
మోదీ ప్రభుత్వానికి మద్దతివ్వండి: అమిత్ షా
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి
గోపాల్‌గంజ్: హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకి తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రధాని మోదీని బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష ఆర్‌జేడీకి గట్టిపట్టున్న గోపాల్ గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం.
ఆర్‌జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచిందని, కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్ యాదవ్ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్‌కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్ షా ఆరోపించారు. ‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు.. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.
కుమార్తెను పార్లమెంట్‌కు పంపారు. ఆయన ఇద్దరు కుమారులు ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు.. దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్ రాజ్ కావాలో, మోదీ, నితీశ్‌ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు. ‘మరికొద్ది నెలల్లో అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు బటన్‌నే మీరు నొక్కుతారని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే ఓటేస్తారని నాకు తెలుసు. మోదీ అంటే బిహార్ ప్రజలు ఎప్పుడూ అభిమానం చూపుతూనే ఉన్నారు. ఆయన్ను మళ్లీ మీరు బలపరుస్తారని ఆశిస్తున్నా’అని అమిత్ షా తెలిపారు. బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.