచ్చే ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ణి నేను. మిగతా ఇద్దరు రణ్ ధీర్ కపూర్, రీతూ కపూర్. ఆ పాట మొత్తం వర్షంలో సాగుతుంటుంది. వర్షపు నీరు నా కంట్లో పడటంతో ఏడ్చేవాణ్ణి. ‘మీ నాన్న గారు చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా’ అని నాతో ఆ సన్నివేశం పూర్తి చేయించారు ఆ సినిమా హీరోయిన్ నర్గీస్ జీ. ఆదివారం మాత్రమే ఆ సినిమా చేశా నాన్నగారు ప్లాన్ చేసిన ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర నాతో చేయించాలనుకున్నారు. అయితే మా అమ్మ మాత్రం కొన్ని షరతులతో నన్ను సినిమాలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకున్నారు. అవేంటి అంటే.. నా చదువుకి ఇబ్బంది కలగకూడదు, స్కూల్లో నా అటెండెన్స్ తగ్గకూడదు. ‘షూటింగ్ మొత్తం ఆదివారం చేస్తా’ అన్నారు నాన్న. వాళ్ల సంభాషణ చాలా క్యాజువల్ గా సాగింది. కానీ నాకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్క్రిప్ట్ తీసుకొని నా రూమ్ లోకి వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నా. సూపర్ స్టార్ అయ్యాక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. కందిన చెంపతో ఏడ్చాను ‘మేరా నామ్ జోకర్’లో ఓ సన్నివేశంలో నా తల్లి పాత్ర చేసిన ఆమె నా చెంప చెళ్లుమనిపించాలి. ఆ సీన్ సరిగ్గా రావడానికి 9 టేకులయింది. దెబ్బకు నా చెంప ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను.. మా నాన్న తన పనిలో నిమగ్నమైపోయారు. అప్పుడు అర్థమయింది.. సెట్లోకి అడుగుపెట్టేంతవరకే ఆయన నా తండ్రి అని అడుగు పెట్టాక ఫిలిం మేకర్ అని. పాకెట్ మనీ ట్రిక్ రాజ్ కపూర్ పిల్లలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ముంబయి లోని ఓ పాపులర్ హోటల్ కి నాన్నగారు తరచూ వెళ్లే వారు. నేను ఆ హోటల్ కి వెళ్తే బిల్ ఆయన అకౌంట్ లో చెల్లించడం అలవాటు. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లినా బిల్ ఆయన ఖాతాయే. కానీ మా ఫ్రెండ్స్ మధ్య రూల్ ఏంటంటే.. ఎప్పుడూ బిల్ షేర్ చేసుకోవాలి. వాళ్ల వాటా డబ్బులు నేను తీసుకొని బిల్ మొత్తం నాన్న అకౌంట్ లో కట్టేసేవాడిని. ఫ్రెండ్స్ వాటా డబ్బులు పాకెట్ మనీలా నా జేబులో వేసుకునేవాణ్ణి. నీతూని నిందించాను 1980లో నీతు, నా పెళ్లి జరిగిన తర్వాత నా సినిమాలు ‘కర్జ్, జమానా కో దికానా హే’ దారుణంగా విఫలమయ్యాయి. పెళ్లి అవడంతో నా రొమాంటిక్ హీరో ట్యాగ్ పోయిందనుకున్నాను. దానికి కారణం నీతూనే అని తనని నిందించాను. డిప్రెషన్లోకి వెళ్లా. కెమెరాకు, పబ్లిక్‌కి మొహం చూపించే ధైర్యం లేకుండా పోయింది. అప్పుడు నీతు కడుపుతో ఉంది. నా డిప్రెషన్ ని ఎలా తట్టుకుందో అని ఆశ్చర్యంగా ఉంటుంది. నాతో ఇన్నాళ్లు కలసి ఉన్నందుకు నీతూకి అవార్డు ఇవ్వాలి అని మా అమ్మ, అక్క అంటుంటారు. అది నిజమే. నా తీరుని మార్చాలని తను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా చిరాకుని తట్టుకుంది. నా మూడ్ కి తగ్గట్టు తను ఉండేది. ఎంతో సహనం వహించింది. నేను, నీతు గొడవపడేవాళ్లం (అందులో చాలాసార్లు తప్పు నాదే అయ్యుంటుంది). కొన్నిసార్లు 6 నెలల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సమస్యలను కలిసే పరిష్కరించుకున్నాం. నాలో పురుషాహంకారి ఉన్నాడు పెళ్లికి ముందు మా ఇద్దరిలో ఒకరు సంపాదిస్తూ, మరొకరు పిల్లలను చూసుకోవాలనుకున్నాం. నీతు యాక్టింగ్ మానేస్తా అన్నప్పుడు మాట వరసకు కూడా నేను వద్దనలేదు. ‘తన భార్య పని చేయకూడదని నాలో ఉన్నపురుషాహంకారి అలా చేశాడేమో?’. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం (పుస్తకం రాస్తున్నసమయానికి) చాలా మారింది. అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నా అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయంతే. నా ‘బాబీ’ విడుదలైన సంవత్సరం (1973)లోనే అమితాబ్ బచ్చ¯Œ ‘జంజీర్’ కూడా విడుదలైంది. ‘బాబీ’ సినిమాకి నాకు బెస్ట్ అవార్డు వచ్చినందుకు అమితాబ్ బాధపడతాడని అనుకున్నాను. ఎందుకంటే ‘జంజీర్’ కోసం తనకి అవార్డు రావాలనుకుని ఉంటాడేమో. అయితే నేను అవార్డు కొనుక్కున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజానికి అవార్డు కొని, మ్యానిపులేట్ చేయాలనుకునే వ్యక్తిని కాదు నేను. అయితే దేని గురించీ ఆలోచించని వయసులో ఉన్నాను. అవార్డు ప్రతినిధి ‘30వేలు ఇవ్వండి. అవార్డు మీది అవుతుంది’ అనడంతో, వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేశా. అలా అవార్డు దక్కించుకున్నందుకు ఎప్పటికీ గిల్టీగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ రిషీయే ‘‘ఎప్పుడైనా రిషి నుంచి విడిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ అని నన్ను అడిగితే ‘‘చాలాసార్లు. ప్రతిరోజూ’’ అని సమాధానం చెబుతాను నేను సరదాగా. ఎందుకంటే.. ఇతనితో తప్ప నేను వేరే ఎవ్వరితోను ఉండలేనేమో? ఎందుకంటే... తెలుసుకున్న కొద్దీ గొప్పగా కనిపించే వ్యక్తి రిషి. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతని గొప్ప లక్షణాల ముందు అతని చెడ్డ అలవాట్లు కనిపించనంత చిన్నగా మారిపోతున్నాయి. నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. రిషీని పెళ్లి చేసుకోవడం. రిషి చాలా కష్టమైన మనిషి. అది ఆయన్ను అర్థం చేసుకునేంత వరకే. కొత్తవాళ్లను సులభంగా నమ్మడు. అందుకే అతని చుట్టూ ఎప్పుడూ పాత ముఖాలే. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ఇవాళ్టికి (పుస్తకం రాస్తున్న సమయానికి) నేను , రిషి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా మారింది. ఆయన ముఖంలో చిన్న మార్పు చూసి ఆయన మనసును అర్థం చేసుకోగలను. నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే రిషీయే నాకు ఎక్కువ. అతనితో పోలిస్తే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాబ్ (రిషీని నీతూ అలానే పిలుస్తారు)కి సినిమాలంటే పిచ్చి. కుటుంబం అంటే పిచ్చి. నా కుటుంబమే నాకు ప్రపంచం. అందుకే సినిమాలా? కుటుంబమా? అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇష్టంగా ఇంట్లోనే ఉండాలనుకున్నా. నాన్నతో మరింత టైమ్ గడిపి ఉండాల్సింది (తండ్రి ఆటోబయోగ్రఫీ ముందు మాటలో రణ్ బీర్ పేర్కొన్న విషయాలివి) నాకు మా నాన్నతో కంటే అమ్మతో దగ్గరితనం ఎక్కువ. నాన్నతో చాలా గౌరవమైన బంధమే ఉండేది. కానీ కొన్నిసార్లు నాన్నతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది అనిపించేది. ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఏదో ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగి ఉండాల్సింది అనిపిస్తుంటుంది. మా పిల్లలతో నేను ఇలా ఉండను.. కచ్చితంగా వారికి సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా అంటున్నప్పటికీ మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ‘మన ఫ్యామిలీని బలంగా కలిపి ఉంచినది, మన అందరి జీవితాలను సులభం చేస్తున్నది మీ అమ్మ (నీతూ కపూర్) మాత్రమే’ అని చాలా స్పష్టంగా చెప్పేవారు నాన్న. వాళ్ల ఇద్దరి నుంచే ప్రేమ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయాలు నేర్చుకున్నాను. చేసే పనిని ఎలా ప్రేమించాలో నేర్పించారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో నాన్న నాకంటే ఉత్సాహంగా షూటింగ్స్ కి వెళ్లడం చూశాను. నా మీద ఆయనకు ఉన్న గౌరవం చూస్తే భయంగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. -
ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి
ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త విని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్తం చేశారు. ఆ ట్వీట్స్ ఈ విధంగా.. ► ఇర్ఫాన్ ఖాన్ లేరనే వార్త నన్ను ఎంతో బాధించింది. ప్రపంచ వ్యాప్తింగా పాపులారిటీ సాధించిన అద్భుతమైన నటుడు ఇర్ఫాన్. ఆయన లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఇర్ఫాన్ నటన మన అందరి గుండెల్లో నిలిచిపోతుంది. ఇర్ఫాన్. మేమందరం నిన్ను మిస్ అవుతాం. – చిరంజీవి ► ప్రపంచ సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఆయన సినిమాలన్నీ చూసి, చెప్పగలిగేది ఏంటంటే ఆయనో అద్భుతమైన నటుడు. మీ సినిమాల ద్వారా మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటాం. – వెంకటేష్ ► ఇర్ఫాన్ ఖాన్ నటన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నాకు తెలిసిన గొప్ప నటుల్లో ఇర్ఫాన్ ఒకరు. మనల్ని విడిచి ఆయన చాలా తొందరగా వెళ్లిపోయారు. ఇంకొంతకాలం జీవించి ఉండాల్సింది. – కమల్‌హాసన్ ► ఇర్ఫాన్‌ఖాన్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – మోహన్‌లాల్ ► గొప్ప నటుడు. చాలా త్వరగా మనందర్నీ విడిచి వెళ్లిపోయారు. ఆయన తో పని చేయడం ఓ మంచి అనుభవం, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రేమించిన వారికి నా హుదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను . – మహేష్ బాబు ► ప్రపంచ సినిమా ఒక ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌గారు అత్యద్భుతమైన నటులు. సినిమా ఇండస్ట్రీ ఈ లెజెండ్ ను కచ్చితంగా మిస్ అవుతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – రామ్ చరణ్ ► మన దేశంలోనే ఉన్న గొప్ప నటుల్లో ఇర్ఫాన్ గారు ఒకరు. ఆయన చనిపోయారనే వార్త వింటుంటే చాలా బాధగా ఉంది. ఎన్నో మర్చిపోలేని పాత్రలను పోషించారాయన. ï్రÜ్కన్ మీద ఆయన్ను మిస్ అయినా, ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. – విష్ణు మంచు ► చాలా బాధగా ఉంది. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు ఇర్ఫాన్. ప్రపంచ కళా రంగానికి నువ్వు చేసిన కృషికి ధన్యవాదాలు. – ప్రకాష్ రాజ్ ► మీరు (ఇర్ఫాన్ ఖాన్) ఇంటర్నేషనల్ స్టార్. ఒక లెజెండ్. గొప్ప ప్రతిభావంతులు. మీతో కలిసి ‘కర్వాన్’ సినిమాలో నటించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అందరినీ సమానంగా చూశారు. మీ కుటుంబసభ్యులుగా భావించారు. ఒక అభిమానిగా, ఒక విద్యార్థిగా ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ నవ్వును నేను మర్చిపోలేను. మీరు లేరన్న వార్తను భరించలేకపోతున్నాను. – దుల్కర్ సల్మాన్ ► ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారన్న దుర్వార్త నన్నెంతగానో కలచివేసింది. ఇండస్ట్రీకి ఇర్ఫాన్ లేని లోటు తీరనిది. అద్భుతమైన నటుడు. ప్రపంచ సినిమాకు తన వంతు సేవ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మనల్ని చాలా తొందరగా వదిలి వెళ్లిపోయాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – అమితాబ్ బచ్చన్ ► నా సహచర నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధగా ఉంది. ప్రతిభావంతుడు. తన నటనతో ఆయన మనందరికీ ఎప్పుడూ గుర్తుంటారు. ప్రేమతో మిమ్మల్ని (ఇర్ఫాన్ ఖాన్) గుర్తుపెట్టుకుంటాం. – ఆమిర్‌ఖాన్ ► ఈ కాలంలోనే గొప్ప నటుడు, నా ప్రేరణ, నా మిత్రుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం నన్ను ఎంతో బాధించింది. మీరు కనబర్చిన అద్భుత నటనతో మా జీవితాల్లో ఎప్పటికీ మీరు (ఇర్ఫాన్ ఖాన్) భాగమయ్యే ఉంటారు. – షారుక్ ఖాన్ ► ఇర్ఫాన్ ఇక లేరన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు. అతని కుటుంబం, అభిమానులకు కూడా. మనందరి హృదయాల్లో ఇర్ఫాన్ ఎప్పటికీ బతికే ఉంటారు – సల్మాన్ ఖాన్ ► ఇర్ఫాన్గారితో నేను ఎక్కువ సందర్భాల్లో మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఈ ట్వీట్ టైప్ చేసేప్పుడు నా కళ్లు కన్నీటితో నిండిపోయాయి. అరుదైన మానవతావాది. మిమ్మల్ని (ఇర్ఫాన్) చాలా మిస్ అవుతున్నాను. అవుతున్నాను. – హృతిక్ రోషన్ ► ఇర్ఫాన్ మరణించారన్న వార్త విని చాలా కలత చెందాను. మా తరంలోనే చాలా గొప్ప నటుడు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు అతని కుంటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను – అక్షయ్ కుమార్ ► గొప్ప నటుడిని మనం కోల్పోయాం. ఇర్ఫాన్ చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఆయన్ను చాలా మిస్ అవుతాం. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బోనీకపూర్ ► ఇర్ఫాన్ నా ప్రియమైన స్నేహితుడు. జీవితంతో ఇర్ఫాన్ పోరాడిన తీరుకు ఆయన స్నేహితుడిగా నేను గర్వపడుతున్నాను. ఇర్ఫాన్‌కు నా సెల్యూట్ – సుజిత్ సర్కార్ ► మీ (ఇర్ఫాన్‌ఖాన్) శకాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. నా స్నేహితుడు ఇర్ఫాన్ జీవితంతో ఓ యోధుడిలా పోరాడారు. – ప్రియాంకా చోప్రా ► మీతో (ఇర్ఫాన్) నాకు అంతగా పరిచయం లేదు. కానీ నా శోకాన్ని ఆపుకోలేకపోతున్నాను.. ఎందుకంటే మీ నటన నా వృత్తి జీవితంపై చూపిన ప్రభావం అలాంటిది. నటనలో మీరు చేసిన మ్యాజిక్ మిమ్మల్ని మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. – విద్యాబాలన్ ► నా ప్రియమిత్రుడు ఇర్ఫాన్‌ఖాన్ మరణం నన్ను బాధించింది. ఇర్ఫాన్ ప్రతిభా వంతుడు, నిజాయితీపరుడు, ధైర్యవంతుడు. – ఐశ్వర్యారాయ్ ► ఈ రోజు(బుధవారం) చాలా ధుర్ధినం. స్వయంకృషితో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి లీడ్ యాక్టర్‌గా ఆస్కార్ స్థాయి నటన కనబరచారు. – కంగనా రనౌత్ ► ఇర్ఫాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నా హృదయం బద్దలైపోయింది. – దీపికా పదుకోన్ ► ఇర్ఫాన్గారితో కలిసి పనిచేయడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. – కరీనా కపూర్ ► నాలో ఆత్మవిశ్వాసం తగ్గిన సమయంలో మీరు నాకు చెప్పిన మాటలు నాలో ఎంత ధైర్యాన్ని నింపాయో మాటల్లో చెప్పలేను ఇర్ఫాన్ సర్. ఇకపై మీరు లేరన్న విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది – సోనమ్ కపూర్ ► ఇర్ఫాన్‌గారు వెండితెర ఇంద్రజాలికులు. మాలాంటి వారికి స్ఫూర్తి. ఆయనతో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. – శ్రద్ధాకపూర్ ► నాకు తెలిసిన స్ట్రాంగెస్ ్టపీపుల్లో ఇర్ఫాన్‌గారు ఒకరు. ఆయన ఒక ఫైటర్. ఇర్ఫాన్‌గారు నటించిన కాలంలోనే మా జర్నీ కూడా సాగిందని గర్వంగా చెప్పుకుంటాం. – రాధికా మాధన్ (‘అంగ్రేజీ మీడియం’ సినిమాకు ఇర్ఫాన్ కో స్టార్) ► ఇర్ఫాన్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధలోనూ సానుకూలంగా ఆలోచించగల వ్యక్తి. చివరిసారిగా మేం కలిసినప్పుడు మానవాళి ఉనికికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నాం. – కొలిన్ (జురాసిక్ వరల్డ్ 2015 డైరెక్టర్) వీరితో పాటు మహేశ్ భట్, అలీ అబ్బాస్ జాఫర్, అనురాగ్ బసు, అర్జున్‌కపూర్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్ వంటి సినీ ప్రముఖులు ఇర్ఫాన్‌ఖాన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. -
అప్పుడే అందరి దృష్టి ఇర్ఫాన్‌పై పడింది
‘‘ఒక గొప్ప కళాకారుడు కన్ను మూసినప్పుడు ప్రపంచంలో గొప్ప సినిమా చేయాలనుకునే అందరికీ అది లాసే. ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటుడు ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం షాకింగ్ గా ఉంది. మరెన్నో గొప్ప సినిమాలు, గొప్ప పెర్ఫార్మన్స్‌లు చూసే అవకాశాన్ని మనందరం కోల్పోయాం’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఇర్ఫాన్ ఖాన్ యాక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘సైనికుడు’. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘పప్పు యాదవ్’ అనే విలన్ పాత్రలో నటించారాయన. ఇర్ఫాన్‌ని తెలుగు సినిమాలో నటింపజేసిన దర్శకుడు గుణశేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► ఇర్ఫాన్ ఇక లేరనే వార్త వినగానే మీకు గుర్తొచ్చిన విషయాలు? గుణశేఖర్: క్వారంటైన్ సమయంలో పాత క్లాసిక్స్ దగ్గర నుంచి మంచి మంచి సినిమాలన్నీ మళ్లీ చూస్తూ, ఇర్ఫాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో చేసిన ‘దృష్టి’ కూడా చూశాను. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. క్యాన్సర్ తో పోరాడి మళ్లీ మనందర్నీ తెరపై అలరిస్తారనుకున్నాను. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. నమ్మబుద్ధి కాలేదు. నమ్మాలనిపించలేదు. ‘సైనికుడు’ సినిమాలో మహేష్‌తో ఇర్ఫాన్ ► ఇర్ఫాన్ ఖాన్ని ‘సైనికుడు’ సినిమాలో నటింపజేయాలని ఎందుకు అనిపించింది? ఇర్ఫాన్ గొప్ప నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘దృష్టి’లో గజల్ సింగర్ గా చిన్న పాత్ర చేశారు. అందులో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రధారులు. ఇర్ఫాన్ ది చిన్న పాత్ర. కేవలం ఆ పాత్రతోనే దేశవ్యాప్తంగా తన మీద దృష్టి పడేలా చేసుకున్నారు. తర్వాత ‘సలాం బొంబాయి’ చేశారు. అది మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. బొంబాయిలో ఉన్న వీధి పిల్లలతో ఆ సినిమా చేశారు. అటు ఇటుగా అదే సమయంలో నేను చిన్నపిల్లలతో తీసిన ‘రామాయణం’ విడుదలయింది. ఆయన ఎక్కువ శాతం ఆఫ్ బీట్ సినిమాలు చేస్తుండేవారు. కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని 2001 నుంచి ఆసక్తి చూపించారు. అదే సమయంలో సౌత్ నుంచి చాలా మంది ఆయన్ను ఇక్కడి సినిమాల్లో యాక్ట్ చేయించాలని ప్రయత్నించారు. మా సినిమాకు బావుంటారని మహేష్, నేను అనుకోవడంతో ఆయన్ను సంప్రదించాం. ఇర్ఫాన్ నన్ను కేవలం ‘ఒక్కడు’ సినిమా దర్శకుడిగా కాకుండా చిన్న పిల్లలతో ‘రామాయణం’ సినిమా చేసిన దర్శకుడిగా కూడా గుర్తు పెట్టుకున్నారు. అలా ఆయన మా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ► ఆయనతో పని చేసిన రోజుల గురించి? ఆఫ్ బీట్ సినిమాలు చేసేవాళ్లు ఎక్కువ శాతం నేషనల్ స్కూల్ ఆఫ్ ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్లందరిలో సాధారణంగా కనిపించేది ఏంటంటే.. పాత్రను ఎక్కువగా స్టడీ చేయడం. అయితే ఇర్ఫాన్ ఆఫ్ బీట్ సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టేవారో కమర్షియల్ సినిమాలకూ అంతే శ్రమించేవారు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. ‘సైనికుడు’లో ‘పప్పు యాదవ్’ పాత్ర చేశారు. భాష రాని నటులు ఉంటే షూటింగ్ సమయంలో చిన్నఇబ్బంది ఉంటుంది. డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సందర్భాలు ఉంటాయి. ఆ డైలాగ్ కాకుండా వేరే లైన్స్ పలుకుతుంటారు. కానీ ఇర్ఫాన్ గారు ‘మమ’ అనిపించేద్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు. తెలుగు నేర్చుకుని, ప్రతి డైలాగ్ అర్థం ఏంటి? ఎలా పలకాలి? అని తెలుసుకుని, నటించారు. ‘సైనికుడు’లో ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ గారు, ఇర్ఫాన్ కాంబినేషన్ లో ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్లో ఇర్ఫాన్ తన డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చెప్పడంతో కోటా గారు అభినందించారు. ► సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలేమైనా గుర్తు చేసుకుంటారా? ఆరోగ్య విషయంలో ఇర్ఫాన్ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ‘ఏ.యం.సి’ కుక్ వేర్ లో నూనె వాడకుండా వంట చేయొచ్చు. మా ఆవిడ (రాగిణి గుణ) ఆ పాత్రలను వాడుతుండేవారు. ఆ విధానం ఆయనకు బాగా నచ్చింది. ఆ పాత్రల గురించి మా ఆవిడ దగ్గర తెలుసుకొని హైదరాబాద్ నుంచి సామాగ్రి కొనుక్కొని తీసుకుని వెళ్లారు. అదో మంచి జ్ఞాపకం. ఆయన చనిపోయిన వార్త విని మా ఆవిడ కూడా షాక్ అయ్యారు. ► చాలామంది సెలబ్రిటీలు ఇర్ఫాన్ చనిపోవడం పర్సనల్ లాస్లా ఉంది అంటున్నారు.. అది నిజమే. ఎన్నో గొప్ప సినిమాలు చేశారాయన. ఇంకా ఎన్నో సినిమాలు మనకు అందిస్తారు, గొప్ప కథలు చెబుతారు, అద్భుతమైన ఆర్ట్‌ని ప్రపంచానికి చూపిస్తారని ఊహించాం. ఇక అది జరగదనే విషయం ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే పర్సనల్ లాస్ లా ఫీల్ అవుతున్నారు. ► ‘సైనికుడు’ చేస్తున్నప్పుడే ఆయనకు హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట కదా? అవును. అప్పుడే ఆయనకు తొలి హాలీవుడ్ సినిమా ‘మైటీ హార్ట్’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్, మా డేట్స్ ఒకటే. దాంతో ఇర్ఫాన్ చాలా ప్రొఫెషనల్‌గా ‘ఒక హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. మన డేట్స్ ని మార్చడానికి వీలవుతుందా?’ అని అడిగారు. మహేష్ గారు, అశ్వనీ దత్ గారు, నేను మాట్లాడుకుని మొత్తం డేట్స్ అన్నీ మార్చేశాం. నెల రోజులు తర్వాత చేయాల్సిన షూటింగ్ ని ముందుకు మార్చి, 30 రోజుల పనిని 18 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసి ఆయన్ను పంపించాం. ఆయన చాలా సంతోష పడ్డారు. హాలీవుడ్ ఆఫర్ అనేది ఆయనకు కొత్త ఇన్నింగ్స్. ఇర్ఫాన్ పొటెన్షియాల్టీకి తగ్గ కాన్వాస్ దొరికిందనుకున్నాను. ఆ తర్వాత ఆయనలా ఎవరికీ దొరకలేదు. హాలీవుడ్ హిట్ సినిమాలన్నిట్లో ఇర్ఫాన్ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. మనందరం గర్వపడే స్థాయికి వెళ్లారాయన. -
బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్ర తేజ్ సింగ్ (46) సోమవారం ఉదయం హఠాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది.ఈ కష్ట కాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. స్ఫూర్తిదాయకమైన , మానవత్వమున్న నాయకుడిగా రుద్ర నిలిచిపోతారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బీఎండబ్ల్యూ ఇండియా యాజమాన్యం, సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగి పోయారు. 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు. 2019 ఆగస్టు 1 ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్ర బీఎండబ్ల్యూ సంస్థకు నాయకత్వాన్ని చేపట్టిన మొదటి భారతీయుడు. అంతకు ముందు రాయల్ ఎన్ఫీల్డ్లో గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని సొంతం చేసుకున్న రుద్ర ప్రతాప్ ఆటోమోటివ్, నాన్-ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక నాయకత్వ పదవులను చేపట్టి విజయం సాధించారు. -
‘టామ్ అండ్ జెర్రీ’ దర్శకుడి కన్నుమూత
ప్రేగ్: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు. జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. -
కెమెరామేన్ అల్లెన్ డీవియో మృతి
కరోనా వైరస్ కారణంగా ఇటీవలే పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ కెమెరామేన్ అల్లెన్ డీవియో (77) కరోనా వల్ల మరణించారు. ‘ఈటీ’, ‘డి కలర్ పర్పుల్’, ‘ఎంపైర్ ఆఫ్ డి సన్’ వంటి పాపులర్ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేశారాయన. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌తో ఎక్కువ సినిమాలు కలసి పని చేశారు అల్లెన్. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఐదుసార్లు ఆస్కార్ నామినేషన్ పొందారు అల్లెన్ డేవియో. 2007లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆయనకు జీవిత సాఫల్యత పురస్కారాన్ని అందించింది. -
కరోనాతో హాలీవుడ్ నటి మృతి
కరోనా లక్షణాలతో హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ (74) మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ‘విచ్ ఫైండర్ జనరల్’ అనే హారర్ మూవీ ద్వారా పాపులారిటీ సంపాదించారు హిల్లరీ హీత్. ఆ తర్వాత ‘నిల్ బై మౌత్’, ‘యాన్ ఆఫుల్లీ బిగ్ అడ్వెంచర్’ వంటి సినిమాలను నిర్మించారు. హీత్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా చిత్ర నిర్మాతే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ‘లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణమూర్తి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్ బాబు చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నన్ను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దు’’ అని కోరారు. కాగా కృష్ణవేణి మరణ వార్త లె లుసుకున్న చిరంజీవి ఫో¯Œ లో తమ్మారెడ్డి భరద్వాజను పరామర్శించారు. -
శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు
బుల్లితెర నటి శ్రీలక్ష్మి కనకాల (40) మృతి చెందారు. గత రెండేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. దివంగత దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల కుమార్తె, నటుడు రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి. శ్రీ పెద్ది రామారావు భార్య అయిన శ్రీలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు కూడా. కొన్నాళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
డీఎల్ఎస్ సూత్రధారి లూయిస్ ఇక లేరు!
లండన్: టోనీ లూయిస్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అంటే తెలియని వారుండరు. క్రికెట్‌కు బాగా అక్కరకొచ్చే ‘డక్‌వర్త్ లూయిస్ పద్ధతి’ (డీఎల్ఎస్) సూత్రధారుల్లో టోనీ ఒకరు. మ్యాచ్ ప్రతికూల పరిస్థితుల్లో ఆగిపోతే ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. వర్షంతో ఆగి... సాగే మ్యాచ్‌లకు విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన ఇప్పుడు లూయిస్ కన్నుమూశారు. 78 ఏళ్ల టోనీ లూయిస్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఓ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్ అయిన టోనీ లూయిస్, మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి ఓ లెక్క తెచ్చారు. ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్‌రేట్, తాజా పరిస్థితి అన్నింటిని లెక్కలోకి తీసుకొని ఓ సారుప్య నిష్పత్తితో గణాంకాలను ఆవిష్కరించారు. ఇది వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన, ఆగి సాగిన ఎన్నో మ్యాచ్‌లకు ఫలితాన్నిచ్చింది. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్) పురస్కారంతో సత్కరించింది. డీఎల్ఎస్ రాకముందు అర్ధంతరంగా ఆగే మ్యాచ్‌ల కోసం ఓ మూస పద్ధతిని అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో అత్యధిక సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో... లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది. దీంతో మెరుగైన కొత్త పద్ధతి కోసం ఐసీసీ అన్వేషించగా... డక్‌వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి రూపొందించిన పద్ధతి ఐసీసీని మెప్పించింది. దీంతో వారిద్దరి పేర్లతోనే డీఎల్ సిస్టమ్‌గా 1997 జనవరి 1నుంచి అమలు చేశారు. నిజానికి ఇదేమీ తేలిగ్గా అర్థమవదు. అయితే పాత పద్ధతి కంటే మేలైనది కావడంతో ఐసీసీకి డీఎల్ఎస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనపడలేదు. తదనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014నుంచి డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్ఎస్)గా వ్యవహరిస్తున్నారు. -
‘స్టార్ వార్స్’ నటుడు కరోనాతో మృతి
కరోనాతో మరో హాలీవుడ్ నటుడు మరణించారు. ఇటీవలే మార్క్ బ్లమ్ అనే నటుడు కరోనా సోకి మరణించారు. తాజాగా ‘స్టార్ వార్స్’ ఫేమ్ ఆండ్రూ జాక్ (76) కూడా కోవిడ్ –19 కారణంగానే చనిపోయారు. కరోనా పాజిటివ్ అని తేలిన రెండు రోజుల్లోనే ఆండ్రూ మరణించారని సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘లార్డ్ అఫ్ ది రింగ్స్’, ‘థార్’ తదితర సినిమాల్లో నటించారాయన. -
నిర్మాత ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, ఆయన మేనేజర్ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమా నిర్మించారు. ఆయనకు భార్య పద్మజ, కుమార్తెలు సాయి ప్రణీత, సత్య ప్రజీత ఉన్నారు. ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఏ కాస్త నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్‌తో మాట్లాడగానే ఎనర్జీ వచ్చేది. తన మరణం నాకు చాలా లోటు. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’ అంటూ ప్రసాద్ కుటుంబానికి సుకుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
మార్క్ బ్లమ్ ఇక లేరు
‘డెస్పరేట్లీ సీకింగ్ సుసాన్’, ‘క్రోకోడైల్ డూండీ’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (69) ఇక లేరు. కరోనా వైరస్ సోకి, ఆయన ఆస్పత్రిలో చేరారు. వైరస్ కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల మార్క్ చనిపోయారని స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెబెక్కా డామన్ పేర్కొన్నారు. టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న మార్క్ మరణం తీరని లోటు అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు. -
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి ఇకలేరు
జైపూర్/అమరావతి: మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ దాదీ జానకి (104) శుక్రవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆమె, దీర్ఘకాలిక వ్యాధిబాధల కారణంగా మృతిచెందినట్లు ఆ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు. 21వ ఏటనే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాను ఎంచుకున్న విభాగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 140 దేశాల్లో ఆమె స్థాపించిన సేవా కేంద్రాలు ఉన్నాయి. దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆమె మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారత కోసం జానకి విశేష కృషి అందించారని కొనియాడారు. ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ గవర్నర్ల సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా ఆమె తన జీవితాన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవకు అంకితం చేశారని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. -
ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి సతీశ్ గుజ్రాల్ (94) కన్నుమూశారు. మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు ఈయన సోదరుడు. వయోభారం రీత్యా గురువారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యుడు, రాజ్యసభ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తెలిపారు. సతీశ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి. ఆయన మృతిపై దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సతీశ్ గుజ్రాల్‌కు ఉన్న అపారమైన జ్ఞానమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లిందని, అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తగ్గి ఉండేవారని మోదీ కొనియాడారు. కళలు, సాంస్కృతిక విభాగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
భారత మాజీ ఫుట్‌బాలర్ అబ్దుల్ లతీఫ్ కన్నుమూత
గువాహటి: భారత దిగ్గజ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సంతాపం తెలిపింది. ‘అబ్దుల్ లతీఫ్ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివి’ అని ఏఐఎఫ్ఎఫ్ అ«ధ్యక్షులు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. 1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్... 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్‌కు ప్రాతిని«ధ్యం వహించారు. వీటితో పాటు కోల్‌కతా విఖ్యాత క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్లకూ తన సేవలు అందించారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది. -
నిర్మాత వెంకట్రాజు ఇకలేరు
‘గూండారాజ్యం, టూటౌన్ రౌడీ, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, చక్రం’.. వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత చమర్తి వెంకట్రాజు(సి.వెంకట్రాజు) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో 1948 మే 25న చమర్తి నారపరాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారాయన. సిద్దిరాజు కండ్రిగ గ్రామానికే చెందిన గుంటుమడుగు శివరాజుతో(జి.శివరాజు) కలిసి శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించారు వెంకట్రాజు. తొలిచిత్రంగా కృష్ణ హీరోగా ‘గూండారాజ ్యం’(1989) నిర్మించారు. ఆ తర్వాత ‘టూటౌన్ రౌడీ, నియంత, అహంకారి, ఆదర్శం, ఆరంభం’ వంటి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత గీత చిత్ర ఇంటర్నేషనల్ అనే పతాకాన్ని స్థాపించిన వీరిద్దరూ ‘లేడీబాస్, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా, ఘర్షణ, చక్రం’ వంటి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. ‘పవిత్రబంధం’ సినిమాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని బహూకరించింది. సి.వెంకట్రాజు మృతికి పలువురు సినీ ప్రముఖులతో పాటు ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ సంతాపం తెలిపింది. కాగా ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈరోజు జరగనున్నాయి. -
డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ (98) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అన్బళగన్ మృతితో పార్టీ కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజులపాటు వాయిదా వేసినట్లు డీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటించింది. అన్బళగన్ పార్థివదేహంపై డీఎంకే పతాకాన్ని కప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పార్టీనేతలు కనిమొళి, దురైమురుగన్ నివాళులర్పించారు. కరుణానిధికి మిత్రుడిగా మెలిగిన అన్బళగన్ గత 43ఏళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. -
నటుడు జనార్ధన్ రావు మృతి
సీనియర్ నటుడు ముప్పుళ్ల జనార్ధన్ రావు(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నై సాలిగ్రామంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామంలో 1946లో జన్మించిన జనార్ధన్ రావు చెన్నైలో స్థిరపడ్డారు. తెలుగు, తమిళ సహా వివిధ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ‘జానకిరాముడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అభిలాష, అమ్మోరు, గోరింటాకు, గోకులంలో సీత, తలంబ్రాలు’.. వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారాయన. చెన్నైలో ఒక రికార్డింగ్ స్టూడియోను లీజుకు తీసుకుని నిర్వహించారు. భాగస్వామ్యంలో కొన్ని అనువాద చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. జనార్ధన్ రావు అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు శుక్రవారమే నిర్వహించారు. మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది. -
దర్శకుడు రాజ్‌కుమార్ కన్నుమూత
చిరంజీవి తొలి సినిమా ‘పునాది రాళ్లు’ తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో గల తన నివాసంలో మృతి చెందారు. ‘పునాదిరాళ్లు’ చిత్రం చిరంజీవికే కాదు రాజ్కుమార్కి కూడా తొలి సినిమాయే. రాజ్‌కుమార్ మొదటి సినిమానే ఐదు నంది అవార్డులు సాధించడం విశేషం. ఆ తర్వాత ‘ఈ సామ్రాజ్యం మాకొద్దు, మన వూరి గాంధీ, ఇంకా తెలవారదేమి, తాండవకృష్ణ తరంగం, మా సిరి మల్లి’ వంటి సినిమాలను తెరకెక్కించారాయన. రాజ్‌కుమార్ స్వస్థలం విజయవాడ దగ్గర ఉయ్యూరు. గూడపాటి రాజ్‌కుమార్ ఆయన పూర్తి పేరు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాతే ఆయన భార్య కూడా చనిపోవడంతో రాజ్‌కుమార్ కుంగిపోయి అనారోగ్యం పాలయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని ఉయ్యూరు తీసుకెళ్లారు ఆయన చిన్న కుమారుడు. రాజ్‌కుమార్ మరణం తీరని లోటు. ఆయన ‘పునాది రాళ్లు’ తీయాలనుకున్నప్పుడు నన్నో వేషం వేయమని అడిగారు. అప్పటికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా శిక్షణ పూర్తి కాలేదు. ఆ విషయం చెప్పినా కూడా నువ్వే చేయాలి అన్నారు. నా నట జీవితానికి ‘పునాది రాళ్లు’ సినిమా పునాది వేసింది. ఈ మధ్యనే ఆయన్ని కలిశాను. అనారోగ్యంతో ఉన్నారని చెబితే అపోలో ఆసుపత్రిలో వైద్యపరీక్షలు కూడా చేయించాం. కోలుకుని నా దగ్గరకు వస్తారనుకుంటే ఇలా జరగడం విచారకరం. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – నటుడు చిరంజీవి -
‘టెరి’ వ్యవస్థాపక డైరెక్టర్ ఆర్కే పచౌరి మృతి
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టెరి)’ మాజీ చీఫ్ ఆర్కే పచౌరి(79) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి పచౌరి వైదొలిగారు. ‘టెరి’కి పచౌరి అందించిన అనుపమాన సేవలను సంస్థ చైర్మన్ నితిన్ దేశాయి ఒక ప్రకటనలో కొనియాడారు. 1974లో ‘టెరి’ని స్థాపించారు. విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది. -
అనారోగ్యంతో సీఎం బావ కన్నుమూత
అల్వాల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండో సోదరి భర్త అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు (84) హైదరాబాద్‌లోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గధామ శ్మశాన వాటికలో రాజేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అక్కడే ఉన్నారు. రాజేశ్వరరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు -
పెజావర స్వామీజీ అస్తమయం
సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజీ కోరిక మేరకు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు. ప్రధాని సంతాపం స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూరుకు స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మధ్వాచార్యుడు స్థాపించిన మఠం 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు. హిందూజాతికి తీరని లోటు – స్వరూపానందేంద్ర సరస్వతి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు. స్వామీజీ సేవలు చిరస్మరణీయం – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. -
ఆమె పోరాటం ముగిసింది!
న్యూఢిల్లీ/లక్నో/ఉన్నావ్: నేరస్తుల బెదిరింపులు.. స్పందించని ప్రభుత్వం.. చలించని పోలీసులు..ఇలా అడ్డంకులెన్ని ఎదురైనా వెరవకుండా న్యాయం కోసం ముందుకు సాగిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి(23) జీవన పోరాటం ముగిసింది. దాదాపు 40 గంటల పాటు మృత్యువుతో పోరాడి, ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. తనపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై గురువారం ఉదయం నిందితులు పెట్రోల్ పోసి, నిప్పంటించిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసింది. కుటుంబసభ్యులు శనివారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆమె మృతిపై విపక్షాలు భగ్గుమన్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని, బాధితురాలికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టి, త్వరలోనే బాధితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వెంటాడి చంపాలి: మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటాడి, చంపాలని మృతురాలి తండ్రి ఆవేశంతో అన్నారు. ‘మాకు డబ్బూ వద్దు. ఎలాంటి సాయమొద్దు. హైదరాబాద్ ఎన్కౌంటర్ మాదిరి దోషుల్ని కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలి’అని అన్నారు. తన సోదరి మరణానికి కారణమైన దోషులకు జీవించే హక్కు లేదని బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దోషులంతా చస్తేనే నా సోదరికి న్యాయం జరిగినట్లవుతుంది. ఆ కిరాతకులందరినీ యమపురికి పంపాలి’అని అన్నారు. అత్యాచారాల రాజధానిగా భారత్: రాహుల్ దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంకా గాంధీ ఉన్నావ్ రేప్ బాధితురాలికి న్యాయం అందించడంలో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రియాంక శనివారం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమెకు న్యాయం దక్కకపోవడానికి ప్రతి ఒక్కరిదీ బాధ్యతేనన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: మాయావతి మహిళలపై పెరుగుతున్న నేరాలను సుమోటోగా పరిగణించి, వీటికి అడ్డుకట్టపడేలా కేంద్రానికి తగు సూచనలివ్వాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టును కోరారు. మాయావతి శనివారం యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్‌ను కలిశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్ననేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. యోగి ప్రభుత్వాన్ని తొలగించాలి: అఖిలేశ్ ‘ఉన్నావ్’బాధితురాలికి రక్షణ కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. ఇది చీకటి దినమనీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి సాయం అందించారు? మీరు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? అని నిలదీశారు. పోస్టుమార్టం నివేదిక ఏం చెప్పింది? ఉన్నావ్ రేప్ బాధితురాలి మృతదేహానికి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు శనివారం పోస్టుమార్టం జరిపారు. ‘తీవ్రంగా కాలిన గాయాల కారణంగా బాధితురాలు చనిపోయింది. విష ప్రయోగం, మారణాయుధాలు, ఊపిరాడకపోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు ఆధారాలు కనిపించలేదు’అని వైద్యుడొకరు చెప్పారు. ‘శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించింది. రాత్రి 11 గంటలపుడు అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. గుండెను తిరిగి పని చేయించడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. 11.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచింది’అని ఆస్పత్రి వైద్యుడు శలబ్ కుమార్ ప్రకటించారు. మృతురాలి ఇంటివద్ద జనం. బాధితురాలి బంధువులను పరామర్శించి వస్తున్న ప్రియాంక గాంధీ. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న దృశ్యం -
నిర్మాత తోట రామయ్య ఇక లేరు
శ్రీ భాస్కర్ ఫిలిమ్స్ పతాకంపై ‘రణధీరుడు’, ‘మళ్లీ ఇంకోసారి’ ‘రౌడీ’ చిత్రాలను నిర్మించిన తోట రామయ్య కన్ను మూశారు. శుక్రవారం రాత్రి 10.30 ప్రాంతంలో సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు రాహుల్‌బాబు, కుమార్తె నీలిమ ఉన్నారు. సోమవారం బన్సీలాల్‌పేటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని తోట రామయ్య కుటుంబసభ్యులు తెలిపారు. -
త్వరలో ప్రజ్నేశ్ పెళ్లి... ఇంతలోనే తండ్రి మృతి
చెన్నై: భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సమయంలోనే ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో విషాదం నెలకొంది. అతని తండ్రి ఎస్.జి.ప్రభాకరన్ అనారోగ్య సమస్యలతో శనివారం తుదిశ్వాస విడిచారు. స్థిరాస్తి వ్యాపారి అయిన ప్రభాకరన్ గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శనివారం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతిచెందారని ప్రజ్నేశ్ సన్నిహితులు వెల్లడించారు. తండ్రి తుదిశ్వాస విడిచే సమయంలో అతను అక్కడే ఉన్నాడు. 29 ఏళ్ల ప్రజ్నేశ్‌కు ఈ నెల 28న కొచ్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లితంతు ఏమవుతుందో తెలీదుకానీ... సోమవారం మొదలయ్యే పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో అతను పాల్గొంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
తెలంగాణ వంటల తాత ఇకలేరు..!
సంప్రదాయ వంటల నుంచి.. చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నింటినీ అవలీలగా వండి వార్చే యూట్యూబ్ వంటల తాత ఇకలేరు. ‘గ్రాండ్‌పా కిచెన్’ను యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ వంటల తాతగా పరిచయమున్న నారాయణరెడ్డి(73) అక్టోబర్ 27న అనారోగ్యంతో హైదరాబాద్‌కు సమీపంలోని తన సొంతూరులో మరణించారు. ఈ తెలంగాణ తాత 2017లో ప్రారంభించిన గ్రాండ్ పా కిచెన్ చానల్‌కు ఏకంగా 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతారు. అంతేకాదు యూట్యూబ్ చానల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టిన రోజు కానుకలు కొనిపెడు తుంటారు. చనిపోయే ముందు 6 రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. నోరూరించే వంటకాలను తయారుచేసే విధానాన్ని చూపించి, వాటిని అనాథలకు పంచిపెట్టే నారాయణరెడ్డికి విదేశాల్లోనూ అభిమానులున్నారు. -
కార్మిక గళం మూగబోయింది
కోల్‌కతా: భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో గురువారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, గురుదాస్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురుదాస్ ఐదుసార్లు పార్లమెంటుసభ్యుడిగా ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటులో ఆయన ఆవేశపూరిత ఉపన్యాసాలు కొన్నిసార్లు పార్టీ సైద్ధాంతిక సరిహద్దులను చెరిపేసేవి. యాంగ్రీ యంగ్ మాన్ ‘యాంగ్రీ యంగ్ మాన్’గా పేరున్న గురుదాస్ దాస్ గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో పుట్టారు. విభజన అనంతరం ఈయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది. 50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అ«ధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. కొన్ని సందర్భాల్లో రహస్య జీవితంలోకి వెళ్లారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో గురుదాస్ ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మాజీ ప్రధాని వాజ్‌పేయితోనూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోనూ, పలువురు కాంగ్రెస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇటు పార్లమెంటులోనూ, అటు కార్మికవర్గంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గురుదాస్ గుప్తా లేని లోటు కార్మికలోకానికి తీరని నష్టమన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గురుదాస్ దాస్‌గుప్తా∙మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, రాజకీయాల్లో ఆయన విలువలకు ప్రతీకగా నిలిచారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
ప్రముఖ నటి గీతాంజలి (72) ఇక లేరు. బుధవారం హఠాత్తుగా కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 11.45 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున ఆమె తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. ఆమె తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే మణి రెండో కుమార్తె. మూడేళ్ల వయసు నుంచే అక్క స్వర్ణతో కలిసి కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. భర్త రామకృష్ణతో... పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది మణి. ఆ సినిమాలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ పాట నేటికీ శ్రీరామ నవమి పందిళ్లలో, పెళ్లి పందిళ్లలో వినిపిస్తుంటుంది.‘సీతారామ కల్యాణం’లో సీత పాత్ర ఒప్పుకున్నప్పుడు గీతాంజలి వయసు 14. ఎన్టీఆర్ రావణాసురుడు, రాముడేమో హరనాథ్. అంతకుముందు ‘రాణీ రత్నప్రభ’ అనే సినిమాలో గీతాంజలి చేసిన ఓ డ్యాన్స్ బిట్ చూసి, ‘సీతారామ కల్యాణం’లో సీత పాత్రకు తీసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. ‘నవరాత్రి’లో ఓ దృశ్యం ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. ‘‘ఏం భయపడొద్దు. మీరే సీత అనుకోండి.. చేయండి’’ అని భయపడుతున్న గీతాంజలితో అన్నారు. ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్లు చేశారామె. సినిమా రిలీజైంది. ఘనవిజయం సాధించింది. అప్పుడు గీతాంజలి ఎక్కడ కనిపించినా ‘అదిగో సీత’ అనేవారు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు గీతాంజలి. ఎన్టీఆర్ తిలకం దిద్దేవారని, ‘సీతారామ కల్యాణం’ వంద రోజుల వేడుక శ్రీరామ నవమి వేడుకలా జరగడం మరచిపోలేనని ఓ సందర్భంలో పేర్కొన్నారామె. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె గీతాంజలిగా ఎలా మారారంటే? హిందీ చిత్రంతో పేరు మార్పు ఆ మార్పుకి కారణం హిందీ సినిమా ‘పారస్ మణి’ (1963). అందులో గీతాంజలిది రాజకుమారి పాత్ర. సినిమా పేరు ‘పారస్ మణి’, కథానాయిక నిజమైన పేరు ‘మణి’ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చిత్రదర్శకుడు బాబూ భాయ్ మిస్త్రీ ‘గీతాంజలి’గా మార్చారు. అప్పటివరకూ దక్షిణాది తెరపై ‘మణి’ పేరుతో పాపులర్ అయిన గీతాంజలి ఆ తర్వాతి నుంచి మార్చిన పేరుతో కొనసాగడం విశేషం. మణి సార్థక నామధేయురాలు అనాలి. పేరుకి తగ్గట్టుగానే నటనలో ‘మణి’ అనిపించుకుని, మంచి ‘నటనామణి’గా తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు గీతాంజలి. మలయాళ సినిమా ‘స్వప్నంగళ్’లో ఆమె అంధురాలి పాత్ర చేశారు. అప్పుడు గీతాంజలికి 18 ఏళ్లు. ఆ సినిమాలో గీతాంజలి చిన్ననాటి పాత్రను శ్రీదేవి చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవికి తొమ్మిదేళ్లు. తమిళంలో శారద, దైవత్తిన్ తాయ్, పనమ్ పడైత్తవన్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. హీరోయిన్ టు హాస్యం ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలూ చేసేవారు. ‘డా. చక్రవర్తి’లో చేసిన ఏయన్నార్ చెల్లెలి పాత్ర, ‘లేత మనసులు’లో చేసిన డ్యాన్స్ టీచర్ తదితర పాత్రలు గీతాంజలికి మంచి పేరు తెచ్చాయి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కథానాయికగా చేసిన ‘ఇల్లాలు’ సినిమా కూడా గీతాంజలి కెరీర్‌కి ప్లస్ అయింది. అందులో ఆమె కథానాయికగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ‘దేవత’ సినిమాలో హాస్యపాత్ర ఒప్పుకోవడం తాను చేసిన తప్పు అని, పద్మనాభం వల్లే తన కెరీర్ హాస్యం వైపు మళ్లిందని ఓ సందర్భంలో గీతాంజలి చెప్పారు. సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్ర బాగా క్లిక్ అయితే ఆ తర్వాత ఆ ఆర్టిస్ట్‌ని ఆ తరహా పాత్రలకు పరిమితం చేయడం ఓ ఆనవాయితీ. అలా ‘దేవత’ చిత్రంలో గీతాంజలి చేసిన హాస్య పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో దర్శకులు ఆమెని చూసే దృష్టి కోణం మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు కామెడీ పాత్రలకే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ‘వ్యాంప్ క్యారెక్టర్స్’, ‘డ్యాన్స్ నంబర్స్’ కూడా చేశారామె. హీరోయిన్గా దాదాపు 50 చిత్రాలు చేసిన గీతాంజలి కెరీర్ కామెడీ ఆర్టిస్ట్‌కి మారింది. అయితే కామెడీ జంటల్లో పద్మనాభం, గీతాంజలిలది హిట్ పెయిర్. ‘మర్యాద రామన్న’, ‘పొట్టి ప్లీడరు’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. అది గీతాంజలి నిజాయతీకి నిదర్శనం మామూలుగా రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ‘నా స్టయిల్లో చేశాను. కాపీ కొట్టలేదు’ అని చెబుతుంటారు. కానీ గీతాంజలి మాత్రం ‘కాపీ కొట్టాను’ అని ఒప్పుకోవడం ఆమె నిజాయతీకి నిదర్శనం. తమిళంలో కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఎదిర్ నీచ్చల్’ సినిమాని ‘సంబరాల రాంబాబు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో షావుకారు జానకి చేసిన పాత్రను తెలుగులో గీతాంజలి చేశారు. ‘‘తమిళ సినిమాలో షావుకారు జానకి పాత్ర చూశాను. ఆమెను కాపీ కొట్టాను’’ అని ఓ సందర్భంలో గీతాంజలి అన్నారు. బామ్మగా రీ–ఎంట్రీ కెరీర్ సజావుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు రామకృష్ణతో గీతాంజలి వివాహం జరిగింది. వాస్తవానికి వారిది ప్రేమ వివాహం అనుకుంటారు కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లే అని గీతాంజలి స్వయంగా పేర్కొన్నారు. పెళ్లి తర్వాత భర్త విశ్రాంతి తీసుకోమనడంతో గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. నటిగా రీ–ఎంట్రీలో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంలో చేసిన బామ్మ పాత్ర క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమె ఈ తరహా పాత్రలు చేయడం మొదలుపెట్టారు. తనయుడిని నటుడిని చేయాలనుకున్నారు గీతాంజలి–రామకృష్ణ దంపతులకు ఓ కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌ని నటుడిని చేయాలనే ఆకాంక్ష ఇద్దరికీ ఉండేది. 2001లో రామకృష్ణ చనిపోయారు. అప్పటివరకూ చెన్నైలోనే ఉంటున్న గీతాంజలి భర్త దూరమయ్యాక హైదరాబాద్‌కి మకాం మార్చారు. శ్రీనివాస్ ఓ మూడు సినిమాలు కమిట్ అయినా, అవి విడుదల వరకూ రాలేదు. చిత్రప్రముఖుల నివాళి గీతాంజలి హఠాన్మరణం చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి ఆమె భౌతిక కాయాన్ని నందీ నగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ ఆవరణలో ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జీవితా రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, వీకే నరేష్.. ఇలా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గీతాంజలి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామ కల్యాణం’తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన గుర్తుండిపోతుందన్నారు. చెమర్చిన కళ్లతో శ్రీనివాస్ -
జెఠ్మలానీ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎంతో క్లిష్టమైన క్రిమినల్ కేసులతోపాటు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ తెలిపారు. జెఠ్మలానీ నలుగురు సంతానంలో ఇద్దరు చనిపోగా కుమారుడు మహేశ్, కుమార్తె శోభ ఉన్నారు. ఆయన మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబసభ్యుల కు సానుభూతి తెలిపారు. జెఠ్మలానీ అంత్యక్రియ లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన కుమారుడు మహేశ్ చితికి నిప్పంటించారు. కరాచీలో 17 ఏళ్లకే లా పట్టా 1923 సెప్టెంబర్ 14వ తేదీన సింథ్(పాకిస్తాన్)లోని షికార్పూర్లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు. అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి చేరుకున్నారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగానూ పేరు.. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో కేసు వేశారు. అనంతరం ఆ కేసును జెఠ్మలానీ ఉపసంహరించుకున్నారు. న్యాయ నిపుణుడిని కోల్పోయాం: రాష్ట్రపతి ‘రామ్ జెఠ్మలానీ మృతి విచారకరం. ఆయన తన వాక్పటిమతో ప్రజా సమస్యలపై పోరాడారు. గొప్ప న్యాయ నిపుణుడిని దేశం కోల్పోయింది’అని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ. న్యాయ వ్యవస్థకు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజం జెఠ్మలానీ. అటువంటి విశిష్టమైన వ్యక్తిని దేశం కోల్పోయింది’అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ జెఠ్మలానీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసిన జెఠ్మలానీ ఉన్నతమైన వ్యక్తిగా గుర్తుండిపోతారని జగన్ పేర్కొన్నారు. కేసులతో వార్తల్లోకి.. సుదీర్ఘ వృత్తి జీవితంలో ఆయన చేపట్టని అంశం లేదు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్ల తరఫున కూడా వాదించారు. దేశంలో ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన జెఠ్మలానీ.. పలు ప్రతిష్టాత్మక క్రిమినల్ కేసుల్లో నిందితుల పక్షాన వాదించడం వివాదాస్పదం అయింది. ఇందిరాగాంధీ హత్య కేసులో, అనంతరం రాజీవ్ హత్య కేసులో నిందితుల పక్షాన నిలబడ్డారు. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల కేసుల్లోనూ ఆయన వాదించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జిలానీ తరఫున వాదనలు వినిపించారు. విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్ వేశారు. హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా తరఫున వాదించారు. దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున వాదించారు. 2013లో మైనర్‌పై రేప్ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు. -
ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!
హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. గత ఏప్రిల్‌లో ఆయనను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘ జింబాబ్వే పితామహుడు రాబర్ట్ ముగాబే మనకిక లేరు’ అని దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మన్‌గాగ్వా ట్విట్టర్లో వెల్లడించారు. నాడు స్వాతంత్య్రం కోసం గెరిల్లా పోరు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రొడేషియాలో (ఇప్పటి జింబాబ్వే) 1924వ సంవత్సరం ఫిబ్రవరి 21న ముగాబే జన్మించారు. చిన్నప్పట్నుంచి విప్లవ భావాలు కలిగిన ముగాబే 1964లో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. అందుకు 10 సంవత్సరాలకుపైగా విచారణ లేకుండానే జైలు జీవితం అనుభవించారు. జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను)కి వ్యవస్థాపక సభ్యుడైన ముగాబే ఆ తర్వాత 1973లో దానికి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఏడాది జైలు నుంచి విడుదలై తెల్లదొరల పాలనలో ఉన్న రొడేషియా విముక్తి కోసం గెరిల్లా తరహా పోరాటాలు చేశారు. సంక్షోభ సమయాల్లో సంప్రదింపులు జరపడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన ముగాబే ఆ తర్వాత రాజకీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయన పోరాటాల ఫలితంగా జింబాబ్వే స్వతంత్ర దేశమయింది. 1980లో జరిగిన తొలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు. ఒక స్వాతంత్య్ర వీరుడిగా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడటంతో పాటు, స్వాతంత్య్రం వచ్చాక నల్లజాతీయులకు ఆరోగ్యం, విద్య అందేలా అవిరళ కృషి చేశారు. తొలి 20 ఏళ్లలో మంచి పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. 2000వ సంవత్సరం నుంచే ముగాబే పతనం మొదలైంది. అధికారం కోల్పోతానేమోనన్న అభద్రతా భావంలో ఆయన నియంతలా మారారు. 2000లో ముగాబే తెచ్చిన భూ సంస్కరణ విధానాలు బెడిసి కొట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయింది. తెల్లజాతీయుల నుంచి భూములు లాక్కున్నారు. సైన్యం అండతో 17 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని వణికించేశాయి. 37 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లోనూ అసమ్మతి పేరుకుపోయింది. వయోభారంతో ఇక పదవిలో కొనసాగలేనని భావించిన ముగాబే 2017లో తన భార్య గ్రేస్‌కు అధ్యక్ష పీఠం అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసి గద్దె దింపింది. -
అందరివాడు
రాజకీయాల్లో అందరి మనసులూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్‌జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్‌లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు. వాదనలో పదునెక్కువ గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్ రామ్‌జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. తెరవెనుక వ్యూహకర్త జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు. ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నిక కాలేదు... ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు. మోదీకి ప్రధాన మద్దతుదారు వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్ సీఎంగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీతో.. క్రికెట్ అంటే ప్రాణం న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జైట్లీ అస్తమయం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతగా.. కష్టకాలంలో బీజేపీని అదుకున్న మూలస్తంభాల్లో ఒకరిగా అభిమానుల గుండెల్లో ఆయన స్థానం చెరగనిది. సుష్మాస్వరాజ్ వంటి మహానేత హఠాన్మరణాన్ని (ఆగస్టు 6న) మరవక ముందే.. అదేతరానికి చెందిన జైట్లీ వంటి మరో రాజకీయ ప్రముఖుడిని కోల్పోవడం దేశానికి మరీ ముఖ్యంగా బీజేపీకి పెద్దలోటు. ఆగస్టు 9న శ్వాస ఇబ్బందులతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారని ఏయిమ్స్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ జైట్లీ మృతి బీజేపీకి తీరని శోకాన్ని మిగిల్చింది. జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. పార్టీలకతీతంగా అభిమానం పొంది.. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనలో జైట్లీ చొరవను ప్రశంసించకుండా ఉండలేం. స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఏకాభిప్రాయంతో అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేశారు. నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో జైట్లీది క్రియాశీలక పాత్ర. కీలక వ్యూహకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అందరికీ గుర్తే. ఆర్థిక శాఖతోపాటు రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి కీలక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారు. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలై.. బీజేపీలో ఉన్నతస్థానానికి చేరినా.. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల జోలికి ఆయనెప్పుడూ వెళ్లలేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా నడవడం వెనక కూడా జైట్లీ కృషి చాలా ఉంది. రాజకీయాల్లో ఉంటూ.. న్యాయవాదిగా పలు ముఖ్యమైన కేసుల్లో తనముద్ర వేశారు. ప్రముఖ కంపెనీలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా ఆయన పనిచేశారు. బీజేపీలో ఆయనో ట్రబుల్ షూటర్‌గా పేరు సంపాదించారు. విషాదంలో బీజేపీ శ్రేణులు... సుష్మాస్వరాజ్ మృతి నుంచి తేరుకోకముందే మరో అగ్రనేత జైట్లీని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదంలో (విషాదం) మునిగిపోయాయి. జైట్లీ ఇకలేరనే వార్త తెలియగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు. భౌతికకాయం జైట్లీ ఇంటికి చేరాక అక్కడికి కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. బీజేపీలో కొత్తతరం నేతలకు స్ఫూర్తిగా నిలిచే జైట్లీ... 2019 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించక బహిరంగ సభలకు వెళ్లకపోయినా.. పార్టీ కార్యాలయం నుంచే ప్రెస్మీట్ల ద్వారా విపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం, పాలన సమర్థవంతంగా మందుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు. పార్టీ ట్రబుల్ షూటర్: అడ్వాణీ ‘అందరినీ కలుపుకుని పోయేవాడిగా.. పార్టీలకు అతీతంగా జైట్లీ అందరి మదిలో ఉంటారు. జైట్లీ భోజన ప్రియుడు. మంచి రెస్టారెంట్ అనిపిస్తే.. అక్కడోసారి భోజనం చేయండని సూచించేవాడు. ప్రతి దీపావళికి కుటుంబసమేతంగా ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పేవాడు’ అని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అడ్వాణీ గద్గదస్వరంతో జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు కూడా జైట్లీ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జైట్లీల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. గతేడాది నుంచే అనారోగ్యంతో.. 2014లో ఆయన బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. గతేడాది మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మృదు కణజాల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీంతో 2019 ఎన్నికల్లో పోటీపై విముఖత చూపించటమే కాక... భారీ విజయం సాధించిన తర్వాత కేబినెట్లో తనకు చోటు వద్దని కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖుల నివాళి దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్షవర్ధన్, జితేంద్ర సింగ్, ఎస్ జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ శుక్లా కూడా ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరణవార్త విని బాధపడ్డాను: సీజేఐ ‘దేశం ఓ ఉన్నతమైన సీనియర్ లాయర్, గొప్ప నేతను కోల్పోయింది. ఆయన మరణ వార్త వినగానే బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. న్యాయవాదిగా ప్రస్థానం జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ. తల్లి రతన్ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, జనతాదళ్ నేత శరద్‌యాదవ్ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీత. ఆయనకు కుమారుడు రోహన్, కుమార్తె సొనాలీ. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. జైట్లీ పార్థివ దేహం వద్ద అమిత్ షా నివాళి, జైట్లీ భార్య సంగీతను ఓదారుస్తున్న సోనియా 2001లో వాజ్‌పేయితో.. 2004లో కలకత్తా హైకోర్టులో లాయర్‌గా.. 1974లో ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా.. -
నట గురువు ఇక లేరు
రజనీకాంత్, చిరంజీవి ఇప్పటి సూపర్‌స్టార్స్. కానీ వాళ్లకు నటనలో ఓనమాలు దిద్దించిన నటగురువు దేవదాస్ కనకాల. వీరే కాదు రాజేంద్రప్రసాద్, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రఘువరన్, రాంకీ వంటి నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవదాస్ కనకాల ప్రయాణం సాగింది. నిన్నటితో ఆ ప్రయాణం ఆగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం దేవదాస్ కనకాల మృతి చెందారు. 1945 జూలై 30 యానాంలోని కనకాల పేటలో కనకాల పాపయ్య, మహాలక్ష్మికి జన్మించారు. ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు వీరి తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. దేవదాస్ కనకాల విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సినిమా కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యనభ్యసించిన తర్వాత నటనలో శిక్షణ కేంద్రం స్థాపించారు. ఎందరో నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పంపించారాయన. చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటుడిగా ‘ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్‌లీడర్, మంచు పల్లకి. అమ్మో ఒకటో తారీఖు, మల్లీశ్వరీ, కింగ్, అసాధ్యుడు’ వంటి సినిమాల్లో నటించారు. ‘అమృతం’ టీవీ సీరియల్లో కూడా నటించారు. ‘చలి చీమలు, నాగవల్లి’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురుదక్షిణగా రజనీకాంత్ తన డేట్స్ ఇచ్చినప్పటికీ దేవదాస్ కనకాల తిరస్కరించారట. 1971 నవంబర్ 21న లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు రాజీవ్ కనకాల, శ్రీ లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ ప్రముఖ యాంకర్. శ్రీ లక్ష్మి నాటక రంగ ప్రముఖులు డా. పెద్ది రామారావును వివాహం చేసుకున్నారు. 2018లో దేవదాస్ భార్య లక్ష్మీ దేవి మరణించారు. భార్య దూరం అయిన బాధలో దేవదాస్ ఎక్కువ శాతం ఇంటికే పరిమితం అయ్యారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్ కనకాల మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శనివారం ఉదయం మణికొండలోని స్వగృహానికి దేవదాస్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తారు. ఉదయం 11.30. తర్వాత అంత్యక్రియలు ఆరంభమవుతాయి. భార్య లక్ష్మీదేవి, కొడుకు, కోడలు రాజీవ్, సుమలతో...దేవదాస్ కనకాల -
తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు
-
మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్(64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హర్యాణాలోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయన్ని సోమవారం మేఘాలయాకు తరలించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. డోంకుపర్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కీలకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. దీంతో ఆయన 2018లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డోంకుపర్ రాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘మేఘాలయ స్పీకర్‌గా, మాజీ ముఖ్యమంత్రిగా డోంకుపర్ రాయ్ విశేషమైన సేవలు అందించారు. అదేవిధంగా మేఘాలయ అభివృద్ధికి కృషి చేశారు. చాలా మందికి సాయం అందించి వారి జీవితాలను మార్చారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతున్నాన’ని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా డోంకుపర్ అకాల మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి నాయకున్ని, మెంటర్ని కోల్పోయామని తెలిపారు. ఆయన ఎంతో మందికి అంకితభావంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. -
షీలాకు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో ముగిశాయి. ఇక్కడి నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. షీలాకు నివాళులర్పించిన వారిలో బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎంలు అశోక్ గహ్లోత్, కమల్‌నాథ్ తదితరులు ఉన్నారు. ఆమె నివాసం నుంచి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతోపాటు, చివరగా బాధ్యతలు నిర్వహించిన ఢిల్లీ కాంగ్రెస్ విభాగం కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా అనేక రంగాలకు చెందిన ప్రజలు ఆమెకు నివాళులర్పించారు. -
హస్తిన హ్యాట్రిక్ విజేత
ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. 81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్. ఆసక్తికరం...షీలా ప్రేమాయణం! ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్‌కు వినోద్ దీక్షిత్‌తో పరిచయమైంది. వినోద్ దీక్షిత్ కాంగ్రెస్ నేత ఉమా శంకర్ కొడుకు. వినోద్ చురుకైన వాడు, మంచి క్రికెటర్ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు. అనూహ్యంగా రాజకీయ ప్రవేశం షీలా మామ ఉమా శంకర్ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. వివాదాలు, పురస్కారాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు, 2009లో బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్ వేలెత్తి చూపించింది. -
షీలా దీక్షిత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్(81) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. షీలా మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. షీలా భౌతిక కాయాన్ని ఈస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. షీలా దీక్షిత్ శనివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స అందించింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి తాత్కాలికంగా కుదుటపడింది. కొద్ది సేపటి తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రముఖుల సంతాపం ఢిల్లీ సీఎంగా షీలా నగర రూపురేఖలనే మార్చేశారని, ఆమె ప్రజల మదిలో కలకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. షీలా మంచి పరిపాలనాదక్షురాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా సేవలు శ్లాఘనీయమని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మోదీ షీలా నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. షీలా మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ను ఆయన..అత్యంత ఆత్మీయురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమాన పుత్రికగా పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ప్రజా నేతలను కాంగ్రెస్ కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆమె మరణం తీరని నష్టమని, ఆమె సేవలను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. షీలా దీక్షిత్ కుమార్తె, కుమారుడికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఉంచారు. ‘మీ తల్లికి నా హృదయంలో గొప్ప స్థానముంది. నా భర్త రాజీవ్‌తో షీలాజీకి మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెతో నాకూ స్నేహం ఏర్పడింది. షీలాజీకి ఉన్న అనేక సుగుణాలను నేను అభిమానించడం ప్రారంభించాను. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, డీపీసీసీ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేశాం’ అని సోనియా పేర్కొన్నారు. సమర్ధురాలైన పాలకురాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: సీనియర్ రాజకీయవేత్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాదంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె మరణంతో దేశం ఒక సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. షీలా దీక్షిత్ పోరాట పటిమకు, సాహసానికి, చురుకుదనానికి పెట్టింది పేరని జగన్ కొనియాడారు. షీలా చివరి ఆదేశాలు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో ప్రతిష్టంభన తొలగని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగాలని పార్టీ కార్యకర్తలను షీలా దీక్షిత్ కోరినట్లు తెలుస్తోంది. యూపీలో పర్యటిస్తున్న ప్రియాంకను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం కూడా ఆమె నిర్బంధం కొనసాగినట్లయితే బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలపాల్సిందిగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ హోదాలో షీలా దీక్షిత్ కార్యకర్తలకు శుక్రవారం ఆదేశాలిచ్చినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అవసరమైతే ఆదివారం కూడా నిరసన కొనసాగించాలని కూడా ఆమె చిట్టచివరి ఆదేశాలు జారీ చేశారని పార్టీ నేత కిరణ్ వాలియా వివరించారు. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్ హోటళ్ల గ్రూప్ అధినేత పి.రాజగోపాల్ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్ స్థాపించిన శరవణ భవన్ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. -
ఆమె జీవిత మంత్రం అదే
గత గురువారం ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. ‘విజయ నిర్మలగారి మరణాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను’ అన్నారు మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్. విజయ నిర్మలను గుర్తు చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు నమ్రత. దాని సారాంశం ఈ విధంగా... ‘‘నా వరకూ ఆమె ఎన్నో స్కిల్స్ ఉన్న ఉమెన్. ఆవిడతో నేను పద్నాలుగేళ్లు ప్రయాణం చేశాను. ఆమె గురించి చెప్పాలంటే.. చాలా కేరింగ్, ఆత్మీయంగా ఉంటారు. ప్రేమ నిండిన మనిషి. డైనమిక్, స్ట్రాంగ్ అయినా కూడా ఫన్ని బాగా ఇష్టపడే వ్యక్తి. కాంప్రమైజ్ కాకూడదు అనేదే తన జీవిత మంత్రం. తన ఆలోచనలు, ఆచరణలను గమనిస్తే తనో నిజమైన విజనరీ అని మనం అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబానికి, తనను ఇష్టపడేవాళ్లకు సపోర్ట్ సిస్టమ్‌గా నిలబడ్డారు. విజయ నిర్మలగారూ... మిమ్మల్ని బాగా మిస్ అవ్వబోతున్నాం. మిమ్మల్ని మళ్లీ చూడలేము అనే విషయాన్నే ఊహించుకోలేకపోతున్నాను’’ అంటూ తన ఎమోషన్ని పంచుకున్నారు. -
నిర్మలాకాశం
-
ధీర విజయ
నటి. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. దర్శకురాలు. అక్కినేని, శివాజీ గణేశన్‌లను కూడా డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌పై తన సంతకం చేసింది. సహచరి. భర్త వేసే ప్రతి అడుగులోనూ భాగమవుతూ తన అడుగు చెరిగిపోకుండా కాపాడుకుంది. తల్లి. కుమారుడి వెన్నంటే ఉండి అతడి కెరీర్‌కు వెన్నెముకలా నిలిచింది. సంపూర్ణ స్త్రీ. సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది. విజయ నిర్మల సార్థక నామధేయి. వెండితెర విజయకేతనం. అన్ని విధాల ధీర విజయ. తెలుగువారి గర్వకారణాలలో తప్పక మెదిలే ఒక గొప్ప స్త్రీ ఉనికి. రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు. బాల సరస్వతి గాయని, నటి. ఆ రోజుల్లో సూపర్‌స్టార్. ఏడేళ్ల వయసులో ఒక రోజు విజయ నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాలసరస్వతి వచ్చి ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లింది. తెల్లవారి లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యం. ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యం. అది ఒక స్టూడియో. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాల నటి కావాలని బాల సరస్వతిని కోరితే విజయ నిర్మలను తీసుకొచ్చి నిలబెట్టింది. ఆ సినిమా పేరు ‘మచ్చరేకై’ (తమిళం). అలా వెండి తెర మీద బుజ్జిపాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది. ఘనమైనది కూడా. జయ కృష్ణా ముకుందా మురారి విజయ నిర్మలకు పన్నెండు పదమూడేళ్లు వచ్చాయి. ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నదే. తల్లి శకుంతల గృహిణే అయినా తండ్రి రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పని చేసేవారు. బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశమొస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు. విమల, విజయనిర్మల ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశమే ‘పాండురంగ మహత్య్మం’లో నటించే అవకాశం. అందులోని ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాటలో విజయ నిర్మల బాలకృష్ణునిగా నటించాలి. ‘మీనా’లో నాగరత్నమ్మ (కృష్ణ తల్లి), కృష్ణ, విజయనిర్మల అది ఎవరి పర్యవేక్షణలో? కృష్ణుడంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పర్యవేక్షణలో. ఎన్టీఆర్ విజయ నిర్మలను ఎంతో ప్రోత్సహించారు. అది చాలా పెద్ద పాట. ప్రతిరోజూ మేకప్‌ను ఆయనే సరిదిద్దడం, కళ్లచివర శంఖు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు. కొన్నిరోజుల షూటింగ్ జరిగింది. ఒకరోజు షాట్లో విజయ నిర్మల కళ్లు తిరిగి పడిపోయారు. రామారావు షూటింగ్ ఆపేశారు. మూడు నాలుగు రోజుల తర్వాత ‘నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది’ అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టితీసి మిగిలిన పాటను సెట్లోకి బయటివారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు. ఆ పాట తెలుగు సినిమాలలో, ఎన్టీఆర్ నటజీవితంలో దాంతోపాటు విజయ నిర్మల నట జీవితంలో కూడా నిలబడింది. ‘దేవదాసు’లో కృష్ణ పిలిచిన కేరళ గాలి తర్వాతి కాలంలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు గడించిన విన్సెంట్ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచారు. ఆయన వాహినిలో పని చేస్తున్నప్పుడు విజయ నిర్మల తండ్రికి స్నేహితుడయ్యాడు. విజయ నిర్మలను చూసి ‘మీ అమ్మాయి కళ్లు బాగున్నాయి. నేను మలయాళంలో ఒక ఘోస్ట్ సినిమా తీస్తున్నాను. ఆ పాత్రకు కళ్లు చాలా ముఖ్యం. హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను’ అంటే తండ్రి అంగీకరించారు. అలా విజయ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా ‘భార్గవి నిలయం’. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అక్కడ డజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈలోపు బి.ఎన్.రెడ్డి నుంచి ‘రంగుల రాట్నం’లో నటించడానికి పిలుపు వచ్చింది.. తెలుగులో తొలిసారి హీరోయిన్గా. ‘రంగుల రాట్నం’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా క్లాసిక్‌గా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది. ఎస్.వి. రంగారావును గెలిచింది తెలుగులో ‘షావుకారు’ను విజయా సంస్థ తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్’గా తీయదలిచింది. తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మలకు ఇచ్చారు. షూటింగ్ తొలిరోజు సెట్‌కు ఎస్.వి. రంగారావు వచ్చారు. విజయ నిర్మలను చూశారు. ‘ఏమిటి... ఈ అమ్మాయా నా మేనకోడలుగా చేసేది. ఏం బాగాలేదు. కె.ఆర్.విజయను పెట్టి తీయండి’ అని వెళ్లిపోయారు. విజయ నిర్మల చాలా అప్సెట్ అయ్యారు. చాన్స్ పోయినట్టే అనుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ విజయా సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఏమిటి... రంగారావు గారు ఒప్పుకున్నారా’ అంటే ‘కాదు.. ఆయననే మార్చేశాం. ఆయన ప్లేస్‌లో ఎస్.వి.సుబ్బయ్యను తీసుకున్నాం’ అని జవాబు వచ్చింది. అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల. అక్కడ కూడా ఆమె దాదాపు డజను సినిమాల్లో నటించారు. వచ్చాడు నా రాజు ఈ రోజు ఆ తర్వాత ఆమె నట జీవితం ఎలా ఉండేదో తెలియదు. కాని బాపు–రమణలు సొంత నిర్మాణ సంస్థ మొదలెట్టి తీసిన ‘సాక్షి’ సినిమాలో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది. కృష్ణ జీవితాన్ని కూడా. వారిరువురూ గోదావరి ప్రాంతంలోని ‘మీసాల కృష్ణుడి’ గుడిలో ‘అమ్మ కడుపు చల్లగా’ పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్ ముగించి బయటకు వస్తుంటే బయటే ఉన్న నటుడు రాజబాబు ‘ఇది మీసాల కృష్ణుడి గుడి. విజయనిర్మల, కృష్ణ చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది’ అని జోస్యం చెప్పారు. మూడు నాలుగు నెలలో అదే నిజమైంది. ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలలో నటిస్తున్న విజయ నిర్మల, కృష్ణ తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ అది ద్వితీయ వివాహమే. పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పెళ్లి ఆ సమయంలో ఇండస్ట్రీలో న్యూస్ క్రియేట్ చేసినా క్రమంగా అందరూ వారి జంటను ఆదరించారు. భర్తను డైరెక్ట్ చేసిన భార్య సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం. సెట్లో నటుడి కన్నా దర్శకుడిదే పై చేయి. కాని కృష్ణ, విజయ నిర్మలల మధ్య ఉండే అవగాహన, సామరస్యం, ప్రొఫెషనలిజమ్ అసాధారణమైనది. అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో కృష్ణ భేషజం లేకుండా, ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు. కృష్ణ సూపర్ డూపర్ హిట్స్‌లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ చేత ‘త్రిబుల్ యాక్షన్’ చేయించి విజయ నిర్మల తీసిన ‘రక్త సంబంధం’ సినిమా సంచలనం. కృష్ణ, విజయనిర్మల ఉన్నది కాసేపే అయినా ఈ సినిమాలు ఒకెత్తయితే ఉన్నది కాసేపే అయినా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు. ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట ‘వస్తాడు నా రాజు ఈరోజు’ ఎంత హిట్టో అందరికీ తెలుసు. విశేషం ఏమిటంటే కృష్ణతో పెళ్లయ్యాక కూడా ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్తబలం’ సినిమాలలో ఆయన చెల్లెలిగా విజయ నిర్మల నటించారు. ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ అభ్యంతర పెట్టకపోవడం వల్ల ‘బుద్ధిమంతుడు’, ‘తాతా మనవడు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’ వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. విజయనిర్మల, జ్యోతిలక్ష్మి కెరీర్‌ను హుందాగా నిలబెట్టుకొని విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు. ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకుని పొందేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా తన ప్రయారిటీస్‌ని ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు. వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు. ఎప్పుడూ డల్‌గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ బ్రైట్‌గా, గ్లామరస్‌గా, కృష్ణ పక్కన ఎనర్జిటిక్‌గా ఆమె కనపడేవారు. సినిమా రంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం. మార్గదర్శి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు. అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం వింత కాదు. కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థంగా నడపడం కచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశం. కృష్ణతో 47 సినిమాలలో తెలుగులో హిట్ పెయిర్స్ చాలా ఉన్నాయి. ఎన్.టి.ఆర్–జయలలిత, అక్కినేని–సావిత్రి, జమున–హరనాథ్... కానీ కృష్ణ–విజయ నిర్మల జోడి చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. వీరిరువురూ కలిసి 47 సినిమాలలో నటించారు. ‘అత్తగారు–కొత్త కోడలు’, ‘టక్కరిదొంగ–చక్కని చుక్క’, బందిపోటు భీమన్న’, ‘అమ్మ కోసం’.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. అయితే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో కృష్ణతో కలిసి గుర్రపు స్వారీ చేయడం, స్టంట్స్‌లో పాల్గొనడం దేనికీ తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల చేశారు. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’ ఈ సినిమాలన్నింటిలో వారి జంట రక్తి కట్టింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల నటన ఎన్నదగినదిగా నిలిచింది. కృష్ణగారిని ఒంటరిని చేసి వెళ్లారని తప్ప బహుశా అభిమానులకు వేరే ఫిర్యాదులుండే అవకాశం లేదు. జీవించినంత కాలం ప్రతిభా తరంగాలను ప్రసారం చేసిన విజయ నిర్మల మరణించాక దివ్య తరంగాలతో కృష్ణగారి సమక్షంలోనే ఉంటారని ఈ అభిమానులే ఊరట చెందుతారు. ఎందుకంటే అదే సత్యం. ఈ బహుముఖ సమర్థురాలికి తెలుగువారి ఘన నివాళి. – కె -
నిర్మలమైన మనసులు
కృష్ణగారు భర్తగా దొరకడం ఓ వరం నిర్మల ముక్కుసూటి మనిషి. అందుకే ఇష్టం... కృష్ణగారిది నిర్మలమైన మనసు... నిర్మలది మంచి మనసు... ‘సాక్షి’కి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూస్’లో ఇలా కృష్ణ, విజయ నిర్మల పలు విశేషాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. ► కృష్ణగార్ని మొదటెక్కడ చూశారు? విజయనిర్మల: మద్రాసులో ఓ సినిమా ఆఫీసులో చూశా. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలోంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నా. మా సినిమాలో ఆయనే హీరో అని తెలిసి సంతోషమేసింది. అదే ‘సాక్షి’ సినిమా. ► ఆ సినిమా అప్పుడే ప్రేమలో పడ్డారు కదా? అవును. ‘సాక్షి’లో చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిలా ఆయన చేయాలి. ఆ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. కృష్ణగారి నవ్వు నాకు మరీ నచ్చింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే నాకు కృష్ణగారంటే మనసులో ఓ ఇష్టం ఏర్పడింది. ఆ సినిమాలో మీసాల కృష్ణుడు టెంపుల్ సీన్ ఉంది. ఆ గుడిలో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త కడుపు చల్లగా, కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను. ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించారు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. ► కృష్ణగారు బిడియస్తులు అనిపిస్తుంటుంది. అసలాయన మీకు ఎలా ప్రపోజ్ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది. విజయ నిర్మల: ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని చంద్రమోహన్ అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అన్నాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అన్నారు. ► మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. మరి మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు? విజయ నిర్మల: (నవ్వుతూ). డేట్ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది (2018) 50వ సంవత్సరం. కృష్ణ: 1969 మార్చి 24 మా పెళ్లి రోజు. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్ చేసి విషెస్ చెబుతారు. మ్యారేజ్ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్ చేసి, చెబుతారు (నవ్వుతూ). విజయనిర్మల: ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుకే డేట్ చెప్పేశారు. ► ఇంతకీ కృష్ణగారిలో మీకు బాగా నచ్చిన అంశం? విజయనిర్మల: చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. తన పనేంటో తనేంటో అన్నట్లు ఉంటారు. అనవసరంగా ఒకర్ని నిందించడం, లేనిపోనివి మాట్లాడడం ఆయనకిష్టం ఉండదు. అది నాకు నచ్చింది. ఇక ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను.. లేకపోతే రానని కండీషన్ పెట్టిందట. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్ ఉండేది ఆయనకు. ► కృష్ణగారు ఎంతోమంది అందమైన నాయికల సరసన నటించారు కదా. మిమ్మల్నే ప్రేమించడానికి కారణం ఏమిటంటారు? విజయనిర్మల: దర్శకురాలైన తర్వాత నేను అందరితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను కానీ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్లో గ్యాప్ దొరికితే, నవల చదువుతూ కూర్చునేదాన్ని. నా పనేంటో నేనేంటో అన్నట్లుండేదాన్ని. కృష్ణగారు నన్నిష్టపడడానికి అదో కారణం అయ్యుంటుంది. ► మీరెందుకు నచ్చారో ఆయన్ను అడిగారా? విజయనిర్మల: ‘వంట బాగా చేస్తావు కాబట్టి ఇష్టం’ అన్నారు. ‘వంట కోసమే పెళ్లాడారా’ అంటే, ‘కాదు. నీ కళ్లంటే ఇష్ట’మని చెప్పారు. ► మీరు చేసే వంటల్లో కృష్ణగారికి బాగా నచ్చేవి? విజయ నిర్మల: అన్నీ ఇష్టమే. ఆయన కోసం తందూరీ చేయడం నేర్చుకున్నా. ముఖ్యంగా నేను చేసే చేపల పులుసంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నిర్మల చేసినట్లుగా ఎవరూ వంట చేయలేరు. ఆమె వంటలంటే నాకు చాలా ఇష్టం’ అని ఆయన అందరికీ చెబుతుంటారు. నాకెంత ఒంట్లో బాగాలేకపోయినా వంటలో నా చెయ్యి ఉండాల్సిందే. అప్పుడే ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ మధ్య నాకు చెయ్యి ఫ్రాక్చరై దాదాపు ఆరు నెలలు వంట చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. ► మామూలుగా కృష్ణగారు భోజనప్రియులా? విజయనిర్మల: ఒకప్పుడు! కానీ, ఇప్పుడు తిండి తగ్గిపోయింది. ► కృష్ణగారి మొదటి భార్యతో మీ అనుబంధం? విజయనిర్మల: మేమిద్దరం బాగానే ఉంటాం. ఓరకంగా క్లోజ్‌ఫ్రెండ్స్ అనొచ్చు. ఆవిడ మా ఇంటికి భోజనానికి వస్తుంది. నేను వాళ్లింటికి వెళతాను. ఆవిడ పుట్టినరోజుకు కేక్ తీసుకెళతాం. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. నన్ను ‘పిన్నీ’ అని పిలుస్తారు. నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. ► డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కృష్ణగారు మీకేమైనా ఆంక్షలు పెట్టేవారా? విజయనిర్మల: లేదు. ‘నీకు సౌకర్యంగా ఉన్న డ్రెస్‌లు వేసుకో’ అంటారు. పాత్రకు అనుగుణంగా డ్రెస్ ఉండాలంటారు. హెయిర్ స్టయిల్ విషయంలో మాత్రం కామెంట్ చేసేవారు. ఒకప్పుడు జుట్టును ఇంతెత్తున చేసి, ముడిలా వేసేవాళ్లు. ఆ స్టయిల్ చేసుకున్నప్పుడు ‘ఇదేంటి పిచ్చుక గూడులా ఉంది. బాగా లేదు’ అనేవారు (నవ్వుతూ). ► కృష్ణగారితో మీకు అనుబంధం పెరిగిన తర్వాత జరుపుకొన్న మీ తొలి పుట్టినరోజుకు ఆయన ఏం బహుమతి ఇచ్చారు? విజయ నిర్మల: మా మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజుకి గడియారం కొనిపెట్టారు. ప్యాక్ విప్పి చూసిన నాకు నవ్వాగలేదు. అది టేబుల్ క్లాక్. ఇష్టంగా ఇచ్చారు కాబట్టి, ఆ గడియారాన్ని చాలా ఏళ్లు పదిలంగా కాపాడుకున్నా. కృష్ణగారు బంగారు నగలు ఇష్టపడరు. ఎలాంటి కానుకలు కొనిపెట్టాలో మాత్రమే కాదు.. ఎలాంటి డ్రెస్సులేసుకోవాలో కూడా ఆయనకు తెలియదు. ► సూపర్‌స్టార్ డ్రెస్‌లన్నీ మీ సెలక్షన్ అన్నమాట? విజయనిర్మల: అవును. సినిమాల కోసం కాస్ట్యూమర్స్ సెలక్ట్ చేస్తారు. కానీ, విడిగా వేసుకునే బట్టలు మాత్రం నేనే కొంటాను. ► మీ మధ్య చిన్న చిన్న అలకలు.. గొడవలు..? విజయ నిర్మల: సంసారమన్నాక అలకలు కామన్. అయితే విడిపోయేంత గొడవలు ఎప్పుడూ రాలేదు. చెప్పిన టైమ్‌కి ఇంటికి రానప్పుడు, కోపం ప్రదర్శించేదాన్ని. కాసేపు మాట్లాడుకోకపోయినా, తర్వాత మామూలైపోతాం. ► మీ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. మరి, ఎలా గడుపుతున్నారు? విజయ నిర్మల: రోజూ పేపర్లు తిరగేస్తాం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తాం. క్రికెట్ మ్యాచ్ అప్పుడు మాత్రం ఆయనో టీవీ, నేనో టీవీ చూస్తాం. యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్లోనూ టీవీ పెట్టుకునేవారు కృష్ణగారు. క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి సినిమాలు చేసినప్పుడు మాత్రం పేకాట ఆడేవాళ్లం. ఎప్పుడూ ఆయనే విన్నర్. ► ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా? విజయ నిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్ అయ్యాం. బాధ అనిపించలేదు. ► కృష్ణగారు మీ భర్త కావడం వరం అనుకుంటారా? విజయ నిర్మల: కచ్చితంగా. ఒక మంచి జీవిత భాగస్వామి లభించడం తేలిక కాదు. భార్యలను హింసించే భర్తల కథలు సినిమాల్లో చూస్తున్నాం. విడిగా కూడా అలాంటి భర్తలు చాలామందే ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు మేలిమి బంగారం. ► అప్పట్లో కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్ అంటే క్రేజ్. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా? కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు. ► ఎక్కువ సినిమాలు చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆమె కెరీర్ విషయంలో మీ ప్రోత్సాహం గురించి? కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తన నరేషన్ కూడా బావుంటుంది. షాట్స్ కూడా బావుంటాయి. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు మీకెలా అనిపించేది? కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు. ► విజయ నిర్మలగారి డైరెక్షన్లో చేసిన సినిమాల విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైందా? కృష్ణ: ‘దేవదాసు’ సినిమా అప్పుడు కొంచెం డైలమాలో పడ్డాం. ఆ పిక్చర్ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్ చేయండని డిస్ట్రిబ్యూటర్స్ అడిగితే మాకు ఎక్కడ కట్ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీప్రసాద్ వంటి దర్శకులకు షో వేసి చూపించాం. సినిమా చూసి ఎల్వీ ప్రసాద్‌గారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్ చేయమంది? అన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. నేను సినిమా చూసి ఏడవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్ అయిపోయాను’ అని విజయకు కాల్ చేశారు. ► దర్శకురాలిగా చాలా త్వరగా సినిమాలు పూర్తి చేస్తారనే పేరు ఆమెకి ఉంది? కృష్ణ: అవును. ఓ సినిమాకి శివాజీ గణేశన్గారివి 30 రోజులు డేట్స్ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు. ► విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? కృష్ణ: తను చాలా కామ్ పర్సన్. దానికి తగ్గట్టు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్ మీద చాలా కమాండ్ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ముక్కుసూటితనం ఇష్టం. ► కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్ చేస్తారా? విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు. ► కృష్ణగారి బయోపిక్ తీస్తే ఒప్పుకుంటారా? విజయ నిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్ చేయాలి. మహేశ్ కూడా చాలా ఫాస్ట్. సెట్లో చాలా జోక్స్ వేస్తుంటాడు. కృష్ణగారికి జోక్ వేయడం కూడా రాదు. అలా దూరంగా ఉండిపోతారు. -
చిత్రపరిశ్రమకు తీరని లోటు
-
గట్టు భీముడికి కన్నీటి వీడ్కోలు
గట్టు: టీఆర్ఎస్ నేత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరలో నిర్వహించిన గట్టు భీముడి అంత్యక్రియలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నివాళులర్పించారు. గట్టు భీముడి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటా మని హామీనిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మంచి బీసీ నాయకుడిని కోల్పోయిందన్నారు. గట్టు భీముడి సతీమణి భువనేశ్వరి తమ కుటుంబానికి తీరని అన్యా యం జరిగిందని, మాకు న్యాయం చేయాలని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డిని కలవాలని, ఆయన ద్వారా మీకు న్యాయం చేస్తామని కేటీఆర్ చెప్పారు. అంత్యక్రియల్లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్ గట్టు భీముడి పాడెను మోశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథ«ం, తదితరులు గట్టు భీముడికి నివాళులు అర్పించారు. -
గిరీష్ కర్నాడ్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని రఘు తెలిపారు. ఆయన ఉదయం వేళలో మరణించారని, 8.30 సమయంలో ఆయన చనిపోయినట్టుగా తాము గుర్తించామని చెప్పారు. కాగా ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం గిరీష్ కర్నాడ్ భౌతికకాయాన్ని బయ్యప్పనహళ్లి రోడ్డులోని కల్లహళ్లిలో ఉండే విద్యుత్ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా.. కర్నాడ్ కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తితో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, నటులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, హెచ్డీ కుమారస్వామి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశ్‌పాండే, బి.జయశ్రీ, సురేష్ హెబ్లీకార్ తదితర నాటక, సినీరంగ ప్రముఖులు తమ అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలను తమ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నందున, అంతిమ నివాళుర్పించేందుకు నేరుగా స్మశానానికే రావాల్సిందిగా కర్నాడ్ కుటుంబం అంతకుముందు ఆయన అభిమానులకు, ప్రుముఖులకు విజ్ఞప్తి చేసింది. భారత సాహితీ రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా తన సొంత భాష కన్నడలో చేసిన గొప్ప రచనలకు గాను 1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: రంగస్థలంలో గిరీశ్ కర్నాడ్‌ది ప్రత్యేక స్థానమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. ‘ఆయన మృతి విచారం కలిగించింది. అన్ని మాధ్యమాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్ కలకాలం గుర్తుండి పోతారు. ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది..’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా తామొక సాంస్కృతిక రాయబారిని కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. వైఎస్ జగన్ సంతాపం గిరీష్ కర్నాడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్ మరణం అటు సినీ రంగానికి, ఇటు సాహితీ రంగానికి తీరని లోటు అని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్నాడ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక, సాహిత్య, సినీ రంగానికి ఆయన చేసిన సేవ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు. -
నవ్వులు వెలవెలపోయాయి
తమిళ నాటక రచయిత, హాస్యనటుడు, డైలాగ్ రైటర్ ‘క్రేజీ’ మోహన్ సోమవారం తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 1952 అక్టోబర్ 16న జన్మించిన ‘క్రేజీ’ మోహన్ అసలు పేరు మోహన్ రంగాచారి. కాలేజీ రోజుల్లో నుంచే నాటకాలు రాసి, అందులో నటిస్తుండేవారు. అలా రాసిన ‘గ్రేట్ బ్యాంక్ రోబరీ’ స్కిట్‌కు ఉత్తమ రచయితగా, ఉత్తమనటుడు అవార్డ్‌ను కమల్‌హాసన్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన రాసిన మొదటి నాటకం ‘క్రేజీ థీవ్స్ ఇన్ పాలవాక్కమ్’. ఈ నాటకం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మోహన్ రంగాచారిని, ‘క్రేజీ’ మోహన్‌గా మార్చింది. ఈ నాటకం ఆధారంగా ఓ టీవీ సీరియల్ కూడా స్టార్ట్ చేశారు. తమ్ముడు మధు బాలాజీ డ్రామా ట్రూప్‌కు ఎక్కువగా నాటకాలు రాసేవారు మోహన్. వేరే ప్రొడక్షన్స్ వాళ్లకు చాలా నాటకాలు రాసిన తర్వాత 1979లో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి, దానికి ‘క్రేజీ క్రియేషన్స్’ అని నామకరణం చేశారు. 30కి పైగా నాటకాలు, 6,500 స్టేజిషోలు చేశారు. మోహన్ నాటకాల్లో వాళ్ల అన్నయ్య మధు బాలాజీ హీరోగా నటించేవారు. ‘క్రేజీ’ మోహన్ రచించిన ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ సెలూన్’ నాటకం ఆధారంగా కె. బాలచందర్ ‘పోయికల్ కుదిరై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో డైలాగ్ రైటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించారు మోహన్. ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ కామెడీ సినిమాలకు తనవంతు మాటల సాయం చేశారాయన. ‘క్రేజీ’ మోహన్ ఎక్కువగా కమల్ హాసన్‌తో పనిచేశారు. ‘సతీ లీలావతి, కాదలా కాదలా (నవ్వండి లవ్వండి), మైఖేల్ మదన కామరాజు, విచిత్రసోదరులు, ఇంద్రన్ చంద్రన్ (ఇంద్రుడు–చంద్రుడు), భారతీయుడు, భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, వసూల్ రాజా ఎంబీబీఎస్’ వంటి సినిమాలకు కలసి పనిచేశారు. ‘అరుణాచలం, రక్షకుడు’ సినిమా చేశారు. నటుడిగా కమల్‌హాసన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిశారు మోహన్. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ‘క్రేజీ’మోహన్‌ను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘స్నేహానికి అంతం అనేదే ఉండదు. మనిషి బతికి ఉంటేనే స్నేహం ఉంటుందా? మోహన్ కామెడీ ఆయన సినిమాల ద్వారా ఆయన అభిమానులలో నిలిచే ఉంటుంది. మోహన్లోనాకు బాగా నచ్చే క్వాలిటీ ఆయన చిన్నపిల్లాడిలాంటి మనస్తత్వం. అందరికీ ఉండేది కాదది. ‘క్రేజీ’ అనే టైటిల్ అతనికి సూట్ కాదు. అతనో ‘కామెడీ జీనియస్’’ అని పేర్కొన్నారు కమల్ హాసన్. కమల్ హాసన్, మోహన్ -
నటుడు బోస్ ఇక లేరు
ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. సుమన్ హీరోగా తెరకెక్కిన ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్ తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. ఆయన ఎక్కువగా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్ ‘ఇడియట్, నిన్నే పెళ్లాడతా, అల్లరి రాముడు, శివమణి’ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు ‘ప్రేమఖైదీ’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. బోస్ మృతిపట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.