హ్యాపీ హ్యాపీగా.. లేడీస్ స్పెషల్
లేడీస్ స్పెషల్.. ఫలక్‌నుమా టు లింగంపల్లి ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు కాదు ఎక్కే రైలు ఇంకో జీవితానికి రూటు! అదో మినీ లోకం.. ఎంత దగ్గరి ప్రయాణమైనాసరే దూరంగా ఉన్న ప్రపంచానికి కిటికీ తెరుస్తోంది. మెట్రోసిటీల్లోని బిజీ జీవితాల్లో లేని తీరికను ఈ జర్నీ చెంతచేరుస్తోంది. హైదరాబాద్‌లో ఈ బాధ్యతను ఎమ్‌ఎమ్‌టీఎస్ మోసుకొని తిరుగుతోంది. లేడీస్ కోసం స్పెషల్‌గా మాతృభూమి అనే పేరుపెట్టుకొని మరీ సర్వీస్ ఇస్తోంది. ఆ ట్రావెలింగ్ గురించే ఈ స్టోరీ..
లోకల్ ట్రైన్‌లో జర్నీ అంటే జనాలు బాగా కనెక్ట్ అయ్యేది ముంబైలోనే! అక్కడి ఏ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి కిందకు చూసినా సరే.. ప్లాట్‌ఫాం మీద ఆగిన లోకల్ ట్రైన్ ద్వారాలు లిప్త పాటులో కొన్ని వందల మందిని అక్కున చేర్చుకుంటాయి.. కొన్ని వందల మందిని తమ ఒళ్లోంచి దింపేస్తుంటాయి. వేగమే తప్ప లొల్లిలేని ఈ క్రమం గొప్ప జీవన సత్యాన్ని చెప్పకుండా చూపిస్తుంది. అందుకేనేమో కేవలం ఈ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఆధారంగా ముంబై లైఫ్ స్టైల్‌ను 60 సెకన్లలో అవగతం చేసిన షార్ట్ ఫిల్మ్స్ అనేకం చాలా మందికి ఫేవరేట్స్‌గా నిలిచాయి.
కోసుల దూరాన్ని ఉదయం ఆరిటింకే మొదలుపెట్టి.. కంపార్ట్‌మెంట్లను కూరలు తరుక్కునే వంట గదులుగా.. ఉప్పోసను వెళ్లగక్కుకొనే ఫ్రెండ్‌షిప్ సెంటర్స్‌గా.. కూరగాయలు దొరికే అంగడిగా.. రబ్బరు గాజులు, రిబ్బన్ పూలు అమ్మే ఫ్యాన్సీ స్టోర్స్‌గా.. ఒక్కటేంటి సమస్తం అందుబాటులోకి తెచ్చి ఆ రద్దీలోనే బతుకు మెళకువలు నేర్పి సాయంత్రం ఆరు గంటలకల్లా ఆ ప్రయాణాన్ని ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిల్చి ఇంటికి చేరుస్తుంది. ఇది ముంబై లోకల్‌ట్రైన్ విండో మనకు చూపించే అక్కడి జీవన చిత్రం! హైదరాబాద్ సిటీ వేగాన్ని కూడా మెల్లమెల్లగా ఎమ్‌ఎమ్‌టీఎస్.. రానున్న మెట్రోరైల్‌తో కలసి సౌకర్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. దీనికి మూవింగ్ ఎగ్జాంపుల్ ‘మాతృభూమి’ లేడీస్ స్పెషల్!
ఫలక్‌నుమా టు లింగంపల్లి
నాలుగేళ్ల కిందట అచ్చంగా ఆడవాళ్ల కోసమే మొదలైన ఈ ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీస్.. ఫలక్‌నుమాలో ఉదయం 8.30 గంటలకు తొలికూత పెడుతుంది. వయా ఉప్పుగూడ, మలక్‌పేట, కాచిగూడ, సికింద్రాబాద్, హైటెక్ సిటీ.. గమ్య స్థానం లింగంపల్లి చేరే వరకు తొమ్మిదిన్నరవుతుంది. ప్రయాణం గంటే అయినా తోటివారితో పెనవేసుకునే ఆత్మీయానుబంధాలు జీవిత కాలం మిగిలిపోతాయి. గీతమ్స్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదివే సాయిప్రియ ఫలక్‌నుమాలో ఉంటున్న తన తండ్రిని చూడాలనుకున్నప్పుడల్లా ఈ మాతృభూమి లేడీస్ స్పెషలే ఎక్కుతుంది. ‘ఎవ్రీ వీకెండ్ మా డాడీని చూడటానికి ఫలక్‌నుమా వస్తుంటా. శనివారం సాయంత్రం కాలేజ్ అయిపోగానే మాతృభూమి క్యాచ్ చేస్తా. మళ్లీ సోమవారం ఉదయం ఇదే ట్రైన్ పట్టుకొని రిటర్న్ అవుతా. ఫలక్‌నుమా నుంచి నా డెస్టినేషన్ వెళ్లడానికి చాలా ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు ఉన్నాయి. కానీ మగవాళ్ల తోపులాటల మధ్య ఆ ట్రైన్స్ ఎక్కడం నరకం. వాటిల్లో లేడీస్ కంపార్ట్‌మెంట్స్ ఉన్నా అందులోకీ మగవాళ్లు జొరబడ్తారు. అందుకే పీక్ అవర్స్‌లో ఈ లేడీస్ స్పెషల్ చాలా రష్‌గా ఉన్నా దీనినే ప్రిఫర్ చేస్తా. బోగీకో లేడీకానిస్టేబుల్ ఎస్కార్ట్‌గా ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా డెస్టినేషన్ చేరుతాం. ఈ రోజుల్లో లేడీస్‌కి అత్యంత అవసరం ఈ భద్రతే కదా! అందరూ లేడీసే ఉంటారు కాబట్టి హడావుడిలో ఏ బోగీ ఎక్కినా భయం ఉండదు. అంతేకాదు నేను ఫ్రీక్వెంట్‌గా చేసే ఈ జర్నీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. డియరెస్ట్ వన్స్‌గా మారినవారూ ఉన్నారు’ అని చెప్పింది మాతృభూమి ప్రయాణం గురించి. వర్కింగ్ విమెన్ శాతం పెరుగుతుంది కాబట్టి ఈ లేడీస్ స్పెషల్ ట్రైన్ సంఖ్య పెంచితే బాగుంటుందని ఆ అమ్మాయి అభిప్రాయం.
ఇంట్లో ఉన్నట్టే ఉంటది..
అలివేలు అనే ఓ అమ్మ రోజూ ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు వెళ్తుంది. అక్కడ ఓ మర్వాడీ ఇంట్లో వంటచేస్తుంటుంది. ఆమె తన ప్రయాణంలో భద్రత కోసం ఈ మాతృభూమినే ఎంచుకుంది. కారణం.. ‘అందరూ ఆడోళ్లుండే ఈ రైల్లో నిమ్మళంగా పోవచ్చు. మీదికెళ్లి పోలీసులు కూడా ఉంటరు.. మొగోళ్లను ఎక్కనియ్యకుండ స్ట్రిక్టుగుంటరు. ఏ డబ్బాల ఎక్కినా మనింట్ల ఉన్నట్టే ఉంటది నాకైతే. సాయంత్రం కొలువు నుంచి వచ్చేటప్పుడైతే ఈళ్లందరితో మాట్లాడితే పొద్దంత పడ్డ కష్టం తుడిచినట్టే పోతది’ అని చెప్తుంది.
సేఫ్ అండ్ హ్యాపీ..
గాయత్రి అనే సాఫ్ట్‌వేర్ ప్రయాణికురాలిదీ ఇలాంటి అనుభూతే! ‘నేను యూజువల్‌గా మాతృభూమినే క్యాచ్ చేస్తా. ఇందులో జర్నీ సేఫే కాదు హ్యాపీ కూడా! ఉదయం చూడాలి.. భలే ఉంటుంది.. కొంత మంది లలితాసహస్ర నామాలు, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు.. కొంతమంది తమ మనసులో బాధనంతా పక్కవాళ్లతో వెళ్లబోసుకుంటుంటారు. మాలాంటి సాఫ్ట్‌వేర్స్ అయితే మా ల్యాప్‌టాప్‌తో టైమ్‌పాస్ చేస్తుంటాం. కొంతమంది పుస్తకాలు చదువుకుంటారు. ఇందులో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాం కదా.. ఈ ట్రైన్‌లో నాకు చాలామందే ఫ్రెండ్స్ ఉన్నారు. పొద్దున ఎనిమిదిన్నరకే ఎక్కుతాం కాబట్టి ట్రైన్‌లో అందరం కలిసి టిఫిన్ షేర్ చేసుకుంటూ తింటాం. ఇలాంటి మంచి మంచి ఎక్స్‌పీరియెన్స్ ఎన్నో.. ఈ ట్రైన్‌లో’ అని లేడీస్ స్పెషల్ జర్నీని వివరించింది గాయత్రి.
గమ్యం..
ఈ మాటల ప్రయాణం అంతలోకే లింగంపల్లి చేరుకుంది. ఈలోపు ఎన్నో మజిలీలు.. ఎందరో ప్రయాణికులు.. స్టూడెంట్స్.. వెజిటేబుల్ వెండర్స్... అత్తగారింట్లో ఉన్న బిడ్డను చూడ్డానికి వెళ్లే తల్లులు.. హాస్పిటల్లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బయలుదేరిన శ్రేయోభిలాషులు.. వీళ్లందరినీ గమ్యం చేర్చేందుకు పట్టాల మీద అలుపులేని పరుగుతో మాతృభూమి. మాటలు కరువై పక్కనే ఉంటున్నా.. మనుషులు అలికిడి పట్టని నాగరీకులకు ఓ ఆత్మీయ వేదికగా సాగుతున్న ఈ ప్రయాణం శుభప్రదం కావాలి!