
ఢిల్లీ: ఇండిగో విమానం ఆలస్యంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించక.. జైపూర్‌లో ల్యాండ్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్త పరిచారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుని.. పరుష పదజాలంతో తన బాధను చెప్పుకొచ్చారు.
వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీలోకి బయలుదేరారు. ఈ సమయంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సదరు ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దీంతో, విమానం రాజస్థాన్‌లోని జైపూర్ ల్యాండ్ అయ్యింది. దాదాపు నాలుగు గంటల తర్వాత మళ్లీ విమానం.. ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానం ఆలస్యం కావడంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ షో అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల విషయంలో వీరి అలసత్వం చూస్తుంటే.. సహనం కోల్పోతున్నామని.. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా తాను లేనని అన్నారు.
Delhi airport is a bloody shit show (excuse my French but I’m in no mood to be polite). 3 hours in the air after we left Jammu we get diverted to Jaipur & so here I am at 1 in the morning on the steps of the plane getting some fresh air. I’ve no idea what time we will leave from… pic.twitter.com/RZ9ON2wV8E
— Omar Abdullah (@OmarAbdullah) April 19, 2025
దాదాపు మూడు గంటల తర్వాత ఒమర్ అబ్దుల్లా మరో పోస్టులో స్పందిస్తూ..‘ఎవరైనా ఆలోచిస్తుంటే, నేను తెల్లవారుజామున 3:00 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్ విమానాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని.. జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు కురవడం వల్ల ఈ అంతరాయం కలిగిందని తెలిపింది. వాతావరణం మెరుగైన వెంటనే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది.