nazeeb jung
-
మీ పోలీసా.. మా పోలీసా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య మరోసారి చిచ్చురేగింది. ఢిల్లీ ఏసీబీ చీఫ్‌గా ఢిల్లీ పోలీసు విభాగంలోని జాయింట్ కమిషనర్ ఎంకే మీనాను నజీబ్ జంగ్ నియమించారు. అయితే, సీఎం కేజ్రీవాల్ మాత్రం అదనపు కమిషనర్ ఎస్ఎస్ యాదవ్‌ను ఎంచుకున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే, మీనాయే ఏసీబీకి బాస్ అవ్వాల్సి ఉంది. మీనా నియామకంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. దీన్ని ఊరికే వదిలేది లేదని, కోర్టులో తేల్చుకుంటామని నాయకులు అంటున్నారు. ఈ నియామకం అక్రమమని, అసలు ఏసీబీలో జాయింట్ కమిషనర్ పదవే లేనప్పుడు.. అలాంటి పోస్టులను ఎలా సృష్టిస్తారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. కానీ, అవినీతిపై పోరాడేందుకు ఢిల్లీ ప్రభుత్వంలోని ఏసీబీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఒక జాయింట్ కమిషనర్‌ను, ఏడుగురు ఇన్స్పెక్టర్లను ఆ విభాగంలోకి నియమించినట్లు ఢిల్లీ పోలీసు విభాగం సోమవారం ప్రకటించింది. అవసరమైతే మరింతమందిని కూడా ఆ విభాగంలోకి పంపుతామని తెలిపారు. -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
సాధారణంగా ఎవరికైనా ఒక దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయంటారు. కానీ కమలనాథులకు మాత్రం ఒకే దెబ్బకు ఏకంగా మూడు పిట్టలు పడ్డాయి. హర్యానాలో స్పష్టమైన మెజారిటీ సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయిన మనోహర్ లాల్ ఖట్టర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన బీజేపీ జాతీయ నేతలు.. మహారాష్ట్రలో ముందు మొండికేసిన శివసేనను కూడా చివరకు లొంగదీసుకున్నారు. వాళ్లంతట వాళ్లే కాళ్ల బేరానికి వచ్చేలా చేసుకుని అక్కడ దేవేంద్ర ఫడ్నవిస్ లేదా మరో నేత చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అంతా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ ముందునుంచి అనుకున్నవే. కానీ ఇప్పటికిప్పుడే వచ్చిన మరో ఛాన్సు.. ఢిల్లీ సర్కారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో చాలా కాలం నుంచి రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. అక్కడ ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలా అనే విషయమై అనేకసార్లు తర్జనభర్జన జరిగింది. చివరకు హస్తినపీఠాన్ని కూడా కమలనాథులకే కట్టబెట్టాలని నిర్ణయించారు. బీజేపీ నాయకులను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొన్నామధ్య ఓ లేఖ రాశారు. దీనికి ప్రణబ్ నుంచి కూడా సానుకూలంగా సమాధానం వచ్చింది. ఇక ఒకటి రెండు లాంఛనాలను మాత్రం పూర్తిచేసుకుని.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని పిలవడమే తరువాయి. ఇలా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడగొట్టి, కమలనాథులు వరుస విజయాలను సాధించగలిగారు. -
ఢిల్లీలో బీజేపీ సర్కారు?
హస్తినలోనూ జెండా ఎగరేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశం లభించేలా ఉంది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పటినుంచి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. అత్యధిక స్థానాలు పొందిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి ఓ నివేదిక పంపారు. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేముందు సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం బీజేపీకి ఇవ్వడం మంచిదని ఆయన పేర్కొన్నారు. అయితే.. బీజేపీని ఆహ్వానించడం రాజ్యాంగవిరుద్ధమని, దీనివల్ల పార్టీలు మారేవాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం చెబుతున్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 29 మంది సభ్యులున్న బీజేపీ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది ఉన్నారు. వాస్తవానికి బీజేపీ తరఫున 31 మంది గెలిచినా, ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ సహా ముగ్గురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. దాంతో ఇప్పుడు సభలో మెజారిటీ కావాలంటే బీజేపీకి మరో ఐదుగురి మద్దతు అవసరం. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా లేదా అని బీజేపీ కూడా మల్లగుల్లాలు పడుతోంది. -
మళ్లీ ట్రామ్ పరుగులు!
2.5 కిలోమీటర్ల మేర ట్రామ్‌మార్గం నిర్మాణం ప్రతిపాదనకు సమ్మతించిన ఎల్జీ త్వరలోనే టెండర్లు న్యూఢిల్లీ: దేశరాజధాని చారిత్రక వైభవాన్ని ఇనుమడింపజేసిన ట్రామ్‌ల పునరుద్ధరణకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రామ్‌రైలు మార్గాల నిర్మాణ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. బ్రిటిష్ పాలన సమయంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ హర్డింగ్ హయాంలో 1908, మార్చి ఆరున ట్రామ్ సేవలు మొదలయ్యాయి. కాలక్రమేణా సాధారణ రైళ్ల సేవలు విస్తరించడం, వాహన సంచారం పెరగడంతో 1960 దశకంలో వీటికి గడ్డుకాలం దాపురించింది. పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుభాష్‌మార్గ్ నుంచి ఫతేపురి మసీదు వరకు 2.5 కిలోమీటర్ల మేర ట్రామ్ మార్గం నిర్మాణానికి ప్రభుత్వం సమ్మతించింది. ఇందులో భాగంగా రిక్షాలు, బగ్గీల వంటి మోటారు రహిత వాహనాల కోసం కూడా ప్రత్యేక లేన్లు నిర్మిస్తారు. అంతేగాక 50 శాతం మార్గాన్ని పాదచారుల మార్గాల నిర్మాణానికి కేటాయిస్తారు. ట్రామ్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు గత వారం ఆమోదం లభించిందని, అయితే మసీదు ప్రాంతంలో మోటారు వాహనాల సంచారంపై ఆంక్షలు విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విశాలమైన పాదచారుల మార్గాల వెంట నిర్మించే ట్రామ్‌మార్గాన్ని ఎర్రకోటకు దారితీసే రోడ్డుతోనూ అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించాలని భావిస్తున్నారు. ట్రామ్ ప్రాజెక్టు డిజైన్‌ను ఎల్జీ చైర్మన్‌గా వ్యవహరించే యూనిఫైడ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్) సెంటర్ పరిశీలన కోసం వచ్చే వారం పంపిస్తారు. పెట్టుబడి ప్రతిపాదనల సమర్పణకు కూడా త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తారు. ట్రామ్‌ల ఏర్పాటుపై చర్చ కోసం గత వారం ఎల్జీ నేతృత్వంలో నిర్వహించిన భేటీకి ప్రజాపనుల విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, మోటారు రహిత వాహనాల యజమానులు హాజరయ్యారు. అత్యంత చౌకరవాణా వ్యవస్థ అయిన ట్రామ్‌ల హవా మనదేశంలో 1960 వరకు కొనసాగింది. అప్పట్లో జామా మసీదు, చాందినీచౌక్, సదర్‌బజార్ మీదుగా ట్రామ్‌లు నడిచేవని స్థానికులు చెబుతారు. వీటి తొలగింపునకు స్థలాభావమే ప్రధాన కారణమని రవాణారంగ నిపుణుడు ఒకరు అన్నారు. -
వేసవికి సిద్ధం కండి..
విద్యుత్ శాఖ అధికారులకు ఎల్జీ ఆదేశం న్యూఢిల్లీ: ‘వచ్చేది వేసవి.. నగరంలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది.. కాబట్టి విద్యుత్ డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి..’ అని విద్యుత్ శాఖను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. ఆయన గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చే వేసవిలో పెరిగి విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచిం చారు. నగరంలో వేసవిలో సుమారు ఆరు వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా అవసరమవుతుందని అంచనా. కాగా, ప్రస్తుతం ఢిల్లీ డిస్కంలు 5,800 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఎల్జీ, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాత్సవ, పవర్ సెక్రటరీ పునీత్ గోయల్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులు, మూడు డిస్కంలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో విద్యుత్ సరఫరా తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ఆర్థిక పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. నగరంలో గత ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 5,600 మెగావాట్లు. నగరంలో అత్యధిక ప్రాంతానికి విద్యుత్ పంపిణీ చేస్తున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీకి బకాయిల పేరుతో విద్యుత్ సరఫరాను నిలిపివేయరాదని ఎన్టీసీపీకి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నగరంలో విద్యుత్ టారిఫ్‌లు తక్కువగా ఉండటం వల్ల తాము నష్టాల్లో కూరుకుపోయి ఎన్టీపీసీకి బకాయి పడ్డామని అంబానీ కంపెనీ సుప్రీంలో పిటిషన్ వేయడంతో మార్చి 26 వరకు వారికి విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా ఎన్టీపీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఉత్తర, తూర్పు ఢిల్లీల్లోని పలు అనధికార కాలనీల్లో ఇప్పటికే విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే ఎన్టీపీసీకి చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుపై డిస్కంలతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా, నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు డిస్కంలలో కాగ్ ఆడిట్‌కు ఆప్ సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన రెండు విద్యుత్ కంపెనీల్లో ఆడిట్‌పై, అలాగే విద్యుత్ సరఫరా విషయమై ఎల్జీతో బుధవారం రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ సమావేశమైన విషయం తెలిసిందే. -
లెఫ్టినెంట్ గవర్నర్‌తో అనిల్ అంబానీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాణిజ్యవేత్త అనిల్ అంబానీ...లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను బుధవారం రాజ్‌నివాస్‌లో కలిశారు. కేజ్రీవాల్ సర్కారు అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన డిస్కంల ఖాతాలను ఆడిట్‌కు ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన బీఏసీఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ కంపెనీలు విద్యుత్ సరఫరాలో కోత విధించినట్లయితే వాటి లెసైన్సులను రద్దు చేయాలని కూడా కేజ్రీవాల్ సర్కారు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)ను ఆదే శించింది. ఈ రెండు కంపెనీలు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ నేషనల్ థర్మల్ పవర్ కంపెనీ (ఎన్ టీపీసీ) డిస్కంలను హెచ్చరించింది. అనిల్ అంబానీ, నజీబ్ జంగ్ల మధ్య గంట సేపు జరిగిన సమావేశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాల యం మర్యాదపూర్వకమేనని పేర్కొంది. అయి తే డిస్కంల ఖాతాలపై కాగ్ ఆడిట్, కోత విధిస్తే లెసై న్సు రద్దు హెచ్చరిక, బకాయిల చెల్లింపుకోసం ప్రభుత్వ సహాయం, విద్యుత్ చార్జీల పెంపు తది తర విషయాలు చర్చకు వచ్చిఉంటాయని భావి స్తున్నారు. అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రెండు డిస్కంలు నగరంలోని 70 శాతం ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు విద్యుదుత్పత్తి కంపెనీలకు రూ. 4,000 వేల కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది. -
ఢిల్లీ అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లు
న్యూఢిల్లీ: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సలహాను బేఖాతరు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టారు. 'సభలో బిల్లును ప్రవేశపెట్టాం. బిల్లుపై సానుకూల చర్చ జరుగుతుంది' అని సభ వాయిదా పడిన తర్వాత న్యాయశాఖ మంత్రి సోమ్ నాత్ భారతి మీడియాకు వెల్లడించారు. సభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్పీకర్ ఎంస్ ధీర్ ను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. దాంతో సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. అవినీతిని తుదముట్టేంచేందుకు జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం
ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఎట్టకేలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి - లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య వివాదం సమసిపోయినట్లయింది. కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం దక్కినట్లయింది. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మతఘర్షణలపై సిట్ ఏర్పాటు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఓ హామీ. అయితే, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆయన దాన్ని అనుమతించడం లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు ఇది చాలా సానుకూల అంశం అవుతుంది. సిక్కు వ్యతిరేక మత ఘర్షణలపై సిట్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు ఈనెల ప్రారంభంలోనే పంపింది. 1984 నవంబర్ నెలలో జరిగిన ఈ అల్లర్లను నియంత్రించేందుకు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన కొద్ది రోజులకే ఆప్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం 2002 గోధ్రా అనంతర అల్లర్లను నియంత్రించడంలో విఫలం అయ్యిందని రాహుల్ అప్పట్లో అన్నారు. దీంతో సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.