భువనేశ్వర్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పాలక బీజేడీ చీఫ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పావులు కదుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామని ఇప్పటికే ప్రకటించిన పట్నాయక్ ఆ దిశగా ప్రచార పర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒడిషాలో ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలో భారీ బహిరంగసభలకు ఒడిషా సీఎం శ్రీకారం చుట్టారు.
గత ఏడాడి డిసెంబర్ 24 నుంచి జనవరి 15 మధ్య ప్రధాని మోదీ ఒడిషాలోని ఖుర్ధా, బరిపడ, బొలన్‌గిర్‌లలో భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించగా, ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భారీ సభలకు హాజరుకావాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ పశ్చిమ ఒడిషాలోని జర్సుగుడలో బహిరంగ సభలో పాల్గొనగా గురువారం అదే ప్రాంతంలో నవీన్ పట్నాయక్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేడీ సీనియర్ నేత వెల్లడించారు.
ఇక బొలన్‌గిరిలో ఈనెల 24న జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. మరోవైపు భువనేశ్వర్‌కు కొద్ది దూరంలోనే ఉన్నా ఖుర్ధాలోనూ త్వరలోనే సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఒడిషాలో మెరుగైన విజయాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకే సీఎం నవీన్ పట్నాయక్ ఈ తరహా వ్యూహంతో ముందుకెళుతున్నారని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment