Mathrubhumi
-
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయామ్స్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మత్) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరీ (అమర్ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పీ రెడ్డి (సాక్షి), వివేక్ గొయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), అతిదేవ్ సర్కార్ (టెలిగ్రాఫ్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ఐ.వెంకట్ (ఈనాడు), జయంత్ మమెన్ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
జర్నలిస్టు ఇంట్లో చోరీ : దారుణం
తిరువనంతపురం: కేరళలో దారుణమైన చోరీ కలకలం రేపింది. స్థానిక పత్రిక మాతృభూమి కన్నూర్ ఎడిటర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి, భార్యభర్తలను తీవ్రంగా గాయపర్చిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. కన్నూర్ జిల్లా, తజే చొవ్వ ప్రాంతంలో గురువారం తెల్లవారు ఝామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నలుగురు దొంగల ముఠా మాతృభూమి సంపాదకుడు వినోద్ చంద్రన్ ఇంటిలోకి చొరబడ్డారు. వినోద్, ఆయన భార్య సరితను, కళ్లకు గంతలు కట్టి, తాళ్లతో కట్టేసి బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. 35వేల నగదు, 25 తుపాల బంగారాన్ని దోచుకున్నారు. అంతేనా ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఎత్తుకు పోయారు. దాదాపు గంటసేపు స్వైర విహారం అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. అయితే పొరుగువారి సాయంతో బాధితులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన వినోద్ దంపతులు ప్రస్తుతం ఎ.కె.జి. మెమోరియల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కన్నూర్ నగర సిఐ ప్రదీపన్ కన్నిప్పాయిల్ తెలిపారు. నేరస్తులు హిందీ, ఇంగ్లీషుల్లో సంభాషించుకున్నారని, ఇది బయటి ముఠా పనికావచ్చనే అనుమానాలను వ్యక్తంచేశారు. సీఐతోపాటు కన్నూర్ డీఎస్పీ ఆధ్వర్యంలోఒక కమిటీ విచారణ చేపట్టిందన్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిట్లు తెలిపారు. మరోవైపు దీనిపై పలు అధికార,ప్రతిపక్ష పార్టీనేతలు తీవ్రంగా స్పందించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మంత్రి రామచంద్రన్‌పోలీసులను ఆదేశించారు. -
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్‌లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: మలయాళ టీవీ చానల్ ‘మాతృభూమి న్యూస్’కు చెందిన ప్రముఖ యాంకర్‌పై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) ఖండించింది. ఇలాంటి చర్యలతో కేరళ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛకు, స్వతంత్రంగా ఆలోచించి, మాట్లాడే సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని ప్రభుత్వానికి ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. -
లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్ అరెస్ట్
తిరువనంతపురం: ప్రముఖ మలయాళం న్యూస్ చానల్ మాతృభూమి కి చెందిన సీనియర్ జర్నలిస్టుపై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలతో మాతృభూమి ఛానల్ సీనియర్ న్యూస్ ఎడిటర్ అమాల్ విష్ణుదాస్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విష్ణుదాస్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మంగళవారం డీసిపికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ స్పర్జన కుమార్ ధృవీకరించారు. మహిళా ఉద్యోగిపై లైంగికఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం విష్ణుదాస్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు.సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్ తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే ఆమెకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చాడు . అయితే విడాకులు మంజూరైన తరువాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించాడు. దీంతోపాటుగా విష్ణుదాస్ తండ్రి వైద్య ఖర్చుల పేరుతో తన దగ్గర భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. -
హ్యాపీ హ్యాపీగా.. లేడీస్ స్పెషల్
లేడీస్ స్పెషల్.. ఫలక్‌నుమా టు లింగంపల్లి ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు కాదు ఎక్కే రైలు ఇంకో జీవితానికి రూటు! అదో మినీ లోకం.. ఎంత దగ్గరి ప్రయాణమైనాసరే దూరంగా ఉన్న ప్రపంచానికి కిటికీ తెరుస్తోంది. మెట్రోసిటీల్లోని బిజీ జీవితాల్లో లేని తీరికను ఈ జర్నీ చెంతచేరుస్తోంది. హైదరాబాద్‌లో ఈ బాధ్యతను ఎమ్ఎమ్టీఎస్ మోసుకొని తిరుగుతోంది. లేడీస్ కోసం స్పెషల్‌గా మాతృభూమి అనే పేరుపెట్టుకొని మరీ సర్వీస్ ఇస్తోంది. ఆ ట్రావెలింగ్ గురించే ఈ స్టోరీ.. లోకల్ ట్రైన్లో జర్నీ అంటే జనాలు బాగా కనెక్ట్ అయ్యేది ముంబైలోనే! అక్కడి ఏ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి కిందకు చూసినా సరే.. ప్లాట్‌ఫాం మీద ఆగిన లోకల్ ట్రైన్ ద్వారాలు లిప్త పాటులో కొన్ని వందల మందిని అక్కున చేర్చుకుంటాయి.. కొన్ని వందల మందిని తమ ఒళ్లోంచి దింపేస్తుంటాయి. వేగమే తప్ప లొల్లిలేని ఈ క్రమం గొప్ప జీవన సత్యాన్ని చెప్పకుండా చూపిస్తుంది. అందుకేనేమో కేవలం ఈ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఆధారంగా ముంబై లైఫ్ స్టైల్‌ను 60 సెకన్లలో అవగతం చేసిన షార్ట్ ఫిల్మ్స్ అనేకం చాలా మందికి ఫేవరేట్స్‌గా నిలిచాయి. కోసుల దూరాన్ని ఉదయం ఆరిటింకే మొదలుపెట్టి.. కంపార్ట్మెంట్లను కూరలు తరుక్కునే వంట గదులుగా.. ఉప్పోసను వెళ్లగక్కుకొనే ఫ్రెండ్షిప్ సెంటర్స్‌గా.. కూరగాయలు దొరికే అంగడిగా.. రబ్బరు గాజులు, రిబ్బన్ పూలు అమ్మే ఫ్యాన్సీ స్టోర్స్‌గా.. ఒక్కటేంటి సమస్తం అందుబాటులోకి తెచ్చి ఆ రద్దీలోనే బతుకు మెళకువలు నేర్పి సాయంత్రం ఆరు గంటలకల్లా ఆ ప్రయాణాన్ని ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిల్చి ఇంటికి చేరుస్తుంది. ఇది ముంబై లోకల్‌ట్రైన్ విండో మనకు చూపించే అక్కడి జీవన చిత్రం! హైదరాబాద్ సిటీ వేగాన్ని కూడా మెల్లమెల్లగా ఎమ్ఎమ్టీఎస్.. రానున్న మెట్రోరైల్‌తో కలసి సౌకర్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. దీనికి మూవింగ్ ఎగ్జాంపుల్ ‘మాతృభూమి’ లేడీస్ స్పెషల్! ఫలక్‌నుమా టు లింగంపల్లి నాలుగేళ్ల కిందట అచ్చంగా ఆడవాళ్ల కోసమే మొదలైన ఈ ఎమ్ఎమ్టీఎస్ సర్వీస్.. ఫలక్‌నుమాలో ఉదయం 8.30 గంటలకు తొలికూత పెడుతుంది. వయా ఉప్పుగూడ, మలక్‌పేట, కాచిగూడ, సికింద్రాబాద్, హైటెక్ సిటీ.. గమ్య స్థానం లింగంపల్లి చేరే వరకు తొమ్మిదిన్నరవుతుంది. ప్రయాణం గంటే అయినా తోటివారితో పెనవేసుకునే ఆత్మీయానుబంధాలు జీవిత కాలం మిగిలిపోతాయి. గీతమ్స్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదివే సాయిప్రియ ఫలక్‌నుమాలో ఉంటున్న తన తండ్రిని చూడాలనుకున్నప్పుడల్లా ఈ మాతృభూమి లేడీస్ స్పెషలే ఎక్కుతుంది. ‘ఎవ్రీ వీకెండ్ మా డాడీని చూడటానికి ఫలక్‌నుమా వస్తుంటా. శనివారం సాయంత్రం కాలేజ్ అయిపోగానే మాతృభూమి క్యాచ్ చేస్తా. మళ్లీ సోమవారం ఉదయం ఇదే ట్రైన్ పట్టుకొని రిటర్న్ అవుతా. ఫలక్‌నుమా నుంచి నా డెస్టినేషన్ వెళ్లడానికి చాలా ఎమ్ఎమ్టీఎస్ సర్వీసులు ఉన్నాయి. కానీ మగవాళ్ల తోపులాటల మధ్య ఆ ట్రైన్స్ ఎక్కడం నరకం. వాటిల్లో లేడీస్ కంపార్ట్మెంట్స్ ఉన్నా అందులోకీ మగవాళ్లు జొరబడ్తారు. అందుకే పీక్ అవర్స్‌లో ఈ లేడీస్ స్పెషల్ చాలా రష్‌గా ఉన్నా దీనినే ప్రిఫర్ చేస్తా. బోగీకో లేడీకానిస్టేబుల్ ఎస్కార్ట్‌గా ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా డెస్టినేషన్ చేరుతాం. ఈ రోజుల్లో లేడీస్‌కి అత్యంత అవసరం ఈ భద్రతే కదా! అందరూ లేడీసే ఉంటారు కాబట్టి హడావుడిలో ఏ బోగీ ఎక్కినా భయం ఉండదు. అంతేకాదు నేను ఫ్రీక్వెంట్‌గా చేసే ఈ జర్నీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. డియరెస్ట్ వన్స్గా మారినవారూ ఉన్నారు’ అని చెప్పింది మాతృభూమి ప్రయాణం గురించి. వర్కింగ్ విమెన్ శాతం పెరుగుతుంది కాబట్టి ఈ లేడీస్ స్పెషల్ ట్రైన్ సంఖ్య పెంచితే బాగుంటుందని ఆ అమ్మాయి అభిప్రాయం. ఇంట్లో ఉన్నట్టే ఉంటది.. అలివేలు అనే ఓ అమ్మ రోజూ ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు వెళ్తుంది. అక్కడ ఓ మర్వాడీ ఇంట్లో వంటచేస్తుంటుంది. ఆమె తన ప్రయాణంలో భద్రత కోసం ఈ మాతృభూమినే ఎంచుకుంది. కారణం.. ‘అందరూ ఆడోళ్లుండే ఈ రైల్లో నిమ్మళంగా పోవచ్చు. మీదికెళ్లి పోలీసులు కూడా ఉంటరు.. మొగోళ్లను ఎక్కనియ్యకుండ స్ట్రిక్టుగుంటరు. ఏ డబ్బాల ఎక్కినా మనింట్ల ఉన్నట్టే ఉంటది నాకైతే. సాయంత్రం కొలువు నుంచి వచ్చేటప్పుడైతే ఈళ్లందరితో మాట్లాడితే పొద్దంత పడ్డ కష్టం తుడిచినట్టే పోతది’ అని చెప్తుంది. సేఫ్ అండ్ హ్యాపీ.. గాయత్రి అనే సాఫ్ట్వేర్ ప్రయాణికురాలిదీ ఇలాంటి అనుభూతే! ‘నేను యూజువల్‌గా మాతృభూమినే క్యాచ్ చేస్తా. ఇందులో జర్నీ సేఫే కాదు హ్యాపీ కూడా! ఉదయం చూడాలి.. భలే ఉంటుంది.. కొంత మంది లలితాసహస్ర నామాలు, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు.. కొంతమంది తమ మనసులో బాధనంతా పక్కవాళ్లతో వెళ్లబోసుకుంటుంటారు. మాలాంటి సాఫ్ట్వేర్స్ అయితే మా ల్యాప్‌టాప్‌తో టైమ్‌పాస్ చేస్తుంటాం. కొంతమంది పుస్తకాలు చదువుకుంటారు. ఇందులో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాం కదా.. ఈ ట్రైన్లో నాకు చాలామందే ఫ్రెండ్స్ ఉన్నారు. పొద్దున ఎనిమిదిన్నరకే ఎక్కుతాం కాబట్టి ట్రైన్లో అందరం కలిసి టిఫిన్ షేర్ చేసుకుంటూ తింటాం. ఇలాంటి మంచి మంచి ఎక్స్‌పీరియెన్స్ ఎన్నో.. ఈ ట్రైన్లో’ అని లేడీస్ స్పెషల్ జర్నీని వివరించింది గాయత్రి. గమ్యం.. ఈ మాటల ప్రయాణం అంతలోకే లింగంపల్లి చేరుకుంది. ఈలోపు ఎన్నో మజిలీలు.. ఎందరో ప్రయాణికులు.. స్టూడెంట్స్.. వెజిటేబుల్ వెండర్స్... అత్తగారింట్లో ఉన్న బిడ్డను చూడ్డానికి వెళ్లే తల్లులు.. హాస్పిటల్లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బయలుదేరిన శ్రేయోభిలాషులు.. వీళ్లందరినీ గమ్యం చేర్చేందుకు పట్టాల మీద అలుపులేని పరుగుతో మాతృభూమి. మాటలు కరువై పక్కనే ఉంటున్నా.. మనుషులు అలికిడి పట్టని నాగరీకులకు ఓ ఆత్మీయ వేదికగా సాగుతున్న ఈ ప్రయాణం శుభప్రదం కావాలి!