lieutenant governor
-
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్‌గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
అలా అయితే మీ తరపున ప్రచారం చేస్తా: బీజేపీ ఎమ్మెల్యేకు సీఎం అతిషి ఆఫర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశా ల్లో భాగంగా శుక్రవారం ప్రతిపక్ష బీజేపీపై సీఎం అతిషి మార్లేనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కొర్పొరేషన్ బస్సులో బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అతిషి కౌంటర్ ఇచ్చారు.అయితే ఆప్ ప్రతిపాదనపై రోహిణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆప్‌పై విమర్శలు గుప్పించారు. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబితేనే బస్ మార్షల్స్‌ను తొలగించామని చెప్పారు. దీనిపై సీఎం అతిషి స్పందిస్తూ..‘ నేను ముఖ్యమంత్రినే.. బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించాలని నేను కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పదేపదే చెబుతున్నాను. వీకే సక్సేనా కూడా ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట వింటుంటే.. మార్షల్స్‌ను తిరిగి నియమించగలరు’ అని కౌంటర్ ఇచ్చారు.బస్ మార్షల్‌పై "నవంబర్ 10న మేం మీటింగ్ పెట్టాం. నవంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్కురిపోర్టు పంపాం. ఈరోజు నవంబర్ 29. ఇప్పుడు బస్ మార్షల్స్‌ను పునరుద్దరించే ప్రతిపాదన ఆయన వద్ద ఉంది. ఒకవేళ మీరు (విజేందర్ గుప్తా) బస్ మార్షల్స్ నియమాకానికి సంబంధించిన ఫైల్‌ను ఎల్ సంతకం చేయిస్తే.. మీపై ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టకుండా మా పార్టీని ఒప్పిస్తాను. అంతేగాక మీ తరపున నేను కూడా ప్రచారం చేస్తాను’ అని పేర్కొన్నారు. VIDEO | "You (BJP MLA Vijender Gupta) just get the file for the appointment of bus marshals signed by the LG, I will convince my party not to field any candidate against you in Rohini, I will also campaign for you," said Delhi CM Atishi (@AtishiAAP) speaking in the Assembly,… pic.twitter.com/XxVHRuDwlO— Press Trust of India (@PTI_News) November 29, 2024 కాగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆప్ సర్కార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బస్ మార్షలల్స్ను తిరిగి నియమించాలని కోరూతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానించి సిఫార్సు చేసిన ఫైల్ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా వద్ద పెండింగ్‌లో ఉంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులపై మార్షల్స్‌పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే మధ్య వాగ్వాదం గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతోంది. -
మరీ ఇంత బరితెగింపా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు. రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి. ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది. పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్‌కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్‌కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్‌లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు. పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్‌కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది. కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా? -
అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలీదు: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ఎల్జీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలోని చెట్లను నరికివేయడానికి కోర్టు అనుమతి అవసరమని తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై నేడు(బుధవారం) సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. రిడ్జ్ ప్రాంతంలో దాదాపు 600 చెట్లను నరికేయడంపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం.. అక్రమంగా 600 చెట్లను నేల కూల్చడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోవివరిస్తూవ్యక్తిగత అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఎల్జీని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాయన తాజాగా ప్రమాణపత్రం సమర్పించారు.ఇందులో తాను రిడ్జి ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ నిర్మించాలనుకున్న ప్రదేశాన్ని ఫిబ్రవరి 3వ తేదీన సందర్శించినట్లు ఎల్జీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ నిర్మాణ అవసరం, ప్రాధాన్యం, దానికి కేటాయించిన వనరుల అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు విస్తరణ జరుగుతున్న స్థలంలో ఆగినట్లు తెలిపారు. నాడు కోర్టు అనుమతి లేకుండా చెట్లను నరికివేయకూడదనే అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు.అయితే.. ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు అనుమతి కోరుతూ డీడీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మాత్రమే మార్చి 21న ఆ విషయం తనకు తెలిసినట్లు ఎల్జీ చెప్పారు.. చెట్లను నరికివేయడానికి కాంట్రాక్టర్లకు డీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోజ్ కుమార్ యాదవ్, డీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ కుమార్, ఆయుష్ సరస్వత్‌లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీరే నరికివేతకు అనుమతించారని తెలిపారు.పంకజ్ వర్మ, సూపరింటెండింగ్ ఇంజనీర్ యాదవ్‌లను కోర్టు నుండి వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.చెట్లను నరికివేయడంపై కొందరు డీడీఏ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. చైర్పర్సన్ అంగీకరిస్తే, చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని పేర్కొంది. -
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవ్నర్పై సుప్రీం ఆగ్రహం.. ‘అంత తొందరెందుకు?’
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలోని చివరి స్థానానికి(18వ ) కోసం ఎన్నిక జరిపించేందుకు ఎందుకు అంత తొందర అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే.. దీనికి సంబంధించిన ఛైర్మన్ ఎన్నికునే ప్రక్రియపై కూడా స్టే విధించింది. నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఎన్నికలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం వెనుక న్యాయపరమైన ఆధారం ఏంటని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది."నామినేషన్ సమస్య కూడా ఉంది... మేయర్ (అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్) అధ్యక్షత వహించారు. మీకు (ఎల్జీ) అధికారం ఎక్కడ లభిస్తుంది?" అని కోర్టు ప్రశ్నించింది. ‘నామినేషన్ అంశం కూడా ఉంది. దానిని పర్యవేక్షించేందుకు అక్కడ మేయర్(ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్) ఉన్నారు. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా జోక్యం చేసుకొంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. దీనిలో కూడా రాజకీయాలా?’ అని న్యాయమూర్తులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నిలదీశారు. అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు విచారిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.అనంతరం బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్‌ను కమిటీలోకి ఎన్నుకోవడంపై మేయర్ షెల్లీ ఓబ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎల్జీని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరోవైపు ఆప్ తరపున అభిషేక్ సింఘ్వీ మను దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ స్పందిస్తూ..ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని.. రెండు వారాల తర్వాత చూడాలని సూచించింది, -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.సీఎం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఛీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టుల్లో గ్లూకోమీటర్, సీజీఎంఎస్ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటరింగ్) వివరాల్లో తేడాలు ఉన్నాయి. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కేజీల బరువు తగ్గారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్ షుగర్ తగ్గుతోందని ఇటీవలే ఆప్ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాంటి లేటర్ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు. ‘ఎల్జీ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎల్జీపై సెటైర్లు వేశారు. -
త్వరలో ఎన్నికలు.. జమ్ము-కశ్మీర్ చట్టంలో సవరణలు
ఢిల్లీ: జమ్ము-కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్ లెఫ్ట్నెట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ సవరించింది.అయితే ఈ సవరణల వల్ల జమ్ము కశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరుగనున్నాయి. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధిచిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.తాజాగా సవరించిన చట్టం.. జమ్ము- కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండో సవరణ. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చిన మొదట్లో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సి అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియమాల్లో పొందుపర్చిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం.. ఇక నుంచి ఆర్థికశాఖ అనుమంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను చీఫ్ సెక్రటరీ.. ఎల్జీ ముందు తీసుకెవెళ్లితే.. ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం లభించింది.చట్టంలోని ప్రధాన నిబంధనల్లో కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది.ఈ నిబంధన ప్రకారం.. సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం.. ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42 బీ నిబంధనం ప్రకారం.. ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. -
ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు విచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది. అయితే డీఈఆర్సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్ ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. -
ఆప్‌కు షాక్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో.. ఆప్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆర్డినెన్స్ నిలుపుదలకై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. అదే సమయంలో ఆప్ పిటిషన్ ఆధారంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికి అనుకూలంగా ఇది వరకే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాలనాధికారం ఢిల్లీ సర్కార్‌దేనని మే 11ద తేదీ తీర్పులో స్పష్టం చేసింది. ఆపై. కేంద్రం ఆ తీర్పుపై రివ్యూకు వెళ్లడం, ఆ ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఈ గ్యాప్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 400 మంది రీసెర్చ్ ఆఫీసర్లు, ఇతరులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. కేంద్రం ఆదేశాలపై రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంలో మరో పిటిషన్ వేసింది ఆప్ ప్రభుత్వం. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం ఆదేశాలపై నిలుపుదల ఇవ్వలేమని, అయితే ఈ పిటిషన్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇంప్లీడ్ చేయడానికి నోటీసులు కేంద్రానికి మాత్రం జారీ చేయగలమని పేర్కొంది. అలాగే.. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది. అంతకు ముందు.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ ఓ సూపర్ సీఎంలా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ► అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ మే 19వ తేదీన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ► అయితే.. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఈ ఆర్డినెన్స్‌ను అభివర్ణించింది. ► ఈ మధ్యలోనే సుప్రీం కోర్టు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఎల్జీ సాయంతో కేంద్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోతోంది. ► మరోవైపు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకా పార్టీల మద్దతు కూడగట్టే పని సైతం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పలు రాష్ట్రాలు తిరిగి.. ఆయా సీఎంలతో భేటీ అయ్యి మద్దతు కోరారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రం ఎటూ స్పందించలేదు. ► ఇక.. దీన్నొక చీకటి ఆర్డినెన్స్‌గా పేర్కొంటూ ఆప్.. ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: ఆయనే ప్రధాని కావాలని అంతా కోరుకుంటున్నారు! -
సాకేత్ కాల్పుల ఘటన.. కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. సాకేత్ కోర్టు ఆవరణలో ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. లాయర్ దుస్తుల్లో కాల్పులకు దిగిన వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. సౌత్ ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన జరిగింది. కాల్పులకు ముందు.. జనంతో కిక్కిరిసిపోయిన కోర్టు కాంప్లెక్స్ వద్ద బాధితురాలితో సదరు నిందితుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో గన్ బయటకు తీసి ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. దీంతో ఆమె అక్కడి నుంచి పరుగు అందుకుంది.అక్కడే పోలీసులు, కొందరు లాయర్లు ఉన్నప్పటికీ.. ఎవరూ ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇక కాల్పుల తర్వాత కోర్టు కాంప్లెక్స్ క్యాంటీన్ నుంచి పారిపోయాడు దుండగుడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కాల్పులకు తెగబడిన వ్యక్తి ఓ లాయర్. అయితే.. బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయ్యాడు. కిందటి ఏడాది జులైలో సదరు మహిళకు, ఓ అడ్వొకేట్కు వ్యతిరేకంగా సాకేత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడతను. తన నుంచి పాతిక లక్షల రూపాయలు తీసుకుని.. పెద్ద మొత్తంలో తిరిగి ఇస్తామంటూ ఆశ కల్పించారని, ఆపై మాట తప్పారని వాళ్లపై ఫిర్యాదు చేశాడా సస్పెండెడ్ లాయర్. ఈ క్రమంలో.. ఈ ఉదయం లాయర్ దుస్తుల్లోనే కోర్టులోకి వచ్చి తన లాయర్‌తో మాట్లాడుతున్న మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో మహిళ సహా ఆమె లాయర్, మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలు అయ్యాయని, కడుపులో బుల్లెట్ దూసుకుపోయిన మహిళను ఎయిమ్స్‌లో చేర్పించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.ఎల్జీ సాబ్.. మా ఢిల్లీలో ఏం జరుగుతోందంటూ మరో ట్వీట్ చేశారాయన. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడం చేత కాకపోతే.. రాజీనామా చేయాలంటూ పరోక్షంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు చురకలు అంటించారు. ‘‘ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇతరుల పనులకు విఘాతం కలిగించే బదులు.. ప్రతీదానికి చెత్త రాజకీయాలు చేసే బదులు.. వాళ్లు వాళ్ల పనిని చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆయన(ఎల్జీని ఉద్దేశిస్తూ..) గనుక ఆ పని చేయకుంటే రాజీనామా చేస్తే వేరేవాళ్లు ఆ పని చూసుకుంటారు. రాముడిపై నమ్మకంతో ప్రజల భద్రతను వదిలిపెట్టలేం’’ అంటూ ట్వీట్ చేశారాయన. LG साहिब, ये हमारी दिल्ली में क्या हो रहा है? pic.twitter.com/lpWy4NlOW7 — Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2023 👉 ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో కోర్టుల ఆవరణలోనే నేరాలు జరగడం కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట సౌత్‌వెస్ట్ ఢిల్లీ ద్వారక కోర్టులో లాయర్ వేషాల్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపి పారిపోయారు. 👉 ఈ క్రమంలో.. తమకు రక్షణ కరువైందని, భద్రత కల్పించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు కొందరు న్యాయవాదులు. 👉 కిందటి ఏడాది సెప్టెంబర్‌లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిపై రోహిణి కోర్టు ప్రాంగణంలో.. న్యాయవాద దుస్తుల్లో వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ప్రతిగా.. ఆ ఇద్దరినీ పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. 👉 అంతకు ముందు 2022 ఏప్రిల్‌లోనూ రోహిణి కోర్టు ఆవరణలో క్లయింట్ల విషయంలో ఇద్దరు అడ్వొకేట్ల మధ్య కాల్పులు జరిగాయి. -
సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం
-
సుప్రీం కోర్టులో ఆప్‌కు భారీ విజయం
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల్లో గెలిచి కూడా మేయర్ ఎన్నికకు ఆటంకాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ఆమ్ఆద్మీ పార్టీకి భారీ విజయం దక్కింది. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్ కోసం జరిగే ఓటింగ్‌కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, సత్యశర్మ బీజేపీ గనుక సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆప్ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది. ఈ తరుణంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా.. ఆప్ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు.. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు 24 గంటల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికపై ప్రతిష్టంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో, ఫిబ్రవరి 6వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఢిల్లీ చరిత్రలోనే మేయర్ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. -
బ్రిటిష్ వైశ్రాయ్‌లా చేయకండి.. ఎల్జీ సక్సేనాపై కేజ్రీవాల్ ఫైర్
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. తమ ప్రభుత్వ కార్యకలాపాలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అడ్డుపడుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను బ్రిటిష్ వైస్రాయ్‌తో పోల్చారు కేజ్రీవాల్. దీంతో, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, రెండు రోజులుగా ఢిల్లీ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్జీ సక్సేనా.. టీచర్ల శిక్షణకు సంబంధించిన ఫైనల్ తాము పంపితే తిరస్కరించారని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎల్జీ పడుతున్నాడని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల టీచర్లను శిక్షణ కోసం ఫిన్లాండ్కు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఎల్జీ అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రెండు కోట్ల జనాభా ఉన్నదని, వారిలో లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి మంచి విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎల్జీ అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ దగ్గరకు పంపిస్తే ఆయన తిరస్కరించారని సభకు చెప్పారు. ఇదే సమయంలో బ్రిటిష్ పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. ప్రస్తుతం తాము కూడా ఎల్జీ పోరాటం చేస్తున్నామని అన్నారు. సక్సేనా.. బ్రిటిష్ వైస్రాయ్‌లా వ్యవహరించవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీకి మా నెత్తిన కూర్చునే అధికారం లేదని మండిపడ్డారు. తన వల్లే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కేజ్రీవాల్ హితవు పలికారు. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
సుకేశ్ నుంచి ఆప్ మంత్రికి నెలకి రూ.2కోట్లు.. చిక్కుల్లో కేజ్రీవాల్!
న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఖండించిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్ -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
ఆప్ నాయకులకు పరువు నష్టం నోటీసులు... భయపడేదే లేదంటూ ముక్కలు ముక్కలుగా చించేసి...
న్యూఢిల్లీ: మద్యంపాలసీకి సంబంధించిన స్కీంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దాడుల జరిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆప్ నాయకులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వర్సస్ ఎల్జీ(లెఫ్టినెంట్ గవర్నర్), స్కామ్ వర్సస్ స్కామ్ రాజకీయం అన్నట్లుగా ఇద్దరి మధ్య వాడి వేడిగా విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖాదీ స్కాం విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పై ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ సక్కేనా ఆప్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల తోపాటు జాస్మిన్ షాలకు పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసులు పంపించారు. అంతేకాదు ఇలా పార్టీలోని సభ్యులందరూ ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగా దురుద్దేశపూర్వకంగా, నిరాధారమైన తప్పుడు ప్రకటనలతో తన పరువుకి భంగం కలిగేంచే వ్యాఖ్యలను వ్యాప్తి చేసే అలవాటును మానుకోవాలంటూ ఒక పత్రిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ..."భారత రాజ్యంగం నాకు మాట్లాడే హక్కును ఇచ్చింది. అలాగే రాజ్యసభ సభ్యునిగా నిజం మాట్లాడే హక్కు నాకు ఉంది. ఒక దొంగ, అవినీతిపరుడు పంపిన నోటీసులకు భయపడను అంటూ ముక్కలు ముక్కలుగా చించేశారు. అలాంటివి ఎన్ని నోటీసులు పంపించినా చించేయగలను, విసిరి పారేయగలను" అని ఆగ్రహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తమపై ఇలా రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆప్ పేర్కొంది. అంతేకాదు సక్కేనా 2015 నుంచి 2022 వరకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీన్ కమిషన్(కేవీఐసీ) చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడూ అనేక అవకతవకలు జరిగాయని ఆప్ ఆరోపించింది. పైగా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ అసెంబ్లీలో మాట్లాడుతూ...కేవీఐసీ ఉద్యోగులపై సుమారు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు మంబైలోని ఖాదీ లాంచ్ ఇంటీరీయర్ డిజైనింగ్ కాంట్రాక్టును కూడా తన కుమార్తెకు ఇచ్చారంటూ ఆరోపణలు గుప్పించారు. తాము చేస్తున్న పోరాటంలో పలు ప్రశ్నలు ఉంటాయని వాటిని ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండండి అని సవాలు ఆప్ నేత సంజయ్ సింగ్ సవాలు విసిరారు. సుప్రీం కోర్టు ఆప్ నేతలకు ఈ నోటీసులను బుధవారం పంపిచింది. ఈ కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్ 11 వ తేదికి వాయిదా వేసింది. (చదవండి: 'బీజేపీలో ఉంటూనే ఆప్ కోసం పనిచేయండి'.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు) -
Masarat Farooq: కశ్మీర్ లోయకు ట్యూషన్ చెబుతోంది
తుపాకుల మోతలు.. ఉగ్రవాదదాడులు ఇవి కశ్మీర్ అంటే గుర్తుకు వచ్చేది. కాని అక్కడి పిల్లలు చదువుకు చాలా విలువ ఇస్తారు. తరచూ స్కూళ్లకు వచ్చే ‘భయం సెలవులకు’ బాధ పడతారు. వారి భయం పోవాలంటే వాళ్ల ఇళ్లకే వెళ్లి ట్యూషన్ చెప్పాలి అని నిశ్చయించుకుంది మస్రత్ ఫారూక్. తానే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా మారి, లోయ మొత్తం దాదాపు 100 మంది టీచర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లు సాయంత్రమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ట్యూషన్ చెప్పాలి. మస్రత్ ఆలోచన పెద్ద హిట్ అయ్యింది. తాజాగా కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమెకు ‘కశ్మీర్ విద్యారంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్’గా గుర్తింపు ఇచ్చారు. 26 ఏళ్లు మస్రత్ ఫరూక్‌కు. కాని కాశ్మీర్‌లోయ అంత ముఖ్యంగా శ్రీనగర్ అంతా ఆమెను ‘మాస్టర్జీ’ అని పిలుస్తారు. నర్వారా నుంచి ఒక తండ్రి ఫోన్ చేస్తాడు.. ‘మాస్టర్జీ... మా అబ్బాయికి ట్యూషన్ కావాలి’... రేషి మొహల్లా నుంచి ఒక తల్లి ఫోన్ చేస్తుంది.. ‘మాస్టర్జీ... మా పిల్లలకు ట్యూషన్ కావాలి’... టాటా బ్రాండ్, బాటా బ్రాండ్‌లాగా నమ్మకానికి, ఫలితాలకు ఒక గ్యారంటీగా మస్రత్ ఒక బ్రాండ్ అయ్యింది ట్యూషన్లకు ఆ అందమైన లోయలో... కలతల నేలలో. పాఠాలు చెప్పడం ఇష్టం శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్ పదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ‘నాకు పాఠాలు చెప్పడం ఇష్టం’ అంటుంది మస్రత్. ఇంటర్ చదువుతూ, డిగ్రీ చదువుతూ కూడా స్కూళ్లలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేసింది మస్రత్. క్లినికల్ సైకాలజీలో ఎం.ఎస్సీ చేసింది. అయితే 2019 అక్టోబర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో శ్రీనగర్‌లో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో పిల్లలు చదువుకు అంతరాయం కలగడం గమనించింది మస్రత్. ఆ వెంటనే 2020లో ఫిబ్రవరి నుంచి కోవిడ్ ప్రతిబంధకాలు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినా ఆ క్లాసులు జరిగే సమయంలో పిల్లలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం తన సొంత కజిన్స్ చదువు కుంటుపడటం కూడా గమనించింది. ఒక్కోసారి ఉగ్రవాద చర్యల వల్ల కూడా స్కూళ్లు సరిగ్గా నడవవు. బడి దగ్గర పిల్లలు అనే భావన కంటే పిల్లల దగ్గరకే బడి అనే భావన సరైనదని మస్రత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ముగ్గురు టీచర్లు... 20 మంది పిల్లలు విద్య గురు ముఖతా ఉండాలి... టీచర్ సమక్షం లో ఉంటూ టీచర్‌ను చూస్తూ నేర్చుకుంటే చదువు సరిగ్గా వస్తుందనేది మస్రత్‌కు తెలుసు. అందుకే స్కూల్ ఎలా నడిచినా హోమ్ ట్యూషన్లు పిల్లలకు మేలు చేస్తాయని భావించింది. తానొక్కతే అందరికీ చెప్పలేదు కనుక తన ఆధ్వర్యంలో పని చేసే టీమ్ ఉండాలనుకుంది. ఒక ముగ్గురు టీచర్లు దొరికితే 20 మంది పిల్లల ఖాతాలు దొరికితే చాలు అనుకుంది. ‘స్మార్ట్క్లాసెస్ హోమ్ ట్యూషన్స్’ పేరుతో సంస్థ ప్రారంభించి పత్రికల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చింది. చాలామంది అప్లికేషన్స్ పంపారు. కాని టీచింగ్‌కు ఎవరు పనికి వస్తారో కనిపెట్టడమే మస్రత్ విజయానికి కారణం. అలాంటి ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ట్యూషన్లు ఎవరికి చెప్పాలో తాను నిర్ణయించి పంపుతుంది. ఎంతమందికి చెప్తే ఆ మొత్తం నుంచి టీచరు, తాను షేర్ చేసుకుంటారు. అదీ ఒప్పందం. కాని వెంటనే స్పందన రాలేదు. కొన్ని రోజులకు రవూఫ్ అనే యూరాలజిస్ట్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని కోరాడు. మస్రత్ టీచర్ని పంపింది. పిల్లలు చదువుకుంటున్న పద్ధతికి ఆ డాక్టరు చాలా ఆనందించాడు. ఊళ్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ పదే పదే మస్రత్ టీమ్ గురించి చెప్పాడు. విద్యార్థులు పెరుగుతూ పోయారు. నేడు శ్రీనగర్ అంతా 200 మంది పిల్లలు మూలమూలన సాయంత్రమైతే దీపం వెలిగించి మస్రత్ పేరు తలుచుకుంటారు. ఎందుకంటే ట్యూషన్ మొదలయ్యేది అప్పుడే కదా. 80 మంది టీచర్లు మస్రత్ కింద పని చేస్తున్నారు. 50 వేల వరకూ జీతం మస్రత్ చెప్పడం ‘నా ట్యూషన్ల వల్ల 98 శాతం మార్కులు గ్యారంటీ’ అని. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ పిల్లలకు అలాగే మార్కులు వస్తున్నాయి. క్లాసును బట్టి ఫీజు నిర్ణయించడం వల్ల ఒక టీచరు చెప్పగలిగినన్ని ట్యూషన్లు చెప్పే స్వేచ్ఛ ఉండటం వల్ల తన దగ్గర పని చేస్తున్నవారిలో కొందరు నెలకు 50 వేలు (ఆమె వంతు షేర్ పోను) సంపాదిస్తున్నారని మస్రత్ చెప్పింది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’ అంటుంది మస్రత్. ఆమె ఇప్పుడు శ్రీనగర్‌లో రెండు కంప్యూటర్ సెంటర్లు నడుపుతోంది. త్వరలో స్కూల్ తెరవాలని అనుకుంటోంది. ఆమె చొరవ వల్ల ఒక వైపు చదువు, మరో వైపు ఉపాధి కలుగుతుండటంతో శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా ఆమెను తాజాగా సత్కరించారు. అది మస్రత్‌కు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఆన్లైన్ ట్యూషన్లతో కొందరు సక్సెస్ అయ్యారు. నాకు ఆన్‌లైన్‌తో సంబంధమే లేదు. నా విధానం నేరుగా పిల్లలకు విద్యావిధానం’ అని చెబుతున్న మస్రత్ త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆమె సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అలాంటిది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’. -
ఉగ్రకాండ.. అమిత్ షా మీటింగ్ ముందర మరొకటి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం. మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్‌గఢ్. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్ భట్ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కూడా దారుణ హత్యకు గురైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా? -
ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి, వారి సేవ కోసం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. ప్రజల్లో చైతన్యం పెంచడంలో, జాతీయ లక్ష్యాలను సాధించేగా దిశగా వారికి స్ఫూర్తినివ్వడంలో గవర్నర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గవర్నర్లు జిల్లాలకు వెళ్లాలని, జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల సహకారంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని గవర్నర్లను కోరారు. కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చిరస్మరణీయ పోరాటం సాగించిందని, ఇందులో గవర్నర్లు తమ వంతు సహకారం అందించారని కోవింద్ ప్రశంసించారు. ఈ పోరాటంలో వారు చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులంతా అసాధారణ త్యాగం, అంకితభావంతో విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్లో జరిగింది. పథకాల అమలును పర్యవేక్షించాలి: వెంకయ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో గవర్నర్ల పాత్ర కీలకమని తెలిపారు. గవర్నర్ పదవిని కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా భావించకూడదని, రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు సేవ చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతిని కాపాడడానికి తోడ్పాటునందించాలని గవర్నర్లకు వెంకయ్య పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధి: మోదీ గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గవర్నర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గవర్నర్లతోనూ తరచుగా భేటీ కావాలని, దానివల్ల ప్రజల సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడుతూ ఉండాలని మోదీ వివరించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ల మధ్య అనుసంధానం కోసం ఓ సంస్థాగత యంత్రాంగం ఉండాలన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నర్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల గవర్నర్లు సైతం అందిపుచ్చుకోవాలని కోరారు. -
పిజ్జా డెలివరీ ఓకే.. రేషన్ నాట్ ఓకేనా?
న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన. ‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. కేసు ఉందనేనా? కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. చదవండి: ఇంటికి రేషన్.. ఇక్కడ తొలగిన అడ్డంకి -
Delhi Lieutenant Governor: ఢిల్లీకి ఎల్జీనే బాస్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇన్చార్జ్గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. జీఎన్సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఆప్ సహా పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధమని విమర్శించాయి. తాజా నోటిఫికేషన్‌తో చట్టంలోని నిబంధనలు ఈనెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఎల్జీని కేంద్రం నియమిస్తునందున, ఇకపై దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం వైఫల్యం చెందిన వేళ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా విజృంభణపై మంగళవారం ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ ప్రభుత్వం నామమాత్రమే.. జీఎన్సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నామమాత్రంగా మిగలనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తాజా ఆదేశాలతో ఇకపై ఎల్జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్ ప్రభుత్వం ఎల్జీ అనుమతితోనే అడుగులు వేయాల్సిఉంటుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎల్జీ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ ఎల్జీ అధికారాలు భిన్నమైనవని అధికారులు వివరించారు. ఇప్పటివరకు అధికార పరిధిపై ఎల్జీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న సందిగ్ధాలను తాజా చట్టం నివారిస్తుందని చెప్పారు. -
‘ఢిల్లీ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘ఢిల్లీ’ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఓకే చెప్పడంతో బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లయింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్ గవర్నర్దే అంతిమాధికారం అని చెప్పే ఈ బిల్లు ఆమోదం సందర్భంగా బుధవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ఎస్పీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు వాకవుట్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ) ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే!. ముందుగా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వాదనలు జరిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లుతో ఢిల్లీలో బలమైన ప్రభుత్వయంత్రాంగం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 1991లో తెచ్చిన చట్టంలోని సందిగ్ధతలు తొలగించేందుకే ఈ బిల్లు తెచ్చామన్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల సారాంశానికి అనుగుణంగానే మార్పులు చేశామని వివరించారు. ప్రజాస్వామ్యానికి దుర్దినం బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినంగా అభివర్ణించారు. అయితే తిరిగి ప్రజా ప్రభుత్వానికి అధికారాలు పునఃసంప్రాప్తించేందుకు తాను చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. ప్రజలకు తిరిగి అధికారం సాధించేవరకు పోరాటం ఆపను. మంచిపనులు ఆగవు, నెమ్మదించవు’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా ఎల్జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు. 2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ పరోక్షంగా అరవింద్ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్ ఎంపీ భగవంత్‌మన్ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
బస్సులో గవర్నర్ తమిళిసై ప్రయాణం
-
బస్సులో ప్రయాణించిన గవర్నర్ తమిళిసై!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఇన్చార్జ్) తమిళిసై సౌందరరాజన్ ప్రజలతో మమేకం అయ్యేరీతిలో, వారి సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం బస్సులో ప్రయాణం చేశారు. ప్రజల విజ్ఞప్తుల్ని విన్న ఆమె అవసరం అయితే, రాజ్‌నివాస్‌కు వచ్చి తనను కలవాలని సూచించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక వ్యవహారాలే కాదు, ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. తనకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం బస్సులో పయనించారు. పుదుచ్చేరిలోని కడలూరు బస్టాండ్‌కు ఉదయం పది గంటలకు రాజ్‌నివాస్ నుంచి కారులో సహాయకుడు చంద్రమౌళితో కలిసి బయలుదేరారు. అంతోనియార్ బస్టాండ్ వద్ద కారు నుంచి దిగేసి బర్గూర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఎక్కారు. ముందు సీటులో కూర్చున్న ఆమె ప్రయాణికులతో మాటలు కలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోగా, మరి కొందరు పింఛన్ రాలేదంటూ, ఇంకొందరు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేవంటూ ఇలా అనేక సమస్యల్ని ఆమె దృష్టికి తెచ్చారు. తవలకుప్పం వరకు ఆమె బస్సులో ప్రయాణించారు. ఆ తర్వాత కారులో అక్కడి డంపింగ్ యార్డ్‌కు వెళ్లారు. ఆ పరిసర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిశీలించారు. మళ్లీ తవలకుప్పం చేరుకుని మరలా మరో బస్సులో ప్రయాణించారు. అప్పటికే ఆ బస్సులో సీట్లు పూర్తిగా నిండి ఉన్నాయి. దీంతో ఆమె నిలబడే పయనం చేశారు. మాస్క్‌ను ఆమె ధరించి ఉండడంతో తొలుత ఎవరూ గుర్తు పట్టలేదు. చివరకు తమతో లెఫ్టినెంట్ గవర్నర్ పయనిస్తున్నట్టు గుర్తించిన అనేక మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే పనిలో పడ్డారు. కొందరు తన దృష్టికి పలుసమస్యలు తీసుకు రాగా, వారిని నేరుగా రాజ్‌నివాస్‌కు వచ్చి కలవాలని, తనను కలిసేందుకు ఎవరైనా రావచ్చు అని ప్రజలకు సూచించారు. కొన్ని గంటల పాటు బస్సులో పయనించి, ప్రజా సమస్యలు తెలుసుకున్న తమిళిసై మీడియాతో మాట్లా డారు. ప్రజా సమస్యల్ని తెలుసుకునే పరిష్కరించేందుకే ఈ పయనం అని ఆమె పేర్కొన్నారు. -
22న బలం నిరూపించుకోండి
సాక్షి ప్రతినిధి, చెన్నై/యానాం: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. ‘విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమం మొత్తం వీడియో రికార్డింగ్ జరగాలి. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగియాలి’అని గవర్నర్ కార్యాలయం ఒక తెలిపింది. అంతకుముందు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్ బంగ్లా రాజ్‌నివాస్‌లో ఆమె చేత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీప్ బెనర్జీ పదవీ ప్రమాణం చేయించారు. సీఎం నారాయణస్వామి ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. తెలంగాణ, పుదుచ్చేరి అనే కవలపిల్లలను ఎలా చూసుకోవాలో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వలసలు, రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. అయితే ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. -
పుదుచ్చేరి సంక్షోభం: తమిళిసై కీలక నిర్ణయం
పుదుచ్చేరి: ఎమ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. దీనికోసం ఈనెల 22వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడిని తొలగించి తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సమావేశంలో ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు పార్టీలకు ఎమ్మెల్యేలు సమానంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి భవితవ్యం సోమవారం తేలనుంది. 30 మంది సభ్యులున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నలుగురి రాజీనామాలతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. గతంలో మంత్రి నమశివ్వాయం, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్తో మరో ఇద్దరు రాజీనామాలు చేశారు. వీరందరి రాజీనామాతో ప్రస్తుతం ప్రభుత్వానికి 14 మంది (కాంగ్రెస్ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. దీనికి సమానంగా ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. చదవండి: కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం -
కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు
సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. నారాయణ స్వామి ఏమంటున్నారు? మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు. సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నేడు రాహుల్ రాక బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్ ఫిగర్ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దినేష్ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
జమ్మూకశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రెస్ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వికాస్ పురుష్‌గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. -
ముర్ము రాజీనామాకు కారణాలేమిటి?
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. నిన్నటి వరకు ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడం, వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందుకు అంగీకరించడం.. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సరిగ్గా ఏడాది కాలం పూర్తైన రోజే ముర్ము ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం సహా ఎల్జీగా కేంద్ర మాజీ మంత్రి నియామకం వంటి ఆకస్మిక పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.(చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం: భారత్) తొలి ఎల్జీగా జీసీ ముర్ము ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము.. జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 నవంబర్ 30 న పదవీ విరమణ చేసిన ఆయన అదే ఏడాది అక్టోబరులో జమ్మూ కశ్మీర్ ఎల్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఆ పదవిలో కొనసాగిన ముర్ము సాయంత్రానికి తన విధులకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం రద్దు చేసుకున్నారు. ఆ వెనువెంటనే రాజీనామాను సమర్పించారు. మరుసటి రోజే ఆయన స్థానంలో సీనియర్ నాయకులు, బీజేపీ మాజీ ఎంపీ మనోజ్ సిన్హా నియామఖం ఖరారైంది. (జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా) ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్జీగా నియమితులైన మనోజ్ సిన్హాకు శుభాకాంక్షలు తెలిపానన్న ఆయన.. తనకున్న రాజకీయ, పాలనా అనుభవంతో సిన్హా ఆ పదవికి మరింత వన్నె తీసుకువస్తారని పేర్కొన్నారు. దీంతో జమ్మూ కశ్మీర్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే కేంద్ర సర్కారు ఈ మేరకు పావులు కదిపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జీగా పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగిన నాయకుడిని ఎంపిక చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) అందుకే ముర్ము రాజీనామా చేశారా? మరోవైపు.. రాజకీయ ప్రయోజనాల కోసమే సిన్హా నియామకం జరిగిందని పలువురు భావిస్తున్నపటికీ.. ఇటీవల ముర్ము చేసిన వ్యాఖ్యలే ఆయన పదవికి ఎసరు తెచ్చాయని మరికొందరు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముర్ము మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్లో 4జీ సేవల(ఇంటర్నెట్)ను పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించుకున్నా తాను భయపడబోనని ఆయన పేర్కొన్నారు. కాగా కశ్మీర్లో లోయలో ఉగ్రవాదుల వల్ల ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున.. కేంద్ర హోం శాఖ ఇందుకు సుముఖంగా లేదని ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేగాక కశ్మీర్ లోయలో రాష్ట్రపతి పాలన కొనసాగింపు భావ్యం కాదని, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని ముర్ము పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు తోడు.. స్వయానా ఐఏఎస్ అధికారి అయిన ముర్ముకు ఎల్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్లతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయని.. అంతేగాక ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఎల్జీ తన ఆఫీసుకు తెప్పించుకుని, అక్కడి నుంచి సీఎస్‌కు నోట్స్ పంపేవారని తెలుస్తోంది. తప్పనిసరిగా తన ఆదేశాలు అమలు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం పరిస్థితి తన చేయి దాటి పోకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్టు జఫర్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘ కశ్మీర్ చాలా సున్మితమైన(బ్యూరోక్రాట్లకు) ప్రదేశం. ఈ కారణంగానే నెహ్రూ హయాంలోనూ సర్దార్ వల్లభబాయ్ పటేల్‌కు కొన్నిసార్లు విభేదాలు తలెత్తాయి. ఇక ముర్ము ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పాలనా విభాగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరికి కౌంటర్‌గా మరొకరు పనులు చేసేవారు. పాలనా వ్యవస్థలోని అంతర్గత విభేదాలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి’’అని పేర్కొన్నారు. ఎవరైనా అంతే కదా! ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక కారణాలు చూపి మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు కశ్మీరీ నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అంతేగాక 400 మందిని అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం వీరిలో కొంతమందిపై ఇంకా నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా పరిణామాల గురించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా నియమించే వ్యక్తులు వల్ల పెద్దగా తేడా ఉండబోదని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆందోళనలు ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న అభిప్రాయానికి అద్దం పట్టాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఇన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్ ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము బుధవారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆయన రాజీనామాను ఆమోదించారు. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శరవేగంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.(కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్ సిన్హా ఐఐటీ వారణాసి నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అఫ్జల్ అన్సారీ చేతిలో ఆయన ఓటమి పాలైన విషయం విదితమే. ఇక గతేడాది (ఆగస్టు 5న) ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. -
జెస్సికాలాల్ హంతకుడి విడుదలకు ఢిల్లీ ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: 1999లో సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో దోషిగా యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న మనుశర్మను ముందుగానే విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. మనుశర్మను ముందే విడుదల చేయాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన మే 11న జరిగిన భేటీలో ‘ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్’ సిఫారసు చేసింది. మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు. దక్షిణ ఢిల్లీలో ఉన్న టామరిండ్ కోర్ట్ రెస్టారెంట్లో మద్యం అందించేందుకు నిరాకరించిందన్న కారణంతో మోడల్ జెస్సికా లాల్‌ను మనుశర్మ తుపాకీతో కాల్చి చంపేశాడు. 1999 ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు మనుశర్మను నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు 2006 డిసెంబర్లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. -
కౌంట్‌డౌన్ మొదలైంది!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భంగా తన సేవలను గుర్తు చేస్తూ పుదుచ్చేరి ప్రజలకు ఆమె ఓ లేఖ రాయడమే కాదు, చివరగా కౌంట్‌డౌన్ మొదలైందంటూ ముగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 2016లో మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు స్వీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య నాలుగేళ్లుగా అధికార వార్ కొనసాగుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తాను లెఫ్టినెంట్ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు ముగించి, ఐదో వసంతంలోకి అడుగు పెట్టడంతో ప్రజలకు కిరణ్ ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో తాను బాధ్యతలు స్వీకరించడం, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. రాజ్ నివాస్ సేవల్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రజాహిత కార్యక్రమాల్ని ఎన్నడూ రాజ్ నివాస్ అడ్డుకోలేదని వివరించారు. రాజ్ నివాసన్ ప్రజల నివాస్‌గా మారిందన్నారు. వారంలో ఓ రోజు ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు సాగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు కరోనా అందుకు అడ్డు వచ్చినట్టు పేర్కొన్నారు. మున్ముందు ఈ కార్యక్రమాలు కొనసాగేనా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ పరమైన సిద్ధాంతాల్ని పునఃపరిశీలించాల్సి ఉందని వివరించారు. మద్యం దుకాణాల వేలం, ఆస్తి, వినోద పన్నుల బకాయిల వసూళ్లు, కొన్నేళ్లుగా చెల్లించకుండా ఉన్న ప్రభుత్వ స్థలాల లీజుకు సంబంధించిన అద్దెల వసూళ్లు అంశాలపై పునఃపరిశీలన తప్పనిసరిగా పేర్కొన్నారు. కరోనా రూపంలో పర్యాటక ఆదాయం పూర్తిగా కోల్పోవడం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుతం చేతిలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఆదాయం పెంచుకోవాల్సిన ఉందన్నారు. విజయన్ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నియమించ బడ్డ లేదా ఎంపిక చేసిన అధికారులు నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక పరిస్థితుల మెరుగు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ, చివరగా పుదుచ్చేరికి సేవ చేయడానికి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిందని, ఐదో ఏట అడుగు పెట్టానని, ఇక, తన కౌంట్‌డౌన్ మొదలైందని ముగించారు. ఈ దృష్ట్యా, మళ్లీ అవకాశం ఇచ్చినా, ఆ పదవిలో కిరణ్ కొనసాగేది అనుమానమేనా అన్న చర్చ బయలు దేరింది. -
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయండి
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సుల్లో మోదీ మాట్లాడారు. ఆరోగ్య, విద్య, పర్యాటక రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పేద, అణగారిన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని ప్రధాని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ, మహిళ, యువజన వర్గాలకు ప్రభుత్వ పథకాల లబ్ది అందేలా చూడాలని కోరారు. పరస్పర సహకారం, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ సాకారానికి గవర్నర్ల వ్యవస్థ ఎంతో కీలకమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ రచన 70 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంచేందుకు కలిసి పనిచేయాలి’ అన్నారు. ఢిల్లీలో జరిగిన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో తొలిసారి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమితులైన 17 మంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాదు!రాష్ట్రపతి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రజల సేవకు, సంక్షేమానికి నిత్యం పనిచేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలు లడాఖ్, జమ్మూ కశ్మీర్‌ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆర్.కె.మాథుర్, జి.సి.మర్మూల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాష్ట్రపతి గిరిజనుల అభివృద్ధి, సాధికారత సమీకృత అభివృద్ధికి, దేశ భద్రతలకూ కీలకమని వ్యాఖ్యానించారు. ‘వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి సంబంధించి గవర్నర్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయవచ్చు’ అని సూచించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ రాష్ట్రం స్థానంలో నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా జీసీ ముర్ము, లేహ్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఆర్కే మాథుర్ గురువారం పాలనాపగ్గాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5వ తేదీన కేంద్ర తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం తెల్సిందే. లదాఖ్ రాజధాని లెహ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథుర్‌తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జీసీ ముర్ము(59)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధాకృష్ణ మాథుర్(66) 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా, సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ముర్ము స్వస్థలం ఒడిశా. విధుల్లో ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి అధికారి ముర్మునే. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం కేంద్ర విధించిన ఆంక్షలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
ఇద్దరు మాత్రమే వచ్చారు!
శ్రీనగర్: కేంద్ర పాలిత జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్ ఎల్జీగా ఆర్కే మాథూర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణం చేయించారు. లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథూర్ ప్రమాణం చేశారు. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారానికి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. జమ్మూ నియోజకవర్గ లోక్‌సభ ఎంపీ జుగల్ కిశోర్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు నజీర్ అహ్మద్ లావే మాత్రమే హాజరుకావడం గమనార్హం. నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ)కి చెందిన ఎంపీలు, పీడీపీ రాజ్యసభ సభ్యుడు మరొకరు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. శ్రీనగర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉండటంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లోని తన అధికార నివాసంలో ఆహ్వాన పత్రికను విసిరేసి వెళ్లారని పీడీపీ రాజ్యసభ ఎంపీ ఫయాజ్ మిర్ తెలిపారు. అయితే తాను కశ్మీర్లో లేనని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తరపున తనకు అందించిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు బారాముల్లా ఎంపీ అక్బర్ లోనె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వెళితే రాష్ట్ర విభజనను ఆమోదించినట్టు అవుతుందన్న ఉద్దేశంతో గైర్హాజరైనట్టు తెలిపారు. (చదవండి: నవ కశ్మీరం ఎలా ఉండబోతోంది?) -
కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ముర్ము
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము శుక్రవారం జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ముర్ము సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలన కొనసాగిస్తుంది.1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము ఈ నవంబర్ 30 న పదవీ విరమణ చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఈ నెల 31న శ్రీనగర్‌లో ముర్ము ప్రమాణ స్వీకారంచేస్తారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాల పరిపాలనాధికారిగా ఆయన వ్యవహరిస్తారు. మరోవైపు, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే మాథుర్ నియమితులయ్యారు.మాథుర్ 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత సంవత్సరం ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్ అయ్యారు. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన అక్టోబర్ 31న లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్ గోవా గవర్నర్‌గా వెళ్తున్నారు. తన మిగతా పదవీకాలాన్ని ఆయన గోవాలో పూర్తి చేస్తారు. ముర్ము లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారులుగా వ్యవహరిస్తున్న కే విజయకుమార్, ఖుర్షీద్ గనాయి, కే సికందన్, కేకే శర్మల పదవీకాలం కూడా ముగుస్తుంది. మరోవైపు, మాజీ ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మను లక్షద్వీప్ పరిపాలనాధికారిగా నియమిస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైను నియమించారు. -
కశ్మీర్ ఎల్జీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన విజయ్ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్ గుర్తింపు పొందనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రం తరఫున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్ వ్యవహారాలను గవర్నర్ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ఆయన నియమకానికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుత్తున్నాయి. ఎవరీ విజయ్!? విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను 2004 అక్టోబర్‌లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వీరప్పన్‌ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ట్రాక్ రికార్డ్!! హైదరాబాద్ నగరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజీ, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. అందుకే ఇంతటి రికార్డ్ ఉన్న విజయ్ను కశ్మీర్‌కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఇదిలావుండగా.. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మిత్రుడు కావడంతో నరసింహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా నరసింహన్ కాకుండా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. -
మహా అమరవీరుడు
పది నిమిషాలలో ఓ నదిని సృష్టించడం సాధ్యమా? శాంతియుతంగా సమావేశమైన పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది నిరాయుధుల మీద... మహిళలు... వారి చంకలలోని పసివాళ్లు... చేతులు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు.. వృద్ధులు... యువకులు... మధ్య వయస్కులు... ఎలాంటి తరతమ భేదం లేకుండా, నిర్దాక్షణ్యంగా జరిపిన కాల్పులు ఐదు నదులున్న పంజాబ్‌లో ఆరో నదిని పారించాయి. అక్షరాలా అదొక నెత్తుటి నది. ఆ ఆరో నదిని పారించినవాడు జనరల్ రెజినాల్డ్ డయ్యర్– పది నిమిషాల వ్యవధిలోనే. ఇందుకు ఆదేశించినవాడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్. ఏప్రిల్ 13, 1919న పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన నరమేధానికి పట్టిన సమయం పది నిమిషాలే. ఆ రక్తస్రవంతి పంజాబ్ నేల మీద వారానికో పది రోజులకో ఇంకి పోయి ఉండవచ్చు. కానీ ఒక శతాబ్దం గడిచినా కూడా మానవాళి జ్ఞాపకాలలో ప్రవహిస్తూనే ఉంది. అలా ప్రవహిస్తూనే ఉంటుంది. జలియన్‌వాలా బాగ్ కాల్పుల మృతుల సంఖ్య 379 అని, క్షతగాత్రులు పదకొండు వందలని ప్రభుత్వం ప్రకటించింది. కాదు, మృతుల సంఖ్య వేయి దాటిందని భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్, ఇతర పంజాబీ నేతల వాదన. రవీంద్రనాథ్ టాగూర్, మోతీలాల్ నెహ్రూ, మదనమోహన్ మాలవీయ వంటివారి గుండె మండింది. కానీ నెత్తురు మరిగినవాడు మాత్రం ఉద్దమ్‌సింగ్. జలియన్‌వాలా బాగ్ కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. ఆ నిర్భాగ్యుల భౌతికదేహాలు అలాగే ఉండిపోయాయి. రక్తం కారే గాయాలతో క్షతగాత్రులు నరకయాతన అనుభవించారు. మరునాడు జనరల్ డయ్యర్ స్వర్ణదేవాలయానికి వెళ్లాడు. దాని నిర్వాహకుడు (జతేతార్) అరూర్సింగ్ను పిలిచాడు. ఇక్కడ మరో సభ జరుగుతుందని చెప్పుకుంటున్నారు, ఏమిటని ప్రశ్నించాడు. అది వదంతేనని తేల్చాడు అరూర్. నిజానికి అక్కడ జనం పోగుపడితే, జలియన్‌వాలా బాగ్‌లో మాదిరిగానే ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులు జరపాలని అతడికి కోరికగా ఉంది. కానీ సిక్కులు సిపాయీలలో తిరుగుబాటు వస్తుందని భయపడ్డాడు. తరువాత అరూర్‌సింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్‌ను స్వర్ణాలయానికి ఆహ్వానించి ‘సిరోపా’తో (ప్రార్థనా స్థలానికి ప్రముఖులు, పెద్దలు వచ్చినప్పుడు కప్పే పవిత్ర వస్త్రం) సత్కరించాడు. సిక్కు దీక్షకు ప్రతీకలైన కరవాలం, తలపాగా కూడా బహూకరించాడు. అంటే గౌరవ సిక్కుగా స్థానం కల్పించాడు (ఈ విషయాన్ని ఓడ్వయ్యర్ భార్య ధ్రువీకరించారు. డాన్ పత్రిక కూడా నివేదించింది). అక్కడితో ఆగకుండా జనరల్ డయ్యర్‌ను, అతని సహాయకుడు బ్రిగేడ్–మేజర్ కెప్టెన్ బ్రిగ్స్‌ను కూడా స్వర్ణాలయానికి అరూర్‌సింగ్ ఆహ్వానించాడు. జనరల్ డయ్యర్ జీవిత చరిత్ర రాసిన ఇయాన్ కోల్విన్ అనే చరిత్రకారుడు అరూర్‌సింగ్, డయ్యర్ మధ్య జరిగిన సంభాషణ గురించి రాశాడు. అంతకు ముందు నికల్సన్ అనే బ్రిటిష్ సైనికాధికారి సిక్కు మతం స్వీకరించినట్టే మీరు కూడా స్వీకరించాలని అరూర్ సింగ్ కోరాడు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. కానీ మా ప్రభుత్వ నిబంధనలను బట్టి నేను ఈ ఉద్యోగంలో అంత జుట్టు పెంచకూడదు అన్నాడు జనరల్ డయ్యర్. మీరు సిగరెట్ తాగడం మానెయ్యాలన్నాడు అరూర్. నా వల్ల కాదన్నాడు డయ్యర్. మెల్లగా వదిలిపెట్టండి అన్నాడు అరూర్. ప్రయత్నిస్తాను, సంవత్సరానికి ఒక్క సిగరెట్ తాగుతాను అన్నాడు డయ్యర్. డయ్యర్ మీద ఇంత ప్రేమాభిమానాలు కనిపించాయి. 1857 తరహా కలహాన్ని, రక్తపాతాన్ని తప్పించినవాడిగా ఓడ్వయ్యర్‌నీ, డయ్యర్‌నీ బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ శ్లాఘించింది. మార్నింగ్ పోస్ట్ అనే ఇంగ్లండ్ పత్రిక 26,000 పౌండ్లు వసూలు చేసి పంపించింది. బాధితులకి కాదు, బాధించినవారిని సత్కరించడానికి. ఈ నిధికి సాహిత్య నోబెల్ గ్రహీత రుడ్యార్డ్ కిప్లింగ్ తన వంతు సాయం చేశాడు. హంటర్ కమిషన్ నివేదిక వెలువడిన తరువాత ఈ దేశం విడిచి వెళ్లిన జనరల్ డయ్యర్‌కు (ఇతడు పంజాబ్‌లోనే పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు) బహుమానంగా ఇచ్చిన మొత్తం 26,000 పౌండ్లు. డయ్యర్ 1927లో పక్షవాతంతో, మెదడులో నరాలు చిట్లి మరణించాడు. మరి, ఓడ్వయ్యర్? ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. ఉద్దమ్‌సింగ్‌ని మహా అమరుడు అని పిలుస్తారు. ఆయన జలియన్‌వాలా బాగ్ కాల్పులకు ప్రత్యక్ష సాక్షి. ఈ దురంతం సాగించిన వాడి మీద పగ తీర్చుకోవడానికి ఆయన ఇరవై ఒక్క సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఉద్దమ్‌సింగ్ (డిసెంబర్ 26, 1899–జూలై 31, 1940) ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పటియాలా సంస్థానంలో ఉన్న సునామ్ వారి స్వగ్రామం. ఇది పంజాబ్‌లోనే సంగ్రూర్ జిల్లాలో ఉంది. ఉద్దమ్ అసలు పేరు షేర్సింగ్. తండ్రి తెహల్సింగ్ కాంభోజ్ ఉపాలీ అనే గ్రామంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కాపలాదారు. తల్లి నారాయణ్ కౌర్. ఆయన బాల్యం అందమైనది కాదు. తల్లి 1901లోనే కన్నుమూశారు. తండ్రి 1907లో పిల్లలను అక్షరాలా అనాథలను చేసి మరణించారు. పేద కుటుంబం కాబట్టి షేర్‌సింగ్‌ను, ఆయన అన్నయ్య ముక్తాసింగ్‌ను అమృత్‌సర్‌లో ఉన్న కేంద్ర ఖల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆయనకు సిక్కు మతం ఇచ్చి, ఉద్దమ్‌సింగ్ అని పేరు మార్చారు. అన్నయ్య పేరును సాధుసింగ్ అని మార్చారు. అదేం దురదృష్టమో సాధుసింగ్ పదేళ్ల తరువాత, అంటే 1917లో ఉద్దమ్‌ను ఏకాకిని చేసి హఠాత్తుగా చనిపోయాడు. 1918లో ఉద్దమ్ మెట్రిక్యులేషన్ చదివిన తరువాత అనాథాశ్రమాన్ని వీడి వెళ్లిపోయాడని అంటారు. కానీ ఆయన జలియన్‌వాలా బాగ్ కాల్పులను దగ్గర నుంచి చూడడానికి కారణం, అనాథాశ్రమంలో ఉండడమే కారణమన్న వాదన కూడా ఉంది. ఏమైనా మొదటి ప్రపంచయుద్ధం, గదర్ పార్టీ ఆనాడు పంజాబ్‌ను అతలాకుతలం చేసిన కాలమది. ఎటు చూసినా రాజకీయ అలజడే. ఏప్రిల్ 13న, 1919 వైశాఖి. ఆ రోజు పంజాబీలకు ముఖ్యమైన పండగలలో ఒకటైన ఉగాది. ఒక చోట పశువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి వచ్చిన జనమంతా జలియన్‌వాలా బాగ్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశానికి హాజరయ్యారు. అప్పుడే జనానికి మంచినీళ్లు అందించే స్వచ్ఛంద సేవకులలో ఒకనిగా ఉద్దమ్ కూడా పనిచేశారు. ఈ స్వచ్ఛంద సేవకులను ఖల్సా అనాథ శరణాలయం పంపించింది. కాల్పులు జరుగుతుండగా రత్తన్‌దేవి అనే ఆవిడ భర్త గాయపడ్డాడని, అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించే పనిలో ఉండగానే ఉద్దమ్‌కు తూటా గాయం తగిలిందని చెప్పే సమాచారం కూడా ఉంది. అదంతా చూసిన తరువాత ఉద్దమ్ ఆంగ్ల జాతి మీద కక్ష పెంచుకున్న మాట నిజం. 1920 చివర ఉద్దమ్ కూలీగా తూర్పు ఆఫ్రికా వెళ్లిపోయాడు. అక్కడ నుంచి అమెరికా చేరుకున్నాడు. డెట్రాయిట్లో ఉన్న ఫోర్డ్ కంపెనీలో టూల్ మేకర్‌గా ఉద్యోగం చేశాడు. తరువాత శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాడు. అక్కడే ఆయనకు గదర్ పార్టీ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఇందులో ఎక్కువగా పంజాబీ సిక్కులే పనిచేసేవారు. భార™Œ లో సాగుతున్న ఇంగ్లిష్ దుష్ట పాలనను అంతం చేయడానికి అమెరికా ఆసరాగా సాయుధ విప్లవం తీసుకురావడమే గదర్ పార్టీ ఉద్దేశం. ఆ పార్టీలో చేరిన తరువాత అమెరికా అంతా తిరుగుతూ మద్దతు కూడగట్టే యత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన షేర్సింగ్, ఉదేసింగ్, ఫ్రాంక్ బ్రెజిల్ పేర్లతో సంచరించేవారు. గదర్ ఏ గంజ్ అనే పత్రికను ఆయన నడిపేవారు. ఈ దశలోనే 1927లో భారతదేశం రావలసిందిగా తను ఎంతో ఆరాధించే భగత్‌సింగ్ నుంచి పిలుపు వచ్చింది. కానీ భారతదేశం రాగానే ఆయనను అరెస్టు చేశారు. ఐదేళ్లు కారాగార శిక్ష పడింది. అక్టోబర్ 23, 1931న బయటకు వచ్చిన ఉద్దమ్‌కు అనేక బాధాకరమైన విషయాలు తెలిశాయి. అందులో ఒకటి 1931, మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను ఉరి తీసిన సంగతి. ఇంకొకటి– జలియన్‌వాలా బాగ్ కాల్పులకు పాల్పడిన జనరల్ డయ్యర్ 1927లో చనిపోయాడు. ఉద్దమ్ తన స్వగ్రామం చేరుకున్నాడు. కానీ ఆయన మీద నిరంతర నిఘా ఉండేది. భగత్‌సింగ్ ఆరంభించిన హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో ఆయన సభ్యుడు. పోలీసుల కన్నుగప్పడానికి మళ్లీ ఒక కొత్త పేరు పెట్టుకున్నాడు. అది – మహమ్మద్ సింVŠ ఆజాద్. వృత్తి బోర్డుల మీద వ్యాపార ప్రకటనలు రాయడం. ఈ పేరుతో రహస్యంగా లండన్ వెళ్లాలని ఆయన ఆలోచించారు. ఎందుకు? డయ్యర్ చనిపోయినా, కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన నాటి లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ బతికే ఉన్నాడు. అతడిని చంపాలి. మొదట పోలీసు వేషంలో కశ్మీర్ చేరుకున్నారు ఉద్దమ్. అక్కడ నుంచి జర్మనీ వెళ్లపోయారు. అక్కడ నుంచి ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆపై ఆస్ట్రియా చేరుకున్నారు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి 1934 నాటికి లండన్ చేరుకున్నారు. తూర్పు లండన్‌లో 9, ఆడ్లర్ స్ట్రీట్, వైట్‌చాపెల్ అనే చోట మకాం ఏర్పాటు చేసుకున్నారు. ఒక కారు కూడా కొన్నారు. ఆయన అక్కడ గడిపిన తీరు చిత్రంగా ఉంటుంది. పెయింటర్‌గా, వ్యాపార ప్రకటనలు రాసే కళాకారునిగా, మోటార్ మెకానిక్‌గా ఆయన అవతారాలు ఎత్తాడు. ఆఖరికి అలెగ్జాండర్ కోర్డా అనే ఆయన నిర్మించిన ఒకటి రెండు చిత్రాలలో అతిథి నటునిగా కూడా వేషాలు వేశారు. మొత్తానికి ఒకరోజు మైఖేల్ ఓడ్వయ్యర్ ఒక సమావేశానికి వస్తున్న సంగతి ముందుగానే తెలుసుకున్నాడు ఉద్దమ్. కాక్స్టన్ హాలులో సెంట్రల్ ఏసియన్ సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడాలి. ఆ కార్యక్రమం మార్చి 13, 1940న జరిగింది. అప్పటికే ఉద్దమ్ ఒక పబ్‌లో ఒక సైనికుడిని ఒక రివాల్వర్‌ను సంపాదించాడు. ఒక పుస్తకం లోపల పేజీలు రివాల్వర్ పట్టడానికి అనుకూలంగా తొలిచి, అందులో దానిని దాచి హాలులోకి వెళ్లాడు ఉద్దమ్. ఇక సమావేశం ముగుస్తుందనగా ఉద్దమ్ వేదిక ముందుకు వెళ్లి ఒడ్వయ్యర్కు గురిపెట్టి రెండుసార్లు రివాల్వర్ కాల్చాడు. ఒకటి గుండెలలో దూసుకుపోయింది. మరొకటి ఊపిరి తిత్తులను చీల్చుకుంటూ వెళ్లింది. అక్కడికక్కడే ఒడ్వయ్యర్ మరణించాడు. ఉద్దమ్ పోలీసులు వచ్చేదాకా అక్కడే నిలబడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఇండియా వ్యవహారాల కార్యదర్శి జెట్లాండ్ మీద కూడా కాల్పులు జరిపి గాయపరిచారాయన. ఉద్దమ్ చర్య హేయమైనదని గాంధీ, నెహ్రూ ప్రకటించారు. ఉద్దమ్‌ను బ్రిక్స్టన్ జైలులో ఉంచారు. అక్కడ తన నిరసన వ్యక్తం చేస్తూ 42 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు. చివరికి జైలు అధికారులు ఆయనకు బలవంతంగా ఆహారం అందించారు. పాత బీలే అనేచోట ఉన్న సెంట్రల్ క్రిమినల్ కోర్టులో జూన్ 4, 1940న జస్టిస్ అట్కిన్సన్ ఆయనను విచారించాడు. ఉద్దమ్ తరఫున నాడు ఉద్దండులైన సెయింట్ జాన్ హచిన్సన్, వీకే కృష్ణమీనన్ వాదించారు. జలియన్‌వాలా బాగ్ రక్తపాతానికి ప్రతీకారంగానే తాను ఈ హత్య చేశానని, ఆ శిక్ష ఓడ్వయ్యర్ తగినదేనని ఉద్దమ్ న్యాయమూర్తికి చెప్పాడు. మాతృదేశం కోసం చనిపోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కూడా వెల్లడించాడు. ఇందుకు ఇరవై ఒక్క ఏళ్లుగా వేచి ఉన్నానని, నా జీవిత ధ్యేయం నెరవేరిందని ధైర్యంగా ప్రకటించారాయన. ఉద్దమ్ ఉపన్యాసం పత్రికలలో రాకూడదని న్యాయమూర్తి ఆదేశించాడు. జూలై 31న పెంటన్‌విల్లే కారాగారంలో ఆయనను ఉద్దమ్‌ను ఉరి తీశారు. అక్కడే ఖననం చేశారు. 1974లో ఆయన శరీర శకలాలు కొన్ని తెచ్చి ఆయన స్వగ్రామంలో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. (జలియన్‌వాలాబాగ్ సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా) డా. గోపరాజు నారాయణరావు -
ఆప్‌కు శరాఘాతం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికార పోరు కొత్తేమీ కాదు. కేంద్రంలో ఎన్డీయే, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆధిపత్య పోరు మరింత పెరిగింది. కేంద్ర సర్వీసు అధికారులు తమ ప్రభుత్వ పనులకు నిత్యం అడ్డుతగులుతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవా ల్ ఎన్నాళ్ల నుంచో ఆరోపిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజాల్, ఇంతకుముందు, ఎల్జీగా పనిచేసిన నజీబ్ జంగ్ విభేదించిన సందర్భాలు ఎన్నో ఉన్నా యి. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఢిల్లీ పై కేంద్రానికి రాజ్యాంగం ప్రత్యేక అధికారా లు కట్టబెట్టడాన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవా లు చేసింది. తాజా తీర్పుతో ఢిల్లీలో అధికార నియంత్రణపై కొంత స్పష్టత వచ్చిందనే చెప్పవచ్చు. చాలా అంశాల్లో ఎల్జీదే తుది మా ట అని ద్విసభ్య ధర్మాసనం చెప్పడం ఒకింత ఆప్ సర్కారుకు శరాఘాతమనే భావించాలి. ఆది నుంచీ ఆధిపత్య పోరు.. 2015లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆధిపత్య పోరాటం మొదలయింది. అయితే దీనికి 2014లోనే బీజం పడింది. 2014లో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ మొదటి సారి అధికారం చేపట్టింది. అవినీతి నిర్మూలన లక్ష్యంగా కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్‌కు నచ్చలేదు. దీంతో సంకీర్ణం కొనసాగడం కష్టమని భావించిన కేజ్రీవాల్ 49 రోజులకే రాజీనామా చేశారు. ఏడాది రాష్ట్రపతి పాలన తరువాత మళ్లీ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. శాసన సభలో 70సీట్లుంటే ఆప్ పార్టీ 67 స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం మూడే స్థానాలే లభించాయి. దీంతో బీజేపీ తమ సర్కారుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్‌ను వాడుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అప్పటి నుంచి అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం–లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికార పోరాటం సాగుతోంది. గత తీర్పుకు కొంచెం భిన్నంగా... లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ సర్కార్ మధ్య అధికార పోరు కేసులో గత ఏడాది జులై 4న సుప్రీం కోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఎల్జీ అనిల్ బైజాల్‌కు ఏ విషయంలోనయినా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని, ఆయన మంత్రి మండలి సలహా మేరకు నడుచుకోవాలని జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ‘అవరోధకుడిగా’వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మంత్రి మండలి తాను తీసుకునే నిర్ణయాలన్నింటినీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియజేసి తీరాలని పేర్కొంది. అయితే, ఆ నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి కాదని తెలిపింది. ఈ విషయంలో నిరంకుశత్వానికి, అరాచకత్వానికి తావులేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మాత్రం భిన్నంగా స్పందిస్తూ భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు తుది నిర్ణయం తీసుకునే హక్కును ఎల్జీకి కట్టబెట్టింది. -
‘ఢిల్లీ’ పెత్తనం కేంద్రానికే!
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం, దేశ రాజధాని అయిన ఢిల్లీలో అధికారాల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సివిల్ సర్వీసెస్ అధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే దానిపై ఇద్దరు సభ్యుల ధర్మాసనం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ‘ఢిల్లీ వర్సెస్ కేంద్రం’గా ప్రాచుర్యం పొందిన ఈ వ్యవహారంపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఢిల్లీలో అధికారం చెలాయించడంపై కేంద్రం, ఆప్ సర్కారు మధ్య ఆరు అంశాలపై నెలకొన్న పోరుకు సంబంధించి బెంచ్ మిగిలిన ఐదింటిపై ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పింది. మొత్తంగా చూస్తే, మెజారిటీ విషయాల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని నర్మగర్భంగా పేర్కొంది. కేంద్రం నియమించిన అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని ఆప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలతో కేజ్రీవాల్ ప్రభుత్వం తరచూ విభేదిస్తోంది. తాజా తీర్పుపై ఆప్ నిరాశ వ్యక్తం చేస్తూ, కనీసం తన కార్యాలయంలో ప్యూన్‌ను నియమించుకునే అధికారం కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని వాపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకమని, న్యాయపర చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టుపై అతిపెద్ద దాడితో సమానమని బీజేపీ అభివర్ణించింది. ఏసీబీ ఎల్జీకి..రెవెన్యూ వ్యవహారాలు ప్రభుత్వానికి అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పరిధిలోనే పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, విచారణ కమిషన్ల నియామక అధికారాల్ని కూడా కేంద్రానికే కట్టబెట్టింది. ఇక రెవెన్యూ వ్యవహారాలను తేల్చేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, విద్యుత్ బోర్డు లేదా కమిషన్ ఏర్పాటు అధికారం ఢిల్లీ ప్రజా ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులపై నియంత్రణ విషయంలోనే ఇద్దరు జడ్జీలు విభేదించారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదని జస్టిస్ అశోక్ భూషణ్ కరాఖండిగా చెప్పారు. ఈ విషయంలో జస్టిస్ సిక్రి కొంత భిన్నంగా స్పందించారు. జాయింట్ డైరెక్టర్ లేదా అంతకు పైహోదా అధికారుల నియామకం, బదిలీలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని తెలిపారు. మిగిలిన బ్యూరోకాట్ల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని, ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే ఎల్జీ మాటే చెల్లుబాటవుతుందని అన్నారు. గ్రేడ్–3, గ్రేడ్–4 స్థాయి అధికారుల నియామకాలు, బదిలీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన సవ్యంగా సాగాలంటే కార్యదర్శులు, విభాగాధిపతుల నియామకాలు, బదిలీలను ఎల్జీనే చేపట్టాలని అన్నారు. ఢిల్లీ–అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీస్, ఢిల్లీ–అండమాన్ నికోబార్ దీవుల పోలీస్ సర్వీస్ అధికారుల విషయంలో ఢిల్లీ కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుని, ఆ దస్త్రాన్ని ఎల్జీకి పంపించాలని పేర్కొన్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎల్జీనే అని చెప్పారు. సివిల్ సర్వీ సెస్ అధికారులపై నియంత్రణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరు జడ్జీలు ఈ అంశాన్ని విస్త్రృత ధర్మాసనానికి నివేదించారు. ఈ విషయంలో జస్టిస్ సిక్రి, జస్టిస్ భూషణ్‌ల అభిప్రాయాల్ని పరిశీలించి ప్రధాన న్యాయమూర్తి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తారు. ఢిల్లీ ప్రజల కష్టాలు తీరవు సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని అధికార ఆప్ పేర్కొంది. జడ్జీల విరుద్ధ అభిప్రాయాలతో ఢిల్లీ ప్రజల కష్టాలు కొనసాగుతాయని వ్యాఖ్యానించింది. ఆప్ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే అధికారుల్నే కేంద్రం నియమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రభుత్వం న్యాయపర చర్యలు ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టుపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అత్యున్నత ధర్మాసనంపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేస్తామని బీజేపీ హెచ్చరించింది. -
తీర్పు వెలువడ్డ కొద్దిగంటలకే...
కోర్టు తీర్పు తర్వాత కూడా ఢిల్లీ రాజకీయాల్లో మార్పు కనిపించటం లేదు. కొద్ది గంటల్లోనే ఆప్ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. సర్కార్ జారీ చేసిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని చెబుతూ సర్వీసెస్ డిపార్ట్మెంట్.. ఆ ఆదేశాలను తిరస్కరించింది. దీంతో అగ్గిరాజుకుంది. కోర్టు ధిక్కారమే.. తాజా అంశంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం కేంద్రం పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తీర్పులో కోర్టు స్పష్టంగా.. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. ఆ లెక్కన కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌కే బదిలీల అధికారం పూర్తిగా ఉంటుందని ఆయన అంటున్నారు. దీనిపై ఎల్జీ కార్యాలయం అధికారికంగా స్పందించాల్సి ఉంది. బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు... ‘ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదు. ప్రభుత్వం తన నిర్ణయాలను ఎల్జికి తెలిపితే సరిపోతుంది. ఆమోదం అవసరం లేదు’ అని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన బెంచ్ తీర్పు వెల్లడించింది. -
ముఖ్యమంత్రిది మరీ చప్రాసి బతుకయ్యింది
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనూహ్యమైన మద్దతు లభించింది. రాజ్యసభలో పలు పార్టీలు ఆయనకు అనుకూలంగా గళం విప్పాయి. గత కొంత కాలంగా ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం ఎక్కువైపోవటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఎల్జీ అలా చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ సహా మూడు పార్టీల నేతలు ఈ అంశంపై చర్చించారు. ఓ ముఖ్యమంత్రిని దారుణంగా అవమానిస్తున్నారంటూ వారు ప్రసంగించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన్ని(కేజ్రీవాల్‌ను) ఓ చప్రాసీలా భావిస్తున్నాడు. ఓ ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో అవమానించటం తగదు’’ అని ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ సభలో ప్రసంగించాడు. అదే సమయంలో దేశ రాజధాని హోదాలో ఉన్న ప్రాంత ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం అవసరం ఉందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఆపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐలు కూడా ఈ అంశంపై సభలో ప్రసంగించాయి. కాగా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధికారంలోకి వచ్చాక లెఫ్టినెంట్ గవర్నర్లతో అస్సలు పోసగకపోవటం చూస్తూనే ఉన్నాం. గతంలో నజీబ్ జంగ్, తర్వాత అనిల్ బైజల్.. ఎల్జీ హోదాలో అధికారం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఎల్జీ అధికారాలపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఓ పిటిషన కూడా దాఖలు చేయగా.. అది పెండింగ్‌లో ఉంది. తాజాగా సీఎం కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ‘ఇంటింటికే ప్రజా సేవలు’ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపుల్ల వేయటంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
కిరణ్‌కు అభయం
►కేంద్రం అధికారాలు సీఎంకు హోం శాఖ వివరణ ►ఇక, సంకటంలో నారాయణ సర్కారు చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కేంద్రం అభయం ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి సర్కారును సంకటంలోకి నెట్టే రీతిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి ఇచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన వివరణ మున్ముందు పుదుచ్చేరిలో ఎలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అస్త్రంగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా అవుతున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి మధ్య నిత్యం సమరమే. వీరిద్దరి మధ్య చాప కింద నీరులా సాగుతున్న వివాదం చివరకు ముదిరి పాకాన పడింది. ప్రభుత్వానికి అండగా అన్నాడీఎంకే, డీఎంకే అండగా నిలవడంతో కిరణ్‌ను రీకాల్ చేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, తమకు కల్పించిన హక్కులను కాలరాసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలతో కిరణ్‌ను బర్తరఫ్ చేయాలని లేదా, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు చేరాయి. అయితే, ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ కిరణ్‌కు మరింత అభయాన్ని ఇస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలను వివరిస్తూ సీఎం నారాయణ స్వామికి సవవిరంగా లేఖాస్త్రాన్ని సంధించడం గమనార్హం. నారాయణ ప్రభుత్వానికి సంకట పరిస్థితులు రాష్ట్రాల గవర్నర్ల కన్నా, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందులో వివరించారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వర్గంతో సంబంధం లేకుండా, ముందుకు సాగే అవకాశం ఉందని, అవసరం అయితే, అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సైతం వీలుందని వివరించడం గమనార్హం. అలాగే, మంత్రివర్గం నుంచి వచ్చే ఫైల్స్‌లో ఏదేని అనుమానాలు ఉన్నా, అధికారుల్ని పిలిపించి సమీక్షించడం, అవసరం అయితే, సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సైతం అధికారం ఉన్నట్టు అందులో పేర్కొనడం బట్టి చూస్తే, మున్ముందు నారాయణ సర్కారుకు కిరణ్రూపంలో మరిన్ని సంకట పరిస్థితులు తప్పవని స్పష్టం అవుతోంది. అలాగే విభేదాలు తలెత్తినా, అభిప్రాయభేదాలు ఎదురైనా, సమస్యలు తాండవించినా.. కీలక నిర్ణయం తీసుకునేందుకు తగ్గ సిఫార్సును రాష్ట్రపతికి చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నట్టు అందులో హెచ్చరించి ఉండడం గమనార్హం. అయితే, వీటన్నింటి గురించి పట్టించుకోకుండా, పుదుచ్చేరి ప్రగతి తనకు లక్ష్యం అని నారాయణ ముందుకు సాగుతున్నారు. ఆగస్టులో పుదుచ్చేరి హార్బర్ నుంచి సరకుల రవాణా విస్తృతం, సెప్టెంబరులో పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి విమాన సేవలు సాగేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు. -
కేజ్రీవాల్‌కు ఎల్జీ షాక్.. రూ. 97 కోట్లు కట్టాల్సిందే!
-
కేజ్రీవాల్‌కు ఎల్జీ షాక్.. రూ. 97 కోట్లు కట్టాల్సిందే!
ఇంతకుముందున్న లెఫ్టినెంట్ గవర్నర్‌తో దాదాపు ప్రతిరోజూ కొట్లాటలకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త ఎల్జీ అనిల్ బైజల్‌తోనూ తలనొప్పి తప్పలేదు. ప్రభుత్వ ప్రకటనలలో కేజ్రీవాల్‌ను చూపించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 97 కోట్లు చెల్లించడానికి పార్టీకి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ ప్రకటనలన్నింటికీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు చెల్లించారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసులు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్లు లేవు. ఇప్పటివరకు ముఖ్యమంత్రికి గానీ, ఉప ముఖ్యమంత్రికి గానీ, పార్టీకి గానీ ఈ నోటీసుల గురించి ఎలాంటి సమాచారం లేదని, తమకు ఏమైనా సమాచారం వస్తే గానీ దీనిపై వ్యాఖ్యానించలేమని ఆప్ వర్గాలు అన్నాయి. ప్రభుత్వ ప్రకటనలలో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు 2015లో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం, అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానివల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థకు ముప్పు కలుగుతుందని వాదించాయి. దాంతో గత సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలను కూడా అనుమతిస్తామని చెప్పింది. -
ఎల్జీగా అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ (70) శనివారం ప్రమాణం చేశారు. నజీబ్ జంగ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఢిల్లీ 21వ ఎల్జీగా అనిల్ బైజల్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీ రోహిణి ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణం చేయించారు. 1969 ఐఏఎస్ బ్యాచ్ అధికారైన అనిల్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా, వివిధ కేంద్ర శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి సన్నిహితుడు. మన్మోహన్సింగ్ రూ.60వేల కోట్లతో ప్రారంభించిన జేఎన్ఎన్యూఆర్ఎమ్ రూపకల్పనలోనూ బైజల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అండమాన్ నికోబార్ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్, ఎండీగా, సేల్స్–ఎక్సైజ్ టాక్స్ కమిషనర్‌గా, ఢిల్లీ, గోవాలకు డెవలప్మెంట్ కమిషనర్‌గా, నేపాల్‌లో భారత సహాయ మిషన్‌కు కౌన్సిలర్ ఇంచార్జ్‌గా పనిచేశారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ సంస్థ మాజీ సభ్యుడైన అజిత్ దోవల్ జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు స్వాగతం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. -
ఢిల్లీ కొత్త ఎల్జీగా అనిల్ బైజల్
న్యూఢిల్లీ: దేశరాజధానికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ (70) నియమితులయ్యారు. నజీబ్ జంగ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో అనిల్ బైజల్ (ఢిల్లీ 21వ ఎల్జీగా) బాధ్యతలు స్వీకరించనున్నారు. 1969 ఐఏఎస్ బ్యాచ్ అధికారైన అనిల్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా, వివిధ కేంద్ర శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి సన్నిహితుడు. మన్మోహన్సింగ్ రూ.60వేల కోట్లతో ప్రారంభించిన జేఎన్ఎన్యూఆర్ఎమ్ రూపకల్పనలోనూ బైజల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అండమాన్ నికోబార్ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్, ఎండీగా, సేల్స్–ఎక్సైజ్ టాక్స్ కమిషనర్‌గా, ఢిల్లీ, గోవాలకు డెవలప్మెంట్ కమిషనర్‌గా, నేపాల్‌లో భారత సహాయ మిషన్‌కు కౌన్సిలర్ ఇంచార్జ్‌గా పనిచేశారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ సంస్థ మాజీ సభ్యుడైన అజిత్ దోవల్ జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు స్వాగతం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. -
కొత్త సీఎం వచ్చినా దూకుడు తగ్గించని గవర్నర్
చెన్నై: పారిశుధ్యంపై పోరు కోసం రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ పుదుచ్చేరిలో ఆమెకు ఎదురవుతున్న కష్టాలు ఏమిటో అన్న అంశంపై దృష్టి పెట్టే వాళ్లు అధికమయ్యారు. అక్కడి కాంగ్రెస్ పాలకులు, గవర్నర్ కిరణ్‌బేడీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో ఉద్యోగులు నలిగి పోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించగానే, కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెం అన్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీని కేంద్రం నియమించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పగ్గాలు చేపట్టిన కిరణ్‌బేడీ తన దూకుడును పెంచారు. సంస్కరణలు, కొత్త విధానాలు అంటూ పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల మనసు చూరగొనే రీతిలో దూసుకెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌తో సరితూగే విధంగా సీఎం అభ్యర్థిగా నారాయణస్వామిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా, రాజకీయ అనుభవం, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణ స్వామి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తన దూకుడును కిరణ్ బేడీ తగ్గించ లేదు. ఈ సమయంలో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య విభేదాలు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని సీఎం, గవర్నర్ ఇద్దరూ ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పుదుచ్చేరి ప్రగతి కోసం తామిద్దరం శ్రమిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కాగా కొత్త ప్రభుత్వ పాలకులు తమ రాజకీయాన్ని ప్రదర్శించే పనిలో పడ్డట్టుంది. కిరణ్ బేడీ సంస్కరణలకు చెక్ పెట్టే రీతిలో సీఎం చాప కింద నీరులా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అందుకే పారిశుధ్య కార్మికుల ద్వారానే కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా నిరసనలు సాగించేందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. ఆదివారం తమకు సెలవు కావాలంటూ కార్మికులు గళం విప్పారు. దీంతో గవర్నర్ ఆదేశాలు రాజ్‌భవన్ వరకే పరిమితం చేయాలని, తాము ఆదేశించే వాటినే అమలు చేయాలన్నట్టుగా ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు సైతం వెళ్లినట్లు సమాచారం. ఈ సీఎం నారాయణ స్వామి, గవర్నర్ కిరణ్ బేడీ మధ్య ఉద్యోగులు, కార్మికులు నలిగి పోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. పాలకులు చెప్పింది వినాలో, గవర్నర్ ఆదేశాలను అనుసరించాలో అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. పైకి తమ మధ్య విభేదాలు లేవన్నట్టుగా ఆ ఇద్దరూ చెప్పుకుంటున్నా, లోలోపల పాలనా పరంగా ఉన్న హక్కులపై అంతర్యుద్ధమే సాగుతున్నట్టు పుదుచ్చేరిలో చర్చ సాగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో ఉద్యోగులతో జరిగిన సమాలోచనలో కిరణ్ తీవ్రంగా స్పందించారు. పై స్థాయి అధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా, కింది స్థాయిలో అమలు చేసే వాళ్లంతా స్థానికులు కావడం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల బేఖాతరు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాగుతున్న వ్యవహారాలు, తాజా పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు, కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేయడంతోపాటుగా, ప్రజల మన్ననల్ని అందుకునే విధంగా రాజీనామా నినాదంతో కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డట్టుగా పుదుచ్చేరిలో చర్చ హోరెత్తడం గమనార్హం. -
లెఫ్టినెంట్ గవర్నర్, క్రేజీవాల్ మధ్య మరో వివాదం
ఢిల్లీ: క్రేజీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మరో వివాదం రేగింది. గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మరో అడుగు ముందుకేశారు. ఢిల్లీ పాలనకు సంబంధించిన ఫైళ్ల వివరాలను తనకు పంపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై క్రేజీవాల్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంతో ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వాధినేత అని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై క్రేజీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
వాళ్లు లేకుంటేనే ఢిల్లీకి మంచిది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: హస్తినలోని కేజ్రీవాల్ సర్కార్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మళ్లీ ఘర్షణ మొదలైంది. ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్ (డానిక్స్) అధికారుల విషయంలో మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విరుచుపడ్డారు. ఐఏఎస్ అధికారులు బీజేపీకి 'బీ టీమ్'లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇటు ప్రధాన కార్యాలయంతో టచ్‌లో ఉంటూనే అటు డానిక్స్ అధికారుల అసోసియేషన్ సమావేశంలోనూ పాల్గొంటున్నారని మండిపడ్డారు. డానిక్స్ అధికారులైన సుభాష్ చంద్ర, యశ్పాల్ గార్గ్‌లను కేజ్రీవాల్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జైళ్లశాఖ సిబ్బంది జీతాలు పెంచుతూ ఢిల్లీ కేబినెట్ జారీచేసిన పత్రాలపై వారు సంతకాలు చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్రం స్పష్టం చేయడంతో వివాదం రాజుకుంది. మరోవైపు సహచర అధికారుల సస్పెన్షన్ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు గురువారం మూకుమ్మడిగా సామూహిక సెలవు పెట్టారు. శుక్రవారం (జనవరి 1) నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న సరి-బేసి నెంబర్‌ప్లేట్ల పథకం నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున సెలవుపై వెళ్లడం కేజ్రీవాల్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందిస్తూ ' ఆ అధికారులు దీర్ఘకాలపు సెలవుపై వెళితే ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ప్రభుత్వం వారికి వేతన సెలవు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల పరిపాలన నిజాయితీగా, సమర్థంగా సాగుతుంది' అని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ నియామక అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే చెందుతాయని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే ఆ సూచనలు అమలు చేయాలా?వద్దా?అనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడుతుందని తెలిపింది.ప్రభుత్వం చేసే సూచనలు తప్పకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షించిన తరువాతే అమలు చేయాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆ వివాదం ముదిరిపాకాన పడి హైకోర్టు వరకూ వెళ్లింది. -
కోర్టుకు చేరిన జగడం
హైకోర్టులో ఆప్ సర్కారు.. సుప్రీంలో కేంద్రం పిటిషన్లు న్యూఢిల్లీ: ఢిల్లీ లొల్లి కోర్టు మెట్లెక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలిస్తూ, కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఢిల్లీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేసింది. మరోవైపు కేంద్ర పరిధిలోని అధికారుల పట్ల అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకోజాలదన్న నోటిఫికేషన్ జారీని అనుమానించాల్సి(సస్పెక్ట్) వస్తోందంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో సస్పెక్ట్ అన్న పదాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయం లెప్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య సమీకరణాన్ని పూర్తిగా అనిశ్చితిలో పడేసిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ గురువారం హోం శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్‌ను కలిశారు. -
కేజ్రీవాల్ కు మమత మద్దతు?
కోల్ కతా: ఢిల్లీ ఏసీబీ విభాగం అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి పరోక్ష మద్దతు లభిస్తుందా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పదేపదే జోక్యం చేసుకోవడం తగదన్న మమత వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే కేబినెట్ ఉంటుందో.. అలానే ప్రతీ రాష్ట్రానికి కూడా కొంతమంది సభ్యులతో కూడిన కేబినెట్ ఉంటుందని కేంద్రాన్ని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ కు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలని మమత ట్వీట్టర్లో హితబోధ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి స్సష్టం చేశారు. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. కాగా, ఆమె చేసిన ట్వీట్స్ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు ముందు చేశారా? లేక తరువాత చేశారా?అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రభుత్వ సలహాతోనే వ్యవహరించండి: హైకోర్టు
ఇటు కేంద్ర ప్రభుత్వంతోను.. అటు కేంద్ర ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్‌తోను గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని గతవారం కేంద్రం చెప్పింది. ఈ అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం సలహాలను తీసుకోవాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని కూడా కేంద్రం తెలిపింది. అయితే.. అవినీతిపరులైన అధికారులను కాపాడేందుకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. -
కేంద్రం ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసింది..
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటాన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేందుకు చూస్తోందంటూ విరుచుకుపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. అవినీతి అధికారులకు కొమ్ము కా'సేలా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం విచారకరమన్నారు. ఢిల్లీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ప్రధాని మోదీ న్యూఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కానుక ఈ నోటిఫికేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యాంగ నిపుణులతో చర్చించి, వారి సలహాలు తీసుకుంటామన్నారు. అయినా తమది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమనీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మద్దతు, సహాయ సహకారాలు తమకు పూర్తిగా ఉన్నాయన్న కేజ్రీవాల్ ధీమాను వ్యక్తం చేశారు. -
'రాష్ట్రపతి పాలన ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన ప్రభుత్వాధికారుల నియామకాలు జరుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా నియామకాల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజేంద్ర కుమార్‌ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్ ఆదేశాలను నజీబ్ జంగ్ తిరస్కరిస్తూ లేఖ రాయడంతో ఆయన ఈ వివాదంపై మంగళవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి సిసోడియా మీడియాతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీని లెఫ్టినెంట్ గవర్నర్ నియమించినప్పుడు తాము అంగీకరించామని, అయితే, ఆయన అంతటితో ఆగకుండా తమను సంప్రదించకుండా.. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వేరే మార్గాల ద్వారా ప్రభుత్వాధికారులను నియమిస్తున్నారని చెప్పారు. ఆయన నేరుగా ప్రభుత్వాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, అయినదానికి కానిదానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే వారిని బెదిరిస్తున్నారని ఈవిషయాలన్నీ రాష్ట్రపతికి విన్నవించామని చెప్పారు. ఇదిలా ఉండగా, తాజా వివాదాల నేపథ్యంలో తమ ప్రధాన కార్యదర్శితో సహా మిగితా కార్యదర్శులందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు కార్యదర్శులంతా ఆ సమావేశానికి రావాలని సిసోడియా ఆదేశించారు. ఇదిలా ఉండగా, అంతకు ముందే నజీబ్ జంగ్ రాష్ట్రపతిని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. -
తూర్పు ఎమ్సీడీని ప్రభుత్వానికి అప్పగించండి
సాక్షి, న్యూఢిల్లీ: సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితికి చేరిన తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్సీడీ)ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయబోతున్నారని సమాచారం. నిర్వహణలో వైఫల్యం కారణంగా ఉత్తర, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటులో కూరుకుపోయాయని ఆరోపిస్తూ ఆయన లేఖ రాయనున్నట్లు ఓ అధికారి తెలియజేశారు. సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయని, దీంతో వారు వేతనాల కోసం సమ్మెకు దిగారని అనే విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సర్కారు ఎమ్సీడీలకు బకాయిలను చెల్లించడం లేదన్న వార్తల్లో సత్యం లేదని సిసోడియా అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అందువల్లే ఆ కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో పడి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితికి చేరిందన్నారు. ‘తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నెలా వేతనాల కింద 55 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అయితే సిబ్బందేమో మూడు నెలలుగా వేతనాలు రావట్లేదని అంటున్నారు. మూడు నెలలుగా సిబ్బందికి వేతనాల కింద చెల్లించవలసిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి. బీజేపీకి ఎమ్సీడీని నిర్వహించడం చేతకాకుంటే దానిని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలి. తాము కార్పొరేషన్‌ను లాభాల బాట నడిపించి చూపిస్తాం’ అని మనీశ్ సిసోడియా అన్నారు. తూర్పు ఎమ్సీడీని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ రాసే విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. -
హోంగార్డ్‌లకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉద్యోగ కాల పరిమితి ముగియనున్న 2,500 మంది హోం గార్డ్లకు ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాదిపాటు అవకాశం ఇచ్చింది. హోం గార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ బలగం డైరక్టర్ జనరల్ జతీందర్ కుమార్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ంగ్ సహాయంతో ప్రత్యేక కేసు కింద పరిగణించి హోం గార్డుల ఉద్యోగ కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో కాలపరిమితి ముగియనున్న 2,500 హోం గార్డు వాలంటీర్లకు మేలు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు హోంగార్డు అధికారులను విశిష్ట సేవలకు ఇచ్చే రాష్ట్రపతి పతకంతో, 8 మంది అధికారులను నిష్కామ సేవా పతకాలతో ఆయన సన్మానించారు. పదోన్నతిపై ఎల్జీకి ప్రతిపాదన పది సంవత్సరాల అనుభవం కలిగి 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి దాటని హోం గార్డుల పదోన్నతి విషయం కూడా లెప్టినెంట్ గవర్నర్ ముందుంచనున్నట్లు శర్మ తెలిపారు. మిగతా అన్ని బలగాల మాదిరిగానే హోంగార్డుల సంస్థ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని తాము లెప్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పనిచేసిన 2,000 మంది హోం గార్డుల సేవలను ఆయన అభినందించారు. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సహాయంతో హోంగార్డుల ఉద్యోగకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రెండు రోజుల కింద నిర్ణయం వెలువడిందని ఆయన తెలిపారు. -
డాలర్ల కోసం పరుగులు తీయొద్దు
విద్యార్థులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ హితవు న్యూఢిల్లీ: కెరీర్‌ను కేవలం ధనసంపాదన కోణంలోనే చూడొద్దని, డాలర్లకోసం విదేశాలకు పరుగులు తీయొద్దని లెఫ్టినెంట్ గవర్నర్, ఛాన్సలర్ నజీబ్‌జంగ్ హితవు విద్యార్థులకు హితవు పలికారు. సమాజ సువిశాల ప్రయోజనాల కోసం ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ)లో బుధవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నత విద్యకోసం వందలాదిమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని, దేశాన్ని గాలికొదిలేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యార్థులంతా వెనక్కి రావాలని ఆయన సూచిం చారు. ఇంకా అనేకమంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశమే రావడం లేదన్నారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. సమయం కేటాయించండి ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై వివిధ రూపాల్లో ఎంతో పెట్టుబడి పెట్టారని ఎల్జీ పేర్కొన్నా రు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విద్యార్థులు కొంత సమయాన్ని దేశం కోసం కేటాయిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా 72 మంది అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయే ట్ విద్యార్థులకు ఎల్జీ పట్టాలను అందజేశా రు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పతకాలను అందజేశారు. నైతిక విలువల్ని పెంపొందించుకోవాలి అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక విలువలను పెంపొం దించుకోవాలని హితవు పలికారు. జీవి తంలో విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. డిగ్రీ పట్టా ప్రతి ఒక్కరికీ అవసరమేనని, నైతిక విలువలు కూడా అంతకంటే ముఖ్యమని అన్నారు. వార్షిక నివేదికను సమర్పించిన వీసీ ఈ సందర్భంగా ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ) వైస్ ఛాన్సలర్ ప్రదీప్ కుమార్ డీటీయూ వార్షిక నివేదికను ఆహూతులకు చదివి వినిపించారు. 2013-14 విద్యా సంవత్సరంలో మొత్తం 13 నూతన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. విద్యలో నాణ్యత పెంపుకోసం రూ. 12.5 కోట్ల మేర నిధులను వెచ్చించామన్నారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల నేతలతో జరిపిన చర్చలపై తన నివేదికతో పాటు, అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా కోరుతూ సిఫార్సులను ఆయన ఈరోజు ఉదయం రాష్ట్రపతికి సమర్పించారు. కాగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై తమకు ఆసక్తిలేదని, ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చిత పరిస్థితికి అంతం పలుకుతూ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని శాసనసభలో అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీ బీజేపీతోపాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. -
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!
బీజేపీని ఆహ్వానించేందుకు మార్గం సుగమం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనకు రాష్ర్టపతి ఆమోదం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, లేఖ సమర్పణ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతోంది. సుప్రీంకోర్టుతో పాటు రాష్ర్టపతి కూడా ఈ అంశంపై నిర్ణయాలు తీసుకుంటుండటంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ఇందుకు ఆ పార్టీని ఆహ్వానిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) చేసిన ప్రతిపాదనను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే సర్కారు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో ఐదు నెలలుగా జాప్యం చేయడంపై కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ రాష్ర్టపతి పాలన కొనసాగరాదని అభిప్రాయపడిన కోర్టు.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొంది. ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ కేంద్రం ఏకవాక్య సమాధానం చెబుతూ నెట్టుకొస్తోందని అక్షింతలు వేసింది. ఎల్జీ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ర్టపతి ఇచ్చిన లేఖను కేంద్రం సమర్పించడంతో.. ఈ పనిని చాలా ముందే చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎల్జీ రెండు రోజుల్లో బీజేపీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఎన్నికలంటే బీజేపీకి భయం: సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించాయి. ఎన్నికలంటే బీజేపీ దూరంగా పరిగెడుతోందని ధ్వజ మెత్తాయి. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకే నీచ రాజకీయాలకు పాల్పడుతూ బీజేపీ జాప్యం చేస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఒక పార్టీ పక్షాన్నే నిలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సబబు కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. మెజారిటీ లేని పార్టీకి ఎలా అవకాశమిస్తారని డీపీసీసీ చీఫ్ అరవిందర్ సింగ్ ప్రశ్నించారు. ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రధాని పదవిపై ఆశలతో ఢిల్లీ ప్రజలను మధ్యలోనే వదిలేసి సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారని మండిపడింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం మూడు ఖాళీలున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికవడంతో బీజేపీ బలం 31 నుంచి 28కి తగ్గిపోయింది. మిత్రపక్షం అకాలీదళ్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది. మెజారిటీకి 34 సీట్లు అవసరం. కాగా, ఖాళీ స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆప్ బలం కూడా 27కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు ఇంకాఉత్కంఠను రేపుతోంది. ఎటూ తేల్చుకోని బీజేపీ: ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేసేందుకు సుప్రీంప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఎలాం టి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ భావిస్తుండగా, పార్టీ అధిష్ఠానం మాత్రం ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. -
ఎన్నికలవైపే మొగ్గు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఆ పార్టీ సుముఖంగా లేదన్న సంకేతాలను ఇచ్చాయి. దీనిని బట్టి సర్కారు ఏర్పాటుకు లెప్టినెంట్ గవర్నర్ ఆహ్వానాన్ని అందించినా భారతీయ జనతా పార్టీ దానిని తోసిపుచ్చవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని అనుమతించవలసిందిగా కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ రాసిన లేఖకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ మంగళవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి తెలపడంతో వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు బీజేపీ నేతలు చేసి ప్రకటనలతో కొంత చల్లబడ్డాయి. ఢిల్లీలో ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో చెప్పారు. బీజేపీ ఎన్నికలకు వెనుకాడుతోందని ఆప్, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలనుకుంటోందని ఆయన చెప్పారు. ఇతర పార్టీలను చీల్చి సర్కారు ఏర్పాటుచేసే ప్రశ్నే లేదన్నారు. పూర్తి మెజారిటీతో గెలిచే అవకాశాలున్నప్పుడు బీజేపీ ఎన్నికలంటే ఎందుకు భయపడుతుందని ఆయన ఎదురుప్రశ్న వేశారు. బీజేపీ సరైన సమసయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. వెంకయ్యనాయుడు తమ సీనియర్ నేత అని, ఆయన పార్టీ వైఖరిని తెలిపారని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఢిల్లీ వ్యవహారంపై పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఢిల్లీ నాయకులు ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తారని, ఆ తరువాత అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో తగిన మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలదన్న అనుమానం ప్రత్యర్థి పార్టీలు, రాజకీయపండితులు, సామాన్యులతో పాటు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా వచ్చింది. అతి పెద్ద రాజకీయ పార్టీ (బీజేపీ)ని ఎల్జీ ఆహ్వానించినా ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావలసిన సంఖ్యా బలం ఆ పార్టీకి ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీకి సిగ్గూ శరం ఏవైనా మిగిలిఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ సవాలు చేశారు. బీజేపీకి బలం ఉంటే ఐదు నెలల కిందటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే అన్ని ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. అటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆ పార్టీ అభిప్రాయపడింది. దేశమంతటా తమ ప్రభంజనం ఉందని చెప్పుకునే బీజేపీ ఎన్నికలంటే భయపడుతోందని ఢిల్లీ కాంగ్రె స్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. సర్కారు ఏర్పాటు చేయడానికి సంఖ్యా బలంలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్లో చెప్పారని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ గుర్తు చేశారు. అప్పుడు లేని సంఖ్యాబలం ఇప్పుడు ఎక్కడనుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తోన్న బీజేపీ, కావాలనే తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యాబలం బీజేపీకి లేదు. 70 స్థానాలున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 29, ఆమ్ ఆద్మీ పార్టీకి 27, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కాక ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక జేడీయూ ఎమ్మెల్యే ఉన్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 32 సీట్లు గెలిచినప్పటికీ ముగ్గురు శాససభ్యులు లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తరువాత శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలకు నవంబర్ 25న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా మంగళవారం వెలువడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలిచింది. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వినోద్ కుమార్ బిన్నీని ఆప్ బహిష్కరించింది. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పార్టీ శాసనసభ్యులు 29 మందితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాంబీర్షౌకీన్, వినోద్‌కుమార్ బిన్నీ మద్దతు ప్రకటించిన తరువాత కూడా బీజేపీకి సంఖ్యాబలం తక్కువే అవుతుంది. అటువంటి పరిస్థితిలో మెజారిటీ కోసం బీజేపీ ప్రత్యర్థి పార్టీలను చీల్చక తప్పదు. దేశమంతటారాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్న ఈ పరిస్థితిలో ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటుచేశామన్న అప్రతిష్ట మూటగట్టుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ ఢిల్లీలోనూ ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: డీపీసీసీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం డిమాండ్ చేసింది. రాజధాని నగరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్రాన్ని, లెప్టినెంట్ గవర్నర్‌ను సుప్రీం కోర్టు మందలించిన నేపథ్యంలో డీపీసీసీలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, డీపీసీసీ అధ్యక్షులు అర్విందర్ సింగ్ లవ్లీ హాజరయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదించామని చెప్పారు. ఎన్నికల కోసం సిద్ధం కావాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని చెప్పారు. -
నేనేం తప్పు మాట్లాడలేదే..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే తప్పేమిటంటూ తాను చేసిన వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సమర్ధించుకున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఎల్జీ తమను ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందిస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్,కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలు లేని బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని అవి ప్రశ్నిస్తున్నాయి. ఆప్ ఒక అడుగు ముందుకు వేసి తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తోందని ఆరోపిస్తోంది. ఇలా బీజేపీపై ముప్పేట దాడి జరుగుతున్న తరుణంలో ఆ పార్టీని ఎల్జీ సర్కారు ఏర్పాటుకు ఆహ్వానిస్తే తప్పేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత, మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. వెంటనే ఆ పార్టీ నాయకులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు.కాగా, ఆమెపై ఉన్న కేసులను కేంద్రం తిరగతోడకుండా ఉండటానికే బీజేపీని షీలా వెనుకేసుకొస్తోందని ఆప్‌తో పాటు ఆమె సొంతపార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీని తాను వెనుకేసుకురావడంలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజ్యాంగపరమైన నిబంధనల గురించే తాను మాట్లాడానన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ వారిని ఆహ్వానిస్తే.. బీజేపీ తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఆప్ సభ్యుల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అసాధ్యం కదా అని ప్రశ్నించగా అది వారి వ్యవహారమని వ్యాఖ్యానించారు.‘ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సభ్యులను సంపాదించుకోవడం వారి బాధ్యత.. ఆ విషయంతో మనకు ఎటువంటి సంబంధం లేదు.. నేను కేవలం రాజ్యాంగ నిబంధనల గురించే మాట్లాడా..’ అంటూ ఆమె వివరణ ఇచ్చారు. ‘తగినంత సంఖ్యాబలం ఉంటేనే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు.. వారికి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ సంతృప్తి చెందాలి .. లేదంటే ప్రభుత్వ ఏర్పాటు వారివల్ల అయ్యే పని కాదు కదా.. ఇందులో నేను చేయగలిగేది లేదా ఇంకెవరైనా చేయగలిగేది ఏమీ లేదు..’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానిస్తే తప్పేమిటని గత బుధవారం షీలాదీక్షిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా తన వ్యాఖ్యలను పార్టీ నాయకులు అపార్థం చేసుకున్నారని ఆమె అన్నారు. ‘ గత ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు మా పార్టీ మద్దతు ఇచ్చింది.. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరు మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది తప్పితే వేరే మార్గం లేదు.. అలా జరగని పక్షంలో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికలు జరపాల్సిందే..’నని ఆమె స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత షీలాదీక్షిత్ కేరళ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు తర్వాత ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి ఢిల్లీ వచ్చేశారు. కాగా, రాష్ర్ట రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనని, అయితే ప్రస్తుతం ఢిల్లీకి యువనాయకత్వం అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనను రద్దుచేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆప్, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి ఎల్జీ లేఖ రాశారు. గత ఫిబ్రవరి 17వ తేదీనుంచి రాష్ర్టపతి పాలనలో ఉన్న నగరంలో ప్రజాసమస్యలు పేరుకుపోతున్నాయని, వెంటనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో వివరించారు. ప్రస్తుతం 67మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 29 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యులు అవసరమవుతారు. -
గ్రీన్ సిటీ కోసం సెస్
* సిగరెట్ ప్యాకెట్, మద్యం సీసాపై రూపాయి చొప్పున పన్ను * ఈ నిధులతో పట్టణ రవాణా నిధి ఏర్పాటుకు చర్యలు * 2017 నాటికి 8 కోచ్‌లతో 129 మెట్రో రైళ్ల ప్రవేశం * ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పెరుగుతున్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మందుబాబులు, పొగరాయుళ్ల జేబులకు చిల్లు పెట్టి, తద్వారా వచ్చే సొమ్మతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించిన మరుసటి రోజే ఎల్జీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. * ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిపాలన విభాగం(జీఎన్సీటీడీ) అధికారులతోపాటు ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల్లోకెళ్తే... * పజారవాణ వ్యవస్థను ప్రోత్సహించడం కోసం జీఎన్సీటీడీ పట్టణ రవాణా నిధిని ఏర్పాటు చేస్తుంది. * నగరంలో విక్రయించే ప్రతి సిగరెట్ ప్యాకెట్, ప్రతి మద్యం సీసాపై ఒక రూపాయి సెస్ విధించడం ద్వారా వసూలయ్యే సొమ్ముతో ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. * కాలుష్య నియంత్రణ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటారు. * పతి వాహనంపై వ్యాలిడ్ పీయూసీ స్టిక్కర్ ఉండేలా చూసేందుకు చర్యలు చేపడాతారు. * ఢిల్లీలో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకునేందుకు వాహనం వ్యాలిడ్ పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధనను విధించే విషయాన్ని పరిశీలిస్తారు. * ఢిల్లీ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహ నాల ప్రవేశాలను నియంత్రిస్తారు. * ఓవర్లోడింగ్ సమస్యను పరిష్కరించడం కోసం ఢిల్లీలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వెయ్ ఇన్ మోషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు జీఎన్సీటీడీ ప్రణాళికలు రూపొందిస్తుంది. * అనధికార పార్కింగ్‌లపై పోలీసులు కఠిన చర్యలు చేపడ్తారు. * రద్దీగా ఉండే ఇరుకు వీధులలో పార్కిగ్‌ను నిరుత్సాహపర్చి, మల్టీలెవల్ పార్కింగ్‌లలో పార్కింగ్‌ను ప్రోత్సహించడం కోసం వేర్వేరు రేట్లతో పార్కింగ్ విధానాన్ని రూపొందిస్తారు. * ఇరుకు రోడ్లపై ప్రీమియం పార్కింగ్ రేట్లను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. * మెట్రో, ప్రజారవాణాకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడం కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను రవాణా విభాగం, జీఎన్సీటీడీ ప్రవేశపెడాతాయి. * 2017 నాటికి 129 మెట్రో రైళ్లలో 8 కోచ్‌లను ప్రవేశపెడాతారు. * వాయు కాలుష్యం పట్ల ఢిల్లీ వాసుల్లో అవగాహన కల్పించడం కోసం రవాణా విభాగం, జీఎన్సీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వస్తాయి. -
బీజేపీని ఆహ్వానించవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ రాష్ట్రపతికి రాసిన లేఖను ఉపంసహరించుకోవాలన్న డిమాండ్‌తో ఆప్ నేతల ప్రతినిధి బృందం బుధవారం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసింది. అసెంబ్లీని వెంటనే రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని వారు ఎల్జీని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి సంబంధించి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సీడీని కూడా వారు లెప్టినెంట్ గవర్నర్‌కు అందచేశారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మనీష్ సిసోడియా, కుమార్ విశ్వాస్, ఆశుతోష్లతో కూడిన ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసింది. ఎల్జీతో సమావేశం తరువాత ఆప్ నేత మనీష్ సిసోడియా విలేఖరులతో మాట్లాడారు. తాము స్టింగ్ ఆపరేషన్ సీడీని ఎల్జీకి ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానించరాదని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 4న రాష్ట్రపతికి రాసిన లేఖను ఉపసంహరించుకోవలసిందిగా తాము ఎల్జీని కోరినట్లు ఆయన చెప్పారు. ఎల్జీ తమ విజ్ఞప్తిని పాటిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే రాష్ట్రపతికి కూడా స్టింగ్ ఆపరేషన్ సీడీని అందచేస్తామని సిసోడియా చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తోందని మనీష్ సిసోడియా మరోమారు ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఢిల్లీ సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి ప్రభుత్వం ఢిల్లీవాసులకు భారంగా మారుతుందని, ఈ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం వారిని మోసగించడమేనని సిసోడియా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావడం ఇక అసాధ్యమని ఆయన ఆ తరువాత ట్వీట్ చేశారు. -
రాష్ట్రపతి పాలనకు ఆర్నెల్లు ఎన్నికలపై ఇంకా ఊహాగానాలే
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దెదిగిన తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించి ఆర్నెల్ల కాలం గడిచిపోయింది. ఇన్నిరోజులుగా విధానసభ సుప్తచేతనావస్థలో కొన సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా? లేక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా? ఎన్నికలు జరుపుతారా ?అనే అంశంపై ఊహాగానాలు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. 49 రోజుల పాలన తరువాత అర్వింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు అదే నెల 17న రాష్ట్రపతి పాలన విధించారు. 1993లో ఢిల్లీలో విధానసభ ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రపతిపాలన విధించడం ఇదే ప్రధమం. విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతిపాలన విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బందులూ లేవు.విధాన సభను తక్షణమే రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుచేయడానికి ఇంతవరకు ఇటు కేంద్రంగానీ, లెఫ్టినెంట్ గవర్నర్ గానీ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టారనే విషయాన్ని కేంద్రం త్వరలో సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా ఆర్నెల్లుగా రాష్ర్టపతి పాలన కొనసాగుతుండడంతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టలేదని, గతంలో చేపట్టినవి కొనసాగడం లేదని అంటున్నారు. బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన పథకాల అమలుకు, ధరల నియంత్రణకు లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీ సర్కారు కృషి చేస్తున్నప్పటికీ గతంతో పోలిస్తే పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఆర్నెల్ల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్ దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో కూడిన 25 ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే వాటి ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తికాలేదని అంటున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
బీజేపీకి త్వరలో సభాపక్ష నేత
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే తమ శాసనసభా పక్ష నాయకుణ్ని నియమిస్తామని ఈ పార్టీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని తెలిపింది. ఎల్జీ నుంచి ఇంత వరకు తమకు ఆహ్వానం అందలేదని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ శనివారం విలేరులతో అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అనుకూల పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు. సర్కారు ఏర్పాటుపై తమ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట నిజమేనని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామన్నారు. గతంలో సభాపక్ష నేతగా వ్యవహరించిన ఎమ్మెల్యే డాక్టర్ హర్షవర్ధన్ ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ ఈ విషయమై శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ తన 50 రోజుల పాలనలో అన్నింటా విఫలమైనందున, తాజాగా ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ జడుస్తోందని ఆరోపించారు. ఆప్ కూడా ఎన్నికలకు సిద్ధంగా లేదన్నారు. -
అంతా అయోమయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటుండడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరితో నూ మాట్లాడకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై గురువారం కూడా అనిశ్చితి కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఆప్ అగ్రనాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించడం వరకే పరిమితమయింది. కేజ్రీవాల్ మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సహా కాంగ్రెస్, బీజేపీపై ట్వీట్లతో విమర్శలు కురిపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానిస్తే తాము సుముఖంగా ఉన్నామంటూ బీజేపీ సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ బేరాలాడుతోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ విషయాలపై గురువారం ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్లు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరిపిం చాలని కోరుతున్న ఈ ఆప్ నేత... బీజేపీ, ఎల్జీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయవల సిందిగా ఎల్జీ గురువారం బీజేపీని ఆహ్వానించవచ్చ ని బుధవారం రాత్రి కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఈ ఆహ్వానానికి అంగీకరిస్తుందని జోస్యం చెప్పారు. దీనికి బీజేపీ స్పందిస్తూ ఈ ఊహాగానం అబద్ధమైతే ఆయన ఢిల్లీవాసులకు క్షమాపణ చెబుతారా ? అని ప్రశ్నించింది. కేజ్రీవాల్ తన ఆరోపణలకు రుజువు లు చూపాలని లేనట్లయితే, లేకుంటే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి, క్షమాపణ చెప్పాలం టూ నోటీసులు పంపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సరికాదని వాదిస్తున్న కేజ్రీవాల్ గురువారం ఉదయం ఎల్జీ నజీబ్జంగ్పై ట్వీట్లతో దాడి చేశారు. ట్వీట్ల వెల్లువ.. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గురువారం ఆహ్వానిస్తారని కేజ్రీవాల్ తొలుత ట్వీట్ చేశారు. తదనంతరం వెంటనే మరో ట్వీట్లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు. ‘ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యేలను కొనడం సులభ మవుతుందని బీ జేపీ అనుకుంటోంది. ఓ పార్టీకి తగిన సంఖ్యాబలం ఉన్నట్టు నిర్ధారణ కాకముందే ఎల్జీ దానిని ప్రభుత్వం చేయడం కోసం ఆహ్వానిస్తారా? ప్రభుత్వ ఏ ర్పాటుకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా సమర్పించవలసిందిగా ఎల్జీ కోరాలి కదా! లేనట్లయితే ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్టే అవుతుంది. ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేదని తెలిసినప్పటికీ ఎల్జీ ఒక పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి ఎమ్మెల్యేల బేరసారాలను ప్రోత్సహిస్తా రా?’ అంటూ ట్వీట్ల సందేశాలు కురిపించారు. ప్ర భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోతే జంగ్‌ను బదిలీ చేయవచ్చని లేదా తొలగింవచ్చని హెచ్చరిం చారు ఎల్జీ తన కుర్చీని కాపాడుకుంటారా లేక రాజ్యాంగాన్ని కాపాడుతారా అనే విషయాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఎల్జీతో భేటీ అయ్యేందుకు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించిన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న కేజ్రీవాల్ చేసిన ఊహాగానాన్ని బీజేపీ ఖండించిం ది. ఎల్జీ గురువారం తమను ఆహ్వానించకపోతే కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతా ద్వారా ఢిల్లీవాసులందరికీ క్షమాపణ చెబుతారా? అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రశ్నించారు. ‘ఇది మరో పచ్చి అబద్ధం.ఇంతకన్నా ఏం చెప్పగలను? తిలక్లేన్ నుం చి 7 రేస్‌కోర్సు రోడ్డుకు (ప్రభుత్వ అధికార నివా సం) వెళ్లాలనుకున్న కేజ్రీవాల్ కలలు కల్లలయ్యా యి’ అని ఉపాధ్యాయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించారు. బీజేపీ ఎన్నడూ బేరసారాలకు పాల్పడలేదని, అది తమ విధానం కాదని రూఢీగా చెప్పగలనని రాజ్‌నాథ్ చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు : గడ్కరీ ప్రభుత్వ ఏర్పాటుపై తాము ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఢిల్లీ బీజేపీ ఇన్చార్జి నితిన్ గడ్కరీ గురువారం అన్నారు. పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని స్పష్టీకరించారు. కేజ్రీవాల్ చేసేవన్నీ నిరాధార ఆరోపణలన్నారు. కేజ్రీవాల్ నిస్పృహతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్షించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 49 రోజులకే కేజ్రీవాల్ పలాయనం చిత్తగించారని, రోడ్లపై ధర్నా, ప్రదర్శనలకు దిగారని ఆయన విమర్శించారు. ఢిల్లీని నాశనం చేసిన వారు ఇప్పుడు జ్యోతిషులుగా మారి తరువాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో జోస్యం చెబుతున్నారని నఖ్వీ ఎగతాళి చేశారు. ఎవరు బేరసారాలకు పాల్పడుతున్నారో.. అందుకు బాధ్యులె వరో చెప్పాలని ఆయన కేజ్రీవాల్‌ను నిలదీశారు. ఏది జరిగినా రాజ్యాంగబద్దంగానే జరుగుతుందని, ఆయన చింతించాల్సిందేమీ లేదని నఖ్వీ అన్నారు. కనిపించని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు హరూన్ యూసుఫ్, అర్విందర్ సింగ్ లవ్లీ మినహా మిగతా ఆరుగురు శాసన సభ్యులు ఫోన్ ఎత్తకపోవడం, మీడియాతో మాట్లాడకపోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. డీపీసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ పరిశీలకుల సమావేశానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాడ కనిపించడలేదు. బీజేపీ బేరసారాలు జరుపుతోందన్న ఆరోపణలకు వీరి గైర్హాజరు బలం చేకూర్చింది. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్న ఆరోపణలను ఖండిం చారు. అరవింద్ కేజ్రీవాల్ ఎవరిపై ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తారో తెలియదని, విశ్వసనీయతలేని ఆయన ఆరోపణలు నమ్మలేమని యూసుఫ్ అన్నారు. -
అసెంబ్లీ రద్దుపై ఆప్ పిటిషన్
రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగింత సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి తక్షణం ఎన్నికలు జరిపించవలసింది గా ఆదేశించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిం చింది. రాష్ట్రపతి పాలనను సవాలుచేస్తూ ఆప్ దాఖలుచేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ అసెంబ్లీ రద్దుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా రాష్ట్రపతి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీనిపై తాము మార్గదర్శకాలను జారీ చేయడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి అసెంబ్లీని తక్షణం రద్దు చేసిన మరుసటి రోజునే ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే వైదొలిగారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వం అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటూ ఆప్సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
ఆరోగ్య రంగంపై నజీబ్ నజర్
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగం పనితీరు క్రమబద్ధీకరణపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ఆపరేషన్ థియేటర్ల వంటి కీలక విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసేందుకుగాను ప్రజాపనుల విభాగంతో సంప్రదింపులు జరిపి తగు వ్యవస్థను రూపొందించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. అధికారులు ఆస్పత్రుల నవీకరణ, పరిశీలన విషయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) వ్యవహరిస్తున్న తీరును పరిశీలించాలని కోరారు. దీంతోపాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా తగినన్ని అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆస్పత్రికి చేరిన రోగికి సకల సదుపాయాలు ఉండేవిధంగా చూడడంతోపాటు వారికి తక్షణమే అవసరమైన సేవలు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో వైద్యులతోపాటు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యసవర సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందిస్తూ నగరంలోని 36 ఆస్పత్రులు ఎంతో బాగా సేవలందిస్తున్నాయన్నారు. తరచూ వీటిని తనిఖీ చేసేందుకుగాను ఎనిమిది బృందాలను నియమించామన్నారు. డిస్పెన్సరీలను సైతం తరచూ తాము తనిఖీ చేస్తున్నామన్నారు. ఔట్ పేషంట్ విభాగాల (ఓపీడీ) వద్ద రోగులు బారులు తీరే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మందుల కొరత సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. -
జీటీబీ ఆస్పత్రిని సందర్శించిన జంగ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన గురు తేజ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు రెండు గంటలకుపైగా ఆస్పత్రిలోనే గడిపిన జంగ్ అక్కడి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. అనారోగ్యంతో కుంగిపోయిన రోగులకు వైద్యుడి స్పర్శ ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందని, కొన్నిసార్లు ఆ స్పర్శ అద్భుతాలు కూడా చేస్తుందన్నారు. ఆస్పత్రికి రోగి వచ్చిననాటి నుంచి నయమై అడుగు బయటపెట్టేవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపైనే ఉందన్నారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ ఔట్ పేషెంట్ విభాగాలను, డయాబెటిక్, మెటబాలిక్ కేర్ బ్లాక్, మాతాశిశు విభాగం, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దే ఓ ప్రణాళికకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ జంగ్కు చూపారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. సీనియర్ వైద్యులు, సర్జన్లు, ఇతర సిబ్బంది కూడా తమ అవసరాలను జంగ్ ముందు ఏకరువు పెట్టుకున్నారు. రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, అయితే అందుకు సరిపడా వైద్య సదుపాయాలు, కిచెన్, లాండ్రీ, పార్కింగ్ సదుపాయాలను కూడా విస్తరించాలన్నారు. జంగ్ స్పందిస్తూ... రోగుల సంఖ్య పెరిగినప్పుడు దాని భారం ఆస్పత్రిలోని ప్రతి విభాగంపై పడుతుందని, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేసుకుంటూ పోవడమే పరి ష్కారమన్నారు. ఓపీడీలో సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేయాలన్నారు. ఫార్మసీ వద్ద కూడా రోగులు మందుల కోసం బారులుతీరుతున్న దృశ్యా లు కనిపించాయని, అవసరమైతే కౌంటర్ల సంఖ్య ను పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. ఆస్పత్రి పరిసరాల్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విషయమై అక్కడికక్కడే అదనపు పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ప్రశాంత్ భూషణ్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి ఎల్జీకి ఎలాంటి కాలపరిమితీ లేదని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ సమయంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు ఆయనకు అధికారాలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. కాబట్టి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎల్జీని కోరారు. ‘‘70 అసెంబ్లీ సీట్లకు గాను 31 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని మేం వినయపూర్వకంగా కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఆప్‌నేత. ‘‘ఒకవేళ వాళ్లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే గతంలో మీరు చేసిన సూచనలను పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకోండి. దానివల్ల తొందరగా ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది’’ అని లేఖలో పొందుపరిచారు. ఈ మార్చి 31న దాదాపు ఇలాంటి లేఖనే ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా జంగ్కు ఇచ్చారు. -
అడ్మిషన్లకు కొత్త షెడ్యూలు
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి అంతర్రాష్ట్ర బదిలీ కేసుల్లో ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేసి గురువారం కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) హైకోర్టుకు బుధవారం తెలిపారు. ఎల్జీ తాజా ప్రకటనతో ప్రస్తుతం అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీలకు ఐదు పాయింట్ల విధానాన్ని రద్దు చేయడంతోపాటు పాయింట్ల కేటాయింపు విధానాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం న్యాయమూర్తి మన్మోహన్‌కు తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతర్రాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయిస్తారు. 75 నుంచి 100 మధ్య పాయింట్లు వచ్చిన వారి పేర్లు మాత్రమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయిన తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సుధాంశు జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎల్జీ పైవిధంగా వివరణ ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని బెంచ్‌కు కూడా ఇదే తరహా కేసు వచ్చింది. అంతర్రాష్ట బదిలీలకు పాయింట్లు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదిలా ఉంటే వికలాంగుల కోటాల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఎంతో చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం సీట్లలో మూడుశాతం సీట్లను వారికి కేటాయించా ల్సిందేనని హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. -
కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం
ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఎట్టకేలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి - లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య వివాదం సమసిపోయినట్లయింది. కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం దక్కినట్లయింది. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మతఘర్షణలపై సిట్ ఏర్పాటు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఓ హామీ. అయితే, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆయన దాన్ని అనుమతించడం లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు ఇది చాలా సానుకూల అంశం అవుతుంది. సిక్కు వ్యతిరేక మత ఘర్షణలపై సిట్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు ఈనెల ప్రారంభంలోనే పంపింది. 1984 నవంబర్ నెలలో జరిగిన ఈ అల్లర్లను నియంత్రించేందుకు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన కొద్ది రోజులకే ఆప్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం 2002 గోధ్రా అనంతర అల్లర్లను నియంత్రించడంలో విఫలం అయ్యిందని రాహుల్ అప్పట్లో అన్నారు. దీంతో సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. -
రెండోస్సారి...ఎల్జీ మార్గదర్శకాలే ఫైనల్!
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై కోర్టుకెక్కిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు రెండోసారీ చుక్కెదురైంది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలే ఫైనల్ అంటూ మొదట ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ద్విసభ్య ధర్మాసనం కూడా వెలువరించింది. వివరాల్లోకెళ్తే... నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను సవాలుచేస్తూ నగరంలోని ప్రైవేటు స్కూళ్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారమే నర్సరీ అడ్మిషన్లు జరుగుతాయని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. విద్యాశాఖ డైరక్టరేట్ త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 15 నుంచి నర్సరీ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావలసిఉంది. కానీ ప్రైవేటు స్కూళ్లు కోర్టుకు వెళ్లాయి. నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియపై మార్గదర్శకాలను జారీచేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని స్కూళ్లు వాదించాయి. ఈ పిటిషన్‌ను మొదట ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దాంతో స్కూళ్లు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. ఈసారి కూడా అదే తీర్పు వెలువడడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది. లెప్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని స్కూళ్లలో మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయాలి. అన్ని పాఠశాలలు 100 పాయింట్ల ప్రాతిపదికన అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. వాటిలో అత్యధికంగా 70 పాయింట్లను పాఠశాలకు సమీపంలో నివసించే వారికే అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వాలనే ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’కు కేటాయించారు. అంటే స్కూలుకు 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే పిల్లలకు ‘నైబర్‌హుడ్ క్రైటీరియా’ వర్తిస్తుంది. మార్గదర్శకాల ప్రకారం 5 శాతం కోటా స్టాఫ్ పిల్లలు, మనవలు, మనుమరాళ్ల కోసం, 5 శాతం ఆడపిల్లల కోసం, 25 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రిజర్వ్ చేస్తారు. -
సర్కారు ఏర్పాటుకు ఆప్ సిద్ధం
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను ఆయన సోమవారం కలవనున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదివారమే ప్రకటించిన కేజ్రీవాల్ ఇందుకు కావల్సిన ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 70 మంది సభ్యులుండే ఈ అసెంబ్లీలో బీజేపీకి 31 స్థానాలు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది. కొన్ని షరతులకు లోబడి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దీంతో ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా వద్దే అనే విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. ప్రజలు తమను అధికారంలో చూడాలనే భావిస్తున్నారని, అందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. అయతే, కాంగ్రెస్-ఆప్ పొత్తు అపవిత్రం, అనైతికమని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.