కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం
ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఎట్టకేలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి - లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య వివాదం సమసిపోయినట్లయింది. కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం దక్కినట్లయింది. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మతఘర్షణలపై సిట్ ఏర్పాటు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఓ హామీ. అయితే, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆయన దాన్ని అనుమతించడం లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్కు ఇది చాలా సానుకూల అంశం అవుతుంది.
సిక్కు వ్యతిరేక మత ఘర్షణలపై సిట్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు ఈనెల ప్రారంభంలోనే పంపింది. 1984 నవంబర్ నెలలో జరిగిన ఈ అల్లర్లను నియంత్రించేందుకు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన కొద్ది రోజులకే ఆప్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గుజరాత్లోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం 2002 గోధ్రా అనంతర అల్లర్లను నియంత్రించడంలో విఫలం అయ్యిందని రాహుల్ అప్పట్లో అన్నారు. దీంతో సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.