
న్యూఢిల్లీ: రాబోయే నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఆలయాలకు సమీపంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ బీజేపీ ఎంపీ రవీంద్ర నెగీ దుకాణదారులను అభ్యర్థించారు. ఈ నెల 30 నుంచి చైత్ర నవరాత్రులు(Chaitra Navratri) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7 వరకూ కొనసాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాదిన చైత్ర నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.
నవరాత్రి వేడుకలు హిందువులకు ఎంతో పవిత్రమైనవని, ఈ సమయంలో ఆలయాల సమీపంలోని మాంసం దుకాణాలు తెరిచి ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఎంపీ రవీంద్ర నెగీ(MP Ravindra Negi) పేర్కొన్నారు. అందుకే ఆ దుకాణాలను నవరాత్రులలో మూసివేయాలని కోరారు. నెగీ అభ్యర్థన నేపధ్యంలో ఢిల్లీ సర్కారు నవరాత్రి సమయంలో ఢిల్లీవ్యాప్తంగా ఉన్న మటన్ దుకాణాలను మూసివేయించే దిశగా యోచిస్తోందని ఇండియా టీవీ తన కథనంలో పేర్కొంది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎమ్మెల్యే జుబేర్ అహ్మద్..ఎంపీ రవీంద్ర నెగీ అభ్యర్థనపై స్పందిస్తూ నవరాత్రులలో ఢిల్లీలో కేవలం మాంసం దుకాణాలను మాత్రమే మూయించడం తగదని, మద్యం దుకాణాలను కూడా బంద్ చేయించాలన్నారు. ఆ రోజుల్లో మద్యం దుకాణాలు తెరిచివుంటే కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నవరాత్రుల్లో మాసం దుకాణాలను మూయించాలనుకుంటోందని తెలుసుకున్న మాంసం దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను మూసివేస్తే పలువురు ఉపాధి కోల్పోతారని వారు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ..