విద్యుత్ శాఖ అధికారులకు ఎల్జీ ఆదేశం
న్యూఢిల్లీ: ‘వచ్చేది వేసవి.. నగరంలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది.. కాబట్టి విద్యుత్ డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి..’ అని విద్యుత్ శాఖను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. ఆయన గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చే వేసవిలో పెరిగి విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచిం చారు. నగరంలో వేసవిలో సుమారు ఆరు వేల మెగావాట్‌ల విద్యుత్ అదనంగా అవసరమవుతుందని అంచనా. కాగా, ప్రస్తుతం ఢిల్లీ డిస్కంలు 5,800 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఎల్జీ, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాత్సవ, పవర్ సెక్రటరీ పునీత్ గోయల్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులు, మూడు డిస్కంలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగరంలో విద్యుత్ సరఫరా తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ఆర్థిక పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. నగరంలో గత ఏడాది అత్యధిక విద్యుత్ డిమాండ్ 5,600 మెగావాట్లు. నగరంలో అత్యధిక ప్రాంతానికి విద్యుత్ పంపిణీ చేస్తున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీకి బకాయిల పేరుతో విద్యుత్ సరఫరాను నిలిపివేయరాదని ఎన్‌టీసీపీకి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నగరంలో విద్యుత్ టారిఫ్‌లు తక్కువగా ఉండటం వల్ల తాము నష్టాల్లో కూరుకుపోయి ఎన్టీపీసీకి బకాయి పడ్డామని అంబానీ కంపెనీ సుప్రీంలో పిటిషన్ వేయడంతో మార్చి 26 వరకు వారికి విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా ఎన్టీపీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఉత్తర, తూర్పు ఢిల్లీల్లోని పలు అనధికార కాలనీల్లో ఇప్పటికే విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే ఎన్‌టీపీసీకి చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుపై డిస్కంలతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌సీ) ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా, నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న మూడు డిస్కంలలో కాగ్ ఆడిట్‌కు ఆప్ సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు చెందిన రెండు విద్యుత్ కంపెనీల్లో ఆడిట్‌పై, అలాగే విద్యుత్ సరఫరా విషయమై ఎల్జీతో బుధవారం రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ సమావేశమైన విషయం తెలిసిందే.
వేసవికి సిద్ధం కండి..
Published Thu, Feb 20 2014 10:56 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
Advertisement