నేడే ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
69 స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ రికార్డు అధిగమిస్తారా? పవన్ చామ్లింగ్ మైలురాయి దాటుతారా?. లోక్‌సభ ఫలితాలతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బీజూ జనతా దళ్(బీజేపీ) విజయం సాధిస్తే నవీన్ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బీజేడీకు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్ 9న నవీన్ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ నేత ఆయన చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు.
దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు అయిదుగురున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్ హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్ నేత లాల్ థధ్వాల్ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు గెగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ చామ్లింగ్ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు.
బీజేడీ నేతల్లో ఆశాభావం: నవీన్ విధేయులుగా ముద్రపడిన నేతలంతా బీజేడీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా నవీన్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. నవీన్‌కు ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తాయని అంటున్నారు.
రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్ మంగళవారం తేలనుంది. ఎన్నికలకు సంబంధించి వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 69 స్ట్రాంగ్ రూముల్లో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లను కట్టుదిట్టంగా భద్రపరిచారు.
మూడంచెల భద్రత
స్ట్రాంగ్ రూముల చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. వాటి రక్షణ కోసం 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్) మోహరించారు. పోలీసు బృందాలు రాత్రింబవళ్లు పహరా కాస్తున్నాయి. భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. సీఏపీఎఫ్ మరియు రాష్ట్ర సాయుధ పోలీసులు (ఓఎస్‌ఏపీ) ఇరువర్గాలు స్ట్రాంగ్‌రూమ్‌కు బాధ్యత వహిస్తారు. ఇదే తరహాలో బరిపద, బరంపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ఉమా చరణ్ పటా్నయక్ ఇంజినీరింగ్ స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీప్యాట్‌లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు.
ఫలితాల తదనంతరంపై నిఘా
రాష్ట్రంలో ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణపై భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీఐ మందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో 70కి పైగా సీఏపీఎఫ్ కంపెనీలు మోహరించబడతాయి. రాష్ట్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాలకు రక్షణగా 25 కంపెనీల సీఏపీఎఫ్ కొనసాగించాలని ఈసీఐ నిర్ణయించింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి అదనంగా 70 సీఏపీఎఫ్ కంపెనీలను నియమించాలని నిర్ణయించారు.
లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
జయపురం: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయపురం సబ్ డివిజన్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడ తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం, కోట్‌పాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు లెక్కించేందుకు 5 టేబుల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నవరంగపూర్, కొరాపుట్ లోక్‌సభ స్థానాల్లో అంతర్భాగమైన ఈ రెండు స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 58 మంది సిబ్బందిని, రెండు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.
లెక్కింపు వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పటా్నయిక్, జయపురం తహసీల్దార్ డా.మనోలిస ఆచార్య, బొరిగుమ్మ బీడీవో అమృత లాల్ బెహర, కోట్‌పాడ్ అదనపు తహసీల్దార్ నీలాంబర పూజారి, జయపురం సబ్ డివిజన్ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి, సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి, బీజేడీ ప్రతినిధి సుభాష్ పండ, కాంగ్రెస్ ప్రతినిధి తరణి ప్రసాద్ పాణిగ్రహిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment