
వీరేంద్ర కుమార్ (ఫైల్)
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్‌డీ దేవెగౌడ కేబినెట్‌లలో బాధ్యతలు నిర్వహించారు.