
సాక్షి, హైదరాబాద్: విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని నగరానికి చెందిన వైద్యురాలు అత్యవసర వైద్య సేవలతో కోలుకునేలా చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకోగా.. సోమవారం వెలుగు చూసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల ఒంటరి వృద్ధుడికి అకస్మాత్తుగా మగతలోకి జారుకుని, నోటి నుంచి నురగ వచ్చింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న నగరంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠం జనరల్ ఫిజీషియన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించారు.
ఆయన పల్స్ బలహీనంగా ఉందని, బీపీ తక్కువగా ఉందని గుర్తింంచారు. అత్యవసరంగా సీపీఆర్ చేయడంతో సదరు ప్రయాణికుడు కొన్ని నిమిషాల్లో స్పృహలోకి వచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడిని క్షేమంగా గమ్యానికి చేర్చారు. సకాలంలో స్పందించి వృత్తి పరమైన నిబద్ధతను ప్రదర్శించిన డా.ప్రీతిరెడ్డిని ప్రయాణికులు అభినందించారు.