
అధికార పక్ష ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
ప్రజాతీర్పును గౌరవించాలంటూ తీర్మానం
అమిత్‌షాకు సీఎం ఒమర్ లేఖ
నా పరిమితులేంటో తెలుసు: ఎల్జీ సిన్హా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పరిపాలనా సర్వీస్(జేకేఏఎస్)కు చెందిన 48 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)మనోజ్ సిన్హా బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పరిపాలనా సంబంధమైన అంశాల్లో ఇప్పటికే రాజ్‌భవన్, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం అబ్దుల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూకు లేఖలు రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్బంగా లేఖలో.. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని కాదని ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి చట్టబద్ధత లేదని అందులో పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్‌కు వెంటనే ఖరారు చేయాలని కోరారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడంపై సమీక్ష చేపట్టాలని ఎల్జీకి రాసిన లేఖలో సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసేతర అధికారులను బదిలీ చేయవద్దని చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో సీఎం ఒమర్‌తోపాటు ఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. ఇదే చిట్టచివరి విజ్ఞప్తి. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు’అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)ప్రతినిధి, ఎమ్మెల్యే జడిబల్ తన్వీర్ సాదిఖ్ అనంతరం మీడియా ఎదుట వ్యా ఖ్యానించారు. తమ సహకార వైఖరిని, మౌ నాన్ని బలహీనతగా భావించరాదని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఖండిస్తూ తీర్మానించిందని, అదేవిధంగా, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలంటూ ఎల్జీకి హితవు పలుకుతూ మరో తీర్మానం చేసిందని ఆయన తెలిపారు.
పరిధిని అతిక్రమించలేదు: ఎల్జీ
అధికార పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చేసిన తీర్మానంపై ఎల్జీ సిన్హా దీటుగా స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం పరిధిని అతిక్రమించి నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. నా పరిధి, నా పరిమితులు నాకు బాగా తెలుసు. అంతకుమించి ఎన్నడూ ఏమీ చేయలేదు’అని న్యూస్18కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.