కృష్ణరాజనగర్ ఎన్నికల సభలో మాట్లాడుతున్న రాహుల్
సాక్షి, బెంగళూరు/కోలార్/చిత్రదుర్గ: చౌకీదార్(కాపలాదారు)గా తనను తాను చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ 100 శాతం దొంగని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ అని ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు అంబానీ–సామాన్యులకు, దొంగలు–నిజాయితీపరులైన ప్రజలకు, అబద్ధపు హామీలు–నిజాయితీకి మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఎన్నికలు రెండు భిన్నమైన భావజాలాల మధ్య జరుగుతున్నాయనీ, వీటిలో ఓవైపు విద్వేషం, కోపం, విభజన రాజకీయాలు ఉంటే, మరోవైపు ప్రేమ, ఆప్యాయత, సోదరభావం ఉన్నాయని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అభ్యర్థుల తరఫున శనివారం ప్రచారం నిర్వహించిన రాహుల్.. మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దొంగ స్నేహితుడికి రూ.30 వేల కోట్లు
ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందాన్ని ప్రస్తావించిన రాహుల్..‘మేం ప్రజల గొంతుకగా మారాలనుకుంటున్నాం. చౌకీదార్ కావాలనుకోవడం లేదు. ఈ చౌకీదార్(మోదీ) నిజంగా 100 శాతం దొంగే. మోదీ రూ.30,000 కోట్ల ప్రజాధనాన్ని తన దొంగ స్నేహితుడు అనిల్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వీరంతా ఓ దొంగల ముఠా. ప్రజలకు నాదో ప్రశ్న.. ఈ దొంగలందరి పేర్లలో మోదీ అని ఎందుకుంది? ఇంకా ఎంతమంది మోదీల పేర్లు వెలుగులోకి వస్తాయో తెలియడం లేదు’ అని ఎద్దేవా చేశారు. మోదీ చౌకీదార్ ప్రచారంపై స్పందిస్తూ..‘మీరు ఎప్పుడైనా రైతులు, కార్మికులు, నిరుద్యోగుల ఇంటి ముందు చౌకీదార్ ఉండటం చూశారా? చూసుండరు. ఎందుకంటే చౌకీదార్ అనిల్ అంబానీ ఇంటి ముందు రక్షణగా ఉంటాడు. కేవలం 15–20 మంది ధనవంతులకే భద్రత కల్పిస్తాడు’ అని ఎద్దేవా చేశారు.
బీజేపీలా అబద్ధాలు చెప్పబోం.
ప్రధాని మోదీ రైతులు, ఉద్యోగాలు, అవినీతి గురించి మాట్లాడటం మానేశారని రాహుల్ దుయ్యబట్టారు. ‘మేం బీజేపీ నేతల్లాగా అబద్ధాలు చెప్పబోం. ఈ ఎన్నికలు ఐదేళ్ల అన్యాయానికి, కాంగ్రెస్ అందించే న్యాయ్(కనీస ఆదాయ భద్రత పథకం)కు మధ్య జరుగుతున్నాయి. దేశంలోని ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని మోదీ చెప్పిన అబద్ధానికి, అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో ఐదేళ్ల కాలానికి రూ.3.6 లక్షలు జమచేస్తామని చెప్పే కాంగ్రెస్ హామీకి మధ్య ఈ పోరాటం సాగుతోంది’ అని అన్నారు. బ్యాంకు రుణాలు చెల్లించకపోయిన రైతులను జైలుపాలు చేసిన మోదీ ప్రభుత్వం రుణాలు ఎగ్గొట్టిన అనిల్ అంబానీని మాత్రం కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment