
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం
పరిపాలనలో గందరగోళం తొలగించేందుకే అన్న సీఎం
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన
వ్యతిరేకించిన బీజేపీ.. ఓయూకు సురవరం పేరు పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలపై సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.
పొట్టి శ్రీరాములును తక్కువగా చూడటం లేదు
‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు. వారి ప్రాణ త్యాగాన్ని అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునరి్వభజన తర్వాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొందరు కొన్ని వర్గాల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు.
ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీకి వెళ్లగా తెలంగాణలో హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్‌ను అగౌరవపరిచినట్టు కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరును పెట్టుకున్నాం. ఇదే కోవలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టుకున్నాం.
వ్యక్తులను అగౌరవ పరిచేందుకు కాదు..
ఏపీలో ఆ పాత పేర్లతో యూనివర్సిటీలు, సంస్థలు కొనసాగనున్నందున తెలంగాణలో కూడా అవే పేర్లతో ఉంటే పరిపాలనలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున మార్చుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కొందరు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవటం తప్పు. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకు ఆయన పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు..’అని రేవంత్ చెప్పారు.
నేచర్‌క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు
‘మాకు ఆర్యవైశ్యులపై, పెద్దలు పొట్టి శ్రీరాములుపై అపార గౌరవం ఉంది. ఆయన త్యాగాలు, ఆయన దేశభక్తిని సమున్నతంగా స్మరించుకునేలా.. ఇటీవలే ఘనంగా ప్రారంభించుకున్న చర్లపల్లి రైల్వే టెరి్మనల్‌కు ఆయన పేరు పెట్టుకుందాం. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖ రాస్తా. ఇక మాజీ సీఎం కె.రోశయ్య ఇంటికి చేరువలోనే ఉన్న ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టడంతో పాటు ఆవరణలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తాం. ఇక సురవరం ప్రతాపరెడ్డి మహనీయుడు. తెలంగాణలో కవులు లేరు అంటూ అపహాస్యం చేసిన పరిస్థితిలో 354 మంది ఉద్ధండ కవులతో సమావేశమై గోల్కొండ పత్రికలో వారి ప్రతిభకు పట్టం కట్టి తెలంగాణ కవుల గొప్పదనాన్ని చాటారు. నిజాంకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన ధీశాలి..’అని సీఎం వివరించారు.
తెలుగుజాతి త్యాగాన్ని అవమానించడమే: బీజేపీ
తెలుగు వర్సిటీ పేరు మార్పును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘పొట్టి శ్రీరాములు ఓ ప్రాంత నేత కాదు. ఆయన గాం«దీజీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుడి పేరును తొలగించటం అంటే తెలుగు జాతి త్యాగాన్ని అవమానపరచటమే.
సురవరం ప్రతాపరెడ్డి పేరును.. నిజాంకు గుర్తుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పేరును మార్చి దానికి పెట్టాలి..’అని బీజేపీ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్‌లోని స్టేడియానికి సర్దార్ పటేల్ పేరును తొలగించారన్న ఆరోపణ సరికాదని, స్టేడియం ప్రాంగణానికి ఆయన పేరే ఉందని, అక్కడి క్రికెట్ గ్రౌండ్‌కు మాత్రమే నరేంద్ర మోదీ పేరు పెట్టారని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment