campaign rally
-
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్‌గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్‌క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'..
భోపాల్: త్వరలో మధ్యప్రదేశ్‌లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలంతా కలిసి అధికార బీజీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'జన ఆక్రోశ యాత్ర'కు శ్రీకారం చుట్టారు. ఒకపక్క బీజేపీ పార్టీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కిలోమీటర్లు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వారికి దీటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలుస్తోంది.15 రోజులపాటు నిర్దేశించిన ఈ యాత్త్ర 11,400 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాల్లోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.. యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా.గోవింద్ సింగ్, అజయ్ సింగ్, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పచౌరీ, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, మాజీ మంత్రులు జీతూ పట్వారీ కమలేశ్వర్ పటేల్ రాధా సారధులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని ముఖ్య కేంద్రాల్లో పూజలు ముగిశాక ఆయా ముఖ్య నేతలు ఈ యాత్రలను ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ.. వినాయాక చవితి సందర్బంగా ఈ జన ఆక్రోశ యాత్రలు ప్రారంభమవుతున్నాయని శివరాజ్ సింగ్ చొహాన్ ప్రభుత్వ పాలనలో 18 ఏళ్ల పాటు అణగారిన వర్గాల బాధలను తెలియజేయడమే ఈ యాత్రల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. Massive response for Congress' Jan Akrosh Yatra in Madhya Pradesh. Congress is coming in MP.🔥🔥 #जन_आक्रोश_यात्रा pic.twitter.com/VIb66N181U — Madhu (@Vignesh_TMV) September 19, 2023 ఇది కూడా చదవండి: 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు! -
ట్రిపుల్ ట్రబుల్ నుంచి త్రిపురను కాపాడేది
చండీపూర్(అగర్తలా): త్రిపురను కాంగ్రెస్, సీపీఎం, తిప్రా మోతా అనే ట్రిపుల్ ట్రబుల్ నుంచి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాపాడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్రిపుర రాష్ట్రం ఉనాకోటి, సెపాహిజలా జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి మాట్లాడారు. ఈ మూడు సమస్యల నుంచి బయటపడాలనుకుంటే బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏళ్లపాటు రాష్ట్రంలోని గిరిజనులను నిర్లక్ష్యం చేసిన సీపీఎం ప్రజలను మోసగించడానికే ఇప్పుడు గిరిజన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన విమర్శించారు. బీజేపీని ఓడించటానికే సీపీఎం, కాంగ్రెస్ ఏకమయ్యాయని మంత్రి ఆరోపించారు. ఈ మూడు పార్టీలకు అధికారమిస్తే రాష్ట్రంలో తిరిగి ఆటవిక పాలన వచ్చినట్లేనన్నారు. సీపీఎం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పలు కుంభకోణాలు జరిగాయని చెప్పారు. ఈ నెల 16న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
నందిగ్రామ్ లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్
-
అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
-
గల్లీల్లో ఢిల్లీ ప్రచారం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ, ఆప్ ప్రచార పర్వంలో దూసుకు పోతూ ఉంటే, కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడి పోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీ ఇంటి పెద్ద కొడుకునంటూ కుటుంబ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని వివరించడానికి మీ ఇంటికొస్తానంటూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి అన్నీ తానై తన భుజస్కంధాలపై మోస్తున్నారు. వీరిద్దరూ ఓటర్లతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు, కొత్త ముఖాలు పార్టీ ప్రచారానికి ఊపు అందించ లేకపోతున్నాయి. బీజేపీ ప్రచారానికి ఫేస్ షా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచార బా«ధ్యతనుమోస్తే, అమిత్ షా తెరవెనుక వ్యూహాలు రచిస్తూ ఆయనకు కుడి భుజంగానే పనిచేసేవారు. కానీ, ఈసారి అమిత్ షా ఢిల్లీ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రచారానికి ఫేస్‌గా మారారు. పెద్ద పెద్ద సభలకు బదులుగా చిన్న చిన్న ర్యాలీలు నిర్వహిస్తూ ఢిల్లీని చుట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటర్లతో వ్యక్తిగత బాంధవ్యం ఏర్పడేలా ముందుకు వెళుతున్నారు. చిన్న గల్లీల్లో జరిగే సభల్లో పాల్గొంటూ, ట్వీట్లు చేస్తూ, బీజేపీ సైబర్ వారియర్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీరోజూ రెండు, మూడు సభలు, ఒక రోడ్ షోలో షా పాల్గొంటున్నారు. 5 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చే సభల్లో మాత్రమే పాల్గొని జాతీయ భావమే ప్రధాన ఎజెండాగా చేసుకున్నారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలే ప్రధాన అస్త్రంగా చేసుకొని బీజేపీ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. కేజ్రీవాల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాముడు మంచి బాలుడు టైప్. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రజలతో మంచి సీఎం అనిపించుకోవాలన్న తపనతోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద అంశాలపై పెదవి విప్పకుండా ఓటర్లతో నేరుగా అనుసంధానమయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీ కుటుంబాలకు పెద్ద కొడుకునంటూ ఫ్యామిలీ సెంటిమెంట్‌ని రగిలిస్తున్నారు. ‘నేనే మీ ఇంటి పెద్ద కొడుకుని. రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్ అందుకే మీ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లడం, వృద్ధులైతే తీర్థయాత్రలకి వెళ్లడం వంటివన్నీ నేనే చూసుకుంటున్నాను’ అంటూ తమ ఉచిత పథకాలకు మైలేజ్ వచ్చేలా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవడానికి ‘ఆప్కా కేజ్రీవాల్ ఆప్ కే ద్వార్’ అన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ఠ్ఛీ ఛిౌఝ్ఛజ్ఛ్జుటజీఠ్చీ .జీn అన్న వెబ్సైట్ ప్రారంభించారు. ఈ వెబ్సైట్లోకి వెళితే కేజ్రీవాల్ ఇంటి డోర్ బెల్ మోగిస్తున్న వీడియో ప్రత్యక్షమవుతుంది. లేదంటే 7690944444కు మిస్డ్ కాల్ ఇచ్చినా కేజ్రీవాల్ వాళ్ల ఇంటికి వెళ్లి అయిదేళ్లలో ఆప్ సర్కార్ ఏం చేస్తుందో స్వయంగా వివరిస్తారు. కాంగ్రెస్‌లో స్తబ్దత ఢిల్లీ ఎన్నికలకు మరో వారం రోజులు కూడా గడువు లేదు. కాంగ్రెస్‌లో ఇంకా స్తబ్దత వీడలేదు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, ప్రచార కమిటీ చైర్మన్ కీర్తి ఆజాద్ మధ్య విభేదాలు పార్టీ ప్రచారంపై ప్రభావం చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావడంతో ప్రచారానికి ఇప్పటివరకు ఒక ఊపు రాలేదు. పార్టీ స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక 4,5 తేదీల్లో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో నెలకొన్న ఒకరకమైన నిర్వే దం ఆప్‌కి లాభించనుందనే వాదనలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకునే ఆప్ పూర్తిగా కొల్లగొట్టేసింది. తన ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ మూడు స్తంభాలాటలో ఆప్‌ది పై చేయిగా నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
వారు పెళ్లి చేసుకోరు..కానీ మహిళలపై లైంగిక దాడులు!
రాంచీ : బీజేపీ నేతలపై జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాషాయ పార్టీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని అన్నారు. యూపీలోని ఉన్నావ్, హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటనలను ప్రస్తావిస్తూ దేశంలో పలువురు మహిళలను సజీవ దహనం చేస్తున్నారు..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కాషాయ దుస్తులు ధరించి తిరగడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు కానీ కాషాయ దుస్తులు ధరించి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని హేమంత్ సొరేన్ అన్నారు.మహిళలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని, నేరస్తులకు మాత్రం భద్రత కల్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రజల ముందుకు వచ్చారు. -
హరియాణలో మోదీ ప్రచార హోరు..
చండీగఢ్ : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇక ఐదు రోజులే మిగిలిఉండటంతో సోమవారం నుంచి వరుసగా నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.సోమవారం వల్లఢ్‌గఢ్‌లో తొలి ర్యాలీ జరగనుండగా, కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ఈనెల 15న ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఇక 18న జాట్ ప్రాబల్య హిస్సార్‌లో తుది ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఫరీదాబాద్ జిల్లా వల్లభ్‌గఢ్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తొలి ర్యాలీలో పాల్గొనే ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో హరియాణాలో ప్రాబల్య వర్గమైన జాట్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
‘ఉద్యోగాలు కోరితే చుక్కలు చూపుతున్నారు’
ముంబై : నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2ను ఉటంకిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో డోక్లాం ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఆదివారం లాతూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. 2017లో చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మేకిన్ ఇండియా కాదని మేకిన్ చైనా అని ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రస్తావించకుండా బీజేపీ నేతలు మూన్‌మిషన్, ఆర్టికల్ 370 అంటూ దాటవేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, నిరుద్యోగులు సమస్యలతో సతమతమవుతుంటే 15 మంది సంపన్నులకు చెందిన రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం చేకూరిందని రాహుల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు ఎవరికీ మేలు చేయకుంటే తనను ఉరి తీయాలని మోదీ అన్నారని కానీ ఆ నిర్ణయం ఎవరికీ ప్రయోజనం కలిగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ వంటి వారు దేశాన్ని వీడి పరారయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్రలోని ప్రజల పొట్టలో అది తిండి నింపలేదని వ్యంగ్యంగా అన్నారు. పేదల జేబుల్లో డబ్బును కొల్లగొట్టి పెద్దలకు పంచేందుకే నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వెనుక ఉద్దేశమని మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. -
ఆ విషయంలో కాంగ్రెస్, పాక్ ఒకటే..
ముంబై : లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన మ్యానిఫెస్టో కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ వైఖరిని సమర్ధిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. జమ్ముకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించవద్దని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొనగా, ఇదే అంశాన్ని పాకిస్తాన్ సైతం చెబుతోందని దుయ్యబట్టారు. భద్రతా వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు దేశ వ్యతిరేక వైఖరితో చెలరేగుతున్నాయని విమర్శించారు. పాకిస్తాన్ వాడుతున్న పదజాలాన్నే కాంగ్రెస్ సైతం వినిపిస్తోందని ఆరోపించారు. భారత్‌ను ముక్కలు చేయాలని భావిస్తూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నవారు దేశంలో స్వేచ్ఛగా తిరగాలని కాంగ్రెస్, పాకిస్తాన్ కోరుకుంటున్నాయని అన్నారు. ఉగ్రవాదులను వారి శిబిరాల్లో మట్టుబెట్టాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు హింసోన్మాదంతో చెలరేగుతుంటే తాము చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
మోదీ ప్రపంచం చుట్టేస్తారు కానీ..
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అయిదేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీకి తన సొంత నియోజకవర్గం వారణాసి పరిధిలోని ఏ ఒక్క గ్రామాన్నీ సందర్శించే సమయం దొరకలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఫైజాబాద్‌లో శుక్రవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలన్నీ మోదీ తిరుగుతారు...కానీ ఆయనకు తన నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకునే సమయం మాత్రం ఉండదని ఎద్దేవా చేశారు. మోదీ తీరు ప్రభుత్వ అభిమతానికి అద్దం పడుతోందని, ఆయన సర్కార్ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడంపై దృష్టి సారించిందని, పేదలను విస్మరించిందని ప్రియాంక ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక సర్కార్‌గా ఆమె అభివర్ణించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సహా దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. -
భారత ఇంజనీర్లను రాహుల్ అవమానించారు
వారణాసి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భారత ఇంజనీర్లను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇది ఈ ప్రాజెక్టులో భాగమైన భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని ప్రధాని మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు. ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోరాదని ఆయన ప్రజలకు సూచించారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని, వారు దేశానికి గర్వకారణంగా ప్రజలు భావిస్తున్నారన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన మరుసటి రోజే వారణాసి నుంచి ఢిల్లీకి తిరిగివస్తూ సాంకేతిక సమస్యలకు లోనవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రధాని మేకిన్ ఇండియా కార్యక్రమం విఫలమైందని, దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన తర్వాత కోచ్‌ల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, బ్రేక్‌లు విఫలమవడంతో రైలు నిలిచిపోయిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. -
ప్రధానిని ఫాలో అవుతున్న పట్నాయక్
భువనేశ్వర్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పాలక బీజేడీ చీఫ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పావులు కదుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామని ఇప్పటికే ప్రకటించిన పట్నాయక్ ఆ దిశగా ప్రచార పర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒడిషాలో ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలో భారీ బహిరంగసభలకు ఒడిషా సీఎం శ్రీకారం చుట్టారు. గత ఏడాడి డిసెంబర్ 24 నుంచి జనవరి 15 మధ్య ప్రధాని మోదీ ఒడిషాలోని ఖుర్ధా, బరిపడ, బొలన్‌గిర్‌లలో భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించగా, ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భారీ సభలకు హాజరుకావాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ పశ్చిమ ఒడిషాలోని జర్సుగుడలో బహిరంగ సభలో పాల్గొనగా గురువారం అదే ప్రాంతంలో నవీన్ పట్నాయక్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేడీ సీనియర్ నేత వెల్లడించారు. ఇక బొలన్‌గిరిలో ఈనెల 24న జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. మరోవైపు భువనేశ్వర్‌కు కొద్ది దూరంలోనే ఉన్నా ఖుర్ధాలోనూ త్వరలోనే సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఒడిషాలో మెరుగైన విజయాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకే సీఎం నవీన్ పట్నాయక్ ఈ తరహా వ్యూహంతో ముందుకెళుతున్నారని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. -
పంజాబ్‌లో అన్ని స్ధానాల్లో పోటీ..
చండీగఢ్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్ధానాల్లో పోటీ చేస్తామని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బర్నాలాలో ఆదివారం ఆప్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కేజ్రీవాల్ సంగ్రూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంతో విసుగెత్తిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. పంజాబ్ పార్టీ నేతలు ఎంపీ, భగవంత్ మాన్, విపక్ష నేత హర్పాల్ చీమా, ఎమ్మెల్యే అమన్ అరోరా కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. కాగా ఆప్ ఇప్పటికే సంగ్రూర్, ఫరీద్కోట్, హోషియార్పూర్, అమృత్సర్, ఆనంద్‌పూర్‌సాహిబ్ స్ధానాల్లో పోటీచేసే అభ్యర్ధులను ప్రకటించింది. మరోవైపు పార్టీ నాయకత్వంతో విభేదించిన ఇద్దరు పంజాబ్ ఆప్ ఎంపీలు ధర్మవీర గాంధీ, హరీందర్ ఖల్సాకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. వీరి సస్పెన్షన్ ఎత్తివేతపైనా కేజ్రీవాల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
పశ్చిమ యూపీలో రాహుల్ ర్యాలీలు
లక్నో : యూపీలో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీలు సీట్ల సర్ధుబాటు చేసుకోవడంతో కీలక రాష్ట్రంలో సొంతంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం లౌకిక శక్తుల ఏకీకరణతో పాటు యూపీలో బలం పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో పశ్చిమ యూపీలో ఏకంగా 15 ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతుల సమస్యలను ప్రధానంగా లేవెనెత్తుతూ ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చేపటిన వ్యవసాయ రుణాల మాఫీని ప్రజల ముందుకు తీసుకువెళ్లేలా ఈ ర్యాలీలకు రూపకల్పన జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల దుస్ధితిని ఈ ర్యాలీల్లో రాహుల్ ప్రజల ముందుంచనున్నారు. పశ్చిమ యూపీలోని హపుర్‌తో తొలి ర్యాలీని చేపట్టే రాహుల్ అనంతరం మొరదాబాద్, షహరన్‌పూర్, బరేలీ ర్యాలీల్లో పాల్గొంటారు. కాగా యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేష్, మాయావతి ప్రకటించిన నేపథ్యంలో యూపీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని రాహుల్ పార్టీ నేతలకు సూచించారు. ఎస్పీ, బీఎస్పీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయని, కాంగ్రెస్ యూపీలో పూర్తిసామర్థ్యంతో పోరాడుతుందని దుబాయ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యానించారు. -
మోదీజీ ఉపాధి ఊసేది..?
జైపూర్ : రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఆల్వార్‌లో నలుగురు యువకులు ఇటీవల ఎందుకు ఆత్మహత్యకు పాల్పడేవారని ఆయన నిలదీశారు.రాజస్ధాన్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి ఈ యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. నిరుద్యోగ సమస్యతోనే వారు బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాధనంతో పారిశ్రామికవేత్తల ఖజానాలను నింపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ తన ప్రసంగంలో భారత్ మాతాకీ జై అంటారని, వాస్తవగా ఆయన అనిల్ అంబానీకి, మెహుల్ చోక్సీ, నీరవ్, లలిత్ మోదీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు. అనిల్ అంబానీ వంటి సంపన్నుల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కాగా, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల ఏడున జరగనుండగా, 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ అండ..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పే కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. అర్బన్ మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చుని, పెద్ద కార్లలో తిరుగుతుంటారని, వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే పేద ఆదివాసీ యువకుల జీవితాలను మాత్రం వారు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అర్బన్ నక్సల్స్‌ను కాంగ్రెస్ ఎందుకు సమర్ధిస్తోందని ప్రధాని నిలదీశారు. బీజేపీ అందరినీ సమదృష్టితో చూస్తుందని, లింగ, కుల ప్రాతిపదకిన ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించదని పేర్కొన్నారు. జగదాల్పూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రదాని ప్రసంగిస్తూ బస్తర్ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా చత్తీస్‌గఢ్ అభివృద్ధిపై దృష్టిసారించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం మాటల పార్టీయేనని ఆచరణలో ఆ పార్టీ చేసేది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలు, పేదలు, దళితులను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తుందని, కానీ వాజ్‌పేయి మాత్రం ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. -
ముస్లింలను అమెరికా రానివ్వొద్దు
న్యూయార్క్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగనున్న ట్రంప్ దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. 'ఉగ్రవాద సమస్య ప్రమాదాన్ని, ముప్పును గుర్తించనంత వరకూ భయంకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇకముందు వారి తీవ్రవాద దాడులకు మన దేశంలోని పౌరులు బలి కాకూడదు... వారు జిహాదీని మాత్రమే నమ్ముకున్నారు. అమెరికా పట్ల ముస్లింల వైఖరి తెలిసేంత వరకు వాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయాలని' ట్రంప్ కోరారు. కాగా దక్షిణ కరోలినాలో జరిగిన ప్రచారంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డిమాండ్లనే చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలని ఖండిస్తూ వివిధ రాష్ట్రాల గవర్నలు విమర్శలు ఎక్కుపెట్టారు. డోనాల్డ్ మాటలను వైట్ హౌస్ వర్గాలు తప్పుపట్టాయి. అమెరికా విలువలకు, జాతీయ భద్రతా వైఖరికి ట్రంప్ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. అటు ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ తీవ్రంగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మతి తప్పినవిగానూ, రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. అలాగే ఓహియా, సౌత్ కరోలినా, న్యూజెర్సీ గవర్నర్లు డొనాల్డ్ వ్యాఖ్యలతో విభేదించారు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతకుముందు వికలాంకుడైన ఓ జర్నలిస్టును అనుకరిస్తూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఓ మహిళా అభిమాని ఛాతీపై ట్రంప్ సంతకం చేసి సంచలనం సృష్టించారు. -
సంచలనం రేపిన ఆటోగ్రాఫ్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా ఓ మహిళ ఛాతీపై సంతకం చేశారు. వర్జీనియాలోని మనస్సాస్లో ప్రిన్స్ విలియమ్ కంట్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ట్రంప్ ఆమె ఛాతీపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఆటోగ్రాఫ్‌ను అందుకున్న ఆ అభిమాని ఇక తాను స్నానం చేసేది లేదంటూ గాల్లోకి ముద్దులు విసిరి మరింత అలజడి రేపారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. రోజురోజుకీ ఆటవికులుగా తయారవుతున్న ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు.