తూర్పున పొడిచేదెవరు? | Modi factor versus CM Naveen Patnaik sway in west Odisha | Sakshi
Sakshi News home page

తూర్పున పొడిచేదెవరు?

Published Mon, Apr 15 2019 2:06 AM | Last Updated on Mon, Apr 15 2019 2:06 AM

Modi factor versus CM Naveen Patnaik sway in west Odisha - Sakshi

నరేంద్ర మోదీ, నవీన్‌ పట్నాయక్‌

మాతృభాషలో సరిగా మాట్లాడలేరు. కానీ రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. వెనుకబడిన రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఇదీ అని చూపించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన రాజకీయాల్లో ఆయన పథం నవీనం, నిత్యనూతనం. కేంద్రంలో ఇరవై ఏళ్లుగా ఎన్ని పార్టీలు మారినా ఒడిశాలో బిజూ జనతాదళ్‌ (బీజేడీ)కి ఎదురు లేదు. ఆ రాష్ట్రంలో సీఎం నవీన్‌ పట్నాయక్‌కు తిరుగులేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నవీన్‌పై నమ్మకం చెక్కు చెదరకపోయినా ఆయన చుట్టూ ఉండే వారిపై అసమ్మతి రాజుకుంటోంది. ముఠా పోరు తారస్థాయికి చేరుకుంది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయా? బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టుపెంచుకోవడం బీజేడీకి ఎసరు పెడుతుందా? ఈ రాష్ట్రంలో మోదీ మేజిక్‌ ఎంతవరకు పని చేస్తుంది? ఈసారి ప్రజా తీర్పు ఎటు ఉండబోతోంది?..

అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి తమ దారి మార్చుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అవినీతి      అధికారులు, నేతలపై నవీన్‌ పట్నాయక్‌ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మైనింగ్, చిట్‌ఫండ్‌ స్కామ్‌లో నవీన్‌ వ్యవహార శైలి ప్రజల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా చాలా కాలంగా అసమ్మతి సెగలు కక్కుతోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిలో బీజేడీపై విముఖత ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నికల బరిలో ఉన్న బీజేడీ నేతలు గెలుపు గుర్రాలు కాదన్న భావన నెలకొంది. గత ఎన్నికల్లో మోదీ హవా దేశాన్ని ఊపేసినా ఒడిశా తన రూటే సెపరేటు అనిపించుకుంది. 21 సీట్లకు 20 సీట్లను బిజూ జనతాదళ్‌ (44.10% ఓట్లు) గెలుచుకుంది. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ (21.50%) బీజేపీ కంటే మెరుగ్గా 26 శాతం ఓట్లు సంపాదించినా సీట్లను మాత్రం సాధించలేకపోయింది.

మహిళల్లో తరగని ఆదరణ
మహిళా ఓటర్లలో ఇప్పటికీ నవీన్‌ పట్నాయక్‌కి గట్టి పట్టు ఉంది. 70 లక్షలకు పైగా మహిళలతో స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేసి శక్తి పథకం కింద వారికి అండదండగా ఉంటున్నారు. ఆ గ్రూపు మహిళలే బీజేడీ ఓటు బ్యాంకుకి శక్తిగా మారారు. స్వయం సహాయక గ్రూపుల్లో  దేశంలోనే ఒడిసా నంబర్‌వన్‌గా నిలిచింది. మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వడం కూడా నవీన్‌కు కలిసొచ్చే అంశం. ‘ఎవరు మా జీవనోపాధికి అండగా ఉంటారో వాళ్లకే ఓటు వేస్తాం‘ అని మహిళలు బహిరంగంగానే చెబుతున్నారు.

బీజేపీ ‘ఆపరేషన్‌ ఒడిశా’ ఫలిస్తుందా
దక్షిణాదిన పట్టు లేదు. ఉత్తరాదిన పట్టు కోల్పోతోందన్న అనుమానాలున్నాయి. అందుకే బీజేపీ ఈసారి తూర్పు రాష్ట్రాలపైనే గురి పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పలుమార్లు ఒడిశాలో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో ‘మా బూత్‌ పటిష్టం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017లో జరిగిన స్థానిక ఎన్నికల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపించింది. బీజేపీ 296 పంచాయతీ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బీజేపీ పట్టు బాగా పెంచుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సుభాష్‌ చౌహాన్‌ పార్టీ పట్టు పెరగడానికి కృషి చేశారు.

ఆయనతో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఒరియా కేంద్ర మంత్రులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గిరిజన వ్యవహారాల మంత్రి జ్యుయల్‌ ఒరమ్‌లు కోస్తా ఒడిశా, ఆదివాసీల జనాభా అధికంగా ఉండే పశ్చిమ ఒడిశా ప్రాంతంలో పట్టు బిగించారు. తమ పార్టీకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నవీన్‌ పట్నాయక్‌ రాజకీయ వ్యూహాలకు తెరతీశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సుభాష్‌ చౌహాన్‌ను తన గూటికి తెచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్‌ నిరాకరించడంతో నవీన్‌ తన గూటికి లాక్కొని బోలాంగిర్‌ బీజేడీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కమలనాథులపై విరుచుకుపడుతున్నారు. ‘ఫైలిన్, హుద్‌హుద్, తిత్లీ తుపాను సమయంలో బీజేపీ నేతలు ఒక్కరూ కనిపించరు. కానీ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి మొసలి కన్నీరు కారుస్తారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

వలసలే కమలానికి బలమా?
బిజూ జనతాదళ్‌లో అధినేత నవీన్‌ పట్నాయక్‌ తర్వాత వినిపించే పేర్లు రెండే. పశ్చిమ ఒడిశాకు చెందిన బలభద్ర మాఝీ , కోస్తా ఒడిశాకు చెందిన బైజయంత్‌  పాండా.. వీళ్లిద్దరూ 2014 ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ తిరుగులేని విజయం సాధించేలా చేశారు. అయిదేళ్లు తిరిగాయి. 2019 ఎన్నికలు మొదలయ్యాయి. సీన్‌ కట్‌ చేస్తే మాఝీ, పాండా ఇద్దరూ బీజేడీని వీడి బీజేపీ గూటికి చేరారు. నవరంగ్‌ పూర్, కేంద్రపారా నుంచి పోటీకి దిగుతున్నారు. వీళ్లిద్దరే కాదు బీజేడీ ఎంపీ ప్రత్యూష రాజేశ్వరిసింగ్, కె.నారాయణరావు, దామా రౌట్, యువ నాయకులు బాబు సంగ్, సుబ్రాంశుదాస్, ప్రకాశ్‌ బెహరా వంటి వారు ఉన్నారు. బీజేడీలో టికెట్లు రాని వారంతా బీజేపీకి క్యూ కట్టేశారు. ‘బిజూ జనతాదళ్‌లో ఈసారి నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది నాయకులు మా పార్టీతో చాలా కాలంగా టచ్‌లో ఉన్నారు. అందుకే మేం గేట్లు ఎత్తేయడంతో ప్రముఖ నాయకులు వచ్చి చేరారు’ అని బీజేపీ ఒడిశా శాఖ కార్యదర్శి జతిన్‌ మొహంతీ అన్నారు. ఈ ఫిరాయింపులతో కమలం పార్టీ  సంస్థాగతంగా బలిష్టమై ప్రాంతీయ పార్టీని ఢీకొనే శక్తిగా ఎదిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బసంత్‌ కుమార్‌ పాండా మేనల్లుడు హరీష్‌ చంద్ర పాండా బీజేడీలో చేరడం విశేషం.

బీజేడీ నుంచి కొత్త ముఖాలే ఎక్కువ
నవీన్‌ పట్నాయక్‌పై ప్రజల్లో ఇంకా ఇమేజ్‌ ఉన్నప్పటికీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో ఆయన చాలా మంది సిటింగ్‌లకు సీట్లు నిరాకరించారు. బలంగీర్‌ నుంచి సింగ్‌దేవ్, పూరి నుంచి పినాకి మిశ్రా, కటక్‌ నుంచి భర్తృహరి మెహతాబ్‌కి మాత్రమే మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఢెంకనాల్‌ ఎంపీ తథాగత సపతి ఏకంగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌ టికెట్లు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది కొత్త ముఖాలు కావడంతో ఫలితాలపై ఫిరాయింపుల ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.

రైతులనే నమ్ముకున్న కాంగ్రెస్‌
ఒకప్పుడు బాగా పట్టు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ పథకం కూడా పార్టీకి ఊపు తీసుకురాలేదు. రాహుల్‌ పలుమార్లు ఒడిశా రాష్ట్ర పర్యటనలు చేసినా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరగడం లేదు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ ఒడిశా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెడితే రైతులు హస్తం గుర్తుకే ఓటు వేసే సంప్రదాయం ఉంది. ఇక చాలాచోట్ల రైతులు నోటా గుర్తును ఎంచుకుంటున్నారంటే వారు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. బిజు జనతాదళ్, బీజేపీపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలు తమ పార్టీ వెంట నడుస్తారన్న ఆశలో రాహుల్‌ ఉన్నారు.

జమిలి ఎన్నికలు ఎవరి కొంప ముంచుతాయి?
ఒడిశాలో ఏకకాలంలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండటంతో క్రాస్‌ ఓటింగ్‌ భయం బిజూ జనతాదళ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.  అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగితే 70 శాతం మంది ఒకే పార్టీకి వేస్తారని ఒక అంచనా. కానీ ఒడిశాలో అలాంటి ఫార్ములాలకు అతీతంగా అసెంబ్లీకి నవీన్‌ పట్నాయక్‌కు, పార్లమెంటుకి నరేంద్ర మోదీకి వేస్తారని అంచనాలైతే ఉన్నాయి. ప్రధానిగా మోదీకున్న ఇమేజ్, బాలాకోట్‌ దాడుల తర్వాత పెరిగిన దేశభక్తి యువతరం మోదీ వైపు చూసేలా చేస్తోంది. ‘ఇవాళా రేపు ఓటర్లు తెలివి మీరారు. అసెంబ్లీకి నవీన్‌కు వేసినా, పార్లమెంటు వచ్చేసరికి వారి మొగ్గు మోదీకే’ అని ఒడిశాలో ఎన్నికల విశ్లేషకుడు మహాపాత్రో అంచనాగా ఉంది. కేంద్రపార, ఢెంకనాల్, సంబల్‌పూర్, బార్‌గఢ్, కాందమాల్, కియోంజార్, భువనేశ్వర్‌లో హోరాహోరీ పోరు నెలకొందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఒడిశా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ‘సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇమేజ్‌ చెక్కు చెదరలేదు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతమైంది. సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ మళ్లీ తన ప్రాభవాన్ని చూపే ప్రయత్నం చేస్తోంది’ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

సంక్షేమ ‘కమలం’
► కేంద్రంలో మోదీ సర్కార్‌ రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏడాదికి రూ.6 వేల పథకం ప్రకటించింది.

► గ్రామాల్లో నిరుపేద మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్‌ స్టౌల పంపిణీ, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్, అటల్‌ పెన్షన్‌ యోజనకు జనంలో ఆదరణ కనిపిస్తోంది.

హామీల శంఖారావం
► నవీన్‌ పట్నాయక్‌ మోదీని ఎదుర్కోవడానికి నిరుపేదలు లబ్ధి పొందే 60 కార్యక్రమాలు రూపొందించారు.

► ‘కాలియా పథకం’ కింద రైతులకు ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

► ‘మమత పథకం’ ద్వారా గర్భిణులకు నగదు బదిలీ పథకం, ఆహార్‌ యోజన కింద రూపాయికే కిలో బియ్యం (రూ.5కి భోజనం),

► నిరుపేదలకు ‘బిజూ పక్కా ఘర్‌ యోజన’ పేరిట ఇళ్ల నిర్మాణ పథకాలు ప్రవేశపెట్టారు.


మోదీ వర్సెస్‌ మినీ మోదీ
ఇద్దరూ ఇద్దరే. జనంలో ఒకే రకమైన ఇమేజ్‌ సాధించిన వారే. సీఎంలుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారే. ఇప్పుడు వారిద్దరి మధ్యే పోటీ. ప్రధాని హోదాలో మోదీ, సీఎం హోదాలో నవీన్‌ పట్నాయక్‌ (మినీ మోదీగా ఒడిశాలో పిలుస్తారు) ఒడిశా బరిలో ఢీకొంటున్నారు. ఇద్దరికీ కుటుంబ బం«ధాలు లేవు. జనమే వారి కుటుంబం. ఏదో ఒకటి చేయాలన్న తపన ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఒడిశాలో రైతులు, మహిళలు, ఆదివాసీల ఓట్లే కీలకం. అందుకే వారిని ఆకర్షించడానికి రూపొందించిన పథకాలే ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారాయి.

‘ఒడిశాలో అత్యధిక భాగం ఒకప్పుడు సంస్థానాధీశుల పాలనలో ఉండేది. తాము పైకి ఎదగాలన్న ఆశలు ఎవరిలోనూ పెద్దగా ఉండవు. ఒరియా ప్రజలు చిన్న చిన్న విషయాలకే అంతులేని ఆనందాన్ని పొందుతారు. నవీన్‌ పట్నాయక్‌ను దయార్ద్ర హృదయుడైన రాజుగానే ఇప్పటికీ చూస్తున్నారు. సర్వేలు కూడా మోదీ ఇమేజ్‌ పెరిగినా, నవీన్‌ పై చేయి సాధిస్తారనే అంచనా వేస్తున్నాయి’

– రాజేశ్‌ మహాపాత్ర, మాజీ జర్నలిస్టు,
 ‘ఒడిశా ఆలోచన చక్ర’ పేరిట  రాజకీయ చర్చల నిర్వాహకుడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement