
26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పకడ్బందీ వ్యూహం
ప్రతీ అసెంబ్లీలో 20వేల ఓట్లు పెంచడం, ప్రతి బూత్‌లో 50శాతం ఓట్లు లక్ష్యంగా ప్రణాళిక
రేపటి నుంచి ప్రచారంలో మోదీ, అమిత్ షా, యోగి
బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలకు నియోజవకర్గాల వారీగా ప్రచార బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారపీఠంపై ఇరవై ఆరేళ్ల తర్వాత పార్టీ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చివరి నిమిషంలో తన ప్రచారాన్ని హోరెత్తించేలా ప్రణాళికలు రచించింది. వచ్చే వారం రోజుల పాటు బూత్ స్థాయి వరకు పార్టీ హామీలపై ప్రచారం జరిగేలా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి పార్టీ విస్తారక్‌ల వరకు అందరినీ కదనరంగంలోకి దించనుంది. 29 నుంచి ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో 100కు పైగా సమావేశాలు, ర్యాలీల్లో భాగస్వాములు కానున్నారు.
అసెంబ్లీకి 20వేల ఓట్లు అదనం
గడిచిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీ 32 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం మూడు చోట్ల నెగ్గింది. 2020 ఎన్నికల్లో 38.51 శాతం ఓట్లతో 8 సీట్లు సాధించింది. ఈ సారి కనీసంగా 50 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళుతోంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా కనీసంగా 20 వేల ఓట్లు అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీని కోసం ప్రతి బూత్ స్థాయిలో పోలయ్యే ఓట్లలో 50శాతం ఓట్లు సాధించేలా మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొన్ని నెలలుగా బీజేపీ ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా తెప్పించి బీజేపీ అనుకూల, ప్రతికూల, స్ధిరమైన ఓటర్లను గుర్తించింది. ఢిల్లీలో అందుబాటులో లేని ఓటర్లను వివిధ మార్గాల ద్వారా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది.
ప్రతి బూత్‌లోని ఓటర్ల సామాజిక ప్రొఫైల్‌లను గుర్తించి స్థానిక పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలను రంగంలోకి దించి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు బీజేపీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక్కో ముఖ్య నేతను ఇంచార్జ్‌గా నియమించింది. మురికివాడలు, అనధికార కాలనీలతోపాటు వీధి వ్యాపారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలవాసులు ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలనే ఇంఛార్జిలుగా నియమించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుమా రు 3లక్షల మంది ఉన్నారు.
వీళ్లు అత్యధికంగా ఉండే ఆర్‌కేపురం, పాండవ నగర్, కరోల్‌భాగ్ ప్రాంతాలకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి నేతలకు ప్రచార బాధ్యతలు కట్టబెట్టారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు పనిచేస్తున్నా రు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప ర్యటిస్తూ స్థానిక మోర్చాలను కలుసుకోవడం, స మావేశాలను నిర్వహించడం, పథకాలపై అవగాహ న కల్పించడం వంటివి చేస్తున్నారు.
కేంద్రం తెచ్చిన బేటీ బచావో– బేటీ పఢావో ప్రచారంతో పాటు, జన్‌ధన్ ఖాతా, ఉజ్వల గ్యాస్ పథకం, ఉచిత గృహాలు, మరుగుదొడ్లు, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి స్వేచ్ఛ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, మహిళా రిజర్వేషన్లు, హిందూ ఆలయాల పునరి్నర్మాణం వంటి అనేక పథకాలపై అవగాహన కల్పించే పనిని అప్పగించారు. ముఖ్యంగా యువ ఓటర్లు లక్ష్యంగా దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ, 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు, మేక్ ఇన్ ఇండియాతో యువతకు పెరిగిన ఉపాధి వంటి అవకాశాలపై ప్రేరణ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.
రేపటి నుంచి మోదీ, షా, యోగి..
ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ కీలక నేతలంతా బుధవారం నుంచి ప్రచార పర్వంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాని మోదీ 29వ తేదీన కర్కర్‌దామా, 31వ తేదీన యమునా ఖాదర్, ఫిబ్రవరి రెండో తేదీన ద్వారాకా ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిపేలా ప్రణాళికలున్నాయి.
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఆరు బహిరంగ సభలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ యోగి దాదాపు 10 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. డజన్ల కొద్దీ కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా 100కు పైగా సభలకు ప్లాన్ చేశారు. ప్రచార అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి కేంద్ర మంత్రికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment